Jammula Srikanth
-
ఎల్ సాల్వడార్ మెగా జైలు.. భూమిపై నరకం!
ఎల్ సాల్వడార్.. ఉత్తర, దక్షిణ అమెరికా ఖండాల మధ్యనున్న సెంట్రల్ అమెరికాలో ఓ చిన్న దేశం. ఇందులో ఉందొక మహా కారాగారం. దాని పేరు- టెర్రరిజం కన్ఫైన్మెంట్ సెంటర్. క్లుప్తంగా సెకోట్ (CECOT). అంటే... సెంటర్ ఫర్ కన్ఫైన్మెంట్ ఆఫ్ టెర్రరిజం. ‘ఉగ్రవాద కట్టడి కేంద్రం’ అనొచ్చు. ఈ జైలును ఉద్దేశపూర్వకంగానే నగర వాతావరణానికి దూరంగా పల్లెపట్టున నిర్మించారు. రాజధాని శాన్ సాల్వడార్ కు తూర్పుగా 40 మైళ్ళ దూరంలోని గ్రామీణ ప్రాంతంలో 57 ఎకరాల్లో విస్తరించిన ఈ మెగా ప్రిజన్.. లాటిన్ అమెరికాలోనే అతి పెద్ద జైలు. ఇందులో 40 వేల మంది వరకూ ఖైదీలను బంధించవచ్చు.పేరుమోసిన క్రిమినల్ గ్యాంగ్స్... ప్రత్యేకించి MS-13, బార్లో-18 సభ్యుల్ని ఇక్కడే బంధిస్తుంది ఎల్ సాల్వడార్. ప్రభుత్వ గణాంకాల ప్రకారం 2024 ఆగస్టు నాటికి ఇందులోని ఖైదీల సంఖ్య 14,500. ఈ జైలు విషయంలో ప్రశంసలు తక్కువగా, విమర్శలు ఎకువగా వినిపిస్తాయి. నేరగాళ్ల పట్ల కఠినంగా వ్యవహరించాలని అభిప్రాయపడేవారు ‘సెకోట్’ను సమర్థిస్తారు. మానవ హక్కుల సంస్థలు మాత్రం పదునైన విమర్శలతో విరుచుకుపడతాయి. ఎల్ సాల్వడార్ ప్రభుత్వం చెబుతున్న దానికంటే ఈ జైల్లో ఎక్కువ మంది ఖైదీలున్నట్టు అనధికారిక లెక్కలు సూచిస్తున్నాయి.అతి ఇరుకైన ఈ కారాగారంలో ఒక్కో ఖైదీకి లభించే చోటు కేవలం 6.45 చదరపు అడుగులు. అంతర్జాతీయ ప్రమాణాలకు ఇది విరుద్ధం. ఈ జైల్లో పరిస్థితులు అత్యంత కఠినంగా, ప్రమాదకరంగా ఉంటాయి. దేశ జనాభా ప్రకారం చూస్తే ప్రతి లక్ష మంది పౌరుల్లో 1,659 మంది ఖైదీలతో ఎల్ సాల్వడార్... ప్రపంచంలోనే అత్యధిక తలసరి ఖైదీలున్న దేశం. దోషులుగా నిర్ధారితులై తమ జైళ్ళలో ఉన్న కొందరు ఖైదీలను ఎల్ సాల్వడార్ జైలుకు తరలించాలని అమెరికా భావిస్తోంది.ఈ మేరకు ఎల్ సాల్వడార్కు అగ్రరాజ్యం ‘మాంచి ఆఫర్’ ఇచ్చింది కూడా. అయితే అమెరికా రాజ్యాంగం తమ దేశ పౌరులకు భద్రత కల్పించింది. నేరస్థుల పౌరసత్వాన్ని లాక్కొనే హక్కు ఎవరికీ లేదని అమెరికా కోర్టులు కూడా గతంలో తీర్పులు వెలువరించాయి. దీని ప్రకారం నేరగాళ్లను బహిష్కరించే, వేరే దేశానికి వెళ్లగొట్టే అధికారం అమెరికాకు లేదు.అయితే తమ ఖైదీల నిర్వహణ ఖర్చు తగ్గించుకునే అవకాశాల్ని దేశాధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ అన్వేషిస్తున్నారు. పదే పదే నేరాలకు పాల్పడే అమెరికన్లను అతి తక్కువ ఫీజు చెల్లించి ఇతర దేశాల్లో నిర్బంధించే అవకాశాలను తాను పరిశీలిస్తున్నట్టు ట్రంప్ బాహాటంగానే ప్రకటించారు. దీనిపై విపక్షం నుంచి వ్యతిరేకత వ్యక్తం కావచ్చు. అమెరికా ఖైదీలను తమ దేశంలో బంధిస్తే మానవ హక్కుల ఉల్లంఘన అధికమవుతుందని, మానవ హక్కులు మరింత ప్రమాదంలో పడతాయని ఎల్ సాల్వడార్ స్వచ్ఛంద సంస్థలు ఆక్రోశిస్తున్నాయి.::జమ్ముల శ్రీకాంత్(Credit: Reuters) -
దటీజ్ ‘C-17A గ్లోబ్ మాస్టర్’!
అక్రమ వలసదారులైన 104 మంది భారతీయులను స్వదేశానికి తిప్పిపంపేందుకు అమెరికా పెట్టిన ఖర్చు రూ.8.74 కోట్లు. ఒక్కొక్కరికి అయిన వ్యయం రూ.8.40,670. అంటే దాదాపు ఎనిమిదన్నర లక్షలు. ఇందుకోసం అమెరికా వినియోగించిన భారీ మిలిటరీ విమానం... C-17A గ్లోబ్ మాస్టర్ III. సైనికులు, వాహనాలు, సరకులను తరలించేందుకు వీలుగా ఈ విమానాన్ని డిజైన్ చేశారు. అమెరికా వాయుసేనకు ఈ విమానాలు పెద్ద బలం, బలగం.ఇవి 1995 నుంచి సేవలందిస్తున్నాయి. పౌర విమానయానంతో పోలిస్తే సైనిక విమానాల ప్రయాణ వ్యయం అధికంగా ఉంటుంది. C-17A గ్లోబ్ మాస్టర్ గాల్లోకి లేచిందంటే గంటకు రూ.25 లక్షలు ఖర్చు అవుతుంది. అదే చార్టర్ ఫ్లైట్ విషయంలో గంటకు అయ్యే వ్యయం రూ.7.5 లక్షలే. గగనతలానికి సంబంధించి ఒక్కో దేశానికి ఒక్కోలా భద్రతా ఏర్పాట్లు, వైమానిక విధానాలు ఉంటుంటాయి. అందుకే వాణిజ్య విమానాలు సాధారణంగా ప్రయాణించే గగనతల దారుల్లో కాకుండా మిలిటరీ విమానాలు వేరే మార్గాల్లో రాకపోకలు సాగిస్తాయి.సాధారణ విమానాశ్రయాల్లో కాకుండా సైనిక స్థావరాల్లోనే మిలిటరీ విమానాలు ఇంధనం నింపుకుంటాయి. 104 మంది భారతీయులతో కాలిఫోర్నియాలో బయల్దేరిన C-17A గ్లోబ్ మాస్టర్... అటుతిరిగి, ఇటుతిరిగి మధ్యమధ్యలో ఆగుతూ సుమారు 43 గంటలు ప్రయాణించి చివరికి పంజాబ్ చేరింది. ఈ మిషన్ ఖర్చు మిలియన్ డాలర్లను మించిందని మరో అంచనా. అలా చూస్తే ఒక్కో భారతీయుడి తిరుగుటపాకు అమెరికాకు అయిన వ్యయం 10 వేల డాలర్లు. సాధారణ టికెట్ రేట్లను పరిశీలిస్తే... శాన్ ఫ్రాన్సిస్కో నుంచి న్యూఢిల్లీకి వన్ వే కమర్షియల్ ఫ్లైట్ ఎకానమీ తరగతిలో రూ. 43,734, బిజినెస్ క్లాస్ అయితే రూ.3.5 లక్షలు ఖర్చు అవుతుంది. అదీ సంగతి!::జమ్ముల శ్రీకాంత్(Credit: Hindustan Times) -
ట్రంప్ దెబ్బకు డెలి‘వర్రీ’
ముందే వచ్చిన పురిటినొప్పులు.. నెలలు నిండకుండానే అగ్రరాజ్యంలో కాన్పులు.. ఆస్పత్రులకు పరుగులు.. ఇప్పుడిదే అక్కడ ట్రెండ్!. రేపటి పరిణామాలు ఎటు దారితీస్తాయో తెలియదు. భారతీయులకు ఎంత ఖర్మ... ఎంత దురవస్థ... ఎన్ని అగచాట్లు... ఎంతటి దుర్గతి!. ‘అమెరికా విధాత’ ట్రంప్ గీసిన కలం గీతకు ఒక్క రోజులోనే మారిపోయింది మనోళ్ల తలరాత. పగవాడికి కూడా రాకూడదు ఈ దీనావస్థ... సీన్ ఇప్పుడే ఇలా ఉంది. అమెరికా 47వ అధ్యక్షుడిగా సోమవారం ప్రమాణ స్వీకారం చేసిన ట్రంప్... మరుక్షణమే తమ దేశంలో జన్మతః పౌరసత్వ హక్కు(Birth Right Citizenship)ను రద్దు చేస్తూ కార్యనిర్వాహక ఉత్తర్వు వెలువరించాడు. అమెరికాలో శాశ్వత నివాసితులు కాని వారికి జన్మించే పిల్లలకు జన్మతః పౌరసత్వం సంక్రమించదంటూ ట్రంప్ ఈ నెల 20న ఆదేశం జారీ చేశాడు. ఉత్తర్వు జారీ అయిన నెల రోజుల తర్వాత ఆ ఆదేశం అమల్లోకొస్తుంది. అంటే గడువు ఫిబ్రవరి 20. ఈ తేదీ ఇప్పుడు అమెరికాలో ఉంటున్న భారతీయ దంపతుల గుండెల్లో రైళ్లు పరుగెత్తిస్తోంది. ట్రంప్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్(Executive Order) నేపథ్యంలో ఫిబ్రవరి 20లోపే.. గర్భిణులకు నెలలు నిండక మునుపే... సిజేరియన్ విధానంలో పిల్లల్ని కనేందుకు భారతీయ దంపతులు తొందరపడుతున్నారు. డెలి‘వర్రీ’తో ఆస్పత్రుల వద్ద క్యూ కడుతున్నారు. అమెరికాలోని ఓ రాష్ట్రంలో ప్రసూతి ఆస్పత్రి నడుపుతున్న డాక్టర్ ఎస్.డి.రామాకు గత రెండు రోజులుగా భారతీయ దంపతుల నుంచి ‘ముందస్తు డెలివరీ’(Pre Delivery) అభ్యర్థనలు ఎక్కువయ్యాట. ముఖ్యంగా 8వ నెల, 9వ నెల గర్భిణులు ‘సి-సెక్షన్’ (సిజేరియన్ శస్త్రచికిత్స) కోసం హడావుడి పడుతున్నారట. ఏడో నెల గర్భిణి అయిన ఓ భారతీయ మహిళ ముందస్తు ప్రసవం కోసం సిజేరియన్ ఆపరేషన్ చేయాలంటూ భర్తతో కలసి తనను సంప్రదించినట్టు డాక్టర్ రామా చెబుతున్నారు. వాస్తవానికి ఆమె మార్చి నెలలో ప్రసవించాల్సివుంది. ‘డెడ్ లైన్’ ఫిబ్రవరి 20వ తేదీ తర్వాత కాన్పు జరిగితే పుట్టే శిశువుకు అమెరికా పౌరసత్వం లభించదన్న భయం ఇప్పుడు వారికి కంటి మీద కునుకు లేకుండా చేస్తోందన్నది ఈ పరిణామంతోనే అర్థమవుతోంది. అయితే.. ఇలా నెలలు నిండకుండానే జరిగే కాన్పుల కారణంగా తల్లికి, బిడ్డకు ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయని గైనకాలజిస్టు డాక్టర్ ఎస్.జి.ముక్కాలా (టెక్సాస్) ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నెలలు నిండకుండా పుట్టే శిశువులో ఊపిరితిత్తులు పూర్తిస్థాయిలో రూపొందవని, శిశువు తక్కువ బరువుతో ఉంటుందని, పోషణతోపాటు నాడీ సంబంధ సమస్యలు తలెత్తుతాయని ఆయన తెలిపారు. ఈ అంశాలన్నిటినీ ఆయన తన వద్దకు వస్తున్న భారతీయ జంటలకు వివరించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ విషయమై ఆయన గత రెండు రోజుల్లో సుమారు 15-20 భారతీయ జంటలకు కౌన్సెలింగ్ ఇచ్చారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. భారతీయ దంపతులు వరుణ్, ప్రియనే (పేర్లు మార్చాం) తీసుకుంటే... ప్రియ వచ్చే మార్చి నెలలో ప్రసవించాల్సివుంది. వరుణ్ H-1 B వీసాపై భార్యతో కలసి ఎనిమిదేళ్లుగా అమెరికాలో ఉంటున్నాడు. గ్రీన్ కార్డుల కోసం ఆ జంట ఆరేళ్లుగా నిరీక్షిస్తోంది. ఇప్పుడు అకస్మాత్తుగా పౌరసత్వ విధానం మారిపోయింది. ప్రస్తుతం తాము నిశ్చింతగా ఉండాలంటే ప్రియ ముందస్తు డెలివరీకి వెళ్లడం ఒక్కటే మార్గమని వరుణ్ భావిస్తున్నాడు. “మేం ఇక్కడికి రావడానికి ఎంతో త్యాగం చేశాం. కానీ మా ఎదుటే తలుపు మూసుకుపోతోంది అనిపిస్తోంది’ అని బాధపడ్డాడు ఓ 28 ఏళ్ల ఇండియన్ ఫైనాన్షియల్ ప్రొఫెషనల్. అతడి భార్య ప్రస్తుతం గర్భవతి. తొలి సంతానానికి జన్మనివ్వబోతోంది. ఇక ఎలాంటి పత్రాలు లేకుండా అక్రమంగా అమెరికాలో నివాసం ఉంటున్న భారతీయుల పరిస్థితి వర్ణనాతీతం. కాలిఫోర్నియాలో ఎనిమిదేళ్లుగా అక్రమంగా నివసిస్తున్న విజయ్ (పేరు మార్చాం) తాజా ఫిబ్రవరి 20 ‘డెడ్ లైన్’తో నెత్తిన పిడుగుపడ్డట్టు బెంబేలెత్తుతున్నాడు. ::జమ్ముల శ్రీకాంత్(Courtesy: The Economic Times) -
‘నల్ల పెట్టె’ మౌనరాగం!
బ్లాక్ బాక్స్... చూసేందుకు నల్ల రంగులో ఉండదు. ‘డెత్ కోడ్’ను రహస్యంగా తనలో దాచుకుంటుంది. ఈ బాక్స్ ఒకటి కూడా కాదు. నిజానికి రెండు పెట్టెలు! విమానం కూలిపోతే అందరి కళ్లూ దానికోసమే చూస్తాయి. రికవరీ బృందాలు దాని వేటలో నిమగ్నమవుతాయి. అది దొరికితే చాలు... ప్రమాద కారణాలు తెలిసినట్టే. ఆ తప్పులు, లోపాలు పునరావృతమవకుండా జాగ్రత్తపడితే భవిష్యత్ ప్రమాదాలను నివారించవచ్చు. విమానయానాన్ని అందరికీ సురక్షితం చేయవచ్చు.గాలిలో ప్రయాణం గాలిలో దీపం. రన్ వే మీది నుంచి పైకి ఎగిరిన విమానం మళ్లీ క్షేమంగా కిందికి దిగేదాకా టెన్షనే. వైమానిక దుర్ఘటనలకు కారణాలు తెలియాలంటే, కచ్చితమైన ఆధారాలు కనుగొనాలంటే తొలుత దాని బ్లాక్ బాక్స్ పరిశోధకుల చేతికి చిక్కాలి. అందుకే దర్యాప్తు సంస్థలు ముందుగా దాని అన్వేషణ కోసం రంగంలోకి దిగుతాయి. బ్లాక్ బాక్స్ వాస్తవానికి రెండు భాగాలు. అవి ఫ్లైట్ డేటా రికార్డర్ (ఎఫ్డీఆర్), కాక్పిట్ వాయిస్ రికార్డర్ (సీవీఆర్). వీటిని ఫ్లైట్ రికార్డర్స్ అంటారు. బ్లాక్ బాక్స్ పేరుకు తగ్గట్టుగా ఇవి నల్ల రంగులో ఉండవు! ప్రమాద స్థలిలో సులభంగా గుర్తుపట్టగలిగేలా ప్రకాశవంతమైన ఆరెంజ్ రంగులో ఉంటాయి.విమానం కూలిపోయినప్పుడు ఆ నష్ట ప్రభావం దాని తోకభాగంపై స్వల్పంగా పడుతుంది. అందుకే కీలక డేటా నిక్షిప్తమైన బ్లాక్ బాక్స్ సురక్షితంగా ఉండేలా దాన్ని విమానం తోక భాగంలో అమర్చుతారు. సెకన్ల వ్యవధిలో ఎఫ్డీఆర్ దాదాపు వెయ్యి పరామితులను నమోదు చేస్తుంది. ప్రమాద సమయంలో విమానం ఎంత ఎత్తులో, ఎంత వేగంతో ఎగురుతోంది? ఇంజిన్ పనితీరు ఎలా ఉంది? ప్రయాణ మార్గం, దిశ వంటి వివరాలను అది నమోదు చేస్తుంది. ఎయిర్ ట్రాఫిక్ నియంత్రణ కేంద్రానికి పైలట్లు పంపిన, స్వీకరించిన సమాచారమేంటి? పైలట్ల సంభాషణలు, విమానంలోని కాక్పిట్ శబ్దాలు వంటి వివరాలను సీవీఆర్ రికార్డు చేస్తుంది.విమాన ప్రమాదాలకు దారితీసిన కారణాలేమిటి? దుర్ఘటన చివరి నిమిషాల్లో ఎలాంటి మార్పులు సంభవించాయి? అనే వివరాలను బ్లాక్ బాక్స్ మాత్రమే వెల్లడించగలదు. ఫ్లైట్ రికార్డర్ల డేటాను విశ్లేషించి ప్రమాద హేతువులపై పరిశోధకులు ఓ అంచనాకు వస్తారు. మరి దర్యాప్తులో ఇంత కీలకమైన ఈ ‘నల్ల పెట్టె’… తాను మాట్లాడబోనంటూ అప్పుడప్పుడు మొండికేస్తుంది. కావాల్సిన డేటా ఇవ్వకుండా మొరాయించి ఇన్వెస్టిగేటర్లను ముప్పుతిప్పలు పెడుతుంది. క్లిష్ట సమయాల్లో రహస్యాలు బయటికి చెప్పకుండా మూగనోము పడుతుంది. దక్షిణ కొరియాకు చెందిన ‘జెజు ఎయిర్’ విమానం గత నెల 29న కూలిపోయి ఇద్దరు మినహా 179 మరణించిన సంగతి తెలిసిందే. ఆ విమానం కూలడానికి నాలుగు నిమిషాల ముందు నుంచే అందులోని ఫ్లైట్ రికార్డర్లు పనిచేయడం మానివేశాయి. దాంతో ఆ దుర్ఘటన దర్యాప్తు ప్రస్తుతం క్లిష్టంగా మారింది. దక్షిణ కొరియా విమానంలోని బ్లాక్ బాక్స్ ఎందుకు విఫలమైంది? బ్లాక్ బాక్సులు ఇలా విఫలమైన సందర్భాలు గతంలో ఉన్నాయా? అందుకు దారితీసే కారణాలేంటి? ఈ సమస్యను అధిగమించేదేలా? వివరాలు మీకోసం... వైఫల్యానికి కారణాలివీ...బ్లాక్ బాక్సులో భాగమైన రెండు ఫ్లైట్ రికార్డర్ల బరువు సుమారు 4.5 కిలోల దాకా ఉంటుంది. గురుత్వశక్తి కంటే 3,400 రెట్ల అధిక శక్తితో విమానం కూలుడు సంభవించినా బ్లాక్ బాక్స్ తట్టుకోగలదు. వెయ్యి డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రతనూ కొంతసేపు భరించగలదు. విమానం సముద్రంలో కూలినా తానెక్కడున్నదీ తెలిపేలా హై పిచ్ శబ్దాలతో బ్లాక్ బాక్స్ 90 రోజులపాటు సంకేతాలు పంపగలదు. నీటిలో 20 వేల అడుగుల లోతులోనూ 30 రోజులు పనిచేయగలదు. దానిలోని కీలక డేటా, ఆడియో చెరిగిపోకుండా టెక్నీషియన్లు జాగ్రత్తగా వివరాలు సేకరిస్తారు. డేటాను డౌన్లోడ్ చేసుకుని కాపీ చేస్తారు. అనంతరం డేటాను డీకోడ్ చేసి గ్రాఫ్స్ రూపొందిస్తారు. సర్క్యూట్ పాడవటం, సెన్సర్లు విఫలమవడం తదితర సాంకేతిక అవరోధాలు, సాఫ్ట్వేర్ (Software) లోపాలు తలెత్తినప్పుడు బ్లాక్ బాక్సులు పనిచేయవు.ప్రమాద తీవ్రత విపరీతంగా ఉండి భౌతికంగా ధ్వంసమైనప్పుడు వాటిపై ఆశ వదిలేసుకోవాల్సిందే. విమాన సిబ్బంది ఉద్దేశపూర్వకంగా డీ-యాక్టివేట్ చేసినప్పుడు అవి పనిచేయడం మానివేస్తాయి. డేటా ఓవర్ లోడ్ (Overload) అయినప్పుడు కూడా అవి మొరాయిస్తాయి. కొన్ని పాత బ్లాక్ బాక్సుల్లో నిర్ణీత కాలం తర్వాత డేటా ఓవర్ రైట్ అయిపోతుంది. ఫలితంగా వాటి నుంచి ఎలాంటి సమాచారం లభించదు. నిరుడు జనవరిలో అలస్కా ఎయిర్లైన్స్ (airlines) బోయింగ్ విమానం ప్రయాణ సమయంలో దాని తలుపు ఊడినప్పుడు (డోర్ ప్లగ్ బ్లో-అవుట్) సీవీఆర్ పూర్తిగా ఓవర్ రైట్ అయింది. దాని నుంచి డేటా లభ్యం కాలేదు. అత్యుష్ణ లేదా అత్యల్ప ఉష్ణోగ్రతలు, నీటిలో ఎక్కువ కాలం నానడం వల్ల కూడా ఫ్లైట్ రికార్డర్లు పాడవుతాయి. తేమ చేరుకుని సున్నిత భాగాల్లోని ఎక్విప్మెంట్ దెబ్బతిని షార్ట్ సర్క్యూట్ కావడం, అత్యధిక ఎత్తుల్లోని పీడనం, పక్షులు ఢీకొనడం, పిడుగుపాట్లు వంటి వాటి వల్ల కూడా బ్లాక్ బాక్సులు పనిచేయకపోవచ్చు. పదేళ్లుగా జాడ లేని మలేసియా విమానం!ఫ్లైట్ రికార్డర్ల సామర్థ్యంపై కొన్నేళ్లుగా చర్చ సాగుతోంది. ఆవశ్యకత ఎంతో ఉన్నా ఖర్చు, పరిమితుల దృష్ట్యా వాటి సామర్థ్యం పెంపు అంశంలో కొంత జాప్యం సంభవిస్తోంది. అత్యవసర సందర్భాల్లో ఫ్లైట్ రికార్డర్లు పనిచేయాలంటే వాటికి విమానంలోని సాధారణ సిస్టమ్స్ నుంచి కాకుండా వేరే వ్యవస్థల నుంచి పవర్ సరఫరా తప్పనిసరి. విమానంలోని రెండు ఇంజిన్లూ విఫలమైనప్పుడు విమానం అంతటా ఎలక్ట్రికల్ పవర్ నిలిచిపోతుంది. 1999లో న్యూయార్క్ నుంచి కైరో వెళుతున్న ‘ఈజిప్ట్ ఎయిర్’ విమానం అట్లాంటిక్ మహాసముద్రంలో కూలిపోయి అందులోని 217 మంది మరణించారు. ఈ విమానంలో ఆన్బోర్డ్ (onboard) ఎలక్ట్రికల్ పవర్ ఆగిపోగానే ఫ్లైట్ రికార్డర్లు పనిచేయడం మానివేశాయి.విమానం లోపల సాధారణ అవసరాలకు సరఫరా అయ్యే కరెంటుపై ఆధారపడకుండా ఫ్లైట్ రికార్డర్లు మరో 10 నిమిషాలపాటు అదనంగా రికార్డింగ్ చేయడానికి వీలుగా ప్రత్యామ్నాయ బ్యాకప్ పవర్ ఏర్పాట్లు ఉండాలని సదరు ప్రమాదం దరిమిలా అమెరికా జాతీయ రవాణా సేఫ్టీ బోర్డు సిఫార్సు చేసింది. బ్లాక్ బాక్సులకు బ్యాకప్ బ్యాటరీలున్నా వాటి జీవితకాలం తక్కువ. ఆ బ్యాటరీలు కొన్ని సందర్భాల్లో పనిచేయవు. దక్షిణ కొరియా ‘జెజు ఎయిర్’ విమానంలోనూ విద్యుత్ వ్యవస్థ విఫలమవడంతో ఫ్లైట్ రికార్డర్లకు పవర్ అందక అవి పనిచేయడం మానివేసి ఉంటాయని భావిస్తున్నారు.ఇక సీవీఆర్ విషయానికొస్తే అది సాధారణంగా ఒక విడతలో గరిష్ఠంగా రెండు గంటలపాటు మాత్రమే రికార్డు చేయగలదు. ఆ రెండు గంటల్లో రికార్డయిన డేటానే అది రిపీట్ చేస్తుంది. ఈ రికార్డింగ్ నిడివిని 25 గంటలకు పెంచాలనేది ఎప్పట్నుంచో వినిపిస్తున్న డిమాండ్. ఇది ప్రస్తుతం కార్యరూపం దాలుస్తోంది. 2009లో ఎయిర్ ఫ్రాన్స్ ఫ్లైట్ 447 రియో డి జెనీరో (బ్రెజిల్) నుంచి ప్యారిస్ వెళుతూ నడి అట్లాంటిక్ మహాసముద్రంలో కూలిపోయి విమానంలోని 228 మంది చనిపోయారు. ఇక మలేసియా ఎయిర్లైన్స్ (airlines) ఎంహెచ్ 370 ఫ్లైట్ వ్యధ... ఇప్పటికీ అంతు లేని కథ! 2014లో కౌలాలంపూర్ నుంచి బీజింగ్ ప్రయాణిస్తూ అకస్మాత్తుగా రాడార్ తెర మీది నుంచి ఆ విమానం అదృశ్యమైంది.అందులోని 239 మందీ మరణించారని భావిస్తున్నారు. విమానం అలా ఎందుకు అదృశ్యమైందో ఇప్పటికీ అంతుచిక్కలేదు. వైమానిక చరిత్రలో అదొక పెద్ద మిస్టరీ. ఆ విమానం ఏమైపోయిందో కనుక్కోవడానికి బోలెడు వ్యయమైంది. ఆ అన్వేషణ ఇప్పటికీ కొనసాగుతుండటం విశేషం. ఆ విమానం దక్షిణ హిందూమహాసముద్రంలో కూలి ఉండొచ్చని అనుమానిస్తున్నారు. దాని జాడ కనుగొనేందుకు అన్వేషణ పునః ప్రారంభించాలని మలేసియా తాజాగా నిర్ణయించింది. ‘ఎయిర్ ఫ్రాన్స్’ విమానం దుర్ఘటన దరిమిలా... మహాసముద్రాలను దాటి దూర ప్రయాణాలు చేసే ట్రాన్స్-ఓషనిక్ ఫ్లైట్స్ విషయంలో కాక్పిట్ వాయిస్ రికార్డర్లో 25 గంటల వాయిస్ డేటా రికార్డింగ్ ఉండాల్సిందేనని ఫ్రాన్స్ సిఫార్సు చేసింది.మలేసియా ఎయిర్లైన్స్ విమానం అదృశ్యంతో ఆ సిఫార్సుకు ప్రాముఖ్యం ఏర్పడింది. ఈ దిశగా అమెరికా కూడా ముందడుగు వేసింది. కాక్పిట్ వాయిస్ రికార్డర్లో 25 గంటల రికార్డింగును తమ ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ రీ-ఆథరైజేషన్ చట్టంలో చేర్చింది అమెరికా. అయితే కొత్తగా తయారయ్యే విమానాల్లోనే ఈ మార్పులకు వీలవుతోంది. ఇప్పుడు తిరుగుతున్న చాలా విమానాల జీవిత కాలం 40-50 ఏళ్లు. పాత విమానాల్లో సీవీఆర్ రికార్డింగ్ వ్యవధి పెంపు సాధ్యపడటం లేదు.కొత్త టెక్నాలజీతో బ్లాక్ బాక్సులు!తాజా సవాళ్లు, మారిన సాంకేతికత నేపథ్యంలో అధునాతన రీతిలో సరికొత్త బ్లాక్ బాక్సులకు రూపకల్పన జరుగుతోంది. ఎక్కువ గంటల రికార్డింగ్, అధిక డేటా స్టోరేజి, బ్యాకప్ బ్యాటరీల జీవిత కాలం పెంపు వంటివి ఇందులోని ప్రధానాంశాలు. విమానాల కూలుళ్ల తీవ్రత ఎంత ఎక్కువగా ఉన్నా సమర్థంగా పనిచేసే బ్లాక్ బాక్సులూ రాబోతున్నాయి. విమానాలు సముద్రాల్లో కూలిపోయే మెరైన్ ప్రమాదాల్లో రికవరీ బృందాలు తక్కువ శ్రమతో సత్వరం బ్లాక్ బాక్సును గుర్తించేలా మెరుగుపరచిన ‘అండర్ వాటర్ లొకేటర్ బీకాన్స్ అభివృద్ధి దశలో ఉన్నాయి. దీంతోపాటు అతి ముఖ్యమైన రియల్ టైమ్ డేటాను గ్రౌండ్ స్టేషన్లకు ప్రసారం చేసే కొత్త డిజైన్లతో బ్లాక్ బాక్సులు రూపుదిద్దుకుంటున్నాయి. విమానానికి సంబంధించిన కీలక సమాచారం ఎప్పటికప్పుడు గ్రౌండ్ స్టేషనుకు చేరుతుంది కనుక ఒకవేళ ప్రమాదంలో బ్లాక్ బాక్స్ భౌతికంగా నాశనమైనా పెద్దగా ఎలాంటి ఇబ్బంది ఉండబోదు. - జమ్ముల శ్రీకాంత్ -
Voyager-1: హస్త లా విస్తా.. బేబీ!
వోయేజర్-1.. ఈ పేరే ఖగోళ శాస్త్రవేత్తలకు ఓ స్ఫూర్తి. ఈ పేరు.. ఉత్సాహంగా నింగికేసి చూసేలా కొన్ని తరాల వారిని పురిగొల్పిన ప్రేరణ శక్తి. అలుపెరుగని యాత్ర.. కోట్లాది కిలోమీటర్ల జైత్రయాత్ర.. దాదాపు అర్ధ శతాబ్ద కాలపు వైజ్ఞానిక పరిశోధనల సారం.. మానవాళి కలలుగన్న ‘సుదూర’ లక్ష్యం సాకారం.. అది గ్రహాంతర హద్దులను దాటి నక్షత్రాంతర రోదసికేగిన విశ్వవిఖ్యాత వ్యోమనౌక.. అదే వోయేజర్-1. అంతరిక్షంలో ఇప్పటివరకు అత్యంత ఎక్కువ దూరం ప్రయాణించిన మానవ నిర్మిత వస్తువు ఇదే. అమెరికా 1977 సెప్టెంబరు 5న ప్రయోగించిన ఈ వ్యోమనౌకది 46 ఏళ్ల సుదీర్ఘ ప్రస్థానం. ఈ ఏడాది జనవరి నాటికి అది భూమి నుంచి 2,440 కోట్ల కిలోమీటర్ల దూరాన ఉంది. ఇప్పుడీ వ్యోమనౌకకు అంతిమ ఘడియలు ఆసన్నమయ్యాయి. గత ఏడాది నవంబరు నుంచి వోయేజర్-1 భూమికి సరైన సమాచారం ఇవ్వడం లేదు. భావ వ్యక్తీకరణ సామర్థ్యం కోల్పోయిన వృద్ధ పక్షవాత రోగిలా... ‘నాసా’ శాస్త్రవేత్తలకు అది ‘పిచ్చి’ సందేశాలు పంపుతోంది. వోయేజర్-1లోని ఓ కంప్యూటర్లో సాంకేతిక సమస్య ఉత్పన్నమైంది. దాంతో కాలిఫోర్నియాలోని పసడెనాలో జెట్ ప్రొపల్షన్ లేబొరేటరీలో ఉన్న గ్రౌండ్ కంట్రోల్ కేంద్రానికి వ్యోమనౌక నుంచి అర్థరహిత సమాచారం అందుతోంది. వోయేజర్-1ను నిర్మించి, ప్రయోగించినప్పటి ‘నాసా’ సిబ్బందిలో చాలామంది కాలం చేశారు. దాంతో తాజా సమస్యను పరిష్కరించి వ్యోమనౌకను మళ్లీ గాడిన పెట్టేందుకు దాని నిర్మాణం తాలూకు పాత పత్రాలను ముందేసుకుని శాస్త్రవేత్తలు కొన్ని నెలలుగా కుస్తీలు పడుతున్నారు. ప్రస్తుత సమస్య నుంచి తమ వ్యోమనౌక బయటపడితే అద్భుతం జరిగినట్టేనని వోయేజర్ ప్రాజెక్టు మేనేజర్ సుజానే డాడ్ వ్యాఖ్యానించారు. ఆమె 2010 నుంచి ఈ ప్రాజెక్టును పర్యవేక్షిస్తున్నారు. వోయేజర్-1 నేడు ముదిమి వయసులో ఉంది. దాని చరిత్ర ఇక ముగిసిన అధ్యాయమేనని తెలుస్తోంది. జంట వోయేజర్స్ విజయాలు.. వోయేజర్ ప్రాజెక్టులో వోయేజర్-1, వోయేజర్-2 భాగస్వాములు. వోయేజర్-2ను వోయేజర్-1 కంటే రెండు వారాల ముందు ప్రయోగించారు. నిజానికి వీటిది కేవలం నాలుగేళ్ల మిషన్. కానీ నేటికీ విజయవంతంగా కొనసాగుతోంది. వోయేజర్-2 ప్రస్తుతం పనిచేస్తున్నప్పటికీ దాన్ని కూడా సాంకేతిక సమస్యలు వేధిస్తున్నాయి. పయనీర్-10, 11 వ్యోమనౌకల యాత్రలకు కొనసాగింపుగా… గురుడు, శని గ్రహాల అన్వేషణ కోసం వోయేజర్ జంటనౌకలను పంపారు. వీటితో గురు గ్రహం (బృహస్పతి)పై పెద్ద ఎర్ర మచ్చ, శని వలయాలు, ఈ రెండు గ్రహాల కొత్త చంద్రుళ్లకు సంబంధించి ఎన్నో విశేషాలు వెలుగుచూశాయి. వోయేజర్-1 1979లో గురుగ్రహాన్ని 3.5 లక్షల కిలోమీటర్ల దూరం నుంచి తిలకించింది. దాని చంద్రుడు ‘అయో’పై క్రియాశీల అగ్నిపర్వతాలను గుర్తించింది. భూమి మినహా సౌరకుటుంబంలోని తక్కిన ఖగోళ వస్తువుల్లో అగ్నిపర్వత క్రియాశీలతను కనుగొనడం అదే తొలిసారి. 1990 ఫిబ్రవరి 14న సూర్యుడికి 600 కోట్ల కిలోమీటర్ల దూరం నుంచి ‘లేత నీలి చుక్క’లా కనిపిస్తున్న భూమి ఫొటోను వోయేజర్-1 తన కెమెరాలో బంధించింది. ఆ సింగిల్ పిక్సెల్ ఫొటో... ‘మానవాళి తనకుతాను గీసుకున్న సొంత చిత్తరువు’లా అనిపిస్తుంది. ఇక వోయేజర్-2 యురేనస్, నెప్ట్యూన్ గ్రహాలను సందర్శించిన ఏకైక వ్యోమనౌకగా పేరుగాంచింది. శిలాగ్రహాలైన బుధుడు, శుక్రుడు, భూమి, అంగారకుడిని అంతర గ్రహాలు అంటారు. వాయుమయ గురుడు, శని, యురేనస్, నెప్ట్యూన్ లను బాహ్యగ్రహాలుగా పిలుస్తారు. 4 బాహ్య గ్రహాలను దగ్గరగా సందర్శించిన ఏకైక వ్యోమనౌకగా వోయేజర్-2 1989లో రికార్డు సృష్టించింది. సౌరవ్యవస్థను దాటి మున్ముందుకు! హీలియోస్ఫియర్ అంటే సౌరవ్యవస్థ చుట్టూ సూర్యుడు నేరుగా ప్రభావం చూపే పొడవైన బుడగ లాంటి ప్రదేశం. హీలియోస్ఫియర్ అంచును హీలియోపాజ్ అంటారు. ఈ ‘హీలియోపాజ్’ను 2012లోనే వోయేజర్-1 దాటవేసి నక్షత్రాంతర రోదసిలోకి ప్రవేశించింది. అలా ఇంటర్స్టెల్లార్ స్పేస్ లోకి అడుగిడిన తొలి మానవ నిర్మిత వస్తువుగా అది గణుతికెక్కింది. 2018లో వోయేజర్-2 కూడా హీలియోస్ఫియర్ బాహ్య అంచును దాటి ఇంటర్స్టెల్లార్ స్పేస్ (సూర్యుడు, ఇతర నక్షత్రాల మధ్యనున్న ప్రాంతం)లోకి ప్రవేశించింది. హీలియోపాజ్ ఆవల నుంచి నక్షత్రాంతర రోదసి మొదలవుతుంది. కాస్మిక్ కిరణాలు, నక్షత్రాంతర ప్రాంతంలోని అయస్కాంత క్షేత్రంలో అసాధారణ అలజడులు, ప్లాస్మా కణాలపై వోయేజర్-1 అధ్యయనం చేస్తోంది. వోయేజర్-1కు భూమి నుంచి ఆదేశం పంపడానికి 22.5 గంటలు, వ్యోమనౌక నుంచి శాస్త్రవేత్తలు డేటా స్వీకరించడానికి మరో 22.5 గంటలు.. ఇలా సమాచారం ఇచ్చిపుచ్చుకోవడానికి రమారమి రెండు రోజులు పడుతోంది. ఫ్లైట్ డేటా సిస్టమ్ లోపాలు వోయేజర్-1లో మూడు కంప్యూటర్లు ఉన్నాయి. అవి ఫ్లైట్ డేటా సిస్టమ్ (ఎఫ్డీఎస్), కమాండ్ అండ్ కంట్రోల్ సెంట్రల్ సిస్టమ్, ఆటిట్యూడ్ కంట్రోల్ అండ్ పాయింటింగ్ సిస్టమ్. వ్యోమనౌక సైన్స్ పరికరాల నుంచి శాస్త్ర పరిశోధనల డేటాను, నౌక ఆరోగ్యానికి సంబంధించిన ఇంజినీరింగ్ డేటాను ఎఫ్డీఎస్ సేకరించి సింగిల్ ప్యాకేజీగా మారుస్తుంది. అనంతరం అది టెలిమెట్రీ మాడ్యులేషన్ యూనిట్ (టీఎంయూ) ద్వారా బైనరీ కోడ్ రూపంలో భూమికి ప్రసారమవుతుంది. ప్రస్తుతం ఎఫ్డీఎస్ కంప్యూటరులో సాంకేతిక సమస్య తలెత్తడంతో ఇంజినీరింగ్, సైన్స్ డేటాను భూమికి పంపే సామర్థ్యాన్ని వోయేజర్-1 కోల్పోయింది. వోయేజర్-1, 2లలో ప్రయోగ సమయంలో రెండేసి ఎఫ్డీఎస్ లు ఉన్నాయి. దురదృష్టవాశాత్తు వోయేజర్-1 బ్యాకప్ ఎఫ్డీఎస్ 1981లో విఫలమైంది. ‘నాసా’ శాస్త్రవేత్తలు తాజాగా ఎఫ్డీఎస్ ను రీ-స్టార్ట్ చేసేందుకు యత్నించారు. కానీ ఈ అన్ ‘ప్లగ్ అండ్ ప్లగ్ ఇన్’ పద్ధతి ఫలితమివ్వలేదు. 2025 నాటికి వోయేజర్ జంట నౌకల్లోని ప్లూటోనియమ్ ఆధారిత అణుశక్తి జనరేటర్లు పని చేయడం మానేస్తాయని ‘నాసా’ అంచనా. భూమ్మీది జీవం, మానవాళి భిన్న సంస్కృతులను ప్రతిబింబించే చిత్రాలు, వివిధ భాషల్లో శుభాకాంక్షలు, ఆడియో-విజువల్ సందేశాలను డిస్కుల (గోల్డెన్ రికార్డులు) రూపంలో ఈ నౌకల్లో పంపారు. (Photo Credits: The New York Times, NASA, Business Insider, Gizmodo, NPR, Popular Mechanics, WIRED, Ars Technica, Science Alert, Popular Science, Smithsonian Magazine) ✍️ జమ్ముల శ్రీకాంత్ -
చండ ప్రచండ మార్తాండ!
భగభగలాడే భానుడిపై ఓ నల్ల మచ్చ... తొలిసారి ఈ నెల 18న కనిపించింది... భయం పుట్టించేలా అది నేరుగా భూమికేసి కసిగా చూస్తోంది.... వారం రోజుల క్రితం తన నోట్లోంచి భూమి వైపు మూడు సౌరజ్వాలల్ని కక్కింది. దాంతో హై ఫ్రీక్వెన్సీ రేడియో కమ్యూనికేషన్లకు అంతరాయం కలిగింది. అదృష్టవశాత్తు కరోనల్ మాస్ ఎజెక్షన్స్ లేకపోవటంతో పెద్దగా నష్టం సంభవించలేదు. తర్వాత ఫిబ్రవరి 24-26 తేదీల మధ్యకాలంలో కేవలం రెండు రోజుల్లోనే ఇంతింతై అన్నట్టు... ఆ మచ్చ సైజు అమాంతంగా 25% పెరిగిపోయింది. .. తొమ్మిదిన్నర భూగ్రహాల వైశాల్యానికి సరిపోయేంతగా ఆ సన్ స్పాట్ విస్తరించింది. 2019లో మొదలైన ప్రస్తుత 25వ సౌరచక్రంలో సూర్యుడిపై ఇదే అతి పెద్ద మచ్చగా అవతరించింది. దీని పేరు ‘ఏఆర్3590’. ఏఆర్ అంటే యాక్టివ్ రీజియన్. సూర్యుడిపై క్రియాశీల ప్రాంతం. భూమికి పొంచి వున్న ముప్పు దృష్ట్యా సన్ స్పాట్ ఏఆర్3590 ప్రస్తుతం ఖగోళ శాస్త్రవేత్తల దృష్టిని అమితంగా ఆకర్షిస్తోంది. ఎందుకంటే సూర్యుడి అంతర్గత స్వరూపంలో గణనీయ మార్పులు వస్తున్నాయి. సూర్యుడిపై నల్ల మచ్చలు మామూలే. సౌరజ్వాలలకు పుట్టినిల్లయిన ఈ మచ్చలు అంతరిక్ష వాతావరణం, సౌరవ్యవస్థలోని గ్రహాలపై ప్రభావం చూపుతాయి. సూర్యుడి ఉపరితలంపై భారీ వైశాల్యంలో ఏర్పడే ఈ మచ్చల అయస్కాంత క్షేత్రం... భూ అయస్కాంత క్షేత్రం కంటే 2,500 రెట్లు శక్తిమంతం. లోలోన సూరీడు బాగా క్రియాశీలంగా ఉన్నచోట ఈ సన్ స్పాట్స్ ద్యోతకమవుతాయి. తమ పరిసర ప్రాంతాలతో పోలిస్తే వీటిలో ఉష్ణోగ్రతలు తక్కువ. Photo Credits: thesuntoday అయినప్పటికీ ఈ మచ్చల్లో 3,600 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత ఉంటుంది. ఇక మచ్చల సంఖ్య మాత్రం 11 ఏళ్ల సౌరచక్రాన్ని అనుసరించి మారుతుంది. సౌరచక్రంలో ఇప్పుడు మనం ముప్పు ముంగిట ఉన్నాం. గణించడం ఆరంభమయ్యాక ప్రస్తుతం 25వ సౌరచక్ర ప్రక్రియ కొనసాగుతోంది. మానవాళిని ఇబ్బంది పెట్టకుండా 24వ సౌరచక్రం ప్రశాంతంగా పూర్తయింది. 25వదీ సాఫీగా అలాగే ఉంటుందని శాస్త్రవేత్తలు ఊహించారు. కానీ తమ అంచనాలను మించి శక్తిమంతంగా కనిపిస్తున్న ఈ 25వ సౌరచక్రం భూమికి అనర్థాలు, చిక్కులు తెచ్చిపెడుతుందేమోనని వారు ఆందోళన చెందుతున్నారు. ఇటీవల సూర్యుడిపై మచ్చలు తరచూ ఏర్పడటం, వాటి సైజు పెరుగుతుండటం, తీవ్ర సౌర తుపాన్లు చోటుచేసుకోవడం గమనిస్తుంటే సూర్యుడు తన తాజా 11 ఏళ్ల సౌరచక్రంలో ఉచ్చ స్థితిలో ఉన్నాడని, మహోగ్ర విస్ఫోట దశను వేగంగా సమీపిస్తున్నాడని తెలుస్తోంది. తాము గతంలో ఊహించిన దాని కంటే చాలా ముందుగానే, బహుశా 2024 జూన్ మాసం ముగిసేలోపే ‘చండ మార్తాండ’ (సోలార్ మాగ్జిమమ్/సౌర గరిష్ఠం) దశ సంభవిస్తుందని శాస్త్రవేత్తల అంచనా. భూమిపై ఇది ఏ ఉత్పాతాలకు దారితీస్తుందో, ఏ ఉపద్రవాలు తెచ్చిపెడుతుందోనని వారు కలవరపడుతున్నారు. ఈ ఉగ్ర రూపం అనంతరం సూర్యుడు మళ్లీ నెమ్మదిస్తాడు. విశేషమేంటంటే... సోలార్ మాగ్జిమమ్ లేదా ‘పీక్ స్టేజి’ సమాప్తమైందనే సంగతి... అది ముగిసిన ఆరు నెలల దాకా శాస్త్రవేత్తలకు తెలియదు! Photo Courtesy: NASA/SDO, AIA, EVE, HMI Science Teams ఏఆర్3590తో ప్రమాదమే! సూర్యుడు లోపల్లోపల తీవ్రంగా ప్రజ్వలిస్తాడు. తన ఉపరితలంపై కొన్ని చోట్ల అకస్మాత్తుగా విస్ఫోటిస్తాడు. అప్పుడు ఆయా ప్రాంతాల నుంచి ఒక్కసారిగా హెచ్చు మొత్తంలో విద్యుదయస్కాంత వికిరణం విడుదలవుతుంది. ఇవే సౌరజ్వాలలు (సోలార్ ఫ్లేర్స్). ఈ జాజ్వల్యమాన ధగధగలు సూర్యుడిపై ప్రకాశవంతంగా గోచరిస్తాయి. సోలార్ ఫ్లేర్ ప్రక్రియ కొన్ని నిమిషాల నుంచి కొన్ని గంటలపాటు కొనసాగవచ్చు. తీవ్రత ఆధారంగా ‘సోలార్ ఫ్లేర్స్’ను X, M, C, B, A అంటూ అవరోహణ క్రమంలో ఐదు రకాలుగా వర్గీకరించారు. వీటిలో X రకం ఫ్లేర్స్ మహా శక్తిమంతం, భూమికి హానికరం. బలహీనపు A, B సౌరజ్వాలల ప్రభావం స్వల్పం. సన్ స్పాట్ ఏఆర్3590 ఫిబ్రవరి నెల 21న రెండు X రకం సౌరజ్వాలలను వెదజల్లింది. X1.7 తీవ్రతతో ఓసారి, X1.8 తీవ్రతతోమరోసారి రెండు సౌరజ్వాలలను భూమి దిశగా ఎగజిమ్మింది. మర్నాడు 22వ తేదీన X6.3 తీవ్రతతో ఇంకో సౌరజ్వాలను వదిలింది. 2017లో X8.2 తీవ్రతతో విడుదలైన సోలార్ ఫ్లేర్ తర్వాత గత ఆరేళ్ల కాలంలో జనించిన అతి తీవ్ర ఫ్లేర్ ఇదే. పై 3 ఫ్లేర్స్ తర్వాత రెండు బలహీన M క్లాస్ జ్వాలలను కూడా సన్ స్పాట్ ఏఆర్3590 వెలువరించింది. ఈ మచ్చలోని అస్థిర బీటా-గామా-డెల్టా అయస్కాంత క్షేత్రంలో మరిన్ని X రకం సౌరజ్వాలలకు కావాల్సిన శక్తి ఉండవచ్చని, మరో X రకం మహా సౌరజ్వాల కోసం అది శక్తిని సమీకరిస్తోందని నిపుణులు అంచనా వేస్తున్నారు. కరోనల్ మాస్ ఎజెక్షన్స్ రూపంలో భూమికి ముప్పు తొలగిపోలేదని హెచ్చరిస్తున్నారు. సౌరచక్రంలో అయస్కాంత ధ్రువాల మార్పిడి సూర్యుడిలో 11 ఏళ్లకోసారి సౌరచక్రం గిర్రున తిరుగుతుంది. ఈ కాలచక్ర మధ్యంలో సౌరక్రియ గరిష్ఠ స్థితిని సంతరించుకునే ‘సోలార్ మాగ్జిమమ్’ దశ సందర్భంగా సూర్యుడి అయస్కాంత క్షేత్రం దాని అయస్కాంత ధ్రువాలను తారుమారు చేస్తుంది. రెండు అయస్కాంత క్షేత్రాలు పరస్పరం మారతాయి. అటుదిటు, ఇటుదటు అవుతాయి. అలా ఉత్తర అయస్కాంత ధ్రువం కాస్తా దక్షిణ అయస్కాంత ధ్రువంగా మారిపోతుంది. ఈ మార్పిడి జరిగేవరకు సూర్యుడు అంతకంతకూ ఉత్తేజితమవుతాడు. అనుక్షణం క్రియాశీలమవుతాడు. సౌరమచ్చలు, జ్వాలలు, సీఎంఈలు పుట్టుకొస్తాయి. ఈ ప్రక్రియ తర్వాత సూర్యుడు నెమ్మదిస్తాడు. మెల్లగా సౌర కనిష్ఠం లేదా సోలామ్ మినిమమ్ దశకు చేరతాడు. ఇదొక చక్రం. కరోనల్ మాస్ ఎజెక్షన్స్.. సౌర తుపాన్లు! ‘కరోనా’ అనేది అత్యంత వేడితో కూడిన సౌర ధూళికణాలతో (ప్లాస్మా) నిండివుండే సూర్యుడి అతి బాహ్య పొర. X, M రకాల సౌర ప్రజ్వలనాలు కరోనల్ మాస్ ఎజెక్షన్స్ (సీఎంఈ)కు కారణమవుతాయి. కరోనా నుంచి ప్లాస్మా, విద్యుదయస్కాంత వికిరణం భారీగా విడుదలై భూ అయస్కాంత క్షేత్రంలోకి చొరబడి దుష్ప్రభావం చూపుతాయి. ‘నార్తర్న్ లైట్స్’గా పిలిచే ‘అరోరాలు’ సాధారణంగా ధ్రువాల వద్దనే కనిపిస్తాయి. కానీ సీఎంఈల వల్ల తలెత్తే భూ అయస్కాంత తుపాన్లు... భూమధ్యరేఖ వద్ద ‘అరోరా’లను సృష్టిస్తాయి. 1989 మార్చిలో భూమిని తాకిన ఓ కరోనల్ మాస్ ఎజెక్షన్ వల్ల కెనడాలోని క్యూబెక్ ప్రావిన్స్ అంతటా 9 గంటలపాటు విద్యుత్ వ్యవస్థ కుప్పకూలి 60 లక్షల మంది ఇబ్బందిపడ్డారు. కరోనల్ మాస్ ఎజెక్షన్స్ వేళల్లో ఆవేశిత శక్తి కణాలు అతి వేగంగా ప్రయాణిస్తాయి. వీటి వల్ల పవర్ గ్రిడ్స్ కుప్పకూలతాయి. విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు తగలబడతాయి. జీపీఎస్ నేవిగేషన్ వ్యవస్థలు అస్తవ్యస్తమై నౌకలు, విమానాల రాకపోకలు, ఇతర ప్రజా రవాణా వ్యవస్థలు స్తంభిస్తాయి. టెలిఫోన్, కంప్యూటర్, కమ్యూనికేషన్, ఇంధన పంపిణీ-పైపులైన్ వ్యవస్థలు పాడవుతాయి. ఆ సమయాల్లో సౌరతుపాను గండం గడిచేదాకా ఉపగ్రహాల్ని స్విచాఫ్ చేస్తారు. లేకపోతే అవి శలభాల్లా మాడిపోతాయి. పిట్టల్లా రాలి భూమిపై పడతాయి. లక్షల కోట్ల ఆస్తినష్టం జరుగుతుంది. ఇక వ్యోమగాములు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్) వెలుపలి కార్యక్రమాల్లో పాల్గొనకుండా కేంద్రంలోని సురక్షిత స్థానాల్లోకి వెళ్లిపోతారు. X, M రకాల సౌర ప్రజ్వలనాల కారణంగా... భూ వాతావరణంలో రేడియో తరంగాలు ప్రయాణించే ‘దిగువ అయనోస్ఫియర్’లో ఎలక్ట్రాన్ల సాంద్రత తీవ్రమవుతుంది. దాంతో రేడియో తరంగాల శక్తి క్షీణించి అవి పై పొరల్లోకి ప్రయాణించలేవు. సూర్యకాంతి 8 నిమిషాల్లో భూమిని చేరుతుంది. సోలార్ ఫ్లేర్స్ నుంచి చొచ్చుకొచ్చే సౌర ధార్మికత కూడా అదే కాంతి వేగంతో భూమిని తాకుతుంది. ఇక కరోనల్ మాస్ ఎజెక్షన్స్ ఫలితంగా వందల కోట్ల టన్నుల కరోనల్ ప్లాస్మా వెదజల్లబడుతుంది. సీఎంఈ వేగం సెకనుకు 250 కిలోమీటర్ల నుంచి 3 వేల కిలోమీటర్ల వరకు ఉంటుంది. వేగవంతమైన కరోనల్ మాస్ ఎజెక్షన్ 15-18 గంటల్లో భూమిని చేరుతుంది. కారింగ్టన్ ఈవెంట్... అతి పెద్ద సౌర తుపాను! 1860లో సోలార్ మాగ్జిమమ్ దశకు కొన్ని నెలల ముందు 1859 సెప్టెంబరులో ఓ సౌర తుపాను సంభవించింది. చరిత్రలో రికార్డయిన అతి పెద్ద సౌర తుపాను ఇదే. 1859 ఆగస్టులో సూర్యబింబంలో నల్లమచ్చల సంఖ్య పెరిగిపోవతాన్ని ప్రపంచవ్యాప్తంగా ఖగోళ శాస్త్రవేత్తలు ఆసక్తిగా తిలకించారు. లండన్ సమీపంలోని రెడ్ హిల్ పట్టణానికి చెందిన ఔత్సాహిక వీక్షకుడు రిచర్డ్ కారింగ్టన్ కూడా వారిలో ఒకరు. 1859 సెప్టెంబరు 1న సౌరమచ్చల్ని ఆయన చిత్రీకరిస్తుండగా అకస్మాత్తుగా తెల్లటి కాంతి తళుక్కున మెరిసింది. అది 5 నిమిషాలు అలాగే ఉంది. నిజానికి అది కరోనల్ మాస్ ఎజెక్షన్. ఈ ఘటనకు ఆయన గౌరవార్థం ‘కారింగ్టన్ ఈవెంట్’ అని పేరు పెట్టారు. ఆ కరోనల్ మాస్ ఎజెక్షన్ సూర్యుడి నుంచి 15 కోట్ల కిలోమీటర్ల దూరాన్ని 17.6 గంటల్లో ప్రయాణించి భూమిని చేరుకుంది. కారింగ్టన్ ఈవెంట్ తర్వాత మర్నాడు జియోమాగ్నెటిక్ తుపానుకు టెలిగ్రాఫ్ వ్యవస్థలు మొరాయించాయి. కొన్ని చోట్ల టెలిగ్రాఫ్ లైన్లపై అధిక విద్యుత్ ప్రసారమై టెక్నీషియన్లు కరెంటు షాక్ కు గురవగా ఇంకొన్ని చోట్ల టెలిగ్రాఫ్ సాధన సంపత్తి దగ్ధమైంది. నాటి ‘కారింగ్టన్ ఈవెంట్’కు కారణమైన నలమచ్ఛతో పోలిస్తే నేటి ఏఆర్3590 సన్ స్పాట్ సైజు 60%గా ఉంది. గ్రహణాల సమయంలో సూర్యుడిని వీక్షించడానికి వాడే సురక్షిత కళ్ళద్దాలు మన చెంత ఉంటే ఈ మచ్చను నేరుగా చూడొచ్చు. :::జమ్ముల శ్రీకాంత్ -
మృత్యుంజయ ‘మూన్ స్నైపర్’!
ఓ వైజ్ఞానిక విశేషం... కాదు... అంతకంటే అబ్బురమే. జపాన్ శాస్త్రవేత్తల్లో వెల్లివిరిసిన సంభ్రమాశ్చర్యాలు, ఆనందోత్సాహాలు... గత నెలలో చంద్రుడిపై దిగిన జపాన్ ల్యాండర్ ‘మూన్ స్నైపర్’ అనూహ్యంగా నిద్ర లేచింది. జాబిలిపై సుదీర్ఘంగా 14 రోజులపాటు కొనసాగిన రాత్రివేళలో గడ్డకట్టించే మైనస్ 130 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతల్ని దీటుగా తట్టుకుని మరీ బతికింది! నిజానికి అంతటి కఠోర శీతల ఉష్ణోగ్రతలను తట్టుకునేలా జపాన్ దానిని తయారుచేయలేదు. కానీ అది మృత్యువును జయించి పునర్జన్మ పొందింది. ఈ ల్యాండర్ అసలు పేరు ‘స్లిమ్’ (స్మార్ట్ ల్యాండర్ ఫర్ ఇన్వెస్టిగేటింగ్ మూన్). ఆదివారం రాత్రి ‘మూన్ స్నైపర్’తో సమాచార సంబంధాల్ని పునరుద్ధరించి ఓ ఆదేశం పంపామని, ల్యాండర్ నుంచి ప్రతిస్పందన వచ్చిందని ‘ఎక్స్’ వేదికగా జపాన్ అంతరిక్ష పరిశోధన సంస్థ (జాక్సా) వెల్లడించింది. చంద్రుడిపై మధ్యాహ్నం కావడంతో కమ్యూనికేషన్స్ సాధనాలు బాగా వేడెక్కినందున కొద్ది సేపటి తర్వాత ల్యాండరుతో సమాచార సంబంధాలు నిలిపివేశామని తెలిపింది. పరికరాల ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టాక కమ్యూనికేషన్స్ పునరుద్ధరిస్తామని ‘జాక్సా’ ప్రకటించింది. ‘మూన్ స్నైపర్’ గత నెల 19న చంద్రమధ్యరేఖకు దక్షిణంగా షియోలీ బిలం వాలులో దిగడమే తలకిందులుగా దిగింది. శీర్షాసనం భంగిమలో నిలిచిన దానిపై తొలుత జాక్సా ఆశలు వదిలేసుకుంది. సూర్యుడికి వ్యతిరేక దిశలో సౌరఫలకాలు ఉండిపోవటంతో ముందుజాగ్రత్తగా ల్యాండరును కొద్దిరోజులు నిద్రాణస్థితిలోకి పంపారు. అనంతరం సూర్యుడి దిశ మారి ఎండ అందుబాటులోకి రావటంతో సౌరశక్తిని సమకూర్చుకున్న ల్యాండర్ తిరిగి పని చేయడం ప్రారంభించింది. అనంతరం చంద్రుడిపై రాత్రి సమయం సమీపించడంతో దాన్ని మరోసారి నిద్రావస్థలోకి పంపారు. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ‘ఇస్రో’ గత ఏడాది విజయవంతంగా నిర్వహించిన చంద్రయాన్-3 మిషన్లోని ‘విక్రమ్’ ల్యాండర్ మాదిరిగానే... చంద్రుడిపై 14 రోజులపాటు నిర్విరామంగా కొనసాగే రాత్రి వేళ అతి శీతల ఉష్ణోగ్రతలను భరించగలిగేలా ‘మూన్ స్నైపర్’ ల్యాండరును ‘జాక్సా’ డిజైన్ చేయలేదు. భూమ్మీద రెండు వారాల కాలానికి సమానమయ్యే అతి శీతల చంద్ర రాత్రిలో మనుగడ సాగించలేక ‘విక్రమ్’ ల్యాండర్ మూగబోయింది. కానీ ‘మూన్ స్నైపర్’ మాత్రం అదృష్టవశాత్తు జీవించగలిగింది. :::జమ్ముల శ్రీకాంత్