కొత్త రికార్డుల దూకుడు
248 పాయింట్ల హైజంప్
27,346 వద్దకు సెన్సెక్స్
ఇంట్రాడేలో 8,181కు నిఫ్టీ
రూ. 10 లక్షల కోట్ల భారీ టర్నోవర్
స్టాక్ మార్కెట్లో మళ్లీ సరికొత్త రికార్డుల మోతమోగింది. కొత్త గరిష్టాలను తాకడం ద్వారా సూచీలు లాభాల సంక్రాంతిని తెచ్చాయి. సెన్సెక్స్ 248 పాయింట్లు ఎగసి 27,346 వద్ద ముగిసింది. ఇంతక్రితం సెప్టెంబర్ 8న అత్యధికంగా 27,320 వద్ద ముగిసింది. ఇక ఇంట్రాడేలో సెన్సెక్స్ 27,390ను, నిఫ్టీ 8,181ను తాకాయి. ఇవి చరిత్రాత్మక గరిష్టాలుకాగా, నిఫ్టీ 79 పాయింట్లు పుంజుకుని 8,169 వద్ద స్థిరపడింది.
అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల పెంపు ఇప్పట్లోలేదని భరోసా ఇవ్వడం, సంస్కరణల కొనసాగింపులో భాగంగా ప్రభుత్వం తాజాగా నిర్మాణ రంగ ఎఫ్‌డీఐ నిబంధనలను సరళీకరించడం వంటి అంశాలు మార్కెట్లకు ప్రోత్సాహాన్నిచ్చాయ్. వరుసగా మూడు రోజుల్లో సెన్సెక్స్ దాదాపు 600 పాయింట్లు జమ చేసుకుంది. ఎఫ్‌డీఐ నిబంధనల సడలింపుతో రియల్టీ ఇండెక్స్ అత్యధికంగా 3.5% ఎగసింది. యూనిటెక్, హెచ్‌డీఐఎల్, డీఎల్‌ఎఫ్, ఇండియాబుల్స్, డీబీ 8.5-2% మధ్య పురోగమించాయి. మార్కెట్ చరిత్రలో తొలిసారి రూ. 10 లక్షల కోట్ల టర్నోవర్ జరిగింది. ఎన్‌ఎస్‌ఈ డెరివేటివ్ విభాగంలోనే రూ. 5 లక్షల కోట్లకుపైగా నమోదుకావడం విశేషం.