
వాషింగ్టన్: అమెరికా, ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు యుద్ధానికి దారి తీస్తాయని ప్రపంచ దేశాలు ఆందోళన చెందుతున్న వేళ ఒకడుగు ముందుకు వేసి సమరానికి సై అన్న అగ్రరాజ్యం అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆఖరి క్షణంలో వెనక్కి తగ్గారు. ఇరాన్‌లోని ఎంపిక చేసిన మూడు లక్ష్యాలపై గురువారం రాత్రే దాడి చేయాలని అంతా సిద్ధం చేసినప్పటికీ, దాడి చేస్తే 150 మంది చనిపోతారని తెలియడంతో ట్రంప్ తన నిర్ణయాన్ని మార్చుకున్నారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ట్విట్టర్‌లో శుక్రవారం ప్రకటించారు. ఇరాన్ భూభాగంలోకి ప్రవేశించిన అమెరికా నిఘా డ్రోన్‌ని ఇరాన్‌కు చెందిన రివల్యూషనరీ గార్డులు కూల్చివేయడంతో ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరుకోవడం తెలిసిందే. యుద్ధానికి తాము ఎప్పుడూ సిద్ధమేనంటూ ఇరాన్ రివల్యూషనరీ గార్డు కవ్వింపు చర్యలకి దిగేసరికి డ్రోన్ కూల్చేసి ఇరాన్ అతి పెద్ద తప్పు చేసిందంటూ ట్రంప్ ట్వీట్ చేశారు.
భద్రతా అధికారులతో ట్రంప్ భేటీ
డ్రోన్‌ని కూల్చిన విషయాన్ని తెలుసుకున్న వెంటనే జాతీయ భద్రతా అధికారులతో ట్రంప్ గురువారం రాత్రి సమావేశమయ్యారు. ఇరాన్‌పై దాడులకు మార్గాలు అన్వేషించారు. ఇరాన్ డ్రోన్‌ని కూల్చేయడం అంత చెత్త పని మరొకటి లేదని మండిపడ్డారు. యుద్ధం ప్రకటించడానికే సిద్ధమయ్యారు. అయితే కొందరు ప్రజాప్రతినిధులు మాత్రం ట్రంప్‌ని వారించారు. కాంగ్రెస్ అనుమతి లేకుండా ఇరాన్‌పై ఎలాంటి కఠిన చర్యలకు దిగవద్దని ఆయనకు నచ్చ చెప్పారు. విదేశాంగ శాఖ మంత్రి మైక్ పాంపియో, జాతీయ భద్రతా సలహాదారు జాన్ బాల్డన్ ఇరాన్‌పై కఠినాత్మకంగా వ్యవహరించాలని సూచిస్తే, హౌస్ ఇంటెలిజెన్స్ కమిటీ చైర్మన్ ఆడమ్ స్కిఫ్ మాత్రం ఈ దశలో యుద్ధం మంచిది కాదని వారించారు. చివరకు ఆ దాడి చేస్తే 150 మంది చనిపోతారని చెప్పడంతో, డ్రోన్‌ను కూల్చేసినందుకు అంత మందిని చంపడం భావ్యం కాదని తాను దాడి ఆలోచనను విరమించుకున్నట్లు ట్రంప్ చెప్పారు.
స్పష్టమైన ఆధారాలున్నాయి: ఇరాన్
అమెరికా డ్రోన్ అంతర్జాతీయ గగనతల నిబంధనల్ని అతిక్రమించి మరీ తమ దేశంలోకి ప్రవేశించిందనడానికి కచ్చితమైన సాక్ష్యాధారాలున్నాయని ఇరాన్ పేర్కొంది. ఇరాన్ విదేశాంగ శాఖ ఒక ప్రకటనలో ఈ విషయాన్ని వెల్లడించింది. డ్రోన్ శకలాలు ఇరాన్ ప్రాంతంలోని జలాల్లో కనిపించాయని తెలిపింది. ఇరాన్ విదేశీ వ్యవహారాల మంత్రి మహమ్మద్ జావేద్ జరీఫ్ మాత్రం తాము యుద్ధం కోరుకోవడం లేదని, తమ గగనతలంలోకి, జలాల్లోకి ఎవరు ప్రవేశించినా ప్రతిఘటిస్తామని స్పష్టం చేశారు.