జలయోగం | Nagarjuna Sagar reservoir | Sakshi
Sakshi News home page

జలయోగం

Published Tue, Mar 29 2016 1:45 AM | Last Updated on Wed, Aug 29 2018 9:29 PM

జలయోగం - Sakshi

జలయోగం

సుంకిశాలపై మళ్లీ కదలిక మూడేళ్లు ఆలస్యం
రూ.300 కోట్లు పెరిగిన అంచనా వ్యయం

 

సిటీబ్యూరో:  నాగార్జున సాగర్ జలాశయం నుంచి నగరానికి కృష్ణా జలాల (రా వాటర్) పంపింగ్‌కు ఉద్దేశించిన సుంకిశాల ఇన్‌టేక్ వెల్ (కృష్ణా హెడ్‌వర్క్స్ పనులు) ప్రాజెక్టుపై మళ్లీ కదలిక వచ్చింది. శాసనసభలో ఇటీవల విపక్షాలు ఇదే అంశంపై సర్కారును నిలదీయడంతో ఈ ప్రాజెక్టును పూర్తి చేస్తామని ఇరిగేషన్ శాఖ మంత్రి హరీష్ రావు సభ్యులకు తెలిపారు. దీంతో ఈ ప్రాజెక్టు చర్చనీయాంశమైంది. దీనికి సంబంధించిన సమగ్ర ప్రాజెక్టు నివేదికను టాటా    కన్సల్టెన్సీ సర్వీసెస్ మూడేళ్ల క్రితమే పూర్తి చేసింది. దీనిపై రాష్ట్ర సర్కారు      మూడేళ్లుగా దృష్టి సారించకపోవడంతో అంచనా వ్యయం రూ.900 కోట్ల నుంచి రూ.1200 కోట్లకు చేరుకుంది. తీవ్ర వర్షాభావ పరిస్థితులు, వేసవిలో నీటి మట్టాలు సాగర్‌లో 465 అడుగులకు పడిపోయినప్పటికీ ఈ పథకం ద్వారా జంట నగరాలకు నీటిని తరలించే అవకాశం ఉంటుంది.

 
ఇన్‌టేక్ వెల్ ఎందుకంటే...

ప్రస్తుతం సాగర్ నీటి పారుదల కాల్వల (ఇరిగేషన్ కెనాల్స్) నుంచి కృష్ణా మొదటి, రెండో దశల ద్వారా కోదండాపూర్ (నల్లగొండ జిల్లా)కు నిత్యం 180  మిలియన్ గ్యాలన్ల నీటిని తరలిస్తున్నారు. అక్కడి నుంచి నగర శివార్లలోని సాహెబ్ నగర్ రిజర్వాయర్‌కు కృష్ణా జలాలను పంపింగ్‌చేస్తున్నారు. వర్షాభావ పరిస్థితులు, వేసవిలో నీటి మట్టాలు 510 అడుగుల దిగువకు పడిపోయినపుడు నగరానికి తాగునీటి సరఫరాపై తరచూ ఆందోళన నెలకొంటున్న విషయం విదితమే. ఈ నేపథ్యంలోనే సుంకిశాల ఇన్‌టేక్ వెల్ నిర్మాణ పథకం రూపుదిద్దుకుంది. ప్రస్తుతం నాగార్జున సాగర్ నుంచి కోదండాపూర్‌కు... అక్కడి నుంచి పుట్టంగండికి రావాటర్ పంపింగ్ చేస్తున్నారు. అటు నుంచి నగర శివారుల్లోని సాహెబ్‌నగర్ వరకు శుద్ధి చేసిన కృష్ణా జలాలు తరలిస్తున్నారు. తాజా ప్రాజెక్టు ద్వారా కోదండాపూర్‌కు 17 కిలోమీటర్ల దూరంలో ఉన్న సుంకిశాల వద్ద ఇన్‌టేక్ వెల్ నిర్మిస్తారు. ఈ ప్రాంతంలో భూమికి అత్యంత లోతున మూడు పెద్ద బావులు (జాక్‌వెల్స్) నిర్మిస్తారు. వాటికి 18 మోటార్లను ఏర్పాటు చేసి అక్కడి నుంచి రావాటర్‌ను కోదండాపూర్‌కు పంపింగ్ చేస్తారు. ఇలా చేయడం వల్ల సాగర్ నీటిమట్టం 465 అడుగులకు పడిపోయినప్పటికీ నగర తాగునీటి అవసరాలకు నీటిని తరలించవచ్చని జలమండలి అధికారులు ‘సాక్షి’కి తెలిపారు.


మూడు దశల పంపింగ్ సుంకిశాల నుంచే...
ఈ ఇన్‌టేక్ వెల్ నిర్మాణం పూర్తయితే రోజువారీగా కృష్ణా మొదటి, రెండు, మూడో దశలకు అవసరమైన 270 మిలియన్ గ్యాలన్లను సుంకిశాల నుంచే పంపింగ్‌కు అవకాశం ఉంటుంది. ఈ ప్రతిపాదనకు నీటి పారుదల శాఖ గతంలో సూత్రప్రాయంగా అంగీకరించినప్పటికీ ప్రాజెక్టు కాగితాలకే పరిమితమైంది. గతంలో దీనికి అవసరమైన రూ.900 కోట్ల రుణాన్ని జైకా (జపనీస్ ఇంటర్నేషనల్ కో-ఆపరేషన్ ఏజెన్సీ) అందజేసేందుకు ముందుకొచ్చినప్పటికీ సర్కారు దృష్టి పెట్టకపోవడంతో పనులు మొదలుకాలేదు. దీనిపై సర్కారు దృష్టి సారించడం అత్యవసరమని నీటి పారుదల శాఖ నిపుణులు చెబుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement