చండ ప్రచండ మార్తాండ! | Black spots on the Sun are an effect on the planets of the solar system | Sakshi
Sakshi News home page

చండ ప్రచండ మార్తాండ!

Published Thu, Feb 29 2024 12:06 PM | Last Updated on Thu, Feb 29 2024 8:43 PM

Black spots on the Sun are an effect on the planets of the solar system - Sakshi

శివమెత్తిన సూరీడు

25వ సౌరచక్రంలో ఉచ్చ దశ

జూన్ ముగిసే లోపే ‘సోలార్ మాగ్జిమమ్’

మహా మచ్చ ‘ఏఆర్3590’ ఆవిర్భావం

భూమికేసి చూస్తూ 3 ఆగ్రహ జ్వాలలు

మున్ముందు కరోనల్ మాస్ ఎజెక్షన్స్ ముప్పు

ఖగోళ శాస్త్రవేత్తల్లో ఆందోళన

భగభగలాడే భానుడిపై ఓ నల్ల మచ్చ... తొలిసారి ఈ నెల 18న కనిపించింది... భయం పుట్టించేలా అది నేరుగా భూమికేసి కసిగా చూస్తోంది.... వారం రోజుల క్రితం తన నోట్లోంచి భూమి వైపు మూడు సౌరజ్వాలల్ని కక్కింది. దాంతో హై ఫ్రీక్వెన్సీ రేడియో కమ్యూనికేషన్లకు అంతరాయం కలిగింది. అదృష్టవశాత్తు కరోనల్ మాస్ ఎజెక్షన్స్ లేకపోవటంతో పెద్దగా నష్టం సంభవించలేదు. తర్వాత ఫిబ్రవరి 24-26 తేదీల మధ్యకాలంలో కేవలం రెండు రోజుల్లోనే ఇంతింతై అన్నట్టు... ఆ మచ్చ సైజు అమాంతంగా 25% పెరిగిపోయింది.

.. తొమ్మిదిన్నర భూగ్రహాల వైశాల్యానికి సరిపోయేంతగా ఆ సన్ స్పాట్ విస్తరించింది. 2019లో మొదలైన ప్రస్తుత 25వ సౌరచక్రంలో సూర్యుడిపై ఇదే అతి పెద్ద మచ్చగా అవతరించింది. దీని పేరు ‘ఏఆర్3590’. ఏఆర్ అంటే యాక్టివ్ రీజియన్. సూర్యుడిపై క్రియాశీల ప్రాంతం. భూమికి పొంచి వున్న ముప్పు దృష్ట్యా సన్ స్పాట్ ఏఆర్3590 ప్రస్తుతం ఖగోళ శాస్త్రవేత్తల దృష్టిని అమితంగా ఆకర్షిస్తోంది. ఎందుకంటే సూర్యుడి అంతర్గత స్వరూపంలో గణనీయ మార్పులు వస్తున్నాయి. సూర్యుడిపై నల్ల మచ్చలు మామూలే. సౌరజ్వాలలకు పుట్టినిల్లయిన ఈ మచ్చలు అంతరిక్ష వాతావరణం, సౌరవ్యవస్థలోని గ్రహాలపై ప్రభావం చూపుతాయి. సూర్యుడి ఉపరితలంపై భారీ వైశాల్యంలో ఏర్పడే ఈ మచ్చల అయస్కాంత క్షేత్రం... భూ అయస్కాంత క్షేత్రం కంటే 2,500 రెట్లు శక్తిమంతం. లోలోన సూరీడు బాగా క్రియాశీలంగా ఉన్నచోట ఈ సన్ స్పాట్స్ ద్యోతకమవుతాయి. తమ పరిసర ప్రాంతాలతో పోలిస్తే వీటిలో ఉష్ణోగ్రతలు తక్కువ. 


Photo Credits: thesuntoday

అయినప్పటికీ ఈ మచ్చల్లో 3,600 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత ఉంటుంది. ఇక మచ్చల సంఖ్య మాత్రం 11 ఏళ్ల సౌరచక్రాన్ని అనుసరించి మారుతుంది. సౌరచక్రంలో ఇప్పుడు మనం ముప్పు ముంగిట ఉన్నాం. గణించడం ఆరంభమయ్యాక ప్రస్తుతం 25వ సౌరచక్ర ప్రక్రియ కొనసాగుతోంది. మానవాళిని ఇబ్బంది పెట్టకుండా 24వ సౌరచక్రం ప్రశాంతంగా పూర్తయింది. 25వదీ సాఫీగా అలాగే ఉంటుందని శాస్త్రవేత్తలు ఊహించారు. కానీ తమ అంచనాలను మించి శక్తిమంతంగా కనిపిస్తున్న ఈ 25వ సౌరచక్రం భూమికి అనర్థాలు, చిక్కులు తెచ్చిపెడుతుందేమోనని వారు ఆందోళన చెందుతున్నారు. 

ఇటీవల సూర్యుడిపై మచ్చలు తరచూ ఏర్పడటం, వాటి సైజు పెరుగుతుండటం, తీవ్ర సౌర తుపాన్లు చోటుచేసుకోవడం గమనిస్తుంటే సూర్యుడు తన తాజా 11 ఏళ్ల సౌరచక్రంలో ఉచ్చ స్థితిలో ఉన్నాడని, మహోగ్ర విస్ఫోట దశను వేగంగా సమీపిస్తున్నాడని తెలుస్తోంది. తాము గతంలో ఊహించిన దాని కంటే చాలా ముందుగానే, బహుశా 2024 జూన్ మాసం ముగిసేలోపే ‘చండ మార్తాండ’ (సోలార్ మాగ్జిమమ్/సౌర గరిష్ఠం) దశ సంభవిస్తుందని శాస్త్రవేత్తల అంచనా. భూమిపై ఇది ఏ ఉత్పాతాలకు దారితీస్తుందో, ఏ ఉపద్రవాలు తెచ్చిపెడుతుందోనని వారు కలవరపడుతున్నారు. ఈ ఉగ్ర రూపం అనంతరం సూర్యుడు మళ్లీ నెమ్మదిస్తాడు. విశేషమేంటంటే... సోలార్ మాగ్జిమమ్ లేదా ‘పీక్ స్టేజి’ సమాప్తమైందనే సంగతి... అది ముగిసిన ఆరు నెలల దాకా శాస్త్రవేత్తలకు తెలియదు! 


Photo Courtesy: NASA/SDO, AIA, EVE, HMI Science Teams

ఏఆర్3590తో ప్రమాదమే! 
సూర్యుడు లోపల్లోపల తీవ్రంగా ప్రజ్వలిస్తాడు. తన ఉపరితలంపై కొన్ని చోట్ల అకస్మాత్తుగా విస్ఫోటిస్తాడు. అప్పుడు ఆయా ప్రాంతాల నుంచి ఒక్కసారిగా హెచ్చు మొత్తంలో విద్యుదయస్కాంత వికిరణం విడుదలవుతుంది. ఇవే సౌరజ్వాలలు (సోలార్ ఫ్లేర్స్).  ఈ జాజ్వల్యమాన ధగధగలు సూర్యుడిపై ప్రకాశవంతంగా గోచరిస్తాయి. సోలార్ ఫ్లేర్ ప్రక్రియ కొన్ని నిమిషాల నుంచి కొన్ని గంటలపాటు కొనసాగవచ్చు. తీవ్రత ఆధారంగా ‘సోలార్ ఫ్లేర్స్’ను X, M, C, B, A అంటూ అవరోహణ క్రమంలో ఐదు రకాలుగా వర్గీకరించారు. వీటిలో X రకం ఫ్లేర్స్ మహా శక్తిమంతం, భూమికి హానికరం. బలహీనపు A, B సౌరజ్వాలల ప్రభావం స్వల్పం. 

సన్ స్పాట్ ఏఆర్3590 ఫిబ్రవరి నెల 21న రెండు  X రకం సౌరజ్వాలలను వెదజల్లింది. X1.7 తీవ్రతతో ఓసారి, X1.8 తీవ్రతతోమరోసారి రెండు సౌరజ్వాలలను భూమి దిశగా ఎగజిమ్మింది. మర్నాడు 22వ తేదీన X6.3 తీవ్రతతో ఇంకో సౌరజ్వాలను వదిలింది. 2017లో X8.2 తీవ్రతతో విడుదలైన సోలార్ ఫ్లేర్ తర్వాత గత ఆరేళ్ల కాలంలో జనించిన అతి తీవ్ర ఫ్లేర్ ఇదే. పై 3 ఫ్లేర్స్ తర్వాత రెండు బలహీన M క్లాస్ జ్వాలలను కూడా సన్ స్పాట్ ఏఆర్3590 వెలువరించింది. ఈ మచ్చలోని అస్థిర బీటా-గామా-డెల్టా అయస్కాంత క్షేత్రంలో మరిన్ని X రకం సౌరజ్వాలలకు కావాల్సిన శక్తి ఉండవచ్చని, మరో X రకం మహా సౌరజ్వాల కోసం అది శక్తిని సమీకరిస్తోందని నిపుణులు అంచనా వేస్తున్నారు. కరోనల్ మాస్ ఎజెక్షన్స్ రూపంలో భూమికి ముప్పు తొలగిపోలేదని హెచ్చరిస్తున్నారు. 

సౌరచక్రంలో అయస్కాంత ధ్రువాల మార్పిడి  
సూర్యుడిలో 11 ఏళ్లకోసారి సౌరచక్రం గిర్రున తిరుగుతుంది. ఈ కాలచక్ర మధ్యంలో సౌరక్రియ గరిష్ఠ స్థితిని సంతరించుకునే ‘సోలార్ మాగ్జిమమ్’ దశ సందర్భంగా సూర్యుడి అయస్కాంత క్షేత్రం దాని అయస్కాంత ధ్రువాలను తారుమారు చేస్తుంది. రెండు అయస్కాంత క్షేత్రాలు పరస్పరం మారతాయి. అటుదిటు, ఇటుదటు అవుతాయి. అలా ఉత్తర అయస్కాంత ధ్రువం కాస్తా దక్షిణ అయస్కాంత ధ్రువంగా మారిపోతుంది. ఈ మార్పిడి జరిగేవరకు సూర్యుడు అంతకంతకూ ఉత్తేజితమవుతాడు. అనుక్షణం క్రియాశీలమవుతాడు. సౌరమచ్చలు, జ్వాలలు, సీఎంఈలు పుట్టుకొస్తాయి. ఈ ప్రక్రియ తర్వాత సూర్యుడు నెమ్మదిస్తాడు. మెల్లగా సౌర కనిష్ఠం లేదా సోలామ్ మినిమమ్ దశకు చేరతాడు. ఇదొక చక్రం. 

కరోనల్ మాస్ ఎజెక్షన్స్.. సౌర తుపాన్లు! 
‘కరోనా’ అనేది అత్యంత వేడితో కూడిన సౌర ధూళికణాలతో (ప్లాస్మా) నిండివుండే సూర్యుడి అతి బాహ్య పొర. X, M రకాల సౌర ప్రజ్వలనాలు కరోనల్ మాస్ ఎజెక్షన్స్ (సీఎంఈ)కు కారణమవుతాయి. కరోనా నుంచి ప్లాస్మా, విద్యుదయస్కాంత వికిరణం భారీగా విడుదలై భూ అయస్కాంత క్షేత్రంలోకి చొరబడి దుష్ప్రభావం చూపుతాయి. ‘నార్తర్న్ లైట్స్’గా పిలిచే ‘అరోరాలు’ సాధారణంగా ధ్రువాల వద్దనే కనిపిస్తాయి. కానీ సీఎంఈల  వల్ల తలెత్తే భూ అయస్కాంత తుపాన్లు... భూమధ్యరేఖ వద్ద ‘అరోరా’లను సృష్టిస్తాయి. 

1989 మార్చిలో భూమిని తాకిన ఓ కరోనల్ మాస్ ఎజెక్షన్ వల్ల కెనడాలోని క్యూబెక్ ప్రావిన్స్ అంతటా 9 గంటలపాటు విద్యుత్ వ్యవస్థ కుప్పకూలి 60 లక్షల మంది ఇబ్బందిపడ్డారు. కరోనల్ మాస్ ఎజెక్షన్స్ వేళల్లో ఆవేశిత శక్తి కణాలు అతి వేగంగా ప్రయాణిస్తాయి. వీటి వల్ల పవర్ గ్రిడ్స్ కుప్పకూలతాయి. విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు తగలబడతాయి. జీపీఎస్ నేవిగేషన్ వ్యవస్థలు అస్తవ్యస్తమై నౌకలు, విమానాల రాకపోకలు, ఇతర ప్రజా రవాణా వ్యవస్థలు  స్తంభిస్తాయి. టెలిఫోన్, కంప్యూటర్, కమ్యూనికేషన్, ఇంధన పంపిణీ-పైపులైన్ వ్యవస్థలు పాడవుతాయి. ఆ సమయాల్లో సౌరతుపాను గండం గడిచేదాకా ఉపగ్రహాల్ని స్విచాఫ్ చేస్తారు. లేకపోతే అవి శలభాల్లా మాడిపోతాయి. పిట్టల్లా రాలి భూమిపై పడతాయి.

 లక్షల కోట్ల ఆస్తినష్టం జరుగుతుంది. ఇక వ్యోమగాములు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్) వెలుపలి కార్యక్రమాల్లో పాల్గొనకుండా కేంద్రంలోని సురక్షిత స్థానాల్లోకి వెళ్లిపోతారు. X, M రకాల సౌర ప్రజ్వలనాల కారణంగా... భూ వాతావరణంలో రేడియో తరంగాలు ప్రయాణించే ‘దిగువ అయనోస్ఫియర్’లో ఎలక్ట్రాన్ల సాంద్రత తీవ్రమవుతుంది. దాంతో రేడియో తరంగాల శక్తి క్షీణించి అవి పై పొరల్లోకి ప్రయాణించలేవు. సూర్యకాంతి 8 నిమిషాల్లో భూమిని చేరుతుంది. సోలార్ ఫ్లేర్స్ నుంచి చొచ్చుకొచ్చే సౌర ధార్మికత కూడా అదే కాంతి వేగంతో భూమిని తాకుతుంది. ఇక కరోనల్ మాస్ ఎజెక్షన్స్ ఫలితంగా వందల కోట్ల టన్నుల కరోనల్ ప్లాస్మా వెదజల్లబడుతుంది. సీఎంఈ వేగం సెకనుకు 250 కిలోమీటర్ల నుంచి 3 వేల కిలోమీటర్ల వరకు ఉంటుంది. వేగవంతమైన కరోనల్ మాస్ ఎజెక్షన్ 15-18 గంటల్లో భూమిని చేరుతుంది. 

కారింగ్టన్ ఈవెంట్... అతి పెద్ద సౌర తుపాను! 
1860లో సోలార్ మాగ్జిమమ్ దశకు కొన్ని నెలల ముందు 1859 సెప్టెంబరులో ఓ సౌర తుపాను సంభవించింది. చరిత్రలో రికార్డయిన అతి పెద్ద సౌర తుపాను ఇదే. 1859 ఆగస్టులో సూర్యబింబంలో నల్లమచ్చల సంఖ్య పెరిగిపోవతాన్ని ప్రపంచవ్యాప్తంగా ఖగోళ శాస్త్రవేత్తలు ఆసక్తిగా తిలకించారు. లండన్ సమీపంలోని రెడ్ హిల్ పట్టణానికి చెందిన ఔత్సాహిక వీక్షకుడు రిచర్డ్ కారింగ్టన్ కూడా వారిలో ఒకరు. 1859 సెప్టెంబరు 1న సౌరమచ్చల్ని ఆయన చిత్రీకరిస్తుండగా అకస్మాత్తుగా తెల్లటి కాంతి తళుక్కున మెరిసింది. అది 5 నిమిషాలు అలాగే ఉంది. నిజానికి అది కరోనల్ మాస్ ఎజెక్షన్. ఈ ఘటనకు ఆయన గౌరవార్థం ‘కారింగ్టన్ ఈవెంట్’ అని పేరు పెట్టారు. 

ఆ కరోనల్ మాస్ ఎజెక్షన్ సూర్యుడి నుంచి 15 కోట్ల కిలోమీటర్ల దూరాన్ని 17.6 గంటల్లో ప్రయాణించి భూమిని చేరుకుంది. కారింగ్టన్ ఈవెంట్ తర్వాత మర్నాడు జియోమాగ్నెటిక్ తుపానుకు టెలిగ్రాఫ్ వ్యవస్థలు మొరాయించాయి. కొన్ని చోట్ల టెలిగ్రాఫ్ లైన్లపై అధిక విద్యుత్ ప్రసారమై టెక్నీషియన్లు కరెంటు షాక్ కు గురవగా ఇంకొన్ని చోట్ల టెలిగ్రాఫ్ సాధన సంపత్తి దగ్ధమైంది. నాటి ‘కారింగ్టన్ ఈవెంట్’కు కారణమైన నలమచ్ఛతో పోలిస్తే నేటి ఏఆర్3590 సన్ స్పాట్ సైజు 60%గా ఉంది. గ్రహణాల సమయంలో సూర్యుడిని వీక్షించడానికి వాడే సురక్షిత కళ్ళద్దాలు మన చెంత ఉంటే ఈ మచ్చను నేరుగా చూడొచ్చు. 

:::జమ్ముల శ్రీకాంత్

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement