International Data Corporation
-
పీసీ మార్కెట్ 30 శాతం డౌన్
న్యూఢిల్లీ: భారత మార్కెట్లో వ్యక్తిగత కంప్యూటర్ల (పీసీలు) రవాణా (షిప్మెంట్/విక్రేతలకు సరఫరా) జనవరి–మార్చి త్రైమాసికంలో 29.92 లక్షల యూనిట్లకు పరిమితమైంది. క్రితం ఏడాది ఇదే కాలంలో షిప్‌మెంట్‌తో పోల్చి చూసినప్పుడు 30 శాతం తగ్గిపోయింది. ఇంటర్నేషనల్ డేటా కార్పొరేషన్ (ఐడీసీ) ఈ మేరకు ప్రపంచవ్యాప్తంగా ఈ ఏడాది మొదటి త్రైమాసికం పీసీ షిప్మెంట్ వివరాలను విడుదల చేసింది. 2022 ఏడాది మొదటి మూడు నెలల్లో మన దేశ మార్కెట్లో పీసీల షిప్మెంట్ 42.82 లక్షల యూనిట్లుగా ఉంది. మార్చి త్రైమాసికంలో డెస్క్‌టాప్‌లకు డిమాండ్ ఉందని, నోట్‌బుక్‌ల డిమాండ్ మరో విడత బలహీనంగా నమోదై, క్రితం ఏడాది ఇదే త్రైమాసికంతో పోల్చినప్పుడు 41 శాతం తగ్గినట్టు ఐడీసీ నివేదిక తెలిపింది. వినియోగ డిమాండ్ 36.1 శాతం తగ్గితే, వాణిజ్య డిమాండ్ 25.1 శాతం తగ్గింది. అగ్రస్థానంలోనే హెచ్‌పీ కంపెనీ హెచ్‌పీ కంపెనీ 33.8 శాతం వాటాను పీసీ మార్కె ట్లో కలిగి ఉంది. ఈ కంపెనీ పీసీల రవాణా మార్చి త్రైమాసికంలో క్రితం ఏడాది ఇదే కాలంతో పోల్చి చూసినప్పుడు 30.2 శాతం తగ్గింది. లెనోవో చేతిలో 15.7 శాతం వాటా ఉంది. లెనోవో పీసీ షిప్మెంట్ మార్చి త్రైమాసికంలో 37.5 శాతం క్షీణించి 4.72 లక్షల యూనిట్లుగా ఉంది. డెల్ మార్కెట్ వాటా 19.4 శాతం నుంచి 13.9 శాతానికి తగ్గింది. 4.17 లక్షల పీసీలను షిప్ చేసింది. ఏసర్ గ్రూప్ వాటా 12.3 శా తంగా, ఆసుస్ మార్కెట్ వాటా 6.6 శాతం చొప్పున ఉంది. -
ఏఐ సునామీని హెచ్ఆర్ గుర్తించింది
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఇంటర్నేషనల్ డేటా కార్పొరేషన్ (ఐడీసీ) ప్రకారం భారత్‌లో ఆర్టి ఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) పరిశ్రమ 20.2 శాతం వార్షిక వృద్ధితో 2025 నాటికి 7.8 బిలియన్ డాలర్లుగా నిలుస్తుందని అంచనా. ఈ సునామీ మార్పును మానవ వనరుల విభాగాలు గుర్తించాయని అంతర్జాతీయ రిక్రూట్మెంట్ ప్లాట్‌ఫామ్ టెక్‌ఫైండర్ గ్లోబల్ మార్కెటింగ్ డైరెక్టర్ పౌల్ గై అన్నారు. హెచ్ఆర్ సవాళ్లను అధిగమించడంపై హైదరాబాద్‌లో జరిగిన సదస్సులో ఆయన మాట్లాడారు. ‘హెచ్ఆర్ రంగంలో ఏఐ అప్లికేషన్లు అమితాదరణ పొందుతున్నాయి. ప్రతిభావంతులను సొంతం చేసుకోవడమనేది సాంకేతికాధారిత హెచ్ఆర్ కార్యక్రమంగా మారింది. వ్యాపారాలలో ఏఐ వినియోగం పెరుగుతోందనడానికి ఇదే నిదర్శనం’ అని చెప్పారు. ఆర్థిక వ్యవస్ధ మందగమనం, అనిశ్చితి, నియామకాలలో మందగమనం, తగిన నైపుణ్యాలు కలిగిన ప్రతిభావంతులను ఆకర్షించడంలో పోటీ వంటివి హెచ్ఆర్ నిపుణులు ఎదుర్కొంటున్న కొన్ని సాధారణ సమస్యలని సదస్సు అభిప్రాయపడింది. -
మూడేళ్ల కనిష్టానికి దేశీ స్మార్ట్‌ఫోన్ మార్కెట్
న్యూఢిల్లీ: దేశీ స్మార్ట్‌ఫోన్ మార్కెట్ ఈ ఏడాది సెప్టెంబర్ త్రైమాసికంలో 10 శాతం క్షీణించింది. అమ్మకాలు మూడేళ్ల కనిష్టం 4.3 కోట్ల స్థాయికి పడిపోయాయి. మార్కెట్ రీసెర్చ్ సంస్థ ఇంటర్నేషనల్ డేటా కార్పొరేషన్ (ఐడీసీ) సోమవారం ఈ అంశాలు వెల్లడించింది. 2019 తర్వాత ఒక మూడో త్రైమాసికంలో ఇంత తక్కువ స్థాయి నమోదు కావడం ఇదే ప్రథమం అని తెలిపింది. బలహీనపడుతున్న డిమాండ్, పెరుగుతున్న ధరలు వెరసి పండుగ కొనుగోళ్లపై ప్రతికూల ప్రభావం చూపినట్లు వివరించింది. నిల్వలు పేరుకుపోవడం, పండుగ సీజన్ తర్వాత డిమాండ్ తగ్గుముఖం పట్టడం తదితర అంశాలతో డిసెంబర్ త్రైమాసికంలో అమ్మకాలు నెమ్మదించవచ్చని ఐడీసీ డివైజ్ రీసెర్చ్ అసోసియేట్ వైస్ ప్రెసిడెంట్ నవ్కేందర్ సింగ్ తెలిపారు. ఈ నేపథ్యంలో 2022 వార్షిక అమ్మకాలు 8–9 శాతం క్షీణించి 15 కోట్ల యూనిట్లకు పరిమితం కావచ్చని పేర్కొన్నారు. పెరుగుతున్న డివైజ్‌ల ధరలు, ఇతరత్రా ద్రవ్యోల్బణం, ఫీచర్ ఫోన్ నుండి స్మార్ట్‌ఫోన్‌కు మారడం నెమ్మదించడం తదితర అంశాలు 2023లో డిమాండ్‌కి ప్రధాన సవాళ్లుగా ఉండవచ్చని తెలిపారు. అయితే, 4జీ నుండి 5జీకి మారుతుండటం మిడ్–ప్రీమియం, అంతకు మించిన సెగ్మెంట్లలో వృద్ధికి కొంత దోహదపడవచ్చని సింగ్ వివరించారు. నివేదికలో మరిన్ని వివరాలు.. ► సెప్టెంబర్ త్రైమాసికంలో అమ్మకాల్లో ఆన్లైన్ పోర్టల్స్ వాటా అత్యధికంగా 58 శాతంగా నమోదైంది. ఈ–టెయిలర్లు పలు విడతలుగా నిర్వహించిన ’సేల్స్’ (ఫ్లిప్‌కార్ట్‌లో బిగ్ బిలియన్ డేస్, అమెజాన్‌లో గ్రేట్ ఇండియా ఫెస్టివల్ మొదలైనవి) ఇందుకు దోహదపడ్డాయి. ఆన్లైన్ ఎక్స్‌క్లూజివ్ డీల్స్, ఆఫర్లు, డిస్కౌంట్లు ఇందుకు సహాయపడ్డాయి. ఆన్‌లైన్‌తో పోటీపడుతూ డిమాండ్‌ను అందుకోవడంలో ఆఫ్‌లైన్ స్టోర్స్ విఫలమయ్యాయి. దీంతో ఆఫ్‌లైన్ విక్రయాలు 20 శాతం క్షీణించాయి. ► మీడియాటెక్ ఆధారిత స్మార్ట్ఫోన్ల మార్కెట్ వాటా 47 శాతానికి పెరిగింది. క్వాల్కామ్ వాటా 25 శాతానికి తగ్గింది. ► 21.2 శాతం వాటాతో స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌కు షావోమీ సారథ్యం వహించింది. 18.5% మార్కె ట్ వాటాతో శాంసంగ్ రెండో స్థానాన్ని తిరిగి దక్కించుకుంది. వివో (14.6%), రియల్‌మి (14.2%), ఒప్పో (12.5%) తర్వాత స్థానాల్లో ఉన్నాయి. ప్రీమియం కేటగిరీలో 63 శాతం వాటాతో యాపిల్ అగ్రస్థానంలో నిల్చింది. షావోమీ టాప్ ప్లేస్లోనే ఉన్నప్పటికీ అమ్మకాలు 18 శాతం క్షీణించాయి. మొత్తం స్మార్ట్ఫోన్ల విక్రయాల్లో 5జీ ఫోన్ల వాటా 36 శాతానికి చేరింది. 1.6 కోట్ల యూనిట్లు అమ్ముడయ్యాయి. -
గాడ్జెట్స్ మార్కెట్ జోరు,ఎక్కువగా ఏం కొంటున్నారంటే?
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దేశంలో వేరబుల్స్ (మన శరీరానికి నేరుగా కాంటాక్ట్‌తో ఉండే ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్) మార్కెట్ జోరుగా సాగుతోంది. ఈ ఏడాది ఏప్రిల్–జూన్ కాలంలో 1.12 కోట్ల యూనిట్ల స్మార్ట్‌వాచెస్, రిస్ట్ బ్యాండ్స్, ఇయర్‌వేర్ అమ్ముడయ్యాయి. ఇందులో ఇయర్‌వేర్ 92 లక్షలు, రిస్ట్ బ్యాండ్స్ 3.72 లక్షలు, స్మార్ట్‌వాచెస్ 16 లక్షల యూనిట్లు ఉంది. క్రితం ఏడాది ఇదే కాలంతో పోలిస్తే ఇది 118.2 శాతం వృద్ధి. దేశీయ కంపెనీలు పెద్ద ఎత్తున ఇయర్‌వేర్, వాచెస్ విక్రయం కారణంగా ఈ వృద్ధి సాధ్యపడిందని ఐడీసీ వెల్లడించింది. ‘2021 జనవరి–మార్చితో పోలిస్తే సెకండ్ వేవ్ మూలంగా జూన్ త్రైమాసికంలో విక్రయాలు 1.3 శాతం తగ్గాయి. గతేడాదితో పోలిస్తే మార్కెట్ ఈ ఏడాది త్వరితగతిన రికవరీ అయింది. పండుగల సీజన్లో డిమాండ్ విపరీతంగా ఉండనుంది. కంపెనీలు ఉత్పత్తుల ధరలను సవరించనున్నాయి. గతేడాదితో పోలిస్తే 2021 జూలై–డిసెంబరు కాలంలో 35 శాతం అధికంగా అమ్మకాలు నమోదయ్యే అవకాశం ఉంది. రిస్ట్‌వేర్ విభాగంలో వాచెస్ వాటా ఏకంగా 81.2 శాతం ఉంది. ఈ విభాగం మరింత పుంజుకోనుంది. రిస్ట్‌వేర్ విభాగం 35 శాతం వృద్ధి చెందింది. ఇయర్‌వేర్ రెండింతలైంది. యూనిట్ల పరంగా ఈ విభాగానిదే పైచేయి’ అని ఐడీసీ వివరించింది. -
డెస్క్‌టాప్స్ మళ్లీ ఊపందుకున్నాయ్..
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ల్యాప్టాప్స్ వచ్చాక డెస్క్‌టాప్ కంప్యూటర్ల ప్రాభవం క్రమంగా తగ్గుతూ వస్తోంది. కార్యాలయాల్లో మాత్రం ఇప్పటికీ డెస్క్టాప్స్ను వినియోగిస్తున్నారు. కొన్నేళ్లుగా సంప్రదాయ డెస్క్‌టాప్ పీసీల స్థానాన్ని ఆల్ ఇన్ వన్ డెస్క్‌టాప్‌లు ఆక్రమించుకుంటున్నాయి. అయితే భారత్‌లో ఈ ఏడాది జనవరి–మార్చిలో పర్సనల్ కంప్యూటర్ల (పీసీ) అమ్మకాలను పరిశీలిస్తే ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి. ఆల్ ఇన్ వన్స్‌తో కలిపి డెస్క్‌టాప్ పీసీల విక్రయాలు సుమారు 5.2 లక్షల యూనిట్లు నమోదయ్యాయి. 2020 జనవరి–మార్చితో పోలిస్తే ఇది దాదాపు 50 శాతం అధికం. వర్క్ ఫ్రమ్ హోమ్, ఆన్లైన్ తరగతుల మూలంగా వీటికి తిరిగి డిమాండ్ వచ్చింది. విద్యార్థుల కోసం గతేడాది ట్యాబ్లెట్ పీసీలను ఎంచుకున్న కస్టమర్లు ఈ ఏడాది డెస్క్‌టాప్‌లకు మళ్లారని మార్కెట్ వర్గాలు అంటున్నాయి. ఆఫ్‌లైన్‌లోనే అధికం.. ఆల్ ఇన్ వన్స్ పూర్తిగా వ్యవస్థీకృత రంగానిదే. ఈ విభాగంలో హెచ్‌పీ, డెల్, లెనోవో, ఏసర్, ఆసస్ బ్రాండ్స్ పోటీపడుతున్నాయి. ఇక డెస్క్‌టాప్స్‌లో అసెంబుల్డ్ వాటా 65–70 శాతం, మిగిలినది బ్రాండెడ్ కంపెనీలది. వీటికి కావాల్సిన విడిభాగాలను 100 వరకు టాప్ బ్రాండ్లు, 250 దాకా లోకల్ బ్రాండ్స్ సరఫరా చేస్తున్నాయి. 95 శాతం డెస్క్‌టాప్స్ అమ్మకాలు ఆఫ్‌లైన్‌లోనే జరుగుతున్నాయి. డెస్క్‌టాప్స్ రూ.17,000ల నుంచి రూ.65,000 వరకు లభిస్తాయి. ఆల్ ఇన్ వన్స్ ధరల శ్రేణి రూ.24–70 వేల వరకు ఉంది. గేమింగ్ శ్రేణి రూ.45,000 నుంచి రూ.2.5 లక్షల వరకు ఉంటుంది. ల్యాప్టాప్స్ రూ.20 వేల నుంచి లభిస్తాయి. ఇదీ పీసీ మార్కెట్.. దేశవ్యాప్తంగా 2021 జనవరి–మార్చిలో సుమారు 31 లక్షల ల్యాప్టాప్స్, డెస్క్‌టాప్స్, వర్క్‌స్టేషన్స్ అమ్ముడయ్యాయి. తొలి త్రైమాసికంలో ఈ స్థాయి విక్రయాలు నమోదు కావడం ఇదే తొలిసారి. 2020 క్యూ1తో పోలిస్తే 73.1 శాతం వృద్ధి నమోదైందని ఇంటర్నేషనల్ డేటా కార్పొరేషన్ చెబుతోంది. పీసీ మార్కెట్లో 75 శాతంపైగా వాటాతో దూసుకెళ్తున్న ల్యాప్టాప్స్ అమ్మకాలు 116.7 శాతం అధికమయ్యాయి. తొలి స్థానంలో ఉన్న హెచ్‌పీ వాటా 32.9 శాతంగా ఉంది. రెండవ స్థానంలో నిలిచిన డెల్ టెక్నాలజీస్ 21.8 శాతం వాటా కైవసం చేసుకుంది. లెనోవో 20.1 శాతం, ఏసర్ గ్రూప్‌నకు 7.7 శాతం వాటా ఉంది. పరిశ్రమలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో జరిగే అమ్మకాలు 10 శాతం ఉంటాయని పరిశ్రమ వర్గాల సమాచారం. అప్‌గ్రేడ్‌కు అనువైనవి.. గతేడాది ఒక్కసారిగా ఆన్లైన్ క్లాసులు తెరపైకి రావడంతో కస్టమర్లు ట్యాబ్లెట్ పీసీలు, స్మార్ట్ఫోన్లను కొన్నారు. దీర్ఘకాలిక వినియోగాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ ఏడాది డెస్క్టాప్స్కు మళ్లారు. వర్క్ ఫ్రమ్ హోమ్ చేసే ఉద్యోగులు సైతం వీటిని ఎంచుకుంటున్నారు. అప్‌గ్రేడ్ విషయంలో ల్యాప్‌టాప్‌తో పోలిస్తే డెస్క్‌టాప్ అనువైనది. కొత్త టెక్నాలజీకి తగ్గట్టుగా హార్డ్ డిస్క్, ర్యామ్, గ్రాఫిక్స్ కార్డ్, ఎస్ఎస్డీ సులువుగా మార్చుకోవచ్చు. నచ్చిన సైజులో స్క్రీన్‌ను, కావాల్సిన కెమెరాను అమర్చుకోవచ్చు. పైగా దీర్ఘకాలిక మన్నిక కూడా. – అహ్మద్, ఎండీ, ఐటీ మాల్ -
పదేళ్లు పన్ను మినహాయింపు!!
న్యూఢిల్లీ: కరోనా వైరస్ దెబ్బతో అస్తవ్యస్తమవుతున్న ఆర్థిక వ్యవస్థకు ఊతమిచ్చే క్రమంలో... భారీగా పెట్టుబడులను ఆకర్షించడంపై కేంద్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఇందులో భాగంగా కొత్తగా ఇన్వెస్ట్ చేసే కంపెనీలకు ట్యాక్స్ హాలిడే ఇవ్వాలని భావిస్తోంది. కేంద్ర వాణిజ్య శాఖ ఈ మేరకు కొన్ని ప్రతిపాదనలు చేసినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. వీటి ప్రకారం.. 500 మిలియన్ డాలర్లకు పైగా కొత్త పెట్టుబడులు పెట్టే కంపెనీలకు 10 ఏళ్ల పాటు పూర్తిగా పన్ను మినహాయింపులు ఇచ్చే అంశాన్ని కేంద్ర ఆర్థిక శాఖ పరిశీలిస్తోంది. వైద్య పరికరాలు, ఎలక్ట్రానిక్స్, భారీ యంత్రాలు, టెలికం పరికరాల ఉత్పత్తి తదితర రంగాలకు దీన్ని వర్తింపచేసే అవకాశం ఉంది. ఈ ప్రతిపాదన కింద ఇన్వెస్ట్ చేసే సంస్థలు.. జూన్ 1 నుంచి మూడేళ్లలోగా కార్యకలాపాలు ప్రారంభించాల్సి ఉంటుంది. 100 మిలియన్ డాలర్లు.. నాలుగేళ్లు ... ఇక కార్మికులు ఎక్కువగా అవసరమయ్యే రంగాల్లో 100 మిలియన్ డాలర్లు.. ఆపైన ఇన్వెస్ట్ చేసే సంస్థలకు నాలుగేళ్ల పాటు పన్ను మినహాయింపులు లభిస్తాయి. ఆ తర్వాత ఆరేళ్ల పాటు తక్కువ స్థాయిలో 10% కార్పొరేట్ ట్యాక్స్ రేటు వర్తిస్తుంది. టెక్స్టైల్స్, ఫుడ్ ప్రాసెసింగ్, లెదర్, ఫుట్‌వేర్ తదితర రంగాలు ఈ జాబితాలోకి వస్తాయి. ప్రస్తుతం పరిశ్రమలకు ఇస్తున్న ప్రోత్సాహకాలకు తాజా మినహాయింపులు అదనం. ఈ ప్రతిపాదనలపై ఆర్థిక శాఖ ఇంకా నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. సమగ్ర అభివృద్ధిపై దృష్టి.. ప్రధానంగా టెక్స్టైల్స్, ఫార్మా, ఫుడ్ ప్రాసెసింగ్, వజ్రాభరణాలు వంటి రంగాలతో పాటు వివిధ పరిశ్రమల సమగ్ర అభివృద్ధిపై కేంద్రం వాణిజ్య శాఖ దృష్టి పెడుతోంది. సేవల రంగానికి చెందిన టూరిజం వంటి విభాగాలను కూడా ఈ జాబితాలో చేర్చడంపై కసరత్తు చేస్తోంది. ప్రస్తుత మౌలిక సదుపాయాలు, టెస్టింగ్ ల్యాబ్‌లు, పరిశోధన.. అభివృద్ధి కేంద్రాల అప్‌గ్రెడేషన్ కోసం 50 పారిశ్రామిక క్లస్టర్లను వాణిజ్య శాఖ గుర్తించింది. చైనా నుంచి భారత్‌కు కంపెనీలు.. ఎన్నో ఉత్పత్తుల కోసం ప్రపంచదేశాలు చైనాపైనే అధికంగా ఆధారపడడం వల్ల వైరస్ విస్తరణకు దారితీయడంతోపాటు.. సరఫరా పరంగా తీవ్ర ఇబ్బందుల పాలవ్వాల్సి వచ్చింది. దీంతో ఇన్వెస్టర్లు చైనాపైనే పూర్తిగా ఆధారపడిపోకుండా ప్రత్యామ్నాయంగా ఇతర దేశాల్లోనూ తయారీ యూనిట్ల ఏర్పాటుకు మొగ్గుచూపిస్తున్నారు. ఈ నేపథ్యంలో.. చైనాకు దూరమయ్యే ఆలోచనలో ఉన్న ఇన్వెస్టర్లను భారత్ వైపు ఆకర్షించేందుకు కేంద్రం కసరత్తు చేస్తోంది. భారత్‌లో ఫ్యాక్టరీలు ఏర్పాటు చేసే సంస్థలకు స్థల సమీకరణను సులభతరం చేయడం, కొత్త ప్లాంట్లకు పన్నుపరమైన రాయితీలివ్వడం తదితర చర్యలు తీసుకుంటోంది. ‘‘ఎన్నో చర్యల దిశగా పనిచేస్తున్నాం. రాష్ట్రాలు భూముల అందుబాటు వివరాలను సిద్ధం చేసి ఇస్తే, వాటిని ఆసక్తిగల ఇన్వెస్టర్ల ముందు ఉంచుతాం’’ అని ఈ వ్యవహారంతో సంబంధం కలిగిన ఓ సీనియర్ అధికారి ఇటీవల తెలిపారు. బహుళజాతి సంస్థలు చైనా నుంచి పూర్తిగా బయటకు వచ్చే ఆలోచనలో లేవని, కాకపోతే ప్రత్యామ్నాయాల వైపు చూస్తున్నాయని, వారికి భారత్ ఆకర్షణీయ కేంద్రం అవుతుందని మరో అధికారి అభిప్రాయపడ్డారు. నిర్ణీత సమయంలోగా నిర్ణయాలు తీసుకోవడంతోపాటు, సకాలంలో అన్ని అనుమతులను ఇచ్చే విధంగా కేంద్ర, రాష్ట్ర అధికారులను బాధ్యులను చేయాలని ఎగుమతుల సమాఖ్య (ఎఫ్ఐఈవో) ప్రెసిడెంట్ శరద్ సరాఫ్ అభిప్రాయపడ్డారు. భారత్ వైపు.. యాపిల్ చూపు.. టెక్ దిగ్గజం యాపిల్ కూడా చైనాలోని తమ ఉత్పత్తి కార్యకలాపాల్లో అయిదో వంతు భాగాన్ని భారత్‌కు మళ్లించాలని యోచిస్తోంది. దేశీయంగా తయారీ రంగానికి ఊతమిచ్చే ఉద్దేశంతో భారత్ అమలు చేస్తున్న ఉత్పత్తిపరమైన ప్రోత్సాహకాల ప్రయోజనాలు పొందాలని భావిస్తోంది. ప్రస్తుతం యాపిల్ స్మార్ట్ఫోన్లు, ఇతర ఉత్పత్తులను ఫాక్స్‌కాన్, విస్ట్రాన్ సంస్థలు కాంట్రాక్టు ప్రాతిపదికన తయారు చేసి అందిస్తున్నాయి. దాదాపు 40 బిలియన్ డాలర్ల విలువ చేసే స్మార్ట్ఫోన్లను విదేశీ మార్కెట్లకు ఎగుమతి చేయడం కోసం భారత్‌లో తయారు చేసేందుకు .. ఈ కాంట్రాక్టర్లను యాపిల్ ఉపయోగించుకునే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఇంటర్నేషనల్ డేటా కార్పొరేషన్ (ఐడీసీ) లెక్కల ప్రకారం.. గత త్రైమాసికంలో ప్రీమియం స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో యాపిల్ 62.7 శాతం వాటా దక్కించుకుంది. దేశీయంగా రీసెల్లర్స్ ద్వారానే విక్రయిస్తున్న యాపిల్.. సొంతంగా కూడా స్టోర్స్ ఏర్పాటు చేసే యోచనలో ఉంది. 2021 నాటికి తొలి యాపిల్ రిటైల్ స్టోర్ ప్రారంభిస్తామని ఇటీవలే సంస్థ సీఈవో టిమ్ కుక్ చెప్పారు. ప్రస్తుతం భారత్‌లో ఐఫోన్ 7, ఐఫోన్ ఎక్స్ఆర్ స్మార్ట్ఫోన్లు తయారవుతున్నాయి. చిన్న వ్యాపారాలు, తయారీకి ప్యాకేజీ దన్ను ... కరోనా కష్టం నుంచి ఆర్థిక వ్యవస్థను గట్టెక్కించడానికి ప్రధాని మోదీ మంగళవారం ప్రకటించిన రూ. 20 లక్షల కోట్ల ఉద్దీపన ప్యాకేజీలో చిన్న పరిశ్రమలకు పన్నుల రూపంలో ప్రయోజనం కల్పించడమే కాకుండా, దేశీయ తయారీ రంగానికి ఊతం కూడా ఉంటుందని విశ్లేషకులు భావిస్తున్నారు. కరోనా ఇబ్బందుల్లో నుంచి ఆర్థిక వ్యవస్థలను గట్టెక్కించడానికి ఇప్పటికే అమెరికా తమ జీడీపీలో 13% ప్యాకేజ్ని ప్రకటించగా, జపాన్ విషయంలో ఇది 21%. మోదీ ప్రకటించిన ప్యాకేజీ కూడా ఇదే తరహా భారీ ప్యాకేజ్ కిందకు వస్తుందని నిపుణులు పేర్కొంటున్నారు. భారత్ తనంతట తానుగా నిలదొక్కుకోడానికి దోహదపడే ప్యాకేజ్‌లో ఇప్పటికే కేంద్రం ప్రకటించిన 1.7 లక్షల కోట్ల ప్యాకేజీ అలాగే ఆర్బీఐ ద్రవ్య, వడ్డీరేట్ల పరమైన ప్రయోజనలు కలిపి ఉన్నాయి. భూ, కార్మిక, ద్రవ్య, న్యాయ పరమైన అంశాలు ప్యాకేజ్‌లో ఇమిడి ఉంటాయని మోదీ తన మంగళవారంనాటి ప్రసంగంలో పేర్కొన్నారు. మొత్తంగా కరోనాను ఎదుర్కొనే విషయంలో మోదీ ప్రకటించిన ప్యాకేజీ సమగ్ర స్వరూపాన్ని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బుధవారం నుంచి వెల్లడించనున్నారు. -
దేశీ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్స్ ‘స్విచ్ ఆఫ్’
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: మీకు గుర్తుందా.. దేశీయ మొబైల్ ఫోన్ బ్రాండ్లు రూ.5 వేలలోపే స్మార్ట్ఫోన్లను అందించి భారత్‌లో సంచలనం సృష్టించాయి. ధరల పరంగా, ఫీచర్లతో దిగ్గజ బ్రాండ్లకు వణుకు పుట్టించాయి. ఒకానొక దశలో మొత్తం మార్కెట్లో దేశీయ బ్రాండ్లదే సింహభాగం. ఇదంతా గతం. ఇప్పుడు సీన్ రివర్స్ అయింది. దేశీయ బ్రాండ్లు కనుమరుగయ్యాయి. భారత స్మార్ట్‌ఫోన్ మార్కెట్ అనూహ్యంగా విదేశీ కంపెనీల చేతుల్లోకి వెళ్లిపోయింది. ఒకప్పుడు రిటైల్ స్టోర్లలో ఎంత కాదన్నా 30కిపైగా బ్రాండ్ల ఫోన్లు లభించేవి. ఇప్పుడీ సంఖ్య 10లోపే పరిమితం అయిందంటే అతిశయోక్తి కాదు. అది కూడా పరాయి దేశానికి చెందిన బ్రాండ్లే ఉంటున్నాయి. దేశీయ మొబైల్ బ్రాండ్స్ చాలామటుకు యాక్సెసరీస్ వ్యాపారంలో భవిష్యత్‌ను వెతుక్కుంటున్నాయి. ఇదీ స్మార్ట్‌ఫోన్ మార్కెట్.. ఇంటర్నేషనల్ డేటా కార్పొరేషన్ (ఐడీసీ) లెక్కల ప్రకారం భారత్‌లో 2018లో 14.23 కోట్ల స్మార్ట్ఫోన్లు అమ్ముడయ్యాయి. అంత క్రితం ఏడాదితో పోలిస్తే ఇది 14.5 శాతం అధికం. ఇప్పటి వరకు దేశంలో ఈ స్థాయి అమ్మకాలు జరగడం ఇదే తొలిసారి. ఇక ఫీచర్ ఫోన్ల విక్రయాలు క్రమంగా తగ్గుతూ 8.8 కోట్లకు చేరుకున్నాయి. స్మార్ట్‌ఫోన్స్ యూనిట్ల పరంగా 2018లో షావొమీ(28.9 శాతం), శామ్సంగ్(22.4), వివో(14.2), ఒప్పో(7.2 శాతం) వాటాను దక్కించుకున్నాయని ఐడీసీ చెబుతోంది. వన్‌ప్లస్, లెనోవో, మోటో, హానర్, నోకియా తదితర బ్రాండ్లు వీటితో పోటీపడుతున్నాయి. రెనో పేరుతో ఒప్పో, ఐక్యూ పేరుతో వివో సబ్ బ్రాండ్లను భారత్‌లో పరిచయం చేయబోతున్నాయి. పోకో సబ్ బ్రాండ్‌ను షావొమీ, రియల్మీ సబ్ బ్రాండ్‌ను ఒప్పో ఇప్పటికే రంగంలోకి దింపాయి. 2019లో స్మార్ట్‌ఫోన్ విపణి వృద్ధి రేటు సింగిల్ డిజిట్‌కు పరిమితం అవుతుందని శామ్సంగ్ ఇండియా జీఎం ఆదిత్య బబ్బర్ సాక్షి బిజినెస్ బ్యూరోకు తెలిపారు. సంఖ్యా పరంగా మార్కెట్ పెద్దది అవడం, అప్‌గ్రేడ్ సైకిల్ మందగించడం ఇందుకు కారణమని చెప్పారు. ఎందుకిలా జరిగిందంటే.. గతంలో రూ.6 వేలలోపు స్మార్ట్ఫోన్ల హవా ఉండేది. ఇప్పుడు వీటి అమ్మకాలు 70 శాతంపైగా పడిపోయాయి. 2017 వరకు రూ.10 వేల లోపు విభాగంలో దేశీ బ్రాండ్లు తమ సత్తా చాటాయి. ఇప్పుడు శామ్సంగ్ సహా విదేశీ దిగ్గజ కంపెనీలు ఈ ధరలో ఆకట్టుకునే ఫీచర్లతో మోడళ్లను తీసుకు రావడంతో మార్కెట్ ఒక్కసారిగా మారిపోయింది. ఆన్లైన్లో ఎక్స్‌క్లూజివ్ మోడళ్లతోనూ ఈ కంపెనీలు క్రమంగా సేల్స్ పెంచుకున్నాయి. ఇక్కడ ఇంకో విషయమేమంటే రూ.15 వేలలోపు శ్రేణిలో సేల్స్ 60 శాతం ఉంటున్నాయి. కారణాలేవైనా భారత స్మార్ట్‌ఫోన్ విపణి నుంచి ప్రీమియం బ్రాండ్లు అయిన హెచ్‌టీసీ, బ్లాక్‌బెర్రీ, సోనీ తప్పుకున్నాయి. భారత్‌లో ఆపిల్‌కు ఆదరణ తగ్గకపోవడం విశేషం. శామ్సంగ్ దక్షిణ కొరియా కంపెనీ కాగా, మిగిలిన టాప్–3 కంపెనీలు చైనాకు చెందినవి. తమ స్టోర్లలో ప్రస్తుతం డిమాండ్ ఉన్న 8–10 విదేశీ బ్రాండ్ల మోడళ్లు మాత్రమే అమ్మకానికి ఉంచినట్టు హ్యాపీ మొబైల్స్ సీఎండీ కృష్ణ పవన్ చెప్పారు. -
ఐటీ సేవల మార్కెట్ అంతంతే
న్యూఢిల్లీ: ఐటీ సర్వీసుల మార్కెట్ ఆశించిన దానికంటే తక్కువ వృద్ధిని సాధిస్తోందని అంతర్జాతీయ రీసెర్చ్ సంస్థ ఐడీసీ పేర్కొంది. గత ఏడాది జూలై-డిసెంబర్ కాలానికి భారత ఐటీ సర్వీసుల మార్కెట్ 6.5 శాతం వృద్ధితో రూ.2.56 లక్షల కోట్లకు పెరిగిందని ఈ సంస్థ వెల్లడించింది. మౌలిక రంగంపై ప్రభుత్వ, ప్రైవేట్ రంగాలు తక్కువగా వ్యయం చేయడం, వివిధ వాణిజ్య సంస్థలు టెక్నాలజీ బడ్జెట్‌పై ఆచి తూచి వ్యవహరించడం దీనికి ప్రధాన కారణాలని వివరించింది. ఐడీసీ వెల్లడించిన వివరాల ప్రకారం... గత ఏడాది రెండో అర్థ భాగంలో సపోర్ట్ సర్వీసులు 5.5 % వృద్ధి సాధించాయి. వివిధ కంపెనీలు వ్యయ నియంత్రణ పద్ధతులు పాటించడం వల్ల తక్కువ స్థాయి వృద్ధి నమోదైంది. సిస్టమ్ ఇంటిగ్రేషన్ 6.8 శాతం, ఐటీ కన్సల్టింగ్ సర్వీసులు 6.3 శాతం చొప్పున వృద్ధి సాధించాయి. గత ఏడాది జనవరి-జూన్ కాలం వృద్ధితో పోల్చితే ఇది తక్కువే. అవుట్ సోర్సింగ్ సర్వీసుల మార్కెట్ వృద్ధి స్వల్పంగా తగ్గి 7.1 శాతానికే పరిమితమైంది. మేనేజ్డ్ సర్వీసుల మార్కెట్ స్వల్పంగా వృద్ధి సాధించింది. ఐటీ సర్వీసుల మార్కెట్లో 12 శాతం వాటాతో ఐబీఎం మొదటి స్థానంలో నిలిచింది. 7.4 శాతం మార్కెట్ వాటాతో విప్రో రెండో స్థానంలో నిలిచింది. గత ఏడాది జూలై-డిసెంబర్ కాలంలో బ్యాంకింగ్, ఆర్థిక సేవలు, తయారీ, టెలికాం, ప్రభుత్వ రంగాలు... ఐటీ సర్వీసులపై పెద్ద ఎత్తున దృష్టి సారించాయి. -
స్మార్ట్ఫోన్లు పెరుగుతున్నాయ్..
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: అంతర్జాతీయగా స్మార్ట్ఫోన్ల అమ్మకాలు జనవరి-మార్చి త్రైమాసికంలో 28.6 శాతం పెరిగి 28.15 కోట్లకు చేరుకున్నాయి. 2013 నాల్గవ త్రైమాసికంలో జరిగిన 28.96 కోట్ల యూనిట్లతో పోలిస్తే ఈ సంఖ్య 2.8 శాతం తక్కువ. అయితే 2013 తొలి త్రైమాసికంలో మొత్తం అమ్ముడైన ఫోన్లలో స్మార్ట్ఫోన్ల వాటా 50.7 శాతం. ఈ ఏడాది ఇది 62.7 శాతానికి ఎగబాకిందని పరిశోధనా సంస్థ ఇంటర్నేషనల్ డేటా కార్పొరేషన్(ఐడీసీ) వెల్లడించింది. అభివృద్ధి చెందుతున్న దేశాల నుంచి విపరీతమైన డిమాండ్, అందుబాటు ధరలో లభించడం, 4జీ సేవలు విస్తరించడం అమ్మకాల జోష్‌కు ప్రధాన కారణాలు. స్మార్ట్ఫోన్లలో 40 శాతం చైనా కస్టమర్లు చేజిక్కించుకున్నారు. శాంసంగ్‌దే హవా.. కంపెనీల వారీగా చూస్తే స్మార్ట్ఫోన్ల అమ్మకాల్లో శాంసంగ్ అగ్రస్థానంతో 30.2 శాతం వాటా కైవసం చేసుకుంది. ఆపిల్ 15.5, హువావె 4.9 శాతంతో ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. ఆపిల్ తొలిసారిగా ఒక త్రైమాసికంలో 4 కోట్ల యూనిట్ల మార్కును దాటింది. భారత్‌తోసహా చైనా, జపాన్, బ్రెజిల్, ఇండోనేసియా మార్కెట్లలో ఆపిల్ రెండంకెల వృద్ధి నమోదు చేసింది. ఇక 2013 జనవరి-మార్చితో పోలిస్తే ఈ ఏడాది 3.9 శాతం వృద్ధితో ఫీచర్, స్మార్ట్ఫోన్లు మొత్తం 44.86 కోట్ల యూనిట్లు విక్రయమయ్యాయి. శాంసంగ్ 10.89 కోట్లు, నోకియా 5.05 కోట్లు, ఆపిల్ 4.37 కోట్ల పీసులతో అగ్రస్థానంలో ఉన్నాయి.