వరుసగా మూడో ఏడాది తొలి స్థానం
తర్వాతి స్థానాల్లో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఎయిర్‌టెల్
న్యూఢిల్లీ: అత్యంత విలువైన భారత బ్రాండ్‌గా టీసీఎస్ మరోసారి మొదటి స్థానంలో నిలిచింది. కాంటార్ బ్రాండ్జ్ రిపోర్ట్‌లో వరుసగా మూడో ఏడాది ఈ గుర్తింపు పొందింది. ఆ తర్వాతి స్థానాల్లో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఎయిర్‌టెల్, ఇన్ఫోసిస్, ఎస్‌బీఐ ఉన్నాయి. టీసీఎస్ బ్రాండ్ విలువ 49.7 బిలియన్ డాలర్లుగా ఈ నివేదిక తెలిపింది. గతేడాది నుంచి చూస్తే టీసీఎస్ బ్రాండ్ విలువ 16 శాతం పెరిగింది. ఏఐ, డిజిటల్ విభాగాల్లో టీసీఎస్ చేసిన పెట్టుబడులు బ్రాండ్ విలువ పెరిగేందుకు దోహదపడినట్టు తెలిపింది.
హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ 38.3 బిలియన్ డాలర్ల విలువను సొంతం చేసుకుంది. 18 బిలియన్ డాలర్ల విలువతో ఎస్‌బీఐ ఐదో స్థానంలో నిలవగా, 15.6 బిలియన్ డాలర్లతో ఐసీఐసీఐ బ్యాంక్ ఆరో స్థానంలో, 11.5 బిలియన్ డాలర్ల విలువతో ఎల్‌ఐసీ పదో స్థానంలో నిలిచాయి. గతే డాది నుంచి చూస్తే 54 బ్రాండ్లు తమ విలువను పెంచుకున్నాయి. భారత్‌లోని టాప్–75 బ్రాండ్ల విలువ అద్భుతమైన రీతిలో ఏడాదిలోనే 19 శాతం పెరిగి 450.5 బిలియన్ డాలర్లకు చేరుకున్నట్టు కాంటార్ బ్రాండ్జ్ నివేదిక వెల్లడించింది. ఆర్థిక సేవల బ్రాండ్లు ఈ జాబితాలో ప్రముఖంగా నిలిచాయి. మొత్తం బ్రాండ్ల విలువలో 17 ఆర్థిక సేవల బ్రాండ్ల రూపంలోనే 28 శాతం ఉన్నట్టు ఈ నివేదిక తెలిపింది.
జొమాటో స్పీడ్..
ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫామ్ జొమాటో చాలా వేగంగా తన విలువను రెట్టింపు చేసుకున్నట్టు కాంటార్ బ్రాండ్జ్ నివేదిక తెలిపింది. 3.5 బిలియన్ డాలర్ల విలువతో జాబితాలో 31వ స్థానాన్ని సొంతం చేసుకుంది. బజాజ్ ఆటో 20వ స్థానంలో ఉంది. మహీంద్రా అండ్ మహీంద్రా బ్రాండ్ విలువ ఏడాదిలో 78 శాతం పెరిగింది. 30వ స్థానం సొంతం చేసుకుంది. మొత్తం 1535 బ్రాండ్లకు సంబంధించి 1.41 లక్షల మంది అభిప్రాయాలను కాంటార్ సంస్థ పరిగణనలోకి తీసుకుంది.
Comments
Please login to add a commentAdd a comment