‘హోదా’ ధర్నాలో తీవ్ర ఉద్రిక్తత..
♦ హోదా కోసం విజయవాడలో విద్యార్థుల నిరసన ప్రదర్శన
♦ ప్రధాని మోదీ దిష్టిబొమ్మ దహనానికి యత్నం
♦ దాడి చేసి చితక బాదిన బీజేపీ నాయకులు
సాక్షి, విజయవాడ: ప్రత్యేక హోదాను తక్షణం ప్రకటించాలని కోరుతూ ఆదివారం స్థానిక బీజేపీ రాష్ట్ర కార్యాలయం వద్ద ధర్నా చేసేందుకు ప్రయత్నించిన విద్యార్థి, యువజన జేఏసీ నాయకులపై బీజేపీ నేతలు పాశవికంగా దాడి చేశారు. దీంతో ఆ ప్రాంతమంతా తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. విద్యార్థి, యువజన జేఏసీ నేతలు శాంతియుతంగా ధర్నా చేసి, ప్రధాని నరేంద్ర మోదీ దిష్టిబొమ్మను దహనం చేసి తమ నిరసనను తెలియచేసేందుకు ప్రయత్నించగా, అప్పటికే అక్కడ సిద్ధంగా ఉన్న ఎస్సీ మోర్చా, ఇతర విభాగాల నేతలు ఒక్కసారిగా వారిపై విరుచుకు పడ్డారు. విద్యార్థుల చేతిలో ఉన్న ప్రధాని దిష్టిబొమ్మను బలవంతంగా లాక్కుని పక్కన పడేశారు.
తరిమి కొట్టిన నేతలు..: బీజేపీ నేతలు జి.మోహన్, అంజిబాబు, రామినేని కృష్ణ, శ్రీనివాస్, పీయూశ్ దేశాయ్ తదితరులు విద్యార్థులపై మూకుమ్మడిగా దాడి చేసి వారిని కార్యాలయం ఉన్న రోడ్డు చివర వరకు తరిమి కొట్టా రు.విద్యార్థుల గుర్తింపు కార్డులు చూపించాలంటూ వారి మెడలు పట్టుకుని తోసుకుంటూ వెళ్లారు. అయినా వారు సంయమనంతో వ్యవహరించి ప్రత్యేక హోదా కోసం నినాదాలు చేశారు. నల్లజెండాలతో విద్యార్థులు నిరసన తెలియజేయబోగా రెచ్చిపోయిన బీజేపీ నేతలు నల్లజెండాలను లాక్కుని వాటి కర్రలతో వారిపైనే దాడి చేశారు. కొంతమంది విద్యార్థుల చెంపలు చెళ్లుమనిపించారు.
కిందకు పడదోసి కాళ్లతో ఇష్టం వచ్చినట్లు తన్ని తరిమితరిమి కొట్టారు. ఈ నేపథ్యంలో సుమారు 20 నిమిషాల పాటు రాష్ట్ర కార్యాలయం వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. రవికిరణ్ అనే విద్యార్థి మీడియా ప్రతినిధులతో మాట్లాడేందుకు ప్రయత్నించగా, అతని నోరు నొక్కివేస్తూ తోసుకుంటూ తీసుకువెళ్లారు. పోలీసులు అక్కడే ఉన్నా ప్రేక్షక పాత్ర వహించారు. అనంతరం బీజేపీ రాష్ట్ర కార్యాలయ కార్యదర్శి శ్రీనివాస్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు విద్యార్థి, యువజన జేఏసీ నేతలు జె.రవికిరణ్, దుర్గా నాగరాజు, కె.తేజ, నిరంజన్‌లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఉద్యమాన్ని ఇంతటితో ఆపబోమని, మరింతగా ప్రజల్లోకి తీసుకువెళతామని జేఏసీ నేతలు చెప్పారు.