![Us Likely Spent Over 1 Million To Deport 104 Indian Migrants On Militarys C 17 Flight](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/8/Us-Likely-Spent-Over-1-Mill.jpg.webp?itok=VJJNB_Ru)
అక్రమ వలసదారులైన 104 మంది భారతీయులను స్వదేశానికి తిప్పిపంపేందుకు అమెరికా పెట్టిన ఖర్చు రూ.8.74 కోట్లు. ఒక్కొక్కరికి అయిన వ్యయం రూ.8.40,670. అంటే దాదాపు ఎనిమిదన్నర లక్షలు. ఇందుకోసం అమెరికా వినియోగించిన భారీ మిలిటరీ విమానం... C-17A గ్లోబ్ మాస్టర్ III. సైనికులు, వాహనాలు, సరకులను తరలించేందుకు వీలుగా ఈ విమానాన్ని డిజైన్ చేశారు. అమెరికా వాయుసేనకు ఈ విమానాలు పెద్ద బలం, బలగం.
ఇవి 1995 నుంచి సేవలందిస్తున్నాయి. పౌర విమానయానంతో పోలిస్తే సైనిక విమానాల ప్రయాణ వ్యయం అధికంగా ఉంటుంది. C-17A గ్లోబ్ మాస్టర్ గాల్లోకి లేచిందంటే గంటకు రూ.25 లక్షలు ఖర్చు అవుతుంది. అదే చార్టర్ ఫ్లైట్ విషయంలో గంటకు అయ్యే వ్యయం రూ.7.5 లక్షలే. గగనతలానికి సంబంధించి ఒక్కో దేశానికి ఒక్కోలా భద్రతా ఏర్పాట్లు, వైమానిక విధానాలు ఉంటుంటాయి. అందుకే వాణిజ్య విమానాలు సాధారణంగా ప్రయాణించే గగనతల దారుల్లో కాకుండా మిలిటరీ విమానాలు వేరే మార్గాల్లో రాకపోకలు సాగిస్తాయి.
సాధారణ విమానాశ్రయాల్లో కాకుండా సైనిక స్థావరాల్లోనే మిలిటరీ విమానాలు ఇంధనం నింపుకుంటాయి. 104 మంది భారతీయులతో కాలిఫోర్నియాలో బయల్దేరిన C-17A గ్లోబ్ మాస్టర్... అటుతిరిగి, ఇటుతిరిగి మధ్యమధ్యలో ఆగుతూ సుమారు 43 గంటలు ప్రయాణించి చివరికి పంజాబ్ చేరింది. ఈ మిషన్ ఖర్చు మిలియన్ డాలర్లను మించిందని మరో అంచనా. అలా చూస్తే ఒక్కో భారతీయుడి తిరుగుటపాకు అమెరికాకు అయిన వ్యయం 10 వేల డాలర్లు. సాధారణ టికెట్ రేట్లను పరిశీలిస్తే... శాన్ ఫ్రాన్సిస్కో నుంచి న్యూఢిల్లీకి వన్ వే కమర్షియల్ ఫ్లైట్ ఎకానమీ తరగతిలో రూ. 43,734, బిజినెస్ క్లాస్ అయితే రూ.3.5 లక్షలు ఖర్చు అవుతుంది. అదీ సంగతి!
::జమ్ముల శ్రీకాంత్
(Credit: Hindustan Times)
Comments
Please login to add a commentAdd a comment