
ఫార్మాస్యూటికల్స్‌పై త్వరలోనే భారీ సుంకాన్ని ప్రకటించబోతున్నామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వెల్లడించారు. హౌస్ రిపబ్లికన్ల కోసం ఫండ్ రైజింగ్ గాలాలో మాట్లాడుతూ ట్రంప్ ఈ విషయాన్ని తెలిపారు. అయితే దీనికి సంబంధించిన పూర్తి వివరాలేవీ ఆయన బయటపెట్టలేదు.
‘ఒకసారి మనం అలా చేస్తే (సుంకాలు విధిస్తే) వారు (ఔషధ కంపెనీలు) తిరిగి మన దేశంలోకి వస్తారు. ఎందుకంటే మనమే వాళ్లకు పెద్ద మార్కెట్" అని ట్రంప్ అన్నారు. "మనది పెద్ద మార్కెట్ కావడమే అందరి కంటే మనకు ఉన్న అవకాశం" పేర్కొన్నారు.
బ్లూమ్‌బర్గ్ నివేదికల ప్రకారం.. దేశీయ ఫార్మాస్యూటికల్ ఉత్పత్తి లేకపోవడంపై ట్రంప్ చాలా కాలంగా విచారం వ్యక్తం చేస్తున్నారు. దేశంలోకి మరింత సామర్థ్యాన్ని తీసుకురావడానికి సుంకాలు విధిస్తామని ఆయన పదేపదే హామీ ఇచ్చారు. త్వరలోనే ఫార్మాస్యూటికల్స్‌పై సుంకాలు ఉంటాయని మార్చిలోనే ట్రంప్ సంకేతాలిచ్చారు.
పలు దేశాలపై ప్రతీకార సుంకాలను ప్రకటించిన కొద్ది రోజులకే డొనాల్డ్ ట్రంప్ తాజా వ్యాఖ్యలు చేయడం అమెరికా, ప్రపంచ స్టాక్ మార్కెట్లను అతలాకుతలం చేసింది. ఒకవేళ ఫార్మాస్యూటికల్ ఔషధాలపై సుంకాలు ప్రకటిస్తే అమెరికాకు ఎగుమతి చేసే భారతీయ కంపెనీలపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంది.
అమెరికాకు భారత ఫార్మా ఎగుమతుల్లో ఎక్కువగా జనరిక్స్ లేదా పాపులర్ ఔషధాల చౌక వెర్షన్లు ఉన్నాయి. అక్కడ వీటిపై ప్రస్తుతం దాదాపు ఎలాంటి సుంకాలు లేవు. కానీ భారత ప్రభుత్వం యూఎస్ ఫార్మా దిగుమతులపై 10% పన్నును విధిస్తోందని పరిశ్రమ నిపుణులను ఉటంకిస్తూ రాయిటర్స్ నివేదించింది.
ఈ కంపెనీలపైనే ఎక్కువ ప్రభావం
రాయిటర్స్ ప్రకారం, భారతదేశ మొత్తం ఫార్మా ఎగుమతుల్లో మూడింట ఒక వంతు అమెరికాకే ఉంటున్నాయి. 2024 మార్చితో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో బెంగళూరుకు చెందిన బయోకాన్, ముంబైకి చెందిన లుపిన్ సంస్థలు తమ ఆదాయంలో 44 శాతం, 37 శాతం అమెరికా నుంచే ఆర్జించాయి.
హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న భారత బహుళజాతి ఫార్మాస్యూటికల్, బయోటెక్నాలజీ కంపెనీ లారస్ ల్యాబ్స్ కూడా ఉత్తర అమెరికా మార్కెట్ నుంచి 17 శాతం వాటాను ఆర్జించింది. రాయిటర్స్ ప్రకారం, భారతదేశపు అతిపెద్ద ఔషధ తయారీ సంస్థ సన్ ఫార్మా గత ఆర్థిక సంవత్సరంలో మొత్తం ఆదాయంలో 32% యూఎస్ అమ్మకాల ద్వారానే సంపాదించింది. వీటితో పాటు డాక్టర్ రెడ్డీస్, అరబిందో ఫార్మా, జైడస్ లైఫ్సైన్సెస్, గ్లాండ్ ఫార్మా వంటి సంస్థలు అమెరికాకు గణనీయంగా ఎగుమతులు చేస్తున్నాయి.