ఐటీ సేవల మార్కెట్ అంతంతే
న్యూఢిల్లీ: ఐటీ సర్వీసుల మార్కెట్ ఆశించిన దానికంటే తక్కువ వృద్ధిని సాధిస్తోందని అంతర్జాతీయ రీసెర్చ్ సంస్థ ఐడీసీ పేర్కొంది. గత ఏడాది జూలై-డిసెంబర్ కాలానికి భారత ఐటీ సర్వీసుల మార్కెట్ 6.5 శాతం వృద్ధితో రూ.2.56 లక్షల కోట్లకు పెరిగిందని ఈ సంస్థ వెల్లడించింది. మౌలిక రంగంపై ప్రభుత్వ, ప్రైవేట్ రంగాలు తక్కువగా వ్యయం చేయడం, వివిధ వాణిజ్య సంస్థలు టెక్నాలజీ బడ్జెట్‌పై ఆచి తూచి వ్యవహరించడం దీనికి ప్రధాన కారణాలని వివరించింది.
ఐడీసీ వెల్లడించిన వివరాల ప్రకారం...
గత ఏడాది రెండో అర్థ భాగంలో సపోర్ట్ సర్వీసులు 5.5 % వృద్ధి సాధించాయి. వివిధ కంపెనీలు వ్యయ నియంత్రణ పద్ధతులు పాటించడం వల్ల తక్కువ స్థాయి వృద్ధి నమోదైంది.
సిస్టమ్ ఇంటిగ్రేషన్ 6.8 శాతం, ఐటీ కన్సల్టింగ్ సర్వీసులు 6.3 శాతం చొప్పున వృద్ధి సాధించాయి. గత ఏడాది జనవరి-జూన్ కాలం వృద్ధితో పోల్చితే ఇది తక్కువే.
అవుట్ సోర్సింగ్ సర్వీసుల మార్కెట్ వృద్ధి స్వల్పంగా తగ్గి 7.1 శాతానికే పరిమితమైంది.
మేనేజ్‌డ్ సర్వీసుల మార్కెట్ స్వల్పంగా వృద్ధి సాధించింది.
ఐటీ సర్వీసుల మార్కెట్లో 12 శాతం వాటాతో ఐబీఎం మొదటి స్థానంలో నిలిచింది. 7.4 శాతం మార్కెట్ వాటాతో విప్రో రెండో స్థానంలో నిలిచింది.
గత ఏడాది జూలై-డిసెంబర్ కాలంలో బ్యాంకింగ్, ఆర్థిక సేవలు, తయారీ, టెలికాం, ప్రభుత్వ రంగాలు... ఐటీ సర్వీసులపై పెద్ద ఎత్తున దృష్టి సారించాయి.