కొన్నింటికి మోదం.. కొన్నింటికి ఖేదం  | Donald Trump Tariffs Will Impact Indian Stocks | Sakshi
Sakshi News home page

కొన్నింటికి మోదం.. కొన్నింటికి ఖేదం 

Published Fri, Apr 4 2025 5:52 AM | Last Updated on Fri, Apr 4 2025 7:45 AM

Donald Trump Tariffs Will Impact Indian Stocks

ఫార్మా, సెమీకండక్టర్, ఇంధనాలకు మినహాయింపులు 

టెక్స్‌టైల్స్, ఫార్మా, ఎలక్ట్రానిక్స్‌ రంగాలకు సానుకూలం 

పోటీ దేశాలకంటే భారత్‌పై టారిఫ్‌లు తక్కువే 

రత్నాభరణాలు, ఆటోమొబైల్స్, వైద్య పరికరాలపై ప్రభావం 

జీడీపీ అరశాతం వరకు తగ్గిపోవచ్చు 

ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందమే పరిష్కారం: నిపుణులు

న్యూఢిల్లీ/ముంబై: భారత ఎగుమతులపై అమెరికా విధించిన ప్రతీకార సుంకాలు కొన్ని రంగాలపై ప్రతికూల ప్రభావం చూపించనుండగా.. అదే సమయంలో కొన్ని రంగాలకు ఎగుమతి అవకాశాలను విస్తృతం చేయనుంది. ముఖ్యంగా భారత ఫార్మాస్యూటికల్స్, సెమీకండక్టర్లు, ఇంధన ఉత్పత్తులు, అమెరికాలో లభించని కొన్ని రకాల అరుదైన ఖనిజాలకు ట్రంప్‌ సర్కారు టారిఫ్‌ల నుంచి మినహాయింపు కల్పించింది. మిగిలిన అన్ని ఉత్పత్తులపైనా 27 శాతం అదనపు సుంకాన్ని మోపింది. దీంతో ఆటోమొబైల్‌ వాహనాలు, వాటి విడిభాగాలు, వైద్య పరికరాలు, రత్నాభరణాల ఎగుమతులపై ఎక్కువ ప్రభావం పడుతుందన్న అంచనాలు నెలకొన్నాయి.

రత్నాభరణాల ఎగుమతులకు ఎదురుదెబ్బ: జీజేఈపీసీ 
అమెరికా విధించిన 27 శాతం ప్రతీకార సుంకాలు భారత జెమ్స్‌ అండ్‌ జ్యుయలరీ (రత్నాలు, ఆభరణాలు) ఎగుమతులకు పెద్ద ఎదురుదెబ్బగా జెమ్స్‌ అండ్‌ జ్యుయలరీ ఎగుమతుల ప్రోత్సాహక మండలి (జీజేఈపీసీ) పేర్కొంది. అమెరికాకు భారత్‌ నుంచి ఏటా 10 బిలియన్‌ డాలర్ల రత్నాభరణాల ఎగుమతులు జరుగుతుండగా, వీటికి సవాళ్లు ఎదురుకానున్నట్టు పేర్కొంది.

 ‘‘భారత్‌–అమెరికా మధ్య ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం దిశగా పురోగతికి కృషి చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం. టారిఫ్‌లను అధిగమించేందుకు ఇది కీలకం’’అని జీజేఈపీసీ పేర్కొంది. భారత్‌ నుంచి అమెరికా ఏటా 11.58 బిలియన్‌ డాలర్ల మేర జెమ్స్, జ్యుయలరీని దిగుమతి చేసుకుంటుంటే.. అదే సమయంలో భారత్‌కు అమెరికా 5.31 బిలియన్‌ డాలర్ల  రత్నాభరణాలను ఎగుమతి చేస్తోంది.    

వైద్య పరికరాలకు ప్రతికూలం.. 
ప్రతీకార టారిఫ్‌లతో మెడికల్‌ డివైజ్‌ల ఎగుమతులపై ప్రభావం పడనుందని, పరిశ్రమ వృద్ధికి సవాలుగా మారుతుందని ఇండియన్‌ మెడికల్‌ డివైజ్‌ ఇండస్ట్రీ అసోసియేషన్‌ (ఏఐఎంఈడీ) ఫోరం కోఆర్డినేటర్‌ రాజీవ్‌ నాథ్‌ తెలిపారు.  2023–24లో భారత్‌ నుంచి అమెరికాకు 714.38 మిలియన్‌ డా లర్ల విలువైన పరికరాలు ఎగుమతయ్యాయి.

ఫార్మాకు ఊరట 
చౌకగా ఔషధాలు అందిస్తున్న భారత ఫార్మాకి ప్రతీకార టారిఫ్‌ల నుంచి ట్రంప్‌ సర్కార్‌ మినహాయింపునిచ్చింది.  అమెరికాకు భారత ఫార్మా ఎగుమతులు 9 బిలియన్‌ డాలర్ల స్థాయిలో ఉన్నాయి. 2022లో అక్కడి ప్రతి పది ప్రి్రస్కిప్షన్లలో నాలుగు ప్రిస్క్రిప్షన్లకు సంబంధించిన ఔషధాలు మన కంపెనీలు సరఫరా చేసినవే.

జీడీపీ వృద్ధికి నష్టం 
ట్రంప్‌ ప్రతీకార సుంకాలతో భారత జీడీపీ వృద్ధి ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో అర శాతం తగ్గిపోయి 6%కి పరిమితం కావొచ్చని ఈవై చీఫ్‌ పాలసీ అడ్వైజర్‌ డీకే శ్రీవాస్తవ తెలిపారు. అదనపు సుంకాలు విధించడం వల్ల భారత జీడీపీపై గరిష్టంగా 35–40 బేసిస్‌ పాయింట్ల మేర ప్రభావం పడుతుందని స్టాండర్డ్‌ చార్టర్డ్‌ బ్యాంక్‌ ఇండియా హెడ్‌ అనుభూతి సహాయ్‌ అభిప్రాయపడ్డారు.    

టెక్స్‌టైల్స్‌ ఎగుమతులకు సానుకూలం 
అమెరికా సుంకాల మోత భారత టెక్స్‌టైల్స్‌ ఎగుమతులకు సానుకూలమేనని  పరిశ్రమ అభిప్రాయపడుతోంది. అమెరికాకు టెక్స్‌టైల్స్‌ను పెద్ద ఎత్తున ఎగుమతి చేస్తున్న పోటీ దేశాలు చైనాపై 34%, వియత్నాంపై 46%, బంగ్లాదేశ్‌పై 37% సుంకాల విధింపు భారత్‌ కంటే అధికంగా ఉండడాన్ని ప్రస్తావించింది. ‘మా వద్ద మిగిలి ఉన్న ఖాళీ సామర్థ్యం గురించి ఇప్పటికే అమెరికా కస్టమర్ల నుంచి విచారణలు మొదలయ్యాయి’అని రేమండ్‌ గ్రూప్‌ సీఎఫ్‌వో అమిత్‌ అగర్వాల్‌ తెలిపారు. భారత్‌ నుంచి అమెరికా ఏటా 36 బిలియన్‌ డాలర్ల  (రూ.3 లక్షల కోట్లు) టెక్స్‌టైల్స్‌ను దిగుమతి చేసుకుంటోంది.  

ఐటీ సేవలపై పరోక్ష ప్రభావం 
ఎగుమతి ఆధారిత దేశీ ఐటీ సేవల రంగంపై టారిఫ్‌ల ప్రభావం ప్రత్యక్షంగా పడకపోయినా, తదనంతర పరిమాణాల వల్ల పరోక్ష ప్రభావం ఉంటుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అమెరికాలో మందగమనం వస్తే తయారీ, లాజిస్టిక్స్, రిటైల్‌ తదితర రంగాల్లో డిమాండ్‌ పడిపోవచ్చని ఆందోళన నెలకొంది. దీంతో ఆ రంగాల్లోని సంస్థలకు సరీ్వసులు అందించే భారత ఐటీ కంపెనీలకు ఇబ్బందులు ఎదురుకావొచ్చని విశ్లేషకులు చెప్పారు.  2024 ఆర్థిక సంవత్సరంలో భారతీయ ఐటీ సేవల కంపెనీలు ఆర్జించిన 193 బిలియన్‌ డాలర్ల ఆదాయాల్లో అమెరికా వాటా 57 శాతంగా నమోదైంది.

వాహనాలపై ప్రభావం కొంతే.. 
ట్రంప్‌ టారిఫ్‌ల ప్రభావం వాహన రంగంపై పెద్దగా ఉండకపోవచ్చని ఆటోమొబైల్‌ సంస్థల సమాఖ్య సియామ్‌ తెలిపింది. మార్చి 26 నాటి ఆదేశాల ప్రకారం ఇప్పటికే 25 శాతం సుంకాలు అమలవుతుండడాన్ని ప్రస్తావించింది. అమెరికా మార్కెట్లో చెప్పుకోతగ్గ విక్రయాలు కలిగిన టాటా మోటర్స్‌ అనుబంధ సంస్థ జాగ్వార్‌ ల్యాండ్‌రోవర్, రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ సంస్థలకు మాత్రం.. ఎగుమతుల వృద్ధి నెమ్మదించే అవకాశం ఉంది. 2024 ఆర్థిక సంవత్సరంలో అమెరికాకు భారత్‌ నుంచి ఆటో విడిభాగాల ఎగుమతులు 6.79 బిలియన్‌ డాలర్లుగా ఉండగా, అక్కడినుంచి దిగుమతులు 1.4 బిలియన్‌ డాలర్లుగా నమోదయ్యాయి.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement