సాక్షి, ముంబై: దేశీయ మార్కెట్లో బంగారం రికార్డు స్థాయికి చేరింది. ప్రపంచ మాంద్యం భయాల నేపథ్యంలో పసిడికి డిమాండ్ పెరిగింది. ఇన్వెస్టర్ల కొనుగోళ్లతో దేశీయమార్కెట్లో పసిడి ధర రూ. 56,200 దాటి రికార్డు స్థాయికి చేరుకుంది. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ఔన్స్ 1,898 డాలర్లు, వెండి ఔన్స్ 23.73 డాలర్ల వద్ద ట్రేడవుతోంది.
శుక్రవారం బంగారం ధర రికార్డు గరిష్ట స్థాయికి చేరుకుందనిహెచ్‌డిఎఫ్‌సి సెక్యూరిటీస్ తెలిపింది. తద్వారా ఆగస్టు 2020లో రూ. 56,191 నమోదైన మునుపటి రికార్డును అధిగమించింది. రాజధాని నగరం ఢిల్లీలో గోల్డ్ 10 గ్రాముల ధర రూ.121 పెరిగి రూ.56,236కి చేరుకుంది.
ఈ రోజు (జనవరి 13) 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ. 220 ఎగిసి రూ. 56,290 స్థాయికి చేరింది. వెండి ధర కూడా ఇదే బాటలో ఉంది. హైదరాబాద్‌లో 24 క్యారెట్ల స్వచ్ఛత గల బంగారం రూ.56,290గా ఉంది. కిలో వెండి ధర 74వేల రూపాయలుగా ఉంది. బెంగళూరులో రూ.56,340కి వద్ద ఉంది. చెన్నైలో 24 క్యారెట్ల పసిడి ధర రూ. 57,250 గా ఉంది.
ఎంసీఎక్స్ మార్కెట్లో గోల్డ్ ఫిబ్రవరి ఫ్యూచర్స్ (మధ్యాహ్నం 3 గంటలకు) 10 గ్రాములు, దాదాపు 0.50 శాతం రూ. 56,140 పలికింది. బలహీనమైన డాలర్, అమెరికాలో ద్రవ్యోల్బణం, ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేటు పెంపు నెమ్మదించవచ్చనే అంచనాలు పసిడికి బలాన్నిస్తున్నాయి. డిసెంబర్‌లో యూఎస్ వినియోగదారుల ధరలు తగ్గడంతో రానున్న రోజుల్లో ద్రవ్యోల్బణం తగ్గుముఖం పట్ట వచ్చన్న ఆశాభావం వ్యక్తమవుతోంది.
Comments
Please login to add a commentAdd a comment