Valuable Brand
-
విలువలో టీసీఎస్ నంబర్ 1
న్యూఢిల్లీ: అత్యంత విలువైన భారత బ్రాండ్‌గా టీసీఎస్ మరోసారి మొదటి స్థానంలో నిలిచింది. కాంటార్ బ్రాండ్జ్ రిపోర్ట్‌లో వరుసగా మూడో ఏడాది ఈ గుర్తింపు పొందింది. ఆ తర్వాతి స్థానాల్లో హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఎయిర్టెల్, ఇన్ఫోసిస్, ఎస్బీఐ ఉన్నాయి. టీసీఎస్ బ్రాండ్ విలువ 49.7 బిలియన్ డాలర్లుగా ఈ నివేదిక తెలిపింది. గతేడాది నుంచి చూస్తే టీసీఎస్ బ్రాండ్ విలువ 16 శాతం పెరిగింది. ఏఐ, డిజిటల్ విభాగాల్లో టీసీఎస్ చేసిన పెట్టుబడులు బ్రాండ్ విలువ పెరిగేందుకు దోహదపడినట్టు తెలిపింది.హెచ్డీఎఫ్సీ బ్యాంక్ 38.3 బిలియన్ డాలర్ల విలువను సొంతం చేసుకుంది. 18 బిలియన్ డాలర్ల విలువతో ఎస్బీఐ ఐదో స్థానంలో నిలవగా, 15.6 బిలియన్ డాలర్లతో ఐసీఐసీఐ బ్యాంక్ ఆరో స్థానంలో, 11.5 బిలియన్ డాలర్ల విలువతో ఎల్ఐసీ పదో స్థానంలో నిలిచాయి. గతే డాది నుంచి చూస్తే 54 బ్రాండ్లు తమ విలువను పెంచుకున్నాయి. భారత్‌లోని టాప్–75 బ్రాండ్ల విలువ అద్భుతమైన రీతిలో ఏడాదిలోనే 19 శాతం పెరిగి 450.5 బిలియన్ డాలర్లకు చేరుకున్నట్టు కాంటార్ బ్రాండ్జ్ నివేదిక వెల్లడించింది. ఆర్థిక సేవల బ్రాండ్లు ఈ జాబితాలో ప్రముఖంగా నిలిచాయి. మొత్తం బ్రాండ్ల విలువలో 17 ఆర్థిక సేవల బ్రాండ్ల రూపంలోనే 28 శాతం ఉన్నట్టు ఈ నివేదిక తెలిపింది. జొమాటో స్పీడ్.. ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫామ్ జొమాటో చాలా వేగంగా తన విలువను రెట్టింపు చేసుకున్నట్టు కాంటార్ బ్రాండ్జ్ నివేదిక తెలిపింది. 3.5 బిలియన్ డాలర్ల విలువతో జాబితాలో 31వ స్థానాన్ని సొంతం చేసుకుంది. బజాజ్ ఆటో 20వ స్థానంలో ఉంది. మహీంద్రా అండ్ మహీంద్రా బ్రాండ్ విలువ ఏడాదిలో 78 శాతం పెరిగింది. 30వ స్థానం సొంతం చేసుకుంది. మొత్తం 1535 బ్రాండ్లకు సంబంధించి 1.41 లక్షల మంది అభిప్రాయాలను కాంటార్ సంస్థ పరిగణనలోకి తీసుకుంది. -
అత్యంత విలువైన భారత్ బ్రాండ్.. టాటా
న్యూఢిల్లీ: భారత అత్యంత విలువైన బ్రాండ్‌గా టాటా గ్రూప్ నిలిచింది. 2,100 కోట్ల డాలర్ల విలువతో తన అగ్రస్థానాన్ని టాటా గ్రూప్ ఈ ఏడాది కూడా నిలుపుకుందని ప్రముఖ కన్సల్టింగ్ సంస్థ బ్రాండ్ ఫైనాన్స్ తాజా నివేదిక వెల్లడించింది. భారత టాప్ 100 బ్రాండ్ల విలువ మొత్తం 9,260 కోట్ల డాలర్లని ఈ అధ్యయనం పేర్కొంది. ఈ అధ్యయనం వెల్లడించిన మరికొన్ని వివరాలు... ఏడాదికాలంలో టాటా బ్రాండ్ విలువ 300 కోట్ల డాలర్లు పెరిగింది. టాటా గ్రూప్ అంతర్జాతీయ వివిధీకరణ వ్యూహం, గ్రూప్ ప్రధాన ఐటీ కంపెనీ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్(టీసీఎస్)లు ఈ పెరుగుదలకు ప్రధాన కారణాలు. టాప్ 50 బ్రాండ్ల విలువ గత ఏడాది విలువతో పోల్చితే 10 శాతం పెరిగింది. టాటా, గోద్రేజ్, హెచ్‌సీఎల్, ఎల్ అండ్ టీ ల బ్రాండ్ విలువ చెప్పుకోదగిన స్థాయిలో పెరిగింది. హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ బ్రాండ్ విలువ 51 శాతం పెరిగింది. బలహీనమైన రుణ నియంత్రణ నిబంధనలు, నిర్వహణ తీరు సరిగ్గా లేనందున ప్రభుత్వ బ్యాంక్‌ల బ్రాండ్ విలువ తగ్గింది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాండ్ విలువ 190 కోట్ల డాలర్లు తగ్గింది. ఆదాయ అంచనాలు బాగా లేకపోవడం, మొండి బకాయిలు బ్రాండ్ విలువ తగ్గడంలో ప్రభావం చూపాయి. భారత అగ్రశ్రేణి 100 బ్రాండ్లకు సంబంధించి బ్రాండ్ విలువ, వ్యాపార విలువకు ఉన్న నిష్పత్తి సగటున 12%గా ఉంది. కొన్ని భారీ ప్రభుత్వ రంగ సంస్థలకు ఈ నిష్పత్తి 3 శాతంగా ఉంది.