మా ప్రయోజనాలు కాపాడండి: సీఎం రేవంత్‌ | CM Revanth Reddy appeals to Union Water Resources Minister CR Patil | Sakshi
Sakshi News home page

మా ప్రయోజనాలు కాపాడండి: సీఎం రేవంత్‌

Published Tue, Mar 4 2025 4:08 AM | Last Updated on Tue, Mar 4 2025 11:15 AM

CM Revanth Reddy appeals to Union Water Resources Minister CR Patil

ఢిల్లీలో కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్‌ పాటిల్‌కు జ్ఞాపిక ఇస్తున్న సీఎం రేవంత్‌రెడ్డి. చిత్రంలో మంత్రి ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి

కృష్ణా జలాల్లో న్యాయమైన వాటా కేటాయించాలి

సాక్షి, న్యూఢిల్లీ: కృష్ణా, గోదావరి నదీ జలాలకు సంబంధించి తెలంగాణ ప్రయోజనాలను కాపాడాలని కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్‌ పాటిల్‌కు సీఎం    రేవంత్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. కృష్ణా నదీ పరీవాహకంలో సుమారు 70శాతం తెలంగాణలోనే ఉండగా.. 30 శాతం మాత్రమే ఏపీలో ఉందని వివరించారు.   అందువల్ల కృష్ణా జలాల్లో తెలంగాణకు న్యాయబద్ధమైన 70శాతం వాటా కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. గోదావరి నదికి సంబంధించి తెలంగాణ వాటా నికర జలాలు తేల్చిన తర్వాతే.. ఏపీ ప్రాజెక్టులపై నిర్ణయం తీసుకోవాలని కేంద్ర మంత్రి ని కోరారు. 

సోమవారం సాయంత్రం ఢిల్లీలో కేంద్ర మంత్రి సీఆర్‌ పాటిల్‌తో సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి భేటీ అయ్యారు. కృష్ణా పరీవాహక ప్రాంతం తెలంగాణలో ఎక్కువగా ఉన్నప్పటికీ... కృష్ణా నది యాజమాన్య బోర్డు (కేఆర్‌ఎంబీ) పక్షపాతంతో ఏపీకి 66శాతం, తెలంగాణకు 34శాతం నీటి కేటాయింపులు చేసిందని కేంద్ర మంత్రికి తెలిపారు. 

ఈ కేటాయింపుల వల్ల ఎన్నో ఏళ్లుగా తెలంగాణ నష్టపోతోందని.. ఈ ఏడాది సైతం ఏపీ కేటాయించిన మొత్తానికి మించి నీరు తరలించుకుపోయిందని వివరించారు. ఇక ముందు ఏపీ ఇలా వాటాకు మించి జలాలను తరలించుకు పోకుండా చూడాలని విజ్ఞప్తి చేశారు. కృష్ణా ప్రాజెక్టుల నుంచి నీటి విడుదలకు సంబంధించి వెంటనే టెలిమెట్రీ యంత్రాలను ఏర్పాటు చేయాలని.. అవసరమైతే అందుకయ్యే మొత్తాన్ని తామే భరిస్తామని కేంద్ర మంత్రికి తెలియజేశారు.

ఈ ప్రాజెక్టులకు అనుమతులు ఇప్పించండి
పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకం డీపీఆర్‌ను 2022లోనే సమర్పించినా.. అనుమతుల్లో ఆలస్యం చేస్తున్నారని కేంద్ర జల్‌శక్తి మంత్రి సీఆర్‌ పాటిల్‌కు సీఎం రేవంత్‌ వివరించారు. అదే సమయంలో న్యాయస్థానాల పరిధిలో ఉన్న అప్పర్‌ భద్ర ప్రాజెక్టుకు మాత్రం అనుమతులు ఇచ్చారన్నారు. సీతారామ ఎత్తిపోతల, సమ్మక్క సాగర్‌ బ్యారేజీలకు మాత్రం అనుమతులు ఇవ్వలేదని చెప్పారు. ఈ మూడు ప్రాజెక్టులకు కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ), సాంకేతిక సలహా మండలి (టీఏసీ) నుంచి అవసరమైన అనుమతులు ఇప్పించాలని కేంద్ర మంత్రిని కోరారు.

	CM Revanth Reddy: తెలంగాణకు నీటి వాటాపై కేంద్ర మంత్రులతో భేటీ



ఏపీ తీరు చట్టవిరుద్ధం
ఆంధ్రప్రదేశ్‌ పునర్విభజన చట్టం నిబంధనలకు విరుద్ధంగా ఏపీ ప్రభుత్వం గోదావరి–బనకచర్ల అనుసంధాన పథకానికి రూపకల్పన చేసిందని కేంద్ర మంత్రికి సీఎం రేవంత్‌ వివరించారు. ఆ పథకానికి కేంద్ర జల సంఘం, గోదావరి నది యాజమాన్య బోర్డు (జీఆర్‌ఎంబీ), కేఆర్‌ఎంబీల నుంచి ఎటువంటి అనుమతి పొందలేదని తెలిపారు. 

అపెక్స్‌ కౌన్సిల్‌లోనూ ఈ ప్రాజెక్టుపై ఎటువంటి చర్చ జరగలేదన్నారు. గోదావరిలో తెలంగాణకు సంబంధించి నికర జలాల వాటాలు తేల్చాలని.. రాష్ట్రం చేపడుతున్న ప్రాజెక్టులకు వెంటనే అనుమతులు ఇవ్వాలని కోరారు. పాలమూరు– రంగారెడ్డి, సీతారామ ఎత్తిపోతల, మోదికుంట వాగు, చనాకా కొరట బ్యారేజీ (డిస్ట్రిబ్యూషన్‌ సిస్టమ్‌), చిన్న కాళేశ్వరం (ముక్తేశ్వర) ఎత్తిపోతల పథకాలకు ‘సత్వర సాగునీటి ప్రయోజన పథకం (ఏఐబీపీ)’, ‘పీఎంఆర్‌పీ 2024’ కింద తగిన ఆర్థిక సాయం అందజేయాలని కేంద్ర మంత్రికి విజ్ఞప్తి చేశారు. 

ఇందులో భాగంగా మౌలిక వసతుల అభివృద్ధి కింద 50 సంవత్సరాల వడ్డీలేని రుణాలను ఇవ్వాలని అభ్యర్థించారు. ప్రాణహిత–చేవెళ్ల ప్రాజెక్టుకు సంబంధించి తుమ్మిడిహెట్టి వద్ద బ్యారేజీ నిర్మిస్తామని, ఈ క్రమంలో ఏర్పడే ముంపునకు సంబంధించి మహారాష్ట్ర ప్రభుత్వం నుంచి అనుమతులు ఇప్పించాలని కోరారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement