Indian companies
-
కొలువుల్లోనూ విభిన్న ‘ప్రతిభావంతులు’
సాక్షి, అమరావతి: ఉరుకులు పరుగులు పెట్టే ఉద్యోగ ప్రపంచంలో పోటీ తట్టుకుని నిలబడాలన్నా, నిలిచి గెలవాలన్నా విభిన్న ప్రతిభావంతులకు ఒకింత కష్టం. దీంతో సాధారణంగా కార్పొరేట్ కంపెనీలు సైతం అన్ని అవయవాలూ బాగున్నవారిని ఉద్యోగంలో చేర్చుకుంటే ఉత్పాదకత బాగుంటుందని భావిస్తుంటాయి. అయితే ప్రస్తుతం పరిస్థితుల్లో మార్పు వస్తోంది. దేశీయ కార్పొరేట్ కంపెనీలు సామాజిక బాధ్యతగా విభిన్న ప్రతిభావంతులకు కొలువుల్లో ప్రాధాన్యం ఇస్తున్నాయి. అనేక విభాగాల్లోని పోస్టుల్లో వారి నియామకాన్ని వేగవంతం చేయడమే కాకుండా సాధికారత సాధించేలా ప్రత్యేకంగా నైపుణ్య శిక్షణ కూడా ఇస్తున్నాయి. దేశంలోని 155 భారతీయ కంపెనీలపై అవతార్ సంస్థ నిర్వహించిన ‘మోస్ట్ ఇన్‌క్లూజివ్ కంపెనీస్ ఇండెక్స్(ఎంఐసీఐ) సర్వే నివేదికలో పలు ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి. విభిన్న ప్రతిభావంతులకు అవకాశాలు ఇస్తున్న కంపెనీలు 2019లో 58శాతం ఉండగా తాజాగా 98శాతానికి పెరిగాయి. వీరికి ఉద్యోగ అవకాశాలు ఇవ్వడంలో మిడ్–క్యాప్ ఐటీ సేవల సంస్థ ఎంఫాసిస్ దేశంలోనే ఆదర్శంగా నిలుస్తోంది.నేషనల్ సెంటర్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ ఫర్ డిజేబుల్డ్ పీపుల్(ఎన్సీపీఈడీపీ) అనే జాతీయ స్వచ్ఛంద సంస్థ ఉద్యోగ నియామకాల్లో తన వంతు చొరవ చూపిస్తోంది. ఈ సంస్థ ‘ది మిస్సింగ్ మిలియన్’ ప్రాజెక్ట్‌లో దేశంలోని విభిన్న ప్రతిభావంతుల సంఖ్య, వారికి ఉన్న వైకల్య రకాలు, అవసరమైన నైపుణ్యం, అందించాల్సిన సహకారం వంటి వివరాలను సేకరించి అందుబాటులోకి తెస్తోంది.దేశంలో 2011 జనాభా లెక్కల ప్రకారం 2.68 కోట్ల మంది విభిన్న ప్రతిభావంతులు ఉన్నట్టు లెక్కలు తేల్చారు. వాస్తవానికి అన్ని రకాల వైకల్యాలను పరిగణనలోకి తీసుకుని తాజాగా సర్వే నిర్వహిస్తే 10 కోట్లకుపైగా ఉంటారని అంచనా. వీరికి తగిన విద్యను అందించి నైపుణ్య శిక్షణ ఇచ్చి ఉపాధి అవకాశాలు కల్పించగలిగితే ఆర్థికంగా పురోగతి సాధించగలుగుతారని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఉద్యోగం..నైపుణ్యంయువతతో పోటీపడి విభిన్న ప్రతిభావంతులు రాణించాలంటే వారు చదువు ద్వారా సాధించిన ఉద్యోగానికి తోడు సరైన నైపుణ్య శిక్షణ కూడా అవసరమని అనేక కంపెనీలు గుర్తించి ఆదిశగా దృష్టిపెట్టాయి. వారి విద్యకు తగిన ఉద్యోగం ఇవ్వడంతోపాటు ఏ విధమైన శిక్షణ అవసరమో గుర్తించి అందిస్తున్నామని స్పార్కిల్ ఇన్నోవేషన్ ఎకోసిస్టమ్–కమ్యూనికేషన్స్ వైస్ ప్రెసిడెంట్, హెడ్ దీపా నాగరాజ్ తెలిపారు. సామాజిక బాధ్యతగా ఐటీసీ సంస్థ బెంగళూరులో విభిన్న ప్రతిభావంతులకు శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఆ తర్వాత కోల్‌కతా, హౌరాల్లో నిర్వహించింది. ఇక్కడ సాంకేతిక నైపుణ్యంతోపాటు వ్యక్తిత్వ వికాసం, నిర్వహణ, నైపుణ్య శిక్షణ, ఆత్మవిశ్వాసం పెంపు వంటి వాటిలో శిక్షణ ఇచ్చి ఉద్యోగ నియామకాల్లో అవకాశాలను అందిపుచ్చుకునేలా తీర్చిదిద్దారు. విభిన్న ప్రతిభావంతుల కోసం పనిచేస్తున్న సార్థక్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ అనే స్వచ్చంద సంస్థతో కలిసి అమెజాన్ సంస్థ గతేడాది గురుగ్రామ్‌లో గ్లోబల్ రిసోర్స్ సెంటర్(జీఆర్సీ)ని ప్రారంభించింది. ఈ కేంద్రంలో శిక్షణా కార్యక్రమాలను నిర్వహించడంతోపాటు వారికి అవసరమైన సాయం, ఉద్యోగ అవకాశాలను అందించేలా తోడ్పడుతోంది. వినికిడిలోపం, దృష్టిలోపం, లోకోమోటర్ వైకల్యాలు ఉన్న వారికి తగిన శిక్షణ అందించి ఉపాధి చూపేలా దృష్టి సారించింది. డ్రోన్ ఆపరేషన్‌లో శిక్షణ గరుడ ఏరోస్పేస్ డ్రోన్ తయారీ కంపెనీ విభిన్న ప్రతిభావంతుల కోసం ప్రత్యేకంగా రూపొందించిన ఈక్వాలిటీ డ్రోన్ ట్రైనింగ్ ప్రోగ్రామ్‌ను ప్రారంభించింది. ఇటీవల చెన్నైలో పది రోజులపాటు వారికి ఉచిత నైపుణ్య శిక్షణ అందించింది. అంధ సంఘాల నుంచి సేకరించిన సమాచారంతో స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీ దృష్టిలోపం ఉన్న వారికి బ్రెయిలీ బీమా పాలసీని ప్రారంభించింది.విభిన్న ప్రతిభావంతులకు ఉద్యోగ అవకాశాలు కల్పించడం, వారు నిలదొక్కుకునేలా నైపుణ్య శిక్షణ అందించడం సామాజిక బాధ్యతగా కంపెనీలు భావిస్తున్నాయి. – సౌందర్య రాజేష్, అవతార్ గ్రూప్ వ్యవస్థాపక చైర్మన్ఐటీసీ హోటల్స్‌తో పాటు అనుబంధ సంస్థల్లో 390 మంది విభిన్న ప్రతిభావంతులకు ఉద్యోగాలు ఇచ్చాం. వారికి తగిన శిక్షణ ఇస్తున్నాం, బ్రెయిలీ సంకేతాలు, సులభంగా వెళ్లి వచ్చేందుకు అనుకూలమైన ర్యాంప్ తదితర మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నాం. – అమిత్ ముఖర్జీ, ఐటీసీ హెచ్ఆర్ హెడ్ -
భారత కంపెనీలపై అమెరికా ఆంక్షలు.. జాగ్రత్తగా అధిగమించాలి
న్యూఢిల్లీ: రష్యాకు రక్షణ సామాగ్రిని సరఫరా చేస్తున్నాయనే నెపంతో భారత్‌కు చెందిన 19 కంపెనీలపై అమెరికా విధించిన ఆంక్షలను జాగ్రత్తగా అధిగమించాల్సి ఉంటుందని స్వతంత్ర పరిశోధన సంస్థ గ్లోబల్ ట్రేడ్ రీసెర్చ్ ఇనీషియేటివ్ (జీటీఆర్ఐ) సూచించింది. భారత కంపెనీలు సహా మొత్తం 400 సంస్థలు, వ్యక్తులపై ఆంక్షలు విధిస్తూ అక్టోబర్ 30న అమెరికా విదేశాంగ శాఖ, ట్రెజరీ ఆఫీస్ ఆఫ్ ఫారీన్ అసెట్స్ కంట్రోల్ (ఓఎఫ్ఏసీ) ఆదేశాలు జారీ చేయడం గమనార్హం.ఉక్రెయిన్‌పై రష్యా సైనిక కార్యకలాపాలకు సహకరిస్తున్నాయంటూ కంపెనీలపై అమెరికా ఏకపక్ష చర్యలకు దిగింది. దీంతో ఈ దిశగా భారత్ చేపట్టాల్సిన చర్యలను జీటీఆర్ఐ సూచించింది. ఆయా కంపెనీల ప్రయోజనాలను కాపాడేందుకు వీలుగా అమెరికాతో, అంతర్జాతీయ సంస్థలతో భారత్ సంప్రదింపులు చేపట్టడం ద్వారా పరిష్కారాలు గుర్తించాలని పేర్కొంది. భవిష్యత్తులో ఈ తరహా ఆంక్షలను నివారించేందుకు వీలుగా ఎగుమతులకు సంబంధించి కఠిన నియంత్రణలు, స్పష్టమైన నిబంధనల అమలుకు చర్యలు తీసుకోవాలని కోరింది.‘‘యూఎస్ ఏకపక్షంగా ఆంక్షలు విధించడం అంతర్జాతీయ చట్టాలకు విరుద్ధం. తమ వ్యాపార ప్రయోజనాల పరిరక్షణకు వీలుగా భారత్ మాదిరి దేశాలు ఈ ఆంక్షలను జాగ్రత్తగా అధిగమించడమే వాస్తవిక కార్యాచరణ అవుతుంది. అమెరికా చర్యలు భారత వ్యాపార ప్రయోజనాలకు హానికలించినా లేదా అంతర్జాతీయ వాణిజ్య నిబంధనలకు విరుద్ధంగా ఉంటే ఈ విషయాన్ని ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యూటీఐ) దృష్టికి భారత్ తీసుకెళ్లాలి’’అని జీటీఆర్ఐ తన తాజా నివేదికలో సూచించింది. అంతర్జాతీయ నిబంధనలకు కట్టుబడాలి.. భారత వ్యాపార సంస్థలు సున్నితమైన ఉత్పత్తుల (పౌర, సైనిక వినియోగం) ఎగుమతుల విషయంలో స్థానిక చట్టాలనే కాకుండా అంతర్జాతీయ వాణిజ్య నిబంధనలకు అనుగుణంగా నడుచుకోవాల్సిన అవసరాన్ని అమెరికా ఆంక్షలు గుర్తు చేస్తున్నాయని జీటీఆర్ఐ పేర్కొంది. ఆంక్షలు విధించిన దేశాలు, సంస్థలకు మద్దతు విషయంలో కంపెనీలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఆంక్షలు ఎదుర్కొంటున్న భారత కంపెనీలు అటు సైనిక, ఇటు పౌర అవసరాల కోసం ఉద్దేశించినవి ఎగుమతి చేస్తున్నట్టు తెలిపింది. వీటిల్లో కొన్ని అమెరికాలో తయారైనవే కాకుండా, స్థానికంగా తయారు చేసినవీ రష్యా సైనిక అవసరాలకు ఎగుమతి చేస్తున్న విషయాన్ని ప్రస్తావించింది.అమెరికా ఆంక్షలు ఆ దేశ తయారీ ఉత్పత్తులను ఇతర దేశాలకు తరలించే కంపెనీలకూ వర్తిస్తాయంటూ.. భారత ఎగుమతిదారులపై పరిశీలన మరింత పెరుగుతుందని అంచనా వేసింది. ఐక్యరాజ్యసమితికి వెలుపల ఏకపక్ష చర్యలకు భారత్ మద్దతు ఇవ్వరాదని.. అమెరికా ఆంక్షల విధానం కేవలం ఇరాన్, ఉత్తరకొరియా వంటి దేశాలకే పరిమితం కావాలని పేర్కొంది. భారత కంపెనీలు తమ ఉత్పత్తుల సరఫరా చైన్‌ను తప్పకుండా పరిశీలించాలని సూచించింది. -
ఒక్క కంపెనీ లాభం.. రోజుకు రూ.216 కోట్లు!
దేశంలోని కొన్ని కంపెనీలు లాభాల్లో దూసుకెళ్తున్నాయి. అవి మనం నిత్యం వింటున్న పేర్లే.. బాగా తెలిసిన కంపెనీలే. అయితే అవి రోజుకు ఎంత లాభం ఆర్జిస్తున్నాయో తెలిస్తే ముక్కున వేలేసుకుంటాం. 2024 ఆర్థిక సంవత్సరానికి ఆయా కంపెనీలు ప్రకటించిన ఫైనాన్షియల్ స్టేట్మెంట్ల ఆధారంగా సగటున రోజుకు ఎంత లాభం ఆర్జిస్తున్నాయో ఇక్కడ తెలుసుకుందాం.ముఖేష్ అంబానీ నేతృత్వలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ 2024 ఆర్థిక సంవత్సరంలో రూ. 1.79 లక్షల కోట్ల ఏకీకృత ఎబీటా (EBITDA)ని నివేదించింది. నికర లాభం రూ. 79,020 కోట్లుగా ఉంది. అంటే కంపెనీ సగటున రోజుకు ఆర్జిస్తున్న లాభం రూ.216.5 కోట్లు. ఈటీ మనీ నివేదిక ప్రకారం 2024 ఆర్థిక సంవత్సరంలో సగటున రోజువారీ లాభంలో టాప్ టెన్ కంపెనీల జాబితా ఇదే..లాభాల్లో టాప్10 కంపెనీలు🔝రిలయన్స్ ఇండస్ట్రీస్ రూ.216.5 కోట్లు🔝ఎస్బీఐ రూ.186.7 కోట్లు🔝హెచ్డీఎఫ్సీ బ్యాంక్ రూ.179.3 కోట్లు🔝ఓఎన్జీసీ రూ.156.4 కోట్లు🔝టీసీఎస్ రూ.126.3 కోట్లు🔝ఐసీఐసీఐ బ్యాంక్ రూ.123.3 కోట్లు🔝ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ రూ.118.2 కోట్లు🔝ఎల్ఐసీ రూ.112.1 కోట్లు🔝కోల్ ఇండియా రూ.102.4 కోట్లు🔝టాటా మోటర్స్ రూ.87.1 కోట్లుఇదీ చదవండి: పడిలేచిన కెరటంలా అనిల్ అంబానీ.. -
రూ.1.25 లక్షల కోట్ల పెట్టుబడులు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: పెరుగుతున్న డిమాండ్‌ను తీర్చడానికి భారత సిమెంట్ పరిశ్రమ 2027 మార్చి నాటికి రూ.1.25 లక్షల కోట్లు పెట్టుబడి చేయనుందని రేటింగ్ ఏజెన్సీ క్రిసిల్ నివేదిక తెలిపింది. ఈ కాలంలో 130 మిలియన్ టన్నుల సిమెంట్ గ్రైండింగ్ సామర్థ్యం తోడవుతోందని వెల్లడించింది. ఇది ప్రస్తుతం ఉన్న సామర్థ్యంలో 20 శాతానికి సమానం అని వివరించింది. క్రిసిల్ నివేదిక ప్రకారం.. ఆరోగ్యకర డిమాండ్ దృక్పథం, మార్కెట్ వాటా కోసం పోటీ ఈ పెట్టుబడులను నడిపిస్తాయి. తక్కువ మూలధన వ్యయాలు, బలమైన బ్యాలెన్స్ షీట్లు కంపెనీల క్రెడిట్ ప్రొఫైల్స్‌ను స్థిరంగా ఉంచుతాయి. అంచనా వేసిన పెట్టుబడులు గత మూడు ఆర్థిక సంవత్సరాలలో చేసిన క్యాపెక్స్ కంటే 1.8 రెట్లు ఉంటుంది. అయినప్పటికీ తయారీదారుల క్రెడిట్ రిస్క్ ప్రొఫైల్‌లు స్థిరంగా ఉంటాయి. దశాబ్దంలో గరిష్టంగా.. గత మూడు ఆర్థిక సంవత్సరాలలో సిమెంట్ డిమాండ్‌లో ఆరోగ్యకరంగా 10 శాతం వార్షిక పెరుగుదల.. సామర్థ్యం జోడింపును మించిన వృద్ధిని సాధించింది. 2023–24లో వినియోగ స్థాయి ఈ దశాబ్దంలో గరిష్టంగా 70 శాతానికి చేర్చింది. ఇది సిమెంట్ తయారీదారులను ‘క్యాపెక్స్ పెడల్‌ను నొక్కడానికి‘ ప్రేరేపించింది. 2024 మార్చి 31 నాటికి పరిశ్రమ స్థాపిత సిమెంట్ గ్రైండింగ్ సామర్థ్యంలో 80 శాతానికి పైగా కైవసం చేసుకున్న 20 సిమెంట్ తయారీ సంస్థల విశ్లేషణ ఆధారంగా ఈ నివేదిక రూపొందించినట్టు క్రిసిల్ తెలిపింది. డిమాండ్ ఔట్లుక్.. సిమెంట్ పరిశ్రమ మూలధన వ్యయాలు ఇప్పటికీ తక్కువగా ఉన్నాయి. 2025–26, 2026–27 ఆర్థిక సంవత్సరాలలో 0.7–0.9 శ్రేణిలో ఉండొచ్చు. ఇది గత మూడు ఆర్థిక సంవత్సరాల మాదిరిగానే ఉంది. 2025–2029 ఆర్థిక సంవత్సరాల్లో 7 శాతం వార్షిక వృద్ధి రేటుతో సిమెంట్ డిమాండ్ ఔట్లుక్ ఆరోగ్యంగా ఉంది. రాబోయే మూడు ఆర్థిక సంవత్సరాల్లో క్యాపెక్స్‌లో వృద్ధి ప్రధానంగా పెరుగుతున్న డిమాండ్‌తోపాటు.. దేశవ్యాప్తంగా ఉనికిని మెరుగుపరుచుకోవాలనే సిమెంట్ తయారీదారుల ఆకాంక్షలకు అనుగుణంగా ఉంటుందని క్రిసిల్ రేటింగ్స్ సీనియర్ డైరెక్టర్, డిప్యూటీ చీఫ్ రేటింగ్స్ ఆఫీసర్ మనీష్ గుప్తా తెలిపారు. సిమెంట్ తయారీదారుల సంఘం (సీఎంఏ) ప్రకారం దేశంలో స్థాపిత సిమెంట్ సామర్థ్యం 670 మిలియన్ టన్నులు. -
వరల్డ్ టాప్ 100 బ్రాండ్లలో ఇండియన్ కంపెనీలు
ప్రపంచంలోని అత్యంత విలువైన 100 బ్రాండ్లలో ఇండియా నుంచి నాలుగు కంపెనీలు చోటు దక్కించుకున్నాయి. దీనికి సంబంధించిన డేటాను బ్రాండ్జెడ్ మోస్ట్ వాల్యూబుల్ గ్లోబల్ బ్రాండ్స్ రిపోర్ట్‌లో ప్రముఖ మార్కెటింగ్ డేటా అండ్ అనలిటిక్స్ బిజినెస్ కాంటార్ వెల్లడించింది.ప్రపంచంలోని అత్యంత విలువైన 100 కంపెనీల జాబితాలో టీసీఎస్ (టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్) 46వ ర్యాంక్ పొందగా.. హెచ్డీఎఫ్సీ బ్యాంక్ 47 ర్యాంక్ పొందింది. టెలికాం కంపెనీ ఎయిర్టెల్ కూడా ఈ జాబితాలో 73 ర్యాంక్ సొంతం చేసుకుంది. టెక్ దిగ్గజం ఇన్ఫోసిస్ 74 ర్యాంక్ కైవసం చేసుకుంది.ప్రపంచంలోని అత్యంత విలువైన కంపెనీల జాబితాలో ఇన్ఫోసిస్ సంస్థ స్థానం పొందటం ఇది వరుసగా మూడోసారి. బిజినెస్-టు-బిజినెస్ టెక్నాలజీ బ్రాండ్‌గా ఇన్ఫోసిస్ 20వ ర్యాంక్ పొందింది.ఇండియాలో మాత్రమే కాకుండా అమెరికాలో కూడా అత్యంత విశ్వసనీయమైన బ్రాండ్లలో ఇన్ఫోసిస్ టాప్ 6 శాతంలో ఉందని కాంటార్ బ్రాండ్జెడ్ డేటా వెల్లడించింది. రెండు మార్కెట్లలో ఇన్ఫోసిస్ విశ్వసనీయ భాగస్వామిగా దాని స్థానాన్ని సుస్థిరం చేయడం ద్వారా దాని వినియోగదారులకు చాలా ఉపయోగకరంగా ఉందని కాంటార్ బ్రాండ్జెడ్ అధిపతి మార్టిన్ గెరియేరియా అన్నారు.Infosys featured as a Top 100 global brand by Kantar! Thank you to every Infoscion, for making this happen for the 3rd consecutive year! https://t.co/MSaxBOIy1x#NavigateYourNext #KantarBrandzTop100 #InfyNews pic.twitter.com/zGe99AWfeI— Infosys (@Infosys) June 12, 2024 -
యూఎస్ జెనరిక్స్ మార్కెట్లో భారత్ హవా
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: జెనరిక్ ఔషధ రంగంలో భారత కంపెనీల హవా కొనసాగుతోంది. 2022లో వైద్యుల సిఫార్సు మేరకు యూఎస్‌లో రోగులు వినియోగించిన మొత్తం జెనరిక్స్‌లో 47 శాతం భారతీయ కంపెనీలు సరఫరా చేశాయి. ఔషధాల పరిమాణం పరంగా భారత్ తొలి స్థానంలో నిలిచింది. ఇక్వియా నేషనల్ ప్రి్రస్కిప్షన్ ఆడిట్ ప్రకారం.. అందుబాటు ధరలో జెనరిక్ మందుల సరఫరాలో భారతీయ కంపెనీలు తమ సత్తా చాటుతున్నాయి. ప్రభుత్వ బీమా కార్యక్రమాలు, ప్రైవేట్ బీమా కంపెనీలు ఔషధాల కోసం చెల్లించిన మొత్తంలో.. భారతీయ ఫార్మా కంపెనీలు అందించిన మందులు సగానికంటే అధికంగా ఉండడం గమనార్హం. యూఎస్ సంస్థలు 30 శాతం వాటాతో రెండవ స్థానం సంపాదించాయి. మధ్యప్రాచ్య దేశాలు 11 శాతం, యూరప్ 5, కెనడా 3, చైనా 2, ఇతర దేశాల కంపెనీలు 2 శాతం జెనరిక్స్ సరఫరా చేశాయి. 50 శాతంపైగా మన కంపెనీలవే.. చికిత్సల పరంగా చూస్తే మానసిక రుగ్మతలకు వినియోగించిన మందుల్లో భారతీయ కంపెనీలు సరఫరా చేసినవి ఏకంగా 62 శాతం ఉన్నాయి. హైపర్‌టెన్షన్ 60 శాతం, లిపిడ్ రెగ్యులేటర్స్ 58, యాంటీ అల్సర్స్ 56, నరాల సంబంధ చికిత్సలకు 55 శాతం మందులు భారత్ నుంచి సరఫరా అయినవే కావడం విశేషం. మధుమేహ సంబంధ ఔషధాల్లో భారత్ వాటా 21 శాతంగా ఉంది. ఇక బయోసిమిలర్స్ సరఫరాలో మూడవ స్థానంలో ఉన్న భారత సంస్థల వాటా ప్రస్తుతం 15 శాతంగా ఉంది. యూఎస్ 56 శాతం, కొరియా 18, యూరప్ 11 శాతం బయోసిమిలర్స్ సరఫరా చేశాయి. మరో 1.3 ట్రిలియన్ డాలర్లు..భారతీయ కంపెనీలు సరఫరా చేసిన జెనరిక్ మందుల కారణంగా 2022లో యూఎస్ ఆరోగ్య సంరక్షణ వ్యవస్థ 219 బిలియన్ డాలర్ల మేర పొదుపు చేయగలిగింది. 2013 నుంచి 2022 మధ్య మొత్తం 1.3 ట్రిలియన్ డాలర్లు ఆదా అయ్యాయని ఇక్వియా నేషనల్ ప్రి్రస్కిప్షన్ ఆడిట్ నివేదిక పేర్కొంది. భారతీయ కంపెనీల నుండి వచ్చే జెనరిక్ ఔషధాలతో వచ్చే ఐదేళ్లలో అదనంగా 1.3 ట్రిలియన్ డాలర్ల పొదుపు అవుతుందని అంచనా. భారత్–యూఎస్ మధ్య బలమైన ఫార్మా వాణిజ్య భాగస్వామ్యం కోసం రెండు దేశాలు ఔషధ ముడిపదార్థాలకై విదేశీ వనరులపై ఆధారపడటాన్ని తగ్గించడానికి ఔషధ స్థితిస్థాపకతను సాధించాలని ఇండియన్ ఫార్మాస్యూటికల్ అలయన్స్ (ఐపీఏ) ఇటీవల కోరింది. ఔషధాల రంగంలో ఇరు దేశాలు కలిసి వచ్చి అగ్రిగేటర్‌గా మారాలి అని ఐపీఏ అభిప్రాయపడింది. 70 శాతం యాక్టివ్ ఫార్మా ఇంగ్రీడియెంట్స్ చైనా నుంచి భారత్‌కు దిగుమతి అవుతున్నాయి. -
ఫార్మాకు కొత్త పీఎల్ఐ పథకం!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఔషధ రంగానికి కొత్త ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక (పీఎల్ఐ) పథకాన్ని ప్రవేశపెట్టడంపై కేంద్ర ప్రభుత్వం ఆలోచిస్తోంది. యాక్టివ్ ఫార్మాస్యూటికల్ ఇంగ్రీడియెంట్స్ (ఏపీఐ) తయారీకి అవసరమైన కీలక రసాయనాల ఉత్పత్తిని దేశీయంగా పెంచడం లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. తద్వారా కీలక రసాయనాల ఉత్పత్తుల కోసం భారతీయ కంపెనీలు చైనాపై ఆధారపడటాన్ని తగ్గించడం ఈ నిర్ణయం వెనుక ఉన్న ముఖ్య ఉద్ధేశం. ఫార్మాతో ముడిపడి ఉన్న అన్ని విభాగాలు ప్రస్తుత పీఎల్ఐ కింద కవర్ కాలేదు. దీని కారణంగా ఈ రసాయనాలు ఇప్పటికీ చైనా నుండి పెద్దమొత్తంలో భారత్‌కు దిగుమతి అవుతున్నాయి. అయితే కేంద్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మాత్రమే నూతన పీఎల్ఐ కార్యరూపంలోకి వచ్చే అవకాశం ఉంది. అలాగే తదుపరి కేంద్ర బడ్జెట్లో ప్రతిపాదిత పథకం భాగం కావచ్చు. ప్రస్తుత పథకానికి సవరణ.. భారత్‌కు దిగుమతి అవుతున్న ఫార్మా ముడిపదార్థాల్లో 55–56 శాతం వాటా చైనాదే. 2013–14లో దిగుమతైన యాక్టివ్ ఫార్మా ఇంగ్రీడియెంట్స్‌లో చైనా వాటా విలువ పరంగా 64 శాతం, పరిమాణం పరంగా 62 శాతం వృద్ధి నమోదైంది. 2022–23 వచ్చేసరికి ఇది వరుసగా 71 శాతం, 75 శాతానికి ఎగబాకింది. చైనా నుంచి ముడిపదార్థాల (బల్క్ డ్రగ్) దిగుమతులు 2013–14లో 2.1 బిలియన్ డాలర్లు, 2018–19లో 2.6 బిలియన్ డాలర్లు, 2022–23 వచ్చేసరికి 3.4 బిలియన్ డాలర్లకు ఎగబాకాయి. చైనాలో ఈ రసాయనాల తయారీ వ్యయాలు చాలా తక్కువగా ఉన్నాయి. దీని కారణంగా ఏపీఐల ఉత్పత్తికై భారతీయ తయారీ సంస్థలు చైనా నుంచే వీటిని ఎక్కువగా దిగుమతి చేసుకుంటున్నాయి. ముఖ్యంగా ఈ రసాయనాలు కాలుష్యకారకాలు. ఈ రసాయనాలను పీఎల్ఐ పరిధిలోకి చేర్చేందుకు ప్రస్తుత పథకాన్ని సవరించడాన్ని కూడా ప్రభుత్వం పరిశీలించవచ్చని తెలుస్తోంది. జాప్యాలకు దారితీయవచ్చు.. ప్రస్తుతం ఉన్న ఫార్మా పీఎల్ఐ పథకం కింద పరిశ్రమకు కీలక స్టారి్టంగ్ మెటీరియల్స్, డ్రగ్ ఇంటర్మీడియట్స్, యాక్టివ్ ఫార్మాస్యూటికల్ ఇంగ్రీడియెంట్స్‌ను స్థానికంగా తయారు చేయడానికి కేంద్ర ప్రభుత్వం ప్రోత్సాహకాలను అందిస్తోంది. ఫార్మా సరఫరా వ్యవస్థ మొత్తాన్ని ప్రస్తుత పీఎల్ఐ పథకం కవర్ చేయడం లేదు. అయితే ఏపీఐల తయారీలో వాడే రసాయనాల ధరలను చైనా తగ్గించింది. పీఎల్ఐ పథకంలో భాగం కాని కంపెనీలు చైనా నుంచి ఈ రసాయనాలను తక్కువ ధరకు దిగుమతి చేసుకుంటున్నాయి. కీలక ఔషధ ముడి పదార్ధాల కోసం ఒకే దేశంపై ఎక్కువగా ఆధారపడటం భారత ఫార్మా పరిశ్రమకు ప్రమాదం కలిగించే అవకాశమూ లేకపోలేదు. దీనికి కారణం ఏమంటే సరఫరా వ్యవస్థలో అంతరాయాలు ఏర్పడినట్టయితే మందుల కొరత, తయారీ జాప్యాలకు దారితీయవచ్చు. -
అంకురాలకు తగ్గుతున్న ఆదరణ.. కానీ..
ముంబై: అంకురాలు పెట్టుబడుల సమీకరణకు ఎన్నో సవాళ్లు ఎదుర్కొంటున్నాయి. వెంచర్ క్యాపిటలిస్టులు, ప్రైవేట్ ఈక్విటీ సంస్థల దగ్గర పెద్ద మొత్తంలో నిధులు ఉన్నప్పటికీ.. ఆచితూచి పెట్టుబడులు పెట్టడం ప్రారంభించడంతో ఈ సమస్య ఎదురవుతోంది. వృద్ధి దశలోని అంకురాలకు నిధులు అందడం కష్టంగా ఉందని నిపుణులు భావిస్తున్నారు. కానీ స్థిరమైన వృద్ధిని అందించే ప్రాజెక్టులపై మాత్రం ఆసక్తి పెరుగుతుందని చెబుతున్నారు. దేశీ కంపెనీల్లోకి ప్రైవేట్ ఈక్విటీ (పీఈ), వెంచర్ క్యాపిటల్ (వీసీ) పెట్టుబడులు ఈ ఏడాది 40 శాతం క్షీణించాయి. ఇప్పటివరకు 27.9 బిలియన్ డాలర్లకు పరిమితమయ్యాయి. అదే సమయంలో పెట్టుబడుల ఉపసంహరణ స్వల్పంగా పెరిగి 19.34 బిలియన్ డాలర్లకు చేరింది. ప్రైవేట్ పెట్టుబడులను విశ్లేషించే వెంచర్ ఇంటెలిజెన్స్, పరిశ్రమ సమాఖ్య ఐవీసీఏ రూపొందించిన నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. దీని ప్రకారం 2023 డిసెంబర్ 30 నాటికి పీఈ, వీసీ సంస్థలు 697 లావాదేవీల ద్వారా 27.9 బిలియన్ డాలర్లు ఇన్వెస్ట్ చేశాయి. గతేడాది (2022లో) 1,364 డీల్స్ ద్వారా 47.62 బిలియన్ డాలర్లు వచ్చాయి. అలాగే గతేడాది 233 లావాదేవీల ద్వారా 18.45 బిలియన్ డాలర్ల పెట్టుబడులను వెనక్కి తీసుకోగా ఈసారి లావాదేవీల సంఖ్య 248కి, పరిమాణం 19.34 బిలియన్ డాలర్లకు పెరిగింది. అయితే, నిధుల ప్రవాహం మందగించడం తాత్కాలికమేనని, రాబోయే రోజుల్లో మరింత భారీగా పెట్టుబడులు రాగలవని ఐవీసీఏ (ఇండియన్ ప్రైవేట్ ఈక్విటీ, వెంచర్ క్యాపిటలిస్ట్ అసోసియేషన్) ప్రెసిడెంట్ రజత్ టాండన్ తెలిపారు. ఈ ఏడాది లావాదేవీల సంఖ్య తగ్గినా భారీ స్థాయి పెట్టుబడులు రావడమనేది గణనీయమైన విలువను, స్థిరమైన వృద్ధిని అందించే ప్రాజెక్టులపై ఆసక్తి పెరగడాన్ని సూచిస్తోందని ఆయన పేర్కొన్నారు. నివేదికలో మరిన్ని అంశాలు.. టాప్ 5 పెట్టుబడులను చూస్తే.. ఏప్రిల్‌లో మణిపాల్ హాస్పిటల్లో టీపీజీ క్యాపిటల్, టెమాసెక్ 2.4 బిలియన్ డాలర్లు ఇన్వెస్ట్ చేశాయి. తదుపరి జూన్‌లో హెచ్డీఎఫ్సీ క్రెడిలాను బేరింగ్ ఏషియా, క్రిస్‌క్యాపిటల్ 1.35 బిలియన్ డాలర్లకు దక్కించుకున్నాయి. ఆగస్టులో రిలయన్స్ రిటైల్ వెంచర్స్‌లో ఖతర్ ఇన్వెస్ట్మెంట్ అథారిటీ 1 బిలియన్ డాలర్లు ఇన్వెస్ట్ చేసింది. ఏప్రిల్‌లో అవాడా వెంచర్స్‌లో బ్రూక్‌ఫీల్డ్ 1 బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టింది. జూలైలో ఫెర్టిలిటీ క్లినిక్‌ల సంస్థ ఇందిరా ఐవీఎఫ్ క్లినిక్స్‌కి బేరింగ్ ఏషియా 732 మిలియన్ డాలర్లు అందించింది. ► రంగాలవారీగా పరిశీలించినప్పుడు హెల్త్‌కేర్.. లైఫ్ సైన్సెస్‌లో అత్యధికంగా పెట్టుబడులు వచ్చాయి. గతేడాదితో పోలిస్తే 30.2 శాతం పెరిగాయి. అలాగే ఇంధన (14.5 శాతం), రిటైల్ (98.8 శాతం), అడ్వర్టైజింగ్.. మార్కెటింగ్‌లో (199.8 శాతం) ఇన్వెస్ట్మెంట్లు పెరిగాయి. ► ఐటీ..ఐటీఈఎస్ రంగంలో పెట్టుబడులు 64.5 శాతం క్షీణించాయి. అలాగే బీఎఫ్ఎస్ఐ (బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్, బీమా)లోకి 47.6 శాతం, తయారీలోకి 43 శాతం, ఇంజినీరింగ్.. నిర్మాణ రంగాల్లోకి 64 శాతం మేర ఇన్వెస్ట్మెంట్లు పడిపోయాయి. షిప్పింగ్ .. లాజిస్టిక్స్‌లోకి 60.6 శాతం, విద్యా రంగంలోకి 78.4 శాతం, ఎఫ్ఎంసీజీలో 48.5 శాతం, అగ్రి బిజినెస్‌లోకి 81 శాతం, ఫుడ్ అండ్ బెవరేజెస్లోకి 70 శాతం, టెలికంలోకి 84 శాతం పెట్టుబడులు క్షీణించాయి. ఇదీ చదవండి: 1.5 లక్షల మందికి శిక్షణ ఇవ్వనున్న ప్రభుత్వం.. ► టాప్ పీఈ నిష్క్రమణలను చూస్తే.. టైగర్ గ్లోబల్, యాక్సెల్ ఇండియా.. ఈ–కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌లో తమ వాటాలను వాల్‌మార్ట్‌కు 1.78 బిలియన్ డాలర్లకు విక్రయించాయి. లెన్స్‌కార్ట్‌లో ఇన్వెస్టర్లు షిరాటే వెంచర్స్, ప్రేమ్‌జీఇన్వెస్ట్, యునీలేజర్ వెంచర్స్, స్టెడ్‌వ్యూ క్యాపిటల్, టీఆర్ క్యాపిటల్, క్రిస్ గోపాలకృష్ణన్, ఎపిక్ క్యాపిటల్ తమ వాటాలను అబు ధాబి ఇన్వెస్ట్మెంట్ అథారిటీకి 410 మిలియన్ డాలర్లకు విక్రయించాయి. పర్సనల్ కేర్ బ్రాండ్ మామాఎర్త్ ఇన్వెస్టర్లు సోఫినా, స్టెలారిస్ వెంచర్ పార్ట్నర్స్, ఫైర్‌సైడ్ వెంచర్స్, షార్ప్ వెంచర్స్ .. పబ్లిక్ ఇష్యూలో తమ వాటాలను విక్రయించి 133 మిలియన్ డాలర్లు సమీకరించాయి. -
ManpowerGroup Employment Outlook Survey: నియామకాలపై భారత్‌లో బుల్లిష్ ధోరణి
న్యూఢిల్లీ: భారత కంపెనీలు వచ్చే మూడు నెలల (2024 జనవరి–మార్చి) కాలానికి నియామకాల పట్ల ఎంతో సానుకూలంగా ఉన్నట్టు మ్యాన్‌వపర్ గ్రూప్ ఇండియా సర్వే వెల్లడించింది. నియామకాల ఆశావాదం భారత్‌లోనే ఎక్కువగా నమోదైంది. రానున్న మూడు నెలల్లో తమ ఉద్యోగుల సంఖ్యను పెంచుకుంటామని 37 శాతం కంపెనీలు చెప్పాయి. మ్యాన్‌పవర్ గ్రూప్ ఎంప్లాయింట్‌మెంట్ అవుట్‌లుక్ సర్వే ప్రపంచవ్యాప్తంగా 3,100 కంపెనీలను ప్రశ్నించి ఈ వివరాలను విడుదల చేసింది. 2023 ప్రథమ త్రైమాసికంతో పోలిస్తే భారత్‌లో నియామకాల ధోరణి 5 శాతం ఎక్కువగా కనిపించింది. ‘‘దేశీయ డిమాండ్ ఇప్పటికీ స్తబ్దుగానే ఉంది. నిరంతరాయ ప్రైవేటు పెట్టుబడుల ప్రవాహం భారత్‌ను లాభదాయక ఆర్థిక వ్యవస్థగా మార్చడంలో సాయపడుతున్నాయి’’అని మ్యాన్‌పవర్ గ్రూప్ ఇండియా ఎండీ సందీప్ గులాటి పేర్కొన్నారు. భారత్‌లోనే అధికం.. జనవరి–మార్చి త్రైమాసికానికి నియామకాల పరంగా ఎక్కువ ఆశావాదం భారత్, నెదర్లాండ్స్‌లోనే కనిపించింది. ఈ రెండు దేశాల్లోనూ 37 శాతం కంపెనీలు నియామకాల పట్ల సానుకూలత కనబరిచాయి. ఆ తర్వాత కోస్టారికా, అమెరికాలో ఇది 35 శాతంగా ఉంది. 34 శాతంతో మెక్సికో నియామకాల ఆశావాదంలో మూడో స్థానంలో ఉంది. అంతర్జాతీయంగా సగటున చూస్తే ఇది రానున్న త్రైమాసికానికి 26 శాతంగా ఉంది. ఈ రంగాల్లో సానుకూలం రియల్ ఎస్టేట్ రంగంలో నియామకాల సానుకూల త ఎక్కువగా నమోదైంది. ఆ తర్వాత ఐటీ, కన్జ్యూ మర్ గూడ్స్ అండ్ సర్వీసెస్ రంగాల్లో నియామకాల ధోరణి వ్యక్తమైంది. మార్చి త్రైమాసికంలో నియామకాలు పెంచుకుంటామని ఫైనాన్షియల్స్, రియల్ ఎస్టేట్ రంగంలో 45 శాతం కంపెనీలు చెప్పాయి. ఐటీ రంగంలో 44 శాతం, కన్జ్యూమర్ గూడ్స్ అండ్ సర్వీసెస్ రంగంలో 42% కంపెనీలు ఇదే విధమైన దృక్పథంతో ఉన్నాయి. అతి తక్కువగా 28% మేర నియామకాల సానుకూలత ఇంధనం, యుటిలిటీ రంగాల్లో కనిపించింది. మన దేశంలో పశ్చిమ భారత్‌లో ఎక్కువగా 39 శాతం మేర నియామకాల పట్ల కంపెనీలు సానుకూలంగా ఉన్నాయి. ఆ తర్వాత ఉత్తరాదిలో 38 శాతం సానకూలత కనిపించింది. నిపుణుల కొరత భారత్, జపాన్‌లో నిపుణులైన మానవ వనరుల కొరత అధికంగా ఉంది. భారత్‌లో 81 శాతం సంస్థలు నైపుణ్య మానవ వనరులను గుర్తించడం కష్టంగా ఉందని చెప్పాయి. 2023 సంవత్సరం ఇదే కాలంలోని ఫలితాలతో పోలి్చచూసినప్పుడు ఒక శాతం పెరిగింది. తమకు కావాల్సిన నిపుణులను గుర్తించడం కష్టంగా ఉందని 85 శాతం జపాన్ కంపెనీలు చెప్పాయి. ఆ తర్వాత గ్రీస్, ఇజ్రాయెల్‌లోనూ 82 శాతం కంపెనీలు ఇదే అభిప్రాయాన్ని వెల్లడించాయి. నిపుణులను గుర్తించి, వారిని నియమించుకుని, అట్టి పెట్టుకునేందుకు కంపెనీలు సౌకర్యవంతమైన పని విధానాన్ని ఆఫర్ చేస్తున్నాయి. ఐటీ, డేటా, సేల్స్ అండ్ మార్కెటింగ్, ఇంజనీరింగ్, ఆపరేషన్స్ అండ్ లాజిస్టిక్స్, హెచ్ఆర్ నిపుణులకు ఎక్కువ డిమాండ్ నెలకొంది. -
విదేశాల్లో డైరెక్ట్ లిస్టింగ్‌కు గ్రీన్ సిగ్నల్..
న్యూఢిల్లీ: భారతీయ కంపెనీలు విదేశీ ఎక్స్చెంజీలలో నేరుగా లిస్టయ్యేందుకు మార్గం సుగమం చేస్తూ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇందుకోసం కంపెనీల చట్టంలో సంబంధిత సెక్షన్ 5ని నోటిఫై చేసింది. దీని ప్రకారం నిర్దిష్ట తరగతులకు చెందిన పబ్లిక్ కంపెనీలు .. ఆమోదయోగ్యమైన కొన్ని విదేశీ స్టాక్ ఎక్స్చెంజీలలో తమ షేర్లను లిస్ట్ చేసుకోవచ్చు. అయితే, ఈ సెక్షన్‌కు సంబంధించిన నిబంధనలను ఇంకా నోటిఫై చేయాల్సి ఉంది. విదేశాల్లో లిస్టింగ్ కోసం విదేశీ మారక నిర్వహణ చట్టం మొదలైన వాటిని కూడా సవరించాల్సి ఉంటుందని న్యాయ సేవల సంస్థ సిరిల్ అమర్‌చంద్ మంగళ్‌దాస్ పార్ట్నర్ యష్ అషర్ తెలిపారు. తాజా పరిణామంతో పెట్టుబడుల సమీకరణకు దేశీ కంపెనీలకు మరో మాధ్యమం అందుబాటులోకి వచ్చినట్లవుతుందని పేర్కొన్నారు. అయితే, వ్యాల్యుయేషన్లను అంతర్జాతీయ ఇన్వెస్టర్లు లెక్కగట్టే విధానం, విదేశాల్లో లిస్టింగ్ వల్ల వాణిజ్యపరంగా ఒనగూరే ప్రయోజనాలు మొదలైన వాటన్నింటినీ కంపెనీలు మదింపు చేసుకోవాల్సి ఉంటుందన్నారు. ప్రస్తుతం దేశీ కంపెనీలు అమెరికన్ డిపాజిటరీ రిసీట్స్ (ఏడీఆర్), గ్లోబల్ డిపాజిటరీ రిసీట్స్ (జీడీఆర్) రూపంలో విదేశాల్లో లిస్టవుతున్నాయి. 2020 మే నెలలో కోవిడ్ ఉపశమన ప్యాకేజీలో భాగంగా భారతీయ సంస్థలు విదేశాల్లో నేరుగా లిస్టయ్యేందుకు అనుమతించే ప్రతిపాదనను కేంద్రం తెరపైకి తెచ్చింది. సదరు సంస్థలు ప్రపంచ మార్కెట్ల నుంచి పెట్టుబడులను సమీకరించుకునేందుకు తోడ్పా టు అందించేలా దీనిపై నిర్ణయం తీసుకోనున్నట్లు జూలై 28న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించిన సంగతి తెలిసిందే. పటిష్టమైన మనీలాండరింగ్ నిబంధనలు అమలయ్యే ఎన్వైఎస్ఈ, నాస్డాక్, ఎల్ఎస్ఈ మొదలైన పది ఎక్సే్చంజీలను పరిశీలించవచ్చని మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ ప్రతిపాదించింది. -
విదేశాల నుంచి ఉద్యోగులు.. కంపెనీలకు జీఎస్టీ నోటీసులు
దేశంలోని అనేక కంపెనీలకు ఇటీవల జీఎస్టీ నోటీసులు రావడం గురించి ఎక్కువగా వింటున్నాం. అయితే కంపెనీలకు ఎందుకిలా వరుసపెట్టి జీఎస్టీ నోటీసులు వస్తున్నాయని పరిశీలిస్తే అసలు కారణం తెలిసింది. భారత్‌కు చెందిన చాలా కంపెనీలు, వాటి అనుబంధ సంస్థలు విదేశాల్లోనూ కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి. అలాగే విదేశీ సంస్థలు, వాటి అనుబంధ కంపెనీలు ఇక్కడ కొనసాగుతున్నాయి. ఈ కంపెనీలు ఆయా దేశాల్లో ఉద్యోగులను అక్కడి చట్టాలు, నిబంధనలకు అనుగుణంగా నియమించుకుంటాయి. అయితే బయటి దేశాల్లో నియమించుకున్న ఉద్యోగులను భారత్‌కు డిప్యూటేషన్‌పై తెచ్చుకున్న కంపెనీలకు ఇటీవల జీఎస్టీ నోటీసులు అందాయి. బయటి దేశాల నుంచి డిప్యూటేషన్‌పై వచ్చిన ఉద్యోగులకు సంబంధించిన జీతాన్ని తమ విదేశీ సంస్థకు ఇక్కడి కంపెనీలు తిరిగి చెల్లిస్తుంటాయి. ఇలా బయటి దేశాల నుంచి డిప్యూటేషన్‌పై వచ్చినవారిని సెకెండెడ్ ఎంప్లాయీస్ అంటారు. విదేశీ సంస్థకు రియింబర్స్ చేసే వీరి జీతాలపై సర్వీస్ ట్యాక్స్ వర్తిస్తుంది. ఈమేరకు నార్తర్న్ ఆపరేటింగ్ సిస్టమ్స్ కేసులో భాగంగా 2022 మేలో సుప్రీం కోర్టు తీర్పు చెప్పింది. ఈ తీర్పును అనుసరిస్తూ ఆయా కంపెనీలకు జీఎస్టీ నోటీసులు పంపినట్లు తెలుస్తోంది. అయితే ఈ నోటీసులపై కంపెనీల్లోని ట్యాక్స్ నిపుణులు మిశ్రమంగా స్పందిస్తున్నారు. "2017-18 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన కేసుల మదింపు పరిమితి కాలం సెప్టెంబర్‌తో ముగిసిన నేపథ్యంలో కంపెనీలకు వరుపెట్టి నోటీసులు వచ్చాయి. ఇటువంటి నోటీసులు అందుకున్న కంపెనీలు వాస్తవాలను పరిశీలించుకుని ముందుకు వెళ్లాల్సిఉంటుంది" అని కేపీఎంజీ-ఇండియా, భాగస్వామి, ఇన్‌డైరెక్ట్ ట్యాక్స్ నేషనల్ హెడ్ అభిషేక్ జైన్ అన్నారు. -
దేశీ సంస్థల్లో ఏఐ జోరు
న్యూఢిల్లీ: భారతీయ కంపెనీలు కృత్రిమ మేథను (ఏఐ) వినియోగించుకోవడం గణనీయంగా పెరిగింది. ఈ విషయంలో పారిశ్రామికోత్పత్తులు, తయారీ రంగం మిగతా అన్ని విభాగాల కన్నా ముందుంటున్నాయి. కోవిడ్ తర్వాత శకంలో ఏఐ ప్రభావం అనే అంశంపై కన్సల్టెన్సీ సంస్థ పీడబ్ల్యూసీ రూపొందించిన నివేదికలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. 2020లో భారత మార్కెట్లో నిర్వహించిన సర్వేకు కొనసాగింపుగా 2022–23లో 220 పైచిలుకు చీఫ్ ఎక్స్పీరియన్స్ ఆఫీసర్లు (సీఎక్స్‌వో), నిర్ణయాధికారాలు ఉన్న ఉన్నతోద్యోగులతో మాట్లాడి దీన్ని తయారు చేసినట్లు పేర్కొంది. దీని ప్రకారం గత రెండేళ్లుగా పారిశ్రామికోత్పత్తులు, తయారీ రంగాల్లో ఏఐ/ఎంఎల్ (మెషిన్ లెరి్నంగ్) వినియోగం అత్యధికంగా పెరిగింది. సర్వేలో పాల్గొన్న వాటిలో ఈ రంగాలకు చెందిన 64 శాతం సంస్థలు తాము ప్రస్తుతం ఏఐకు మారే క్రమంలో తొలి దశలో ఉన్నట్లు తెలిపాయి. దీనిపై మరింతగా పెట్టుబడులు పెట్టే అవకాశాలు ఉన్నట్లు సూచనప్రాయంగా తెలియజేశాయి. నివేదికలోని మరిన్ని ముఖ్యాంశాలు.. ► ఏఐని వినియోగించడం ద్వారా పెట్టుబడులపై అధిక రాబడులను అందుకునే విషయంలో ట్రావెల్, ఆతిథ్య పరిశ్రమ ఒక మోస్తరు సంతృప్త స్థాయికి చేరింది. టెక్నాలజీ, మీడియా, టెలికం, హెల్త్‌కేర్, ఫార్మా తదితర రంగాలు ఏఐ వినియోగంలో స్థిరంగా ముందుకెడుతున్నప్పటికీ పెట్టుబడులపై రాబడులను అంచనా వేసుకోవడంలో సవాళ్లు ఎదుర్కొంటున్నాయి. ► మిగతా రంగాలతో పోలిస్తే రిటైల్, కన్జూమర్ మార్కెట్లలో ఏఐ వినియోగం తగ్గింది. మార్కెట్ శక్తులు, వినియోగదారుల పోకడలు మారిపోతున్న నేపథ్యంలో ఏఐని ఏయే అంశాల్లో వినియోగించవచ్చనేది గుర్తించడం సంక్లిష్టంగా మారడమే ఇందుకు కారణం. ► గత రెండేళ్లుగా, 2020 మధ్య నుంచి 2022–23 వ్యవధిలో పారిశ్రామికోత్పత్తులు.. తయారీ రంగాల్లో ఏఐ/ఎంఎల్ సొల్యూ,న్స్ వినియోగం అత్యధికంగా 20 శాతం పెరిగింది. -
ఫ్లాట్‌గా వెంచర్ క్యాపిటల్ పెట్టుబడులు
న్యూఢిల్లీ: భారతీయ కంపెనీలు జూన్ క్వార్టర్లో 8 బిలియన్ డాలర్ల వీసీ నిధులను సంపాదించాయి. మార్చి త్రైమాసికంతో పోలిస్తే పెరగ్గా, క్రితం ఏడాది ఇదే కాలంతో పోలిస్తే స్తబ్దుగానే ఉన్నట్టు కేపీఎంజీ నివేదిక తెలిపింది. టాప్ డీల్స్‌లో బైజూస్ 700 మిలియన్ డాలర్లు, లెన్స్‌కార్ట్ 600 మిలియన్ డాలర్లు, ట్రూబ్యాలన్స్ 168 మిలియన్ డాలర్ల సమీకరణ ఉన్నాయి. ఫిన్‌టెక్, ఎడ్యుటెక్, గేమింగ్ కంపెనీలు దేశంలో ఎక్కువ వీసీ నిధులను ఆకర్షించాయి. ఆ తర్వాత అగ్రిటెక్ కూడా వీసీ ఇన్వెస్టర్ల ప్రాధాన్య క్రమంలో ఉంది. ఈ వివరాలను కేపీఎంజీ సంస్థ ‘వెంచర్పల్స్ క్యూ 2023’ పేరుతో విడుదల చేసిన నివేదికలో పేర్కొంది. అంతర్జాతీయంగా వెంచర్ క్యాపిటల్ (వీసీ) పెట్టుబడులు జూన్ త్రైమాసికంలో స్వల్పంగా తగ్గి 77.4 బిలియన్ డాలర్లుగా (రూ.6.34 లక్షల కోట్లు) ఉన్నాయి. మొత్తం 7,783 డీల్స్ నమోదయ్యాయి. అంతర్జాతీయంగా అనిశి్చత పరిస్థితుల్లోనూ భారీ డీల్స్‌కు ఇన్వెస్టర్ల నుంచి మద్దతు ఉందని ఈ నివేదిక తెలిపింది. అమెరికాకు చెందిన స్ట్రైప్ 6.8 బిలియన్ డాలర్లను జూన్ త్రైమాసికంలో సంపాదించింది. సింగపూర్‌కు చెందిన షీన్ 2 బిలియన్ డాలర్లు, అమెరికాకు చెందిన ఏఐ స్టార్టప్ ఇన్ఫ్లెక్షన్ 1.3 బిలియన్ డాలర్ల నిధులను సొంతం చేసుకున్నాయి. కొత్త నిధుల సమీకరణ విషయంలో ప్రముఖ వీసీ సంస్థలు కొంత వేచి చూసే ధోరణితో ఉన్నట్టు కేపీఎంజీ నివేదిక తెలిపింది. అంతర్జాతీయంగా అధిక ద్రవ్యోల్బణం, భౌగోళిక రాజకీయ అస్థిరతలు, వడ్డీ రేట్లను ఇంకా పెంచే అవకాశాలు ఉండడంతో సవాళ్లు ఇప్పట్లో ముగిసే పరిస్థితులు కనిపించడం లేదని ఈ నివేదిక అభిప్రాయపడింది. -
విదేశాల్లో నేరుగా దేశీ సంస్థల లిస్టింగ్
న్యూఢిల్లీ: దేశీ కంపెనీలు తమ షేర్లను నేరుగా విదేశీ స్టాక్ ఎక్సే్చంజీల్లో లిస్ట్ చేసుకునేందుకు అనుమతించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. వాస్తవానికి కోవిడ్–19 సహాయక ప్యాకేజీ కింద 2020 మేలోనే ప్రకటించినప్పటికీ, దీనిపై తాజాగా నిర్ణయం తీసుకుంది. మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ నిర్వహించిన కార్పొరేట్ డెట్ మార్కెట్ డెవలప్మెంట్ ఫండ్ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ విషయాలు తెలిపారు. ‘ఐఎఫ్ఎస్సీ ఎక్సే్చంజీల్లో లిస్టెడ్, అన్‌లిస్టెడ్ కంపెనీలు నేరుగా లిస్ట్ అయ్యేందుకు అనుమతించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది‘ అని ఆమె చెప్పారు. సంస్థలు అంతర్జాతీయంగా పెట్టుబడులు సమీకరించుకునేందుకు, మెరుగైన వేల్యుయేషన్స్ దక్కించుకునేందుకు దీనితో తోడ్పాటు లభించగలదని మంత్రి పేర్కొన్నారు. మరికొద్ది వారాల్లో దీనికి సంబంధించిన నిబంధనలను నోటిఫై చేయనున్నట్లు ఆర్థిక శాఖ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. తొలుత గుజరాత్ గిఫ్ట్ సిటీలోని ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సెంటర్ (ఐఎఫ్ఎస్సీ)లో లిస్ట్ అయ్యేందుకు, ఆ తర్వాత ఎనిమిది లేదా తొమ్మిది నిర్దిష్ట దేశాల్లో లిస్టింగ్‌కు అనుమతినివ్వొచ్చని పేర్కొన్నారు. ఈ జాబితాలో బ్రిటన్, కెనడా, స్విట్జర్లాండ్, అమెరికా మొదలైనవి ఉండొచ్చని అంచనాలు ఉన్నాయి. స్టార్టప్‌లు.. రిలయన్స్‌కు బూస్ట్.. కొత్త పాలసీతో యూనికార్న్‌లు (1 బిలియన్ డాలర్లకు పైగా వేల్యుయేషన్ గల స్టార్టప్‌లు), విదేశాల్లో లిస్టింగ్‌పై కసరత్తు చేస్తున్న రిలయన్స్ డిజిటల్ విభాగానికి ఊతం లభించగలదని పరిశ్రమ వర్గాలు అభిప్రాయపడ్డాయి. ప్రస్తుత విధానం ప్రకారం భారతీయ సంస్థలు.. ప్రధానంగా అమెరికన్ డిపాజిటరీ రిసీట్స్ (ఏడీఆర్), గ్లోబల్ డిపాజిటరీ రిసీట్స్ (జీడీఆర్) రూపంలో విదేశాల్లో లిస్ట్ కావాల్సి ఉంటోంది. ఇన్ఫోసిస్, విప్రో తదితర సంస్థలు ఇదే బాటలో లిస్ట్ అయ్యాయి. విదేశాల్లో లిస్టింగ్ వల్ల భారతీయ కంపెనీలు వివిధ దేశాల్లోని ఎక్సే్చంజీల ద్వారా విదేశీ నిధులను సమకూర్చుకునేందుకు వీలుంటుంది. -
భారీగా తగ్గిన ఐటీ ఉద్యోగులు! టాప్ 10 దిగ్గజ కంపెనీల్లో..
భారతదేశంలో ఎక్కువమందికి ఉపాధి కల్పించే రంగాల్లో ఒకటి 'ఐటీ' అని అందరికి తెలుసు. ప్రతి సంవత్సరం లెక్కకు మించిన ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తూ ఎంతోమందికి ఉపాధి కల్పిస్తోంది. అలాంటి ఐటీ రంగం ఇప్పుడు రిక్రూట్మెంట్స్ జరపకపోగా.. ఉన్న ఉద్యోగులను కూడా తొలగిస్తుంది. కొన్ని నివేదికల ప్రకారం, ఈ ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో మన దేశంలోని టాప్ 10 దిగ్గజ కంపెనీల ఉద్యోగుల సంఖ్య 21,327కి పడిపోయినట్లు సమాచారం. గత సంవత్సరం ఇదే సమయంలో ఈ కంపెనీలలోని ఉద్యోగుల సంఖ్య 69,634 కావడం గమనార్హం. దీన్ని బట్టి చూస్తే ఎంతమంది తగ్గారో స్పష్టంగా తెలుస్తోంది. టాప్ 10 కంపెనీలలో ఆరు కంపెనీల ఉద్యోగుల సంఖ్య తగ్గింది, కాగా టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS), ఎల్ అండ్ టీ టెక్నాలజీ సర్వీసెస్ (LTTS), పెర్సిస్టెంట్, కోపోర్ట్ వంటి నాలుగు కంపెనీలు మాత్రం కొంతవరకు నియామకాలను చేపట్టి ఉద్యోగుల సంఖ్యను పెంచింది. మొత్తం మీద చాలా కంపెనీలు కొత్త వారిని చేర్చుకోవడం కంటే కూడా ఉన్న వారి నైపుణ్యాలనే మెరుగుపరిచేందుకు మొగ్గు చూపుతున్నట్లు సమాచారం. (ఇదీ చదవండి: ఇది విడ్డూరం కాదు.. అంతకు మించి.. తెల్లగా ఉందని జాబ్ ఇవ్వలేదు! ఎక్కడంటే?) కరోనా మహమ్మారి భారతదేశంలో విజృంభించినప్పటి నుంచి ఉద్యోగుల జీవితాలు తలకిందులైపోయాయి. కొన్ని కంపెనీలు తమ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్ అందించగా.. మరి కొన్ని కంపెనీలు ఉద్యోగులనే తొలగించింది. ఆ ప్రభావం ఇప్పటికి కూడా చాలా వరకు ఉద్యోగుల మీద ఉన్నట్లు నిపుణులు చెబుతున్నారు. (ఇదీ చదవండి: సీఏ చదివి ఈ పని చేస్తావా? అని చీవాట్లు.. నేడు నెలకు రూ.4.5 కోట్లు టర్నోవర్!) తొలగింపు & నియామకాలు అలా ఉంచితే ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఉద్యోగుల పాలిట మరో గండంగా మారింది. ఇప్పటికే చాలా కంపెనీలు కృత్రిమ మేధను ఉపయోగిస్తూ.. ఎంప్లాయిస్ సంఖ్యను తగ్గిస్తోంది. భవిష్యత్తులో కూడా క్రమంగా ఇదే జరిగితే ఉద్యోగుల సంఖ్య భారీగా క్షిణించే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. -
చైనా మొబైల్ కంపెనీలకు షాక్
న్యూఢిల్లీ: దేశంలో కార్యకలాపాలు నిర్వహించే చైనా మొబైల్ తయారీ కంపెనీలకు కేంద్ర సర్కారు స్పష్టమైన మార్గదర్శనం చేసింది. భారత్‌లో విక్రయాలకు, భారత్ నుంచి ఎగుమతుల కోసం మొబైల్ ఫోన్లు, ఇతర ఎల్రక్టానిక్ ఉపకరణాలను ఇక్కడే తయారు చేయాలని, భారతీయ సంస్థల భాగస్వామ్యంతో నిర్వహించాలని కోరినట్టు తెలిసింది. భారత్‌లో కార్యకలాపాలకు స్థానిక భాగస్వాములను చేర్చుకోవాలని కోరింది. కేంద్రం నిర్వ హించిన సమావేశానికి హాజరైన ముగ్గురు ఎగ్జిక్యూటివ్‌లు ఈ వివరాలను మీడియాతో పంచుకోవడం వల్ల బయటకు తెలిసింది. అంతేకాదు సదరు జా యింట్ వెంచర్ కంపెనీల్లో కీలక స్థానాల్లో భారతీయులనే నియమించుకోవాలని కూడా కోరింది. సీఈవో, సీవోవో, సీఎఫ్‌వో, సీటీవో తదితర స్థానాలకు భారతీయులను తీసుకోవాలని ఆదేశించింది. భారత కాంట్రాక్టు తయారీ సంస్థలను నియమించుకోవాలని, స్థానికంగానే విడిభాగాల తయారీని కూడా చేపట్టాలని కూడా కోరింది. ప్రస్తుతం చైనీ సంస్థలు ఇక్కడ అసెంబ్లింగ్ వరకే చేస్తుండడం గమనార్హం. విడిభాగాల తయారీని కూడా భారత భాగస్వామ్య సంస్థలతో కలసి చేపట్టి, ఇక్కడి నుంచి మరిన్ని ఎగుమతులు చేయాలని కోరినట్టు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. పంపిణీదారులు కూడా స్థానికులే ఉండాలని స్పష్టం చేసింది. ప్రస్తుతం కొన్ని కంపెనీలు చైనా డి్రస్టిబ్యూటర్లను కలిగి ఉన్నాయి. భారత చట్టాలను విధిగా అనుసరించాలని, పన్ను ఎగవేతలకు పాల్పడరాదని తేల్చి చెప్పింది. చైనాకు చెందిన షావోమీ, ఒప్పో, రియల్మీ, వివోతోపాటు, ఇండియా సెల్యులర్ అండ్ ఎల్రక్టానిక్స్ అసోసియేషన్ (ఐసీఈఏ)కు ఇటీవలి సమావేశంలో కేంద్రం ఈ మేరకు సూచనలు జారీ చేసింది. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఈ సమావేశాన్ని నిర్వ హించింది. ఇది నిజమేనన్నట్టు.. దేశీ కాంట్రాక్టు తయారీ సంస్థ డిక్సన్ టెక్నాలజీస్‌తో షావోమీ ఒ ప్పందాన్ని కుదుర్చుకోవడం గమనార్హం. భారత్‌లో మొబైల్ ఫోన్లను తయారు చేసి ఇవి ఎగుమతి చేయనున్నాయి. మరికొన్ని సంస్థలతోనూ ఇదే విధమైన భాగస్వామ్యంపై డిక్సన్ చర్చలు నిర్వహిస్తుండడం గమనార్హం. -
ఆ విషయంలో ముందున్న ఇండియన్ కంపెనీలు.. అమెరికా కూడా మన తర్వాతే
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: కార్యాలయాల కోసం స్థలాన్ని లీజుకు తీసుకున్న కంపెనీల్లో భారతీయ సంస్థలే ముందంజలో ఉన్నాయని సీబీఆర్ఈ ఇండియా నివేదిక వెల్లడింంది. దేశవ్యాప్తంగా తొమ్మిది ప్రధాన నగరాల్లో 2023 జనవరి - మార్చిలో స్థల లీజింగ్‌లో అమెరికా కంపెనీలను ఇక్కడి సంస్థలు వెనక్కి నెట్టాయని తెలిపింది. దాదాపు డిసెంబర్ త్రైవసికం మాదిరిగానే జనవరి - మార్చిలో మొత్తం డిమాండ్‌లో భారతీయ సంస్థల వాటా ఏకంగా 50 శాతం ఉంది. 2022లో తొలిసారిగా అమెరికన్ కంపెనీలను మించి భారతీయ సంస్థలు ఎక్కువ స్థలాన్ని లీజుకు తీసుకున్నాయి. అంత క్రితం ఏడాదితో పోలిస్తే 2023 మార్చి త్రైమాసికంలో స్థల ఆఫీస్ స్పేస్ లీజింగ్ 9 శాతం ఎగసి 1.26 కోట్ల చదరపు అడుగులు నవెదైంది. నగరాల వారీగా ఇలా.. స్థల ఆఫీస్ స్థల లీజింగ్‌లో బెంగళూరు, ఢిల్లీ ఎన్సీఆర్, చెన్నైల వాటా 62 శాతం ఉంది. హైదరాబాద్ స్థిరంగా 14 లక్షల చదరపు అడుగుల డిమాండ్‌ను చూసింది. ఢిల్లీ ఎన్సీఆర్ స్వల్పంగా పెరిగి 24 లక్షలు, ముంబై రెండింతలై 16 లక్షలు, చెన్నై స్వ ల్పంగా అధికమై 20 లక్షలు, పుణే కొద్దిగా పెరిగి 12 లక్షల చదరపు అడుగులు నమోదైంది. బెంగళూరు స్వల్పంగా తగ్గి 35 లక్షల చదరపు అడుగులుగా ఉంది. 2022లో స్థల ఆఫీస్ లీజింగ్ 40 శాతం అధికమై 5.66 కోట్ల చదరపు అడుగులుగా ఉంది. ఇందులో దేశీయ కంపెనీల వాటా 2.77 కోట్ల చదరపు అడుగులు కాగా, అమెరికా కంపెనీలు 2 కోట్ల చదరపు అడుగుల స్థలాన్ని తీసుకున్నాయి. భిన్న పరిస్థితులు.. అంతకు ముందు త్రైమాసికాల్లో సాంకేతిక రంగ కంపెనీలే ముందు వరుసలో ఉండేవి. అందుకు భిన్నంగా జనవరి–మార్చిలో బీఎఫ్ఎస్ఐ, ఫ్లెక్సిబుల్ స్పేస్ కంపెనీలు చెరి 22 శాతం వాటాతో తొలి స్థానాన్ని కైవసం చేసుకున్నాయి. టెక్నాలజీ కంపెనీలు 20 శాతం, ఇంజనీరింగ్, తయారీ 11, పరిశోధన, కన్సల్టింగ్, అనలిటిక్స్ కంపెనీలు 10 శాతం వాటాకు పరిమితం అయ్యాయి. మధ్య, భారీ స్థాయి డీల్స్‌లో బీఎఫ్ఎస్ఐ కంపెనీల గ్లోబల్ కేపబిలిటీ సెంటర్స్, భారతీయ బ్యాంకులు, ఫ్లెక్స్ కంపెనీలు ముందంజలో ఉన్నాయి. బీఎఫ్ఎస్ఐ కంపెనీల వాటా డిసెంబర్ క్వార్టర్లో 20 శాతం ఉంటే, మార్చిలో ఇది 44 శాతానికి ఎగబాకింది. రెండవ భాగంలో.. ద్రవ్య నియంత్రణ, ద్రవ్యోల్బణం, అభివృద్ధి చెంది న దేశాలలో మందగమన అవకాశాలు, భౌగోళిక రాజకీయ సమస్యల కారణంగా ఏర్పడే స్వల్పకాలిక స్థల ఆర్థిక ఒత్తిడి 2023లో కంపెనీల విస్తరణ ప్రణాళికలు, నిర్ణయాలపై ప్రభావం చూపవచ్చు. అయితే బహుళజాతి సంస్థల లీజింగ్ నిర్ణయాలపై ఈ పరిస్థితుల ప్రభావం ఇంకా గుర్తించలేదని సీబీఆర్ఈ తెలిపింది. లీజింగ్ కార్యకలాపాలు ముఖ్యంగా ఈ ఏడాది రెండవ భాగంలో పుంజుకోవచ్చు, ఎందుకంటే భారతదేశం అధిక నైపుణ్యం కలిగిన ప్రతిభకు ఆకర్షణీయ, సరసమైన మూలంగా కొనసాగుతోంది. ఇది ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుత పరిస్థితుల్లో వ్యాపారాలను నిలదొక్కుకోవడం కోసం కా ర్పొరేట్లు దేశం వైపు చసేలా చేస్తుందని సీబీఆర్ ఈ ఇండియా చైర్మన్ అన్షుమన్ మ్యాగజిన్ తెలిపారు. -
సైబర్ దాడులను తట్టుకునే సామర్థ్యం మనకుందా?
జైపూర్: ఒకవైపు సైబర్ దాడులు అంతకంతకూ పెరిగిపోతుంటే.. మరోవైపు ఆ దాడుల నుంచి రక్షించుకునే సామర్థ్యాలు దేశంలో చాలా కంపెనీలకు లేవన్న విషయాన్ని సైబర్ సెక్యూరిటీపై సిస్కో నిర్వహించిన సర్వేలో తెలిసింది. అధునాతన సైబర్ దాడులను తట్టుకునే సామర్థ్యాలు కేవలం 24 శాతం కంపెనీలకే ఉన్నట్టు సిస్కో ప్రకటించింది. ఇదీ చదవండి: స్టార్‌బక్స్ సీఈవోగా నరసింహన్.. బాధ్యతలు చేపట్టిన ప్రవాస భారతీయుడు వచ్చే మూడేళ్లలో భారత్‌లో ఐదు లక్షల మంది సైబర్ సెక్యూరిటీ నిపుణులకు శిక్షణ ఇవ్వాలన్నది తన లక్ష్యంగా పేర్కొంది. వచ్చే 12–24 నెలల్లో తమ వ్యాపారాలకు విఘాతం కలిగించే సైబర్ దాడులు జరగొచ్చని భావిస్తున్నట్టు సిస్కో సర్వేలో 90 శాతం మంది చెప్పారు. అంతర్జాతీయంగా సైబర్ సెక్యూరిటీ సన్నద్ధత సగటున కేవలం 15 శాతంగానే ఉందని, ఈ విధంగా చూస్తే భారత్ మెరుగ్గా ఉన్నట్టు సిస్కో తెలిపింది. భారత్‌లోని 38 శాతం కంపెనీలు ఆరంభ, ఏర్పాటు స్థాయిలో ఉన్నవేనని పేర్కొంది. స్వతంత్ర థర్డ్ పార్టీతో సిస్కో ఈ సర్వే చేయించింది. 27 మార్కెట్ల నుంచి 6,700 మంది సైబర్ సెక్యూరిటీ నిపుణులు సర్వేలో పాల్గొన్నారు. సైబర్ దాడులను ఎదుర్కొనేందుకు ఎలాంటి సొల్యూషన్లను కంపెనీలు ఏర్పాటు చేశాయి, అమలు ఏ స్థాయిలో ఉందో తెలుసుకునే ప్రయత్నం చేసింది. ఇదీ చదవండి: గోపీనాథన్‌ను వదులుకోలేకపోతున్న టీసీఎస్.. కీలక బాధ్యతలపై చర్చలు! చిన్న కంపెనీలకు ముప్పు అధికం.. ఇందులో ఆరంభ, స్టార్టప్, పురోగతి, పూర్తి స్థాయి కంపెనీలు అని సిస్కో సర్వే వర్గీకరించింది. ఆరంభ దశలోని కంపెనీలు సైబర్ సెక్యూరిటీ సొల్యూషన్లను ఏర్పాటు చేసే దశలో ఉన్నాయి. వీటికి 10 కంటే తక్కువే స్కోర్ లభించింది. ఏర్పాటు దశలోని కంపెనీలు సైబర్ సెక్యూరిటీ సొల్యూషన్లను అమలు చేసే దశలో ఉన్నాయి. వీటికి స్కోర్ 11–44 మధ్య ఉంది. సైబర్ భద్రతా సన్నద్ధత విషయంలో ఇవి సగటు కంటే తక్కువ పనితీరు చూపిన్నట్టు సర్వే నివేదిక తెలిపింది. పురోగతి దశలోని కంపెనీలు సైబర్ భద్రతా సన్నద్ధత పరంగా సగటు కంటే ఎక్కువ పనితీరు చూపిస్తున్నాయి. ఇక పూర్తి స్థాయికి చేరిన కంపెనీలు సైబర్ సెక్యూరిటీ సొల్యూషన్లలో చాలా ముందంజలో ఉండడమే కాకుండా, రిస్క్‌లను ఎదుర్కొనే సామర్థ్యాలతో ఉన్నాయి. గడిచిన ఏడాది కాలంలో తాము సైబర్ దాడిని ఎదుర్కొన్నామని, వీటి కారణంగా తమకు రూ.4–5 కోట్ల స్థాయిలో నష్టం ఎదురైనట్టు 53 శాతం మంది సర్వేలో చెప్పారు. ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి.. ‘‘సైబర్ సెక్యూరిటీకి వ్యాపార సంస్థలు అధిక ప్రాధాన్యత ఇవ్వాలి. అప్పుడే అవి తమ డిజిటైజేషన్ ప్రయాణాన్ని కొనసాగించగలవు. హైబ్రిడ్ పని విధానం ప్రముఖంగా మారడం, సేవలు అప్లికేషన్ ఆధారితం కావడంతో.. సైబర్ భద్రతా సన్నద్ధత పరంగా ఉన్న అంతరాలను తగ్గించుకోవడం కంపెనీలకు కీలకం’’ అని సిస్కో ఇండియా సెక్యూరిటీ బిజినెస్ గ్రూప్ డైరెక్టర్ సమీర్ మిశ్రా తెలిపారు. ఇదీ చదవండి: గేమింగ్ హబ్‌గా భారత్.. భారీ ఆదాయం, ఉపాధి కల్పన -
CBRE India: ఆఫీసు లీజింగ్‌లో భారత కంపెనీల పైచేయి
న్యూఢిల్లీ: భారత కంపెనీలు మొదటిసారి ఆఫీసు స్పేస్ లీజింగ్ పరిమాణంలో అమెరికా సంస్థలను అధిగమించాయి. దేశ ఆఫీసు లీజు మొత్తం డిమాండ్‌లో 50 శాతం వాటాను ఆక్రమించాయి. ఈ మేరకు సీబీఆర్ఈ ఇండియా ఓ నివేదిక విడుదల చేసింది. దీని ప్రకారం.. 2022లో భారత్‌లోని తొమ్మిది ప్రధాన పట్టణాల్లో స్థూల ఆఫీసు స్పేస్ లీజు పరిమాణం 40 శాతం పెరిగి 56.6 మిలియన్ చదరపు అడుగులుగా ఉంది. ఇది అంతకుముందు సంవత్సరంలో 40.5 మిలియన్ చదరపు అడుగులుగా ఉంది. 2022లో మొత్తం ఆఫీసు లీజులో 27.73 మిలియన్ చదరపు అడుగుల స్థలాన్ని భారత కంపెనీలే తీసుకున్నాయి. 20.37 మిలియన్ చదరపు అడుగులను అమెరికా కంపెనీలు లీజుకు తీసుకున్నాయి. టెక్నాలజీ కంపెనీలు, బీఎఫ్ఎస్ఐలు, ఫ్లెక్సిబుల్ స్పేస్ ఆపరేట్లు గతేడాది లీజులో ఎక్కువ భాగాన్ని ఆక్రమించాయి. ఇందులో టెక్నాలజీ సంస్థలు 29 శాతం, ఫ్లెక్సిబుల్ ఆపరేటర్లు 14 శాతం, ఇంజనీరింగ్, తయారీ కంపెనీలు 13 శాతం, బీఎఫ్ఎస్ఐ సంస్థలు 13 శాతం, పరిశోధన, కన్సల్టింగ్, అనలైటిక్స్ కంపెనీలు 7 శాతం చొప్పున లీజింగ్ తీసుకున్నాయి. బెంగళూరు, ఢిల్లీ ఎన్సీఆర్, ముంబై పట్టణాల్లో దేశీ కంపెనీలు ఎక్కువగా ఆఫీస్ స్థలాన్ని లీజుకు తీసుకున్నాయి. కరోనా నిబంధనలను సడలించడం, అప్పటి వరకు నిలిచిన డిమాండ్ తోడవడం, తిరిగి ఆఫీసుకు వచ్చి పనిచేసే విధానాలు ఆఫీసు స్పేస్ లీజును నడిపించిన అంశాలుగా ఉన్నాయి. ‘‘అభివృద్ధి చెందిన దేశాల్లో కొన్ని సవాళ్లు ఎదురవుతున్నాయి. ఈ రిస్క్‌లకు సంబంధించి పూర్తి ప్రభావం కార్పొరేట్ల లీజింగ్ నిర్ణయాలపై ఇంకా ప్రతిఫలించాల్సి ఉంది’’అని సీబీఆర్ఈ ఇండియా చైర్మన్, సీఈవో అన్షుమన్ మేగజిన్ తెలిపారు. నిపుణుల లభ్యత, తక్కువ వ్యయాలతో భారత్ ఇక ముందూ ఆకర్షణీయంగా ఉంటుందన్నారు. అంతర్జాతీయ సంస్థలు తమ కార్యకలాపాలను ఆప్టిమైజ్ చేసుకునేందుకు భారత్ వైపు చూడొచ్చని చెప్పారు. -
మార్చి క్వార్టర్లో ఆచితూచి నియామకాలు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఈ ఏడాది జనవరి–మార్చిలో భారతీయ కంపెనీలు ఆచితూచి నియామకాలు చేపట్టే అవకాశం ఉందని మ్యాన్‌పవర్ గ్రూప్ ఎంప్లాయ్మెంట్ ఔట్లుక్ సర్వే వెల్లడించింది. 3,030 ప్రభుత్వ, ప్రైవేటు కంపెనీలు ఈ సర్వేలో పాలుపంచుకున్నాయి. ‘మాంద్యం అంచనాలు, ప్రపంచ మందగమనం ఇందుకు కారణం. ఉద్యోగుల సంఖ్య పెరగవచ్చని 48 శాతం కంపెనీలు తెలిపాయి. తగ్గవచ్చని 16 శాతం, మార్పు ఉండకపోవచ్చని 34 శాతం సంస్థలు అభిప్రాయపడ్డాయి. ఈ ఏడాది మార్చి క్వార్టర్లో నియామకాలు అంత క్రితం త్రైమాసికంతో పోలిస్తే 17 శాతం, 2022 తొలి క్వార్టర్‌తో చూస్తే 22 శాతం తగ్గవచ్చు. ఐటీ, ఫైనాన్స్, రియల్టీ, కంజ్యూమర్ గూడ్స్, సర్వీసెస్ విభాగాల్లో డిమాండ్ ఉంటుంది. నిపుణుల కొరత నియామకాలకు అడ్డంకిగా పరిణమించింది. కార్పొరేట్ కంపెనీలు, విద్యా సంస్థలు సంయుక్త ప్రయత్నాల ద్వారా దీనిని పరిష్కరించే వరకు ఉపాధి రేటులో వృద్ధి సింగిల్ డిజిట్లో ఉంటుంది’ అని నివేదిక వివరించింది. -
బలహీన రూపాయితో భారత్ కంపెనీలు బేఫికర్
న్యూఢిల్లీ: అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థల్లో పెరుగుతున్న వడ్డీ రేట్లు, అధిక ఇంధన ధరలు వంటి అంతర్జాతీయ సవాళ్లు కరెన్సీ అస్థిరతను పెంచుతాయని మూడీస్ ఇన్వెస్టర్స్ సర్వీస్ మంగళవారం తెలిపింది. అయితే దేశంలోని పలు రేటింగ్ కంపెనీలు బలహీనమైన రూపాయిని తట్టుకోగలిగిన పరిస్థితిని కలిగిఉన్నాయని విశ్లేషించింది. ఏడాది ప్రారంభం నుంచి డాలర్ మారకంలో రూపాయి విలువ దాదాపు 10 శాతం క్షీణించింది. అక్టోబర్ 19న అమెరికా కరెన్సీలో రూపాయి విలువ 60 పైసలు పతనమై, చరిత్రాత్మక కనిష్టం 83 వద్ద ముగిసింది. అదే రోజు ఇంట్రాడేలో 83.01నీ చూసింది. అప్పట్లో గడచిన కేవలం 14 రోజుల్లో 100 పైసలు నష్టపోయి, 83 స్థాయిని చూసింది. కాగా, మరుసటి రోజు అక్టోబర్ 20న బలహీనంగా 83.05 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. అయితే చివరకు చరిత్రాత్మక పతనం నుంచి 21 పైసలు కోలుకుని 82.79 వద్ద ముగిసింది. అటు తర్వాత కొంత బలపడినా, రూపాయి ఇంకా బలహీన ధోరణిలోనే ఉందన్నది విశ్లేషణ. ఈ నేపథ్యంలో మూడీస్ తాజా నివేదికలో మరికొన్ని ముఖ్యాంశాలు.. ► అధిక ఇంధన ధరలు, అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థల్లో వడ్డీ రేట్ల స్థిరమైన పెరుగుదల వంటి అంశాలు భారత్ కరెంట్ అకౌంట్ (దేశంలోకి నిర్దిష్ట కాలంలో వచ్చీ–పోయే విదేశీ మారకద్రవ్యం మధ్య నికర వ్యత్యాసం) ప్రభావం చూపుతాయి. ఇది రూపాయిపైనా ఒత్తిడిని పెంచుతుంది. ► అయితే ఈ తరహా అంతర్జాతీయ సవాళ్లను దేశ కరెన్సీ ఎదుర్కొంటున్నప్పటికీ, భారతదేశంలోని చాలా రేటెడ్ కంపెనీలు రూపాయి క్షీణతను తట్టుకునే బఫర్లను కలిగి ఉన్నాయి. ► రూపాయి క్షీణించడం దేశీయ కరెన్సీలో ఆదాయాన్ని ఆర్జించే భారతీయ కంపెనీలకు క్రెడిట్ ప్రతికూలమే. అయితే ఆయా కంపెనీల కార్యకలాపాలకు సంబంధించిన నిధుల విషయంలో డాలర్ రుణ నిష్పత్తి ఎంతుందన్న విషయంపై ఇది ఆధారపడి ఉంటుంది. ► పలు అంశాల విశ్లేషణల అనంతరం, రేటింగ్ పొందిన కంపెనీలకు ప్రతికూల క్రెడిట్ చిక్కులు పరిమితంగా లేదా తాత్కాలికంగా ఉంటాయని మేము భావిస్తున్నాం. ► చాలా రేటెడ్ కంపెనీలు కరెన్సీ హెచ్చుతగ్గుల ప్రభావాన్ని పరిమితం చేయడానికి తగిన రక్షణలను (హెడ్జింగ్ సౌలభ్యాలు) కలిగి ఉన్నాయి. రూపాయి తీవ్ర పతన సమయాల్లోనూ ఈ ప్రతికూల ప్రభావాలను పరిమితం చేయడంలో ఇవి దోహదపడతాయి. ► భారతదేశం రుణంలో ఎక్కువ భాగం స్థానిక కరెన్సీలో ఉంది. విదేశీ కరెన్సీ రుణం బహుపాక్షిక లేదా ద్వైపాక్షిక అభివృద్ధి భాగస్వాముల నుండి దాదాపు రాయితీల ప్రాతిపదికన ఉంటుంది. ఈ నేపథ్యంలో రూపాయి బలహీనత వల్ల ఎకానమీకి ఇబ్బంది ఏదీ ఉండబోదు. ► రూపాయి విలువ క్షీణించడం వల్ల విదేశీ కరెన్సీ రుణాలను తీర్చగల ప్రభుత్వ సామర్థ్యంలో ప్రతికూలతలు ఏర్పడతాయని మేము భావించడం లేదు. ► భారత్ ఎకానమీలో ద్రవ్య స్థిరత్వానికి ఢోకా లేదు. ఆదాయాలు పటిష్టంగా ఉన్నాయి. రుణ పరిస్థితులు స్థిరంగా కొనసాగుతున్నాయి. ఆయా అంశాలు దేశంపై రేటింగ్‌కు సంబంధించి ఒత్తిడులను తగ్గిస్తాయి. ► మంచి పన్ను వసూళ్ల వల్ల 2022–23 ఆర్థిక సంవ త్సరంలో ద్రవ్యలోటు (ప్రభుత్వ ఆదాయాలు–వ్యయాలకు మధ్య నికర వ్యత్యాసం) అంచనాలకు అనుగుణంగా 6.4 శాతానికి (జీడీపీ విలువలో) పరిమితం అవుతుందని భావిస్తున్నాం. భారత్‌కు మూడీస్ రేటింగ్ ఇలా... మూడీస్ గత ఏడాది అక్టోబర్‌లో భారత్ సావరిన్ రేటింగ్ అవుట్‌లుక్‌ను ‘నెగటివ్’ నుంచి ‘స్థిరత్వానికి’ అప్‌గ్రేడ్ చేసింది. ‘బీఏఏ3’ రేటింగ్‌ను పునరుద్ఘాటించింది. అయితే ఇది చెత్త గ్రేడ్‌కు ఒక అంచె అధికం కావడం గమనార్హం. భారత్ స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి అంచనాలను వరుసగా రెండవసారి రేటింగ్ దిగ్గజం మూడీస్ ఇటీవలే తగ్గించింది. 2022 భారత్ వృద్ధి రేటును 7.7 శాతం నుంచి 7 శాతానికి కుదించింది. ద్రవ్యోల్బణం, అధిక వడ్డీరేట్లు, అంతర్జాతీయ మందగమనం వంటి అంశాలు తాజా నిర్ణయానికి కారణం. తొలుత ఈ ఏడాది మే నెల్లో 2022 వృద్ధి అంచనాలను మూడీస్ 8.8 శాతంగా అంచనావేసింది. అయితే సెప్టెంబర్‌లో 7.7 శాతానికి తగ్గించింది. రెండు నెలలు గడవకముందే మరోసారి ‘కోత’ నిర్ణయం తీసుకుంది. 2023లో మరింతగా 4.8 శాతానికి వృద్ధి రేటు తగ్గి, 2024లో 6.4 శాతానికి మెరుగుపడుతుందన్నది మూడీస్ అంచనా. 2021 క్యాలెండర్ ఇయర్లో భారత్ వృద్ధి 8.5 శాతమని మూడీస్ పేర్కొంది. -
ఏం జరిగింది?.. విదేశాల్లో భారత కంపెనీల పెట్టుబడులు డౌన్
ముంబై: భారత కంపెనీలు విదేశాల్లోని తమ వెంచర్లలో చేసే పెట్టుబడులు ఆగస్ట్ నెలలో 59 శాతం తగ్గి 1.03 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. అంతక్రితం ఏడాది ఇదే నెలలో భారత కంపెనీలు విదేశాల్లో చేసిన పెట్టుబడులు 2.5 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. ఈ ఏడాది జూలై నెలకు సంబంధించి పెట్టుబడులు చూసినా, 1.12 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. లెన్స్‌కార్ట్ సొల్యూషన్స్.. సింగపూర్‌లోని తన సబ్సిడరీలో 319 మిలియన్ డాలర్లను ఇన్వెస్ట్ చేసింది. గ్లెన్‌మార్క్ ఫార్మాస్యూటికల్స్ స్విట్జర్లాండ్‌లోని సబ్సిడరీలో 100 మిలియన్ డాలర్లను పెట్టుబడిగా పెట్టింది. (క్లిక్: రూపీలోనే ఇన్వాయిస్, చెల్లింపులు, భారీ ఊరట) -
జోరుగా.. హుషారుగా..నియామకాలు!
న్యూఢిల్లీ: రానున్న మూడు నెలల్లో (అక్టోబర్–డిసెంబర్) ఉపాధి అవకాశాలు పెద్ద ఎత్తున రానున్నాయి. 54 శాతం కంపెనీలు ఉద్యోగులను నియమించుకోవాలని అనుకుంటున్నాయి. మ్యాన్ పవర్ గ్రూప్ నిర్వహించిన ‘ఎంప్లాయ్మెంట్ అవుట్‌లుక్ సర్వే’ ఈ వివరాలను నివేదికగా విడుదల చేసింది. కార్మిక మార్కెట్ సెంటిమెంట్ రానున్న త్రైమాసికానికి బలంగా ఉన్నట్టు తెలిపింది. మ్యాన్‌పవర్ గ్రూపు భారత్ సహా 41 దేశాల్లో ఉపాధి మార్కెట్ తీరుతెన్నులను అర్థం చేసుకునేందుకు ఈ సర్వే నిర్వహించింది. భారత్‌లో సర్వే ఫలితాలను గమనించినట్టయితే.. 64 శాతం కంపెనీలు ఉద్యోగులను పెంచుకోవాలని అనుకుంటున్నాయి. 24 శాతం కంపెనీలు ఎలాంటి మార్పు ఉండదని చెప్పాయి. 10 శాతం కంపెనీల్లో నియామకాల ధోరణి తగ్గింది. దీని ప్రకారం సగటున 54 శాతం కంపెనీలు ఉద్యోగులను నియమించుకోనున్నట్టు ఈ సర్వే తేల్చింది. బ్రెజిల్లో 56 శాతం కంపెనీలు వచ్చే మూడు నెలలకు ఉద్యోగుల నియామకాల విషయంలో ఆశావహంగా ఉంటే, ఆ తర్వాత భారత్ అత్యధిక రేటుతో రెండో స్థానంలో ఉంది. క్రితం ఏడాది ఇదే కాలంతో పోల్చి చూస్తే.. మన దేశంలో నియామకాల సెంటిమెంట్‌లో 10 శాతం వృద్ధి కనిపిస్తోంది. త్రైమాసికం వారీగా చూస్తే నియామకాల సెంటిమెంట్ 3% మెరుగుపడింది. భారత్‌కు ప్రయోజనం.. ‘‘భారత్ ఆర్థిక మూలాలు పటిష్టంగా, బలంగా ఉన్నాయి. స్వల్పకాల ప్రతికూలతలు ఉన్నా కానీ, వృద్ధికి మద్దతునిచ్చే విధానాలు, మౌలిక రంగంలో పెట్టుబడులు, ఎగుమతులు పెరగడం వల్ల మధ్య కాలం నుంచి దీర్ఘకాలానికి ప్రతికూలతలను అధిగమిస్తుంది. భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల వల్ల వర్ధమాన దేశాలు, మరీ ముఖ్యంగా భారత్ వృద్ధికి మద్దతునిస్తుంది. ఎగుమతులు పెంచుకుంటుంది. అదే సమయంలో అంతర్జాతీయ మందగమనంపై వదంతులు నేపథ్యంలో ఐటీ కంపెనీల్లో అప్రమత్త ధోరణి నెలకొంది’’అని మ్యాన్‌పవర్ గ్రూప్ ఇండియా ఎండీ సందీప్ గులాటీ తెలిపారు. నియామకాల పట్ల సానుకూల ధోరణి బలంగానే ఉన్నా కానీ, తమకు కావాల్సిన నైపుణ్య మానవ వనరులు లభించడం లేదని 85 శాతం కంపెనీలు చెప్పడం ఆందోళనకరం. ఇక భారత్‌లో ప్రాంతాల వారీగా చూస్తే దక్షిణాది, ఉత్తరాదిన వచ్చే మూడు నెలల్లో ఉద్యోగులను నియమించుకోవాలని 56 శాతం కంపెనీలు అనుకుంటుంటే.. పశ్చిమాదిన 53 శాతం, తూర్పున 47 శాతంగానే ఉంది. -
వేతనాలు 10 శాతం పెంచే చాన్స్
ముంబై: భారత్‌లోని కంపెనీలు తమ ఉద్యోగులకు వచ్చే ఏడాది 10 శాతం వేతనం పెంచే అవకాశం ఉందని అడ్వైజరీ, బ్రోకింగ్, సొల్యూషన్స్ కంపెనీ విల్లిస్ టవర్స్ వాట్సన్ నివేదిక తెలిపింది. ఆసియా పసిఫిక్ ప్రాంతంలో ఇదే అధికం అని వెల్లడించింది. ప్రస్తుత సంవత్సరంలో జీతాలు 9.5% అధికం అయ్యాయని వివరించింది. ‘ఫైనాన్షియల్ సర్వీసెస్, బ్యాంకింగ్, టెక్నాలజీ, మీడియా, గేమింగ్ రంగాల్లో వేతనాలు అత్యధికంగా 10–10.4 శాతం పెరగనున్నాయి. ఈ రంగాల్లో 2022లో ఇప్పటికే గణనీయంగా సాలరీలు పెరిగాయి. పెంపు 2023లోనూ ఇదే తరహాలో ఉండనుంది. గత ఏడాదితో పోలిస్తే దేశంలోని కంపెనీల యజమానుల్లో 58 శాతం ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో అధిక జీతాల పెంపుదల కోసం బడ్జెట్‌ను కేటాయించారు. 24.4% ఎటువంటి మార్పు చేయలేదు. 5.4% మంది తగ్గించారు. వచ్చే 12 నెలలు ఆదాయం మెరుగ్గా ఉంటుందని 42 శాతం కంపెనీలు భావిస్తున్నాయి. తిరోగమనం ఉండొచ్చని 7.2 శాతం కంపెనీలు అభిప్రాయపడ్డాయి’ అని నివేదిక వెల్లడించింది. డిజిటల్ నిపుణుల కోసం.. ‘తదుపరి 12 నెలల్లో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఇంజనీరింగ్, అమ్మకాలు, సాంకేతికంగా నైపుణ్యం కలిగిన వ్యాపారాలు, ఫైనాన్స్ రంగాల్లో నియామకాలు ఉంటాయి. డిజిటల్ నైపుణ్యాలు కలిగిన వారి కోసం డిమాండ్ ఉండడం వేతనాల పెంపునకు కారణం అవుతోంది. హాంకాంగ్ తర్వాత రెండవ స్థానంలో ఉన్న భారత్‌లో స్వచ్ఛంద అట్రిషన్ అత్యధికంగా 15.1 శాతంగా కొనసాగుతోంది’ అని నివేదిక వివరించింది. గత సంవత్సరం బడ్జెట్ల కంటే వాస్తవ జీతాల పెంపుదల ఎక్కువగా ఉంది. ఊహించిన దాని కంటే మెరుగైన వ్యాపార పనితీరు, ప్రతిభను నిలుపుకోవాల్సిన అవసరం కారణంగా వేతన సవరణ జరిగిందని విల్లిస్ టవర్స్ వాట్సన్ కన్సల్టింగ్ ప్రతినిధి రాజుల్ మాథుర్ తెలిపారు. ఇక చైనా 6 శాతం, హాంగ్‌కాంగ్ 4, సింగపూర్ 4 శాతం వేతనాలు పెంచే చాన్స్ ఉంది. 2022 ఏప్రిల్–మే నెలల్లో 168 దేశాల్లో సర్వే జరిగింది. భారత్ నుంచి 590 కంపెనీలు పాలుపంచుకున్నాయి. -
ఆర్థిక ఇబ్బందులతో దేశీ స్టార్టప్ కంపెనీలు సతమతం
(కంచర్ల యాదగిరిరెడ్డి) దేశంలో గత కొన్నేళ్లుగా వినిపిస్తున్న కొత్త మంత్రం స్టార్టప్.. స్టార్టప్.. వినూత్నమైన ఉత్పత్తులు, సేవలతో సరికొత్త వ్యాపారాలను సృష్టించి భారత యువత ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తోంది. రూ. వందల వేల కోట్ల విలువైన పెట్టుబడులు స్టార్టప్ కంపెనీల్లోకి ప్రవహిస్తూ ఎందరికో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నాయి. అయితే ప్రతి వ్యవస్థలో ఒడిదుడుకులు ఉన్నట్లే ప్రస్తుత మన స్టార్టప్ కంపెనీలూ ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. రూ. లక్ష కోట్లకుపైగా పెట్టుబడులు... దేశంలో ఇప్పటివరకు దాదాపు 72 వేల స్టార్టప్‌లు ఏర్పాట య్యాయి. ఈ ఏడాది జూన్ వరకూ భారత స్టార్టప్ కంపెనీలు ఆకర్షించిన పెట్టుబడులు సుమారు రూ. 1.36 లక్షల కోట్ల వరకు ఉంటాయని అంచనా. కేవలం 891 ఒప్పందాల ద్వారా ఈ స్థాయి పెట్టుబడులు రావడమన్నది చెప్పుకోదగ్గ విషయమే. ఈ సమయంలోనే సుమారు 18 స్టార్టప్ కంపెనీలు 100 కోట్ల డాలర్ల విలువైనవిగా (యూనికార్న్)గా మారిపోయాయి. గతేడాదితో పోలిస్తే వచ్చిన పెట్టుబడులు, యూనికార్న్‌లుగా ఎదిగిన కంపెనీల సంఖ్య రెండూ ఎక్కువే. సరిపెట్టుకుంటున్న స్టార్టప్‌లు.. పెట్టుబడులు తగ్గిపోయిన నేపథ్యంలో భారత స్టార్టప్ కంపెనీలు కూడా అందుకు తగ్గట్లుగా సర్దుకొనే ప్రయత్నాలు మొదలుపెట్టాయి. మౌలిక సదుపాయాలు, టెక్నాలజీ, మార్కెటింగ్ వ్యవహారాలను తగ్గించుకోవడం ద్వారా పొదుపును పాటించే ప్రయత్నం చేస్తున్నాయి. భారం తగ్గించుకొనే క్రమంలో వేల మంది ఉద్యోగులకు ఉద్వాసన పలికాయి. ఈ ఏడాది ఇప్పటివరకూ ఇలా ఉద్యోగాలు కోల్పోయిన వారి సంఖ్య 10 వేలకు పైనే. ఈ పరిస్థితి ఇంకో ఏడాదిన్నర వరకూ కొనసాగే అవకాశం ఉందని అంచనా. కోవిడ్ సమయంలో లాక్డౌన్ కారణంగా ఆన్లైన్ క్లాసులు ఉనికిలోకి రాగా విద్యకు సంబంధించిన స్టార్టప్‌లు ఈ అవకాశాన్ని తమకు అనుకూలంగా మలుచుకున్నాయి. వీడియో గేమింగ్ పరిస్థితి కూడా ఇదే. అయితే కోవిడ్ సద్దుమణుగుతున్న నేపథ్యంలో ఈ రంగాలకు నిధుల కొరత ఏర్పడిందని నిపుణులు అంటున్నారు. ఆసక్తికరమైన అంశం ఏమిటంటే చాలా రంగాల్లోని స్టార్టప్‌లు గత రెండేళ్లుగా నిధులు సేకరించలేదు. ప్రస్తుత పరిస్థితులు ఇలాంటి కంపెనీలకు పెద్ద సమస్యగా మారుతున్నాయి. ఈ పరిస్థితిలో మార్పు వస్తేనే సమీప భవిష్యత్తులో మళ్లీ స్టార్టప్‌లు నిలదొక్కుకోగలవని నిపుణులు చెబుతున్నారు. అమెరికా ఆర్థిక వ్యవస్థ కుదుటపడితే నిధులు వస్తాయని, కాకపోతే వచ్చే ఈ నిధులను కొంచెం ఆచితూచి తగిన వ్యాపార ప్రణాళికతో ఖర్చు చేస్తే మేలన్నది వారి అభిప్రాయం. మే నెలలో మందగమనం.. ఈ ఏడాది తొలి అర్ధ భాగంలో పెట్టుబడుల మొత్తం రూ. 1.36 లక్షల కోట్లుగా పరిశ్రమ వర్గాలు అంచనా వేస్తున్నా అంతర్జాతీయ పరిణామాల ప్రభావం ఫలితంగా ఏప్రిల్ నుంచే మందగమనం మొదలైంది. మే నెలలో వచ్చిన పెట్టుబడులు రూ. 14 వేల కోట్లు మాత్రమే. ఇందులోనూ గతంలో కుది రిన ఒప్పందాల కారణంగా వచ్చినవే ఎక్కువ. ప్రపంచవ్యాప్తంగా షేర్ మార్కెట్ల పతనం, పెరుగుతున్న వడ్డీ రేట్లు, సరుకు రవాణా ఇబ్బందులు, ద్రవ్యోల్బణం పెరుగుదల వంటివి భారత స్టార్టప్ వ్యవస్థపైనా ప్రభావం చూపాయని నిపుణులు విశ్లేస్తున్నారు. రష్యా–ఉక్రెయిన్ యుద్ధం కూడా ఇందు కు ఒక కారణంగా చెబుతున్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద వెంచర్ క్యాపిటలిస్టులైన సాఫ్ట్ బ్యాంక్, టైగర్ గ్లోబల్ మేనేజ్ మెంట్లు మే నెలలోనే 2022 సంవత్సరానికిగాను నష్టాలను ప్రకటించడం గమనార్హం. ఈ ఏడాది ఏప్రిల్ వరకూ ప్రతి త్రైమాసి కానికి 1,000–1,100 కోట్ల డాలర్ల పెట్టుబడులు రాగా మే–జూన్ త్రైమాసికంలో అది 40% దాకా తగ్గిపోయి 600–700 కోట్ల డాలర్లకు పరిమితమైంది. ( పాపం.. ఓలా అంచనా తల్లకిందులైందే!) నిపుణుల మాట ఇదీ.. ప్రస్తుత సంక్షోభం నుంచి గట్టెక్కగలిగినవి మాత్రమే భవిష్యత్తులో దేశంలోని దిగ్గజ కంపెనీల జాబితాలోకి చేరిపోతాయి. 2021ని స్టార్టప్‌లకు ఊపిరి పోసిన ఏడాదిగా చెప్పుకోవాలి. ఇప్పుడు కొన్ని సమస్యల నుంచి గట్టెక్కగలిగితే వాటి భవిష్యత్తుకు ఢోకా ఉండదు. – ఆశిష్ శర్మ, ఇన్నోవెన్ క్యాపిటల్ ఇండియా మేనేజింగ్ పార్ట్నర్ భారత స్టార్టప్ వ్యవస్థకు వచ్చిన ఇబ్బందేమీ లేదు. టెక్నాలజీ, ఇన్నొవేషన్, ఉత్పత్తులన్నీ యథాతథంగా కొనసాగుతాయనేది నా నమ్మకం. కంపెనీల వ్యాల్యుయేషన్‌లో తగ్గుదల ఉన్నా మొత్తమ్మీద పరిస్థితి బాగుంది. – సి.విజయ్ కుమార్, సీఈవో, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ గత 2 నెలల్లో స్టార్టప్ వ్యవస్థకు సమస్యల ముసురు పట్టుకుంది. పెట్టుబడులు తగ్గిపోయాయి. ఉన్న కంపె నీల వ్యాపార ప్రణాళికలు వెనుకంజ వేస్తుండగా కొత్త వాటికి నిధులు గగనమైపోతున్నాయి. ఈ పరిస్థితి ఎందుకొచ్చింది? సమస్యలు ఇలాగే ఉంటే వాటి భవిష్యత్తు ఏమవుతుంది? ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా వంటి అంశాలపై సమగ్ర అధ్యయనం జరగాలి. – కేశవ్ ఆర్. మురుగేష్, నాస్కామ్ మాజీ చైర్మన్ స్టార్టప్ కంపెనీలు మౌలికాంశాలపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. వెంచర్ క్యాపిటలిస్టులు లేదా పెట్టు బడిదారులు గతంలో మాదిరిగా సులువుగా పెట్టుబ డులు పెట్టడం లేదు. ఉత్పత్తి లేదా సేవ ఆదాయాన్ని ఇవ్వగలదా లేదా? అన్నది చూస్తున్నారు. ఇప్పటివరకూ చాలా వరకూ స్టార్టప్‌లు తమ ఉత్పత్తులు/సేవలను రాయితీ ధరలతో అమ్మే ప్రయత్నం చేశాయి. ఇలా కాకుండా వాస్తవ అవసరాలను గుర్తించి చేసే వ్యాపారం లాభదాయకమా కాదా? అని ఆలోచించుకుని ముందడుగు వేయడం మంచిది. – మురళి బుక్కపట్నం, టై గ్లోబల్ ఉపాధ్యక్షుడు స్టార్టప్‌లకు అకస్మాత్తుగా నిధులు మందగించడం ఆర్థిక వ్యవస్థ ఒడిదుడుకుల్లో భాగమే. దీనిపై ఆందోళన అవ సరం లేదు. అయితే కేవలం వ్యాల్యుయేషన్పైనే ఆధార పడి కొంతకాలంగా స్టార్టప్ కంపెనీలు పనిచేస్తుండటం ప్రస్తుత పరిస్థితికి కారణం కావచ్చు. ఆదాయాన్ని సృష్టించగలమా? లాభాలు వస్తాయా అనే ఆలోచన లేకుండా కంపెనీలు పెట్టుబడిదారుల నుంచి వస్తున్న నిధులను ఖర్చు చేయడమే ఆందోళన కలిగించే విషయం. – ఇటీవలి నివేదికలో ఆర్బీఐ