మార్కెట్లకు ఐటీ షేర్ల ఊతం
ఐటీ స్టాక్స్ తోడ్పాటుతో శుక్రవారం స్టాక్ మార్కెట్లు లాభాలు నమోదు చేశాయి. సెన్సెక్స్ 80 పాయింట్ల లాభంతో 25,641.56 వద్ద, నిఫ్టీ 23 పాయింట్లు పెరిగి 7,663.90 వద్ద ముగిశాయి. రెండు సూచీలూ రెండు వారాల గరిష్టంలో ముగిశాయి. మలేషియా ఎయిర్‌లైన్స్ విమానం కూల్చివేత ఘటనతో రాజకీయమైన పరిణామాలపై ఆందోళన కారణంగా శుక్రవారం ఆసియా మార్కెట్లు బలహీనపడటం దేశీ మార్కెట్లపైనా ప్రభావం చూపింది. దీంతో, దేశీ మార్కెట్లూ బలహీనంగా ప్రారంభమైనప్పటికీ.. ఆ తర్వాత పుంజుకున్నాయి.
ఒక దశలో సెన్సెక్స్ ఇంట్రాడే గరిష్టమైన 25,713 స్థాయిని కూడా తాకినా చివరికి 0.31 శాతం లాభంతో ముగిసింది. క్రితం రోజు ఐటీ దిగ్గజం టీసీఎస్ అంచనాలను మించిన ఫలితాలను వెల్లడించడంతో ఐటీ స్టాక్స్ బాగా లాభపడ్డాయి. టీసీఎస్ 2.58 శాతం, విప్రో 1.83 శాతం, ఇన్ఫోసిస్ 0.31 శాతం లాభాలు నమోదు చేశాయి. అటు బ్యాంకింగ్, క్యాపిటల్ గూడ్స్ సంస్థల షేర్లలో కొనుగోళ్లు కూడా మార్కెట్లు పెరిగేందుకు దోహదపడ్డాయి.
అయితే, ఈ మధ్య కాలంలో పెరుగుతూ వస్తున్న స్మాల్‌క్యాప్, మిడ్‌క్యాప్ స్టాక్స్‌లో రిటైల్ ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు దిగారు. మొత్తం మీద ఈ వారంలో సెన్సెక్స్ 617 పాయింట్లు పెరిగినట్లయింది. క్రూడ్ ధరలు తగ్గుతుండటం, వర్షపాతం మెరుగవుతుండటం వల్ల అధిక ద్రవ్యోల్బణ భయాలు తగ్గుముఖం పడుతుండటం వంటివి ఇందుకు దోహదపడినట్లు కోటక్ సెక్యూరిటీస్ ప్రైవేట్ క్లయింటు గ్రూప్ రీసెర్చ్ దీపేన్ షా తెలిపారు. విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు నికరంగా రూ. 574 కోట్ల కొనుగోళ్లు జరపగా, దేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు రూ. 283 కోట్ల మేర విక్రయించారు.
రూ. 5,000 కోట్ల సమీకరణలో హిందాల్కో
న్యూఢిల్లీ: ఆదిత్య బిర్లా గ్రూప్‌నకు చెందిన హిందాల్కో ఇండస్ట్రీస్ తాజాగా రూ. 5,000 కోట్ల మేర నిధులను సమీకరించనుంది. సంస్థలకు ఈక్విటీ షేర్లు, బాండ్లు జారీ ద్వారా గానీ లేదా ఇతర మార్గాల్లో గానీ సమీకరించే ప్రతిపాదనను డెరైక్టర్ల బోర్డు ఆమోదించిందని కంపెనీ తెలిపింది. ఆగస్టు 14న జరిగే సమావేశంలో దీనికి షేర్‌హోల్డర్ల అనుమతి పొందనున్నట్లు వివరించింది. హిందాల్కో ప్రధానంగా అల్యూమినియం, కాపర్ ఉత్పత్తి చేస్తోంది. ప్రపంచంలోనే అతి పెద్ద అల్యూమినియం రోలింగ్ కంపెనీ ఇది.