dron
-
Delhi Pollution: డ్రోన్ల సాయంతో కాలుష్యకారక పరిశ్రమల గుర్తింపు
న్యూఢిల్లీ: దేశరాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం హద్దులు దాటి ప్రజలకు ఊపిరి అందనివ్వకుండా చేస్తోంది. ఈ నేపధ్యంలో ఢిల్లీ సర్కారు కాలుష్యం నియంత్రణ దిశగా నడుంబిగించింది. రాజధానిలోని నివాస ప్రాంతాల్లో అక్రమంగా నడుస్తూ, కాలుష్యాన్ని వ్యాప్తిచేస్తున్న జీన్స్ డైయింగ్ ఫ్యాక్టరీలు, రెడీ-మిక్స్ కాంక్రీట్ (ఆర్ఎంసీ) ప్లాంట్లు, ఎలక్ట్రోప్లేటింగ్ యూనిట్లపై దృష్టి సారించింది.అక్రమ ఫ్యాక్టరీలు, యూనిట్లపై డ్రోన్‌తో నిఘా చేపట్టేందుకు ఢిల్లీ కాలుష్య నియంత్రణ కమిటీ (డీపీసీసీ) సిద్ధమైంది. పారిశ్రామిక కాలుష్యానికి కారణమయ్యే యూనిట్లను గుర్తించి, వాటిపై చర్యలు చేపట్టి, వాటిని మూసివేయించేందుకు ప్రణాళిక సిద్ధం చేసింది. తుఖ్మీర్‌పూర్, కరవాల్ నగర్, గోకుల్‌పురి, ఘాజీపూర్, అలీ విహార్, మిథాపూర్ పరిసర ప్రాంతాలతో సహా 17 ప్రధాన కాలుష్య హాట్స్పాట్లలో డ్రోన్ సర్వే నిర్వహించనున్నారు. ఇక్కడ అక్రమంగా రంగులు వేసే యూనిట్లు, జీన్స్ వాషింగ్ యూనిట్లను నిర్వహిస్తున్నట్లు ప్రభుత్వానికి సమాచారం అందింది.ప్రస్తుతం పైలట్ ప్రాజెక్టుగా 15 రోజుల పాటు ఈ డ్రోన్ సర్వే నిర్వహించనున్నారు. డ్రోన్ ఆధారిత ఆర్థో-రెక్టిఫైడ్ ఇమేజరీ (ఓఆర్ఐ)ని ఇందుకోసం వినియోగించనున్నారు. ఇది కాలుష్య యూనిట్లకు ఫోటోలు తీస్తుంది. ఈ సర్వేలో ఉపయోగించే డ్రోన్ దాదాపు 45-60 నిమిషాల పాటు గాలిలో ఎగురుతుంది. దీని విజిబిలిటీ పరిధి 3-5 కి.మీ ఉంటుంది. ఇది 750 అడుగుల ఎత్తుకు చేరుకుంటుంది. ఈ సర్వే కోసం 17 డ్రోన్లను ఉపయోగించనున్నారు. ఇందుకోసం డీపీసీసీ టెండర్లు జారీ చేసింది. ఆసక్తి గల ఏజెన్సీలు నిర్ణీత గడువులోగా తమ ప్రతిపాదనలో డ్రోన్ ప్లాన్, డ్రాఫ్ట్ స్క్రిప్ట్, యాక్షన్ ప్లాన్, డ్రాఫ్ట్ డిజైన్‌ను సమర్పించాల్సి ఉంటుంది.ఇది కూడా చదవండి: ఒద్దికగా సర్దుకుంటే.. ఇల్లే కదా స్వర్గసీమ! -
ఆయుధాలు నిండిన డ్రోన్ కలకలం
జమ్మూ: రైఫిల్, గ్రెనేడ్లను మోసుకొస్తున్న ఓ డ్రోన్ పాకిస్తాన్ నుంచి భారత్‌లోకి సరిహద్దు దాటి వచ్చింది. దీన్ని గుర్తించిన భద్రతా బలగాలు వెంటనే కూల్చివేశాయి. ఈ ఘటన జమ్మూకశ్మీర్‌లోని కథువా జిల్లాలో శనివారం జరిగింది. జమ్మూ ప్రాంతంలో ఇలాంటి ఘటన జరగడం ఇదే తొలిసారి. 17.5 కేజీల బరువున్న చైనా తయారీ డ్రోన్.. దాదాపు 5.5 కిలోల ఆయుధాలు మోసుకొచ్చింది. అందులో అమెరికాకు, చైనాకు చెందిన ఆయుధాలు ఉన్నాయని అధికారులు చెప్పారు. ఉదయం దాదాపు ఐదింటపుడు బార్డర్ ఔట్ పోస్ట్ నుంచి వస్తున్నడ్రోన్ను గస్తీకాస్తున్న బీఎస్ఎఫ్ జవాన్లు గమనించి దాన్ని తొమ్మిది రౌండ్లు కాల్చి కూల్చివేశారు. అప్పటికే అది భారత్ లోకి 250 నుంచి 300 మీటర్ల దూరం ప్రయాణించినట్లు చెప్పారు. ఈ డ్రోన్‌కు అత్యాధునిక రైఫిల్, ఏడు గ్రెనేడ్లు అమర్చి ఉన్నాయి. ఇవిగాక రేడియో సిగ్నల్ రిసీవర్, రెండు జీపీఎస్‌లు ఉన్నాయి. పాక్ ఉగ్రవాదులు భారత్‌లోని తమ ఏజెంట్లకు వీటిని చేర్చే ప్రయత్నం చేసి ఉంటారని అధికారులు భావిస్తున్నారు. -
ఆఖరి క్షణంలో ఆగిన యుద్ధం
వాషింగ్టన్: అమెరికా, ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు యుద్ధానికి దారి తీస్తాయని ప్రపంచ దేశాలు ఆందోళన చెందుతున్న వేళ ఒకడుగు ముందుకు వేసి సమరానికి సై అన్న అగ్రరాజ్యం అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆఖరి క్షణంలో వెనక్కి తగ్గారు. ఇరాన్‌లోని ఎంపిక చేసిన మూడు లక్ష్యాలపై గురువారం రాత్రే దాడి చేయాలని అంతా సిద్ధం చేసినప్పటికీ, దాడి చేస్తే 150 మంది చనిపోతారని తెలియడంతో ట్రంప్ తన నిర్ణయాన్ని మార్చుకున్నారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ట్విట్టర్లో శుక్రవారం ప్రకటించారు. ఇరాన్ భూభాగంలోకి ప్రవేశించిన అమెరికా నిఘా డ్రోన్‌ని ఇరాన్‌కు చెందిన రివల్యూషనరీ గార్డులు కూల్చివేయడంతో ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరుకోవడం తెలిసిందే. యుద్ధానికి తాము ఎప్పుడూ సిద్ధమేనంటూ ఇరాన్ రివల్యూషనరీ గార్డు కవ్వింపు చర్యలకి దిగేసరికి డ్రోన్ కూల్చేసి ఇరాన్ అతి పెద్ద తప్పు చేసిందంటూ ట్రంప్ ట్వీట్ చేశారు. భద్రతా అధికారులతో ట్రంప్ భేటీ డ్రోన్‌ని కూల్చిన విషయాన్ని తెలుసుకున్న వెంటనే జాతీయ భద్రతా అధికారులతో ట్రంప్ గురువారం రాత్రి సమావేశమయ్యారు. ఇరాన్‌పై దాడులకు మార్గాలు అన్వేషించారు. ఇరాన్ డ్రోన్‌ని కూల్చేయడం అంత చెత్త పని మరొకటి లేదని మండిపడ్డారు. యుద్ధం ప్రకటించడానికే సిద్ధమయ్యారు. అయితే కొందరు ప్రజాప్రతినిధులు మాత్రం ట్రంప్‌ని వారించారు. కాంగ్రెస్ అనుమతి లేకుండా ఇరాన్‌పై ఎలాంటి కఠిన చర్యలకు దిగవద్దని ఆయనకు నచ్చ చెప్పారు. విదేశాంగ శాఖ మంత్రి మైక్ పాంపియో, జాతీయ భద్రతా సలహాదారు జాన్ బాల్డన్ ఇరాన్‌పై కఠినాత్మకంగా వ్యవహరించాలని సూచిస్తే, హౌస్ ఇంటెలిజెన్స్ కమిటీ చైర్మన్ ఆడమ్ స్కిఫ్ మాత్రం ఈ దశలో యుద్ధం మంచిది కాదని వారించారు. చివరకు ఆ దాడి చేస్తే 150 మంది చనిపోతారని చెప్పడంతో, డ్రోన్‌ను కూల్చేసినందుకు అంత మందిని చంపడం భావ్యం కాదని తాను దాడి ఆలోచనను విరమించుకున్నట్లు ట్రంప్ చెప్పారు. స్పష్టమైన ఆధారాలున్నాయి: ఇరాన్ అమెరికా డ్రోన్ అంతర్జాతీయ గగనతల నిబంధనల్ని అతిక్రమించి మరీ తమ దేశంలోకి ప్రవేశించిందనడానికి కచ్చితమైన సాక్ష్యాధారాలున్నాయని ఇరాన్ పేర్కొంది. ఇరాన్ విదేశాంగ శాఖ ఒక ప్రకటనలో ఈ విషయాన్ని వెల్లడించింది. డ్రోన్ శకలాలు ఇరాన్ ప్రాంతంలోని జలాల్లో కనిపించాయని తెలిపింది. ఇరాన్ విదేశీ వ్యవహారాల మంత్రి మహమ్మద్ జావేద్ జరీఫ్ మాత్రం తాము యుద్ధం కోరుకోవడం లేదని, తమ గగనతలంలోకి, జలాల్లోకి ఎవరు ప్రవేశించినా ప్రతిఘటిస్తామని స్పష్టం చేశారు. -
అమెరికా డ్రోన్‌ను కూల్చిన ఇరాన్
టెహ్రాన్: అమెరికా, ఇరాన్‌ల మధ్య ఉద్రిక్తతలు అంతకంతకూ పెరిగిపోతున్నాయి. తమ భూభాగంలోకి చొచ్చుకువచ్చిన అమెరికాకు చెందిన ఒక నిఘా డ్రోన్‌ను కూల్చివేసినట్టు ఇరాన్ వెల్లడించింది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఏడాది క్రితం ఇరాన్‌తో అణు ఒప్పందం వెనక్కి తీసుకున్నప్పట్నుంచి ఇరు దేశాల మ«ధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. ఏ క్షణమైనా రెండు దేశాల మధ్య యుద్ధం వచ్చే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇరాన్ రివల్యూషనరీ గార్డ్ తమ దేశ గగనతలంలోకి ప్రవేశించిన మానవరహిత, ఆయుధరహిత ఆర్క్యూ 4ఏ నిఘా డ్రోన్‌ను కూల్చేసినట్టు అక్కడ మీడియాలో కథనాలు వస్తున్నాయి. కానీ దానికి సంబంధించిన ఫొటోలను ఇరాన్ ప్రభుత్వం వెల్లడించలేదు. అమెరికా డ్రోన్‌ను కూల్చేసిన విషయాన్ని ధ్రువీకరిస్తూనే తాము నిబంధనలు ఉల్లంఘించి ఇరాన్ భూభాగంలోకి చొరబడలేదని హార్మోజ్గాన్ ప్రావిన్స్ వరకు ఆ డ్రోన్ వెళ్లిందని అది అంతర్జాతీయ గగనతలమని అమెరికా సెంట్రల్ కమాండ్ చెబుతోంది. వారం కిందటే అమెరికా డ్రోన్‌పై ఇరాన్ క్షిపణి దాడులకు దిగిందని అమెరికా మిలటరీ ఆరోపించింది. ఇప్పుడు ఈ డ్రోన్‌ను కూల్చివేసి ఇరాన్ అగ్రరాజ్యానికి ఘాటైన హెచ్చరికలే చేసింది. ‘‘ఏ దేశమైనా మా ప్రాదేశిక సమగ్రతను గౌరవించాలి. ఇరాన్ జాతీయ ప్రయోజనాలకు భంగం వాటిల్లకుండా చూసుకోవాలి. అమెరికా మా గగనతలంలోకి ప్రవేశిస్తే ఎందుకు ఊరుకుంటాం. అందుకే సరైన సమయంలో సరైన నిర్ణయాన్నే తీసుకొని డ్రోన్‌ని కూల్చివేశాం‘‘ అని ఇరాన్ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్పొరేషన్ జనరల్ హొస్సెని సలామి వెల్లడించారు. ఇరాన్‌కి ఎవరితోనూ యుద్ధం చేయాలన్న కోరిక లేదు కానీ, ఏ క్షణంలోనైనా యుద్ధం చెయ్యడానికి తామే సిద్ధమేనని సలామి ఘాటైన హెచ్చరికలు జారీ చేశారు. ఇరాన్ అణు ఒప్పందాన్ని వెనక్కి తీసుకోడమే కాక ఇరాన్‌తో ఎలాంటి వాణిజ్య కార్యకలాపాలు వద్దంటూ అగ్రరాజ్యం ఇతర దేశాలపై ఒత్తిడి పెంచినప్పట్నుంచి ఇరాన్ కవ్వింపు చర్యలకు దిగుతూనే ఉంది. డ్రోన్‌ను కూల్చివేయడం ఇది మొదటిసారి కాదు. గతంలోనూ ఒక డ్రోన్‌ను కూల్చివేసి దానిని అందరికీ ప్రదర్శించడంతో అమెరికా అగ్గిమీద గుగ్గిలమైంది. మున్ముందు పరిస్థితులు ఏ మలుపు తిరుగుతాయోనని ప్రపంచ దేశాలు ఆందోళనతో ఉన్నాయి. పెద్ద తప్పిదమే చేశారు: ట్రంప్ డ్రోన్‌ను కూల్చివేయడం ద్వారా ఇరాన్ పెద్ద తప్పే చేసిందని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ గురువారం అన్నారు. శ్వేతసౌధం ప్రెస్ కార్యదర్శి సారా శాండర్స్ మాట్లాడుతూ ఈ ఘటన గురించి బుధవారం రాత్రి, గురువారం ఉదయం ట్రంప్‌కు తాము వివరాలు వెల్లడించామని చెప్పారు. అనంతరం ట్రంప్ ట్వీట్ చేస్తూ ‘ఇరాన్ చాలా పెద్ద తప్పే చేసింది’ అని పేర్కొన్నారు. కాగా, ట్రంప్ చేసిన ఈ ట్వీట్ కారణంగా ముడిచమురు ధరలు దాదాపు 6 శాతం వరకు పెరిగాయి. వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియట్లో బ్యారెల్ చమురు ధర 6.3 శాతం పెరిగి 57.13 డాలర్లకు చేరగా, లండన్‌లోని బ్రెంట్ ఫ్యూచర్స్‌లో బ్యారెల్ ధర 64.69 డాలర్లకు చేరింది. -
పుష్కర ఘాట్లపై ‘డ్రోన్ల’ నిఘా...
– ఆటోమేటిక్ కెమెరాలతో ఫోటోల చిత్రీకరణ – దొంగలు, అసాంఘిక శక్తులను కనిపెట్టే ప్రయత్నం – విజయవాడ, అమరావతి, సీతానగరం ఘాట్లను కవర్ చేసేలా ఏర్పాటు – ‘కైసర్ యాప్’సాయంతో ఘాట్లలో రద్దీ గుర్తింపు సాక్షి ప్రతినిధి, తిరుపతి కృష్ణా పుష్కర ఘాట్లలో దొంగలు, అరాచక శక్తుల ఆట కట్టించడానికి అధికారులు సాంకేతిక పరిజ్ఞానాన్ని వాడుకోనున్నారు. గగన తలం నుంచి నిఘాను ఏర్పాటు చేసేందుకు డ్రోన్ల సాయం తీసుకోనున్నారు. విజయవాడ, సీతానగరం, అమరావతి, హంసలదీవి వంటి ప్రధాన ఘాట్లను కవర్ చేస్తూ అత్యాధునిక పవర్ డ్రోన్లను వినియోగించనున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఇప్పటికే సంబంధిత అధికారులతో దీనిపై చర్చించారు. సోమవారం చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలో పర్యటించిన సీఎం చంద్రబాబునాయుడు టెక్నాలజీ వినియోగంపై కుప్పం ఇంజినీరింగ్ కాలేజీ విద్యార్థులకు తెలియజేస్తూ డ్రోన్ల వినియోగాన్ని వివరించారు. గోదావరి పుష్కరాల సమయంలో ప్రధాన పుష్కర ఘాట్‌లో సీఎం చంద్రబాబునాయుడు పుణ్యస్నానం పూర్తయ్యాక భారీ తొక్కిసలాట జరిగింది. ఈ సందర్భంగా 29 మంది మృత్యువాత పడ్డారు, కారణమేదైనా కృష్ణా పుష్కరాల్లో అటువంటి సంఘటన పునరావృతం కారాదనీ, గట్టి భద్రతా చర్యలు తీసుకోవాలని సీఎం చంద్రబాబు పోలీసు అధికారులకు సూచించారు. ఈ నేపథ్యంలో డ్రోన్ల వాడకం ద్వారా ఒనకూరే ప్రయోజనాలను అంచనా వేసుకున్న అధికారులు 15 నుంచి 20 దాకా వీటిని వాడేందుకు యోచిస్తున్నారు. కోట్లాది మంది పుష్కరయాత్రికులు ఘాట్లలో పుణ్యస్నానాలు చేసే సందర్భంగా జరగరాని ఘోరం ఎదైనా జరిగితే అందుకు గల కారణాలను డ్రోన్లు తీసే ఫోటో చిత్రాల ద్వారా గుర్తించే వీలుంటుందని అధికారులు భావిస్తున్నారు. కిలోమీటరు నుంచి మూడు కిలోమీటర్ల ఎత్తున గగన తలంలో తిరిగే డ్రోన్లు లేజర్ కిరణాల ద్వారా ఫోటోలు చిత్రీకరిస్తాయి. ఘాట్లలో ఏం జరుగుతుందన్న విషయాన్ని ఎప్పటికప్పుడు తెల్సుకునే వీలుంటుంది. రద్దీని గుర్తించేందుకు కైసర్ యాప్.... ప్రధానమైన పుష్కర ఘాట్లను మ్యాపింగ్ చేయడం ద్వారా ఎక్కడ ఎక్కువ రద్దీ ఉందో గుర్తించడం, ఆయా ప్రాంతాల్లో పోలీసుల భద్రతను పటిష్టం చేసుకోవడం వంటి కీలక నిర్ణయాలు తీసుకునేందుకు వీలుగా ప్రభుత్వం ఓ ప్రత్యేక యాప్‌ను అభివద్ధి చేసింది. దీనిపేరు కైసర్. దీనిద్వారా వాహనాల్లో వెళ్లే యాత్రికులు రద్దీ తక్కువగా ఉన్న ఘాట్లను ప్రయాణ సమయంలోనే గుర్తించవచ్చు. దీన్నిబట్టి ఆయా ఘాట్లకు వెళ్లి సత్వరమే స్నానం చేసి వెళ్లేందుకు వీలవుతుంది. దీనివల్ల ట్రాఫిక్ సమస్యలను కూడా నివారించే వీలుందని అధికారులు చెబుతున్నారు.