Indian markets
-
ఎలక్ట్రిక్ కిసిక్!
కొత్త ఏడాదిలో ఎలక్ట్రిక్ ఎస్‌యూవీలు దుమ్మురేపేందుకు ఫుల్ చార్జ్ అవుతున్నాయి. దేశీ కంపెనీలతో పాటు విదేశీ దిగ్గజాలు సైతం భారత్ మార్కెట్లోకి పలు కొంగొత్త మోడళ్లను విడుదల చేసే సన్నాహాల్లో ఉన్నాయి. ముఖ్యంగా దేశీ కార్ల దిగ్గజం మారుతీ సుజుకీ తన ఎలక్ట్రిక్ జర్నీ షురూ చేస్తోంది. ఎలాన్ మస్క్ టెస్లా కూడా ఈ ఏడాదే మన ఈవీ మార్కెట్ రేసుకు సిద్ధమవుతోంది. ఈ నెలలో జరగనున్న అతిపెద్ద భారత్ మొబిలిటీ ఆటో షోలో అనేక కంపెనీలు ‘ఎలక్ట్రిక్’ ఆవిష్కరణలతో ఫాస్ట్ ట్రాక్‌లో దూసుకెళ్లనున్నాయి.గతేడాది రికార్డు ఈవీ అమ్మకాలతో జోష్ మీదున్న వాహన దిగ్గజాలు... 2025లో రెట్టించిన ఉత్సాహంతో గ్రీన్ కార్ల కుంభమేళాకు సై అంటున్నాయి. ఈ ఏడాది కొత్తగా రోడ్డెక్కనున్న ఈవీల్లో అత్యధికంగా ఎస్‌యూవీలే కావడం విశేషం! కాలుష్యానికి చెక్ చెప్పడం, క్రూడ్ దిగుమతుల భారాన్ని తగ్గించుకునే చర్యల్లో భాగంగా పర్యావరణానుకూల వాహనాలను ప్రభుత్వం మరింత ప్రోత్సహిస్తోంది. దీంతో దాదాపు దేశంలోని అన్ని కార్ల కంపెనీలూ ఎలక్ట్రిక్ మార్కెట్లో వాటా కొల్లగొట్టేందుకు పోటీ పడుతున్నాయి. ఇందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది దేశీ కార్ల అగ్రగామి మారుతీ. సంప్రదాయ పెట్రోల్, డీజిల్ వాహన రంగంలో ఎదురులేని రారాజుగా ఉన్న మారుతీ తొలిసారి ఈవీ అరంగేట్రం చేస్తోంది. హ్యుందాయ్తో పాటు లగ్జరీ దిగ్గజాలు మెర్సిడెస్, ఆడి, స్కోడా కూడా తగ్గేదేలే అంటున్నాయి. ఇక ఎలక్ట్రిక్ వాహన మార్కెట్లో టాప్‌గేర్‌లో దూసుకుపోతున్న టాటా మోటార్స్, జేఎస్‌డబ్ల్యూ ఎంజీ మోటార్, మహీంద్రాతో సహా చైనా దిగ్గజం బీవైడీ ఈవీ డ్రైవ్‌తో పోటీ మరింత హీటెక్కనుంది. వీటి ప్రారంభ ధరలు రూ. 16 లక్షల నుంచి రూ. 80 లక్షల రేంజ్లో ఉండొచ్చని అంచనా. ఆటో ఎక్స్పో వేదికగా... అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న భారత్ మొబిలిటీ మెగా ఆటో షో (జనవరి 17–22 వరకు)లో 16 కార్ల కంపెనీలు కొలువుదీరనున్నాయి. ఇందులో పెట్రోలు, డీజిల్, హైబ్రిడ్ వాహనాలు ఉన్నప్పటికీ ఈసారి ఆధిపత్యం ఈవీలదే. అయితే అందరి కళ్లూ మారుతీ తొలి పూర్తి బ్యాటరీ ఎలక్ట్రిక్ వాహనం (బీఈవీ) ఈ–విటారా పైనే ఉన్నాయి. దీని రేంజ్ 500 కిలోమీటర్లకు మించి ఉంటుందని, ధర రూ.15 లక్షలతో ప్రారంభమవుతుందని భావిస్తున్నారు. హ్యుందాయ్ క్రెటా ఈవీ కూడా ఆసక్తి రేకెత్తిస్తోంది. ఇక గతేడాది మార్కెట్ వాటాను కొద్దిగా పెంచుకున్న మహీంద్రా ఈ ఏడాది ఎలక్ట్రిక్ గేర్ మారుస్తోంది. రెండు ఈవీ ఎస్‌యూవీలను రోడ్డెక్కించనుంది. జేఎస్‌డబ్ల్యూ ఎంజీ మోటార్ ఎలక్ట్రిక్ వాటా 2024లో ఏకంగా రెట్టింపై 21 శాతానికి ఎగబాకింది. విండ్సర్తో భారత్ ఈవీ మార్కెట్లో సంచలనానికి తెరతీసింది. గడిచిన 3 నెలల్లో 10 వేలకు పైగా విక్రయాలతో అదరగొట్టింది. బ్యాటరీ రెంటల్ సర్వీస్ (బీఏఏఎస్)ను అందించడం వల్ల కారు ధర కస్టమర్లకు మరింత అందుబాటులోకి వచ్చినట్లయింది. హ్యుందాయ్ వెన్యూ, కియా కారెన్ ్స ఈవీలు కూడా క్యూలో ఉన్నాయి. అన్ని కంపెనీలూ ఎలక్ట్రిక్ బాట పడుతుండటంతో టాటా మోటార్స్ వాటా గతేడాది 62%కి (2023లో 73%) తగ్గింది. అయితే, సియరా, సఫారీ, హ్యారియర్ ఎస్యూవీ ఈవీలతో మార్కెట్‌ను షేక్ చేసేందుకు రెడీ అవుతోంది.టెస్లా వచ్చేస్తోంది... భారత్‌లో ఎంట్రీ కోసం విశ్వప్రయత్నాలు చేస్తున్న ఎలక్ట్రిక్ కార్ కింగ్ టెస్లా ఈ ఏడాది ముహూర్తం ఖారారు చేసింది. అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ ఘన విజయం, ప్రభుత్వంలో ఎలాన్ మస్క్ కీలక పాత్ర పోషిస్తున్న నేపథ్యంలో దిగుమతి సుంకం విషయంలో త్వరలోనే భారత్ సర్కారుతో సయోధ్య కుదిరే అవకాశం ఉందని అధికార వర్గాల సమాచారం. దేశంలో టెస్లా ప్లాంట్ ఏర్పాటు చేయాలని మోదీ సర్కారు పట్టుబడుతుండగా.. ముందుగా దిగుమతి రూట్లో వచ్చేందుకు మస్క్ మొగ్గు చూపుతున్నారు. ఇప్పటికే బెంగళూరు ఆర్‌ఓసీలో టెస్లా ఇండియా మోటార్స్ అండ్ ఎనర్జీ పేరుతో కంపెనీ రిజిస్టర్ కూడా చేసుకుంది. పలు నగరాల్లో రిటైల్ షోరూమ్స్ ఏర్పాటు కోసం కంపెనీ లొకేషన్లను అన్వేషిస్తోంది. తొలుత కొన్ని మోడళ్లను (మోడల్ ఎస్, మోడల్ 3) పూర్తిగా దిగుమతి చేసుకుని ఇక్కడ విక్రయించనుంది. వీటి ప్రారంభ రూ. 70 లక్షలు ఉంటుందని పరిశ్రమ వర్గాలు లెక్కలేస్తున్నాయి.– సాక్షి, బిజినెస్ డెస్క్ -
ట్రంప్ రీఎంట్రీ..మార్కెట్ గతేంటి?
‘మేక్ అమెరికా గ్రేట్ అగైన్’ నినాదంతో ట్రంప్ విజయ విహారం చేశారు. అయితే, ఇప్పుడు ‘మేక్ వరల్డ్ అన్–ప్రెడిక్టబుల్ అగైన్’గా మారుతుందనే అందోళనలు వ్యక్తమవుతున్నాయి. అమెరికా మార్కెట్లలో జోష్ నెలకొన్నప్పటికీ, మన మార్కెట్లో మళ్లీ అమ్మకాలు పోటెత్తడంతో ఇన్వెస్టర్లలో గందరగోళం నెలకొంది. ఇప్పటికే కరెక్షన్ బాటలో ఉన్న దేశీ సూచీల పయనమెటన్నది అర్థం కావడం లేదు. అయితే, ట్రంప్ ‘అమెరికా ఫస్ట్’ పాలసీలతో పాటు సుంకాల పెంపు వంటి చర్యలతో అగ్రరాజ్యంలో వడ్డీరేట్ల తగ్గింపునకు బ్రేకులు పడొచ్చని... డాలరు బలోపేతం, ద్రవ్యోల్బణం పెరుగుదల ఎఫెక్ట్‌తో రూపాయి మరింత బలహీన పడొచ్చని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. విదేశీ ఇన్వెస్టర్ల అమ్మకాల పరంపర కొనసాగడంతో... స్వల్పకాలానికి మన మార్కెట్లో ట్రంప్ సెగలు తప్పవంటున్నారు!అల్‌టైమ్ గరిష్టాల నుంచి కొండ దిగుతున్న దేశీ సూచీలు.. గత నెలన్నర రోజుల్లో 8 శాతానికి పైగానే పడ్డాయి. ముఖ్యంగా విదేశీ ఇన్వెస్టర్ల తిరోగమనం దీనికి ప్రధాన కారణం. ఎన్నికల తర్వాత సెపె్టంబర్ వరకు పెట్టుబడుల మోత మోగించిన విదేశీ ఇన్వెస్టర్లు... అక్టోబర్‌లో రికార్డు స్థాయిలో రూ.1.15 లక్షల కోట్ల విలువైన షేర్లను విక్రయించారు. ఇక నవంబర్లోనూ రివర్స్ గేర్ కొనసాగుతోంది. 6 ట్రేడింగ్ సెషన్లలో రూ.23,000 కోట్లకు పైగా నిధులను వెనక్కి తీసుకున్నారు. మొత్తంమీద ఈ ఏడాది ఇప్పటిదాకా రూ.2.9 లక్షల కోట్ల మేర విదేశీ నిధులు తరలిపోయాయి. ఇలాంటి తరుణంలో అధ్యక్ష ఎన్నికల్లో రెండోసారి గ్రాండ్ విక్టరీ కొట్టిన ట్రంప్.. మళ్లీ సుంకాల జూలు విదిల్చే అవకాశం ఉండటంతో పాటు ‘అమెరికా ఫస్ట్’ పాలసీలను ఆచరణలో పెడితే మన ఎకానమీపై ప్రతికూల ప్రభావానికి దారితీసే అవకాశం ఉందనేది ఆర్థిక వేత్తల అభిప్రాయం. మళ్లీ ద్రవ్యోల్బణం గుబులు... ట్రంప్ చెబుతున్నట్లుగా కార్పొరేట్ ట్యాక్స్ కోతకు తోడు సుంకాల పెంపునకు తెరతీస్తే మళ్లీ ప్రపంచవ్యాప్తంగా ద్రవ్యోల్బణం ఎగబాకే అవకాశాలున్నాయి. సుంకాలు రెండు వైపులా పదునున్న కత్తిలాంటివని కూడా విశ్లేషకులు చెబుతున్నారు. వస్తు, సేవలపై కనీసం 10 శాతం సుంకాలు పెంచినా, అక్కడ 0.8 శాతం ద్రవ్యోల్బణం పెరిగే అవకాశాం ఉందని ఎకనమిస్టులు లెక్కలేస్తున్నారు. దీనివల్ల యూఎస్ ఫెడ్ వడ్డీరేట్ల కోత అవకాశాలు సన్నగిల్లి.. డాలరు పుంజుకోవడానికి దారితీస్తుంది. వెరసి, ఇప్పుడిప్పుడే వడ్డీరేట్ల తగ్గింపు బాటలో వెళ్తున్న వివిధ దేశాల సెంట్రల్ బ్యాంకులు దీనికి బ్రేక్ వేసే చాన్స్ ఉంటుంది. మరోపక్క, టారిఫ్ వార్‌కు తెగబడితే ఎగుమతులు దెబ్బతినడం... దిగుమతులు గుదిబండగా మారడం వల్ల మన దేశంలోనూ మళ్లీ ద్రవ్యోల్బణం పురి విప్పుతుంది. ఇప్పటికే జారుడుబల్లపై ఉన్న రూపాయిని (తాజాగా డాలరుతో 84.38 ఆల్‌టైమ్ కనిష్టానికి పడింది) ఇది మరింత దిగజార్చుతుంది. దీంతో ఆర్బీఐ వడ్డీరేట్ల కోతపై ఆశలు ఆవిరైనట్లేననేది ఆర్థిక వేత్తల మాట. ‘ట్రంప్ ట్యాక్స్ కట్ అంటే అమెరికాలో రుణ భారం మరింత పెరుగుతుంది. అధిక వడ్డీరేట్లు, డాలరు బలంతో భారత్ లాంటి వర్ధమాన దేశాల మార్కెట్లకు కచి్చతంగా ప్రతికూలమే’ అని ఏఎస్కే వెల్త్ అడ్వయిజర్స్‌కు చెందిన సోమ్‌నాథ్ ముఖర్జీ పేర్కొన్నారు. అయితే, చైనాపై భారీగా సుంకాలు విధించి, భారత్‌పై కాస్త కనికరం చూపితే, మన ఎగుమతులు.. కొన్ని రంగాలకు సానుకూలంగా మారుతుందని కూడా కొంత మంది నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఏదేమైనా.. ట్రంప్ పగ్గాలు చేపట్టి (జనవరి 20న), విధానపరమైన స్పష్టత వచ్చే వరకు మన మార్కెట్లలో తీవ్ర ఆటుపోట్లు తప్పవనేది పరిశీలకుల అభిప్రాయం.ట్రంప్ తొలి జమానాలో..2017లో ట్రంప్ తొలిసారి గద్దెనెక్కినప్పుడు.. ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక అనిశ్చితి ఉంది. ముఖ్యంగా చైనా స్టాక్ మార్కెట్లో అలజడి, క్రూడ్ ధరల క్రాష్, గ్రీస్ దివాలా.. బ్రెగ్జిట్ ప్రభావాలతో స్టాక్ మార్కెట్లు తిరోగమనంలో ఉన్నాయి. అయితే, ట్రంప్ ప్రతీకార సుంకాల ప్రభావం ఉన్నప్పటికీ.. ప్రపంచ మార్కెట్ల ట్రెండ్‌కు అనుగుణంగా మన మార్కెట్లు మళ్లీ పుంజుకోగలిగాయి. 2017 నుంచి 2020 వరకు ట్రంప్ తొలి విడతలో నిఫ్టీ 50 శాతం మేర పుంజుకోగా... జో బైడన్ జమానాలో ఈ ఏడాది సెపె్టంబర్ వరకు ఏకంగా 120 శాతం పైగా నిఫ్టీ ఎగబాకడం విశేషం. ఇక ట్రంప్ 1.0 హయాంలో డాలర్‌తో రూపాయి విలువ 11% క్షీణిస్తే, 2.0 కాలంలో 8–10% క్షీణించే అవకాశం ఉందని ఎస్బీఐ తాజా నివేదిక తెలిపింది!ట్రంప్ విక్టరీ నేపథ్యంలో చైనా, భారత్ సహా పలు దేశాలపై దిగుమతి సుంకాల మోతకు అవకాశం ఉంది. ఇది అక్కడ ద్య్రవ్యోల్బణం పెరుగుదలకు దారితీయొచ్చు. దీంతో అమెరికాలో వడ్డీ రేట్ల కోత జాప్యం కావచ్చు. దీనికితోడు ట్రంప్ హామీ మేరకు కార్పొరేట్ ట్యాక్స్ తగ్గిస్తే, యూఎస్ బాండ్ మార్కెట్లో ఈల్డ్‌లు ఎగబాకుతాయి. ఈ పరిణామాలు భారత్ వంటి వర్ధమాన మార్కెట్ల నుంచి విదేశీ ఇన్వెస్టర్ల తిరోగమనానికి మరింత పురిగొల్పుతాయి. – నితిన్ అగర్వాల్, క్లయింట్ అసోసియేట్స్ డైరెక్టర్ – సాక్షి, బిజినెస్ డెస్క్ -
గణాంకాలు, ఫలితాలపై దృష్టి
ముంబై: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2024–25) రెండో త్రైమాసిక ఫలితాల సీజన్ ముగింపునకు వస్తోంది. ఈ బాటలో ఈ వారం మరికొన్ని కార్పొరేట్ దిగ్గజాలు జులై–సెప్టెంబర్(క్యూ2) పనితీరును వెల్లడించనున్నాయి. వీటితోపాటు దేశీ స్టాక్ మార్కెట్లను దేశీ ఆర్థిక గణాంకాలు సైతం ఈ వారం ప్రధానంగా ప్రభావితం చేయనున్నట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. ఈ వారం ఓఎన్జీసీ, అపోలో టైర్స్, బ్యాంక్ ఆఫ్ ఇండియా, హిందాల్కో ఇండస్ట్రీస్, బీఈఎంఎల్, బీఏఎస్ఎఫ్, బాష్, అల్ఫాజియో, జూబిలెంట్ ఫుడ్, ఎన్ఎండీసీ, బ్లూడార్ట్, బ్రిటానియా, ఫినొలెక్స్ కేబుల్స్, హ్యుందాయ్, ఈఐహెచ్, బటర్‌ఫ్లై గంధిమతి, బ్రెయిన్‌బీస్ సొల్యూషన్స్(ఫస్ట్‌క్రై మాతృ సంస్థ), గ్రాఫైట్, ఎల్జీ ఎక్విప్మెంట్స్, శ్రీ సిమెంట్, జైడస్ వెల్నెస్ తదితర పలు కంపెనీలు క్యూ2 ఫలితాలు ప్రకటించనున్నాయి. పావెల్ ప్రసంగం అక్టోబర్ నెలకు యూఎస్ ద్రవ్యోల్బణ గణాంకాలు 13న వెలువడనున్నాయి. సెప్టెంబర్‌లో 2.4 శాతంగా నమోదైంది. ఇక కీలకమైన వినియోగ ధరల సూచీ సెప్టెంబర్‌లో 3.3 శాతాన్ని తాకింది. శుక్రవారం కీలక అంశాలపై యూఎస్ ఫెడరల్ రిజర్వ్ చైర్మన్ జెరోమీ పావెల్ ప్రసంగించనున్నారు. గత వారం చేపట్టిన పాలసీ సమీక్షలో వడ్డీ రేట్లను 0.25 శాతం తగ్గించిన విషయం విదితమే. దీంతో ఫెడ్ ఫండ్స్ రేట్లు తాజాగా 4.5–4.75 శాతానికి చేరాయి. ఇక మరోపక్క జులై–సెప్టెంబర్‌కు జపాన్ జీడీపీ గణాంకాలు ఇదే రోజు వెల్లడికానున్నాయి. ఏప్రిల్–జూన్‌లో జపాన్ జీడీపీ 0.7 శాతం పుంజుకుంది. అక్టోబర్‌కు చైనా పారిశ్రామికోత్పత్తి గణాంకాలు సైతం తెలియనున్నాయి. సెప్టెంబర్‌లో 5.4 శాతం పురోగతి నమోదైంది. ఇతర అంశాలు యూఎస్ ప్రెసిడెంట్‌గా డొనాల్డ్ ట్రంప్ బాధ్యతలు చేపట్టనుండటంతో డాలరు ఇండెక్స్సహా యూఎస్ బాండ్ల ఈల్డ్స్ ఇటీవల బలపడుతూ వస్తున్నాయి. దీంతో డాలరుతో మారకంలో దేశీ కరెన్సీ రూపాయి సరికొత్త కనిష్టాలను తాకుతోంది. 84.38వరకూ పతనమైంది. మరోవైపు రాజకీయ, భౌగోళిక అనిశ్చతుల కారణంగా ముడిచమురు ధరలు ఆటుపోట్లకు లోనవుతున్నాయి. కాగా.. ఈ వారం దేశ, విదేశీ గణాంకాలు సెంటిమెంటుపై ప్రభావం చూపనున్నట్లు స్వస్తికా ఇన్వెస్ట్‌మార్ట్ రీసెర్చ్ హెడ్ సంతోష్ మీనా పేర్కొన్నారు. వీటికితోడు దేశీ కార్పొరేట్ల క్యూ2 ఫలితాలకూ ప్రాధాన్యత ఉన్నట్లు మాస్టర్ క్యాపిటల్ సరీ్వసెస్ డైరెక్టర్ పల్కా ఆరోరా చోప్రా తెలియజేశారు. గత వారమిలా విదేశీ ఇన్వెస్టర్ల భారీ అమ్మకాల నేపథ్యంలో దేశీ స్టాక్ మార్కెట్లు గత వారం డీలా పడినట్లు జియోజిత్ ఫైనాన్షియల్ సరీ్వసెస్ చీఫ్ ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజిస్ట్ వీకే విజయకుమార్ పేర్కొన్నారు. ఈ నెలలోనూ అమ్మకాలు కొనసాగే వీలున్నట్లు అంచనా వేశారు. అంతంతమాత్ర క్యూ2 ఫలితాలు, ప్రపంచ అనిశి్చతుల కారణంగా ఈ వారం మార్కెట్లు సైడ్‌వేస్‌లో కదలవచ్చని మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సరీ్వసెస్ వెల్త్ మేనేజ్మెంట్, రీసెర్చ్ హెడ్ సిద్ధార్థ ఖేమ్కా అభిప్రాయపడ్డారు. అయితే ఫలితాల ఆధారంగా కొన్ని స్టాక్స్‌లో యాక్టివిటీకి వీలున్నట్లు తెలియజేశారు. గత వారం సెన్సెక్స్ 238 పాయింట్లు క్షీణించి 79,486వద్ద నిలవగా.. నిఫ్టీ 156 పాయింట్లు కోల్పోయి 24,148 వద్ద ముగిసింది.ఎఫ్‌పీఐలు5 రోజుల్లో రూ. 20,000 కోట్లు ఈ నెలలోనూ విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) దేశీ స్టాక్స్‌లో విక్రయాలకే మొగ్గు చూపుతున్నారు. దీంతో తొలి ఐదు ట్రేడింగ్ సెషన్లలో నికరంగా దాదాపు రూ. 20,000 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్నారు. చైనా సహాయక ప్యాకేజీలకు తెరతీయడం, దేశీయంగా మార్కెట్లు సరికొత్త గరిష్టాలకు చేరి ఖరీదుగా మారడం తదితర కారణాలతో కొద్ది రోజులుగా ఎఫ్‌పీఐలు నిరవధిక అమ్మకాలకు పాల్పడుతున్నారు. ఫలితంగా గత నెలలో సరికొత్త రికార్డ్ నెలకొల్పుతూ రూ. 94,017 కోట్ల విలువైన స్టాక్స్ విక్రయించిన విషయం విదితమే. అయితే అంతకుముందు సెప్టెంబర్‌లో గత 9 నెలల్లోనే అత్యధికంగా రూ. 57,724 కోట్లు ఇన్వెస్ట్ చేయడం గమనార్హం! కాగా.. ఇంతక్రితం 2020 మార్చిలో మాత్రమే ఒకే నెలలో అత్యధికంగా రూ. 61,973 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్నారు. శుక్రవారం సెలవు గురునానక్ జయంతి సందర్భంగా వారాంతాన(15) ఈక్విటీ మార్కెట్లకు సెలవు. దీంతో ఈ వారం ట్రేడింగ్ నాలుగు రోజులకే పరిమితంకానుంది. కాగా.. అక్టోబర్ నెలకు రిటైల్ ధరల ద్రవ్యోల్బణం(సీపీఐ) గణాంకాలు మంగళవారం(12న) వెలువడనున్నాయి. సెప్టెంబర్‌లో సీపీఐ 5.49 శాతంగా నమోదైంది. టోకు ధరల ద్రవ్యోల్బణం(డబ్ల్యూపీఐ) వివరాలు గురువారం(14న) వెల్లడికానున్నాయి. సెప్టెంబర్‌లో డబ్ల్యూపీఐ 1.84 శాతానికి చేరింది. ఈ బాటలో ప్రభుత్వం శుక్రవారం(15న) అక్టోబర్ నెలకు వాణిజ్య గణాంకాలు విడుదల చేయనుంది. -
అక్కడ డొక్కు డొక్కు.. ఇక్కడ డుగ్గు డుగ్గు
రాయల్ ఎన్ఫీల్డ్.. యెజ్డీ.. జావా.. నార్టన్... బీఎస్ఏ.. విశ్వ విఖ్యాత బైక్ బ్రాండ్లు ఇవి. విదేశాల్లో మనుగడ సాధించలేక చేతులెత్తేసిన ఈ బ్రాండ్లన్నీ భారతీయుల చేతిలో మళ్లీ ప్రాణం పోసుకున్నాయి. అమ్మకాల్లో దుమ్మురేడమే కాదు.. మళ్లీ వాటిని గ్లోబల్ బ్రాండ్లుగా నిలబెట్టి మనోళ్లు సత్తా చాటుతున్నారు!మహీంద్రా కంపెనీ క్లాసిక్ లెజెండ్స్ తాజాగా ప్రఖ్యాత బ్రిటిష్ మోటార్‌సైకిల్ బ్రాండ్ బీఎస్ఏను భారత్‌లో ప్రవేశపెట్టడం తెలిసిందే. అక్కడ మూసేసిన ఈ కంపెనీని కొనుగోలు చేసి, మన మార్కెట్లో లాంచ్ చేసింది. విదేశీ బ్రాండ్లకు మన దగ్గర తిరిగి జీవం పోస్తూ... 1994లో ప్రారంభమైన ఈ ట్రెండ్ ఇప్పటికీ నాన్‌స్టాప్‌గా కొనసాగుతూనే ఉంది. ఇంగ్లాండ్‌లో కార్యకలాపాలను నిలిపేసిన బ్రిటిష్ మోటార్ సైకిల్ కంపెనీ రాయల్ ఎన్ఫీల్డ్ను ఐషర్ గ్రూప్ 1994లో చేజిక్కించుకుంది. అయితే, మన దగ్గర ఈ బ్రాండ్‌ను మళ్లీ జనాల్లోకి తీసుకెళ్లేందుకు ఆ కంపెనీకి 15 ఏళ్లు పట్టింది. 2009లో క్లాసిక్ 350, క్లాసిక్ 500 మోటార్ సైకిళ్లు డుగ్గు డుగ్గు మంటూ మళ్లీ మన రోడ్లపై పరుగులు తీయడం మొదలైంది. ఇప్పుడు యువతకు ఈ మోటార్ సైకిల్స్ అంటే ఎంత క్రేజో చెప్పాల్సిన పని లేదు! ‘2009లో విడుదల చేసిన క్లాసిక్‌తో రాయల్ ఎన్ఫీల్డ్ గ్లోబల్ కంపెనీగా అపూర్వ విజయం సొంతం చేసుకుంది. మొదట్లో ఏడాదికి 50,000 బుల్లెట్లను అమ్మడమే గగనంగా ఉన్న స్థాయి నుంచి ప్రస్తుతం అనేక మోడల్స్ దన్నుతో వార్షిక సేల్స్ 8.5 లక్షలకు ఎగబాకాయి’ అని కంపెనీ సీఈఓ గోవిందరాజన్ పేర్కొన్నారు. 2009 నుంచి ఇప్పటిదాకా రాయల్ ఎన్ఫీల్డ్ 75 లక్షల మోటార్ సైకిళ్లను విక్రయించగా అందులో 40 లక్షలు క్లాసిక్ మోడల్ కావడం మరో విశేషం. ఈ నెల 12న కూడా కంపెనీ కొత్త క్లాసిక్‌ను ప్రవేశపెట్టింది.యెజ్డీ.. కుర్రకారు హార్ట్ ‘బీట్’ అనుపమ్ తరేజా సారథ్యంలోని క్లాసిక్ లెజెండ్.. గ్లోబల్ బైక్ బ్రాండ్స్ జావా, యెజ్డీ, బీఎస్ఏలను భారతీయులకు మళ్లీ పరిచయం చేసింది. 1970లో మార్కెట్ నుంచి వైదొలగిన చెక్ కంపెనీ జావా.. 2018లో మనోళ్ల చేతికి చిక్కింది. అప్పటి నుంచి 1.4 లక్షల జావాలు రోడ్డెక్కాయి. గత నెల 13న జావా 42 మోడల్‌ను సైతం రంగంలోకి దించింది. ఇక అప్పట్లో అదిరిపోయే బీట్తో కుర్రోళ్ల మనను కొల్లగొట్టిన యెజ్డీ కూడా 1996లో అస్తమించి.. 2022లో లెజెండ్స్ ద్వారా తిరిగి ప్రాణం పోసుకుంది. 60 వేల బైక్‌లు ఇప్పటిదాకా అమ్ముడవ్వడం విశేషం. బీఎస్ఏ అయితే, 1973లోనే మూతబడింది. దాన్ని ఆనంద్ మహీంద్రా పోటాపోటీగా దక్కించుకుని యూకేతో పాటు భారత్‌లోనూ మళ్లీ ప్రవేశ పెట్టారు.అదే బాటలో టీవీఎస్, హీరో... ఇక దేశీ దిగ్గజం టీవీఎస్ కూడా మరో విఖ్యాత బ్రిటిష్ బైక్ బ్రాండ్ నార్టన్‌ను కేవలం రూ.153 కోట్లకు కొనుగోలు చేసింది. 2025 నాటికి తొలి మోడల్‌ను ప్రవేశపెట్టడంతో పాటు మూడేళ్లలో ఆరు కొత్త నార్టన్ బైక్‌లను తీసుకొచ్చే సన్నాహాల్లో ఉంది. ఈ ప్రఖ్యాత బ్రాండ్లను దక్కించుకోవడంతో పాటు వాటి చారిత్రక నేపథ్యాన్ని అలాగే కొనసాగించడం ద్వారా ఒరిజినాలిటీని కాపాడుతున్నామని తరేజా వ్యాఖ్యానించారు. బీఎస్ఏను భారత్‌లోనే తయారు చేస్తున్నా, దాని బ్రిటిష్ బ్రాండ్ ప్రాచుర్యం పదిలంగా ఉందన్నారు. ఇక భారత్‌లో నేరుగా ప్లాంట్ పెట్టి, చేతులెత్తేసిన హార్లీ డేవిడ్సన్కు హీరో మోటోకార్ప్ దన్నుగా నిలిచింది. ఆ కంపెనీతో జట్టుకట్టి మళ్లీ హార్లీ బైక్‌లను భారతీయులకు అందిస్తోంది. ఎక్స్440 బైక్‌ను ఇక్కడే అభివృద్ధి చేయడం విశేషం. దీన్ని దేశీయంగా హీరో ఉత్పత్తి చేస్తున్పప్పటికీ, ప్రామాణిక హార్లీ బైక్ బ్రాండ్ విలులో ఎలాంటి మార్పులు చేయలేదని కంపెనీ ప్రెసిడెంట్, సీఈఓ జోషెన్ జీట్స్ పేర్కొన్నారు. భారత్‌లో నేరుగా విక్రయాల్లో వెనుకబడ్డ బీఎండబ్ల్యూ మోటోరాడ్, టీవీఎస్‌తో జట్టుకట్టింది. టీవీఎస్ రూపొందించిన 500 సీసీ లోపు బైక్‌లు 60 వేలకు పైగా అమ్ముడవ్వడం మనోళ్ల సత్తాకు నిదర్శనం! → 2015లో మహీంద్రా మెజారిటీ పెట్టుబడితో ఫై క్యాపిటల్ ఓనర్ అనుపమ్ తరేజా క్లాసిక్ లెజెండ్స్ అనే కంపెనీని నెలకొల్పారు. జావా, యెజ్డీ, బీఎస్ఏ వంటి గ్లోబల్ ఐకాన్లను దక్కించుకుని, పునరుద్ధరించారు.→ 2013లో టీవీఎస్ బీఎండబ్ల్యూ మోటోరాడ్‌తో డీల్ కుదుర్చుకుంది, తద్వారా ప్రపంచ మార్కెట్ కోసం 500 సీసీ లోపు బైక్‌లను అభివృద్ధి చేసి, ఇంటా బయటా విక్రయిస్తోంది. 2020లో టీవీఎస్ మోటార్ కంపెనీ ప్రఖ్యాత బ్రిటిష్ మోటార్‌సైకిల్ బ్రాండ్ నార్టన్‌ను కొనుగోలు చేసింది; వచ్చే మూడేళ్లలో ఆరు కొత్త మోడల్స్‌ను ప్రవేశపెట్టే పనిలో ఉంది.→ 1994లో ఐషర్ గ్రూప్ ఇంగ్లాండ్‌లో పూర్తిగా అమ్మకాలను నిలిపేసిన బ్రిటిష్ బైక్ దిగ్గజం రాయల్ ఎన్ఫీల్డ్ను చేజిక్కించుకుంది. 2009లో ‘క్లాసిక్’ బ్రాండ్‌కు తిరిగి జీవం పోయడంమే కాదు.. గ్లోబల్ కంపెనీగా దీన్ని మళ్లీ నిలబెట్టింది.→ 2023లో హీరో మోటోకార్ప్ భారత్‌లో విఫలమై షట్టర్ మూసేసిన హార్లే డేవిడ్సన్కు మళ్లీ ఇక్కడ ప్రాణం పోసింది. ఎక్స్440 మోడల్‌ను విడుదల చేసి సక్సెస్ కొట్టింది.– సాక్షి, బిజినెస్ డెస్క్ -
భారత్‌లోకి బీఎస్ఏ ఎంట్రీ
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: మహీంద్రా గ్రూప్‌నకు చెందిన మోటార్‌సైకిల్స్ బ్రాండ్ బీఎస్ఏ భారత్‌లో అడుగుపెట్టింది. గోల్డ్‌స్టార్ 650 మోడల్‌తో ఎంట్రీ ఇచి్చంది. ధర ఎక్స్‌షోరూంలో రూ.2.99 లక్షల నుంచి రూ.3.34 లక్షల వరకు ఉంది. 45.6 పీఎస్ పవర్, 55 ఎన్ఎం టార్క్‌తో 652 సీసీ లిక్విడ్ కూల్డ్ ఇంజన్, 5 స్పీడ్ ట్రాన్స్‌మిషన్‌తో తయారైంది. 12 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్, బ్రెంబో బ్రేక్స్, డ్యూయల్ చానెల్ ఏబీఎస్, 12వీ సాకెట్, యూఎస్బీ చార్జింగ్ పోర్ట్ వంటి హంగులు ఉన్నాయి. డెలివరీలు ప్రారంభం అయ్యాయి. పాతతరం ద్విచక్ర వాహన తయారీ దిగ్గజాల్లో బీఎస్ఏ ఒకటి. మహీంద్రా గ్రూప్ కంపెనీ క్లాసిక్ లెజెండ్స్ 2016లో బీఎస్ఏను కైవసం చేసుకుంది. యూకే సంస్థ బమింగమ్ స్మాల్ ఆమ్స్ కంపెనీ (బీఎస్ఏ) 1861లో ప్రారంభం అయింది. తొలి బైక్‌ను 1910లో విడుదల చేసింది. -
కరకర @ 50,000 కోట్లు!
కరకరలాడే సేవ్ భుజియా, వేయించిన పల్లీలు, బఠానీలు, మిక్చర్, జంతికలు ఇలా ఒకటేమిటి.. సాంప్రదాయ చిరుతిళ్లను ఇప్పుడు ఐదు, పది రూపాయల ప్యాకెట్లలో భారతీయులు లొట్టలేసుకుంటూ తినేస్తున్నారు. పొటాటో చిప్స్ ఇతరత్రా పాశ్చాత్య స్నాక్స్ హవాకు సాంప్రదాయ, బ్రాండెడ్ ప్యాకేజ్డ్ స్నాక్స్ గండికొడుతున్నాయి. విదేశీ, దేశీ కంపెనీలు మారుమూల ప్రాంతాల జనాలకు సైతం ఈ ప్యాకేజ్డ్ స్నాక్స్‌ను అందిస్తూ మార్కెట్‌ను భారీగా విస్తరించేందుకు పోటీ పడుతున్నాయి. దేశీయంగా సాల్టెడ్ స్నాక్స్ అమ్మకాలు గత ఆర్థిక సంవత్సరంలో ఏకంగా రూ.50,800 కోట్లకు ఎగబాకాయి. కరోనా మహమ్మారి తర్వాత భారతీయ స్నాక్స్ వాటా క్రమంగా జోరుందుకుంటూ వస్తోంది. ప్రస్తుతం మొత్తం స్నాక్స్ మార్కెట్లో సాంప్రదాయ రుచుల వాటా 56 శాతానికి చేరుకోవడం దీనికి నిదర్శనం. ఐదు, పది రూపాయల చిన్న ప్యాకెట్ల రూపంలో రకరకాల దేశీ రుచులన్నీ లభించడంతో పాటు విదేశీ స్నాక్స్ రకాలతో పోలిస్తే కొంత ఎక్కువ పరిమాణం కూడా ఉంటుండటం దేశీ స్నాక్స్ జోరుకు ప్రధాన కారణంగా నిలుస్తోందని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. ‘భారతీయులు ఎక్కువగా సాంప్రదాయ రుచులనే ఇష్టపడతారు. ఇప్పుడిది స్నాక్స్ మార్కెట్లో కూడా ప్రతిబింబిస్తోంది’ అని బికనీర్‌వాలా ఫుడ్స్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ సురేశ్ గోయెల్ పేర్కొన్నారు. ఈసంస్థ దేశవ్యాప్తంగా సాంప్రదాయ రెస్టారెంట్ల నిర్వహణతో పాటు బికానో బ్రాండ్‌తో స్నాక్స్ ప్యాకెట్లను కూడా విక్రయిస్తోంది. రెండు దశాబ్దాల క్రితం వాటిదే జోరు... మొత్తం దేశీ స్నాక్స్ మార్కెట్లో బంగాళదుంప చిప్స్, కుర్కురే, ఫింగర్ స్టిక్స్ వంటి పాశ్చాత్య స్నాక్స్ వాటా రెండు దశాబ్దాల క్రితం మూడింట రెండొంతుల మేర ఉండేది. దీన్ని కూడా పెప్సీ ఫ్రిటో లేస్, ఐటీసీ ఫుడ్స్ వంటి కార్పొరేట్ దిగ్గజాలే శాసిస్తూ వచ్చాయి. ‘గతంలో బడా కంపెనీలు విక్రయించే పాశ్చాత్య స్నాక్స్ ఇంటింటా తిష్ట వేశాయి. ఇప్పుడీ ట్రెండ్ రివర్స్ అవుతోంది. సాంప్రదాయ స్నాక్స్ తయారీదారులు తమ పంపిణీ వ్యవస్థను విస్తరించుకోవడం ద్వారా పల్లెటూర్లకు కూడా చొచ్చుకుపోతున్నాయి’ అని గోయెల్ చెప్పారు. కొత కొన్నేళ్లుగా సాంప్రదాయ స్నాక్స్ విభాగం భారీగా అమ్మకాలను కొల్లగొడుతోంది. ఇక మార్కెట్ వాటా విషయానికొస్తే, సాల్టెడ్ స్నాక్స్‌లో హల్దీరామ్స్, పెప్సీ, బాలాజీ, ఐటీసీ, బికాజీ వంటి పెద్ద కంపెనీలకు 60 శాతం మార్కెట్ వాటా ఉండగా.. మిగతా 40 శాతాన్ని చిన్నాచితకా కంపెనీలు, ప్రాంతీయ సంస్థల చేతిలో ఉండటం విశేషం. పెద్ద కంపెనీలతో పోలిస్తే ఎక్కువ గ్రాములను అందిస్తుండటం, మరిన్ని స్థానిక రుచులతో ఉత్పత్తులను ప్రవేశపెడుతుండటం వాటికి కలిసొస్తోంది. ‘ఇప్పటికే పాతుకుపోయిన కంపెనీలు సాంప్రదాయ స్నాక్స్‌లో జోరు పెంచుతుండగా.. ప్రాంతీయంగా పేరొందిన కంపెనీలు సైతం క్రమంగా జాతీయ స్థాయిలో విస్తరిస్తున్నాయి’ అని పార్లే ప్రొడక్ట్స్ సీనియర్ కేటగిరీ హెడ్ కృష్ణారావు బుద్ధ చెబుతున్నారు. ఇలా అందరూ స్థానిక సాంప్రదాయ రుచులను అందించేందుకు పోటీపడుతుండటంతో వాటి అమ్మకాలు కూడా పెరిగేందుకు దోహదం చేస్తోందని, దీంతో అన్‌బ్రాండెడ్ సంస్థల నుంచి మార్కెట్ క్రమంగా సంస్థాగత కంపెనీల చేతికి వెళ్తోందని ఆయన పేర్కొన్నారు.హల్దీరామ్స్ హవా...ప్రస్తుతం దేశంలో ఏ మారుమూలకెళ్లినా హల్దీరామ్స్ పేరు తెలియని వారుండరంటే అతిశయోక్తి కాదేమో! మిక్చర్ పొట్లం, పల్లీల ప్యాకెట్ నుంచి రకరకాల ఉత్తరాది, దక్షిణాది రుచులతో సాంప్రదాయ స్నాక్స్‌కు పర్యాయపదంగా మారిపోయింది ఇది. హల్దీరామ్స్ దాదాపు 25% మార్కెట్ వాటాతో అగ్రస్థానంలో ఉంది. 2023–24లో కంపెనీ విక్రయాలు 18% ఎగసి రూ.12,161 కోట్లకు చేరాయి. పెప్సికో స్నాక్స్ అమ్మకాలు 14% పెరిగి రూ. 7,336 కోట్లుగా నమోదయ్యాయి. గుజరాత్‌కు చెందిన బాలాజీ వేఫర్స్ సేల్స్ 12% వృద్ధితో రూ.5,931 కోట్లకు దూసుకెళ్లడం విశేషం. భారతీయ స్నాక్స్ మార్కెట్ జోరుతో విదేశీ కంపెనీల ఇక్కడ ఫోకస్ పెంచాయి. హల్దీరామ్స్ను చేజిక్కించుకోవడానికి అమెరికా ప్రైవేటు ఈక్విటీ (పీఈ) దిగ్గజం బ్లాక్‌స్టోన్ రంగంలోకి దిగినట్లు టాక్. 51% మెజారిటీ వాటా కోసం బ్లాక్‌స్టోన్ రూ. 40,000 కోట్లను ఆఫర్ చేసినట్లు సమాచారం. హల్దీరామ్స్ విలువను రూ.70,000–78,000 కోట్లుగా లెక్కగట్టినట్లు తెలుస్తోంది.– సాక్షి, బిజినెస్ డెస్క్ -
మెర్సిడెస్ ఈవీ @ 66 లక్షలు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: లగ్జరీ కార్ల తయారీ సంస్థ మెర్సిడెస్ బెంజ్ భారత మార్కెట్లో ఈక్యూఏ ఎలక్ట్రిక్ ఎస్యూవీ ఆవిష్కరించింది. ఎక్స్‌షోరూంలో ధర రూ.66 లక్షలు. కంపెనీ నుంచి చిన్న, అందుబాటు ధరలో లభించే ఎలక్ట్రిక్ వెహికల్ ఇదే. 70.5 కిలోవాట్ అవర్ బ్యాటరీ పొందుపరిచారు. ఒకసారి చార్జింగ్‌తో 560 కిలోమీటర్ల వరకు ప్రయాణిస్తుందని కంపెనీ తెలిపింది. గంటకు 100 కిలోమీటర్ల వేగాన్ని 8.6 సెకన్లలో అందుకుంటుంది. గరిష్ట వేగం గంటకు 160 కిలోమీటర్లు. ఏడు ఎయిర్‌బ్యాగ్స్ ఏర్పాటు చేశారు. జీఎల్ఏ ప్లాట్‌ఫామ్‌పై రూపుదిద్దుకున్న ఈ కాంపాక్ట్ క్రాస్ఓవర్ మెర్సిడెస్ నుంచి భారత్‌లో నాల్గవ బ్యాటరీ ఎలక్ట్రిక్ కారు. 2024 చివరినాటికి మరో రెండు ఈవీలు రానున్నాయి. తొలిసారిగా లగ్జరీ కార్ల కొనుగోలుదారులను ఆకర్షించడానికి ఎలక్ట్రిక్ ఎంట్రీ–లెవల్ మోడళ్లను కంపెనీ పరిచయం చేస్తోందని మెర్సిడెస్ బెంజ్ ఇండియా ఎండీ సంతోష్ అయ్యర్ తెలిపారు. -
60 లక్షల ప్యాసింజర్ వాహనాలు
ముంబై: దేశవ్యాప్తంగా ప్యాసింజర్ వెహికిల్స్ మార్కెట్ 6 శాతం వార్షిక వృద్ధితో 2029–30 నాటికి 60 లక్షల యూనిట్ల స్థాయికి చేరుతుందని టాటా మోటార్స్ అంచనా వేస్తోంది. ఆ సమయానికి 18–20 శాతం వాటా చేజిక్కించుకోవాలని లక్ష్యంగా చేసుకున్నట్టు వెల్లడించింది. ఇందుకోసం సంప్రదాయ ఇంజన్‌తోపాటు ఎలక్ట్రిక్ విభాగంలో నూతన మోడళ్లను ప్రవేశపెట్టనున్నట్టు కంపెనీ తెలిపింది. కఠినమైన కార్పొరేట్ యావరేజ్ ఫ్యూయల్ ఎఫీషియెన్సీ (సీఏఎఫ్ఈ–3) నిబంధనలు 2027 నుండి ప్రారంభం కానుండడంతో ఈవీలు, సీఎన్జీ వాహనాల వాటా పెరుగుతుంది. మరోవైపు ఇంటర్నల్ కంబషన్ ఇంజన్ వాహనాల ధరలు అధికం అవుతాయని టాటా మోటార్స్ ప్యాసింజర్ వెహికిల్స్, టాటా ప్యాసింజర్ ఎలక్ట్రిక్ మొబిలిటీ ఎండీ శైలేష్ చంద్ర తెలిపారు. మొత్తం ప్యాసింజర్ వాహన పరిశ్రమలో 2029–30 నాటికి ఈవీల వాటా 20 శాతం, సీఎన్జీ విభాగం 25 శాతం వాటా కైవసం చేసుకుంటాయని అంచనాగా చెప్పారు. కొన్నేళ్లుగా కొత్త ట్రెండ్.. వినియోగదార్లకు ఖర్చు చేయతగిన ఆదాయం పెరగడం, తక్కువ కాలంలో వాహనాన్ని మార్చడం వంటి అంశాలు పరిశ్రమ వృద్ధిని నడిపిస్తాయని శైలేష్ చంద్ర అన్నారు. పైస్థాయి మోడల్‌కు మళ్లడం, అదనపు కార్లను కొనుగోలు చేసేవారి వాటా పెరుగుతోందని చెప్పారు. కొన్నేళ్లుగా ఇది ట్రెండ్‌గా ఉందని అన్నారు. నూతనంగా కారు కొనుగోలు చేసే కస్టమర్ల సంఖ్య తగ్గుతోందని వివరించారు. ఎస్‌యూవీల కోసం ప్రాధాన్యత పెరుగుతోంది. పెద్ద ఎత్తున కొత్త మోడళ్ల రాకతో ఈ సెగ్మెంట్ వాటా ఎక్కువ కానుందని శైలేష్ తెలిపారు. హ్యాచ్బ్యాక్స్, సెడాన్లకయ్యే ఖర్చుతో ఇవి లభిస్తాయని ఆయన చెప్పారు. కొత్త టెక్నాలజీ ఫీచర్లు, అప్గ్రేడ్లు కొన్నేళ్లుగా ట్రెండ్‌గా ఉన్నాయని, ఇది సహజమైన పురోగతి అని ఆయన అన్నారు. అత్యంత విఘాతం..సీఏఎఫ్ఈ–3 కఠిన నిబంధనలు రాబోయే ఐదారు సంవత్సరాలలో పరిశ్రమకు అత్యంత విఘాతం కలిగిస్తాయని అభిప్రాయపడ్డారు. సీఏఎఫ్ఈ–3 నిబంధనలు ఉల్లంఘిస్తే భారీ జరిమానాలు ఉంటాయని, ఇదే జరిగితే బ్రాండ్‌పై తీవ్ర ప్రభావం చూపిస్తుందని చెప్పారు. 2023–24లో దేశీయ ప్యాసింజర్ వాహన పరిశ్రమలో కంపెనీకి 13.9 శాతం వాటా ఉంది. టాటా మోటార్స్ ప్రస్తుతం ఏడు మోడళ్లతో 53 శాతం మార్కెట్లో పోటీపడుతోందని వివరించారు. కొత్త మోడళ్లతో పోటీపడే మార్కెట్‌ను పెంచుకుంటామని వెల్లడించారు. కర్వ్, సియెర్రా మోడళ్లను రెండేళ్లలో ప్రవేశపెట్టనున్నట్టు తెలిపారు. కొత్త మోడళ్ల కోసం ఆదాయంలో 6–8 శాతం వెచ్చిస్తామని వెల్లడించారు. అయిదారేళ్లలో ఎలక్ట్రిక్ వెహికిల్స్ వ్యాపారం కోసం రూ.16–18 వేల కోట్లు ఖర్చు చేస్తామన్నారు. -
భారత్‌లో యాపిల్ జోరు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: టెక్నాలజీ దిగ్గజం యాపిల్ భారత్ మార్కెట్లో జోరు కొనసాగిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా మార్చి త్రైమాసికంలో కంపెనీ 90.8 బిలియన్ డాలర్ల ఆదాయం సాధించింది. గతేడాది ఇదే కాలంతో పోలిస్తే ఆదాయం 4% తగ్గినప్పటికీ భారత్‌లో మాత్రం బలమైన రెండంకెల వృద్ధితో సరికొత్త రికార్డు నమోదు చేయడం విశేషం. అంతర్జాతీయంగా మార్చి త్రైమాసికంలో ఐఫోన్ల విక్రయాలు 10.4 % క్షీణించి 45.9 బిలియన్ డాలర్లకు వచ్చి చేరాయి. -
శామ్సంగ్ కొత్త ఫోన్లు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: శామ్సంగ్ భారత్‌లో గెలాక్సీ సిరీస్‌లో ఏ55 5జీ, ఏ35 5జీ స్మార్ట్ఫోన్లను ప్రవేశపెట్టింది. 6.6 అంగుళాల ఎఫ్‌హెచ్‌డీ ప్లస్ సూపర్ అమోలెడ్ డిస్ప్లే, నాక్స్ వాల్ట్ సెక్యూరిటీ, 50 ఎంపీ ట్రిపుల్ కెమెరా వంటి ఫీచర్లను జోడించింది. ఈ మోడళ్లు 5జీతోపాటు వేగంగా వృద్ధి చెందుతున్న రూ.30–50 వేల ధరల విభాగంలో తమ స్థానాన్ని కన్సాలిడేట్ చేస్తాయని శామ్సంగ్ తెలిపింది. ధర రూ.27,999 నుంచి రూ.42,999 వరకు ఉంది. -
రెండు దశాబ్దాల్లో 30 బిలియన్ డాలర్లు
న్యూఢిల్లీ: భారత మార్కెట్ నుంచి గత రెండు దశాబ్దాల్లో సుమారు 30 బిలియన్ డాలర్ల విలువ చేసే ఉత్పత్తులను కొనుగోలు చేసినట్లు అమెరికన్ రిటైల్ దిగ్గజం వాల్‌మార్ట్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ (సోర్సింగ్ విభాగం) ఆండ్రియా ఆల్బ్రైట్ తెలిపారు. ఇప్పుడు 2027 నాటికల్లా ఏటా 10 బిలియన్ డాలర్ల విలువ చేసే ఉత్పత్తులను కొనుగోలు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఆమె వివరించారు. వాల్‌మార్ట్ గత 25 ఏళ్లుగా భారత్‌లో కార్యకలాపాలు సాగిస్తున్నట్లు వాల్‌మార్ట్ గ్రోత్ సదస్సులో పాల్గొన్న సందర్భంగా పేర్కొన్నారు. వేగవంతమైన వృద్ధి నమోదు చేస్తున్న భారత్‌లాంటి మార్కెట్లలో పెట్టుబడులు పెట్టడమనేది దిగ్గజ సరఫరాదారులతో తమ సంబంధాలను బలోపేతం చేసుకునేందుకు, అలాగే దీర్ఘకాలికంగా విశ్వసనీయమైన సరఫరా వ్యవస్థ కోసం కొత్త సంస్థలతో సంబంధాలను ఏర్పర్చుకునేందుకు తోడ్పడగలదని ఆల్బ్రైట్ చెప్పారు. చిన్న, మధ్య తరహా సంస్థల ఆధునీకరణ, విస్తరణలో తోడ్పడేందుకు ఉద్దేశించిన వాల్‌మార్ట్ వృద్ధి కార్యక్రమం ద్వారా ఇప్పటివరకు 50 వేల మందికి కంపెనీ శిక్షణనిచి్చనట్లు ఆమె పేర్కొన్నారు. మరోవైపు, భారతీయ కంపెనీలు తయారు చేస్తున్న పలు ఉత్పత్తులకు మంచి ఆదరణ లభిస్తోందని గ్రోత్ సదస్సులో వర్చువల్‌గా పాల్గొన్న వాల్‌మార్ట్ సీఈవో డగ్ మెక్‌మిలన్ తెలిపారు. హీరో ఎకోటెక్ తయారు చేసే క్రూయిజర్ సైకిళ్లు, మిసెస్ బెక్టర్స్ ఉత్పత్తులు, వెల్స్పన్ టవళ్లు మొదలైనవి వీటిలో ఉన్నట్లు పేర్కొన్నారు. -
టాటా పంచ్ ఈవీ వచ్చేసింది
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వాహన తయారీ సంస్థ టాటా మోటార్స్ పంచ్ ఎలక్ట్రిక్‌ను భారత మార్కెట్లో ప్రవేశపెట్టింది. ఎక్స్‌షోరూం ధర రూ.10.99 లక్షలతో మొదలై రూ.14.49 లక్షల వరకు ఉంది. గంటకు 100 కిలోమీటర్ల వేగాన్ని 9.5 సెకన్లలో చేరుకుంటుంది. రెండు బ్యాటరీ ప్యాక్ ఆప్షన్స్‌తో లభిస్తుంది. ఒకసారి చార్జింగ్‌తో 25 కిలోవాట్ అవర్ బ్యాటరీతో 315 కిలోమీటర్లు, 35 కిలోవాట్ అవర్ బ్యాటరీతో 421 కిలోమీటర్లు ప్రయాణిస్తుందని కంపెనీ వెల్లడించింది. 190 ఎన్ఎం టార్క్‌తో 120 బీహెచ్పీ, అలాగే 114 ఎన్ఎం టార్క్‌తో 80 బీహెచ్పీ వర్షన్స్‌లో తయారైంది. 6 ఎయిర్‌బ్యాగ్స్, 360 డిగ్రీ కెమెరా, ఏబీఎస్, ఈఎస్సీ, ఈఎస్పీ, క్రూజ్ కంట్రోల్, 360 లీటర్ల బూట్ స్పేస్ వంటి హంగులు ఉన్నాయి. ఎనిమిదేళ్లు లేదా 1,60,000 కిలోమీటర్ల వరకు వ్యారంటీ ఉంది. డెలివరీలు జనవరి 22 నుంచి ప్రారంభం. -
2 బిలియన్లు ఇన్వెస్ట్ చేస్తాం, కానీ..
ముంబై: అమెరికాకు చెందిన ఎలక్ట్రిక్ కార్ల దిగ్గజం టెస్లా భారత మార్కెట్లో ప్రవేశించడంపై మరింతగా కసరత్తు చేస్తోంది. భారత్‌లో ప్లాంటు ఏర్పాటుపై 2 బిలియన్ డాలర్ల వరకు (సుమారు రూ. 16,600 కోట్లు) ఇన్వెస్ట్ చేయడానికి తాము సుముఖంగానే ఉన్నామని, అయితే ఈ క్రమంలో తమకు రెండేళ్ల పాటు దిగుమతి సుంకాలపరంగా కొంత మినహాయింపునివ్వాలని కేంద్రాన్ని కోరుతోంది. సుంకాల మినహాయింపులకు, పెట్టుబడి పరిమాణానికి లంకె పెడుతూ కేంద్ర ప్రభుత్వానికి టెస్లా ఓ ప్రతిపాదన సమరి్పంచినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. దీని ప్రకారం దేశీ మార్కెట్లోకి ప్రవేశించాక రెండేళ్ల పాటు తాము దిగుమతి చేసుకునే కార్లపై సుంకాలను 15 శాతానికే పరిమితం చేయాలని కంపెనీ ప్రతిపాదించింది. 12,000 వాహనాలకు తక్కువ టారిఫ్ వర్తింపచేస్తే 500 మిలియన డాలర్ల దాకా ఇన్వెస్ట్ చేస్తామని, అదే 30,000 వాహనాలకు వర్తింపచేస్తే 2 బిలియన్ డాలర్ల వరకు పెట్టుబడులను పెంచుతామని టెస్లా పేర్కొన్నట్లు సమాచారం. జనవరి నాటికి నిర్ణయం.. ప్రధాని కార్యాలయం మార్గదర్శకత్వంలో టెస్లా ప్రతిపాదనను పరిశ్రమలు, అంతర్గత వాణిజ్య విభాగం (డీపీఐఐటీ), భారీ పరిశ్రమల శాఖ, రోడ్డు రవాణా.. జాతీయ రహదారుల శాఖ, ఆర్థిక శాఖ సంయుక్తంగా మదింపు చేస్తున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. దీనిపై వచ్చే ఏడాది జనవరి నాటికి నిర్ణయం తీసుకోవచ్చని పేర్కొన్నాయి. టెస్లాకు మరీ ఎక్కువ వెసులుబాటు ఇవ్వకుండా అదే సమయంలో గరిష్టంగా 2 బిలియన్ డాలర్ల పెట్టుబడులను దక్కించుకునేలా మధ్యేమార్గంగా పాటించతగిన వ్యూహంపై కసరత్తు జరుగుతోందని వివరించాయి. ఇదే క్రమంలో తక్కువ టారిఫ్‌లతో టెస్లా దిగుమతి చేసుకోవాలనుకుంటున్న వాహనాల సంఖ్యను కుదించడంతో పాటు పలు విధానాలు పరిశీలనలో ఉన్నట్లు పేర్కొన్నాయి. తక్కువ స్థాయి టారిఫ్‌లను, ఈ ఆర్థిక సంవత్సరంలో దేశీయంగా అమ్ముడయ్యే మొత్తం ఎలక్ట్రిక్ వాహనాల్లో (ఈవీ) 10%కి పరిమితం చేయడం, రెండో ఏడాది దీన్ని 20% మేర పెంచడం వీటిలో ఉంది. భారత్‌లో ఈ ఆర్థిక సంవత్సరం 1,00,000 ఈవీలు అమ్ముడవుతాయన్న అంచనాల నేపథ్యంలో తక్కువ టారిఫ్‌లను, అందులో 10%కి, అంటే 10,000 వాహనాలకు పరిమితం చేయొ చ్చని తెలుస్తోంది. దేశీయంగా గత ఆర్థిక సంవత్సరం 50,000 పైచిలుకు ఎలక్ట్రిక్ వాహనాలు అమ్ముడయ్యాయి. మరోవైపు, టెస్లా కూడా భారత్‌లో స్థానికంగా జరిపే కొనుగోళ్లను క్రమంగా పెంచుకునే అవకాశం ఉంది. తొలి రెండేళ్లలో మేడిన్ ఇండియా కార్ల విలువలో 20%, ఆ తర్వాత 4 ఏళ్లలో 40% మేర కొనుగోలు చేసేందుకు కంపెనీ అంగీకరించవచ్చని తెలుస్తోంది. -
భారత్ మార్కెట్లోకి లోటస్ లగ్జరీ కార్లు
న్యూఢిల్లీ: బ్రిటన్ లగ్జరీ స్పోర్ట్స్ కార్ల బ్రాండు లోటస్ తాజాగా భారత మార్కెట్లోకి ప్రవేశించింది. తొలుత ఎలక్ట్రిక్ ’ఎలెటర్ ఆర్’ ఎస్‌యూవీని ప్రవేశపెడుతున్నట్లు తెలిపింది. ఇందులో మూడు వెర్షన్స్ ఉంటాయి. ధర రూ. 2.55 కోట్ల నుంచి రూ. 2.99 కోట్ల (దేశవ్యాప్తంగా ఎక్స్‌షోరూమ్) వరకు ఉంటుంది. దీని గరిష్ట వేగం గంటకు 265 కి.మీ.గా ఉంటుంది. 2.95 సెకన్లలోనే 0 నుంచి 100 కి.మీ. వేగాన్ని (గంటకు) అందుకోగలదు. ఒకసారి చార్జి చేస్తే ఈ ఫైవ్–సీటరు వాహనంలో గరిష్టంగా 600 కి.మీ. వరకు ప్రయాణించవచ్చు. వచ్చే ఏడాది సంప్రదాయ ఇంధనాలతో నడిచే ఎమిరా స్పోర్ట్స్ కారును కూడా అందుబాటులోకి తేనున్నట్లు సంస్థ తెలిపింది. లోటస్ కార్స్‌కు భారత్‌లో అ«దీకృత సంస్థగా ఎక్స్‌క్లూజివ్ మోటర్స్ వ్యవహరిస్తుంది. లోటస్ కార్లు అధునాతన టెక్నాలజీతో అసమాన అనుభూతిని అందిస్తాయని ఎక్స్‌క్లూజివ్ మోటర్స్ ఎండీ సత్య బాగ్లా తెలిపారు. -
జర్మనీ నుంచి టెస్లా దిగుమతులు!
న్యూఢిల్లీ: జర్మనీ ఫ్యాక్టరీలో తయారైన కార్లను దిగుమతి చేసుకోవడం ద్వారా భారత మార్కెట్లో ఎంట్రీ ఇవ్వాలని ఎలక్ట్రిక్ కార్ల దిగ్గజం టెస్లా భావిస్తోంది. చైనాలోనూ ఫ్యాక్టరీ ఉన్నప్పటికీ ఆ దేశంతో నెలకొన్న ఉద్రిక్తతలరీత్యా అక్కణ్నుంచి దిగుమతులపై భారత్ అంత సుముఖంగా లేకపోవడంతో టెస్లా ఈ అంశాన్ని పరిశీలిస్తున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. చైనా నుంచి కార్లను దిగుమతి చేసుకోవద్దంటూ టెస్లా టాప్ మేనేజ్మెంట్కు కేంద్ర ప్రభుత్వ శాఖలు సూచించినట్లు వివరించాయి. దీంతో భారత్‌తో సత్సంబంధాలున్న జర్మనీ నుంచి దిగుమతి చేసుకునే అవకాశం ఉన్నట్లు పేర్కొన్నాయి. జర్మనీలోని బ్రాండెన్‌బర్గ్‌లో టెస్లాకు గిగాఫ్యాక్టరీ ఉంది. భారత మార్కెట్లో 25,000 యూరోల (సుమారు రూ. 20 లక్షలు) కారును ప్రవేశపెట్టే యోచనలో కంపెనీ ఉన్నట్లు వార్తలు వస్తున్న నేపథ్యంలో ఈ పరిణామం ప్రాధాన్యం సంతరించుకుంది. మరోవైపు, జర్మనీ నుంచి దిగుమతి చేసే విద్యుత్ వాహనాలపై కస్టమ్స్ సుంకాల నుంచి మినహాయింపులు ఇవ్వాలని కూడా టెస్లా కోరుతున్నట్లు సంబంధిత వర్గాలు వివరించాయి. ఒకవేళ వాటిపై సుంకాలను 20–30 శాతం మేర తగ్గిస్తే టెస్లా మాత్రమే కాకుండా జర్మనీ కేంద్రంగా కార్యకలాపాలు సాగించే మెర్సిడెస్, బీఎండబ్ల్యూ, ఆడి వంటి పలు లగ్జరీ కార్ల తయారీ సంస్థలకు కూడా ప్రయోజనం లభించవచ్చని పేర్కొన్నాయి. -
భారత్‌లోకి దేవూ రీఎంట్రీ...
న్యూఢిల్లీ: దక్షిణ కొరియా దిగ్గజం పోస్కో దేవూ తాజాగా భారత మార్కెట్లోకి రీఎంట్రీ ఇచ్చింది. ఈసారి కన్జూమర్ ఎల్రక్టానిక్స్, గృహోపకరణాలు, ఎలక్ట్రిక్ వాహనాల విభాగంపై దృష్టి పెట్టింది. కెల్వాన్ ఎల్రక్టానిక్స్ అండ్ అప్లయెన్సెస్‌తో భాగస్వామ్యం కుదుర్చుకుంది. లిథియం హైబ్రిడ్ ఇన్వర్టర్లు, ఎల్ఈడీ టీవీలను విక్రయించే కెల్వాన్ .. కొత్తగా దేవూ బ్రాండ్ కింద ఇంధన, విద్యుత్ రంగానికి సంబంధించిన ఉత్పత్తులతో పాటు కన్జూమర్ ఎల్రక్టానిక్స్ను కూడా ప్రవేశపెట్టనుంది. ఇందుకోసం విక్రయాల పరిమాణాన్ని బట్టి తాము సొంతంగా తయారీ ప్లాంటు ఏర్పాటు చేసే అవకాశం ఉందని, మొత్తం మీద మార్కెటింగ్, పరిశోధన.. అభివృద్ధి కార్యకలాపాలు మొదలైన వాటిపై వచ్చే మూడేళ్లలో రూ. 300 కోట్ల మేర ఇన్వెస్ట్ చేసే అవకాశం ఉందని కెల్వాన్ ఎండీ హెచ్ఎస్ భాటియా తెలిపారు. భారత మార్కెట్లో వేగవంతమైన వృద్ధికి అవకాశాలు ఉన్నాయని, కెల్వాన్ ఎల్రక్టానిక్స్‌తో 10 ఏళ్ల పాటు బ్రాండ్ లైసెన్సింగ్ ఒప్పందం కుదుర్చుకున్నామని దేవూ ఇండియా ఆపరేషన్స్ డైరెక్టర్ చాన్ రియు తెలిపారు. తొలి దశలో కార్లు, ద్విచక్ర వాహనాలకు బ్యాటరీలను అందించడంతో పాటు సోలార్ బ్యాటరీలు, ఇన్వర్టర్లను కూడా ప్రవేశపెట్టనున్నట్లు ఆయన వివరించారు. రాబోయే రోజుల్లో ఎల్ఈడీ టీవీలు, ఆడియో స్పీకర్లు, ఎయిర్ ప్యూరిఫయర్లు, కూలర్లు, ఫ్యాన్లు, ఫ్రిజ్‌లు మొదలైన గృహోపకరణాలను కూడా అందించే యోచ నలో ఉన్నట్లు పేర్కొన్నారు. అలాగే ఈ–బైక్‌లు, ఈ–సైకిల్స్నూ ఆవిష్కరించే ప్రణాళికలు ఉన్నట్లు చాన్ రియు వివరించారు. సియెలోతో ఎంట్రీ.. 1995లో దేవూ తొలిసారిగా సియెలో కారుతో భారత మార్కెట్లోకి ప్రవేశించింది. అటుపైన నెక్సియా, మ్యాటిజ్ కార్లను ప్రవేశ పెట్టింది. 2001లో దేవూకి సంబంధించిన చాలా మటుకు అసెట్స్‌ను జనరల్ మోటర్స్ కొనుగోలు చేసింది. అంతిమంగా 2003–04 నుంచి భారత్‌లో కంపెనీ కార్యకలాపాలు నిలిచిపోయాయి. రాబోయే రోజుల్లో భారత్‌లో ఎలక్ట్రిక్ టూ–వీలర్లకు గణనీయంగా డిమాండ్ పెరగవచ్చన్న అంచనాల నేపథ్యంలో, తిరిగి ఇన్నాళ్లకు మళ్లీ దేశీ మార్కెట్లోకి రావడంపై దేవూ కసరత్తు చేస్తోంది. -
భారత్‌కు థామ్సన్ ల్యాప్టాప్స్
న్యూఢిల్లీ: ఎల్రక్టానిక్స్ తయారీలో ఉన్న థామ్సన్.. భారత ల్యాప్టాప్స్ మార్కెట్లోకి ఎంట్రీ ఇవ్వనుంది. ప్రారంభ, మధ్య, ప్రీమియం విభాగాల్లో 2024 మార్చి నాటికి ల్యాప్‌టాప్స్‌ను ప్రవేశపెట్టనుంది. ప్రస్తుతం యూఎస్, ఫ్రాన్స్, యూరప్‌లో వీటిని విక్రయిస్తోంది. అలాగే భారత్‌లో తయారైన స్మార్ట్ టీవీలు, ఇతర ఉత్పత్తులను విదేశాలకు ఎగుమతి చేయాలని కంపెనీ నిర్ణయించింది. భారత్‌లో థామ్సన్ బ్రాండ్ లైసెన్స్ కలిగిన సూపర్ ప్లాస్ట్రానిక్స్ రూ.300 కోట్లతో అత్యాధునిక ప్లాంటును ఉత్తర ప్రదేశ్‌లోని హాపూర్ వద్ద స్థాపిస్తోంది. ప్లాంటు అందుబాటులోకి వస్తే టీవీల తయారీలో సూపర్ ప్లాస్ట్రానిక్స్ వార్షిక సామర్థ్యం 20 లక్షల యూనిట్లకు చేరుతుంది. 15 ఏళ్ల విరామం తర్వాత 2018లో సూపర్ ప్లా్రస్టానిక్స్ భాగస్వామ్యంతో థామ్సన్ భారత్‌లో రీఎంట్రీ ఇచి్చంది. స్మార్ట్ టీవీలతోపాటు వాషింగ్ మెషీన్స్, ఎయిర్ కండీషనర్స్, చిన్న ఉపకరణాలను భారత్‌లో విక్రయిస్తోంది. టాప్–5లో భారత్.. అంతర్జాతీయంగా భారత్‌ను టాప్–5లో నిలబెట్టాలని లక్ష్యంగా చేసుకున్నట్టు థామ్సన్‌ను ప్రమోట్ చేస్తున్న యూఎస్‌కు చెందిన ఎస్టాబ్లి‹Ù్డ ఇంక్ సేల్స్ డైరెక్టర్ సెబాస్టియన్ క్రాంబెజ్ తెలిపారు. ‘భారత్‌లో తయారైన ఉత్పత్తులను కొనుగోలు చేయాలని యూరప్‌లోని భాగస్వాములను ప్రోత్సహిస్తాం. వారు డబ్బులు ఆదా చేయడంతోపాటు ఇక్కడి ఉత్పత్తులు పోటీ ధరలో లభిస్తాయి. నాణ్యత కూడా బాగుంది. వారు భారత్ నుండి ఉత్పత్తులను కొనుగోలు చేయాలని మేము కోరుకుంటున్నాము. ఇటువంటి అవకాశాలు టీవీలకు మాత్రమే పరిమితం కాదు. ల్యాప్టాప్స్, స్మార్ట్‌ఫోన్స్‌కు కూడా విస్తరించే అవకాశం ఉంది’ అని వివరించారు. సూపర్ ప్లా్రస్టానిక్స్‌కు భారత్‌లో కొడాక్, బ్లాపంక్ట్, వైట్ వెస్టింగ్‌హౌజ్ టీవీ, వైట్ వెస్టింగ్‌హౌజ్ (ఎలక్ట్రోలక్స్) బ్రాండ్ల హక్కులు సైతం ఉన్నాయి. -
షాకిస్తున్న బంగారం ధర: కొనగలమా? నవంబరు నాటికి..!
Today Gold and Silver prices రికార్డు స్థాయి నుంచి కిందికి దిగివచ్చినట్టే వచ్చిన పసిడి ధరలు మళ్లీ ఊపందుకున్నాయి. రానున్న పండుగల సీజన్లో బంగారానికి డిమాండ్ పెరనున్న నేపథ్యంలో పెరుగుతున్న ధరలను పసిడి ప్రియులకు షాకిస్తున్నాయి. అంతర్జాతీయ మార్కెట్ల సంకేతాలతో వెండి బంగారం మళ్లీ పెరుగుదల దిశగా కదులుతున్నాయి. శనివారం నాడు 22 క్యారెట్ల పసిడి 10 గ్రాములకు రూ. 55,000కి చేరుకున్నాయి .అలాగే భారతదేశంలో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు రూ. 60వేల దిశగా కదులుతోంది.(జ్యూస్ అమ్ముకునే స్థాయినుంచి రూ.5 వేల కోట్ల దాకా: ఎవరీ సౌరభ్?) శనివారం నాడు హైదరాబాద్ మార్కెట్లో 22 క్యారెట్ల బంగారం 200 రూపాయలు పెరిగి రూ. 54,900 వద్ద, 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు 220పెరిగి రూ. 59,890 వద్ద ఉంది. అటే వెండి కూడా లాభాల్లోనే ఉంది. రూ. 700రూపాయలు ఎగిసి కిలోవెండి ధర రూ. 78,200 పలుకుతోంది. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో బంగారం డిమాండ్ ఉండే బ్యాక్-టు-బ్యాక్ పండుగల నేపథ్యంలో సెప్టెంబరు- నవంబర్ త్రైమాసికంలో పసిడి మెరుస్తూనే ఉంటుందని,ఈ నవంబర్ 2023 చివరి నాటికి 62 వేలకు దాటవచ్చనేది అంచనా. యూఎస్ ఆర్థిక డేటా , డాలర్ , ముడి చమురు ధరలలో పెరుగుదలో అంతర్జాతీయంగా కూడా బంగారం ధరలు ఔన్సు 2,090డాలర్ల రికార్డు స్థాయికి చేరుకోవచ్చని అంచనా. అంతర్జాతీయ మార్కెట్లో ఔన్సు బంగారం ధర 1,923 డాలర్ల వద్ద ముగిసింది. ఏది ఏమైనా బంగారం ధరలు యూఎస్ ఫెడ్ ధోరణి, జాతీయ, అంతర్జాతీయ పరిణామాలు, అమెరికా కరెన్సీ డాలరు కదలికల ఆధారంగా మారుతూ ఉంటాయి అనేది గమనార్హం. (భారతీయ విద్యార్థులకు షాక్: వీసా ఫీజు భారీగా పెంపు) -
హోండా ఎలివేట్ వచ్చేసింది
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వాహన తయారీ సంస్థ హోండా కార్స్ ఇండియా భారత మార్కెట్లోకి మధ్యస్థాయి ఎస్యూవీ ఎలివేట్ ప్రవేశపెట్టింది. ఎలివేట్‌కు భారత్ తొలి మార్కెట్ కాగా, ఈ మోడల్ ద్వారా కంపెనీ మధ్యస్థాయి ఎస్‌యూవీల్లోకి ఎంట్రీ ఇచ్చింది. ధర ఎక్స్‌షోరూంలో రూ.10.99–15.99 లక్షలు ఉంది. 121 పీఎస్ పవర్, 145 ఎన్ఎం టార్క్‌తో 6–స్పీడ్ మాన్యువల్, 7–స్పీడ్ సీవీటీ ట్రిమ్స్‌లో 1.5 లీటర్ ఐ–వీటీఈసీ పెట్రోల్ ఇంజన్ పొందుపరిచారు. లీటరుకు మైలేజీ మాన్యువల్ ట్రిమ్ 15.31, సీవీటీ 16.92 కిలోమీటర్లు అని కంపెనీ తెలిపింది. అడ్వాన్స్డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టంతో తయారైంది. 6 ఎయిర్‌బ్యాగ్స్, లేన్ వాచ్ కెమెరా, ఎల్రక్టానిక్ స్టెబిలిటీ, ట్రాక్షన్ కంట్రోల్‌తో వెహికిల్ స్టెబిలిటీ అసిస్ట్, హిల్ స్టార్ట్ అసిస్ట్, మల్టీ యాంగిల్ రేర్ వ్యూ కెమెరా, 458 లీటర్ల కార్గో స్పేస్, 7 అంగుళాల హెచ్డీ ఫుల్ కలర్ టీఎఫ్టీ మీటర్ క్లస్టర్, 10.25 అంగుళాల ఐపీఎస్ హెచ్డీ ఎల్సీడీ టచ్ స్క్రీన్ డిస్ప్లే ఆడియో, డ్రైవ్ వ్యూ రికార్డింగ్ వంటి హంగులు ఉన్నాయి. హ్యుందాయ్ క్రెటా, మారుతీ సుజుకీ గ్రాండ్ విటారా, కియా సెల్టోస్, టయోటా అర్బన్ క్రూజర్ హైరైడర్‌కు పోటీనిస్తుంది. అయిదు ఎస్‌యూవీలు: భారత్‌లో 2030 నాటికి అయిదు ఎస్‌యూవీలను ప్రవేశపెట్టనున్నట్టు హోండా కార్స్ ఇండియా ప్రెసిడెంట్, సీఈవో టకూయా సుముర తెలిపారు. ‘భారత ప్యాసింజర్ కార్ల పరిశ్రమలో ఎస్‌యూవీల వాటా ఏడాదిలో 43 నుంచి 48 శాతానికి చేరింది. ఈ విభాగం కంపెనీకి చాలా కీలకం కానుంది. ఎలివేట్ చేరికతో కంపెనీకి కొత్త కస్టమర్లు తోడు కానున్నారు. ఎస్యూవీ విభాగంలో లేకపోవడంతో చాలా కోల్పోయాం. అందుకే ఎలివేట్‌ను పరిచయం చేయడం గొప్పగా భావిస్తున్నాం’ అని వివరించారు. రాజస్తాన్‌లోని ప్లాంటు సామర్థ్యాన్ని పెంచామని, ప్రస్తుతం రోజుకు 660 యూనిట్లు ఉత్పత్తి చేయగలమని చెప్పారు. జూలై నుంచి ఎలివేట్ బుకింగ్స్ ప్రారంభం అయ్యాయి. -
కవాసాకి కొత్త బైక్ వచ్చేసింది: ధర వింటే షాకవుతారు!
2024 Kawasaki Z900RS: కవాసాకి ఇండియా Z900RS 2024 బైక్‌ను భారత మార్కెట్లో లాంచ్ చేసింది. దీని ధరను రూ. 16.80 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా నిర్ణయించింది. జెడ్ 900ఆర్ఎస్ 2024 మోడల్ మెటాలిక్ డయాబ్లో బ్లాక్ పెయింట్ థీమ్‌లో లభిస్తుంది. 2024 మోడల్ బైక్లోదాదాపు పాత ఫీచర్లనే అందించింది.ముందు భాగంలో రౌండ్ హెడ్‌లైట్, ట్విన్-పాడ్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, టియర్-డ్రాప్-ఆకారపు ఇంధన ట్యాంక్, సింగిల్-పీస్ సాడిల్, సైడ్-స్లంగ్ ఎగ్జాస్ట్,, రెండు చివర్లలో స్పోక్-స్టైల్ కాస్ట్ వీల్స్. 2024 మోడల్బైక్లో ఫుల్-LED లైటింగ్, సెమీ-డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, డ్యూయల్-ఛానల్ ABS, కవాసకి ట్రాక్షన్ కంట్రోల్ , అసిస్ట్ , స్లిప్పర్ క్లచ్ మెకానిజంతో తీసుకొచ్చింది. హార్డ్‌వేర్‌లో ట్విన్ 300mm ఫ్రంట్ డిస్క్‌లు, సింగిల్ 250mm రియర్ రోటర్, అప్‌సైడ్ డౌన్ ఫ్రంట్ ఫోర్క్స్ ,రియర్ మోనోషాక్ ఉన్నాయి. ఇంజీన్ 948cc, ఇన్లైన్ ఫోర్-సిలిండర్, లిక్విడ్-కూల్డ్ ఇంజిన్‌ను కలిగి ఉంటి. సిక్స్-స్పీడ్ గేర్‌బాక్స్‌తో అనుసంధానించబడిన ఈ మోటార్ గరిష్టంగా 8,500rpm వద్ద 107bhp , 6,500rpm వద్ద 95Nm గరిష్ట టార్క్‌ను ప్రొడ్యూస్ చేస్తుంది. ముఖ్యంగా, ఈ ఇంజన్ సరికొత్త ఉద్గార ప్రమాణాలకు అనుగుణంగా ఉంటుంది.భారత మార్కెట్లో ట్రయంఫ్ బోన్నెవిల్లే T100 ,స్పీడ్ ట్విన్ వంటి వాటికి గట్టిపోటి ఇవ్వనుందని మార్కెట్ అంచనాలు. -
కొనుగోలుదారులకు గుడ్ న్యూస్, దిగొస్తున్న పసిడి, వెండి ధరలు
Today August 2nd gold and silver prices: హైదరాబాద్ మార్కెట్లో వెండి, బంగారం ధరలు వరుసగా దిగి వస్తున్నాయి. శ్రావణ మాసంలో బంగారం, వెండి ఆభరణాలకు ఎక్కువ డిమాండ్ ఉంటుంది. ఈనేపథ్యంలో వరుస సెషన్లలో బంగారం కాస్త నెమ్మదిస్తున్నారు.తాజాగా 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర 300 రూపాయలు క్షీణించి రూ. 55,110 గా ఉంది.అలాగే 24 క్యారెట్ల 10 గ్రాముల పుత్తడి 330 రూపాయలు తగ్గి రూ. 66110గా ఉంది. అటు వెండి ధర కూడా తగ్గింది. కిలోవెండి ధర 700 రూపాయలు పతనమై రూ. 80,300గా ఉంది. ( దేశంలోని ప్రధాన నగరాల్లో ఈరోజు (ఆగస్టు 2) బంగారం ధరలకోసం క్లిక్ చేయండి) దేశంలోని ప్రధాన నగరాల్లో కిలో వెండి ధర 1 కేజీ వెండి ధర ఢిల్లీ- రూ.77,300 చెన్నై- రూ. 80,300 ముంబై - రూ. 77,300 కోల్‌కతా - రూ. 78,000 బెంగళూరు - 76,500 ఎంసీఎక్స్ షాక్ మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ (MCX)లో మంగళవారం భారత మార్కెట్లో క్షీణించిన పసిడి ధరలు ఆగస్టు 2, బుధవారం బంగారం, వెండి ధరలు రెండూ పెరిగాయి. అక్టోబర్ 5, 2023న మెచ్యూర్ అయ్యే గోల్డ్ ఫ్యూచర్స్ MCXలో రూ. 182 లేదా 0.31 శాతం స్వల్ప పెరుగుదను నమోదు చేశాయి. అంతర్జాతీయ మార్కెట్ అమెరికా డాలర్‌తోపోలిస్తే బుధవారం బంగారంధర పెరిగింది. ట్రెజరీ దిగుబడులు, ఆసియా స్టాక్‌లు ఫిచ్ అమెరికా ట్రిపుల్-ఎ క్రెడిట్ రేటింగ్‌ను డౌన్‌గ్రేడ్ చేయడంతో డాలర్ బలహీన పడింది. దీంతో సురక్షితమైన బులియన్‌పై ఆసక్తిని పెంచిందని రాయిటర్స్ నివేదించింది. తాజా మెటల్ నివేదిక ప్రకారం స్పాట్ బంగారం 0.2 శాతం పెరిగి ఔన్స్‌కు 1,946.97 డాలర్లగానూ, అమెరికా గోల్డ్ ఫ్యూచర్స్ 0.3 శాతం పెరిగి 1,984కి డాలర్లు చేరుకుంది. -
శాంసంగ్ కొత్త మడత ఫోన్లు వచ్చేశాయ్..అదిరిపోయే ఆఫర్‌తో...
Samsung Galaxy Z Fold 5 and Z Flip 5: స్మార్ట్‌ఫోన్ దిగ్గజం శాంసంగ్ బుధవారం సియోల్‌లో జరిగిన గెలాక్సీ అన్ప్యాక్డ్ ఈవెంట్లో రెండు కొత్త ఫోల్డింగ్ ఫోన్లను విడుదల చేసింది. గెలాక్సీ జెడ్ ఫోల్డ్5 , గెలాక్సీ జెడ్ ఫ్లిప్ 5 పేరుతో రెండు ఫోల్డబుల్ స్మార్ట్పోన్లను తీసుకొచ్చింది. అలాగే గెలాక్సీ వాచ్ 6 సిరీస్, గెలాక్సీ ట్యాబ్ ఎస్9 సిరీస్‌ను కూడా ఆవిష్కరించింది.గత సంవత్సరం మాదిరిగానే, కొత్తగెలాక్సీ S9 సిరీస్‌లో మూడు మోడల్స్తీసుకొచ్చింది. గెలాక్సీ ట్యాబ్ ఎస్9, గెలాక్సీ ఎస్9 ప్లస్, గెలాక్సీ ఎస్ 9 అల్ట్రా మోడల్స్‌ను లాంచ్ చేసింది. ('ట్యాప్ & పే' ఫీచర్‌తో శాంసంగ్ గెలాక్సీ వాచ్ 6..యాపిల్‌కు షాకే!) ప్రీమియం సెగ్మెంట్లో ఆండ్రాయిడ్ ప్రత్యర్థులైన షావోమి, ఒప్పో లాంటి కంపెనీలకు గట్టి పోటీ ఇవ్వనుంది. కొత్తగా లాంచ్ అన్ని డివైస్‌లు ప్రీ-ఆర్డర్ కోసం అందుబాటులో ఉంటాయి. Snapdragon 8 Gen 2 SoC కొత్త కీలు డిజైన్‌తోపాటు Z Flip 5 డిస్ప్లేకి కొన్ని అప్గ్రేడ్లను కూడా చేసింది. (మారుతి జిమ్నీని సింగిల్ బెడ్‌తో అలా మార్చేసిన జంట; వైరల్ వీడియో) కొత్త ఫోల్డబుల్ స్మార్ట్ఫోన్లు, ధరలు గెలాక్సీ జెడ్ ఫ్లిప్ 5 (8 జీబీ ర్యామ్ + 256జీబీ స్టోరేజ్): రూ 99,999 గెలాక్సీ జెడ్ ఫ్లిప్ 5 (8జీబీ ర్యామ్ + 512 జీబీ స్టోరేజ్): రూ 1,09,999 గెలాక్సీ జెడ్ ఫోల్డ్5 (12 జీబీ ర్యామ్ + 256జీబీ స్టోరేజ్ ): రూ 1,54,999 గెలాక్సీ జెడ్ ఫోల్డ్5 (12జీబీ ర్యామ్ + 512 జీబీ స్టోరేజ్): రూ 1,64,999 గెలాక్సీ జెడ్ ఫోల్డ్5 (12జీబీ ర్యామ్ + 1టీబీ స్టోరేజ్): రూ 1,84,999 ప్రీ-బుకింగ్ కస్టమర్లు రూ. 23,000 (జెడ్ ఫ్లిప్ 5 కోసం రూ. 20,000) వరకు విలువైన ప్రయోజనాలను పొందుతారని శాంసంగ్ వెల్లడించింది. ఇందులో క్యాష్‌బ్యాక్ అప్‌గ్రేడ్ బోనస్‌లు ఉంటాయని పేర్కొంది. ప్రీ-బుకింగ్ విండో జూలై 27 నుంచి మొదలు. ఆగస్టు 17 లైవ్ సేల్, ఆ తర్వాత విక్రయాలు ఉంటాయి. -
శాంసంగ్ లాంచ్ ఈవెంట్: అంచనాలు మామూలుగా లేవుగా!
Galaxy Unpacked 2023: దక్షిణ కొరియా దిగ్గజం శాంసంగ్ ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్‌తో సహా కొత్త ఉత్పత్తులను ఆవిష్కరించనుంది. గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 5, గెలాక్సీ ఫ్లిప్ 5లను భారత మార్కెట్లో తీసుకొచ్చేందుకు సిద్దమవుతోంది. దక్షిణ కొరియాలోని సియోల్‌లో డిజిటల్ ఇన్ పర్సన్ ఈవెంట్‌గా జరుగుతుంది. మెరుగైన కెమెరాలు, బిగ్ డిస్ప్లే లాంటివి ఫీచర్లతో ముఖ్యంగా క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 2 ప్రాసెసర్‌తో తీసుకురానుందని అంచనా. దీనికి తోడు ప్రముఖ టిప్‌స్టర్ అభిషేక్ యాదవ్ వీటి ధర, ముందస్తు ఆఫర్ గురించి లీక్ చేయడంతో మరింత ఉత్కంఠ పెరిగింది. ఈ లీక్ ప్రకారం శాంసంగ్ గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 5 ధర రూ. 1,49,999గా ఉంటుందని, ప్రారంభ ఆఫర్ కింద మీరు దీన్ని రూ. 1,43,999కే కొనుగోలు చేయవచ్చని తెలుస్తోంది. అదేవిధంగా శాంసంగ్ గెలాక్సీ జెడ్ ఫ్లిప్ 5 ధర రూ.99,999గఘుంది. అయితే ప్రారంభ ఆఫర్ కింద మీరు దీన్ని రూ. 94,999కి కొనుగోలు చేయవచ్చని తెలిపారు. శాంసంగ్ గెలాక్సీ జెడ్ ఫోల్డ్ : 5, 7.6 అంగుళాల ఇన్నర్ డిస్ప్లే, 6.2 అంగుళాల కవర్ డిస్ప్లే, 50+12+10 ఎంపీ ట్రిపుల్ కెమెరా, 12 ఎంపీ సెల్పీ కెమెరా లాంటివి ప్రధాన ఫీచర్లుగా ఉండనున్నాయి. అలాగే 6.7 అంగుళాల మెయిన్ డిస్ప్లే, 3.4 అంగుళాల కవర్ డిస్ప్లేతో గెలాక్సీ ఫ్లిప్ ఫోన్ తీసుకొస్తోంది. అయితే అధికారిక లాంచింగ్ తరువాత దీనిపై పూర్తి క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. గెలాక్సీ వాచెస్, గెలాక్సీ ట్యాబ్స్ శాంసంగ్ గెలాక్సీ వాచ్ 6 , వాచ్ 6 క్లాసిక్‌లను కూడా లాంచ్ చేయనుంది. బిగ్ స్క్రీన్లు సన్నని బెజెల్‌లను కలిగి ఉంటాయని అంచనా. దీంతోపాటు అప్‌గ్రేడ్ చేసిన డిస్ప్లేలు , ప్రాసెసర్లతో Tab S9, S9 ప్లస్ , S9 అల్ట్రాలను కలిగి ఉండే Galaxy Tab S9 సిరీస్‌ని కూడా లాంచ్ చేయనుంది. తొలి స్మార్ట్ రింగ్ అంతేకాదు శాంసంగ్ తన తొలి స్మార్ట్ రింగ్, గెలాక్సీ రింగ్, కొత్త వైర్లెస్ ఇయర్‌బడ్‌లు, బడ్స్ 3తో కూడా ఫ్యాన్స్‌ను ఆశ్చర్యపరచవచ్చని భావిస్తున్నారు. -
ఆడి క్యూ8 ఈ–ట్రాన్ వస్తోంది
న్యూఢిల్లీ: లగ్జరీ కార్ల తయారీలో ఉన్న జర్మనీ కంపెనీ ఆడి భారత మార్కెట్లో క్యూ8 ఈ–ట్రాన్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీని 2023 ఆగస్ట్‌లో ఆవిష్కరిస్తోంది. ఎస్యూవీ, స్పోర్ట్‌బ్యాక్ రకాల్లో విడుదల చేయనుంది. 114 కిలోవాట్ బ్యాటరీ పొందుపరిచారు. పూర్తిగా తయారైన కారును భారత్‌కు దిగుమతి చేసుకుంటారు. ఎలక్ట్రిక్ వాహన విభాగంలో ఇప్పటికే కంపెనీ దేశీయంగా ఈ–ట్రాన్ 50, ఈ–ట్రాన్ 55, ఈ–ట్రాన్ స్పోర్ట్‌బ్యాక్ 55, ఈ–ట్రాన్ జీటీ, ఆర్ఎస్ ఈ–ట్రాన్ జీటీ మోడళ్లను విక్రయిస్తోంది. అంతర్జాతీయంగా అందుబాటులో ఉన్న మోడళ్లను ఇక్కడి మార్కెట్‌కు తీసుకువస్తామని ఆడి ఇండియా హెడ్ బల్బీర్ సింగ్ థిల్లాన్ తెలిపారు. ‘2033 నాటికి పూర్తి ఎలక్ట్రిక్ కంపెనీగా మారాలన్నదే సంస్థ లక్ష్యం. మరిన్ని ఈవీలు ప్రవేశపెడతాం. భారత్‌లో ఈ కార్లు రూ.1.5 కోట్ల సగటు ధరకు అమ్ముడవుతున్నప్పటికీ లగ్జరీ సెగ్మెంట్లో ఆడి ఈవీలు ఆదరణ పొందుతున్నాయి’ అని వివరించారు. అన్ని విభాగాల్లో కలిపి ఆడి ఇండియా 2023 జనవరి–జూన్‌లో 3,474 యూనిట్ల అమ్మకాలను సాధించింది. అంత క్రితం ఏడాదితో పోలిస్తే ఇది 97% ఎక్కువ. -
రియల్మీ నార్జో సిరీస్ 5 జీ స్మార్ట్ఫోన్లు: 100ఎంపీ కెమెరా, ధర, ఇతర ఫీచర్లు
సాక్షి, ముంబై: రియల్మీ నార్జో సిరీస్‌లో కొత్త ఫోన్లు వచ్చేశాయ్. రియల్మీ నార్జో 60, రియల్మీ నార్జో 60 ప్రొ భారత మార్కెట్లో లాంచ్ చేసింది. ఈ రెండు డివైజ్‌లు దేశవ్యాప్తంగా ఉన్న ఆఫ్‌లైన్ రిటైల్ స్టోర్లతో పాటు అమెజాన్ , రియల్మీ ఇండియా వెబ్సైట్ ద్వారా జూలై 15 నుంచి అందుబాటులో ఉంటాయి. రియల్మీ నార్జో 60 ప్రొ ప్రారంభ ధర రూ. 23,999, రియల్మీ నార్జో 60 ప్రారంభ ధర రూ.17,999గా ఉంటాయి. రియల్మీ నార్జో 60 రెండు స్టోరేజ్ మోడల్స్‌లో లభ్యం. బేస్ వేరియంట్ 8జీబీ ర్యామ్, , 128 జీబీ స్టోరేజ్ రూ. 17,999. 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 19,999 గా ఉంటుంది. రియల్మీ నార్జో 60 ప్రొ 8జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ రూ. 23,999 12జీబీ ర్యామ్, 1 టీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 29,999. రియల్మీ నార్జో 60 ప్రొ స్పెసిఫికేషన్స్ 6.9-అంగుళాల కర్వ్డ్ స్క్రీన్‌తో 120Hz రిఫ్రెష్ రేట్ MediaTek డైమెన్సిటీ 7050 ప్రాసెసర్ Android 13 ఆపరేటింగ్ సిస్టమ్ 100 ఎంపీ+ 2ఎంపీ రియల్ కెమెరా 16 ఎంపీ సెల్ఫీ కెమెరా 5,000mAh బ్యాటరీతో 67W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ రియల్మీ నార్జో 60 స్పెసిఫికేషన్స్ 6.43-అంగుళాల AMOLED స్క్రీన్ ,90Hz రిఫ్రెష్ రేట్ 64+2ఎంపీ రియర్ కెమెరా 16ఎంపీ సెల్ఫీకెమెరా 5,000mAh బ్యాటరీ, 33వాట్ల ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ప్రీ-ఆర్డర్ ఆఫర్: నార్జో 60 5జీ కొనుగోలుపై 1,000 కూపన్ లభ్యం. దీంతోపాటు ఐసీఐసీఐ, ఎస్బీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌లను ఉపయోగించి నార్జో 60 Pro 5జీ ని కొనుగోలు చేసే వారికి ఫ్లాట్ రూ. 1,500 తక్షణ తగ్గింపు.