న్యూఢిల్లీ: దేశరాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం హద్దులు దాటి ప్రజలకు ఊపిరి అందనివ్వకుండా చేస్తోంది. ఈ నేపధ్యంలో ఢిల్లీ సర్కారు కాలుష్యం నియంత్రణ దిశగా నడుంబిగించింది. రాజధానిలోని నివాస ప్రాంతాల్లో అక్రమంగా నడుస్తూ, కాలుష్యాన్ని వ్యాప్తిచేస్తున్న జీన్స్ డైయింగ్ ఫ్యాక్టరీలు, రెడీ-మిక్స్ కాంక్రీట్ (ఆర్‌ఎంసీ) ప్లాంట్లు, ఎలక్ట్రోప్లేటింగ్ యూనిట్లపై దృష్టి సారించింది.
అక్రమ ఫ్యాక్టరీలు, యూనిట్లపై డ్రోన్‌తో నిఘా చేపట్టేందుకు ఢిల్లీ కాలుష్య నియంత్రణ కమిటీ (డీపీసీసీ) సిద్ధమైంది. పారిశ్రామిక కాలుష్యానికి కారణమయ్యే యూనిట్లను గుర్తించి, వాటిపై చర్యలు చేపట్టి, వాటిని మూసివేయించేందుకు ప్రణాళిక సిద్ధం చేసింది. తుఖ్మీర్‌పూర్, కరవాల్ నగర్, గోకుల్‌పురి, ఘాజీపూర్, అలీ విహార్, మిథాపూర్ పరిసర ప్రాంతాలతో సహా 17 ప్రధాన కాలుష్య హాట్‌స్పాట్‌లలో డ్రోన్ సర్వే నిర్వహించనున్నారు. ఇక్కడ అక్రమంగా రంగులు వేసే యూనిట్లు, జీన్స్ వాషింగ్ యూనిట్లను నిర్వహిస్తున్నట్లు ప్రభుత్వానికి సమాచారం అందింది.
ప్రస్తుతం పైలట్ ప్రాజెక్టుగా 15 రోజుల పాటు ఈ డ్రోన్ సర్వే నిర్వహించనున్నారు. డ్రోన్ ఆధారిత ఆర్థో-రెక్టిఫైడ్ ఇమేజరీ (ఓఆర్‌ఐ)ని ఇందుకోసం వినియోగించనున్నారు. ఇది కాలుష్య యూనిట్లకు ఫోటోలు తీస్తుంది. ఈ సర్వేలో ఉపయోగించే డ్రోన్ దాదాపు 45-60 నిమిషాల పాటు గాలిలో ఎగురుతుంది. దీని విజిబిలిటీ పరిధి 3-5 కి.మీ ఉంటుంది. ఇది 750 అడుగుల ఎత్తుకు చేరుకుంటుంది. ఈ సర్వే కోసం 17 డ్రోన్లను ఉపయోగించనున్నారు. ఇందుకోసం డీపీసీసీ టెండర్లు జారీ చేసింది. ఆసక్తి గల ఏజెన్సీలు నిర్ణీత గడువులోగా తమ ప్రతిపాదనలో డ్రోన్ ప్లాన్, డ్రాఫ్ట్ స్క్రిప్ట్, యాక్షన్ ప్లాన్, డ్రాఫ్ట్ డిజైన్‌ను సమర్పించాల్సి ఉంటుంది.
ఇది కూడా చదవండి: ఒద్దికగా సర్దుకుంటే.. ఇల్లే కదా స్వర్గసీమ!
Comments
Please login to add a commentAdd a comment