మార్కెట్ క్రాష్ | BSE Sensex registers biggest single-day drop, closes 414 points down on global sell-off | Sakshi
Sakshi News home page

మార్కెట్ క్రాష్

Published Sat, Aug 2 2014 12:53 AM | Last Updated on Thu, Oct 4 2018 5:15 PM

మార్కెట్ క్రాష్ - Sakshi

మార్కెట్ క్రాష్

* అంతర్జాతీయ పరిణామాలతో భారీగా పడిన సూచీలు
* సెన్సెక్స్ 414, నిఫ్టీ 119 పాయింట్లు పతనం
* 26,000 దిగువకి సెన్సెక్స్

 
అమెరికా ఫెడరల్ రిజర్వ్ ఉద్దీపన ప్యాకేజీ కోత ప్రణాళికలు, రుణాల చెల్లింపులో అర్జెంటీనా డిఫాల్టు కావడం తదితర అంతర్జాతీయ పరిణామాలు ప్రపంచ మార్కెట్లలో కలకలం రేపాయి. ఆ ప్రభావం దేశీ మార్కెట్లు, రూపాయిపైనా పడింది. అమ్మకాలు వెల్లువెత్తడంతో కీలక సూచీలు కుప్పకూలాయి. రూపాయి మూడు నెలల కనిష్టానికి పడిపోగా.. మార్కెట్లు మూడు వారాల్లో తొలిసారి అత్యధిక స్థాయి నష్టాలను నమోదు చేశాయి.
 
శుక్రవారం  సెన్సెక్స్ ఏకంగా 414 పాయింట్లు, నిఫ్టీ 119 పాయింట్లు పతనమయ్యాయి. మూడు వారాల కాలంలో సూచీలు ఇంత పెద్ద యెత్తున క్షీణించడం ఇదే ప్రథమం. జూలై 8న సెన్సెక్స్ 518 పాయింట్లు పడిన సంగతి తెలిసిందే. ఇక, తాజాగా సెన్సెక్స్ కీలకమైన 26,000 పాయింట్ల దిగువకి పడిపోయింది.  యూరోజోన్ గణాంకాలు బలహీనంగా ఉండటం, అమెరికాలో నిరుద్యోగుల సంఖ్య పెరిగిందన్న వార్తలతో ఆసియా దేశాల సూచీలు నష్టపోయాయి. అటు యూరప్‌లో సూచీలు కూడా 1.5-2 శాతం నష్టాలతో ట్రేడయ్యాయి.
 
క్రితం ముగింపుతో పోలిస్తే శుక్రవారం బలహీనంగానే ప్రారంభమైన సెన్సెక్స్.. రోజంతా నష్టాల్లోనే కొనసాగింది. ద్వితీయార్థంలో అమ్మకాలు వెల్లువెత్తాయి. చివరికి 1.6 శాతం పతనంతో 25,480.84 వద్ద ముగిసింది. అటు నిఫ్టీ సైతం 1.54 శాతం క్షీణతతో 7,602.60 పాయింట్ల దగ్గర క్లోజయ్యింది.  రైల్వే బడ్జెట్ సమర్పించిన మర్నాడు జూలై 8న నిఫ్టీ అత్యధికంగా 163.95 పాయింట్లు నష్టపోయింది.
 
ఆర్థిక అక్షరాస్యతపై ఎన్‌ఎస్‌ఈ టీవీ ప్రోగ్రాం
చిన్న పట్టణాల్లో నివసించే వారిలో ఆర్థికాంశాలపై అవ గాహన పెంచే దిశగా నేషనల్ స్టాక్ ఎక్స్చేంజీ (ఎన్‌ఎస్‌ఈ), అసోసియేషన్ ఆఫ్ నేషనల్ ఎక్స్చేంజేస్ మెంబర్స్ (ఎఎన్‌ఎంఐ) సంయుక్తంగా టీవీ కార్యక్రమాన్ని రూపొందించాయి. ‘సమృద్ధి కీ పాఠశాల’ పేరిట 26 ఎపిసోడ్స్‌ను తయారు చేశాయి. ఆగస్టు 2 నుంచి ప్రతి శనివారం ఉదయం 8.30 గం.లకు దూరదర్శన్‌లో ఈ కార్యక్రమం ప్రసారమవుతుందని ఎన్‌ఎస్‌ఈ ఒక ప్రకటనలో తెలిపింది.
 
లిస్టెడ్ సంస్థలపై కన్నేసి ఉంచండి :
స్టాక్ ఎక్స్చేంజీలకు సెబీ ఆదేశం

ముంబై: లిస్టింగ్ నిబంధనలు, గుడ్ గవర్నెన్స్ నిబంధనల ఉల్లంఘన ఉదంతాలు పెరుగుతున్న నేపథ్యంలో కంపెనీలపై ఒక కన్నేసి ఉంచాలని మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ.. స్టాక్ ఎక్స్చేంజీలను ఆదేశించింది. వార్షిక సర్వ సభ్య సమావేశాల నిర్వహణ సహా ప్రతి చిన్న విషయాన్ని నిశితంగా పరిశీలించాలని శుక్రవారం జారీచేసిన ఒక సర్క్యులర్‌లో పేర్కొంది. షేర్‌హోల్డర్లు లక్ష పైగా ఉన్నా, వారికి కనీసం మాట్లాడేందుకు కూడా అవకాశమివ్వకుండా పలు లిస్టెడ్ గ్రూప్ కంపెనీల్లోని సంస్థలు  కేవలం 15 నిమిషాల వ్యవధిలో ఏజీఎంలను ముగించేస్తున్న ఉదంతాలు తమ దృష్టికి వచ్చినట్లు సెబీ తెలిపింది.  
 
ఈయూ సంస్థలతో ఒప్పందం..
ప్రత్యామ్నాయ పెట్టుబడి ఫండ్స్‌కి (ఏఐఎఫ్) సంబంధించి యూరోపియన్ యూనియన్‌లో భాగమైన 27 స్టాక్‌మార్కెట్స్ నియంత్రణ సంస్థలతో సెబీ అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. ఆయా నియంత్రణ సంస్థలు.. ప్రత్యామ్నాయ పెట్టుబడి ఫండ్స్ మేనేజర్ల పర్యవేక్షణ సమాచారాన్ని ఇచ్చి.. పుచ్చుకునేందుకు, పరస్పరం సహకరించుకునేందుకు, ఏఐఎఫ్‌లను నిర్వహించేందుకు ఇది ఉపయోగపడుతుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement