కరకర @ 50,000 కోట్లు! | Desi companies are stealing the snacks market | Sakshi
Sakshi News home page

కరకర @ 50,000 కోట్లు!

Published Fri, Aug 16 2024 6:20 AM | Last Updated on Fri, Aug 16 2024 9:46 AM

Desi companies are stealing the snacks market

యునైటెడ్‌ ‘స్నాక్స్‌’ ఆఫ్‌ ఇండియా!  

స్నాక్స్‌ మార్కెట్‌ను కొల్లగొడుతున్న దేశీ కంపెనీలు 

సాంప్రదాయ ‘బ్రాండెడ్‌’ రుచులకు జనాల లొట్టలు... 

పాశ్చాత్య పొటాటో చిప్స్‌ వంటి వాటికి దీటుగా వ్యాపారం 

సగం వాటా సాంప్రదాయ ప్యాకేజ్డ్‌ స్నాక్స్‌దే... 

హల్దీరామ్స్, బాలాజీ, బికాజీ జోరు..

కరకరలాడే సేవ్‌ భుజియా, వేయించిన పల్లీలు, బఠానీలు, మిక్చర్, జంతికలు ఇలా ఒకటేమిటి.. సాంప్రదాయ చిరుతిళ్లను ఇప్పుడు ఐదు, పది రూపాయల ప్యాకెట్లలో భారతీయులు లొట్టలేసుకుంటూ తినేస్తున్నారు. పొటాటో చిప్స్‌ ఇతరత్రా పాశ్చాత్య స్నాక్స్‌ హవాకు సాంప్రదాయ, బ్రాండెడ్‌ ప్యాకేజ్డ్‌ స్నాక్స్‌ గండికొడుతున్నాయి. విదేశీ, దేశీ కంపెనీలు మారుమూల ప్రాంతాల జనాలకు సైతం ఈ ప్యాకేజ్డ్‌ స్నాక్స్‌ను అందిస్తూ మార్కెట్‌ను భారీగా విస్తరించేందుకు పోటీ పడుతున్నాయి. 

దేశీయంగా సాల్టెడ్‌ స్నాక్స్‌ అమ్మకాలు గత ఆర్థిక సంవత్సరంలో ఏకంగా రూ.50,800 కోట్లకు ఎగబాకాయి. కరోనా మహమ్మారి తర్వాత భారతీయ స్నాక్స్‌ వాటా క్రమంగా జోరుందుకుంటూ వస్తోంది. ప్రస్తుతం మొత్తం స్నాక్స్‌ మార్కెట్లో సాంప్రదాయ రుచుల వాటా 56 శాతానికి చేరుకోవడం దీనికి నిదర్శనం. 

ఐదు, పది రూపాయల చిన్న ప్యాకెట్ల రూపంలో రకరకాల దేశీ రుచులన్నీ లభించడంతో పాటు విదేశీ స్నాక్స్‌ రకాలతో పోలిస్తే కొంత ఎక్కువ పరిమాణం కూడా ఉంటుండటం దేశీ స్నాక్స్‌ జోరుకు ప్రధాన కారణంగా నిలుస్తోందని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. ‘భారతీయులు ఎక్కువగా సాంప్రదాయ రుచులనే ఇష్టపడతారు. ఇప్పుడిది స్నాక్స్‌ మార్కెట్లో కూడా ప్రతిబింబిస్తోంది’ అని  బికనీర్‌వాలా ఫుడ్స్‌ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ సురేశ్‌ గోయెల్‌ పేర్కొన్నారు. ఈసంస్థ దేశవ్యాప్తంగా సాంప్రదాయ రెస్టారెంట్ల నిర్వహణతో పాటు బికానో బ్రాండ్‌తో స్నాక్స్‌ ప్యాకెట్లను కూడా విక్రయిస్తోంది. 

రెండు దశాబ్దాల క్రితం వాటిదే జోరు... 
మొత్తం దేశీ స్నాక్స్‌ మార్కెట్లో బంగాళదుంప చిప్స్, కుర్‌కురే, ఫింగర్‌ స్టిక్స్‌ వంటి పాశ్చాత్య స్నాక్స్‌ వాటా రెండు దశాబ్దాల క్రితం మూడింట రెండొంతుల మేర ఉండేది. దీన్ని కూడా పెప్సీ ఫ్రిటో లేస్, ఐటీసీ ఫుడ్స్‌ వంటి కార్పొరేట్‌ దిగ్గజాలే శాసిస్తూ వచ్చాయి. ‘గతంలో బడా కంపెనీలు విక్రయించే పాశ్చాత్య స్నాక్స్‌ ఇంటింటా తిష్ట వేశాయి. ఇప్పుడీ ట్రెండ్‌ రివర్స్‌ అవుతోంది.

 సాంప్రదాయ స్నాక్స్‌ తయారీదారులు తమ పంపిణీ వ్యవస్థను విస్తరించుకోవడం ద్వారా పల్లెటూర్లకు కూడా చొచ్చుకుపోతున్నాయి’ అని గోయెల్‌ చెప్పారు. కొత కొన్నేళ్లుగా సాంప్రదాయ స్నాక్స్‌ విభాగం భారీగా అమ్మకాలను కొల్లగొడుతోంది. ఇక మార్కెట్‌ వాటా విషయానికొస్తే, సాల్టెడ్‌ స్నాక్స్‌లో హల్దీరామ్స్, పెప్సీ, బాలాజీ, ఐటీసీ, బికాజీ వంటి పెద్ద కంపెనీలకు 60 శాతం మార్కెట్‌ వాటా ఉండగా.. మిగతా 40 శాతాన్ని చిన్నాచితకా కంపెనీలు, ప్రాంతీయ సంస్థల చేతిలో ఉండటం విశేషం.

 పెద్ద కంపెనీలతో పోలిస్తే ఎక్కువ గ్రాములను అందిస్తుండటం, మరిన్ని స్థానిక రుచులతో ఉత్పత్తులను ప్రవేశపెడుతుండటం వాటికి కలిసొస్తోంది. ‘ఇప్పటికే పాతుకుపోయిన కంపెనీలు సాంప్రదాయ స్నాక్స్‌లో జోరు పెంచుతుండగా.. ప్రాంతీయంగా పేరొందిన కంపెనీలు సైతం క్రమంగా జాతీయ స్థాయిలో విస్తరిస్తున్నాయి’ అని పార్లే ప్రొడక్ట్స్‌ సీనియర్‌ కేటగిరీ హెడ్‌ కృష్ణారావు బుద్ధ చెబుతున్నారు. ఇలా అందరూ స్థానిక సాంప్రదాయ రుచులను అందించేందుకు పోటీపడుతుండటంతో వాటి అమ్మకాలు కూడా పెరిగేందుకు దోహదం చేస్తోందని, దీంతో అన్‌బ్రాండెడ్‌ సంస్థల నుంచి మార్కెట్‌ క్రమంగా సంస్థాగత కంపెనీల చేతికి వెళ్తోందని ఆయన పేర్కొన్నారు.

హల్దీరామ్స్‌ హవా...
ప్రస్తుతం దేశంలో ఏ మారుమూలకెళ్లినా హల్దీరామ్స్‌ పేరు తెలియని వారుండరంటే అతిశయోక్తి కాదేమో! మిక్చర్‌ పొట్లం, పల్లీల ప్యాకెట్‌ నుంచి రకరకాల ఉత్తరాది, దక్షిణాది రుచులతో సాంప్రదాయ స్నాక్స్‌కు పర్యాయపదంగా మారిపోయింది ఇది. హల్దీరామ్స్‌ దాదాపు 25% మార్కెట్‌ వాటాతో అగ్రస్థానంలో ఉంది. 2023–24లో కంపెనీ విక్రయాలు 18% ఎగసి రూ.12,161 కోట్లకు చేరాయి. 

పెప్సికో స్నాక్స్‌ అమ్మకాలు 14% పెరిగి రూ. 7,336 కోట్లుగా నమోదయ్యాయి. గుజరాత్‌కు చెందిన బాలాజీ వేఫర్స్‌ సేల్స్‌ 12% వృద్ధితో రూ.5,931 కోట్లకు దూసుకెళ్లడం విశేషం. భారతీయ స్నాక్స్‌ మార్కెట్‌ జోరుతో విదేశీ కంపెనీల ఇక్కడ ఫోకస్‌ పెంచాయి. హల్దీరామ్స్‌ను చేజిక్కించుకోవడానికి అమెరికా ప్రైవేటు ఈక్విటీ (పీఈ) దిగ్గజం బ్లాక్‌స్టోన్‌ రంగంలోకి దిగినట్లు టాక్‌. 51% మెజారిటీ వాటా కోసం బ్లాక్‌స్టోన్‌ రూ. 40,000 కోట్లను ఆఫర్‌ చేసినట్లు సమాచారం. హల్దీరామ్స్‌ విలువను రూ.70,000–78,000 కోట్లుగా లెక్కగట్టినట్లు తెలుస్తోంది.

– సాక్షి, బిజినెస్‌ డెస్క్‌

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement