డాలర్లు కుమ్మరిస్తున్న విదేశీ ఇన్వెస్టర్లు
ముంబయి : దేశ ఆర్థిక వ్యవస్థలో ఒక్కసారిగా సానుకూల పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. స్టాక్ మార్కెట్లు రోజూ కొత్త రికార్డులు సృష్టిస్తున్నాయి. రూపాయి దాదాపు 60కి చేరుకుంది. రూపాయి బలపడటంతో బంగారం, పెట్రోల్ ధరలు దిగివస్తున్నాయి. నరేంద్ర మోడీ నేతృత్వంలో సుస్థిరమైన ప్రభుత్వం ఏర్పాటు చేస్తారనే అంచనా వల్ల విదేశీ ఇన్వెస్టర్లు మన మార్కెట్లలోకి డాలర్లను కుమ్మరిస్తున్నారు.
ఆరేళ్లుగా స్టాక్ మార్కెట్లు ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్నట్లు ఉండటంతో చిన్న ఇన్వెస్టర్లకు మార్కెట్లపై నమ్మకం పోయింది. యూపీఏ ప్రభుత్వ వైఫల్యాల వల్ల జీడీపీ వృద్ధిరేటు 5 శాతం లోపునకు రావడం, ధరల పెరుగుదల 10 శాతానికి చేరువలో ఉండటంతో ఆర్థిక వ్యవస్థలో డిమాండ్ పడిపోయింది. వస్తువులకు, సర్వీసులకు డిమాండ్ తగ్గడంతో కంపెనీల ఆదాయాలు, లాభాలు పడిపోయాయి.
మరో పక్క రుణ వాయిదాలు, వాటి మీద వడ్డీలు చెల్లించడం కంపెనీలకు తలకు మించిన భారమైంది. ఫలితంగా పెద్ద సంఖ్యలో ఉద్యోగాలు పోయాయి. కొత్త ఉద్యోగాలు రాడడం బాగా తగ్గిపోయింది. ఈ నేపథ్యంలో దేశ ప్రజలకు యూపీఏ ప్రభుత్వం మీద ముఖ్యంగా కాంగ్రెస్ మీద తీవ్ర ఆగ్రహం కలుగుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో నరేంద్ర మోడీకి దేశంలో సానుకూల వాతావరణం ఏర్పడింది. ఆయన నేతృత్వంలో ఎన్డీఏ కూటమి సాధారణ మెజార్టీకి చేరువ అవుతుందని అంచనాలు వస్తున్నాయి.
చాలా కాలంగా ఇండియన్ స్టాక్ మార్కెట్లు పెరగకపోవడం, ఇప్పుడు ఎన్డీఏ కూటమి సుస్థిరమైన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశాలు ఉన్నాయని సర్వేలు చెబుతుండటంతో విదేశీ ఇన్వెస్టర్లు దేశంలోకి డాలర్లను పెద్దయెత్తున తీసుకు వస్తున్నారు. ఈ కారణంగా స్టాక్ మార్కెట్లు రోజుకొక కొత్త జీవిత కాల గరిష్ఠ స్థాయిని తాకుతూ ముందుకు ఉరుకుతున్నాయి. ప్రస్తుతం సెన్సెక్స్ 22 వేల పైన ట్రేడవుతోంది.
సుస్థిర ప్రభుత్వం వస్తే డిసెంబరు నాటికి సెన్సెక్స్ సులభంగా 24 వేలను అధిగమిస్తుందని అనలిస్టులు అంచనా వేస్తున్నారు. వచ్చే ఐదేళ్ల పాటు మోడీ నేతృత్వంలో స్థిరమైన ప్రభుత్వం వస్తే సెన్సెక్స్ 40 వేలు చూసే అవకాశాలు కూడా ఉన్నాయని భావిస్తున్నారు. సుస్థిర ప్రభుత్వం కాకుండా కిచిడీ ప్రభుత్వం ఏర్పడితే సెన్సెక్స్ 10 శాతం నష్టపోయి 20 వేల లోపునకు పడిపోతుందని అనలిస్టుల అంచనా వేస్తున్నారు.