
ఇవీ వాసన చూస్తాయ్!
న్యూయార్క్: ఘుమఘుమలాడే కాఫీ సువాసనలు జలుబు కారణంగా ముక్కును చేరలేకున్నాయా..? ఏం ఫర్లేదు. ఊరిపితిత్తుల సాయం తీసుకోండి. ఆశ్చర్యపోతున్నారా..! ఊపిరితిత్త్తుల్లోని ఒక రకం కణాలకు ముక్కువలే కాఫీ, సిగరెట్ వాసనలను పసిగట్టే శక్తి ఉందని తాజాగా శాస్త్రవేత్తలు కనుగొన్నారు. అయితే, ముక్కులోని వాసన గ్రాహకాలకు.. ఊపిరితిత్తుల్లోని గ్రాహకాలకు మధ్య తేడా ఉందట. ముక్కులో వాసన గ్రాహకాలు నాడీకణాల పొరల్లో ఉంటే.. ఊపిరితిత్తుల్లో మాత్రం శ్వాస మార్గంలో ఉంటాయి.
వీటినే పల్మనరీ న్యూరోఎండోక్రైన్ కణాలంటారు. ఇవి మెదడుకు నాడీ సంకేతాలను పంపడానికి బదులుగా ఆ వాసనను గ్రహించేందుకు వీలు కల్పిస్తాయి. దీంతో సమీపంలో ఎవరైనా సిగరెట్ ఊది పారేస్తుంటే.. వెంటనే పల్మనరీ ఎండోక్రైన్ కణాలు హార్మోన్లను విడుదల చేస్తాయి. దాంతో శ్వాసమార్గం మూసుకున్నట్లు అవుతుందని వాషింగ్టన్ యూనివర్సిలోని జీవశాస్త్రం ప్రొఫెసర్ యెహుదా బెన్ షహర్ తెలిపారు.