న్యూయార్క్‌లో హెలికాప్టర్‌ ప్రమాదం.. ప్రముఖ కంపెనీ సీఈవో ఫ్యామిలీ మృతి | Tech CEO And Family Died After Helicopter Crashed Into The Hudson River In New York City, Watch Video Inside | Sakshi
Sakshi News home page

న్యూయార్క్‌లో హెలికాప్టర్‌ ప్రమాదం.. ప్రముఖ కంపెనీ సీఈవో ఫ్యామిలీ మృతి

Published Fri, Apr 11 2025 6:48 AM | Last Updated on Fri, Apr 11 2025 10:24 AM

helicopter crashed into the Hudson River in New York City

న్యూయార్క్‌: న్యూయార్క్‌ నగరంలో ఘోర హెలికాప్టర్‌ ప్రమాదం చోటుచేసుకుంది. నగరంలోని హడ్సన్‌ నదిలో హెలికాప్టర్‌ కూలిపోయింది. ఈ ప్రమాదంలో ఆరుగురు మృతి చెందినట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించి వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది.

వివరాల ప్రకారం.. న్యూయార్క్‌ కాలమానం ప్రకారం గురువారం మధ్యాహ్నం 3:17 నగరంలోని హడ్సన్‌ నదిలో హెలికాప్టర్‌ కూలిపోయింది. బెల్‌-206 అనే హెలికాప్టర్‌ నీటిలో పడిపోయింది. ఈ ప్రమాదంలో హెలికాప్టర్‌లో ప్రయాణిస్తున్న పైలట్‌ కుటుంబం చనిపోయినట్టు అధికారులు తెలిపారు. ఈ ప్రమాదంలో ఆరుగురు మృతిచెందగా.. వారిలో ముగ్గురు చిన్నారులు ఉన్నారు. మృతిచెందిన వారిని స్పెయిన్‌లోని సిమెన్స్ సీఈవో అగస్టిన్ ఎస్కోబార్, అతని భార్య, వారి ముగ్గురు పిల్లలుగా అధికారులు గుర్తించారు. ఇక, విమానం న్యూయార్క్ డౌన్‌టౌన్ మాన్‌హట్టన్ హెలిపోర్ట్ నుండి బయలుదేరినట్టు అధికారులు వెల్లడించారు. 

ఇదిలా ఉండగా.. ప్రమాదం జరిగిన వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న సహాయక బృందాలు సహాయక చర్యలు ప్రారంభించాయి. ఘటనా స్థలంలో బోట్ల సాయంతో అగ్నిమాపక సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. హెలికాప్టర్‌ తలకిందులుగా పూర్తిగా నీళ్లలో కూరుకుపోయిందని వెల్లడించారు. గాల్లో ఉండగానే హెలికాప్టర్‌లోని ఒక భాగం విరిగిపోయిందని అధికారులు పేర్కొన్నారు. వెస్ట్ సైడ్ హైవే మరియు స్ప్రింగ్ స్ట్రీట్ సమీపంలో హడ్సన్ నదిలో హెలికాప్టర్ క్రాష్ కారణంగా, చుట్టుపక్కల ప్రాంతాలలో భారీగా ట్రాఫిక్‌ జామ్‌ ఏర్పడింది. ఈ ప్రమాదానికి సంబంధించిన వీడియోలు సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. 
 


హెలికాప్టర్ నుంచి రోటర్ బ్లేడ్ విడిపోయిందని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. అయితే సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్న దృశ్యాల్లో విమానం భాగాలు విరిగిపోవడం, అది నీటిలో కూలిడిపోవడం స్పష్టంగా కనిపిస్తోంది. ‘బెల్ 206 హెలికాప్టర్ న్యూయార్క్ నగరంలోని హడ్సన్ నదిలో కూలి మునిగిపోయింది’ అని ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ ఒక ప్రకటనలో తెలిపింది. ప్రమాదంపై నేషనల్ ట్రాన్స్‌పోర్టేషన్ సేఫ్టీ బోర్డ్‌, ఎఫ్ఏఏ దర్యాప్తు చేస్తున్నాయని పేర్కొంది.

 

న్యూయార్క్ మేయర్ ఎరిక్ ఆడమ్స్ ఈ ఘటనపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ‘ప్రస్తుతానికి ఆరుగుర్ని నదిలో నుంచి వెలికితీశామని, దురదృష్టవశాత్తూ వాళ్లంతా చనిపోయారు’ అని తెలిపారు. ఇది హృదయ విదారక, విషాదకరమైన ప్రమాదమని అభివర్ణించారు. ఘటనా స్థలికి పడవల్లో చేరుకున్న రెస్క్యూ సిబ్బంది నదిలో గాలింపు కొనసాగిస్తున్నారు. కాగా, ప్రతికూల వాతావరణం కారణంగా హెలికాప్టర్ ప్రమాదం జరిగినట్టు అధికారులు ప్రాథమికంగా నిర్దారించారు. కాగా, నౌకలు ఎక్కువగా ప్రయాణించే హడ్సన్ నదిలో అమెరికా ఎయిర్‌వేస్‌కు చెందిన విమానం 2009లో నాటకీయంగా ల్యాండ్ అయ్యింది. ఈ సంఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదు. అందులోని 155 మంది ప్రాణాలతో బయటపడటంతో ఇది ‘మిరాకిల్ ఆన్ ది హడ్సన్’ గా గుర్తింపు పొందింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement