
ట్రంప్ సర్కారు తాజా ప్రకటన
జాబితాలో స్మార్ట్‌ఫోన్లు, ల్యాప్‌లాప్‌లు చాలావరకు విదేశాల్లో తయారయ్యేవే
అమెరికా కంపెనీల ప్రయోజనాలే లక్ష్యం!
వాషింగ్టన్: ప్రతీకార సుంకాల విషయంలో ట్రంప్ సర్కారు మరో యూ టర్న్ తీసుకుంది. 20 రకాల కీలక ఎలక్ట్రానిక్ వస్తువులను కొత్త సుంకాల జాబితా నుంచి మినహాయిస్తున్నట్టు శుక్రవారం ప్రకటించింది. అన్ని దేశాల ఉత్పత్తులపైనా అమెరికా విధించిన 10 శాతం బేస్‌లైన్ టారిఫ్ నుంచి కూడా వీటిని మినహాయించినట్టు యూఎస్ కస్టమ్స్ అండ్ బోర్డర్ ప్రొటెక్షన్ విభాగం పేర్కొంది. చైనా దిగుమతులపై విధించిన 145 శాతం సుంకాలు కూడా వీటికి వర్తించబోవు.
టారిఫ్‌ల దెబ్బకు అమెరికా కంపెనీలు నష్టపోకుండా చూడటమే దీని వెనక ప్రధానోద్దేశంగా కన్పిస్తోంది. స్మార్ట్‌ఫోన్లు మొదలుకుని ల్యాప్‌లాప్‌లు, సెమీ కండక్టర్ చిప్‌ల దాకా ఈ జాబితాలో ఉన్నాయి. వీటిలో చాలా వస్తువులు అమెరికా బయట తయారయ్యేవే. హెచ్చు టారిఫ్‌ల దెబ్బకు వీటి ధరలు చుక్కలనంటుతాయంటూ అమెరికా టెక్ దిగ్గజాలు ఆందోళన వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో ఈ నిర్ణయం వెలువడటం విశేషం.
దీనితో యాపిల్, సామ్‌సంగ్ వంటి మొబైల్ దిగ్గజాలతో పాటు ఎన్‌విడియా వంటి చిప్ తయారీ కంపెనీలకు లబ్ధి చేకూరనుంది. అయితే ఇది తాత్కాలిక నిర్ణయమేనని అమెరికా ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. వాటిపై త్వరలో ఎంతోకొంత టారిఫ్ ప్రకటించవచ్చన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. యాపిల్ ఉత్పత్తుల్లో ఏకంగా 80 శాతానికి పైగా చైనాలో, మిగతా మొత్తం భారత్‌లో తయారవుతాయని అంచనా.
మినహాయింపు జాబితాలో...
స్మార్ట్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, హార్డ్ డ్రైవ్‌లు, టెలికాం పరికరాలు, చిప్–సెమీ కండక్టర్ తయారీ యంత్రాలు, రికార్డింగ్ పరికరాలు, డేటా ప్రాసెసింగ్ యంత్రాలు, ప్రింటెడ్ సర్క్యూట్ బోర్డు విడిభాగాలు, ఫ్లాట్ ప్యానల్ మానిటర్లు