హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: మీకు గుర్తుందా.. దేశీయ మొబైల్ ఫోన్ బ్రాండ్లు రూ.5 వేలలోపే స్మార్ట్‌ఫోన్లను అందించి భారత్‌లో సంచలనం సృష్టించాయి. ధరల పరంగా, ఫీచర్లతో దిగ్గజ బ్రాండ్లకు వణుకు పుట్టించాయి. ఒకానొక దశలో మొత్తం మార్కెట్లో దేశీయ బ్రాండ్లదే సింహభాగం. ఇదంతా గతం. ఇప్పుడు సీన్ రివర్స్ అయింది. దేశీయ బ్రాండ్లు కనుమరుగయ్యాయి. భారత స్మార్ట్‌ఫోన్ మార్కెట్ అనూహ్యంగా విదేశీ కంపెనీల చేతుల్లోకి వెళ్లిపోయింది. ఒకప్పుడు రిటైల్ స్టోర్లలో ఎంత కాదన్నా 30కిపైగా బ్రాండ్ల ఫోన్లు లభించేవి. ఇప్పుడీ సంఖ్య 10లోపే పరిమితం అయిందంటే అతిశయోక్తి కాదు. అది కూడా పరాయి దేశానికి చెందిన బ్రాండ్లే ఉంటున్నాయి. దేశీయ మొబైల్ బ్రాండ్స్ చాలామటుకు యాక్సెసరీస్ వ్యాపారంలో భవిష్యత్‌ను వెతుక్కుంటున్నాయి.
ఇదీ స్మార్ట్‌ఫోన్ మార్కెట్..
ఇంటర్నేషనల్ డేటా కార్పొరేషన్ (ఐడీసీ) లెక్కల ప్రకారం భారత్‌లో 2018లో 14.23 కోట్ల స్మార్ట్‌ఫోన్లు అమ్ముడయ్యాయి. అంత క్రితం ఏడాదితో పోలిస్తే ఇది 14.5 శాతం అధికం. ఇప్పటి వరకు దేశంలో ఈ స్థాయి అమ్మకాలు జరగడం ఇదే తొలిసారి. ఇక ఫీచర్ ఫోన్ల విక్రయాలు క్రమంగా తగ్గుతూ 8.8 కోట్లకు చేరుకున్నాయి. స్మార్ట్‌ఫోన్స్ యూనిట్ల పరంగా 2018లో షావొమీ(28.9 శాతం), శామ్‌సంగ్(22.4), వివో(14.2), ఒప్పో(7.2 శాతం) వాటాను దక్కించుకున్నాయని ఐడీసీ చెబుతోంది. వన్‌ప్లస్, లెనోవో, మోటో, హానర్, నోకియా తదితర బ్రాండ్లు వీటితో పోటీపడుతున్నాయి. రెనో పేరుతో ఒప్పో, ఐక్యూ పేరుతో వివో సబ్ బ్రాండ్లను భారత్‌లో పరిచయం చేయబోతున్నాయి. పోకో సబ్ బ్రాండ్‌ను షావొమీ, రియల్‌మీ సబ్ బ్రాండ్‌ను ఒప్పో ఇప్పటికే రంగంలోకి దింపాయి. 2019లో స్మార్ట్‌ఫోన్ విపణి వృద్ధి రేటు సింగిల్ డిజిట్‌కు పరిమితం అవుతుందని శామ్‌సంగ్ ఇండియా జీఎం ఆదిత్య బబ్బర్ సాక్షి బిజినెస్ బ్యూరోకు తెలిపారు. సంఖ్యా పరంగా మార్కెట్ పెద్దది అవడం, అప్‌గ్రేడ్ సైకిల్ మందగించడం ఇందుకు కారణమని చెప్పారు.
ఎందుకిలా జరిగిందంటే..
గతంలో రూ.6 వేలలోపు స్మార్ట్‌ఫోన్ల హవా ఉండేది. ఇప్పుడు వీటి అమ్మకాలు 70 శాతంపైగా పడిపోయాయి. 2017 వరకు రూ.10 వేల లోపు విభాగంలో దేశీ బ్రాండ్లు తమ సత్తా చాటాయి. ఇప్పుడు శామ్‌సంగ్ సహా విదేశీ దిగ్గజ కంపెనీలు ఈ ధరలో ఆకట్టుకునే ఫీచర్లతో మోడళ్లను తీసుకు రావడంతో మార్కెట్ ఒక్కసారిగా మారిపోయింది. ఆన్‌లైన్‌లో ఎక్స్‌క్లూజివ్ మోడళ్లతోనూ ఈ కంపెనీలు క్రమంగా సేల్స్ పెంచుకున్నాయి. ఇక్కడ ఇంకో విషయమేమంటే రూ.15 వేలలోపు శ్రేణిలో సేల్స్ 60 శాతం ఉంటున్నాయి. కారణాలేవైనా భారత స్మార్ట్‌ఫోన్ విపణి నుంచి ప్రీమియం బ్రాండ్లు అయిన హెచ్‌టీసీ, బ్లాక్‌బెర్రీ, సోనీ తప్పుకున్నాయి. భారత్‌లో ఆపిల్‌కు ఆదరణ తగ్గకపోవడం విశేషం. శామ్‌సంగ్ దక్షిణ కొరియా కంపెనీ కాగా, మిగిలిన టాప్–3 కంపెనీలు చైనాకు చెందినవి. తమ స్టోర్లలో ప్రస్తుతం డిమాండ్ ఉన్న 8–10 విదేశీ బ్రాండ్ల మోడళ్లు మాత్రమే అమ్మకానికి ఉంచినట్టు హ్యాపీ మొబైల్స్ సీఎండీ కృష్ణ పవన్ చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment