Tata Consultancy Services
-
జేఈఈ అడ్వాన్స్డ్ తర్వాతే ఈఏపీ సెట్?
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ ఉమ్మడి ప్రవేశ పరీక్ష (ఈఏపీ సెట్)ను ఈసారి ముందుకు జరిపి ఏప్రిల్‌లోనే నిర్వహించాలన్న ఉన్నత విద్యా మండలి ఆలోచన కార్యరూపం దాల్చేలా కనిపించడం లేదు. ఈఏపీ సెట్‌ను ముందుకు జరపటం అసాధ్యమని పరీక్ష నిర్వహణ కన్సల్టెన్సీ సంస్థ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) స్పష్టం చేసినట్టు తెలిసింది. జాతీయ, రాష్ట్ర పరీక్షలను దృష్టిలో పెట్టుకొని ఈఏపీ సెట్ తేదీని గత ఏడాదికన్నా ముందుకు జరపడం సాధ్యంకాదని తెలిపినట్లు సమాచారం. ప్రధాన పరీక్షలన్నీ పూర్తయిన తర్వాతే ఈఏపీ సెట్ తేదీని ఖరారు చేయాలని ఇటీవల తమతో భేటీ అయిన ఉన్నత విద్యామండలి చైర్మన్ బాలకిష్టారెడ్డికి టీసీఎస్ ప్రతినిధులు సూచించినట్లు తెలిసింది. ఈసారి సెట్‌ను ముందే నిర్వహిస్తామని బాలకిష్టారెడ్డి మండలి చైర్మన్‌గా బాధ్యతలు తీసుకున్న తొలి రోజుల్లోనే ప్రకటించిన విషయం తెలిసిందే. వివిధ పరీక్ష తేదీలను పరిశీలించి టీసీఎస్ సెట్ తేదీని మండలికి సూచించడం ఆనవాయితీ. మే 18 తర్వాత అయితే ఓకే.. మార్చి ఆఖరి వారంలో ఇంటర్మీడియెట్ పరీక్షలు పూర్తవుతాయని అధికారులు అంటున్నారు. ఈ ఫలితాలు ఏప్రిల్ రెండో వారం వెల్లడించే వీలుంది. పరీక్షల్లో ఫెయిలైన విద్యార్థులు అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ రాస్తారు. ఇంటర్ పరీక్షల తర్వాత ఈఏపీ సెట్‌కు సన్నద్ధమవ్వడానికి విద్యార్థులకు సమయం అవసరం. జేఈఈ మెయిన్స్ పరీక్ష ఏప్రిల్ 1వ తేదీ నుంచి 8 వరకు నిర్వహిస్తున్నారు. జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్షను మే 18న నిర్వహిస్తామని ఐఐటీ కాన్పూర్ ప్రకటించింది. దీని తర్వాత ఐఐటీలు, జాతీయ ఇంజనీరింగ్ కాలేజీల్లో కౌన్సెలింగ్ ఉంటుంది. ఏటా ఈ కౌన్సెలింగ్ పూర్తయ్యే సమయంలో రాష్ట్ర ఇంజనీరింగ్ కౌన్సెలింగ్ చేపడుతుంటారు. జాతీయ కాలేజీల్లో సీట్లు రాని వారికి ఇది ఉపయోగపడుతుంది.ఇవన్నీ పట్టించుకోకుండానే ఈఏపీ సెట్‌ను ఏప్రిల్‌లో నిర్వహించాలని మండలి భావించింది. ఇలా చేయడం వల్ల మెయిన్స్, అడ్వాన్స్డ్ రాసే విద్యార్థులు గందరగోళంలో పడే ప్రమాదం ఉందని టీసీఎస్ భావిస్తోంది. అడ్వాన్స్డ్ తర్వాతే ఎప్పటిలాగే సెట్ నిర్వహించాలని సూచించినట్లు టీసీఎస్ ప్రతినిధి ఒకరు తెలిపారు. మండలిలోనూ భిన్నాభిప్రాయాలు ఈఏపీ సెట్‌ను ముందుకు జరపాలన్న ప్రతిపాదనపై మండలిలోనే భిన్నాభిప్రాయాలు ఉన్నట్లు తెలిసింది. వివిధ సెట్స్ ఏ వర్సిటీకి ఇవ్వాలి? కన్వీనర్‌ను ఎవరిని పెట్టాలనే దానిపై ఇంకా స్పష్టత లేదు. ఈఏపీసెట్ నిర్వహించే జేఎన్టీయూహెచ్కు వీసీని కూడా నియమించలేదు. ఇంజనీరింగ్ యాజమాన్య కోటా సీట్లను ఆన్లైన్లో భర్తీ చేస్తామని చెబుతున్నా... ప్రభుత్వం నుంచి అందుకు సమ్మతి రాలేదు. ఇన్ని సమస్యల మధ్య సెట్ నిర్వహణ ముందే ఎలా చేపడతామని మండలి వైస్ చైర్మన్ ఒకరు సందేహం వ్యక్తంచేశారు. -
విలువలో టీసీఎస్ నంబర్ 1
న్యూఢిల్లీ: అత్యంత విలువైన భారత బ్రాండ్‌గా టీసీఎస్ మరోసారి మొదటి స్థానంలో నిలిచింది. కాంటార్ బ్రాండ్జ్ రిపోర్ట్‌లో వరుసగా మూడో ఏడాది ఈ గుర్తింపు పొందింది. ఆ తర్వాతి స్థానాల్లో హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఎయిర్టెల్, ఇన్ఫోసిస్, ఎస్బీఐ ఉన్నాయి. టీసీఎస్ బ్రాండ్ విలువ 49.7 బిలియన్ డాలర్లుగా ఈ నివేదిక తెలిపింది. గతేడాది నుంచి చూస్తే టీసీఎస్ బ్రాండ్ విలువ 16 శాతం పెరిగింది. ఏఐ, డిజిటల్ విభాగాల్లో టీసీఎస్ చేసిన పెట్టుబడులు బ్రాండ్ విలువ పెరిగేందుకు దోహదపడినట్టు తెలిపింది.హెచ్డీఎఫ్సీ బ్యాంక్ 38.3 బిలియన్ డాలర్ల విలువను సొంతం చేసుకుంది. 18 బిలియన్ డాలర్ల విలువతో ఎస్బీఐ ఐదో స్థానంలో నిలవగా, 15.6 బిలియన్ డాలర్లతో ఐసీఐసీఐ బ్యాంక్ ఆరో స్థానంలో, 11.5 బిలియన్ డాలర్ల విలువతో ఎల్ఐసీ పదో స్థానంలో నిలిచాయి. గతే డాది నుంచి చూస్తే 54 బ్రాండ్లు తమ విలువను పెంచుకున్నాయి. భారత్‌లోని టాప్–75 బ్రాండ్ల విలువ అద్భుతమైన రీతిలో ఏడాదిలోనే 19 శాతం పెరిగి 450.5 బిలియన్ డాలర్లకు చేరుకున్నట్టు కాంటార్ బ్రాండ్జ్ నివేదిక వెల్లడించింది. ఆర్థిక సేవల బ్రాండ్లు ఈ జాబితాలో ప్రముఖంగా నిలిచాయి. మొత్తం బ్రాండ్ల విలువలో 17 ఆర్థిక సేవల బ్రాండ్ల రూపంలోనే 28 శాతం ఉన్నట్టు ఈ నివేదిక తెలిపింది. జొమాటో స్పీడ్.. ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫామ్ జొమాటో చాలా వేగంగా తన విలువను రెట్టింపు చేసుకున్నట్టు కాంటార్ బ్రాండ్జ్ నివేదిక తెలిపింది. 3.5 బిలియన్ డాలర్ల విలువతో జాబితాలో 31వ స్థానాన్ని సొంతం చేసుకుంది. బజాజ్ ఆటో 20వ స్థానంలో ఉంది. మహీంద్రా అండ్ మహీంద్రా బ్రాండ్ విలువ ఏడాదిలో 78 శాతం పెరిగింది. 30వ స్థానం సొంతం చేసుకుంది. మొత్తం 1535 బ్రాండ్లకు సంబంధించి 1.41 లక్షల మంది అభిప్రాయాలను కాంటార్ సంస్థ పరిగణనలోకి తీసుకుంది. -
టీసీఎస్‌కు షాక్!.. రూ.1600 కోట్ల జరిమానా
తమ వ్యాపార రహస్యాలను 'టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్' (TCS) బయట పెట్టించిందని 'కంప్యూటర్ సైన్సెస్ కార్పొరేషన్' డల్లాస్‌లోని నార్త్ డిస్ట్రిక్ టెక్సాస్‌లోని యునైటెడ్ స్టేట్స్ డిస్ట్రిక్ కోర్ట్‌లో కేసు వేసింది. ఈ కేసు విచారణ చేపట్టిన తరువాత వాణిజ్య రహస్యాలను దుర్వినియోగం చేసినందుకు టీసీఎస్ పూర్తి బాధ్యత వహిస్తుందని అమెరికా కోర్టు తీర్పునిచ్చింది. ఈ కారణంగా కంపెనీకి 194 మిలియన్ డాలర్ల (భారతీయ కరెన్సీ ప్రకారం సుమారు రూ. 1600 కోట్లు) జరిమానా విధించింది.ఈ విషయాన్ని టీసీఎస్ స్టాక్ ఎక్స్ఛేంజీ ఫైలింగ్‌లో తెలిపింది. ఈ మేరకు జూన్ 14న కోర్టు ఉత్తర్వులను అందుకున్నట్లు వెల్లడించింది. ఈ కేసులో టీసీఎస్ కూడా తన వాదనలను బలంగా వినిపించింది. జిల్లా కోర్టులు మళ్ళీ ఈ విషయాన్ని పునఃపరిశీలన చేయనున్నట్లు సమాచారం. కంపెనీకి అమెరికా కోర్టు భారీ జరిమానా విధించినప్పటికీ.. తమ ఆర్థిక కార్యకలాపాలు సజావుగా సాగుతున్నాయని టీసీఎస్ పేర్కొంది.ఆన్‌బోర్డింగ్ ఆలస్యంఇదిలా ఉండగా గత రెండేళ్ల కాలంలో ఐటీ కంపెనీలు సుమారు 10,000 కంటే ఎక్కువ మంది ఫ్రెషర్లకు ఇంకా ఉద్యోగాలు ఇవ్వలేదని ఎన్ఐటీఈఎస్ వెల్లడించింది. ఈ జాబితాలో టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో మొదలైన కంపెనీలు ఉన్నాయి. కంపెనీలు ఉద్యోగాలు ఆఫర్ చేసి.. ఉద్యోగంలో చేర్చుకోవడంలో చాలా ఆలస్యం చూపిస్తున్నట్లు తమకు ఫిర్యాదులు వచ్చాయని.. ఐటీ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు హర్‌ప్రీత్ సింగ్ సలూజా తెలిపారు. -
టీసీఎస్ భారీ షాక్.. ఉద్యోగులు రెడీగా ఉండండమ్మా!
కరోనా మహమ్మారి విలయతాండవం కారణంగా కంపెనీలు తమ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ వెసలుబాటుని కల్పించాయి. గత కొన్ని నెలలుగా వైరస్ తగ్గుముఖం పట్టడంతో పాటు వ్యాక్సినేషన్ కార్యక్రమం కూడా దాదాపు పూర్తయింది. ఈ తరుణంలో కోవిడ్ తగ్గుముఖం పట్టి యధావిధిగా కార్యకాలపాలు కొనసాగుతుండడంతో కంపెనీలు వర్క్ ఫ్రం హోమ్‌కు సిస్టమ్‌కు గుడ్ బై చెప్పాలని భావిస్తున్నాయి. ఇప్పటికే పలు కంపెనీలు ఆ దిశగా అడుగులు కూడా వేస్తున్నాయి. తాజాగా టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) తన ఉద్యోగులను వారానికి కనీసం మూడు రోజులు ఆఫీసులో పని చేయాలని కోరింది. ఈ మేరకు ఉద్యోగులకు ఈమెయిల్స్ పంపింది. టీసీఎస్ తన ఉద్యోగులకు పంపిన ఈమెయిల్లో.. ఇప్పటికే సీనియర్ ఉద్యోగులు ఆఫీస్ నుంచి పని చేస్తున్నారని పేర్కొంది. ఇంటి నుంచి పని చేస్తున్న ఉద్యోగులు వారానికి కనీసం మూడు రోజులైనా ఆఫీసు నుంచి పని చేయాలని, అందుకు తగ్గట్టు సన్నద్ధం కావాలని సూచించింది. రిటర్న్ టూ ఆఫీస్ మోడల్ ప్రకారం.. 25/25 ప్లాన్‌ను మరింత నియంత్రిత పద్ధతిలో అమలు చేయాలని కంపెనీ భావిస్తోంది. ప్రస్తుతానికి, ఉద్యోగులు ఆఫీసులకు వెళ్లేందుకు గుడువు తేదిని మాత్రం తెలపలేదు. అయితే కొత్త వర్కింగ్ ప్లాన్ ప్రకారం.. వారి ప్రాజెక్ట్‌ల కోసం చేసిన ఏర్పాట్ల గురించి సంబంధిత మేనేజర్లను సంప్రదించాలని సూచించింది. అలాగే ఉద్యోగుల రోస్టరింగ్ పద్థతి ప్రాజెక్ట్ అవసరాలపై ఆధారపడి ఉంటుందని తెలిపింది. చదవండి: పండుగ సీజన్.. కొత్త బైక్ కొనేవారికి షాక్! -
టీసీఎస్ సంచలనం.. ప్రపంచంలోనే 2వ స్థానంలో..!
TCS, Infosys among world’s most valuable brands: దేశీయ ప్రముఖ ఐటీ కంపెనీ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్(టీసీఎస్) మరో రికార్డు సాధించింది. బ్రాండ్ ఫైనాన్స్ 2022 గ్లోబల్ 500 నివేదిక ప్రకారం.. టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ ప్రపంచవ్యాప్తంగా ఐటీ సేవల్లో రెండవ అత్యంత విలువైన బ్రాండ్‌గా నిలిచింది. మొదటి స్థానంలో ఉన్న యాక్సెంచర్ అత్యంత విలువైన బలమైన ఐటీ సేవల అందిస్తున్న బ్రాండ్‌గా కొనసాగుతుంది. ఇక మూడవ స్థానంలో ఉన్న ఇన్ఫోసిస్ గత సంవత్సరం నుంచి 52 శాతం వృద్ధి చెందింది. $12.8 బిలియన్లతో ప్రపంచవ్యాప్తంగా వేగంగా అభివృద్ధి చెందుతున్న ఐటి సేవల బ్రాండ్‌గా అవతరించింది. 16.8 బిలియన్ డాలర్ల విలువైన టీసీఎస్ వ్యాపార పనితీరు, మెరుగైన భాగస్వామ్యాల ఒప్పందాల ద్వారా రెండు ర్యాంకింగ్ స్థాయికి చేరుకుంది. బ్రాండ్ ఫైనాన్స్ నివేదిక ప్రకారం.. టీసీఎస్ బ్రాండ్ విలువ గత 12 నెలల్లో $1.844 బిలియన్(12.5 శాతం) పెరిగి $16.786 బిలియన్లకు చేరుకుంది. ఈ వృద్ధికి కంపెనీలో పెట్టుబడులు పెట్టిన పెట్టుబడుదారులు, ఉద్యోగులు, కస్టమర్ ఈక్విటీ & బలమైన ఆర్థిక పనితీరు కారణమని పేర్కొంది. బ్రాండ్ విలువ వృద్ధి పరంగా భారతీయ ఐటీ సేవల కంపెనీలు, యునైటెడ్ స్టేట్స్ నుంచి వస్తున్న పోటీని అధిగమించాయి. కోవిడ్-19 మహమ్మారి ద్వారా డిజిటల్ సేవలు అందించే కంపెనీలు భారీగా వృద్ది చెందాయని ఈ కొత్త నివేదిక తెలిపింది. 2020 నుంచి భారతీయ బ్రాండ్ల సగటు వృద్ధి 51 శాతం పెరిగితే, యుఎస్ బ్రాండ్ల వృద్ది సగటున 7 శాతం తగ్గింది. కరోనా మహమ్మారి వల అనేక రంగాలు ప్రభావితం అయినప్పటికీ ఐటి సేవలు & సాంకేతిక రంగానికి చెందిన దూసుకెళ్తున్నాయి. మార్కెట్ కి అనుగుణంగా ద్వారా క్లౌడ్ సేవలు, టెక్నాలజీ కన్సల్టింగ్, మెషిన్ లెర్నింగ్, కృత్రిమ మేధస్సు వంటి సేవలు అందిస్తుండటం ద్వారా కంపెనీలు దేశీయ కంపెనీలు తమ బ్రాండ్ విలువను పెంచుకుంటూ పోతున్నాయి. (చదవండి: సామాన్యులకు దడ పుట్టిస్తున్న బంగారం ధరలు..!) -
ఫ్రెషర్స్‌కు గుడ్‌న్యూస్, లక్షకు పైగా ఉద్యోగాలకు.. ..
మీరు చదువు కంప్లీట్ చేసుకొని ఉద్యోగ వేటలో ఉన్నారా ! అయితే మీకో గుడ్‌న్యూస్. పలు దిగ్గజ ఎంఎన్సీ కంపెనీలు ఫ్రెషర్లకు ఉద్యోగాలు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. ఫైనాన్షియల్ దిగ్గజం గోల్డ్‌మన్ శాక్స్,పీడబ్ల్యూసీ,టాటా కన్సల్టెన్సీ సర్వీస్,బైజూస్,టాటా స్టీల్,ఇన్ఫోసిస్ కంపెనీలు ఆఫ్ క్యాంపస్‌లో భారీ ఎత్తున ఫ్రెషర్స్ ను రిక్రూట్ చేసుకోనున్నట్లు ఎకనామిక్స్ టైమ్స్ ఓ రిపోర్ట్ ను విడుదల చేసింది. ఆ రిపోర్ట్ ప్రకారం..ఈ ఏడాది సుమారు 30వేల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించిన కాగ్నిజెంట్ 2022( వచ్చే ఏడాదికి ) గ్రాడ్యుయేట్ కంప్లీట్ చేసుకున్న విద్యార్ధులకు 45 వేలు ఉద్యోగాలు ఇవ్వనుంది. ఇన్ఫోసిస్ సైతం గత సంవత్సరంతో పోలిస్తే ఈ ఏడాదిలో ఇంకా 24,000 మంది ఫ్రెషర్స్‌ను నియమించనుంది. 2021-22 ఆర్థిక ఆర్ధిక సంవత్సరంలో ఇండియాకు చెందిన టెక్ దిగ్గజాలు టీసీఎస్, ఇన్ఫోసిస్, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్,విప్రోలు సుమారు లక్షా 20 వేల మంది గ్రాడ్యుయేట్లను నియమించనున్నట్లు ఎకనమిక్ టైమ్స్ తన నివేదికలో పేర్కొంది. ఈ సందర్భంగా కాగ్నిజెంట్ ఇండియా సీనియర్ వైస్ ప్రెసిడెంట్ శంతను మాట్లాడుతూ.. ఫుల్ స్టాక్ ఇంజనీర్లు, డేటా సైంటిస్ట్,ఏల్/ఎంఎల్ డెవలపర్లు, సైబర్ సెక్యూరిటీ కోసం అధునాతన ప్రోగ్రామింగ్ నైపుణ్యాలు కలిగిన విద్యార్థులను పెద్ద సంఖ్యలో నియమించుకోవడంపై కంపెనీ దృష్టి పెట్టినట్లు చెప్పారు. ఫైనాన్షియల్ దిగ్గజం గోల్డ్ మన్ సాక్స్ సైతం ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటి),నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎన్ఐటి) నుండి ఇంజనీరింగ్ విద్యార్ధుల్ని ఎంపిక చేసుకునేందుకు దేశ వ్యాప్తంగా 'ఇంజనీరింగ్ క్యాంపస్ హైరింగ్ ప్రోగ్రామ్' పేరిట క్యాంపస్ ఇంటర్వ్యూలను ఏర్పాటు చేయనుంది. ఉద్యోగుల నియమాకం కోసం ఇండియాలో మొత్తం 600 ఇంజనీరింగ్ క్యాంపస్‌లలో క్యాంపస్ ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్లు హ్యూమన్ కేపిటల్ మేనేజ్మెంట్ అధికారిణి దీపికా బెనర్జీ చెప్పారు. ఈ నియామకాల్లో సాఫ్ట్వేర్ డెవలప్మెంట్, క్లౌడ్, సైబర్ సెక్యూరిటీ, ప్రొడక్ట్ ఇంజనీర్ ఉద్యోగుల నియామకాలు ఎక్కువగా ఉన్నాయి.కాగా, స్టార్టప్‌లు,ఐటీ/ టెక్నాలజీ ఔట్సోర్సింగ్స్ సంస్థలు,స్టార్టప్‌లు, సాఫ్ట్వేర్ కంపెనీలు, బ్యాంకులు, కన్సల్టెన్సీలలో డిమాండ్ పెరగడంతో తాజాగా గ్రాడ్యుయేట్ ఇంజనీరింగ్ విద్యార్ధులను నియమించుకునేందుకు ఆయా సంస్థలు పోటీ పడుతున్నాయి. చదవండి: భారీగా ఉద్యోగాలు, ఈ రేంజ్లో శాలరీలు ఎప్పుడు ఇవ్వలేదేమో! -
గ్లోబల్ ర్యాంకింగ్స్‌లో దేశీ దిగ్గజాలు డీలా..రిలయన్స్‌తో పాటు
ముంబై: ప్రయివేట్ రంగంలోని టాప్–500 గ్లోబల్ కంపెనీల జాబితాలో దేశీ దిగ్గజాలు వెనకడుగు వేశాయి. అత్యంత విలువైన కంపెనీల జాబితాలో ర్యాంకులు నీరసించాయి. జూలై 15 కటాఫ్‌గా పరిగణిస్తూ హురున్ గ్లోబల్ రూపొందించిన టాప్–500 తాజా జాబితాలో డైవర్సిఫైడ్ దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్‌సహా.. సాఫ్ట్వేర్ సేవల దిగ్గజం టీసీఎస్, ఫైనాన్షియల్ దిగ్గజాలు హెచ్డీఎఫ్సీ ద్వయం, టెలికం బ్లూచిప్ భారతీ ఎయిర్టెల్ డీలా పడ్డాయి.అయితే మార్కెట్ క్యాపిటలైజేషన్(విలువ) రీత్యా రూపొందించే ఈ జాబితాలో గతేడాది 11 దేశీ కంపెనీలకు మాత్రమే జాబితాలో చోటు లభించగా తాజాగా 12కు చేరింది. వివరాలు ఇవీ.. విలువ పెరిగినా..: ఆర్ఐఎల్ మార్కెట్ విలువ 11 శాతం బలపడి 188 బిలియన్ డాలర్లను తాకినప్పటికీ కంపెనీ ర్యాంకు మూడంచెలు తగ్గి 57కు చేరింది. ఈ బాటలో 164 బిలియన్ డాలర్ల విలువతో టీసీఎస్ 75 నుంచి 74వ ర్యాంకుకు నీరసించగా.. 113 బిలియన్ డాలర్ల విలువ గల హెచ్డీఎఫ్సీ బ్యాంక్ 19 పొజిషన్లు క్షీణించి 124వ స్థానానికి చేరింది. ఇక హెచ్డీఎఫ్సీ 52 అంచెలు జారి 301వ ర్యాంకును తాకింది. అయితే ఈ కాలంలో కంపెనీ మార్కెట్ విలువ 1 శాతం పుంజుకుని 56.7 బిలియన్ డాలర్లను తాకడం గమనార్హం! కోటక్ మహీంద్రా బ్యాంక్ విలువ 8% తగ్గి 46.6 బిలియన్ డాలర్లకు పరిమితంకాగా.. 96 ప్లేస్‌లు క్షీణించి 380వ ర్యాంకుకు చేరింది. కాగా.. బ్యాంకింగ్ బ్లూచిప్ ఐసీఐసీఐ విలువ 36 శాతం జంప్‌చేసి 62 బిలియన్ డాలర్లను అందుకోవడంతో 48 స్థానాలు మెరుగుపడి 268వ ర్యాంకుకు ఎగసింది. కొత్తగా 3 కంపెనీలు గ్లోబల్ టాప్–500 జాబితాలో కొత్తగా దేశీ దిగ్గజాలు విప్రో(457వ ర్యాంకు), ఏషియన్ పెయింట్స్(477), హెచ్‌సీఎల్ టెక్నాలజీస్(498)కు చోటు లభించింది. దేశీయంగా స్టార్టప్‌ల జోరు కొనసాగుతుండటంతో ఇకపై జాబితాలోకి మరిన్ని కంపెనీలు చేరే వీలున్నట్లు హురున్ నివేదిక అభిప్రాయపడింది. అంతర్జాతీయ స్థాయిలో చూస్తే ఐఫోన్ల దిగ్గజం యాపిల్ ఇంక్ మార్కెట్ విలువ 15 శాతం పురోగమించి 2.4 లక్షల కోట్ల డాలర్లను తాకింది. తద్వారా జాబితాలో అగ్రస్థానంలో నిలిచింది. ఈ బాటలో మైక్రోసాఫ్ట్, అమెజాన్, అల్ఫాబెట్(గూగుల్) తదుపరి ర్యాంకులను ఆక్రమించాయి. జాబితాలో 243 కంపెనీలతో యూఎస్ టాప్ ర్యాంకును కైవసం చేసుకోగా.. చైనా(47), జపాన్(30), యూకే(24) తదుపరి స్థానాల్లో ఉన్నాయి. -
సృజనాత్మకత పెంచుకోవాలి
సాక్షి, హైదరాబాద్: పాఠశాల స్థాయి నుంచే విద్యార్థులు సృజనాత్మకను, నైపుణ్యాలను పెంచుకుంటే భవిష్యత్తుకు భరోసా ఉంటుం దని, అలాగే విద్యా వ్యవస్థలో నాణ్యమైన విద్యను అందించినప్పుడే దేశం అభివృద్ధి సాధిస్తుందని మహారాష్ట్ర గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్‌రావు అన్నారు. గ్రామాలే కేంద్రంగా అభివృద్ధి జరగాలని అప్పుడే అనుకున్న ప్రగతి సాధించగలుగుతామని ఆయన పేర్కొన్నారు. హైదరాబాద్‌లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్(ఎన్ఐఎన్)లో ‘‘ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఫర్ డెవలప్మెంట్ డిస్కోర్స్’’కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. ఈ సందర్భంగా విద్యాసాగర్‌రావు మాట్లాడుతూ చదువంటే కేవలం పరీక్షల కోసమేనన్న భావన నుంచి బయటకు రావాలని సూచించారు. నైపుణ్యాభివృద్ధి, నూతన ఆవిష్కరణలు, అంకుర పరిశ్రమలు దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపించడానికి దోహదపడతాయన్నారు. టాటా కన్సల్టెంట్ సర్వీస్(టీసీఎస్) నిర్వహించిన సర్వేలో గణిత సమస్యల సాధనలో ఇండియాలోని 21 ఏళ్ల ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లు ఓఈసీడీ దేశాల 15 ఏళ్ల విద్యార్థుల కంటే తక్కువ సామర్థ్యం కలిగి ఉండటం బాధాకరమన్నారు. మన దేశ విద్యా విధానాన్ని ప్రక్షాళన చేసే దిశగా కృషి జరగాలన్నారు. యువతకు తగిన ఉపాధి అవకాశాలు కల్పించాల్సిన అవసరముందని లేకుంటే అది సమాజా నికి పెను సవాలుగా పరిణమిస్తుందని హెచ్చరించారు. స్వాతంత్య్రం వచ్చి ఇన్నేళ్లు గడుస్తు న్నా గిరిజన గ్రామాలు ఇంకా అభివృద్ధి ఫలా లు అందుకోలేకపోతున్నాయని వాపోయారు. ఈ కార్యక్రమంలో నీతి అయోగ్ వైస్ చైర్మన్ డా.రాజీవ్‌కుమార్, తదితరులు పాల్గొన్నారు. -
టిసిఎస్‌లో ఉద్యోగ ఆఫర్లు
-
టీసీఎస్‌కు 2 బిలియన్ డాలర్ల డీల్
న్యూఢిల్లీ: దేశీ ఐటీ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) తాజాగా 2 బిలియన్ డాలర్ల డీల్ దక్కించుకుంది. అమెరికాకు చెందిన బీమా సంస్థ ట్రాన్స్ అమెరికా నుంచి ఈ కాంట్రాక్టు లభించినట్లు టీసీఎస్ తెలిపింది. ఈ కాంట్రాక్టు కింద అమెరికాలో ఆ కంపెనీ బీమా, యాన్యుటీ వ్యాపార విభాగాలను మెరుగుపర్చేందుకు అవసరమైన సర్వీసులు అందించాల్సి ఉంటుంది. 2018 రెండో త్రైమాసికంలో ఈ ఒప్పందం పూర్తి కాగలదని టీసీఎస్ తెలియజేసింది. దీంతో ట్రాన్స్‌అమెరికాకు వార్షికంగా 70–100 మిలియన్ డాలర్ల దాకా వ్యయాలు ఆదా కాగలవని పేర్కొంది. ప్రస్తుతం ట్రాన్స్ అమెరికాలో వివిధ విభాగాల్లో పనిచేస్తున్న సుమారు 2,200 మంది సిబ్బందికి తమ సంస్థలో ఉద్యోగావకాశాలు కల్పించనున్నట్లు టీసీఎస్ తెలిపింది. అలాగే, స్థానికంగా మరింత మందిని రిక్రూట్ చేసుకోనున్నట్లు టీసీఎస్ సీఈవో రాజేశ్ గోపీనాథన్ పేర్కొన్నారు. మరింతగా పొదుపు, మదుపు చేసేలా తమ కస్టమర్లకు తోడ్పాటునివ్వడానికి టీసీఎస్‌తో డీల్ ఉపయోగపడగలదని ట్రాన్స్ అమెరికా ప్రెసిడెంట్ మార్క్ మలిన్ చెప్పారు. టీసీఎస్ డిసెంబర్ క్వార్టర్లో సుమారు నాలుగు శాతం క్షీణతతో రూ.6,531 కోట్లకు నికర లాభం ప్రకటించిన నేపథ్యంలో తాజా డీల్ ప్రాధాన్యం సంతరించుకుంది. శుక్రవారం బీఎస్ఈలో టీసీఎస్ షేరు సుమారు అరశాతం క్షీణించి రూ. 2,773 వద్ద క్లోజయ్యింది. -
జేఎన్టీయూతో టీసీఎస్ ఒప్పందం
► బోధన, శిక్షణ కార్యక్రమాల్లో సహకారం అందించనున్న ఐటీ దిగ్గజం సాక్షి, హైదరాబాద్: విద్యార్థులకు మెరుగైన బోధన కోసం జవహర్లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్సిటీ హైదరాబాద్ (జేఎన్టీయూహెచ్)మరో ముందడుగు వేసింది. ఐటీ కంపెనీ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్)తో ఒప్పందం కుదు ర్చుకుంది. ఇందులో భాగంగా జేఎన్టీయూహెచ్ విద్యార్థులు, ఉపాధ్యాయులు నిర్వహించే కార్యక్రమాలకు టీసీఎస్ సహకారం అందించనుంది. పరిశ్రమ ఆధారిత శిక్షణలు, బోధన అభివృద్ధి కార్యక్రమాలు, విద్యార్థుల ఇంటర్న్‌షిప్, అవార్డులు, పరిశోధన ల్లోనూ టీసీఎస్ పాలుపంచుకోనుంది. శనివారం జేఎన్టీ యూహెచ్ వైస్ చాన్స్‌లర్ వేణుగోపాల్‌రెడ్డి, టీసీఎస్ ఉపాధ్యక్షుడు వి.రాజన్న ఒప్పంద పత్రా లపై సంతకాలు చేశారు. జేఎన్టీయూ భాగస్వామ్యంతో దాదాపు పదేళ్లుగా వివిధ అంశాల్లో ఒప్పం దం కుదుర్చుకుని కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపా రు. టీసీఎస్ రీసెర్చ్ స్కాలర్ ప్రొగాంను కూడా పొడిగిం చినట్లు చెప్పారు. -
టీసీఎస్ తర్వాత హెచ్‌సీఎల్ టెక్ కూడా..
ప్రముఖ దేశీయ ఐటీ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ టిసిఎస్ తర్వాత మరో దేశీయ అగ్రగామి హెచ్‌సీఎల్ టెక్ కూడా కీలక నిర్ణయం తీసుకోబోతుంది. షేర్ల బైబ్యాక్ ఆఫర్ ప్రకటించేందుకు సిద్ధమైంది. షేర్ బైబ్యాక్ ప్రకటించాలని కంపెనీ యోచిస్తోందని, ఈ విషయాన్ని బోర్డు ముందుకు తీసుకురాబోతున్నట్టు సంబంధిత వర్గాలు చెప్పాయి. రెండు రోజుల క్రితమే టీసీఎస్ రూ.16వేల కోట్ల మెగా షేర్ల బైబ్యాక్‌ను చేపట్టనున్నట్టు ప్రకటించి, ఇన్వెస్టర్లకు తీపి కబురు అందించింది. ప్రస్తుతం తాము కూడా ఇన్వెస్టర్ల వాల్యు పెంచేందుకు చూస్తున్నామని, షేర్ బైబ్యాకుకు పిలుపునివ్వబోతున్నామని ఓ అధికారి చెప్పారు. ఒక్కసారి ఈ విషయంపై తాము ఫైనల్ నిర్ణయం తీసుకున్నాక, బోర్డు ముందుకు తీసుకొస్తామని పేర్కొన్నారు. బోర్డు ముందుకు వెళ్లిన తర్వాత హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ షేర్ హోల్డర్స్ దీన్ని ఆమోదించాల్సి ఉంది. డిసెంబర్ 31 వరకు కంపెనీ వద్ద నగదు, నగదుతో సమానమైన నిల్వలు రూ.2,214.5 కోట్లు ఉన్నాయి. అంతేకాక ఫిక్స్డ్ డిపాజిట్లు రూ.10,506.9 కోట్లున్నాయి. టీసీఎస్ తరహాలో మెగా బైబ్యాక్ ఆఫర్ చేయకపోయినా.. బైబ్యాక్ మాత్రం తప్పనిసరి అని ఆయన పేర్కొన్నారు. -
అమెరికా అత్యంత విలువైన బ్రాండ్లలో టీసీఎస్
లండన్: దేశీ దిగ్గజ ఐటీ కంపెనీ ‘టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్’ (టీసీఎస్) అమెరికాలోని అత్యంత విలువైన బ్రాండ్లలో ఒకటిగా స్థానం పొందింది. ప్రముఖ బ్రాండ్ వేల్యుయేషన్ కం పెనీ ‘బ్రాండ్ ఫైనాన్స్’ రూపొందించిన వార్షిక ‘టాప్-500 యూఎస్ బ్రాండ్స్’ జాబితాలో టీసీఎస్ 58వ ర్యాంక్‌ను సొంతం చేసుకుంది. ఇక టాప్-100 బ్రాండ్లలో కేవలం ప్రపంచపు అత్యుత్తమ గ్లోబల్ ఐటీ సర్వీసెస్ కంపెనీలు మాత్రమే ఉన్నాయి. అందులో టీసీఎస్ ఒకటి. 2010లో 2.3 బిలియన్ డాలర్లుగా ఉన్న టీసీఎస్ బ్రాండ్ విలువ 2016నాటికి 286% వృద్ధితో 9.04 బిలియన్ డాలర్లయ్యింది. -
ఐటీ ఉపాధి కల్పనలో టీసీఎస్ టాప్: నాస్కామ్
న్యూఢిల్లీ: దేశీ ఐటీ పరిశ్రమలో సాఫ్ట్వేర్ దిగ్గజ కంపెనీ ‘టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్’ (టీసీఎస్) టాప్ ఎంప్లాయర్‌గా నిలిచింది. ఇందులో 3.62 లక్షల మంది పనిచేస్తున్నారు. ఐటీ పరిశ్రమ సమాఖ్య నాస్కామ్ ప్రకారం.. టీసీఎస్ తర్వాతి స్థానాల్లో ఇన్ఫోసిస్, కాగ్నిజెంట్, విప్రో, క్యాప్‌జెమిని ఉన్నాయి. కాగ్నిజెంట్.. అమెరికా కంపెనీ అయినప్పటికీ ఆ కంపెనీ దేశంలో చాలా మందికి ఉపాధి కల్పిస్తోందని నాస్కామ్ పేర్కొంది. దీనికి హైదరాబాద్, చెన్నై, బెంగళూరు ప్రాంతాల్లో డెవలప్మెంట్ సెంటర్లున్నాయి. జూన్ నెల చివరకు.. టీసీఎస్‌లో 3.62 లక్షల మంది ఉద్యోగులున్నారు. ఇన్ఫోసిస్, విప్రోలలో వరుసగా 1.97 లక్షలు, 1.73 లక్షల మంది పనిచేస్తున్నారు. ఇక టాప్-10లో హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, టెక్ మహీంద్రా, జెన్‌ప్యాక్ట్, ఇంటెలిజెంట్ గ్లోబల్ సర్వీసెస్, ఏజీస్ వంటి సంస్థలున్నాయి. టాప్-20లో హిందుజా గ్లోబల్ సొల్యూషన్స్, సీఎస్సీ ఇండియా, డబ్ల్యూఎన్ఎస్ గ్లోబల్ సర్వీసెస్, సింటెల్, ఎంఫసిస్, ఈఎక్స్ఎల్, ఎల్ అండ్ టీ ఇన్ఫోటెక్, మైండ్‌ట్రీ, ఫస్ట్‌సోర్స్ సొల్యూషన్స్, సీజీఐ వంటి కంపెనీలు స్థానం పొందాయి. దేశీ ఐటీ-బీపీఎం పరిశ్రమ దాదాపు 37 లక్షల మందికి ఉపాధి కల్పిస్తోంది. ఇందులో మహిళా ఉద్యోగుల వాటా 13 లక్షలు. -
జలయోగం
సుంకిశాలపై మళ్లీ కదలిక మూడేళ్లు ఆలస్యం రూ.300 కోట్లు పెరిగిన అంచనా వ్యయం సిటీబ్యూరో: నాగార్జున సాగర్ జలాశయం నుంచి నగరానికి కృష్ణా జలాల (రా వాటర్) పంపింగ్‌కు ఉద్దేశించిన సుంకిశాల ఇన్‌టేక్ వెల్ (కృష్ణా హెడ్‌వర్క్స్ పనులు) ప్రాజెక్టుపై మళ్లీ కదలిక వచ్చింది. శాసనసభలో ఇటీవల విపక్షాలు ఇదే అంశంపై సర్కారును నిలదీయడంతో ఈ ప్రాజెక్టును పూర్తి చేస్తామని ఇరిగేషన్ శాఖ మంత్రి హరీష్ రావు సభ్యులకు తెలిపారు. దీంతో ఈ ప్రాజెక్టు చర్చనీయాంశమైంది. దీనికి సంబంధించిన సమగ్ర ప్రాజెక్టు నివేదికను టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ మూడేళ్ల క్రితమే పూర్తి చేసింది. దీనిపై రాష్ట్ర సర్కారు మూడేళ్లుగా దృష్టి సారించకపోవడంతో అంచనా వ్యయం రూ.900 కోట్ల నుంచి రూ.1200 కోట్లకు చేరుకుంది. తీవ్ర వర్షాభావ పరిస్థితులు, వేసవిలో నీటి మట్టాలు సాగర్‌లో 465 అడుగులకు పడిపోయినప్పటికీ ఈ పథకం ద్వారా జంట నగరాలకు నీటిని తరలించే అవకాశం ఉంటుంది. ఇన్‌టేక్ వెల్ ఎందుకంటే... ప్రస్తుతం సాగర్ నీటి పారుదల కాల్వల (ఇరిగేషన్ కెనాల్స్) నుంచి కృష్ణా మొదటి, రెండో దశల ద్వారా కోదండాపూర్ (నల్లగొండ జిల్లా)కు నిత్యం 180 మిలియన్ గ్యాలన్ల నీటిని తరలిస్తున్నారు. అక్కడి నుంచి నగర శివార్లలోని సాహెబ్ నగర్ రిజర్వాయర్‌కు కృష్ణా జలాలను పంపింగ్‌చేస్తున్నారు. వర్షాభావ పరిస్థితులు, వేసవిలో నీటి మట్టాలు 510 అడుగుల దిగువకు పడిపోయినపుడు నగరానికి తాగునీటి సరఫరాపై తరచూ ఆందోళన నెలకొంటున్న విషయం విదితమే. ఈ నేపథ్యంలోనే సుంకిశాల ఇన్‌టేక్ వెల్ నిర్మాణ పథకం రూపుదిద్దుకుంది. ప్రస్తుతం నాగార్జున సాగర్ నుంచి కోదండాపూర్‌కు... అక్కడి నుంచి పుట్టంగండికి రావాటర్ పంపింగ్ చేస్తున్నారు. అటు నుంచి నగర శివారుల్లోని సాహెబ్‌నగర్ వరకు శుద్ధి చేసిన కృష్ణా జలాలు తరలిస్తున్నారు. తాజా ప్రాజెక్టు ద్వారా కోదండాపూర్‌కు 17 కిలోమీటర్ల దూరంలో ఉన్న సుంకిశాల వద్ద ఇన్‌టేక్ వెల్ నిర్మిస్తారు. ఈ ప్రాంతంలో భూమికి అత్యంత లోతున మూడు పెద్ద బావులు (జాక్‌వెల్స్) నిర్మిస్తారు. వాటికి 18 మోటార్లను ఏర్పాటు చేసి అక్కడి నుంచి రావాటర్‌ను కోదండాపూర్‌కు పంపింగ్ చేస్తారు. ఇలా చేయడం వల్ల సాగర్ నీటిమట్టం 465 అడుగులకు పడిపోయినప్పటికీ నగర తాగునీటి అవసరాలకు నీటిని తరలించవచ్చని జలమండలి అధికారులు ‘సాక్షి’కి తెలిపారు. మూడు దశల పంపింగ్ సుంకిశాల నుంచే... ఈ ఇన్‌టేక్ వెల్ నిర్మాణం పూర్తయితే రోజువారీగా కృష్ణా మొదటి, రెండు, మూడో దశలకు అవసరమైన 270 మిలియన్ గ్యాలన్లను సుంకిశాల నుంచే పంపింగ్‌కు అవకాశం ఉంటుంది. ఈ ప్రతిపాదనకు నీటి పారుదల శాఖ గతంలో సూత్రప్రాయంగా అంగీకరించినప్పటికీ ప్రాజెక్టు కాగితాలకే పరిమితమైంది. గతంలో దీనికి అవసరమైన రూ.900 కోట్ల రుణాన్ని జైకా (జపనీస్ ఇంటర్నేషనల్ కో-ఆపరేషన్ ఏజెన్సీ) అందజేసేందుకు ముందుకొచ్చినప్పటికీ సర్కారు దృష్టి పెట్టకపోవడంతో పనులు మొదలుకాలేదు. దీనిపై సర్కారు దృష్టి సారించడం అత్యవసరమని నీటి పారుదల శాఖ నిపుణులు చెబుతున్నారు. -
యూరప్‌యేతర ఉద్యోగులపై వెయ్యిపౌండ్ల సర్‌చార్జ్
యూకే సర్కారు పన్ను ♦ భారత ఐటీ నిపుణులకు మంచి అవకాశం లండన్: యూకేలో యూరప్యేతరులను ఉద్యోగులుగా నియమించుకునే కంపెనీలు ఇకపై ఏడాదికి అదనంగా వెయ్యి పౌండ్ల (దాదాపు రూ.95 వేలు) సర్చార్జ్ను చెల్లించాల్సి ఉంటుంది. టైర్2 వీసా విధానంలో భాగంగా.. కంపెనీల ‘ఇంట్రా కంపెనీ ట్రాన్స్ఫర్’ను సమీక్షించాక యూకే మైగ్రేషన్ అడ్వయిజరీ కమిటీ(మ్యాక్) ఈ సిఫార్సు చేసింది. దీంతో యూకేలో ఉద్యోగానికి వచ్చే వారికి శిక్షణనిచ్చి ఉద్యోగంలో చేర్చుకోవటం కంపెనీలకు భారమవుతుంది. నేరుగా నైపుణ్యమున్న వారికే ఉద్యోగాలివ్వాల్సి ఉంటుంది. కొత్త విధానంతో కనీసం మూడేళ్ల వీసాపై వచ్చే యూరప్యేతరులపై కంపెనీలు 3 వేల పౌండ్లు చెల్లించాలి. దీనివల్ల అవి స్థానికులకే శిక్షణనిచ్చి వారికే ఉద్యోగాలిచ్చేందుకు అవకాశం ఉంటుందని మ్యాక్ తన నివేదికలో పేర్కొంది. నివేదికను యూకే ప్రభుత్వం త్వరగానే ఆమోదించనున్నట్లు సమాచారం. 2015 సెప్టెంబర్ వరకున్న లెక్కల ప్రకారం.. టైర్ 2 వీసా కింద అనుమతి పొందిన వారిలో 90శాతం మంది భారతీయ స్కిల్డ్ వర్కర్లే ఉన్నారని మ్యాక్ తెలిపింది. భారత్‌లోని మల్టీనేషనల్ కంపెనీలు పోటీ వాతావరణం వల్ల యూకేలో ఐటీ ప్రాజెక్టులకోసం భారతీయ ఉద్యోగులను తీసుకొస్తున్నాయంది. యూకేతో పోలిస్తే.. భారత్‌లో వేతనాలు చాలా తక్కువగా ఉండట కారణమంది. భారత్‌లోనూ శిక్షణ సంస్థల మధ్యతో నిపుణులైన ఉద్యోగులు బయటకు వస్తున్నారని.. వారికి యూకే కంపెనీలు మంచి వేతనంతో ఉద్యోగాలిస్తున్నాయ పేర్కొంది. కాగా, 2016 నుంచి 2020 వరకు వెయ్యిమంది యూకే గ్రాడ్యుయేట్లకు శిక్షణ ఇచ్చేందుకు టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ ముందుకొచ్చినట్లు తెలిసింది. -
'మా బిడ్డను బలవంతంగా లాక్కున్నారు'
జైపూర్: తాము ఏ తప్పూ చేయకపోయినా తామేదో కావాలని చేసినట్లు భావించి అమెరికా అధికారులు తమ బిడ్డను బలవంతంగా లాక్కున్నారని, ప్రభుత్వ గుర్తింపు పొందిన సంరక్షణ కేంద్రానికి అప్పగించారని రాజస్థాన్‌కు చెందిన దంపతులు వాపోయారు. జైపూర్ కు చెందిన దంపతులు ఆశిష్ పరీక్, విదిశా అమెరికాలోని న్యూజెర్సీ లో టాటా కన్సల్టెన్సీలో ఉద్యోగం చేస్తున్నారు. విదిశా గత అక్టోబర్ నెలలోనే ఓ బాబుకు జన్మనిచ్చింది. గత నెలలో ఆ బాలుడు చేతిలోకి తీసుకొని ఆడిస్తుండగా చేయి జారి కిందపడ్డాడు. ఆ క్రమంలో అతడి తల టీవీ స్టాండ్ కు తగిలి అనంతరం నేలకు బలంగా తాకింది. దీంతో ఆ బాలుడిని న్యూజెర్సీలోని ఆస్పత్రికి తరలించారు. దీంతో బాలుడికి ప్రాణగండం తప్పింది. సురక్షితంగా కోలుకున్నాడు. అయితే, అమెరికా శిశు సంరక్షణ శాఖకు చెందిన అధికారులు మాత్రం వారు కావాలనే బాబుకు హానీ కలిగించేందుకు ప్రయత్నించారని ఆరోపిస్తూ వారి చేతినుంచి బిడ్డను తీసుకొని ప్రభుత్వ శిశు సంరక్షణ కేంద్రానికి తరలించారు. దీంతో ఇప్పుడు తమ బిడ్డను ఎలాగైనా తమకు ఇప్పించండని, అది కేవలం అనుకోకుండా జరిగిన ప్రమాదం మాత్రమేనని అంటున్నారు. గతంలో నార్వేలో కూడా తమ పిల్లలకు సంబంధించి భారతీయ దంపతులకు ఇలాంటి చిక్కులు ఎదురైన విషయం తెలిసిందే. -
84% స్మార్ట్ ఫోన్ ప్రియులే!
హైదరాబాద్: విద్యార్థులకు అత్యంత ప్రియమైన గాడ్జెట్ స్మార్ట్‌ఫోన్ అని టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ జనరేషన్ జెడ్ సర్వేలో తేలింది. డిజిటల్ గాడ్జెట్ వినియోగంలో విద్యార్థులు ముందున్నారని, వీరిలో 84 శాతం మంది స్మార్ట్‌ఫోన్ ప్రియులని తేటతెల్లమైంది. 83 శాతం మంది విద్యార్థులు ఫేస్బుక్ వినియోగిస్తున్నారని, టెక్నాలజీ ఇంతగా అభివృద్ధి చెందినా ఇప్పటికీ 80 శాతం మంది సమాచారం, వినోదం కోసం టీవీలు, న్యూస్ పేపర్లపైనే ఆధారపడుతున్నారని వెల్లడైంది. విద్యార్థులకు డిజిటల్ అవగాహనపై టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ జనరేషన్ జెడ్ హైదరాబాద్‌లోని 50 స్కూళ్లలో చదివే వెయ్యి మంది విద్యార్థులపై సర్వే నిర్వహించింది. ఈ సర్వేలో పలు ఆసక్తికమైన విషయాలు వెలుగు చూశాయి. శుక్రవారం గచ్చిబౌలిలోని టీసీఎస్ సినర్జీ పార్కులో నిర్వహించిన విలేకరుల సమావేశంలో టీసీఎస్ టెక్నాలజీ బిజినెస్ యూనిట్ గ్లోబల్ హెడ్, వైస్ ప్రెసిడెంట్, రీజనల్ హెడ్ వి.రాజన్న సర్వే వివరాలను వెల్లడించారు. దేశంలోనే అతిపెద్ద సర్వేల్లో ఇది ఒకటని, నగరంలోని 50 స్కూళ్లలో చదివే 12 నుంచి 18 ఏళ్లలోపు వెయ్యి మంది విద్యార్థులపై సర్వే నిర్వహించామని తెలిపారు. ప్రధానంగా 10 అంశాలైన స్మార్ట్‌ఫోన్, ఫేస్బుక్, సోషల్ మీడియా, వాట్సప్, ఆన్లైన్ వినియోగం, ఎనీ టైమ్ ఎనీవేర్ లెర్నింగ్, టీవీ చూడడం, న్యూస్‌పేపర్లు చదవడం, ప్రొఫెషనల్ కోర్సుల పట్ల వారికున్న అవగాహనపై సర్వే నిర్వహించినట్టు చెప్పారు. ప్రొఫెషనల్ కోర్సులను చదవాలని 61 శాతం మంది విద్యార్థినులు అభిప్రాయపడగా, 48 శాతం మంది విద్యార్థులు మా త్రమే ప్రొఫెషనల్ కోర్సు లు చేయాలని కోరుకుంటున్నారని సర్వేలో తేలిందన్నారు. ఆన్లైన్ షాపింగ్‌పై 62 శాతం మంది.. బుక్స్, ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్‌పై 59 శాతం, సినిమాలు, ఇతర ఈవెంట్లపై 55 శాతం మంది ఆసక్తి కనబరుస్తున్నారని చెప్పారు. ప్రతి నిత్యం 75 శాతం మంది గంట పాటు ఆన్లైన్లోనే ఉంటున్నారని, వీరిలో 59 శాతం మందికి వచ్చే స్పందనలు తల్లిదండ్రుల పర్యవేక్షణలో సాగడం విశేషమని రాజన్న వివరించారు. అవగాహనకు కార్యక్రమాలు విద్యార్థులకు డిజిటల్ రంగంలో అవగాహన పెంచేందుకు టీసీఎస్ ఎన్నో కార్యక్రమాలను చేపట్టినట్లు రాజన్న వివరించారు. విద్యార్థుల కోసం క్యాంపస్ కమ్యూన్ పేరిట దేశంలో ఎక్కడివారైనా వినియోగించుకోవడానికి ఏర్పాటు చేశామని అలాగే యాస్పైర్ కార్యక్రమం ద్వారా ఎంపిక చేసిన వారికి శిక్షణ ఇస్తున్నామని చెప్పారు. ఈ-లెర్నింగ్, ఆన్లైన్ కోర్సులను శిక్షణా కేంద్రాల ద్వారా నిర్వహిస్తున్నామని, హైదరాబాద్‌లో కూడా ఈ కేంద్రం పనిచేస్తోందన్నారు. తెలంగాణ, ఏపీతో పాటు ఇతర ప్రాంతాల నుంచి కూడా శిక్షణ కోసం విద్యార్థుల ఎంపిక జరుగుతోందన్నారు. పీహెచ్డీ విద్యార్థులను ప్రోత్సహించేందుకు ఐదు యూనివర్శిటీలను ఎంపిక చేసుకుని వారికి చేయూత ఇస్తున్నామని రాజన్న తెలిపారు. -
అంచనాలను అందుకున్న టీసీఎస్ ఫలితాలు
టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) రెండో త్రైమాసికం ఫలితాలు అంచనాలను అందుకునేవిధంగా ఉన్నాయి. టీసీఎస్ ఈ ఏడాది రెండో త్రైమాసికంలో 6శాతం వృద్ధితో రూ. 6,055.2 కోట్ల నికర లాభం ఆర్జించింది. అయితే సంస్థ మొత్తం ఆదాయం విషయంలో మాత్రం అంచనాలకు దూరంగా ఉండిపోయింది. రెండో త్రైమాసికంలో సంస్థ రెవెన్యూ ఆదాయం 5.8శాతం పెరిగి.. రూ. 27,165 కోట్లకు చేరుకుంది. డాలర్ ఆదాయం మూడు శాతం మాత్రమే పెరిగి 4,156 మిలియన్ డాలర్లకు చేరుకుంది. డాలర్‌తో పోలిస్తే కాన్స్టంట్ కరెన్సీ రెవెన్యూ మూడుశాతానికి మించి పెరుగకపోవడం మార్కెట్ వర్గాలను నిరాశ పరిచింది. -
వృద్ధిలో టాప్... టీసీఎస్ బ్రాండ్
ముంబై: టాటా గ్రూప్‌కు చెందిన టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్(టీసీఎస్).. ఐదేళ్లలో అత్యంత వేగంగా వృద్ధి సాధించిన సాఫ్ట్వేర్ బ్రాండ్‌గా అవతరించింది. 2010లో 230కోట్ల డాలర్లుగా ఉన్న తమ బ్రాండ్ విలువ 2015 కల్లా 271 శాతం వృద్ధితో 870 కోట్ల డాలర్లకు చేరిందని టీసీఎస్ తెలిపింది.అంతర్జాతీయ బ్రాండ్ వాల్యూయేషన్ సంస్థ, బ్రాండ్ ఫైనాన్స్‌ను ఉటంకిస్తూ టీసీఎస్ ఈ వివరాలు వెల్లడించింది. ఐటీ పరిశ్రమలో ఉండే అత్యున్నత బ్రాండ్ రేటింగ్ ఏఏప్లస్‌ను నిలుపుకున్నామని టీసీఎస్ ఎండీ, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఎన్. చంద్రశేఖరన్ చెప్పారు. ఐటీ సర్వీసుల విభాగంలో ప్రపంచంలో అగ్రశ్రేణి నాలుగు బ్రాండ్లలో ఒకటిగా వరుసగా నాలుగో ఏడాది కూడా నిలిచామని వివరించారు. 46 దేశాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తోన్న టీసీఎస్‌లో 3,18,000 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. -
9 నెలల్లో 2,574 మందికి టీసీఎస్‌లో ఉద్వాసన
న్యూఢిల్లీ: దేశీ సాఫ్ట్వేర్ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి తొమ్మిది నెలల్లో (ఏప్రిల్-డిసెంబర్ మధ్య) 2,574 మంది ఉద్యోగులకు ఉద్వాసన పలికింది. పూర్తి సంవత్సరానికికొస్తే ఈ సంఖ్య 3,000 పైచిలుకు ఉండొచ్చని అంచనా. పనితీరు మదింపు, దాని ఆధారంగా నిర్ణయాలు తీసుకోవడం అన్నది సంస్థాగతంగా సాధారణంగా జరిగేదే తప్ప భారీ స్థాయిలో తొలగింపులు ఉంటాయంటూ వస్తున్న వార్తలు వాస్తవం కాదని కంపెనీ తెలిపింది. -
టీసీఎస్ సీఈవోగా మళ్లీ చంద్రశేఖరన్
న్యూఢిల్లీ: టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) సీఈవోగా ఎం. చంద్రశేఖరన్ మళ్లీ నియమితులయ్యారు. ఆయన పదవీ కాలాన్ని మరో ఐదేళ్ల పాటు (2019, అక్టోబర్) పొడిగిస్తున్నామని టీసీఎస్ బుధవారం తెలిపింది. ఆయన నేతృత్వంలో తమ కంపెనీ మంచి వృద్ధిని సాధిస్తోందని పేర్కొంది. ఆయన సీఈవోగా పదవీ బాధ్యతలు చేపట్టిన క్వార్టర్లో (2009-10 జూలై-సెప్టెంబర్) రూ.29,091 కోట్లుగా ఉన్న కంపెనీ రాబడులు ఈ ఏడాది జూన్ చివరి నాటికి రూ.85,933 కోట్లకు పెరిగాయని వివరించింది. అంతేకాకుండా కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.1.2 లక్షల కోట్ల నుంచి రూ.4.97 లక్షల కోట్లకు పెరిగిందని పేర్కొంది. తమ కంపెనీ 24 శాతం చొప్పున చక్రగతిన వృద్ధి సాధిస్తోందని, ఐటీ పరిశ్రమలో ఇదే అధికమని టీసీఎస్ వివరించింది. -
టీసీఎస్ శిక్షణ అకాడమీ ప్రారంభం..
సాఫ్ట్వేర్ దిగ్గజం టీసీఎస్ జపాన్‌కు చెందిన శిక్షణ అకాడమీని మోడీ మంగళవారమిక్కడ ప్రారంభించారు. ఇరు దేశాల్లోని ఐటీ నిపుణులకు సాంకేతిక, సాంస్కృతికపరమైన నైపుణ్యాలు, విజ్ఞానాన్ని పెంపొందించేందుకు ఈ అకాడమీ కృషిచేస్తుంది. ఈ సందర్బంగా 48 మంది టీసీఎస్ జపాన్ ట్రైనీల తొలి బ్యాచ్ భారత్ పర్యటనను కూడా మోడీ లాంఛనంగా ప్రారంభించారు. ‘21 శతాబ్దాన్ని నడిపిస్తున్నది సాంకేతికత, మేధోపరమైన పరిజ్ఞానమే. మీరంతా భారత్‌లో పర్యటించి తగిన విజ్ఞానాన్ని సొంతం చేసుకుంటారని భావిస్తున్నా. టీసీఎస్‌లో మీరు ఉద్యోగులుగా మారనున్నారు. అయితే, భారత్‌కు బ్రాండ్ అంబాసిడర్లుగా మీరు జపాన్‌కు తిరిగిరావాలని నేను ఆకాంక్షిస్తున్నా’ అని మోడీ పేర్కొన్నారు. ఈ రెండు గొప్ప దేశాల మధ్య సంబంధాలను మరింత బలోపేతం చేయడంలో తాము కూడా పాలుపంచుకుంటుండటం తమకు గర్వకారణమని టీసీఎస్ సీఈఓ, ఎండీ ఎన్.చంద్రశేఖరన్ వ్యాఖ్యానించారు. -
సృజనాత్మక సంస్థల్లో హెచ్‌యూఎల్, టీసీఎస్
న్యూయార్క్: అభివృద్ధికి వినూత్న ఆలోచనలు సృష్టించేవిగా ఇన్వెస్టర్లు భావిస్తున్న ప్రపంచంలోని 100 అత్యంత సృజనాత్మక కంపెనీలతో ఫోర్బ్స్ రూపొందించిన జాబితాలో ఐదు భారతీయ కంపెనీలకు చోటు దక్కింది. హిందుస్థాన్ యూనిలీవర్ 14, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ 57వ ర్యాంకుల్లో నిలిచాయి. లార్సెన్ అండ్ టూబ్రో 58, సన్ ఫార్మా ఇండస్ట్రీస్ 65, బజాజ్ ఆటో 96వ స్థానాల్లో ఉన్నాయి. కాలిఫోర్నియా కేంద్రంగా గల క్లౌడ్ కంప్యూటింగ్ కంపెనీ సేల్స్‌ఫోర్స్ వరుసగా నాలుగో ఏడాదీ అగ్రస్థానాన్ని దక్కించుకుంది. ఓ కంపెనీ భవిష్యత్తులో ఎలాంటి వినూత్న ఉత్పత్తులు, సేవలను అందుబాటులోకి తెస్తుంది, ఆ కంపెనీ ప్రస్తుత వ్యాపార విలువ కంటే మున్ముందు ఎంత అధిక ఆదాయాన్ని ఆర్జిస్తుందని ఇన్వెస్టర్లు భావిస్తున్నారనే అంశాల ఆధారంగా ఇన్నోవేషన్ ప్రీమియంను లెక్కించామని ఫోర్బ్స్ తెలిపింది. హిందుస్థాన్ యూనిలీవర్‌కు 54.7 శాతం, ఐటీ దిగ్గజం టీసీఎస్‌కు 39.58 శాతం, లార్సెన్ అండ్ టూబ్రోకు 39.4 శాతం ఇన్నోవేషన్ ప్రీమియం వచ్చిందని పేర్కొంది. సన్ ఫార్మాకు 38.34 శాతం, బజాజ్ ఆటోకు 31.73 శాతం ఇన్నోవేషన్ ప్రీమియం వచ్చిందని వివరించింది. ఫోర్బ్స్ జాబితాలో చోటు లభించిన వాటిలో 41 కంపెనీలు అమెరికాకు చెందినవి కాగా మరో 29 కంపెనీలు యూరప్‌నకు చెందినవి. -
పరిశోధనలతోనే దేశ ప్రగతి
ట్రిపుల్ ఐటీ స్నాతకోత్సవంలో టీసీఎస్ ఉపాధ్యక్షుడు ఎస్. రామదొరై భవిష్యత్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీదే : కేటీఆర్ హైదరాబాద్ : నిత్య విద్యార్థిగా ఉంటేనే కెరీర్లో రాణించగలరని టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్(టీసీఎస్) ఉపాధ్యక్షుడు ఎస్.రామదొరై అన్నారు. పోటీ ప్రపంచంలో సవాళ్లను ఎదుర్కొనేందుకు సిద్ధమయ్యేలా యువత కెరీర్‌ను నిర్మించుకోవాలన్నారు. హైదరాబాద్ ట్రిపుల్ఐటీ 13వ స్నాతకోత్సవ సభకు హాజరైన రామదొరై మాట్లాడుతూ భారత్ సైన్స్‌పరంగా అభివృద్ధి చెందుతున్నా పరిశోధనల్లో చైనా కంటే వెనుకే ఉందన్నారు. రాబోయే రోజుల్లో భారత్ ‘రీసెర్స్ పవర్ హౌస్’గా ఆవిర్భవించనుందన్నారు. ఫార్మా, ఐటీ, బయోటెక్నాలజీ, ఆటోమోటివ్ రంగాలు 2015 నాటికి మరింత వృద్ధి చెందుతాయనే ఆశాభావం వ్యక్తంచేశారు. ఐటీ మంత్రి కె.తారకరామారావు మాట్లాడుతూ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో భవిష్యత్‌లో లక్షలాది ఉద్యోగాలు రాబోతున్నాయని స్పష్టంచేశారు. అవకాశాలను అందిపుచ్చుకునేందుకు విద్యార్థులు దీటుగా సిద్ధం కావాలన్నారు. ఈ కార్యక్రమంలో ట్రిపుల్ ఐటీ ఛైర్మన్ ప్రొఫెసర్ రాజరెడ్డి, డెరైక్టర్ పి.జె.నారాయణ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రాడ్యుయేషన్, పోస్టు గ్రాడ్యుయేషన్, పీహెచ్డీ పూర్తిచేసిన సుమారు 375 మంది విద్యార్థినీ, విద్యార్థులు పట్టాలు అందుకున్నారు. వీరిలో ఏడుగురు విద్యార్థులు బంగారు పతకాలు సాధించారు. బెస్ట్ ఆల్ రౌండర్-2014గా ఎంపికైన బీటెక్(సీఎస్ఈ) విద్యార్థి చెట్లూర్ మాధవన్ మలోలన్ కు పసిడి పతకం బహూకరించారు.