విజయవాడలో చినుకుపడితే రోడ్లు ఛిద్రమే.. | Quality Less Roads In Vijayawada | Sakshi
Sakshi News home page

విజయవాడలో చినుకుపడితే రోడ్లు ఛిద్రమే..

Published Sat, Aug 3 2019 9:18 AM | Last Updated on Sat, Aug 3 2019 9:19 AM

Quality Less Roads In Vijayawada - Sakshi

చిన్నపాటి వర్షానికే పిల్ల కాలువలా మారిన విజయవాడలోని నిర్మలా కాన్వెంట్‌ రోడ్డు

చినుకుపడితే చాలు రాజధాని నగరంలో రోడ్లన్నీ వాగులను తలపిస్తున్నాయి.. ప్రధాన రహదారుల నుంచి వీధుల వరకు రోడ్లు నిండుకుండల్లా మారుతున్నాయి. అడుగుతీసి అడుగువేయలేని పరిస్థితి నెలకొంటోంది. దశాబ్దాల నుంచి వర్షం నీటి మళ్లింపునకు విజయవాడ నగరపాలక సంస్థ వందలకోట్లు ఖర్చుపెడుతున్నా ఫలితం శూన్యమే. గతంలో నదీతీర ప్రాంతాలు, పల్లపు ప్రాంతాలు మాత్రమే ముంపునకు గురయ్యేవి.. ప్రస్తుతం నగరమంతా ఇలాంటి దుస్థితే కనిపిస్తుండటం.. చిన్నపాటి చినుకులకే ‘జల’విల్లాడటం గమనిస్తే వీఎంసీ ఇంజినీరింగ్‌ విభాగం నాసిరకం పనుల తీరు స్పష్టమవుతుంది.

సాక్షి, విజయవాడ : రాజధాని నగరాన్ని ఏటా వర్షాకాలంలో మురుగు ముంచెత్తుతోంది. చినుకుపడితే వర్షపు నీటితోపాటు డ్రెయినేజీల్లో మురుగునీరు రోడ్లపై పొంగి ప్రవహిస్తుండటంతో వాహనచోదకులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఏటా ఇదే తంతు జరుగుతున్నా గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని అధికార యంత్రాంగం దిద్దుబాటు చర్యలు చేపట్టడం లేదు. మరోవైపు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వందలకోట్లు ఖర్చుపెడుతూ.. కార్పొరేషన్‌ జనరల్‌ ఫండ్స్‌ నుంచి కూడా కోట్లకు అభివృద్ధి పనుల బిల్లుల మంజూరులు జరుగుతున్నాయి. కానీ సమస్యలు మాత్రం పరిష్కారం నామ్‌కే వాస్తేలా మారింది. నాటి జేన్‌ఎన్‌యూఆర్‌ఎం నుంచి ఇప్పటి అమృత్‌ పథకం వరకు నగరంలో ప్రధానంగా డ్రెయిన్లు, కాలువలు మరమ్మతులకు, నూతన కాలువల నిర్మాణాలకు నిధులు వెచ్చిస్తున్నారు. అందులో మురుగునీటితోపాటు వీఎంసీలో పేరుకుపోయిన అవినీతి సిల్టును తోడే నాథుడు కరువయ్యారు.
 
అక్షరాల వెయ్యి కోట్లు..!
నగరంలో మురుగునీటి పారుదలకు, వర్షంనీటి మళ్లింపునకు, నూతన సైడు, అవుట్‌ ఫాల్‌డ్రెయిన్ల నిర్మాణం, పాత డ్రెయిన్ల మరమ్మతులుకు కలిపి దశాబ్దకాలంలో వీఎంసీ సుమారు వెయ్యికోట్లు ఖర్చుపెట్టింది. జేన్‌ఎన్‌యూఆర్‌ఎం పథకంలో రూ. 320 కోట్లు నగరంలో ప్రధానంగా వరదనీటి మళ్లింపునకు అప్పట్లో ఖర్చు చేయగా.. తాజాగా కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అమృత్‌ పథకంలో భాగంగా నగరంలో రూ. 461 కోట్లతో స్ట్రామ్‌వాటర్‌ డ్రెయిన్లు నిర్మాణాలు చేపట్టిన విషయం తెలిసిందే. అయితే మూడేళ్లలో నగర పాలక సంస్థ కూడా అన్ని డివిజన్లలో కలిపి భారీ మొత్తాన్ని వెచ్చించటం గమనార్హం.

కేటాయింపులు.. ఖర్చులు..
కార్పొరేషన్‌ బడ్జెట్‌లో డ్రెయిన్ల నిర్మాణాలకు, సిల్టు తొలగింపునకు ఓపెన్‌ డ్రెయిన్లలో మరమ్మతులకు 2017–18 ఆర్థిక సంవత్సరంలో 69.24 లక్షలు ఖర్చు చేయగా, 2018–19 ఆర్థిక సంవత్సరంలో 2.4 కోట్లు ఖర్చు చేసింది. 2019–20 ఆర్థిక సంవత్సరానికి 19.20 కోట్లు ఖర్చు చేసేలా కార్పొరేషన్‌ బడ్జెట్‌ సమావేశంలో ఆమోదం పొందింది. ఇందులో ఇప్పటి వరకు రూ. 10 కోట్లు ఖర్చు చేసినట్లు వీఎంసీ ఇంజినీరింగ్‌ వర్గాలు చెబుతున్నాయి. 

  • 14వ ఫైనాన్స్‌ నిధుల నుంచి మురుగునీటి తోడటానికి, కాలువల్లో పేరుకుపోయిన సిల్టును తొలగించటానికి, ఇతర పనులకు 2017–18లో రూ. 4.32 కోట్లు, 2018–19 ఆర్థిక సంవత్సరంలో రూ. 45.20 కోట్లు ఖర్చు చేయగా 2019–20లో రూ. 75 కోట్లు నిధులు కేటాయింపులు జరిగాయి.
  • స్టేట్‌ ఫైనాన్స్‌ కమిషన్‌ నుంచి కూడా 2017–18 ఆర్థిక సంవత్సరంలో రూ. 88.72 లక్షలు, 2018–19లో రూ. 9.86 కోట్లు ఖర్చు చేయగా.. ఈ ఆర్థిక సంవత్సరానికి రూ. 15 కోట్లు కేవలం నగరంలోని సిల్టు తొలగింపునకు మాత్రమే కేటాయింపులు జరిగాయి. 
  • కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అమృత్‌ పథకంలో మురుగునీటి సమస్యను పరిష్కరించటానికి 2018–19లో 14.32 కోట్లు ఖర్చు చేయగా 2019–20 ఏడాదికి రూ. 59.86 కోట్లు కేటాయింపులు జరిగాయి. 

పేరుకే పనులు 
డ్రెయినేజీల్లో పేరుకుపోతున్న సిల్టును తోడేందుకు వీఎంసీ కోట్లకు కోట్లు ఖర్చుపెడుతుంది. భారీ యంత్రాలను అద్దెకు తీసుకోవటమే కాకుండా వీఎంసీ సమకూర్చుకున్న యంత్రాలతో కూడా రేయింబవళ్లు తీస్తున్నట్లు అధికారులు ప్రకటిస్తున్నప్పటికీ క్షేత్రస్థాయిలో మాత్రం సమస్య యథాతథంగా దర్శనమిస్తుందని స్థానికులు ఆరోపిస్తున్నారు. నగరంలో డ్రెయిన్లలో సిల్టు తీయటానికి కాంట్రాక్టర్లకు లబ్ధిచేకూరేలా దొంగమస్తర్లుతో ఇంజినీరింగ్‌ అధికారులు చేస్తున్న మాయాజాలంతోనే లక్షలు బిల్లులు పాస్‌ అవుతున్నాయని ఆరోపణలు వినబడుతున్నాయి. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement