సృజనాత్మక సంస్థల్లో హెచ్‌యూఎల్, టీసీఎస్
న్యూయార్క్: అభివృద్ధికి వినూత్న ఆలోచనలు సృష్టించేవిగా ఇన్వెస్టర్లు భావిస్తున్న ప్రపంచంలోని 100 అత్యంత సృజనాత్మక కంపెనీలతో ఫోర్బ్స్ రూపొందించిన జాబితాలో ఐదు భారతీయ కంపెనీలకు చోటు దక్కింది. హిందుస్థాన్ యూనిలీవర్ 14, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ 57వ ర్యాంకుల్లో నిలిచాయి. లార్సెన్ అండ్ టూబ్రో 58, సన్ ఫార్మా ఇండస్ట్రీస్ 65, బజాజ్ ఆటో 96వ స్థానాల్లో ఉన్నాయి. కాలిఫోర్నియా కేంద్రంగా గల క్లౌడ్ కంప్యూటింగ్ కంపెనీ సేల్స్‌ఫోర్స్ వరుసగా నాలుగో ఏడాదీ అగ్రస్థానాన్ని దక్కించుకుంది.
ఓ కంపెనీ భవిష్యత్తులో ఎలాంటి వినూత్న ఉత్పత్తులు, సేవలను అందుబాటులోకి తెస్తుంది, ఆ కంపెనీ ప్రస్తుత వ్యాపార విలువ కంటే మున్ముందు ఎంత అధిక ఆదాయాన్ని ఆర్జిస్తుందని ఇన్వెస్టర్లు భావిస్తున్నారనే అంశాల ఆధారంగా ఇన్నోవేషన్ ప్రీమియంను లెక్కించామని ఫోర్బ్స్ తెలిపింది. హిందుస్థాన్ యూనిలీవర్‌కు 54.7 శాతం, ఐటీ దిగ్గజం టీసీఎస్‌కు 39.58 శాతం, లార్సెన్ అండ్ టూబ్రోకు 39.4 శాతం ఇన్నోవేషన్ ప్రీమియం వచ్చిందని పేర్కొంది. సన్ ఫార్మాకు 38.34 శాతం, బజాజ్ ఆటోకు 31.73 శాతం ఇన్నోవేషన్ ప్రీమియం వచ్చిందని వివరించింది. ఫోర్బ్స్ జాబితాలో చోటు లభించిన వాటిలో 41 కంపెనీలు అమెరికాకు చెందినవి కాగా మరో 29 కంపెనీలు యూరప్‌నకు చెందినవి.