- 261 పాయింట్ల నష్టంతో 27,177కు సెన్సెక్స్
- 91 పాయింట్లు క్షీణతతో 8,214కు నిఫ్టీ
స్టాక్ మార్కెట్ పతనం కొనసాగుతూనే ఉంది. ఎఫ్‌ఐఐల పన్ను ఆందోళనల కారణంగా విదేశీ నిధులు వెళ్లిపోతుండటంతో సోమవారం బీఎస్‌ఈ సెన్సెక్స్ 261 పాయింట్లు పతనమై 27,177 పాయింట్ల వద్ద ముగిసింది. ఇది మూడున్నర నెలల కనిష్ట స్థాయి. చివరి పది ట్రేడింగ్ సెషన్లలో ఎనిమిదింటిలో స్టాక్ మార్కెట్ నష్టాల్లోనే ముగిసింది.
ఇక నిఫ్టీ 8,334-8,202 గరిష్ట, కనిష్ట స్థాయిల మధ్య కదలాడి చివరకు 91 పాయింట్లు నష్టపోయి 8,214 పాయింట్లకు పడిపోయింది. ఎలాంటి సానుకూల సంకేతాలు లేకపోవడంతో స్టాక్ మార్కెట్ పతనం కొనసాగుతూనే ఉందని రెలిగేర్ సెక్యూరిటీస్ ప్రెసిడెంట్(రిటైల్ డిస్ట్రిబ్యూషన్) జయంత్ మాంగ్లిక్ చెప్పారు. ఏప్రిల్ ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ కాంట్రాక్టులు ఈ వారంలోనే ముగియనుండటం, కంపెనీల ఆర్థిక ఫలితాలు నిరుత్సాహకరంగా ఉండడం కూడా ప్రభావం చూపుతోందని పేర్కొన్నారు.
అన్ని రంగాల సూచీలు నష్టాల్లోనే ముగిశాయి. 30 సెన్సెక్స్ షేర్లలో 23 షేర్లు నష్టపోయాయి. టర్నోవర్ ఎన్‌ఎస్‌ఈ నగదు విభాగంలో రూ.18,946 కోట్లుగా, ఎన్‌ఎస్‌ఈ డెరివేటివ్స్ విభాగంలో రూ.3,74,772 కోట్లుగా నమోదైంది. విదేశీ ఇన్వెస్టర్లు రూ.1,749 కోట్ల నికర అమ్మకాలు జరపగా, దేశీయ ఇన్వెస్టర్లు రూ.1,668 కోట్ల నికర కొనుగోళ్లు జరిపారు.
మన్‌పసంద్ ఐపీఓకు సెబీ ఓకే
పళ్ల రసాలు తయారుచేసే మన్‌పసంద్ బేవరేజెస్ ఐపీఓకు స్టాక్ మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ ఆమోదం లభిం చింది. ఈ ఐపీఓ ద్వారా మన్‌పసంద్ బేవరేజేస్ రూ.400 కోట్లు సమీకరించనున్నది. వ్యాపార విస్తరణకు వినియో గించనుంది. ఈ ఐపీఓకు సంబంధించి ముసాయిదా పత్రాలను (డీఆర్‌హెచ్‌పీ) గతేడాది నవంబర్‌లోనే సెబీకి ఈ కంపెనీ సమర్పించింది. మ్యాంగో సిప్, యాపిల్, లిచి జ్యూస్‌లను తయారు చేస్తోన్న ఈ కంపెనీకి వడోదర, వారణాసి, డెహ్రాడూన్‌లలో ప్లాంట్‌లు ఉన్నాయి.
రూ. 100 లక్షల కోట్ల దిగువకు మార్కెట్ క్యాప్
బీఎస్‌ఈ మార్కెట్ క్యాపిటలైజేషన్ సోమవారం రూ.100 లక్షల కోట్ల మార్క్ దిగువకు పడిపోయి రూ.99,12,226 కోట్లకు తగ్గిపోయింది. ఈ నెల 15 నుంచి చూస్తే రూ.7.73 లక్షల కోట్ల ఇన్వెస్టర్ల సంపద ఆవిరైంది.
కొనసాగుతున్న పతనం
Published Tue, Apr 28 2015 1:25 AM | Last Updated on Thu, Oct 4 2018 5:15 PM
Advertisement
Advertisement