– ఆటోమేటిక్ కెమెరాలతో ఫోటోల చిత్రీకరణ
– దొంగలు, అసాంఘిక శక్తులను కనిపెట్టే ప్రయత్నం
– విజయవాడ, అమరావతి, సీతానగరం ఘాట్లను కవర్ చేసేలా ఏర్పాటు
– ‘కైసర్ యాప్’సాయంతో ఘాట్లలో రద్దీ గుర్తింపు
సాక్షి ప్రతినిధి, తిరుపతి
కృష్ణా పుష్కర ఘాట్లలో దొంగలు, అరాచక శక్తుల ఆట కట్టించడానికి అధికారులు సాంకేతిక పరిజ్ఞానాన్ని వాడుకోనున్నారు. గగన తలం నుంచి నిఘాను ఏర్పాటు చేసేందుకు డ్రోన్ల సాయం తీసుకోనున్నారు. విజయవాడ, సీతానగరం, అమరావతి, హంసలదీవి వంటి ప్రధాన ఘాట్లను కవర్ చేస్తూ అత్యాధునిక పవర్ డ్రోన్లను వినియోగించనున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఇప్పటికే సంబంధిత అధికారులతో దీనిపై చర్చించారు. సోమవారం చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలో పర్యటించిన సీఎం చంద్రబాబునాయుడు టెక్నాలజీ వినియోగంపై కుప్పం ఇంజినీరింగ్ కాలేజీ విద్యార్థులకు తెలియజేస్తూ డ్రోన్ల వినియోగాన్ని వివరించారు.
గోదావరి పుష్కరాల సమయంలో ప్రధాన పుష్కర ఘాట్‌లో సీఎం చంద్రబాబునాయుడు పుణ్యస్నానం పూర్తయ్యాక భారీ తొక్కిసలాట జరిగింది. ఈ సందర్భంగా 29 మంది మృత్యువాత పడ్డారు, కారణమేదైనా కృష్ణా పుష్కరాల్లో అటువంటి సంఘటన పునరావృతం కారాదనీ, గట్టి భద్రతా చర్యలు తీసుకోవాలని సీఎం చంద్రబాబు పోలీసు అధికారులకు సూచించారు. ఈ నేపథ్యంలో డ్రోన్ల వాడకం ద్వారా ఒనకూరే ప్రయోజనాలను అంచనా వేసుకున్న అధికారులు 15 నుంచి 20 దాకా వీటిని వాడేందుకు యోచిస్తున్నారు. కోట్లాది మంది పుష్కరయాత్రికులు ఘాట్లలో పుణ్యస్నానాలు చేసే సందర్భంగా జరగరాని ఘోరం ఎదైనా జరిగితే అందుకు గల కారణాలను డ్రోన్లు తీసే ఫోటో చిత్రాల ద్వారా గుర్తించే వీలుంటుందని అధికారులు భావిస్తున్నారు. కిలోమీటరు నుంచి మూడు కిలోమీటర్ల ఎత్తున గగన తలంలో తిరిగే డ్రోన్లు లేజర్ కిరణాల ద్వారా ఫోటోలు చిత్రీకరిస్తాయి. ఘాట్లలో ఏం జరుగుతుందన్న విషయాన్ని ఎప్పటికప్పుడు తెల్సుకునే వీలుంటుంది.
రద్దీని గుర్తించేందుకు కైసర్ యాప్....
ప్రధానమైన పుష్కర ఘాట్లను మ్యాపింగ్ చేయడం ద్వారా ఎక్కడ ఎక్కువ రద్దీ ఉందో గుర్తించడం, ఆయా ప్రాంతాల్లో పోలీసుల భద్రతను పటిష్టం చేసుకోవడం వంటి కీలక నిర్ణయాలు తీసుకునేందుకు వీలుగా ప్రభుత్వం ఓ ప్రత్యేక యాప్‌ను అభివద్ధి చేసింది. దీనిపేరు కైసర్. దీనిద్వారా వాహనాల్లో వెళ్లే యాత్రికులు రద్దీ తక్కువగా ఉన్న ఘాట్లను ప్రయాణ సమయంలోనే గుర్తించవచ్చు. దీన్నిబట్టి ఆయా ఘాట్లకు వెళ్లి సత్వరమే స్నానం చేసి వెళ్లేందుకు వీలవుతుంది. దీనివల్ల ట్రాఫిక్ సమస్యలను కూడా నివారించే వీలుందని అధికారులు చెబుతున్నారు.