న్యూఢిల్లీ: భారతీయ కంపెనీలు కృత్రిమ మేథను (ఏఐ) వినియోగించుకోవడం గణనీయంగా పెరిగింది. ఈ విషయంలో పారిశ్రామికోత్పత్తులు, తయారీ రంగం మిగతా అన్ని విభాగాల కన్నా ముందుంటున్నాయి. కోవిడ్ తర్వాత శకంలో ఏఐ ప్రభావం అనే అంశంపై కన్సల్టెన్సీ సంస్థ పీడబ్ల్యూసీ రూపొందించిన నివేదికలో ఈ విషయాలు వెల్లడయ్యాయి.
2020లో భారత మార్కెట్లో నిర్వహించిన సర్వేకు కొనసాగింపుగా 2022–23లో 220 పైచిలుకు చీఫ్ ఎక్స్‌పీరియన్స్ ఆఫీసర్లు (సీఎక్స్‌వో), నిర్ణయాధికారాలు ఉన్న ఉన్నతోద్యోగులతో మాట్లాడి దీన్ని తయారు చేసినట్లు పేర్కొంది. దీని ప్రకారం గత రెండేళ్లుగా పారిశ్రామికోత్పత్తులు, తయారీ రంగాల్లో ఏఐ/ఎంఎల్ (మెషిన్ లెరి్నంగ్) వినియోగం అత్యధికంగా పెరిగింది. సర్వేలో పాల్గొన్న వాటిలో ఈ రంగాలకు చెందిన 64 శాతం సంస్థలు తాము ప్రస్తుతం ఏఐకు మారే క్రమంలో తొలి దశలో ఉన్నట్లు తెలిపాయి. దీనిపై మరింతగా పెట్టుబడులు పెట్టే అవకాశాలు ఉన్నట్లు సూచనప్రాయంగా తెలియజేశాయి. నివేదికలోని మరిన్ని ముఖ్యాంశాలు..
► ఏఐని వినియోగించడం ద్వారా పెట్టుబడులపై అధిక రాబడులను అందుకునే విషయంలో ట్రావెల్, ఆతిథ్య పరిశ్రమ ఒక మోస్తరు సంతృప్త స్థాయికి చేరింది. టెక్నాలజీ, మీడియా, టెలికం, హెల్త్‌కేర్, ఫార్మా తదితర రంగాలు ఏఐ వినియోగంలో స్థిరంగా ముందుకెడుతున్నప్పటికీ పెట్టుబడులపై రాబడులను అంచనా వేసుకోవడంలో సవాళ్లు ఎదుర్కొంటున్నాయి.
► మిగతా రంగాలతో పోలిస్తే రిటైల్, కన్జూమర్ మార్కెట్లలో ఏఐ వినియోగం తగ్గింది. మార్కెట్ శక్తులు, వినియోగదారుల పోకడలు మారిపోతున్న నేపథ్యంలో ఏఐని ఏయే అంశాల్లో వినియోగించవచ్చనేది గుర్తించడం సంక్లిష్టంగా మారడమే ఇందుకు కారణం.
► గత రెండేళ్లుగా, 2020 మధ్య నుంచి 2022–23 వ్యవధిలో పారిశ్రామికోత్పత్తులు.. తయారీ రంగాల్లో ఏఐ/ఎంఎల్ సొల్యూ,న్స్ వినియోగం అత్యధికంగా 20 శాతం పెరిగింది.
Comments
Please login to add a commentAdd a comment