ముంబై: ప్రయివేట్ రంగంలోని టాప్–500 గ్లోబల్ కంపెనీల జాబితాలో దేశీ దిగ్గజాలు వెనకడుగు వేశాయి. అత్యంత విలువైన కంపెనీల జాబితాలో ర్యాంకులు నీరసించాయి. జూలై 15 కటాఫ్‌గా పరిగణిస్తూ హురున్ గ్లోబల్ రూపొందించిన టాప్–500 తాజా జాబితాలో డైవర్సిఫైడ్ దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్‌సహా.. సాఫ్ట్‌వేర్ సేవల దిగ్గజం టీసీఎస్, ఫైనాన్షియల్ దిగ్గజాలు హెచ్‌డీఎఫ్‌సీ ద్వయం, టెలికం బ్లూచిప్ భారతీ ఎయిర్‌టెల్ డీలా పడ్డాయి.అయితే మార్కెట్ క్యాపిటలైజేషన్(విలువ) రీత్యా రూపొందించే ఈ జాబితాలో గతేడాది 11 దేశీ కంపెనీలకు మాత్రమే జాబితాలో చోటు లభించగా తాజాగా 12కు చేరింది. వివరాలు ఇవీ..
విలువ పెరిగినా..:
ఆర్‌ఐఎల్ మార్కెట్ విలువ 11 శాతం బలపడి 188 బిలియన్ డాలర్లను తాకినప్పటికీ కంపెనీ ర్యాంకు మూడంచెలు తగ్గి 57కు చేరింది. ఈ బాటలో 164 బిలియన్ డాలర్ల విలువతో టీసీఎస్ 75 నుంచి 74వ ర్యాంకుకు నీరసించగా.. 113 బిలియన్ డాలర్ల విలువ గల హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ 19 పొజిషన్లు క్షీణించి 124వ స్థానానికి చేరింది. ఇక హెచ్‌డీఎఫ్‌సీ 52 అంచెలు జారి 301వ ర్యాంకును తాకింది. అయితే ఈ కాలంలో కంపెనీ మార్కెట్ విలువ 1 శాతం పుంజుకుని 56.7 బిలియన్ డాలర్లను తాకడం గమనార్హం! కోటక్ మహీంద్రా బ్యాంక్ విలువ 8% తగ్గి 46.6 బిలియన్ డాలర్లకు పరిమితంకాగా.. 96 ప్లేస్‌లు క్షీణించి 380వ ర్యాంకుకు చేరింది. కాగా.. బ్యాంకింగ్ బ్లూచిప్ ఐసీఐసీఐ విలువ 36 శాతం జంప్‌చేసి 62 బిలియన్ డాలర్లను అందుకోవడంతో 48 స్థానాలు మెరుగుపడి 268వ ర్యాంకుకు ఎగసింది.
కొత్తగా 3 కంపెనీలు
గ్లోబల్ టాప్–500 జాబితాలో కొత్తగా దేశీ దిగ్గజాలు విప్రో(457వ ర్యాంకు), ఏషియన్ పెయింట్స్(477), హెచ్‌సీఎల్ టెక్నాలజీస్(498)కు చోటు లభించింది. దేశీయంగా స్టార్టప్‌ల జోరు కొనసాగుతుండటంతో ఇకపై జాబితాలోకి మరిన్ని కంపెనీలు చేరే వీలున్నట్లు హురున్ నివేదిక అభిప్రాయపడింది. అంతర్జాతీయ స్థాయిలో చూస్తే ఐఫోన్ల దిగ్గజం యాపిల్ ఇంక్ మార్కెట్ విలువ 15 శాతం పురోగమించి 2.4 లక్షల కోట్ల డాలర్లను తాకింది. తద్వారా జాబితాలో అగ్రస్థానంలో నిలిచింది. ఈ బాటలో మైక్రోసాఫ్ట్, అమెజాన్, అల్ఫాబెట్(గూగుల్) తదుపరి ర్యాంకులను ఆక్రమించాయి. జాబితాలో 243 కంపెనీలతో యూఎస్ టాప్ ర్యాంకును కైవసం చేసుకోగా.. చైనా(47), జపాన్(30), యూకే(24) తదుపరి స్థానాల్లో ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment