
న్యూఢిల్లీ: వ్యక్తిగత ఆదాయపన్ను శ్లాబులలో మార్పులు చేయాలని, భారత కంపెనీలు విదేశాల్లో లిస్టింగ్ ప్రక్రియను సులభతరం చేయాలని, టీడీఎస్/టీసీఎస్ నిబంధనలను క్రమబద్ధీకరించాలని కేంద్ర ప్రభుత్వానికి కేపీఎంజీ సూచించింది. ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులకు కంపెనీలు అందించిన కోవిడ్ టీకాలు, వైద్య సరఫరాలపై పన్నుల్లేకపోవడంపై స్పష్టత ఇవ్వాలని కోరింది. 2022–23 బడ్జెట్‌కు ముందు కీలక సూచనలు చేసింది.
ఆర్థిక శాఖకు కేపీఎంజీ సూచనలు
► కరోనా చికిత్సలకు భారీ మొత్తం ఖర్చయినందున ప్రత్యేక పన్ను మినహాయింపు కల్పించాల్సిన అవసరం ఉందని పేర్కొంది.
► భారత కంపెనీలు నేరుగా విదేశాల్లో లిస్ట్ అయ్యేందుకు లేదా స్పెషల్ పర్పస్ యాక్విజిషన్ కంపెనీ మార్గంలో లిస్ట్ అయ్యేందుకు, పన్ను మినహాయింపులకు సంబంధించి నియంత్రణపరమైన కార్యాచరణను ప్రకటించాలి.
► విదేశీ కంపెనీలకు, విదేశీ బ్యాంకు శాఖలకు కార్పొరేట్ పన్నును తగ్గించాలి. దేశీ కంపెనీలకు మాదిరే రేట్లను అమలు చేయాలి.
► టీడీఎస్, టీసీఎస్‌కు సంబంధించి నిబంధనలను సరళీకరించాలి. అన్ని రకాల సెక్యూరిటీలను (డెరివేటివ్స్ సైతం) టీడీఎస్/టీసీఎస్ నుంచి మినహాయించాలి.
► బ్యాంకుల మాదిరే నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ (ఎన్‌బీఎఫ్‌సీ) కంపెనీలకు నిబంధనల పరంగా వెసులుబాటు కల్పించాలి. ముఖ్యంగా ఎన్‌పీఏలకు సంబంధించి మినహాయింపును పెంచాలి. వడ్డీ ఆదాయంపై టీడీఎస్ మినహాయింపు ఇవ్వాలి.
► దేశంలో నూతన ఉత్పత్తులు, సాంకేతిక పరిజ్ఞానాల ఆవిష్కరణలను ప్రోత్సహించేందుకు.. ముఖ్యంగా ఫార్మా, హెల్త్‌కేర్ రంగంలో పరిశోధన, అభివృద్ధిపై (ఆర్‌అండ్‌డీ) కంపెనీలు చేసే వ్యయాలకు వెయిటెడ్ డిడక్షన్ ఇవ్వాలి.
► జీఎస్‌టీ కిందకు పెట్రోలియం ఉత్పత్తులను తీసుకురావడాన్ని పరిశీలించాలి.
► కార్పొరేట్ సామాజిక బాధ్యత కింద కరోనా మహమ్మారి సమయంలో కంపెనీలు వినియోగించిన ఉత్పత్తులు, సేవలకు ఇన్‌పుట్ ట్యాక్స్ క్రెడిట్ సదుపాయం కల్పించాలి.
Comments
Please login to add a commentAdd a comment