black spots
-
చండ ప్రచండ మార్తాండ!
భగభగలాడే భానుడిపై ఓ నల్ల మచ్చ... తొలిసారి ఈ నెల 18న కనిపించింది... భయం పుట్టించేలా అది నేరుగా భూమికేసి కసిగా చూస్తోంది.... వారం రోజుల క్రితం తన నోట్లోంచి భూమి వైపు మూడు సౌరజ్వాలల్ని కక్కింది. దాంతో హై ఫ్రీక్వెన్సీ రేడియో కమ్యూనికేషన్లకు అంతరాయం కలిగింది. అదృష్టవశాత్తు కరోనల్ మాస్ ఎజెక్షన్స్ లేకపోవటంతో పెద్దగా నష్టం సంభవించలేదు. తర్వాత ఫిబ్రవరి 24-26 తేదీల మధ్యకాలంలో కేవలం రెండు రోజుల్లోనే ఇంతింతై అన్నట్టు... ఆ మచ్చ సైజు అమాంతంగా 25% పెరిగిపోయింది. .. తొమ్మిదిన్నర భూగ్రహాల వైశాల్యానికి సరిపోయేంతగా ఆ సన్ స్పాట్ విస్తరించింది. 2019లో మొదలైన ప్రస్తుత 25వ సౌరచక్రంలో సూర్యుడిపై ఇదే అతి పెద్ద మచ్చగా అవతరించింది. దీని పేరు ‘ఏఆర్3590’. ఏఆర్ అంటే యాక్టివ్ రీజియన్. సూర్యుడిపై క్రియాశీల ప్రాంతం. భూమికి పొంచి వున్న ముప్పు దృష్ట్యా సన్ స్పాట్ ఏఆర్3590 ప్రస్తుతం ఖగోళ శాస్త్రవేత్తల దృష్టిని అమితంగా ఆకర్షిస్తోంది. ఎందుకంటే సూర్యుడి అంతర్గత స్వరూపంలో గణనీయ మార్పులు వస్తున్నాయి. సూర్యుడిపై నల్ల మచ్చలు మామూలే. సౌరజ్వాలలకు పుట్టినిల్లయిన ఈ మచ్చలు అంతరిక్ష వాతావరణం, సౌరవ్యవస్థలోని గ్రహాలపై ప్రభావం చూపుతాయి. సూర్యుడి ఉపరితలంపై భారీ వైశాల్యంలో ఏర్పడే ఈ మచ్చల అయస్కాంత క్షేత్రం... భూ అయస్కాంత క్షేత్రం కంటే 2,500 రెట్లు శక్తిమంతం. లోలోన సూరీడు బాగా క్రియాశీలంగా ఉన్నచోట ఈ సన్ స్పాట్స్ ద్యోతకమవుతాయి. తమ పరిసర ప్రాంతాలతో పోలిస్తే వీటిలో ఉష్ణోగ్రతలు తక్కువ. Photo Credits: thesuntoday అయినప్పటికీ ఈ మచ్చల్లో 3,600 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత ఉంటుంది. ఇక మచ్చల సంఖ్య మాత్రం 11 ఏళ్ల సౌరచక్రాన్ని అనుసరించి మారుతుంది. సౌరచక్రంలో ఇప్పుడు మనం ముప్పు ముంగిట ఉన్నాం. గణించడం ఆరంభమయ్యాక ప్రస్తుతం 25వ సౌరచక్ర ప్రక్రియ కొనసాగుతోంది. మానవాళిని ఇబ్బంది పెట్టకుండా 24వ సౌరచక్రం ప్రశాంతంగా పూర్తయింది. 25వదీ సాఫీగా అలాగే ఉంటుందని శాస్త్రవేత్తలు ఊహించారు. కానీ తమ అంచనాలను మించి శక్తిమంతంగా కనిపిస్తున్న ఈ 25వ సౌరచక్రం భూమికి అనర్థాలు, చిక్కులు తెచ్చిపెడుతుందేమోనని వారు ఆందోళన చెందుతున్నారు. ఇటీవల సూర్యుడిపై మచ్చలు తరచూ ఏర్పడటం, వాటి సైజు పెరుగుతుండటం, తీవ్ర సౌర తుపాన్లు చోటుచేసుకోవడం గమనిస్తుంటే సూర్యుడు తన తాజా 11 ఏళ్ల సౌరచక్రంలో ఉచ్చ స్థితిలో ఉన్నాడని, మహోగ్ర విస్ఫోట దశను వేగంగా సమీపిస్తున్నాడని తెలుస్తోంది. తాము గతంలో ఊహించిన దాని కంటే చాలా ముందుగానే, బహుశా 2024 జూన్ మాసం ముగిసేలోపే ‘చండ మార్తాండ’ (సోలార్ మాగ్జిమమ్/సౌర గరిష్ఠం) దశ సంభవిస్తుందని శాస్త్రవేత్తల అంచనా. భూమిపై ఇది ఏ ఉత్పాతాలకు దారితీస్తుందో, ఏ ఉపద్రవాలు తెచ్చిపెడుతుందోనని వారు కలవరపడుతున్నారు. ఈ ఉగ్ర రూపం అనంతరం సూర్యుడు మళ్లీ నెమ్మదిస్తాడు. విశేషమేంటంటే... సోలార్ మాగ్జిమమ్ లేదా ‘పీక్ స్టేజి’ సమాప్తమైందనే సంగతి... అది ముగిసిన ఆరు నెలల దాకా శాస్త్రవేత్తలకు తెలియదు! Photo Courtesy: NASA/SDO, AIA, EVE, HMI Science Teams ఏఆర్3590తో ప్రమాదమే! సూర్యుడు లోపల్లోపల తీవ్రంగా ప్రజ్వలిస్తాడు. తన ఉపరితలంపై కొన్ని చోట్ల అకస్మాత్తుగా విస్ఫోటిస్తాడు. అప్పుడు ఆయా ప్రాంతాల నుంచి ఒక్కసారిగా హెచ్చు మొత్తంలో విద్యుదయస్కాంత వికిరణం విడుదలవుతుంది. ఇవే సౌరజ్వాలలు (సోలార్ ఫ్లేర్స్). ఈ జాజ్వల్యమాన ధగధగలు సూర్యుడిపై ప్రకాశవంతంగా గోచరిస్తాయి. సోలార్ ఫ్లేర్ ప్రక్రియ కొన్ని నిమిషాల నుంచి కొన్ని గంటలపాటు కొనసాగవచ్చు. తీవ్రత ఆధారంగా ‘సోలార్ ఫ్లేర్స్’ను X, M, C, B, A అంటూ అవరోహణ క్రమంలో ఐదు రకాలుగా వర్గీకరించారు. వీటిలో X రకం ఫ్లేర్స్ మహా శక్తిమంతం, భూమికి హానికరం. బలహీనపు A, B సౌరజ్వాలల ప్రభావం స్వల్పం. సన్ స్పాట్ ఏఆర్3590 ఫిబ్రవరి నెల 21న రెండు X రకం సౌరజ్వాలలను వెదజల్లింది. X1.7 తీవ్రతతో ఓసారి, X1.8 తీవ్రతతోమరోసారి రెండు సౌరజ్వాలలను భూమి దిశగా ఎగజిమ్మింది. మర్నాడు 22వ తేదీన X6.3 తీవ్రతతో ఇంకో సౌరజ్వాలను వదిలింది. 2017లో X8.2 తీవ్రతతో విడుదలైన సోలార్ ఫ్లేర్ తర్వాత గత ఆరేళ్ల కాలంలో జనించిన అతి తీవ్ర ఫ్లేర్ ఇదే. పై 3 ఫ్లేర్స్ తర్వాత రెండు బలహీన M క్లాస్ జ్వాలలను కూడా సన్ స్పాట్ ఏఆర్3590 వెలువరించింది. ఈ మచ్చలోని అస్థిర బీటా-గామా-డెల్టా అయస్కాంత క్షేత్రంలో మరిన్ని X రకం సౌరజ్వాలలకు కావాల్సిన శక్తి ఉండవచ్చని, మరో X రకం మహా సౌరజ్వాల కోసం అది శక్తిని సమీకరిస్తోందని నిపుణులు అంచనా వేస్తున్నారు. కరోనల్ మాస్ ఎజెక్షన్స్ రూపంలో భూమికి ముప్పు తొలగిపోలేదని హెచ్చరిస్తున్నారు. సౌరచక్రంలో అయస్కాంత ధ్రువాల మార్పిడి సూర్యుడిలో 11 ఏళ్లకోసారి సౌరచక్రం గిర్రున తిరుగుతుంది. ఈ కాలచక్ర మధ్యంలో సౌరక్రియ గరిష్ఠ స్థితిని సంతరించుకునే ‘సోలార్ మాగ్జిమమ్’ దశ సందర్భంగా సూర్యుడి అయస్కాంత క్షేత్రం దాని అయస్కాంత ధ్రువాలను తారుమారు చేస్తుంది. రెండు అయస్కాంత క్షేత్రాలు పరస్పరం మారతాయి. అటుదిటు, ఇటుదటు అవుతాయి. అలా ఉత్తర అయస్కాంత ధ్రువం కాస్తా దక్షిణ అయస్కాంత ధ్రువంగా మారిపోతుంది. ఈ మార్పిడి జరిగేవరకు సూర్యుడు అంతకంతకూ ఉత్తేజితమవుతాడు. అనుక్షణం క్రియాశీలమవుతాడు. సౌరమచ్చలు, జ్వాలలు, సీఎంఈలు పుట్టుకొస్తాయి. ఈ ప్రక్రియ తర్వాత సూర్యుడు నెమ్మదిస్తాడు. మెల్లగా సౌర కనిష్ఠం లేదా సోలామ్ మినిమమ్ దశకు చేరతాడు. ఇదొక చక్రం. కరోనల్ మాస్ ఎజెక్షన్స్.. సౌర తుపాన్లు! ‘కరోనా’ అనేది అత్యంత వేడితో కూడిన సౌర ధూళికణాలతో (ప్లాస్మా) నిండివుండే సూర్యుడి అతి బాహ్య పొర. X, M రకాల సౌర ప్రజ్వలనాలు కరోనల్ మాస్ ఎజెక్షన్స్ (సీఎంఈ)కు కారణమవుతాయి. కరోనా నుంచి ప్లాస్మా, విద్యుదయస్కాంత వికిరణం భారీగా విడుదలై భూ అయస్కాంత క్షేత్రంలోకి చొరబడి దుష్ప్రభావం చూపుతాయి. ‘నార్తర్న్ లైట్స్’గా పిలిచే ‘అరోరాలు’ సాధారణంగా ధ్రువాల వద్దనే కనిపిస్తాయి. కానీ సీఎంఈల వల్ల తలెత్తే భూ అయస్కాంత తుపాన్లు... భూమధ్యరేఖ వద్ద ‘అరోరా’లను సృష్టిస్తాయి. 1989 మార్చిలో భూమిని తాకిన ఓ కరోనల్ మాస్ ఎజెక్షన్ వల్ల కెనడాలోని క్యూబెక్ ప్రావిన్స్ అంతటా 9 గంటలపాటు విద్యుత్ వ్యవస్థ కుప్పకూలి 60 లక్షల మంది ఇబ్బందిపడ్డారు. కరోనల్ మాస్ ఎజెక్షన్స్ వేళల్లో ఆవేశిత శక్తి కణాలు అతి వేగంగా ప్రయాణిస్తాయి. వీటి వల్ల పవర్ గ్రిడ్స్ కుప్పకూలతాయి. విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు తగలబడతాయి. జీపీఎస్ నేవిగేషన్ వ్యవస్థలు అస్తవ్యస్తమై నౌకలు, విమానాల రాకపోకలు, ఇతర ప్రజా రవాణా వ్యవస్థలు స్తంభిస్తాయి. టెలిఫోన్, కంప్యూటర్, కమ్యూనికేషన్, ఇంధన పంపిణీ-పైపులైన్ వ్యవస్థలు పాడవుతాయి. ఆ సమయాల్లో సౌరతుపాను గండం గడిచేదాకా ఉపగ్రహాల్ని స్విచాఫ్ చేస్తారు. లేకపోతే అవి శలభాల్లా మాడిపోతాయి. పిట్టల్లా రాలి భూమిపై పడతాయి. లక్షల కోట్ల ఆస్తినష్టం జరుగుతుంది. ఇక వ్యోమగాములు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్) వెలుపలి కార్యక్రమాల్లో పాల్గొనకుండా కేంద్రంలోని సురక్షిత స్థానాల్లోకి వెళ్లిపోతారు. X, M రకాల సౌర ప్రజ్వలనాల కారణంగా... భూ వాతావరణంలో రేడియో తరంగాలు ప్రయాణించే ‘దిగువ అయనోస్ఫియర్’లో ఎలక్ట్రాన్ల సాంద్రత తీవ్రమవుతుంది. దాంతో రేడియో తరంగాల శక్తి క్షీణించి అవి పై పొరల్లోకి ప్రయాణించలేవు. సూర్యకాంతి 8 నిమిషాల్లో భూమిని చేరుతుంది. సోలార్ ఫ్లేర్స్ నుంచి చొచ్చుకొచ్చే సౌర ధార్మికత కూడా అదే కాంతి వేగంతో భూమిని తాకుతుంది. ఇక కరోనల్ మాస్ ఎజెక్షన్స్ ఫలితంగా వందల కోట్ల టన్నుల కరోనల్ ప్లాస్మా వెదజల్లబడుతుంది. సీఎంఈ వేగం సెకనుకు 250 కిలోమీటర్ల నుంచి 3 వేల కిలోమీటర్ల వరకు ఉంటుంది. వేగవంతమైన కరోనల్ మాస్ ఎజెక్షన్ 15-18 గంటల్లో భూమిని చేరుతుంది. కారింగ్టన్ ఈవెంట్... అతి పెద్ద సౌర తుపాను! 1860లో సోలార్ మాగ్జిమమ్ దశకు కొన్ని నెలల ముందు 1859 సెప్టెంబరులో ఓ సౌర తుపాను సంభవించింది. చరిత్రలో రికార్డయిన అతి పెద్ద సౌర తుపాను ఇదే. 1859 ఆగస్టులో సూర్యబింబంలో నల్లమచ్చల సంఖ్య పెరిగిపోవతాన్ని ప్రపంచవ్యాప్తంగా ఖగోళ శాస్త్రవేత్తలు ఆసక్తిగా తిలకించారు. లండన్ సమీపంలోని రెడ్ హిల్ పట్టణానికి చెందిన ఔత్సాహిక వీక్షకుడు రిచర్డ్ కారింగ్టన్ కూడా వారిలో ఒకరు. 1859 సెప్టెంబరు 1న సౌరమచ్చల్ని ఆయన చిత్రీకరిస్తుండగా అకస్మాత్తుగా తెల్లటి కాంతి తళుక్కున మెరిసింది. అది 5 నిమిషాలు అలాగే ఉంది. నిజానికి అది కరోనల్ మాస్ ఎజెక్షన్. ఈ ఘటనకు ఆయన గౌరవార్థం ‘కారింగ్టన్ ఈవెంట్’ అని పేరు పెట్టారు. ఆ కరోనల్ మాస్ ఎజెక్షన్ సూర్యుడి నుంచి 15 కోట్ల కిలోమీటర్ల దూరాన్ని 17.6 గంటల్లో ప్రయాణించి భూమిని చేరుకుంది. కారింగ్టన్ ఈవెంట్ తర్వాత మర్నాడు జియోమాగ్నెటిక్ తుపానుకు టెలిగ్రాఫ్ వ్యవస్థలు మొరాయించాయి. కొన్ని చోట్ల టెలిగ్రాఫ్ లైన్లపై అధిక విద్యుత్ ప్రసారమై టెక్నీషియన్లు కరెంటు షాక్ కు గురవగా ఇంకొన్ని చోట్ల టెలిగ్రాఫ్ సాధన సంపత్తి దగ్ధమైంది. నాటి ‘కారింగ్టన్ ఈవెంట్’కు కారణమైన నలమచ్ఛతో పోలిస్తే నేటి ఏఆర్3590 సన్ స్పాట్ సైజు 60%గా ఉంది. గ్రహణాల సమయంలో సూర్యుడిని వీక్షించడానికి వాడే సురక్షిత కళ్ళద్దాలు మన చెంత ఉంటే ఈ మచ్చను నేరుగా చూడొచ్చు. :::జమ్ముల శ్రీకాంత్ -
ప్రమాదాలకు బ్లాక్‘స్పాట్’
సాక్షి, అమరావతి: వాహనాల్లో హైవేలపై రివ్వున దూసుకుపోవడం సరదాగానే ఉంటుంది కానీ, అదే హైవేలపై బ్లాక్స్పాట్లు (ప్రమాదకర ప్రదేశాలు) యమపాశాలుగా మారుతున్నాయి. దేశంలో అత్యధిక రోడ్డు ప్రమాదాలు హైవే బ్లాక్ స్పాట్ల వద్ద సంభవిస్తున్నాయి. దేశంలో హైవేలపై ఐదేళ్లలో బ్లాక్ స్పాట్ల వద్ద ఏకంగా 39,944 రోడ్డు ప్రమాదాలు సంభవించాయి. ఆ ప్రమాదాల్లో 18,476 మంది దుర్మరణం చెందారు. ప్రస్తుతం దేశంలో 5,803 బ్లాక్ స్పాట్లు ఉన్నాయని జాతీయ రహదారుల అభివృద్ధి సంస్థ (ఎన్హెచ్ఏఐ) నివేదికలో వెల్లడించింది. బ్లాక్ స్పాట్లను సరిచేయడానికి ప్రాధాన్యమిస్తున్నామని పేర్కొంది. బ్లాక్ స్పాట్లను సరిదిద్దేందుకు ప్రాధాన్యం జాతీయ రహదారులపై బ్లాక్స్పాట్ల ప్రమాదాలను నివారించేందుకు ఎన్హెచ్ఏఐ కార్యాచరణను వేగవంతం చేసింది. గుర్తించిన బ్లాక్ స్పాట్లను శాస్త్రీయంగా విశ్లేషించి తగిన చర్యలు చేపడుతోంది. అందుకోసం పోలీసులు, రవాణా శాఖల సమన్వయంతో జిల్లాస్థాయి కమిటీలను ఏర్పాటు చేసింది. బ్లాక్స్పాట్లుగా గుర్తించిన ప్రదేశాల్లో జాతీయ రహదారుల విస్తరణ, రోడ్లకు మరమ్మతులు, ప్రమాదకర మలుపుల సమీపంలో చెట్ల తొలగింపు, సైన్‌బోర్డుల ఏర్పాటు తదితర చర్యలు వేగవంతం చేస్తోంది. ఆ ప్రమాదాల్లో హైవే పెట్రోలింగ్‌ను కూడా పెంచింది. గత ఐదేళ్లలో దేశంలో మొత్తం 3,972 బ్లాక్ స్పాట్లను సరిచేశారు. బ్లాక్ స్పాట్ అంటే.. భారతీయ రోడ్ రవాణా మంత్రిత్వ శాఖ ప్రకారం.. ఏదైనా జాతీయ రహదారి 500 మీటర్ల పరిధిలో గడిచిన మూడేళ్లలో అత్యంత దారుణ ప్రమాదాలు 5 జరిగి దానిలో 10 మందికిపైగా మరణించినా లేదా తీవ్రంగా గాయపడినా దానిని బ్లాక్‌స్పాట్‌గా గుర్తిస్తారు. మొదటి స్థానంలో తమిళనాడు బ్లాక్ స్పాట్లు, రోడ్డు ప్రమాదాలు, మృతుల సంఖ్యలో తమిళనాడు మొదటిస్థానంలో ఉంది. ఆ రాష్ట్రంలో అత్యధికంగా ఉన్న 748 బ్లాక్ స్పాట్ల వద్ద 6,230 రోడ్డు ప్రమాదాలు సంభవించాయి. ఆ ప్రమాదాల్లో 2,144 మంది దుర్మరణం చెందారు. 701 బ్లాక్ స్పాట్లతో రెండోస్థానంలో ఉన్న పశ్చిమ బెంగాల్లో 3,572 రోడ్డు ప్రమాదాల్లో 1,990 మంది ప్రాణాలు కోల్పోయారు. 551 బ్లాక్ స్పాట్లతో మూడోస్థానంలో ఉన్న కర్ణాటకలో 4,110 రోడ్డు ప్రమాదాలు సంభవించగా 1,694 మంది మృతి చెందారు. ఆ జాబితాలో తెలంగాణ నాలుగోస్థానంలో, ఆంధ్రప్రదేశ్ ఐదోస్థానంలో ఉన్నాయి. తెలంగాణలో 485 బ్లాక్ స్పాట్లలో సంభవించిన 3,965 రోడ్డు ప్రమాదాల్లో 1,672 మంది దుర్మరణం చెందారు. ఏపీలోని 466 బ్లాక్ స్పాట్లలో 2,202 రోడ్డు ప్రమాదాల్లో 1,273 మంది ప్రాణాలు విడిచారు. -
బ్లాక్ స్పాట్స్‌పై నజర్
సాక్షి, హైదరాబాద్ : తరచూ ప్రమాదాలు జరుగుతున్న రోడ్లపై పోలీస్ శాఖ ఫోకస్ పెట్టింది. ఎక్కువగా ప్రమాదాలు జరుగుతున్న ప్రదేశాలను బ్లాక్‌స్పాట్స్‌గా గుర్తించి నియంత్రణకు చర్యలు తీసుకుంటోంది. రాష్ట్రవ్యాప్తంగా పోలీస్‌తోపాటు రోడ్లు, భవనాలు, ఆరోగ్య, స్థానిక మున్సిపల్‌శాఖ అధికారుల సమన్వయంతో తాత్కాలిక, శాశ్వత ప్రాతిపదికన చర్యలు తీసుకుంటున్నారు. గతంలో ఎక్కువ రోడ్డు ప్రమాదాలు జరిగిన ప్రాంతంలో.. మరోమారు ప్రమాదాలకు తావులేకుండా తీసుకుంటున్న చర్యలు ఫలిస్తే.. కొంత కాలం తర్వాత ఆ ప్రదేశాన్ని బ్లాక్ స్పాట్ జాబితాలోంచి తొలగిస్తున్నట్టు అడిషనల్ డీజీ శివధర్‌రెడ్డి తెలిపారు. అందుబాటులో ఉన్న గణాంకాల ప్రకారం.. 2019 నుంచి 2021 వరకు రాష్ట్రవ్యాప్తంగా 1,002 బ్లాక్‌స్పాట్స్‌ను గుర్తించారు. 2022 నాటికి వాటి సంఖ్య 951కి తగ్గింది. బ్లాక్ స్పాట్లలో రోడ్డు ప్రమాదానికి కారణం రోడ్డు మలుపు లేదా ఇరుకుగా ఉండటం అయితే.. వెంటనే ఆ ప్రాంతంలో స్థలాన్ని కొనుగోలు చేసి రోడ్డు వెడల్పు చేయడం, లేదా మూల మలుపు ప్రమాదకరంగా లేకుండా మార్చడం వంటి ఇంజనీరింగ్ చర్యలతో సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతారు. ఇవన్నీ 3 నెలల్లో పూర్తి చేయాల్సి ఉంటుంది. బ్లాక్ స్పాట్లలో రోడ్డు సరిగా కనిపించేలా మార్కింగ్‌లు పెట్టడం.. వాహన వేగాన్ని నియంత్రించేందుకు స్పీడ్ బ్రేకర్స్ వేయడం, గుంతలు పూడ్చడం వంటి తాత్కాలిక చర్యలను తీసుకుంటారు. బ్లాక్ స్పాట్ అంటే..? బ్లాక్ స్పాట్లను రెండు విధాలుగా గుర్తిస్తారు. ఏదైనా రోడ్డులో 500 మీటర్ల పరిధిలో గత మూడేళ్లలో ఐదుకు మించి రోడ్డు ప్రమాదాలు జరిగితే దాన్ని బ్లాక్ స్పాట్‌గా గుర్తిస్తారు. ఏదైనా రోడ్డులో 500 మీటర్ల పరిధిలో జరిగిన ప్రమాదంలో పది మంది కంటే ఎక్కువ మంది చనిపోయినా (అక్కడ జరిగిన ప్రమాదాల సంఖ్యతో సంబంధం లేకుండా) ఆ ప్రాంతాన్ని బ్లాక్ స్పాట్‌గా పరిగణిస్తారు. -
బండెక్కితే భయమే! రాష్ట్రంలో రోజూ 20 మంది మృతి.. టాప్ 10లో తెలంగాణ
సాక్షి ప్రత్యేక ప్రతినిధి : రోడ్డెక్కగానే బండిని రయ్‌మంటూ పరుగెత్తిస్తారు.. జన సంచారం ఉండని హైవేలపై అయితే వాయు వేగంతో పోటీ పడతారు.. ఇలా దూసుకుపోతే ఆ కిక్కే వేరనుకుంటారు.. దీనికోసం ట్రాఫిక్ నిబంధనలనూ బేఖాతరు చేస్తారు.. ఇందులో కిక్కు ఎంత వస్తుందో వారికే తెలుసుగానీ.. ప్రమాదాలు జరిగి ప్రాణాలు పోవడం మాత్రం పెరిగిపోతోంది. రహదారులపై బ్లాక్ స్పాట్లు, వాహన వేగ నియంత్రణలో వైఫల్యం, హెల్మెట్, సీటుబెల్టు పెట్టుకోవడంలో నిర్లక్ష్యం వంటివి వేలకొద్దీ మరణాలకు కారణమవుతున్నాయి. కరోనా అనంతరం వ్యక్తిగత వాహనాల వినియోగం బాగా పెరిగింది. దీనితో రోడ్లపై ట్రాఫిక్ రద్దీ ఎక్కువై ప్రమాదాలు– మరణాల శాతం పెరగడానికి దారితీస్తోందని నిపుణులు చెప్తున్నారు. ప్రమాద మృతుల్లో 35ఏళ్ల లోపు వారే 46.3శాతం ఉంటుండటంపై ఆందోళన కరమని పేర్కొంటున్నారు. 2021 సంవత్సరానికిసంబంధించి కేంద్ర రవాణాశాఖ ఇటీవలి పార్లమెంటు సమావేశాల్లో వెల్లడించిన గణాంకాలు ఈ పరిస్థితిని స్పష్టంగా చూపుతున్నాయి. అతి వేగమే.. చంపేస్తోంది ♦ రోడ్డు ప్రమాదాల్లో చనిపోయిన వారిలో 18–35 ఏళ్లలోపు వారే అత్యధికంగా (46.3శాతం) ఉన్నారు. ఇందులోనూ 45.1శాతం టూవీలర్స్‌పై, 12.9 శాతం కార్లలో ప్రయాణిస్తున్నవారుకాగా.. 18.9శాతం మంది పాదచారులు. ♦ 71.7శాతం ప్రమాదాలు అతివేగంతో డ్రైవర్ వైఫల్యం వల్లే చోటు చేసుకున్నాయి. ఇందులో 31శాతం కొత్త వాహనాలు (5 ఏళ్లలోపువే) నడిపేవారే చేశారు. 9.5 శాతం మంది మద్యం–సెల్‌ఫోన్ డ్రైవింగ్ కారణంగా ప్రమాదాల బారినపడ్డారు. ♦ ప్రమాదాలు చేసిన వారిలో ఏడు శాతం మందికి లైసెన్స్‌లు కూడా లేకపోవడం గమనార్హం. ♦ నేషనల్ హైవేలపైనే అత్యధిక ప్రమాదాలు–మరణాలు చోటు చేసుకున్నాయి. 2021లో 1,28,825 (31.6శాతం) ప్రమాదాలు, 56,007 మరణాలు హైవేలపైనే నమోదయ్యాయి. ఆ ఏడాది తెలంగాణలోని హైవేల 2,735 మంది చనిపోయారు. ♦ 10 లక్షలు జనాభా దాటిన నగరాల్లో రోడ్డు ప్రమాదాల విషయంలో చెన్నై, ఢిల్లీ, జబల్పూర్లో తొలి మూడు స్థానాల్లో ఉండగా.. హైదరాబాద్ 8వ ప్లేస్‌లో ఉంది. మహానగరాల్లో జరుగుతున్న ప్రమాదాల్లో మరణిస్తున్న వారిలో 25 శాతం మంది పాదచారులే. హైవేలపై లోపాలు సరిదిద్దక.. తెలంగాణ మీదుగా వెళుతున్న ప్రధాన హైవేలపై లోపాలను సరిదిద్దే అంశం వేగంగా ముందుకు కదలటం లేదు. అత్యధిక ప్రమాదాలు జరిగే హైవే–65 (మచిలీపట్నం– హైదరాబాద్– పుణే), హైవే–44 (కన్యాకుమారి–కశ్మీర్), హైవే–563 (భూపాలపట్నం–హైదరాబాద్)లపై పలుచోట్ల ఇంజనీరింగ్ లోపాలను గతంలోనే గుర్తించారు. వాటితో ప్రమాదాలు జరుగుతున్నట్టూ తేల్చారు. కానీ వాటిని సరిదిద్దే విషయంలో జాప్యం జరుగుతోంది. ముఖ్యంగా హైవే–65పై కోదాడ, మునగాల, కట్టంగూర్, చిట్యాల, చౌటుప్పల్ ప్రాంతాల్లో అండర్‌వేలు నిర్మించాల్సి ఉంది. మూడేళ్లుగా టెండర్ల ప్రక్రియే పూర్తికాలేదు. హైవే–44లోనూ నిర్మల్, కామారెడ్డి, మేడ్చల్, మహబూబ్‌నగర్ జిల్లాల పరిధిలో ఇంజనీరింగ్ లోపాలు అలానే ఉన్నాయి. ఇప్పుడేం చేయాలి? తెలంగాణలో ప్రమాదాల నియంత్రణ దిశగా నూతన మోటార్ వెహికల్ యాక్ట్‌ను పూర్తిస్థాయిలో అమలు చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా బ్లాక్ స్పాట్స్‌లో లోపాలను సరిచేయడం, సైన్‌బోర్డులు, ఎలక్ట్రానిక్ ఎన్ఫోర్స్మెంట్ను పెంచటం, ప్రమాద బాధితులకు సత్వర వైద్యం అందే చర్యలు తీసుకోవడం అవసరమని స్పష్టం చేస్తున్నారు. మితిమీరిన వేగంతో ప్రయాణించకుండా తగిన అవగాహన కల్పించాలని పేర్కొంటున్నారు. ప్రమాదాల్లో యూఎస్.. మరణాల్లో భారత్.. వరల్డ్ రోడ్ స్టాటిస్టిక్స్–2020 నివేదిక ప్రకారం ప్రపంచంలోనే అత్యధికంగా అమెరికాలో 19,27,654 రోడ్డు ప్రమాదాలు జరిగాయి. ఈ ప్రమాదాల్లో సంభవించిన మరణాల సంఖ్య (36,650)లో మూడో స్థానంలో నిలిచింది. భారత్ 4,12,432 ప్రమాదాలతో ప్రపంచంలోనే రెండో స్థానంలో ఉండగా.. 1,53,972 మృతులతో మరణాల సంఖ్యలో మాత్రం టాప్‌లో నిలిచింది. అమ్మానాన్నను రోడ్డు మింగింది గత ఏడాది డిసెంబర్ 11న సూర్యాపేట జిల్లా అనంతగిరి నుంచి ఖమ్మం జిల్లా జల్లేపల్లికి వెళ్తున్న ఆటోను బస్సు ఢీకొట్టింది. ఆ ప్రమాదంలో రమేష్–రేణుక దంపతులు మృతిచెందడంతో.. వారి పిల్లలు కార్తీక్, హాసిని అనాథలుగా మారిపోయారు. -
Alert: హైదరాబాద్‌కు వస్తున్న వారికి పోలీసుల కీలక సూచన
సాక్షి, హైదరాబాద్: సంక్రాంతికి పల్లెబాట పట్టిన జనం ఇప్పుడు మళ్లీ నగరబాట పట్టారు. దీంతో పంతంగి టోల్ ప్లాజా వద్ద వాహనాల రద్దీ పెరిగింది. ఈ క్రమంలో పోలీసులు కూడా అలర్ట్ అయ్యారు. ఎలాంటి ప్రమాదాలు జరగకుండా హైదరాబాద్- విజయవాడ జాతీయ రహదారిపై 17 బ్లాక్ స్పాట్స్‌ను గుర్తించారు. నవాబుపేట (ఏపీ) నుంచి చిట్యాల మండలం పెద్దకాపర్తి వరకు తరచుగా ప్రమాదాలు జరిగే ప్రాంతాలుగా గుర్తించారు. కాగా, జాతీయ రహదారులు, స్థానిక రహదారులపై తరచూ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్న ప్రాంతాలను బ్లాక్స్పాట్లుగా గుర్తిస్తారు. బ్లాక్ స్పాట్స్ వివరాలు నవాబ్ పేట, రామాపురం, శ్రీరంగాపురం, మేళ్లచెరువు క్రాస్ రోడ్డు, కట్టకొమ్ముగూడ క్రాస్, కొమరబండ, ఆకుపాముల, ముకుందాపురం, దురాజ్ పల్లి, జమ్మిగూడ, జనగామ క్రాస్, ఎస్వీ కాలేజ్, కొర్ల పహాడ్, కట్టంగూరు, నల్లగొండ క్రాస్, చిట్యాల, పెద్ద కాపర్తి. ఈ బ్లాక్ స్పాట్ల వద్ద వాహనదారులు జాగ్రత్తగా వెళ్లాలని పోలీసులు సూచిస్తున్నారు. చదవండి: (మంత్రి ఎర్రబెల్లి సంచలన వ్యాఖ్యలు.. 20 మంది ఎమ్మెల్యేలపై వ్యతిరేకత) -
బ్లాక్స్పాట్లకు చెక్
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో రహదారి భద్రత దిశగా ప్రభుత్వం కార్యాచరణ చేపట్టింది. అత్యధికంగా రోడ్డు ప్రమాదాలు సంభవిస్తున్న ప్రమాదకర మలుపుల వద్ద రహదారి భద్రత చర్యలను చేపట్టాలని నిర్ణయించింది. అందుకోసం రాష్ట్ర రహదారి భద్రత కమిటీ సర్వే నిర్వహించింది. అత్యధికంగా ప్రమాదాలు జరుగుతుండటంతోపాటు ఎక్కువమంది దుర్మరణం చెందుతున్న బ్లాక్స్పాట్లను గుర్తించింది. అటువంటి బ్లాక్స్పాట్లు రాష్ట్రంలో 300 ఉన్నాయని ఆ సర్వేలో వెల్లడైంది. గత మూడేళ్లలో ఆ బ్లాక్స్పాట్లలో ఏకంగా 5,708 మంది దుర్మరణం చెందారని గుర్తించింది. దీంతో ఆ బ్లాక్స్పాట్ల వద్ద ఏటా రూ.400 కోట్లతో భద్రతాపరమైన చర్యలు చేపట్టేందుకు ప్రణాళిక రూపొందించింది. గుంటూరు జిల్లాలో ఎక్కువ బ్లాక్స్పాట్లు రాష్ట్రంలో రహదారి భద్రత కోసం ప్రభుత్వం పోలీసు, రవాణా, వైద్య–ఆరోగ్య శాఖల అధికారులతో కమిటీ ఏర్పాటు చేసింది. రాష్ట్రంలో అత్యధికంగా ప్రమాదాలు జరుగుతున్న రహదారులపై ఈ కమిటీ సర్వే చేసింది. రాష్ట్రంలో 26 జిల్లాలకుగాను 23 జిల్లాల పరిధిలో ఉన్న ఈ 300 బ్లాక్స్పాట్లలో మూడేళ్లలో 5,708 మంది ప్రాణాలు కోల్పోయారు. వీటిలో అత్యధికంగా గుంటూరు జిల్లాలోని 15 బ్లాక్స్పాట్ల వద్ద రోడ్డు ప్రమాదాల్లో ఏకంగా 1,383 మంది దుర్మరణం చెందారు. ఆ జాబితాలో రెండు, మూడు స్థానాల్లో బాపట్ల, తిరుపతి జిల్లాలు ఉన్నాయి. బాపట్లలో 15 బ్లాక్స్పాట్ల వద్ద 328 మంది మృతిచెందగా, తిరుపతి జిల్లాలో 15 బ్లాక్స్పాట్లలో 282 మంది మృత్యువాత పడ్డారు. బ్లాక్స్పాట్ల వివరాలు డీఆర్సీలకు.. బ్లాక్స్పాట్ల వద్ద రూ.400 కోట్లతో అమలు చేయనున్న రహదారి భద్రత చర్యల్లో భాగంగా ఆ ప్రాంతాల్లో సైన్ బోర్డులు, స్పీడ్గన్లు ఏర్పాటు చేయడం, ప్రత్యేక అధికారులు బృందాలతో వాహనాల తనిఖీ చేపట్టడం, అంబులెన్స్‌ల ఏర్పాటు, ఆ సమీపంలోని ఆస్పత్రుల్లో వసతులను మెరుగుపరచడం వంటివి చేపడతారు. రహదారి భద్రత కమిటీ బ్లాక్ స్పాట్ల వివరాలను ఆయా జిల్లా అభివృద్ధి మండళ్లకు(డీఆర్సీలకు) సమర్పించింది. ఈ ప్రదేశాల్లో చేపట్టాల్సిన పనులను జిల్లా భద్రత కమిటీల ఆధ్వర్యంలో చేపడతారు. బ్లాక్స్పాట్ల వద్ద భద్రత చర్యలను మెరుగుపరిచిన ఏడాది తరువాత పరిస్థితి సమీక్షిస్తారు. రోడ్డు ప్రమాదాలు, మృతుల సంఖ్య తగ్గిందీ లేనిదీ పరిశీలిస్తారు. తదనుగుణంగా భవిష్యత్ కార్యాచరణను నిర్ణయిస్తారు. ఈ విధంగా ఐదేళ్లపాటు బ్లాక్స్పాట్లలో రోడ్డు ప్రమాదాల నివారణకు కార్యాచరణను కొనసాగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. -
మృత్యుహైవే..37 బ్లాక్ స్పాట్స్ గుర్తింపు
మార్కాపురం టౌన్/మద్దిపాడు(ప్రకాశం జిల్లా): హైవే రోడ్లు ప్రమాదాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారాయి. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా నిత్యం ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. ప్రయాణికుల ప్రాణాలు అనంతవాయువుల్లో కలిసిపోతున్నాయి. జాతీయ రహదారులపై జరుగుతున్న రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు జిల్లా పోలీసులు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. ఎస్పీ మలికా గర్గ్ నేతృత్వంలో డీఎస్పీలు, సీఐలు, ఎస్సైలు ప్రతి శనివారం నేషనల్, స్టేట్ హైవేలపై నో యాక్సిడెంట్ డేగా నిర్ణయించి తనిఖీలు చేస్తున్నారు. ప్రమాదాల సంఖ్యను తగ్గించేందుకు ఒక వైపు ప్రజలకు ప్రయాణాల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పిస్తున్నారు. మరో వైపు నిబంధనలు ఉల్లంఘంచిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నారు. భారీగా జరిమానాలు విధిస్తున్నారు. జిల్లాలో ప్రధానంగా ఒంగోలు–చెన్నై, ఒంగోలు–విజయవాడ ఎన్‌హెచ్ 16, ఒంగోలు–చీమకుర్తి పరిధిలోని స్టేట్ హైవే నంబర్ 39, గిద్దలూరు–విజయవాడ పరిధిలోని ఎన్‌హెచ్ 544డి, మార్కాపురం టౌన్‌లోని బోడపాడు క్రాస్ రోడ్‌లోని ఎన్‌హెచ్ 565 పరిధిలో రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నట్లు పోలీసులు గుర్తించారు. బ్లాక్ స్పాట్స్‌లో ప్రత్యేక జాగ్రత్తలు చేపట్టారు. వీటి వద్ద బోర్డులు ఏర్పాటు చేయటంతో పాటు స్పీడ్ బ్రేకర్లను, బ్లింకింగ్ లైట్స్ సిస్టంను ఏర్పాటు చేశారు. రోడ్లకు ఇరువైపులా ఉన్న చిల్లచెట్లను తొలగిస్తున్నారు. గ్రామాలు పాఠశాలలు, మలుపుల వద్ద వాహనదారులను అలర్టు చేసేందుకు మార్కింగ్ చేశారు. గత నెల 24వ తేదీన డీఐజి త్రివిక్రమ వర్మ మద్దిపాడు మండలంలోని బ్లాక్ స్పాట్లను పరిశీలించి ప్రమాదాల సంఖ్యను తగ్గించేందుకు ఎస్పీ మలికాగర్గ్‌కు పలు సూచనలు చేశారు. కారణాలు ఇవే „ నేషనల్ హైవే నిబంధనల ప్రకారం హైవే రోడ్డుపై స్పీడ్ బ్రేకర్లు ఉండవు „ 100 నుంచి 140 కిలో మీటర్ల మితిమీరిన వేగంతో ప్రయాణించడంతో వాహనం అదుపు తప్పి ప్రమాదాలు జరుగుతున్నాయి. „ మద్యం తాగి వాహనం నడపటం „ గ్రామాల వద్ద, మలుపుల వద్ద వాహనం నిదానంగా కాకుండా వేగంగా వెళ్లడం, ఎదురుగా వచ్చే వాహనాన్ని గుర్తించక ప్రమాదాలు జరుగుతున్నాయి. „ హెల్మెట్ వాడకపోవటం, సీట్ బెల్ట్ పెట్టుకోకపోవటంతో ప్రమాదాల్లో పలువురు ప్రాణాలు కోల్పోతున్నారు. „ హైవేపై ఆటో డ్రైవర్లు ట్రాఫిక్ నిబంధనలు పాటించకపోవటంతో ప్రమాదాలకు కారణమవుతున్నాయి. గత నెలలో జరిగిన ప్రమాదాల్లో కొన్ని అమరావతి–అనంతపురం హైవేపై కంభం రైల్వేస్టేషన్ వద్ద ఆగస్టు 8వ తేదీ తెల్లవారుజామున రెండు గంటల సమయంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ముందు వెళ్తున్న లారీని వెనుక నుంచి వస్తున్న కారు ఢీకొనడంతో పల్నాడు జిల్లా వెల్దుర్తి మండలం సిరిగిరిపాడుకు చెందిన ఐదుగురు దుర్మరణం చెందారు. 12న కొనకనమిట్ల మండలంలో జాతీయ రహదారిపై బైక్ ఢీకొని వృద్దుడు మృతి. 16న బేస్తవారిపేట పరిధిలో బస్సును బైక్ ఢీకొని యువకుడు మృతి. దర్శిలో బైక్‌పై వెళ్తూ బస్సును ఢీకొట్టి ఇద్దరు యువకులు మృతి. 20వ తేదీన తాళ్లూరు మండలం గంగవరం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో అన్నా చెల్లెలు మృతి. 23న జే పంగులూరు మండలం కొండమంజులూరు వద్ద రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. 28వ తేదీ కొమరోలు మండలంలో బైక్‌ను ఢీకొట్టిన లారీ, బైక్‌పై ఉన్న ఇద్దరు మృత్యువాత. 2019వ సంవత్సరంలో బ్లాక్ స్పాట్ల వద్ద 24 మంది చనిపోగా, 17 మంది తీవ్రంగా గాయపడ్డారు. 2020లో 18 మంది ప్రమాదాల్లో చనిపోగా 17 మంది తీవ్ర గాయాలపాలయ్యారు. నలుగురికి గాయాలయ్యాయి. 2021లో 22 మంది చనిపోగా, 17 మంది తీవ్రంగా గాయపడ్డారు. 2022లో ఆగస్టు వరకూ 11 మంది మృతిచెందగా, 13 మందికి తీవ్ర గాయాలయ్యాయి. నివారణ చర్యలు తీసుకుంటున్నాం జిల్లా వ్యాప్తంగా తరచుగా రోడ్డు ప్రమాదాలు జరిగే ప్రాంతాలను గుర్తించాం. నివారణకు మా సిబ్బంది వాహనదారులకు అవగాహన కలి్పస్తున్నారు. నిబంధనలు పాటించని వారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నాం. స్పీడ్ గన్లు ఏర్పాటు చేశాం. దీంతో హై స్పీడ్‌తో వెళ్తున్న వాహనాలను గుర్తించి జరిమానా విధిస్తున్నాం. ప్రతి శనివారం జిల్లా వ్యాప్తంగా నో యాక్సిడెంట్ డేను అమలు చేస్తున్నాం. పోలీస్ అధికారులు తమ సిబ్బందితో ఉదయం 8 నుంచి రాత్రి 8 గంటల వరకు వాహనాల తనిఖీ చేపడుతున్నారు. – మలికాగర్గ్, జిల్లా ఎస్పీ బ్లాక్ స్పాట్లు మార్కాపురం పరిధిలోని బోడపాడు క్రాస్‌రోడ్డు, కొనకనమిట్ల జంక్షన్, రాయవరం పలకల గనులు, పెద్దారవీడు సమీపంలోని హనుమాన్ జంక్షన్, నేషనల్ హైవేపై ఉన్న గొబ్బూరు, తోకపల్లి, దేవరాజుగట్టు, కంభం సమీపంలో హైవేపై ఉన్న పెట్రోల్ బంకు వద్ద, గిద్దలూరు సమీపంలోని త్రిపురాపురం క్రాస్‌రోడ్, బేస్తవారిపేట సమీపంలోని పెంచికలపాడు, యర్రగొండపాలెం పరిధిలోని గురిజేపల్లి, బోయలపల్లి, దోర్నాల సమీపంలోని చింతల, చిన్నారుట్ల మలుపు, పుల్లలచెరువు సమీపంలోని మల్లపాలెం క్రాస్‌రోడ్డు, త్రిపురాంతకం సమీపంలోని నేషనల్ హైవేపై ఉన్న గొల్లపల్లి, డీబీఎన్ కాలనీ క్రాస్ రోడ్ల వద్ద తరచుగా రోడ్డు యాక్సిడెంట్లు జరుగుతున్నాయి. ఒంగోలు తాలుకా పోలీస్ స్టేషన్ పరిధిలోని సౌత్ బైపాస్ జంక్షన్, సంఘమిత్ర హాస్పిటల్ రోడ్డు, వెంగముక్కలపాలెం జంక్షన్, త్రోవగుంట, ఏడుగుండ్లపాడు, కొప్పోలు ఫ్లైఓవర్ జంక్షన్, మద్దిపాడు పరిధిలోని గ్రోత్ సెంటర్, చీమకుర్తి పరిధిలోని మర్రిచెట్లపాలెం జంక్షన్, ఈస్ట్ బైపాస్ రోడ్డు, రెడ్డి నగర్, సంతనూతలపాడు పరిధిలోని ఒంగోలు రోడ్డు, సింగరాయ కొండ పరిధిలోని కనుమళ్ల క్రాస్‌రోడ్డు, టంగుటూరు సమీపంలోని రైజ్ ఇంజినీరింగ్ కాలేజి, వల్లూరమ్మ గుడి మధ్య, సూరారెడ్డిపాలెం ఐవోసీ ప్రాంతం, కొండపి ఫైవోవర్ బ్రిడ్జి దగ్గర తరచుగా ప్రమాదాలు జరుగుతున్నాయి. -
ఒకే చోట వరుస ప్రమాదాలు.. ప్రాణాలు తీస్తున్న బ్లాక్‌స్పాట్
ఒకేచోట 20 మీటర్ల దూరంలో తరచూ ప్రమాదాలు జరిగే ప్రాంతాలను బ్లాక్ స్పాట్లు అంటారు. బరంపురం నగరం నుంచి దిగపండి మీదుగా కొందమాల్, రాయగడ వెళ్లే 326 నంబర్ జాతీయ రహదారిలో తప్తపాణి–కళింగా మధ్య ఘాట్ రోడ్ బ్లాక్ స్పాట్‌గా మారింది. గత కొద్ది రోజులుగా ఇక్కడ వరుసగా ప్రమాదాలు జరుగుతుండడం దీనికి ఉదాహరణగా నిలుస్తోంది. ఏడాదిలో కాలంలో ఇక్కడ జరిగిన దుర్ఘటనల్లో సుమారు 20 మందికి పైగా మరణించారు. మరో 100 మందికి పైగా తీవ్ర గాయాలు పాలై అస్పత్రిలో చికిత్స పొందగా, వారిలో పదుల సంఖ్యలో వికలాంగులుగా మారారు. అందువలన ఇక్కడ ప్రయాణాలు చేసేటప్పుడు అప్రమత్తంగా ఉండాలని పలువురు సూచిస్తున్నారు. ఏ పిక్నిక్కు వెళ్లి వస్తుండగా... జనవరి 15వ తేదీన రాయగడా జిల్లా చంద్రగిరికి పిక్నిక్కు వెళ్లి రాత్రి 10 గంటల సమయంలో తిరిగి వస్తున్న బస్సు తప్పపాణి ఘాటి దగ్గర ఎదురుగా వస్తున్న ద్విచక్ర వాహనాన్ని ఢీకొంది. ప్రమాద సమయంలో డ్రైవర్ కంగారు పడడంతో అదుపు తప్పిన పిక్నిక్ బస్సు లోయలోకి పల్టీ కొట్టింది. ప్రమాదంలో పిక్నిక్ వెళ్లిన వారిలో 30 మందికి తీవ్ర గాయాలయ్యాయి. అలాగే అంబగడా గ్రామానికి చెందిన బైక్ నడిపిన వ్యక్తి, వెనుక కూర్చున్న వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందారు. 8 మంది దుర్మరణం ఏప్రిల్ 29వ తేదీన రాయగడా నుంచి బరంపురంనకు 60 మందితో వస్తున్న బస్సు ఉదయం 3 గంటల సమయంలో అదుపు తప్పడంతో 8 మంది దుర్మరణం చెందారు. అలాగే 40 మంది ప్రయాణికులు తీవ్రగాయాల పాలయ్యారు. స్వయంగా గంజాం జిల్లా కలెక్టర్ విజయ్ అమృత కులంగా, ఎస్పీ బ్రాజేష్ కుమార్‌రాయ్ సంఘటనా స్థలానికి చేరుకొని ఓడ్రాప్ బృందం సాయంతో క్షతగాత్రులను ఎంకేసీజీ మెడికల్ ఆస్పత్రికి తరలించారు. 60 మంది విద్యార్థులకు ప్రమాదం ఇదే రోడ్డులో జనవరి చివరి వారంలో రాష్ట్ర రాజధాని భువనేశ్వర్‌లోని రవిన్స్శా విశ్వ విద్యాలయానికి చెందిన విద్యార్థులు సుమారు 60 మంది బస్సులో గజపతి జిల్లా గండాహతి వాటర్ ఫాల్స్ వద్దకు పిక్నిక్కు వెళ్లారు. వీరు ఆనందంగా గడిపి తిరిగి రాత్రి 10 గంటల సమయంలో వస్తుండగా బస్సు అదుపుతప్పి లోయలోకి పడిపోయింది. దీంతో 30 మంది విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. తీవ్ర విషాదం ఇటీవల కొందమాల్ జిల్లా దరింగబడి నుంచి బరంపురం మీదుగా పశ్చిమబంగా వెళ్తున్న పర్యాటకుల ఏసీ బస్సు వేకువజామున 3 గంటల సమయంలో గంజాం జిల్లా జగన్నాథ్ ప్రసాద్ బ్లాక్ కళింగా ఘాట్ రోడ్డులో అదుపు తప్పి విద్యుత్ స్తంభానికి ఢీకొట్టి బోల్తా పడింది. దుర్ఘటనలో 6గురు పర్యాటకులే మృతి చెందగా, 30 మంది తీవ్రంగా గాయపడ్డారు. లోయలో పడిన ట్రక్కు అలాగే అక్కడికి కొద్ది రోజుల తర్వాత రాయగడ నుంచి బరంపురం లోడుతో వస్తున్న ట్రాక్‌కు లోయలోకి పడిపోవడంతో డ్రైవర్ మృతి చెందగా, క్లీనర్‌కి తీవ్ర గాయాలయ్యాయి. ఇదేవిధంగా పత్తపాణి ఘాటి లోయలో పడిన టాటా సఫారి దుర్ఘటనలో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. చెట్టుని ఢీకొని... ఇటీవల గంజాం జిల్లా సురడా బ్లాక్ పరిధి తప్తపాణీ–గజలబడి దగ్గర కళింగా ఘాట్ రోడ్డులో పెళ్లి బృందం వ్యాన్ చెట్టుని ఢీకొనడంతో 21 మందికి తీవ్ర గాయాలయ్యాయి. కలెక్టర్ ఆదేశాలతో అగ్నిమాపక సిబ్బంది, పోలీసు అధికారులు సంఘటన స్థలానికి చేరుకొని క్షతగాత్రులను బంజనగర్ ఆస్పత్రికి తరలించారు. చదవండి: Orissa Crime News: నా భార్యను చంపేశాను.. డయల్ 100కు ఫోన్ చేసి.. -
హైదరాబాద్‌లో బ్లాక్ స్పాట్స్‌పై ట్రాఫిక్ పోలీసుల నజర్
సాక్షి, హైదరాబాద్: నగరంలో రోడ్డు ప్రమాదాలు, మృతుల సంఖ్యను తగ్గించడానికి ట్రాఫిక్ పోలీసులు ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్తున్నారు. ఇందులో భాగంగా తరచూ ప్రమాదాలు చోటుచేసుకునే బ్లాక్ స్పాట్స్‌తో పాటు బ్లాక్‌స్ట్రెచ్‌లపైనా దృష్టి పెట్టారు. ఇక్కడి పరిస్థితులను అధ్యయనం చేసి, పరిష్కార మార్గాలు సూచించడానికి బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ నిపుణుల సహాయం తీసుకుంటున్నారు. మరోపక్క బడి పిల్లల భద్రత కోసం ఆధునిక స్కూల్ జోన్స్ ఏర్పాటు చేయడానికీ కసరత్తు చేస్తున్నారు. దీనికి సంబంధించి డీసీపీ– 1 ఎన్.ప్రకాష్‌రెడ్డి నేతృత్వంలోని బృందం మంగళవారం వివిధ ప్రాంతాల్లో పర్యటించింది. స్థానిక పరిస్థితుల ఆధారంగా స్ట్రెచ్‌లు... ట్రాఫిక్ విభాగం అధికారులు బ్లాక్ స్పాట్స్ గుర్తించడానికి కేంద్రం అధీనంలోని మినిస్ట్రీ ఆఫ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ అండ్ హైవేస్ (ఎంఓఆర్టీహెచ్) మార్గదర్శకాలను అనుసరిస్తారు. వీటి ప్రకారం గడిచిన మూడేళ్ల కాలంలో ఒకటి కంటే ఎక్కువ ప్రమాదాలు చోటు చేసుకున్న 50 బ్లాక్ స్పాట్స్‌ను గుర్తించారు. వీటితో పాటు స్థానిక పరిస్థితులను బట్టి రోడ్డు ప్రమాదాలకు కారణమైన బ్లాక్ స్ట్రెచ్‌లను సిటీ ట్రాఫిక్ పోలీసులు గుర్తించారు. ఇవి కనిష్టంగా కి.మీ. నుంచి గరిష్టంగా రెండు కి.మీ. వరకు ఉన్నాయి. బ్లాక్ స్పాట్స్, స్ట్రెచ్‌ల్లో పరిస్థితులు మార్చడానికి బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ నిపుణుల సహాయం తీసుకుంటున్నారు. ఆయా ప్రాంతాల్లో పర్యటిస్తున్న ప్రత్యేక బృందం కారణాలు, నివారణ మార్గాలను సూచిస్తోంది. వీటిని ఆధారంగా జీహెచ్ఎంసీ అధికారులతో కలిసి ట్రాఫిక్ పోలీసులు చర్యలు తీసుకోనున్నారు. (క్లిక్: వాహనదారులపై భారీగా పెరిగిన జీవిత కాలం పన్ను) తొలిదశలో పదకొండు ప్రాంతాల్లో పరిశీలన.. ట్రాఫిక్– బిట్స్ పిలానీ అధికారులు, నిపుణులతో కూడిన ప్రత్యేక బృందం తొలి దశలో నగరంలోని పదకొండు కీలక ప్రాంతాలపై దృష్టి పెట్టింది. ఈ నేపథ్యంలోనే మంగళవారం ఈ టీమ్ తాడ్‌బండ్ గ్రేవ్ యార్డ్, డెయిరీ ఫాం, టి జంక్షన్, బోయిన్పల్లి ఎక్స్ రోడ్స్, హోలీ ఫ్యామిలీ జంక్షన్, సంగీత్ చౌరస్తా, చిలకలగూడ ఎక్స్‌రోడ్స్, రైల్ నిలయం, ఆలుగడ్డబావి, మెట్టుగూడ చౌరస్తా, రైల్వే డిగ్రీ కాలేజ్, ట్యాంక్‌బండ్ చిల్డ్రన్స్ పార్క్ ప్రాంతాల్లో పర్యటించింది. అక్కడి పరిస్థితులపై ట్రాఫిక్ విభాగం అధికారులు రూపొందించిన మ్యాప్స్ సాయంతో బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ నిపుణులు అధ్యయనం చేశారు. పాఠశాలల పునఃప్రారంభం లోపు... నగరంలో పాఠశాలలు పునఃప్రారంభమయ్యే లోపు బడి పిల్లల భద్రతకు ఉద్దేశించిన ఆధునిక స్కూల్స్ జోన్స్‌ను సిద్ధం చేయాలని ట్రాఫిక్ విభాగం అధికారులు నిర్ణయించారు. రద్దీ, పాఠశాల ఉన్న ప్రాంతం తదితరాలను పరిగణనలోని తీసుకుని ఏఏ స్కూళ్ల వద్ద ఇవి ఏర్పాటు చేయాలన్నది నిర్ణయించనున్నారు. ప్రయోగాత్మకంగా నార్త్‌జోన్‌లో ఒకటి, సెంట్రల్ జోన్లో ఒకటి, వెస్ట్‌జోన్‌లో రెండు పాఠశాలలను ఎంపిక చేయాలని నిర్ణయించారు. (క్లిక్: వాహనాలపై పెరిగిన గ్రీన్ ట్యాక్స్!) -
ఇలా చేస్తే.. ముఖంపై ఎలాంటి మచ్చలైనా మటుమాయం
ఎత్తుకు తగిన బరువుతో ఆకర్షణీయమైన పర్సనాలిటీతో నలుగురిన్నీ ఆకట్టుకుంటూ ఉండాలని అందరమూ కోరుకుంటాం. కానీ అన్నీ బావున్నా.. తీరా ముఖం దగ్గరికొచ్చేసరికి మచ్చలు కొంతమందిని వేధిస్తూ ఉంటాయి. ముఖాన్ని అందహీనంగా మార్చే ఈ నల్లటి మచ్చలనే మంగు మచ్చలంటారు. ఈ మచ్చలు ముఖం రెండు వైపులా బుగ్గలపై నుంచి ముక్కు వరకూ వ్యాపిస్తాయి. ఇవి ముఖంతో పాటు మెడ, భుజాలు, వీపు వెనుకభాగంలో కూడా ఏర్పడే అవకాశం ఉంది. శరీరతత్వాన్ని బట్టి ముఖంపై మొటిమలు, పులిపిర్లు, పెద్ద పరిమాణంలో ఉండే పుట్టుమచ్చలు, వయసుతో పాటు ఏర్పడిన మార్పులు, ఎండలో తిరగటం వల్ల ఏర్పడిన మచ్చలు మొదలైనవి ఏర్పడుతుంటాయి. వీటిలో కొన్ని వంశ పారంపర్యంగా వస్తే, మరికొన్ని హార్మోన్లలో సమతుల్యత లోపించడం వల్ల కూడా రావచ్చు. వంశ పారంపర్యంగా వచ్చే మచ్చలను నివారించలేకపోయినా, వాటి ప్రభావాన్ని తగ్గించవచ్చు. ముఖంపై మంగు మచ్చలు లేదా, నల్లటి మచ్చలు వ్యాధి కాదు కానీ, వీటితో ఆత్మన్యూనతతో పదిమందిలోకీ వెళ్లడానికి ఇబ్బంది పడతారు. అసలు ఇలాంటి మచ్చలు ఎందుకు వస్తాయో తెలుసుకుంటే వాటిని నివారించ వచ్చు. తొలిదశలోనే ఉన్న వాటిని చిన్న చిన్న చిట్కాలతో నయం చేసుకోవచ్చు. చిన్న చిన్న చిట్కాలతో ముఖంపై మంగు మచ్చలు మాయం. తాజా వెన్నను ముఖంపైన ఉండే మంగు మచ్చలపై రోజూ రుద్దుతుంటే క్రమేణా పలచబడి కొంతకాలానికి చర్మం రంగులో కలిసిపోతాయి. పచ్చి పసుపు, ఎర్రచందనం సమభాగాలుగా కలిపి పాలల్లో కలిపి రాస్తుంటే మంగు మచ్చలు, చెంపలపైన ఉన్న నల్లని మచ్చలూ తగ్గుతాయి. జాజికాయను పాలలో అరగదీసి రాయడం వల్ల గుణం కనిపిస్తుంది. పాలల్లో ఎర్రకందిపప్పు నూరి నేతిలో కలిపి మంగు మచ్చలపై రాస్తుంటే కొద్ది రోజుల్లోనే నలుపుదనం పోతుంది. పావు టీ స్పూన్నిమ్మరసానికి సమంగా తేనె కలిపి మచ్చలపై బాగా రుద్ది 20 నిమిషాల తర్వాత చల్లని నీటితో కడగాలి. ఇలా నెల రోజులు చేస్తే మంచి ఫలితం ఉంటుంది. టొమాటోను రెండు ముక్కలుగా తరిగి, వాటితో మచ్చలపై బాగా రుద్ది 20 నిమిషాల తర్వాత చల్లని నీటితో కడగాలి. క్రమం తప్పకుండా ఇలా చేస్తే నల్ల మచ్చలు తగ్గడంతోపాటు ముఖవర్చస్సు పెరుగుతుంది. అలోవెరా పేస్టును మచ్చలపై పూయాలి. ఆ మచ్చతడి ఆరిపోయాక చల్లని నీటితో శుభ్రంగా కడిగేయాలి. ఇలా చేయడం వల్ల క్రమంగా మచ్చలు తగ్గిపోతాయి. టీ స్పూన్టొమాటో రసం, టీ స్పూన్గంధం పొడి, రెండు టీ స్పూన్ల ముల్తాని మట్టి కలిపి మెత్తని పేస్టులా చేసి మచ్చలపై పట్టించి 20 నిమిషాల తర్వాత చల్లని నీటితో కడగాలి. ఇలా వారానికి రెండు లేదా మూడుసార్లు చేస్తుంటే మంచి ఫలితం ఉంటుంది. రోజ్‌వాటర్, కీరా రసం, నిమ్మరసం, తేనె సమంగా కలిపి మచ్చలపై రుద్ది 20 నిమిషాల తర్వాత చల్లని నీటితో కడుగుతుంటే నెల రోజులు గడిచేసరికి మంచి మార్పు వస్తుంది. బంగాళదుంప చెక్కు తీసి, సన్నగా తురిమి పల్చని గుడ్డలో పిండి, రసం తీయాలి. దానిలో దూది ఉండలని ముంచి, వాటితో మచ్చలపై అద్దాలి. పావుగంట తర్వాత చల్లని నీటితో కడుక్కోవాలి. ఇలా క్రమం తప్పకుండా చేయాలి. అన్నింటికన్నా ముఖ్యమైనంది ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకుండా ఉండటం. ఆత్మన్యూనతతో ఉంటే మరింత కృంగిపోతాం. పదే పదే అందవిహీనంగా ఉన్నామనే విషయాన్ని గుర్తు చేసుకుంటే డిప్రెషన్‌కు లోనవుతాం. సో అలాంటివన్నీ పక్కన పెట్టి, సహజ పద్ధతుల్లో పరిష్కారానికి ప్రయత్నించడం, లేదంటే నిపుణులైన డాక్టర్ని సంప్రదించి చికిత్స తీసుకోవడం ఉత్తమం. ఆత్మవిశ్వాసంతో ఉండి చక్కగా చిరునవ్వుతో మాట్లాడుతూ ఉంటే ఏ మచ్చలూ మన అందాన్ని మసక బార్చలేవు. -
జీరో బ్లాక్ స్పాట్స్!
సాక్షి, సిటీబ్యూరో : చిలకలగూడ క్రాస్‌రోడ్స్‌లో తరచూ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. బ్లాక్‌స్పాట్‌గా ఉన్న ఇక్కడ తగిన సేఫ్టీ చర్యలు తీసుకోవాల్సిందిగా 2018లో గుర్తించి చర్యలుతీసుకున్నారు. అయినప్పటికీ 2019లో కూడా ఇది బ్లాక్స్పాట్గానమోదైంది. ఎంజే మార్కెట్..గాంధీ భవన్ జంక్షన్–యూసుఫ్ కంపెనీ–జీపీఓ మార్గం సైతం బ్లాక్ స్పాట్ మరకను పోగోట్టుకోలేదు. 2018లోబ్లాక్స్పాట్గా ఉన్న ఇది 2019లోనూ అదే ముద్ర వేసుకుంది.... ఇలా ఒకటి కాదు.. రెండు కాదు మహానగరంలో 52 ప్రాంతాలు ఇంకా ప్రాణాంతక బ్లాక్స్పాట్లుగా ఉన్నాయి. అక్కడ ప్రమాదాలు, ప్రాణనష్టాలు జరుగకుండాఉండాలంటే మరిన్ని చర్యలు తీసుకోవాల్సి ఉంది. ఇలా పదే పదే ప్రమాదాలు పునరావృతమవుతున్న బ్లాక్‌స్పాట్స్‌లో ఇతర సమస్యలతో పాటు ర్యాష్‌డ్రైవింగ్, సరైన వెలుతురు లేకపోవడం, స్పీడ్ లిమిట్స్ పాటించకపోవడం వంటివి కూడా కారణాలని గుర్తించారు. ఇలాంటి లోపాల్ని సరిదిద్దడం ద్వారా ప్రమాదాల్ని తగ్గించవచ్చునని, బ్లాక్‌స్పాట్స్ లేని నగరంగా మార్చవచ్చునని భావించిన అధికారులు అందుకు చేపట్టాల్సిన చర్యలకు సిద్ధమవుతున్నారు. గ్రేటర్ నగరంలో గతంతో పోలిస్తే రోడ్డు ప్రమాదాలు 35 శాతం తగ్గినప్పటికీ, బ్లాక్‌స్పాట్స్ ఇంకా కొనసాగుతుండటంతో పరిశీలించిన ట్రాఫిక్ పోలీసులు మరిన్ని చర్యలు తీసుకోవాల్సిందిగా జీహెచ్ఎంసీకి సూచించారు. తగిన చర్యలకు జీహెచ్ఎంసీ సిద్ధమవుతోంది. ఇందులో భాగంగా వేగ నియంత్రణపై ప్రత్యేక దృష్టి సారించడంతోపాటు తగిన లైటింగ్ ఏర్పాట్లు, హెచ్చరిక బోర్డులు, ఉల్లంఘనులను గుర్తించేందుకు తగిన ఎన్ఫోర్స్మెంట్ వింగ్ అవసరమని భావిస్తున్నారు. జీరో బ్లాక్‌స్పాట్స్ నగరంగా మార్చేందుకు జీహెచ్ఎంసీతోపాటు రోడ్ల నిర్వహణ బాధ్యతలు చూస్తున్న సంస్థలు, పోలీసు, రవాణా శాఖలు సైతం తమవంతు పాత్ర పోషించనున్నాయి. ఆయా అంశాల వారీగా ప్రమాదాల నివారణకు దిగువ చర్యలు తీసుకోవాలని భావిస్తున్నారు. వివరాలిలా ఉన్నాయి. వేగ నియంత్రణ.. ఎన్ని చర్యలు తీసుకుంటున్నప్పటికీ చాలా సందర్భాల్లో అతివేగమే ప్రమాదాలకు కారణం కావడంతో స్పీడ్కంట్రోల్కు తగిన ఎన్ఫోర్స్మెంట్ చర్యలు అవసరం. ఇందులో భాగంగా ఉల్లంఘనులకు భారీ పెనాల్టీలు. అంతేకాకుండా వాహనాలు నడిపేవారికి ఉపకరించేలా, వేగం నియంత్రణలో ఉండేలా కార్ల తయారీదారులు కొత్త టెక్నాలజీ అందుబాటులోకి తేవాల్సిన అవసరముంది. ట్రాఫిక్ నిబంధనలు పాటించడంతో పాటు సీటుబెల్ట్, సెల్‌ఫోన్ డ్రైవింగ్, హెల్మెట్లు, ఓవర్ స్పీడ్, ఓవర్‌లోడ్ తదితరమైనవి పకడ్బందీగా అమలయ్యేలా చూడాలి. డ్రంక్ అండ్ డ్రైవ్తరహాలో ప్రజలు భయపడేలా అమలు చేయాలి. బ్లాక్‌స్పాట్స్‌కు సంబంధించిన హెచ్చరిక బోర్డులుండాలి. వేగ పరిమితి దాటకుండా రంబుల్‌స్ట్రిప్స్ వంటివి సరేసరి. కేవలం ఫ్లై ఓవర్లపైనే కాక అవసరమైన అన్ని ప్రాంతాల్లో వేగపరిమితి సూచికలు, రోడ్డు మార్కింగ్‌లు,సైనేజీలు ఉండాలి. సేఫ్టీ చర్యల్లో భాగంగా వాహనాలకు సైడ్, రియర్ అద్దాలు, ఎయిర్‌బ్యాగ్‌లతోపాటు వాహనాలు ఓవర్‌స్పీడ్‌తో వెళ్లే బీప్ సౌండ్ ఉపకరణాలు తదితరమైనవి అవసరం. అవగాహన.. రోడ్‌సేఫ్టీ గురించి తగిన అవగాహన కల్పించేందుకు, విస్తృత ప్రచారం చేసేందుకు ఒక ప్రత్యేక ఏజెన్సీ అవసరం. డేటా సిస్టమ్స్ అభివృద్ధి పరచడం ద్వారా రోడ్‌సేఫ్టీ పర్యవేక్షణ. సదుపాయాల అభివృద్ధి.. పాదచారులు, సైక్లిస్టులు, మోటార్ సైకిళ్లు సాఫీగా ప్రయాణించేందుకు వారికి ప్రత్యేక లేన్లుండాలి. క్రాష్బారియర్లుండాలి. స్కూల్జోన్లతోపాటు రెసిడెన్షియల్, వాణిజ్య ప్రాంతాల్లో ట్రాఫిక్‌కు, వేగా>నికి తగిన నియంత్రణ ఉండాలి. ప్రజారవాణాను ఎక్కువగా వినియోగించుకునేలా అవగాహన కల్పించాలి. క్షతగాత్రులకు తక్షణ సాయం.. చేసేవన్నీచేసినా ప్రమాదాలు జరిగితే గాయపడ్డవారిని తక్షణం ఆస్పత్రులకు తరలించేలా ఏర్పాట్లుండాలి. అత్యవసర వైద్యం అందించేందుకు ఆస్పత్రులు సంసిద్ధంగా ఉండాలి. డబ్బులేని కారణంగా వైద్యం నిరాకరించరాదు. ప్రమాదప్రాంతంలోని స్థానికులు క్షతగాత్రులకు తక్షణసాయం అందించేలా తగిన శిక్షణ కార్యక్రమాలు నిర్వహించాలి. బ్లాక్స్పాట్లు.. గ్రేటర్‌లోని 52 బ్లాక్ స్పాట్ ప్రాంతాల్లో రేతిబౌలి, ఎన్ఎండీసీ, బోయిన్పల్లి, బంజారాహిల్స్ రోడ్‌నెంబర్ 12, రోడ్‌నెంబర్ 3, జూబ్లీహిల్స్ చెక్‌పోస్టు, పెద్దమ్మగుడి, డీఎంఆర్ఎల్ క్రాస్‌రోడ్స్, ఫలక్‌నుమా రైల్వే బ్రిడ్జి,పురానాపూల్దర్వాజ, ఓల్డ్ ఆనంద్థియేటర్, తాజ్‌కృష్ణా, మదీన క్రాస్‌రోడ్స్, ఐఎస్ సదన్, మారుతీనగర్ కమాన్,సెవెన్‌టూంబ్స్(దక్కన్పార్క్), పుత్లిబౌలి, చాదర్‌ఘాట్ క్రాస్‌రోడ్స్, కవాడిగూడ సీజీవో టవర్స్, ఆర్టీసీ క్రాస్‌రోడ్స్ , జూబ్లీహిల్స్ రోడ్‌నెంబర్ 45, సికింద్రాబాద్ వైఎంసీఏ జంక్షన్ తదితర ప్రాంతాలున్నాయి. ముఖ్యంగా ఎర్రగడ్డ–పటాన్చెరు మార్గంలో అత్యధిక ప్రమాదాలు జరిగినట్లు గుర్తించారు. పరిష్కారమిలా.. ఆయా బ్లాక్‌స్పాట్ ప్రాంతాల్లో ఏమేం చేయాలోకూడా సూచించారు. ఉదాహరణకు ∙చిలకల గూడ బ్లాక్ స్పాట్‌గా మిగలకూడదంటే మరిన్ని అదనపు సేఫ్టీ చర్యలు తీసుకోవాల్సి ఉంది. అందుకుగాను జంక్షన్ దగ్గరి రోటరీని తగిన డైమెన్షన్స్‌లో అభివృద్ధి చేయాల్సి ఉంది. పాదచారుల కోసం ప్రత్యేకంగా స్కైవాక్‌ను ఏర్పాటు చేయాలి. మెట్రో పిల్లర్లపై రేడియం స్టిక్కర్లు ఉండాలి. రాత్రివేళల్లో మితిమీరిన వేగంతో వెళ్లేవారిని కట్టడి చేసేందుకు తగిన ‘ఎన్ఫోర్స్మెంట్’ చర్యలుండాలి. ∙ఎంజే మార్కెట్ పరిసరాలకు బ్లాక్‌స్పాట్ ముద్ర తొలగాలంటే çస్టడ్స్, రంబుల్‌స్ట్రిప్స్, జీబ్రాక్రాసింగ్ మార్కులు వేయాలి. హమీదా స్వీట్ హౌస్ వద్ద రోడ్డు వెడల్పు చేయడంతోపాటు మ్యాన్‌హోళ్లు రోడ్డుకు సమానంగా సరిచేయాలి. జీపీఓ వద్ద ఫుట్‌పాత్‌లు వెడల్పు చేయాలి. మాలకుంట జంక్షన్ వద్ద బీటీరోడ్డు అవసరం. ఇలా అన్ని బ్లాక్‌స్పాట్స్ వద్ద ఏమేం చేయాలో ట్రాఫిక్ విభాగం సూచించింది. ప్రమాదాలు ఇలా.. అధికారుల వివరాల మేరకు, గత సంవత్సరం దేశవ్యాప్తంగా రోడ్డు ప్రమాదాల్లో 1.51 లక్షల మంది మృతి చెందారు. 4.7 లక్షల మంది క్షతగాత్రులయ్యారు. తెలంగాణలో 6.6 వేల మంది మరణించారు. 23.6 వేల మంది క్షతగాత్రులయ్యారు. హైదరాబాద్‌లో 260 మందికి పైగా మరణించారు. -
మెడ మీద నల్లబడుతోంది..?
నా వయసు 38 ఏళ్లు. వృత్తిరీత్యా నాకు బయట ఎక్కువగా తిరగాల్సిన పని ఉంటుంది. ఇటీవల నా మెడమీద, నుదురు,నడుము మీద విపరీతంగా నల్లబడుతోంది. ఇలా ఎందుకు జరుగుతోంది? దయచేసి వివరించండి. మీరు ఎదుర్కొంటున్న కండిషన్‌ను ఎకాంథోసిస్ నైగ్రికాన్స్ అంటారు. ఈ కండిషన్ ఉన్నవారిలో మెడ, నుదురు వంటి చోట్ల నల్లబడటంతో పాటు అక్కడ చర్మం ఒకింత దళసరిగా కూడా మారుతుంది. సాధారణంగా ఉండాల్సిన బరువు కంటే ఎక్కువగా ఉన్నవారిలో ఈ సమస్య కనిపిస్తుంటుంది. తక్కువ వ్యవధిలో ఎక్కువగా బరువు పెరగడం, కొన్ని హార్మోన్ల అస్తవ్యస్తతో ఇలా జరుగుతుంది. కొందరిలో కొన్ని రకాల మందులు వాడినా కూడా ఈ సమస్య రావచ్చు. మీరు వెంటనే డాక్టర్‌ను సంప్రదించి, ఏ కారణాల వల్ల ఇలా జరుగుతుందో తెలుసుకుని, అందుకు అనుగుణంగా చికిత్స తీసుకోండి. టీవీ యాడ్స్‌లోని కాస్మటిక్స్ వాడమంటారా? నా వయసు 20 సంవత్సరాలు. నా ముఖం విషయంలో నాకు ఎలాంటి సమస్యా లేదు. ఎలాంటి ఫిర్యాదులూ లేవు. నేను ఎలాంటి క్రీమ్స్ రాయను. అయితే టీవీ యాడ్స్ చూసినప్పుడు నేను కూడా ఏవైనా క్రీమ్స్ రాస్తే మంచిదా అన్న భావం కలుగుతోంది. వాటివల్ల ఏమైనా సైడ్ఎఫెక్ట్స్ ఉంటాయా అన్న ఆందోళన కూడా ఒక్కోసారి కలుగుతోంది. నాకు తగిన సలహా చెప్పండి. మీ ముఖం, చర్మం విషయంలో ఎలాంటి సమస్యా లేదంటున్నారు కాబట్టి మీరు టీవీ యాడ్స్ వలలో పడకుండా... మీ చర్మాన్ని కాపాడుకోడానికి కొన్ని జాగ్రత్తలు పాటిస్తే చాలు. సూర్యకిరణాల దుష్ప్రభావం నుంచి కాపాడుకోడానికి మీరు డాక్టర్ సూచించిన సన్‌స్క్రీన్ వాడితే చాలు. అలాగే ముఖాన్ని శుభ్రపరచుకోడానికి సోప్ ఫ్రీ క్లెన్సర్ వాడండి. ఇక చర్మం పొడిబారకుండా ఉండేందుకు మాయిష్చరైజర్ ఉపయోగించండి. స్విమ్మింగ్ తర్వాత మాడుపై దురద! నా వయసు 20 ఏళ్లు. నాకు స్విమ్మింగ్ అంటే ఇష్టం. ఈ మధ్య స్విమ్మింగ్ చేసిన తర్వాత మాడు బాగా దురదగా ఉంటోంది. చర్మం కూడా పొడిబారినట్లు నల్లగా మారుతోంది. ఎందుకిలా జరుగుతోంది? స్విమ్మింగ్‌పూల్‌లో శానిటైజింగ్ కోసం కొన్ని రసాయనాలు (ఉదాహరణకు క్లోరిన్ వంటివి) వాడుతుంటారు. ఆ రసాయనాలు కొంతమందికి సరిపడవు. దాంతో అలర్జీలా వస్తుంటుంది. మరికొంతమందిలో చర్మం పొడిబారడం, మాడుపైన దురదలు రావడం మామూలే. మీరు స్విమ్మింగ్‌కు వెళ్లేముందు డాక్టర్ సూచించిన మెడికేటెడ్ మాయిష్చరైజర్ వాడితే, ఈ రసాయనాల ప్రభావం చర్మంపై పడకుండా చూసుకోవచ్చు. ఔట్‌డోర్ స్విమ్మింగ్‌పూల్స్‌లో ఉదయం పది నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు స్విమ్మింగ్ చేసినట్లయితే వాటర్ రెసిస్టెంట్ సన్‌స్క్రీన్ ఎస్పీఎఫ్ 50 ఉన్నది వాడటం సముచితం. ఇలా చేయడం వల్ల చర్మాన్ని సూర్యకిరణాల నుంచి సంరక్షించుకోవచ్చు. మాడు భాగం అంటే స్కాల్ప్‌కు స్విమ్మింగ్‌పూల్‌లోని నీళ్లు తగలకుండా ఉండేందుకు క్యాప్ వాడండి. అంతేగాక మైల్డ్ మెడికేటెడ్ షాంపూ అండ్ కండిషనర్ వాడటం ద్వారా జుట్టు పొడిబారకుండా కాపాడుకోవచ్చు. డాక్టర్ సుభాషిణి జయం, చీఫ్ మెడికల్ కాస్మటాలజిస్ట్, ఎన్ఛాంట్ మెడికల్ కాస్మటాలజీ క్లినిక్, శ్రీనగర్‌కాలనీ, హైదరాబాద్ -
యాక్సిడెంట్స్@ డేంజర్ స్పాట్స్
సాక్షి, మంచిర్యాల : జిల్లాలో రోడ్డు ప్రమాదాలు బెంబేలెత్తిస్తున్నాయి. ప్రతిరోజూ ఏదో ఒక చోట రోడ్డు ప్రమాదం జరుగుతుందనడంలో అతిశయోక్తి లేదు. కొన్ని ప్రాంతాల్లో తరచూ ప్రమాదాలు సంభవిస్తున్నాయి. ఇలాంటి ‘బ్లాక్‌స్పాట్స్’ను గుర్తిస్తున్న పోలీసులు, ప్రమాదాల నివారణకు చర్యలు చేపడుతున్నారు. జిల్లాలో ఇలాంటి బ్లాక్‌స్పాట్స్ 21 ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. 12 పోలీసు స్టేషన్ల పరిధిలో ఉన్న ఈ డేంజర్ స్పాట్స్‌లో గత ఒక్క ఏడాదిలోనే 146 ప్రమాదాలు జరగగా.. 49 మంది మరణించారు. 21 చోట్ల బ్లాక్ స్పాట్స్ రోడ్డు ప్రమాదాలు తరచూ చోటుచేసుకుంటుంటే ఆ ప్రాంతాలను పోలీసు భాషలో బ్లాక్‌స్పాట్స్‌గా పరిగణిస్తారు. 2018లో జరిగిన ప్రమాదాల ఆధారంగా జిల్లాలో 21 బ్లాక్‌స్పాట్స్ ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. బెల్లంపల్లి, సీసీసీ నస్పూరు, చెన్నూరు, హాజీపూర్, జైపూర్, కాసిపేట, లక్సెట్టిపేట, మంచిర్యాల, మందమర్రి, రామకృష్ణాపూర్, శ్రీరాంపూర్, తాండూరు పోలీసుస్టేషన్ల పరిధిలో 21 డేంజర్ స్పాట్స్ ఉన్నట్లు పోలీసులు నిర్ధరించారు. ఈ స్పాట్స్‌లో గత సంవత్సరం ఏకంగా 146 రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. ఇందులో అధికంగా నస్పూరు పోలీస్‌స్టేషన్ పరిధిలో 28 ప్రమాదాలు జరగగా.. మంచిర్యాల పోలీస్‌స్టేషన్ పరిధిలో 24 రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. మొత్తం 146 రోడ్డు ప్రమాదాల్లో 49 మంది మృత్యువాత పడగా.. 96 మంది తీవ్ర గాయాలపాలయ్యారు. గుర్తింపుతో జాగ్రత్తలు కుటుంబాలకు తీరని శోకం కల్పించే రోడ్డు ప్రమాదాలకు కారణాలను గుర్తిస్తున్న పోలీసులు.. తాజాగా వాటి నియంత్రణకు చర్యలు చేపడుతున్నారు. గతంలో ఇలాంటి చర్యలు కాస్త మందగించినా.. మళ్లీ ఇతర ప్రభుత్వ శాఖల సమన్వయంతో రోడ్డు ప్రమాదాలను తగ్గించేందుకు పోలీసు యంత్రాంగం నడుం బిగించింది. బ్లాక్‌స్పాట్స్‌ను గుర్తించి సరిచేసే పనులను 2017 సంవత్సరంలోనే పోలీసులు చేపట్టారు. అప్పటి సీపీ దుగ్గల్ ఆధ్వర్యంలో రోడ్డు ప్రమాదాల నివారణకు యాక్సిడెంట్ రెజుల్యూషన్ టీమ్ (ఆర్ట్) పేరిట ఒక బృందాన్ని ఏర్పాటుచేశారు. ఆర్ట్ బృందంలో సంబంధిత పోలీస్‌స్టేషన్ పరిధిలోని సీఐతో పాటు.. ఆర్అండ్బీ, పంచాయతీరాజ్, మున్సిపాలిటీ, రవాణాశాఖ, ఆర్టీసీల నుంచి ఒక్కో అధికారి ఉంటారు. ఈ బృందం ప్రమాదాలు జరిగిన స్థలాలకు వెళ్లి.. ప్రమాదానికి గల కారణాలు, గతంలో జరిగిన ప్రమాదాల వివరాలు సేకరించి, అక్కడ ప్రమాదాల నివారణకు ఎలాంటి చర్యలు చేపట్టాలో ఉన్నతాధికారులకు నివేదించేవాళ్లు. ఈ నివేదిక ఆధారంగా ఆయా స్పాట్స్‌ల్లో సూచికలు, డివైడర్లు ఏర్పాటు చేయడం, గుంతలుంటే పూడ్చడం, రోడ్డులను సరిచేయడం, అవసరమైన చోట స్పీడ్‌బ్రేకర్లు ఏర్పాటు చేశారు. కానీ.. ఏడాదిపాటు ఆర్ట్ బృందం తన కార్యకలాపాలు నిర్వహించినా.. ఆ తరువాత మందగించింది. నివారణకు చర్యలు జిల్లాలో రోడ్డు ప్రమాదాలను తగ్గించడానికి పోలీసులు తాజాగా చర్యలు చేపట్టారు. అందులో భాగంగానే ముందుగా తరచూ ప్రమాదాలు జరిగే ప్రాంతాలను (బ్లాక్‌స్పాట్స్) గుర్తించారు. బ్లాక్‌స్పాట్స్‌ను గుర్తించేందుకు పోలీసులు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుంటున్నారు. జియోట్యాగింగ్, గూగుల్ మ్యాప్ద్వారా ఏ ప్రాంతంలో ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్నాయో..? ఆ స్పాట్స్‌ను గుర్తించారు. ఇలా ఎక్కువగా ప్రమాదాలు జరుగుతున్న ప్రాంతాలను బ్లాక్‌స్పాట్స్‌గా నిర్ణయించారు. బ్లాక్‌స్పాట్స్‌ను గుర్తించడంతోపాటు, అక్కడ ప్రమాదాల నివారణకు చర్యలు చేపట్టారు. ఇందుకోసం ఆర్అండ్బీ, పీఆర్, నేషనల్ హైవే అథారిటీ, మున్సిపాలిటీ, ఆర్టీసీ, ఆర్టీఏ, ట్రాన్స్‌కో తదితర ప్రభుత్వ శాఖల సమన్వయంతో పోలీసు శాఖ చర్యలకు శ్రీకారం చుట్టింది. బ్లాక్‌స్పాట్స్‌కు కారణమేమిటనే వాటిపై పోలీసులు ముందుగా దృష్టి సారించారు. యూటర్న్లు, రోడ్డు ఇంజినీరింగ్ సరిగా లేకపోవడం, చెట్లు, హోర్డింగ్‌లు అడ్డుగా ఉండడంవంటి కారణాలతోనే ఎక్కువగా ప్రమాదాలు జరుగుతున్నట్లు నిర్ధరించారు. దీంతో రోడ్లను, మూలమలుపులు, యూటర్న్‌ను సరిచేయడం.. అడ్డుగా ఉన్నచెట్లు, హోర్డింగ్‌లను తొలగించడం, అవసరమైన చోట స్పీడ్‌బ్రేకర్లు, సైన్‌బోర్డులు ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపడుతున్నారు. పోలీసులు చేస్తున్న ప్రయత్నాలు త్వరగా పూర్తయి, జిల్లాలో బ్లాక్‌స్పాట్స్ లేకుండా పోవాలని, ఏ కుటుంబం రోడ్డున పడకూడదని ప్రజలు ఆశిస్తున్నారు. -
రహదారులపై మృత్యుహేల
అనంతపురం సెంట్రల్: విస్తీర్ణంలో అతిపెద్ద జిల్లా అయిన అనంతపురంలో ప్రధానమైన రహదారులు వెళుతున్నాయి. ముఖ్యంగా జాతీయ రహదారి 44 యాడికి నుంచి పెనుకొండ సమీపంలోని కొడికొండ చెక్‌పోస్టు వరకు ఉంది. దీంతో పాటు అనంతపురం–కదిరి–మదనపల్లి జాతీయరహదారి 42, బళ్లారి జాతీయ రహదారి 67, రాష్ట్ర రహదారులు, పంచాయతీ రోడ్లు వేలాది కిలోమీటర్లు పొడువునా ఉన్నాయి. తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాలకు కలిపే రోడ్లు జిల్లా మీదుగా ప్రయాణించాల్సి ఉంటుంది. దీంతో జాతీయ, రాష్ట్ర రహదారులపై నిత్యం వేలాది వాహనాలు రాకపోకలు సాగిస్తున్నాయి. రోజూ ఎక్కడో ఒక చోట రోడ్డు ప్రమాదాల రూపంలో ప్రజల ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి. మనిషి బిజీలైఫ్‌లో ప్రయాణ షెడ్యూల్స్ కూడా అంతే బిజీగా ఉంటున్నాయి. ఐదు గంటల్లో హైదరాబాద్‌కు... నాలుగు గంటల్లో బెంగుళూరుకు పోయేలా వాహనాలను నడుపుతున్నారు. జాతీయ రహదారులపై కనీసం 120 నుంచి 150 కిలోమీటర్ల పైగా వేగంతో వాహనాలు నడుపుతున్నారు. ఆ వేగానికి తగ్గుట్టుగా రహదారులు లేవనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. దీంతో అదుపుతప్పి ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. 156 బ్లాక్‌స్పాట్స్ జిల్లాలో అన్ని రహదారుల్లో మొత్తం 156 బ్లాక్‌స్పాట్స్ (ప్రమాద స్థలాలు) గుర్తించారంటే పరిస్థితి ఏవిధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. అధికారులు గుర్తించనివేకాకుండా అనేక ప్రాంతాలు మృత్యుపిలుపులుగా మారాయి. ఆయా ప్రదేశాల్లో అధికారులు ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోవాల్సి ఉంది. అయితే ఆ దిశగా చర్యలు లేవనే విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రమాదం జరిగితే.. స్పీడు బ్రేకరు వేస్తే సరిపోతుందనే భావనలో అధికారులు ఉన్నారు. కానీ ముందే హెచ్చరిక బోర్డులు ఏర్పాటు, ప్రత్యామ్నాయ చర్యలు తీసుకొని బ్లాక్‌స్పాట్స్ నివారించడంపై పెద్దగా దృష్టి సారించడం లేదని అభిప్రాయం వ్యక్తమవుతోంది. పనిచేయని పంచసూత్రాలు రోడ్డు ప్రమాదాలు నివారణకు ఎస్పీ జీవీజీ అశోక్‌కుమార్ బాధ్యతలు చేపట్టాక గట్టి చర్యలు చేపడుతున్నారు. ముఖ్యంగా ‘పంచసూత్రాలు’ పేరుతో హెల్మెట్, సీటు బెల్టు వినియోగం, పరిమితికి మించి ప్రయాణికులను తరలించరాదని, మద్యం తాగి, సెల్ఫోన్లో మాట్లాడుతూ డ్రైవింగ్ చేయరాదని ఆంక్షలు విధించారు. ఎక్కువశాతం మంది పోలీసులు రహదారి భద్రతపైనే దృష్టి సారించేలా ఆదేశాలు జారీ చేశారు. వీఆర్‌లో ఉన్న ఉద్యోగులను రోడ్డు సేఫ్టీ వి«ధులకు వినియోగిస్తున్నారు. అయితే ఎక్కువమంది పోలీసులు జరిమానాలు విధించడంపైనే దృష్టి సారిస్తున్నారు తప్ప ప్రమాదాల నివారణకు జాగ్రత్తలు తీసుకోలేదనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ద్విచక్రవాహనదారులపై వేసే జరిమానాలు... కార్లు, ఇతర నాలుగు చక్రాల వాహనాలపై వేయలేకపోతున్నారనే అభిప్రాయం వినిపిస్తోంది. పరిమితికి మించి తరలిస్తే చర్యలు అనంతపురం సెంట్రల్: పరిమితికి మించి ప్రయాణికులను తరలించే వాహనదారులపై చర్యలు తీసుకుంటామని ఎస్పీ జీవీజీ అశోక్‌కుమార్ హెచ్చరించారు. ప్రధానంగా గూడ్స్వాహనాలైన లారీలు, ట్రాక్టర్లు, 407 వ్యాన్లు తదితర లగేజీ వాహనాల్లో ప్రజలను తరలించకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రస్తుతం శుభకార్యాలు జరుగుతున్న నేపథ్యంలో ప్రజలను తరలించేందుకు గూడ్సు వాహనాలు వినియోగిస్తున్నారని వివరించారు. పెనుకొండ పరిధిలో రెండు రోజుల క్రితం జరిగిన ప్రమాదం కూడా ఈ కోవకు చెందినదేనని తెలిపారు. రోడ్డు ప్రమాదాల నియంత్రణ కోసం జిల్లాలో ‘పంచ సూత్రాలు’ అమలు చేయాలన్నారు. ముందస్తు చర్యలు చేపట్టి రోడ్డు భద్రత ప్రాముఖ్యతను తెలియజేయాలన్నారు. గత వారంలో నిబంధనలు ఉల్లంఘించిన 5469 మందికి కౌన్సెలింగ్ ఇచ్చినట్లు వెల్లడించారు. 3,621 మందిపై కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. -
బ్లాక్‌స్పాట్స్‌పై నజర్!
సాక్షి, సిటీబ్యూరో : ఐటీ కారిడార్‌గా ముద్ర ఉన్న సైబరాబాద్ పోలీసు కమిషనరేట్‌లోని శివారు ప్రాంతాలు శరవేగంగా అభివృద్ధి చెందుతున్నాయి. వందల సంఖ్యలో కంపెనీలతో పాటు కళాశాలలు కూడా వెలుస్తున్నాయి. విద్య, ఉపాధి అవకాశాలు మెండుగా ఉండటంతో అదే సంఖ్యలో జనప్రవాహం పెరుగుతోంది. ఇందుకు తగ్గట్టుగానే ట్రాఫిక్ సమస్యలు పెరుగుతున్నాయి. వాహనదారులు మితిమీరిన వేగంతో రయ్‌మంటూ దూసుకెళుతూ ప్రమాదాల బారిన పడి ప్రాణాలు తీసుకుంటున్నారు. కొన్ని సందర్భాల్లో రోడ్డు బాగాలేక ప్రమాదాలు జరిగి ప్రజల ప్రాణాలు గాల్లో కలుస్తున్నాయి. వీటన్నింటిని దృష్టిలో ఉంచుకొని రోడ్డు ప్రమాదాలు జరిగే ప్రాంతాలుగా గుర్తించిన 70 బ్లాక్స్పాట్లను మెరుగుపరిచేదిశగా సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు కసరత్తు చేస్తున్నారు. ఈ మేరకు ట్రాఫిక్ డీసీపీ విజయ్‌కుమార్ ఆధ్వర్యంలో నేషనల్ హైవే అథారిటీస్, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు, ఆర్ అండ్ బీ అధికారులతో సమన్వయ సమావేశం ఏర్పాటుచేసి రోడ్లను బాగుచేయడంపై దృష్టి సారించారు. ఆయా విభాగ అధికారులను తరచూ కలుస్తూ ఆ పనులను వేగిరం చేయాలని సూచిస్తున్నారు. హైవేల్లో వేగ నియంత్రణపై దృష్టి... నగర శివారు ప్రాంతాల్లో ఉన్న జాతీయ రహదారులపై ఎక్కువగా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. అందుకే అక్కడ ప్రత్యేకంగా స్పీడ్ లేజర్ గన్ కెమెరాలతో వాహనదారుల వేగంపై నిఘా ఉంచి ఉల్లంఘనులకు జరిమానాలు విధిస్తున్నారు. పగటిపూట కూడా డ్రంకన్ డ్రైవ్ పరీక్షలు చేస్తున్నారు. హైవేల్లో వాహనాలు పార్కింగ్ చేయకుండా ఉండేందుకు ప్రత్యేక బృందాలతో ఎప్పటికప్పుడూ తనిఖీలు చేస్తున్నారు. నాణ్యత లేకుండా..గుంతలమయంగా మారిన రోడ్లను బాగుపరిచేందుకు నేషనల్ హైవే ఆథారిటీ అధికారులతో ఎప్పటికప్పుడూ సంప్రదిస్తున్నామని సైబరాబాద్ ట్రాఫిక్ డీసీపీ విజయ్ కుమార్ తెలిపారు. ముఖ్యంగా హెల్మెట్ ధరించకపోవడం వల్లే చాలామంది ద్విచక్ర వాహనదారులు గాయాలై ప్రాణాలు పోతున్నాయనే దానికి అనేక ఘటనలు సాక్ష్యంగా ఉన్నాయన్నారు. ఈ నేపథ్యంలోనే బండి ఎక్కితే తప్పనిసరిగా హెల్మెట్ ధరించడాన్ని పకడ్బందీగా అమలుచేయడాన్ని మరింత కఠినంగా అమలు చేస్తున్నామన్నారు. ముఖ్యంగా గల్లీల్లోనూ ప్రయాణం చేసే వాహనదారులు హెల్మెట్ ధరించకపోతే జరిమానా విధిస్తామని, అవసరమైతే చట్ట ప్రకారం కేసులు నమోదుచేస్తామని ఆయన హెచ్చరించారు. హెల్మెట్ తప్పనిసరి అని చట్టం చెబుతున్నా ఎవరికి వారు బాధ్యతగా హెల్మెట్ ధరించడంలో నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారని అన్నారు. హెల్మెట్ ఉల్లంఘనులకు సంబంధించి నెలకు మూడు లక్షలపైనే కేసులు నమోదవుతుండటం తీవ్ర ఆందోళన కలిగిస్తోందన్నారు. అధిక శాతం మంది కేసులు, జరిమానాలకు సిద్ధమవుతున్నారే తప్ప హెల్మెట్ మాత్రం ధరించడం లేదన్నారు. అలాగే రోడ్ల పక్కనే ఉన్న ఫుట్‌పాత్‌ను ఆక్రమిస్తూ ట్రాఫిక్ సమస్యలకు కారణమవుతున్న వ్యాపారులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఫుట్‌పాత్ ఆక్రమణదారులకు పూర్తిగా చెక్ చెప్తామన్నారు. -
డెత్ స్పాట్లు!
సాక్షి,సిటీబ్యూరో: ఉస్మానియా వర్సిటీ పరిధిలో ‘ప్రమాదకరంగా’ మారిన పాట్‌హోల్ ఓ యువ వ్యాపారి ప్రాణం తీసింది. నారాయణగూడకు చెందిన వ్యాపారి విశాల్ గత మంగళవారం హబ్సిగూడ ప్రాంతంలో స్కూటర్‌పై వెళుతుండగా రోడ్డుపై ఇబ్బందికరంగా ఉన్న పాట్‌హోల్‌ను తప్పించేందుకు తన వాహనాన్ని ఎడమ వైపునకు తిప్పాడు. అదే సమయంలో వెనుక నుంచి వస్తున్న ఆర్టీసీ బస్సు ఢీ కొట్టడంతో అక్కడిక్కడే మరణించారు. కేవలం ఇదొక్కటే కాదు... నగర వ్యాప్తంగా పాట్‌హోల్స్, మ్యాన్‌హోల్స్ కారణంగా నిత్యం అనేక ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. భూగర్భ మంచినీటి సరఫరా, మురుగునీటి పారుదల, కమ్యూనికేషన్ కేబుళ్ల కోసం రహదారులపై ఏర్పాటు చేస్తున్న పాట్‌హోల్స్/మ్యాన్‌హోల్స్ ఏటా పదుల సంఖ్యలో ప్రాణాలు తీస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని మినిస్ట్రీ ఆఫ్ రోడ్Š ట్రాన్స్పోర్ట్ అండ్ హైవేస్ (ఎంఓఆర్‌టీఎహెచ్) తొలిసారిగా ఈ కేటగిరీని తమ గణాంకాల్లో చేర్చింది. రోడ్ యాక్సిడెంట్స్ ఇన్ ఇండియా పేరుతో ఇటీవల విడుదల చేసిన నివేదిక ప్రకారం గత ఏడాది రాష్ట్రంలో ఈ రకమైన ప్రమాదాలు 282 చోటు చేసుకున్నాయి. ఇందులో 82 మంది మృత్యువాత పడగా 424 మంది క్షతగాత్రులయ్యారు. ఆయా హోల్స్‌కు మూతలు ఏర్పాటు చేయడంలో యంత్రాంగాల నిర్లక్ష్యం, సరైన సూచికలు లేకుండా ఎక్కడికక్కడ మరమ్మతుల పేరుతో తవ్వకాలు, పెరుగుతున్న రోడ్ల ఎత్తుకు తగ్గట్టు వీటి ఎత్తు పెంచకపోవడం ప్రధాన కారణాలుగా స్పష్టమవుతోంది. రాష్ట్రంలో ఏ ప్రాంతంలో చూసినా అడ్డదిడ్డంగా స్పీడ్‌బ్రేకర్లు దర్శనమిస్తుంటాయి. వీటి ఏర్పాటులో ప్రభుత్వ యంత్రాంగాలు నిబంధనలకు తిలోదకాలు ఇవ్వడం ప్రమాదాలకు కారణమవుతోంది. స్పీడ్‌బ్రేకర్ల వద్ద చోటు చేసుకున్న 293 ప్రమాదాల్లో 80 మంది చనిపోయినట్లు, మరో 367 మంది క్షతగాత్రులైనట్లు ఎంఓఆర్టీహెచ్ నివేదిక పేర్కొంటోంది. రోడ్లు సరిగ్గా లేకపోవడం, ప్రతికూల వాతావరణం, అననుకూల పరిస్థితుల కారణంగా ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయని సాధారణంగా భావిస్తుంటాం. అయితే రాష్ట్రంలో గుడ్ సర్ఫేస్ (ఎలాంటి లోటుపాట్లు లేని) రహదారుల్లోనే 4328 ప్రమాదాలు జరిగి 1623 మంది మృత్యువాతపడగా మరో ఐదు వేల మందికి గాయాలపాలయ్యారు. మొత్తమ్మీద ఎలాంటి మలుపులు లేకుండా సరిసరిగా ఉన్న రోడ్లలో (గుడ్ సర్ఫేస్ వాటితో కలిపి) 5631 ప్రమాదాలు జరిగి 2691 మంది చనిపోగా, 3436 మంది క్షతగాత్రులు కావడం గమనార్హం. దీని ప్రకారం రాష్ట్రంలో జరుగుతున్న ప్రమాదాల్లో అత్యధికం డ్రైవర్ల కారణంగా జరిగినవేనని ఎంఓఆర్టీహెచ్ స్పష్టం చేస్తోంది. గతేడాది రాష్ట్రంలో జరిగిన ప్రమాదాల్లో 70 శాతం వరకు సిగ్నల్స్, పోలీసు బూత్స్ తదితర పోలీసుల పర్యవేక్షణ, ఉనికి లేని చోట్లే జరిగాయి. ఈ ప్రాంతాల్లో 10,226 ప్రమాదాలు జరిగి 4405 మంది మృత్యువాతపడగా 8373 మంది క్షతగాత్రులుగా మారారు. ఎంఓఆర్టీహెచ్ రికార్డుల ప్రకారం రాష్ట్రంలో గత ఏడాది జరిగిన ప్రమాదాల్లో లెర్నింగ్ లైసెన్స్ కలిగిన, అసలు ఎలాంటి లైసెన్స్ లేని డ్రైవర్ల కారణంగా 2833 ప్రమాదాలు జరిగి 871 మంది మృత్యువాతపడ్డారు. దేశంలో రోడ్డు నిబంధనల అమలు, లైసెన్సుల జారీ, జరిమానాలు/శిక్షల విధింపు తదితరాలు భారత మోటారు వాహనాల చట్టాన్ని అనుసరించి జరుగుతాయి. అంటే... ఈ చట్టం కేవలం మోటారుతో కూడిన వాహనాలకు మాత్రమే వర్తిస్తుంది. అయితే ఎలాంటి మోటారు లేకుండా రోడ్డుపై సంచరించే వాహనాలూ రాష్ట్రంలో పదుల సంఖ్యలో ప్రాణాలు తీస్తున్నాయి. గత ఏడాది సైకిళ్లు, రిక్షాలు, మనుషులు, జంతువులు లాగే బండ్ల కారణంగా 617 ప్రమాదాలు జరిగి 177 మంది మృత్యువాతపడగా, 796 మంది క్షతగాత్రులు కావడం గమనార్హం. దేశ వ్యాప్తంగా జరిగిన రోడ్డు ప్రమాదాలను విశ్లేషిస్తూ ఈ నివేదిక రూపొందించి విడుదల చేసిన ఎంఓఆర్టీహెచ్ ప్రమాదాల నిరోధానికి యాక్షన్ ప్లాన్స్ రూపొందించాల్సిందిగా రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలను ఆదేశించింది. -
ఒకటా..రెండా..!
నగరంలో రోడ్డు ప్రమాదాలు, మరణాలు తగ్గించడానికి జీహెచ్ఎంసీ రంగంలోకి దిగింది. తరచు ప్రమాదాలకు కారణమవుతున్న ప్రాంతాలను గుర్తించి,కారణాలను అధ్యయనం చేయడంతో పాటు నివారణ చర్యలకు కసరత్తుప్రారంభించింది. సిటీకి సంబంధించి మొత్తం 85 బ్లాక్‌స్పాట్స్ ఉన్నట్లు ట్రాఫిక్ విభాగం అధికారులు గతేడాది గుర్తించారు. ఈ ప్రాంతాల్లో ఇప్పుడు పూర్తిస్థాయి నిరోధక చర్యలు తీసుకునే అవకాశం ఉంది. సాక్షి, సిటీబ్యూరో: నగరంలో రోడ్డు ప్రమాదాలు, మరణాలు తగ్గించడానికి జీహెచ్ఎంసీ రంగంలోకి దిగింది. తరచు ప్రమాదాలకు కారణమవుతున్న ప్రాంతాలను గుర్తించి, కారణాలను అధ్యయనం చేయడంతో పాటు నివారణ చర్యలకు కసరత్తు ప్రారంభించింది. సిటీకి సంబంధించి మొత్తం 85 బ్లాక్‌స్పాట్స్ ఉన్నట్లు ట్రాఫిక్ విభాగం అధికారులు గతేడాది గుర్తించారు. ఈ ప్రాంతాల్లో ఇప్పుడు పూర్తిస్థాయి నిరోధక చర్యలు తీసుకునే అవకాశం ఉంది. 2016 గణాంకాలతో స్టడీ... సిటీలో బ్లాక్‌స్పాట్స్‌గా పరిగణించే ప్రమాదకరమైన ప్రాంతాలను గుర్తించడానికి ట్రాఫిక్ పోలీసులు శాంతిభద్రతల విభాగం అధికారుల సహాయం తీసుకున్నారు. నగరంలో ట్రాఫిక్ నియంత్రణ, ప్రమాదాల నిరోధానికి ట్రాఫిక్ పోలీసులు పని చేస్తారు. అయితే ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు దానిపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేసేది మాత్రం లా అండ్ ఆర్డర్ పోలీసులే. ఈ నేపథ్యంలోనే వారి వద్ద ఉన్న గణాంకాలు సేకరించారు. 2016లో సిటీలోని వివిధ ప్రాంతాల్లో జరిగిన ప్రమాదాల జాబితాలను సేకరించి అధ్యయనం చేశారు. ఒకే ప్రాంతం, స్టెచ్లో రెండు కంటే ఎక్కువ యాక్సిడెంట్స్ చోటు చేసుకున్న ప్రాంతాలను గుర్తించారు. వీటిలో యాదృచ్ఛికంగా జరిగిన వాటిని మినహాయించారు. ఇంజినీరింగ్ సహా ఇతర లోపాల వల్ల చోటు చేసుకున్న ప్రమాదాలకు ప్రాధాన్యం ఇస్తూ ఆయా ప్రాంతాలను గుర్తించారు. ‘ఇన్నర్’లోనే అత్యధికంగా... నగర ట్రాఫిక్ కమిషనరేట్ పరిధిలో మొత్తం 25 ట్రాఫిక్ పోలీసుస్టేషన్లు ఉన్నాయి. వీటిలో కేవలం ఏడింటి పరిధిలో మాత్రమే బ్లాక్‌స్పాట్స్ లేవని తేలింది. మిగిలిన 18 ట్రాఫిక్ ఠాణాల పరిధిలోనూ తరచుగా ప్రమాదాలు చోటు చేసుకునే బ్లాక్‌స్పాట్స్ ఉన్నట్లు వెలుగులోకి వచ్చింది. వీటిలోనూ ఒక ఠాణా పరిధిలో ఆరు, మూడు పోలీసుస్టేషన్ల పరిధిలో ఐదేసి, పదింటి పరిధిలో మూడేసి చొప్పున యాక్సిడెంట్స్ స్పాట్స్ ఉన్నట్లు ట్రాఫిక్ విభాగం అధికారులు గుర్తించారు. ప్రధానంగా ఇన్నర్ రింగ్ రోడ్లో (ఐఆర్ఆర్) విస్తరించిన ఉన్న ట్రాఫిక్ పోలీసుస్టేషన్ల పరిధుల్లోనే బ్లాక్‌స్పాట్స్ ఎక్కువగా ఉంటున్నాయని తేలింది. అనేకం ‘చావు’రస్తాలే... నిత్యం ప్రమాదాలు చోటు చేసుకునే ప్రాంతాల్లో అత్యధికం చౌరస్తాలు, జంక్షన్లే ఉంటున్నాయి. రద్దీ వేళలు, సిగ్నల్స్ యాక్టివ్‌గా ఉండే సమయంలో కంటే మిగిలిన సమయాల్లోనే ఎక్కువగా ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ 85 బ్లాక్‌స్పాట్స్‌లో దాదాపు 80 శాతం చౌరస్తాల్లో ఉన్నవే. ఆయా ప్రాంతాలు సైతం హైదరాబాద్–సైబరాబాద్–రాచకొండ సరిహద్దుల్లో ఉన్నవే ఎక్కువ కావడం గమనార్హం. వీటిలో చోటుచేసుకుంటున్న ప్రమాదాల్లో మరణించిన/క్షతగాత్రులైన వారిలో 40 శాతం పాదచారులు, మరో 40 శాతం ద్విచక్రవాహనచోదకులే ఉంటున్నారు. ఒక్కోచోట ఒక్కో కారణం... సిటీలోని ఆయా ప్రాంతాలు బ్లాక్‌స్పాట్స్‌గా మారడానికి అనేక కారణాలు ఉంటున్నాయి. సరోజినీ దేవి కంటి ఆస్పత్రి ప్రాంతంలో ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన రోగులు ఎక్కువగా ప్రమాదాల బారిన పడుతున్నారు. అత్యధికంగా రోడ్డు దాటే ప్రయత్నాల్లో ఉన్న పాదచారులే కావడం గమనార్హం. తాడ్బంద్ ముస్లిం గ్రేవ్‌యార్డ్ ప్రాంతంలో రోడ్డు ఇరుకుగా ఉండటంతో పాటు ఇంజినీరింగ్ లోపాలు సైతం వాహనచోదకులు, పాదచారులకు శాపాలుగా మారాయి. అలాగే 2016లో నలుగురు చనిపోయిన కోఠి జంక్షన్ సైతం పాదచారులకు ప్రమాదహేతువుగా మారింది. ఇలాంటి కారణాలు ఎన్నో ఈ 85 ప్రాంతాల్లో ఉన్నాయి. 30 శాతం మరణాలు అక్కడే... 2016లో నగర వ్యాప్తంగా 2398 ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. వీటిలో 375 మంది మరణించగా... మరో 2023 మంది క్షతగాత్రులయ్యారు. సిటీ మొత్తమ్మీద గణాంకాలు ఇలా ఉంటే... ఆ 85 ప్రాంతాల్లోనే 647 ప్రమాదాలు చోటు చేసుకుని మొత్తం సంఖ్యలో 26.9 శాతంగా నమోదయ్యాయి. అలాగే మొత్తం మృతుల్లో 31.4 శాతం (118) మంది బ్లాక్స్పాట్స్లోనే ప్రాణాలు కోల్పోయినట్లు నగర పోలీసు రికార్డులు స్పష్టం చేస్తున్నారు. ఇవే ప్రధాన కారణాలు: పరిమితికి మించిన వేగం (ప్రధానంగా ఐఆర్ఆర్లో) ♦ మద్యం తాగి వాహనాలను నడపటం ♦ మలుపులు ఉన్న చోట్ల డివైడర్లు, మీడియమ్స్ లేకపోవడం ♦ అత్యంత సమస్యాత్మకంగా (బ్లైండ్) ఉన్న మలుపులు ♦ కీలక సూచనలు చేసే సైనేజ్ బోర్డులు లేకపోవడం ♦ ఇరుకైనా రోడ్లు, ఆపై అక్కడే ఉంటున్న ఆక్రమణలు ♦ రోడ్ ఇంజినీరింగ్‌ను పట్టించుకోకుండా రహదారి నిర్మాణం ♦ రహదారులపై హఠాత్తుగా చేపడుతున్న మరమ్మతులు ♦ క్యారేజ్ వేలో తొలగించకుండా వదిలేసిన చెట్లు, కరెంటు స్తంభాలు ♦ అవసరమైన స్థాయిలో విద్యుత్ దీపాలు లేకపోవడం ♦ వాహనచోదకులు రాంగ్ సైడ్ డ్రైవింగ్ చేయడం ♦ నో–ఎంట్రీల్లోకి వాహనాలతో దూసుకుపోవడం ♦ రోడ్ మార్కింగ్ లేకపోవడం,శాస్త్రీయత కొరవడటం. -
బ్లాక్ స్పాట్లకు చెక్?
చీమకుర్తి రూరల్: పదేళ్లలో వాహనాల సంఖ్య పెరిగినా వాటికి అనుగుణంగా రోడ్లు విస్తరణ జరగకపోవడంతో కర్నూల్ రోడ్డుపై తరుచూ ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. సంతనూతలపాడు మండలం పేర్నమిట్ట నుంచి చీమకుర్తి మండలం మర్రిచెట్లపాలెం వరకు సుమారు 30 కిలోమీటర్ల మేర కర్నూల్ రోడ్డుపై జరిగే రోడ్డు ప్రమాదాలు స్థానిక ప్రజల్లో భయాందోళనలు కలిగిస్తున్నాయి. సాధారణ వాహనాలతో పాటు గ్రానైట్ క్వారీలు, ఫ్యాక్టరీలు, కంకర మిల్లులకు చెందిన భారీ వాహనాలు, పొక్లెయిన్లు, డంపర్లు, టిప్పర్లు ప్రమాదాలకు కారణమవుతున్నాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎప్పటి నుంచో ఒంగోలు నుంచి నంద్యాల ప్రతిపాదనల దశలో ఉన్న ఫోర్‌లైన్ వస్తే ప్రమాదాలను కాస్త తగ్గించొచ్చని పోలీసులు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. కానీ అది ఎప్పటికప్పుడు వాయిదా పడుతుండటంతో చేసేది లేక ప్రమాదాలు జరిగే బ్లాక్స్పాట్లను ఒంగోలు డీఎస్పీ ఆధ్వర్యంలో చీమకుర్తి, సంతనూతలపాడు పోలీసులు గుర్తించారు. వారి ప్రకారం ఈ రెండు మండలాల్లో కలిపి కర్నూల్ రోడ్డుపై సుమారు 25కుపైగా బ్లాక్స్పాట్లున్నట్లు గుర్తించారు. వాటికి అనుగుణంగానే చీమకుర్తి మండలంలో ప్రమాదాలు నివారించేందుకు ప్రస్తుత ఎస్ఐ జీవీ చౌదరి బ్లాక్స్పాట్ల వద్ద ట్రాఫిక్ నియంత్రణకు చర్యలు తీసుకుంటున్నారు. ప్రయాణికుల అసంతృప్తి కర్నూల్ రోడ్డుపై పొదిలి వైపు నుంచి చీమకుర్తి మండలం ప్రారంభమయ్యే మర్రిచెట్లపాలెం నుంచి సంతనూతలపాడులో కలిసే టపా చెట్టు వరకు దాదాపు 18 కిలోమీటర్లు పొడవునా 20కి పైగా బ్లాక్స్పాట్లను గుర్తించారు. బ్లాక్స్పాట్కు ఇరువైపులా వాహనాల వేగాన్ని నియంత్రించే క్రమంలో డబుల్ రోడ్డును కాస్త సింగిల్వేగా మార్చేస్తున్నారు. అందుకోసం ఖాళీ డబ్బాలు, టైర్లు, ఐరన్ బారికేడ్లను ఉపయోగించి వాటిపై రేడియమ్స్ స్టిక్కర్లు అతికించి ప్రయాణం సాగించే వాహనాలకు హెచ్చరికలు ఏర్పాటు చేశారు. ప్రధానమైన కూడళ్లు, బైపాస్ కేంద్రాలు, వేబ్రిడ్జిల వైపు వాహనాలు వెళ్లే ప్రాంతాలు, కాలేజీ కేంద్రాలు, జనావాసాలు ఎక్కువుగా ఉన్న ప్రాంతాల్లో ఇలాంటి ప్రమాద నివారణ చర్యలు చేపట్టంతో గతంతో పోల్చుకుంటే చాలా వరకు రోడ్డు ప్రమాదాలు నివారించగలిగినట్లు పోలీసులు విశ్వసిస్తున్నారు. కానీ అదే సమయంలో మార్కాపురం, గిద్దలూరు, నంద్యాల, కడప, కర్నూల్ ప్రాంతాల నుంచి ఒంగోలుకు వచ్చేవారు. అదే విధంగా ఒంగోలు నుంచి ఆయా ప్రాంతాలకు సూదూరంగా రాకపోకలు సాగించే వాహనదారులకు ఇలా కిలోమీటర్‌కు ఒకచోట ఏర్పాటు చేసిన ప్రమాద నియంత్రణ కేంద్రాలు ప్రయాణానికి ఆటంకంగా మారాయనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. ఫోర్‌లైన్ నిర్మిస్తే గానీ ఈ సమస్యకు పరిష్కారం లభించదని, కానీ ప్రభుత్వాలు ఆ దిశగా చర్యలు చేపట్టకపోవడంపై స్థానికుల్లో అసంతృప్తి వ్యక్తం అవుతోంది. ప్రమాదాలు తగ్గుముఖం పట్టాయి:బ్లాక్స్పాట్ల వద్ద ప్రమాదాల నివారణకు చర్యలు చేపట్టడంతో చాలా వరకు ప్రమాదాలు తగ్గుముఖం పట్టాయి. మర్రిచెట్లపాలెం నుంచి టపాచెట్టు వరకు చీమకుర్తి మండల పరిధిలోని అన్ని బ్లాక్స్పాట్ల వద్ద ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకున్నాం. అంతేకాకుండా రోడ్డుకు ఇరువైపులా చెట్లు, వంతెనలకు రేడియమ్ స్టిక్కర్లు అంటించి ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకుంటున్నాం.–జీవీ చౌదరి, ఎస్ఐ, చీమకురి -
తెల్లసొనతో నల్లమచ్చలు మాయం
బ్యూటిప్స్ ముఖం పేలవంగా, కాంతిహీనంగా, నల్ల మచ్చలు, ముడతలు నిండి ఉంటే కోడిగుడ్డులోని తెల్లసొన బాగా పని చేస్తుంది. రకరకాల కాంబినేషన్లతో ప్యాక్ వేసుకోవడం సాధ్యం కాని వాళ్లు కోడిగుడ్డు మాత్రమే ఉపయోగించి మంచి ఫలితాన్ని పొందవచ్చు. మొదటగా ముఖాన్ని రోజూ వాడుతున్న సబ్బుతోనే శుభ్రంగా కడుక్కోవాలి. ఆరిన తర్వాత కోడిగుడ్డు పగలకొట్టి తెల్లసొనను మాత్రమే గిన్నెలోకి వంపుకోవాలి. ఫోర్కుతో కాని ఎగ్ బీటర్‌తో కాని నురగ వచ్చేటట్లు కలిపి ఆ సొనలో దూదిని ముంచి ముఖానికి పట్టించాలి. గడ్డం నుంచి మొదలు పెట్టి పెదవులు, చెంపలు, ముక్కు, నుదురు అంతటికీ సమంగా పట్టించి ఆరే వరకు ఉండాలి.ఆరిన తర్వాత గోరు వెచ్చటి నీటితో ఏదైనా సబ్బు వాడి ముఖాన్ని శుభ్రంగా కడగాలి.ముఖం మీద నల్ల మచ్చలు ఎక్కువగా ఉంటే వారానికి నాలుగైదు సార్లు ఈ ట్రీట్మెంట్ చేస్తే నెల రోజుల్లోనే ఫలితం ఉంటుంది. కోడిగుడ్డు తెల్లసొన రాస్తే చర్మానికి నునుపుదనం వస్తుంది. తెల్లదనం తీసుకురావడంతోపాటు పొడిబారిన చర్మాన్ని మృదువుగా కూడా మారుస్తుంది. కోడిగుడ్డు తెల్లసొన రాయడం వల్ల ముఖం ముడతలు పడకుండా ఉంటుంది. యంగ్‌గా కనిపిస్తారు. -
నల్లటి మచ్చలు... పోవాలంటే?
డర్మటాలజీ కౌన్సెలింగ్ నా వయసు 28 ఏళ్లు. నా కణతల మీద నల్లటి మచ్చలు వస్తున్నాయి. అవి కొన్ని నెలలుగా అలా ఉన్నాయి. ప్రస్తుతం అవి చెంపలపైన కూడా వస్తున్నాయి. నాకు చాలా ఆందోళనగా ఉంది. దయచేసి నా సమస్యకు సరైన పరిష్కారం చెప్పండి. - రమ్య, వరంగల్ మీరు చెప్పిన లక్షణాలను బట్టి మీకు కణతల మీద, బుగ్గల మీద ‘ఫొటో పిగ్మెంటేషన్’ వల్ల ఇలా నల్ల మచ్చలు వస్తున్నట్లు తెలుస్తోంది. మీరు ఈ కింది సూచనలు పాటించండి. మీరు రెండు శాతం గ్లైకోలిక్ యాసిడ్ ఉన్న మైల్డ్ ఫేస్ వాష్‌ను ఉపయోగించండి. ఎండలో బయటకు వెళ్లినా, వెళ్లకపోయినా 50 ఎస్పీఎఫ్ కంటే ఎక్కువగా ఉండే సన్ స్క్రీన్ లోషన్స్ రాయండి. ఇది ప్రతి రెండు గంటలకు ఒకసారి ఆ లోషన్స్ రాస్తూ ఉండాలి. కోజిక్ యాసిడ్, ఆర్బ్యుటిన్‌తో పాటు విటమిన్-సి ఉండే క్రీమును ప్రతిరోజూ రాత్రివేళ ముఖానికి రాసుకుంటూ ఉండండి. ఇలా కనీసం నాలుగు వారాల పాటు రాసుకుంటూ ఉండాలి. కొన్ని వారాల తర్వాత మీరు కొన్ని కెమికల్ పీలింగ్, మైక్రో డెర్మా అబ్రేషన్, ఫ్రాక్షనల్ లేజర్ వంటి ప్రొసీజర్స్ చేయించుకోవాల్సి రావచ్చు. మన దేహంలోని అతి పెద్ద భాగం మన చర్మం. దాన్ని సంరక్షించుకోవడం మనందరికీ చాలా అవసరం. అది చాలా ప్రధానం కూడా. కేవలం సమస్య వచ్చినప్పుడు చర్మానికి చికిత్స చేయించుకోవడం కంటే సంపూర్ణ ఆరోగ్య సంరక్షణలో భాగంగా కొన్ని పనులు చేయడం అవసరం. అవి... ప్రతిరోజూ ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోవాలి. అందులో ఆకుకూరలు, కాయగూరలు (క్యారట్, బీట్రూట్), తాజా పండ్లు, ఎక్కువ ప్రోటీన్లు ఉండేలా చూసుకోవాలి. ప్రతిరోజూ క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. రోజూ పుష్కలంగా మంచినీళ్లు తాగాలి. కనీసం ఎనిమిది గంటలు తగ్గకుండా కంటి నిండా నిద్రపోవాలి. డాక్టర్ స్మిత ఆళ్లగడ్డ చీఫ్ డర్మటాలజిస్ట్,త్వచ స్కిన్ క్లినిక్ గచ్చిబౌలి, హైదరాబాద్ నొప్పిగా ఉందా? రక్తం పడుతోందా? ఆయుర్వేదం కౌన్సెలింగ్ నా వయసు 44 ఏళ్లు. గత ఎనిమిదేళ్లుగా మూలశంక (పైల్స్) వ్యాధితో బాధపడ్డాను. ఏడాది కిందట ఆపరేషన్ చేశారు. ఉపశమనం లభించింది. కానీ మళ్లీ రెండు నెలల నుంచి మలమార్గం దగ్గర చింతగింజ పరిమాణంలో వాపు, నొప్పి, దురద, మలబంధం లాంటి లక్షణాలున్నాయి. అప్పుడప్పుడు కొంచెం నెత్తురు పడుతూ ఉంటోంది. దీనికి ఆయుర్వేదంలో సంపూర్ణ పరిష్కారం తెలియజేయండి. - సురేశ్ అగర్వాల్, హైదరాబాద్ పైల్స్ వ్యాధిని ఆయుర్వేద పరిభాషలో ‘అర్శో రోగం’ అంటారు. ‘శత్రువులా హింసించే వ్యాధి కాబట్టే దీనిని ‘అర్శ’ అన్నారు. ‘అరివత్ ప్రాణినో మాంసకీలకా విశసంతి అర్శాంసి తస్మాత్ ఉచ్యంతే ..... మార్గ నిరోధతః’ (అష్టాంగ హృదయ గ్రంథం) - కొన్ని మొలకల వంటివి మలమార్గాన్ని అడ్డగించి హింసించడం వల్ల ఈ వ్యాధికి ఆ పేరు వచ్చింది. వ్యాధిస్థానం: మలమార్గంలో మూడు మడతలు ఉంటాయి. (త్రివలీ... అంటే 1. ప్రావరిణి, 2. విసర్జని 3. సంవరిణి). వీటిలో గల సిరలు ఉబ్బుతాయి. వాపు కలుగుతుంది. వ్యాధి తీవ్రతను బట్టి ఈ వాపు పరిమాణం, రూపం మారుతుంటాయి. ఉదా: ఆవగింజ, పెసర, మినప, కంది, బార్లీ గింజల్లా, పగడాలలాగ, చిలకముక్కులాగా ఉంటాయని శాస్త్రకారులు స్పష్టీకరించారు. వీటిని మాంసకీలలు అంటారు. భేదాలు : సహజ (పుట్టుకతో వచ్చినవి), జాతోత్తరకాలజ (వివిధ కారణాల వల్ల, వయసుల్లో వచ్చేవి), శుష్క (పొడిగా ఉండేవి), ఆర్ద్ర (తడిగా ఉండేవి). బాహ్య (బయటకు ఉండేవి), ఆభ్యంతర (లోపలి మడతల్లో ఉండేవి). వ్యాధి కారణాలు: జఠరాగ్ని మందగింపజేసే ఆహారవిహారాలు. అంటే ఉప్పు, పులుపు-కారాలు ఎక్కువగా తినడం, అజీర్తి కలిగించే బరువైన ఆహారం, విరుద్ధాహారం (అంటే కొన్ని కొన్ని పదార్థాల కలయిక శరీరానికి హాని కలిగిస్తుంది. ఉదాహరణకు ఇత్తడి పళ్లెంలో నిల్వ ఉంచిన పులిహోర; కొన్ని రకాల చేపలు తిన్న వెంటనే పాలు తాగడం, పాలు, పెరుగు వెంటవెంటనే సేవించడం), ఎక్కువసేపు కూర్చుని పనిచేసే వృత్తుల్లో ఉన్నవారికి (ముఖ్యంగా మెత్తటి ఆసనాల మీద), జంతువుల (గుర్రం మొదలైనవి) మీద ఎక్కువ సేపు ప్రయాణించడం, పిరుదుల మీద ఎక్కువ సేపు వేడి లేదా చల్లటి ఒత్తిడి పడటం (లారీ నడిపేవారు), మానసిక ఒత్తిడి (ఆందోళన, భయం, దుఃఖం, విచారం మొదలైనవి) చికిత్స విషయంలో సాధ్యాసాధ్యాలు: బాహ్య అర్శస్సులు, కొత్తగా పుట్టేవాటికి తేలిగ్గా చికిత్స చేయవచ్చు. సహజ, ఆభ్యంతర, చిరకాల అర్శస్సులు కష్టసాధ్యాలు, కొన్నింటికి చికిత్స అవసరం. ఉపద్రవాలు: సకాలంలో సరైన చికిత్స చేయకపోతే రక్తహీనత, దౌర్బల్యం, శరీరమంతా వాపులు, మానసిక వ్యాకులతలతో పాటు మరణానికి దారితీస్తుంది. వ్యాధి లక్షణాలు: మలమార్గం దగ్గర వాపు, తీవ్రమైన మలబంధం, దురద, మంట, ఆకలి లేకపోవడం, కోపం, కొన్ని సందర్భాల్లో రక్తస్రావం మొదలైనవి. చికిత్స: పైన చెప్పిన కారణాలను గమనించి వాటిని దూరం చేయాలి. నూనెలు, ఉప్పు-పులుపు, కారం లేని, తేలికగా జీర్ణమయ్యే ఆహారం (పీచుపదార్థాలు ఎక్కువగా ఉండే శాకాహారం, ఆకుకూరలు) తీసుకోవడం, నీళ్లు ఎక్కువగా తాగడం, తాజాఫలాలు ఎక్కువగా తినడం, తగినంత నిద్ర, ప్రశాంతత, ప్రాణాయామం మొదలైనవి. ఔషధాలు: కాంకయనవటి (మాత్రలు) ఉదయం 1, రాత్రి 1 బృహత్ సూరణ వటి (మాత్రలు) ఉదయం 1, రాత్రి 1 అర్శోహర వటి (మాత్రలు): ఉదయం 1, రాత్రి 1 త్రిఫలాచూర్ణం: 5 గ్రాములు నీటితో రెండుపూటలా శుంఠి చూర్ణం: 3 గ్రాములు, తేనెతో, రాత్రి ఒకసారి చిత్రమూల చూర్ణం: 2 గ్రాములు తేనెతో రాత్రి ఒకసారి డాక్టర్ వి.ఎల్.ఎన్.శాస్త్రి ఆయుర్వేద నిపుణులు, సౌభాగ్య ఆయుర్వేదిక్ క్లినిక్, హుమాయూన్‌నగర్, హైదరాబాద్ పసిపిల్లల్లో... వినికిడి సమస్యను కనిపెట్టేదెలా? ఈఎన్టి కౌన్సెలింగ్ మా బాబుకి రెండున్నర ఏళ్లు. వాడిని పిలిచినా పలకడం లేదు. కారణం చెప్పండి. దయచేసి పరిష్కారం చూపించండి. - సులక్షణ, ఖమ్మం సాధారణంగా పుట్టుకతో వినికిడి లోపం అన్నది జన్యుపరంగా వస్తుంది. వినికిడి నరంలో సమస్యతో ఇది వస్తుంది. పిల్లలకు వినికిడి లేకపోతే మాట కూడా రాదు. కారణాలు: మేనరికపు వివాహాల వల్ల జన్యుపరంగా వినికిడికి దోహదం చేసే నరం బలహీనమవుతుంది గర్భవతుల్లో వైరల్ ఇన్ఫెక్షన్ వల్ల అప్పుడే పుట్టిన శిశువుల్లో కామెర్లు, తలకు, చెవికి బలమైన దెబ్బ తగలడం మెదడువాపు వ్యాధి వంటి కారణాలతో ఈ సమస్య వస్తుంది. ఇలా జరిగినప్పుడు వినికిడి లోపానికి తగిన కారణాలు తెలుసుకొని దానికి అనుగుణంగా చికిత్స చేయడం, కాక్లియర్ ఇంప్లాంట్స్ శస్త్రచికిత్స చేయించడం వల్ల ఈ సమస్యను అధిగమించవచ్చు. సమస్యను ఎలా గుర్తించాలి? వినికిడి సమస్య అన్నది పిల్లలు గర్భంలో ఉన్నప్పటి నుంచి ఏర్పడుతుంది. శిశువు పుట్టిన తర్వాత... ఒక నెలలోపువారు శబ్దాన్ని గ్రహించి కంటి రెప్పలను కదిలిస్తారు మూడు నెలల లోపు వయసులో శబ్దం వచ్చే వైపునకు తిరుగుతారు ఆరు నెలలోపు వయసులో మ, బ, త లాంటి అక్షరాలు పలుకుతారు తొమ్మిది నెలలోపు వయసు గల వారు మమ, తత, బబ లాంటి చిన్న చిన్న పదాలు పలుకుతారు పన్నెండు నెలల వయసు వారు అర్థవంతమైన పదాలను పలకడం చేస్తుంటారు ఏడాదిన్నర వయసు ఉన్నవారు చిన్న చిన్న వాక్యాలు పలుకుతుంటారు రెండేళ్ల పిల్లల వారు చిన్న చిన్న కథల రూపంలో ఏదైనా చెబుతుంటారు. వీటిలో ఏది జరగకపోయినా పిల్లలకు వినికిడి సమస్య ఉందని అనుమానించి, వెంటనే డాక్టర్‌ను కలుసుకోవాలి. డాక్టర్ సత్యకిరణ్ అవ్వారు సీనియర్ ఈఎన్టీ అండ్ కాక్లియర్ సర్జన్, సెంచరీ హాస్పిటల్స్, బంజారాహిల్స్, హైదరాబాద్. -
కణతల మీద మచ్చలు... తగ్గేదెలా?
అతివ - ఆత్మవిశ్వాసం నా వయసు కేవలం 28 ఏళ్లు. నా కణతల మీద నల్లటి మచ్చలు వస్తున్నాయి. అవి కొన్ని నెలలుగా అలా ఉన్నాయి. ప్రస్తుతం అవి చెంపలపైన కూడా వస్తున్నాయి. నా సమస్యకు సరైన పరిష్కారం చెప్పండి. - శ్రీజ, కందుకూరు మీరు చెప్పిన లక్షణాలను బట్టి మీకు కణతల మీద, బుగ్గల మీద ‘ఫొటోపిగ్మెంటేషన్’ వల్ల ఇలా నల్ల మచ్చలు వస్తున్నట్లు తెలుస్తోంది. మీరు ఈ కింద సూచనలు పాటించండి. మీరు రెండు శాతం గ్లైకోలిక్ యాసిడ్ ఉన్న మైల్డ్ ఫేస్ వాష్‌ను ఉపయోగించండి. ఇక ఎండకు వెళ్లినా వెళ్లకపోయినా 50 ఎస్పీఎఫ్ కంటే ఎక్కువగా ఉండే సన్ స్క్రీన్ లోషన్స్ రాయండి. ఇది ప్రతి రెండు గంటలకు ఒకసారి రాస్తూ ఉండాలి. రాత్రివేళ కోజిక్ యాసిడ్, ఆర్బ్యుటిన్‌తో పాటు విటమిన్-సి ఉండే క్రీమును ప్రతిరోజూ రాత్రివేళ ముఖానికి రాసుకుంటూ ఉండండి. ఇలా కనీసం నాలుగు వారాల పాటు రాసుకుంటూ ఉండాలి. కొన్ని వారాల తర్వాత మీరు కొన్ని కెమికల్ పీలింగ్, మైక్రోడెర్మాబ్రేషన్ లేదా ఫ్రాక్షనల్ లేజర్ వంటి ప్రొసీజర్స్ చేయించుకోవాల్సి రావచ్చు. మన దేహంలోని అతి పెద్ద భాగం మన చర్మం. దాన్ని సంరక్షించుకోవడం మనందరికీ చాలా అవసరం. అది చాలా ప్రధానం కూడా. కేవలం సమస్య వచ్చినప్పుడు చర్మానికి చికిత్స చేయించుకోవడం కంటే సంపూర్ణ ఆరోగ్య సంరక్షణలో భాగంగా కొన్ని పనులు చేయడం అవసరం. అవి... ప్రతిరోజూ ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోవాలి. అందులో ఆకుకూరలు, కాయగూరలు, తాజా పండ్లు, ఎక్కువ ప్రోటీన్లు ఉండేలా చూసుకోవాలి. ప్రతిరోజూ క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. రోజూ పుష్కలంగా మంచినీళ్లు తాగాలి. కనీసం ఎనిమిది గంటలు తగ్గకుండా కంటినిండా నిద్రపోవాలి. నా వయసు 18 ఏళ్లు. నా ఒంటి మీద దుస్తులు కప్పి ఉండే ప్రాంతం తెల్లగానూ (ఫెయిర్‌గానూ), మిగతా ప్రాంతంలో స్కిన్ కాస్త నల్లగా (డార్క్‌గా) కనిపిస్తుంది. నా మేని రంగు అంతా ఒకేలా ఉండి, దానికి నిగారింపు వచ్చేందుకు ఏం చేయాలి? - కావ్య, కాకినాడ దుస్తులు కప్పి ఉండేచోట చర్మం, సూర్యుడికి ఎక్స్పోజ్ అయ్యే భాగాలతో పోలిస్తే కాస్త తెల్లగానూ, మెరుపుతోనూ ఉంటుంది. ఆ భాగాలతో పోలిస్తే సూర్యకాంతి పడేచోట అల్ట్రా వయొలెట్ కిరణాల వల్ల సన్ డ్యామేజీ వల్ల మేని రంగు కాస్త డార్క్‌గా ఉంటుంది. మీ శరీరంలో సూర్యకాంతికి ఎక్స్పోజ్ అయ్యే భాగాలు తేమను కోల్పోకుండా ఉండటంతో పాటు, మెరుస్తూ ఉండాలంటే తీసుకోవాల్సిన జాగ్రత్తలివి... సూర్యకాంతికి ఎక్స్పోజ్ అయ్యే మీ చర్మానికి... షియాబట్టర్, అలోవీరా, గ్లిజరిన్ ఉండే మంచి మాయిశ్చరైజర్‌ను పూసుకోండి.సూర్యకాంతికి ఎక్స్పోజ్ అయ్యే శరీర భాగాలకు చెందిన చర్మంపై అంటే ముఖం, మెడ, వీపుపైభాగం, చేతులు, కాళ్లు వంటి చోట్ల 50 ఎస్పీఎఫ్ ఉండే బ్రాడ్‌స్పెక్ట్రమ్ సన్‌స్క్రీన్ రాసుకుంటూ ఉండండి. ప్రతి మూడు గంటలకోసారి ఇలా సన్‌స్క్రీన్ రాసుకోవడం చేస్తూ ఉండాలి. సాధారణంగా మీరు ఫుల్స్లీవ్స్ వేసుకోవడం వల్ల మిగతా మేనిభాగాలకు కూడా అదే నిగారింపు, మెరుపు వస్తుంది. గ్లైకోలిక్ యాసిడ్ 6%, ఆర్బ్యుటిన్, కోజిక్యాసిడ్ ఉన్న క్రీములను రాత్రివేళల్లో మీ చర్మంపై పూసుకోండి. పై సూచనలు పాటించినా ఇంకా మేనిపై ఆ తేడాలు తగ్గకపోతే డర్మటాలజిస్ట్‌ను సంప్రదించండి. వారు కెమికల్ పీలింగ్ వంటి ప్రక్రియలతో మీ చర్మాన్ని నిగారింపుతో ఉండేలా చేస్తారు. నా వయసు 25 ఏళ్లు. నాకు విపరీతంగా జుట్టు రాలిపోతోంది. తల మీద వెంట్రుకలు బాగా పలచబారిపోయాయి. నాకు బట్టతల చాలా అర్లీగా వస్తున్నట్లు అనిపిస్తోంది. దయచేసి నా జుట్టు రాలపోకుండా తగిన సలహా ఇవ్వండి. - శ్రీదేవి, కందుకూరు మీరు చెబుతున్న లక్షణాలను బట్టి మీరు యాండ్రోజెనిక్ అలపేషియా అనే కండిషన్‌తో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. బహుశా మీకు ఇది వారసత్వంగా వస్తున్నట్లుగా అనిపిస్తోంది. దీని వల్ల మీకు బట్టతల రాబోతోందని అర్థమవుతోంది. బట్టతలలో మొదటి దశ నుంచి మూడో దశ ఉన్నవారు బయోటిన్‌తో పాటు... సా పాల్మెట్టో, మినాక్సిడిల్ 5 శాతం ఉన్న లోషన్లను తలపై అప్లై చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత నాలుగు, ఐదు దశల్లో పై మందులకు తోడుగా ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా థెరపీ వంటివి కూడా ఇవ్వాల్సి ఉంటుంది. ఇక ఇవేవీ పనిచేయకపోతే జుట్టు పుష్కలంగా ఉన్న ప్రాంతం నుంచి హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ ప్రక్రియను అనుసరించడం మంచి ప్రత్యామ్నాయ మార్గం. మీరు ఒకసారి మీకు దగ్గర్లోని డర్మటాలజిస్ట్‌ను సంప్రదించండి. నా వయసు 15 ఏళ్లు. నాకు ముఖం నిండా మొటిమలు చాలా ఎక్కువగా వస్తున్నాయి. ఇవి తగ్గేదెలా? - జయ, హైదరాబాద్ మీలాంటి టీనేజీ యువతీయువకుల్లో సాధారణంగా మొటిమలు ఎక్కువగా వస్తుంటాయి. ఇవి ముఖం మీదే కాకుండా ఛాతీ, వీపు మీద కూడా కనిపిస్తుంటాయి. మన చర్మం మీద ఉంటే స్వేదగ్రంధుల ఖాళీలలో ఒక రకమైన నూనె స్రవించే గ్రంథులు కూడా ఉంటాయి. ఈ స్వేదగ్రంథుల ఖాళీలు నూనె, చర్మానికి సంబంధించిన మృతకణాలు, లేదా బ్యాక్టీరియాతో నిండితే మొటిమలు వస్తుంటాయి. మొటిమలకు చికిత్స అనేక అంశాలపై ఆధారపడి ఉంటుంది. వీటి తీవ్రత, ఎంతకాలంగా అవి వస్తున్నాయి అనే అనేక అంశాల ఆధారంగా చికిత్స చేస్తారు. మీరు ఒకసారి మీకు దగ్గర్లో ఉన్న డర్మటాలజిస్ట్‌ను కలవండి. డాక్టర్ స్మిత ఆళ్లగడ్డ చీఫ్ డర్మటాలజిస్ట్, త్వచ క్లినిక్, గచ్చిబౌలి, హైదరాబాద్ న్యూట్రిషనల్ ఫ్యాక్ట్స్ కీరదోసతో అదుపులోకి హైబీపీ కీరదోసలో 96 శాతం నీరే. ఈ నీరు దేహాన్ని డీహైడ్రేషన్‌కు గురికాకుండా కాపాడుతుంది. దేహంలోని విషాలను (టాక్సిన్స్) బయటకు పంపుతుంది ఇందులో పొటాషియం, మెగ్నీషియం, సోడియం ఉంటాయి. ఇవి రక్తపోటును క్రమబద్ధీకరిస్తాయి. హైబీపీ అదుపులోకి రావాలంటే రోజూ ఒక కీరదోస కాయను తినాలి. ఇందులోని ‘ కె’ విటమిన్ ఎముకలు కీళ్ల పనితీరును మెరుగుపరుస్తుంది. న్యూరాన్ల పనితీరును మెరుగుపరిచి అల్జీమర్స్ సమస్యను నివారిస్తుంది. కీరదోస ... గ్యాస్ట్రిక్ అల్సర్ నుంచి ఉపశమనాన్ని ఇస్తుంది, జుట్టు పెరగడానికి దోహదం చేస్తుంది. గోళ్లు పెళుసుబారడాన్ని తగ్గిస్తుంది. కీళ్లనొప్పులను తగ్గిస్తుంది. కడుపులో బద్దె పురుగులను నిర్మూలిస్తుంది. చిగుళ్ల సమస్యలను, మూత్ర సంబంధ సమస్యలను నివారిస్తుంది. ప్యాంక్రియాస్ పనితీరులో లోపం వల్ల ఎదురైన సమస్యలను కీరదోస పరిష్కరిస్తుంది. కాబట్టి డయాబెటిస్తో బాధపడేవారు రోజూ తినవచ్చు. బరువు తగ్గడానికి కూడా కీరదోస దోహదం చేస్తుంది. కాబట్టి అధికబరువు, స్థూలకాయంతో బాధపడేవారు కూడా హాయిగా తినవచ్చు. డాక్టర్ రాధిక చీఫ్ డైటీషియన్ కిమ్స్ హాస్పిటల్స్ సికింద్రాబాద్ -
కళ్ల కింది వలయాలకు...
బ్యూటిప్స్ టొమాటో రసంలో కొద్దిగా నిమ్మరసం, కాసింత పుదీనారసం వేసి బాగా కలపాలి. దీన్ని కళ్ల చుట్టూ పూసి, ఆరిన తర్వాత కడిగేయాలి. తరచూ ఇలా చేస్తే కళ్ల చుట్టూ ఉండే నల్లని వలయాలు పోతాయి. కంప్యూటర్ల ముందు ఎక్కువ పనిచేసేవాళ్లు ఈ చిట్కాను పాటిస్తూ ఉంటే నల్లని వలయాలు ఏర్పడకుండా ఉంటాయి. రాత్రి పడుకోబేయే ముందు బాదం నూనెతో కళ్ల కింది వలయాల మీద మృదువుగా రుద్దుతూ కాసేపు మర్దనా చేయాలి. రాత్రంతా అలా వదిలేసి, ఉదయాన్నే చల్లని నీటితో కడిగేసుకోవాలి. వారం పది రోజుల పాటు రోజూ ఇలా చేస్తే నలుపు తగ్గుతుంది. బంగాళాదుంపను సన్నగా తురిమి, ఓ బట్టలో వేసి గట్టిగా పిండి రసం తీయాలి. దీనిలో కొద్దిగా పాల క్రీమ్‌ను కలిపి కళ్ల కింద పూసి, ఆరిన తర్వాత కడిగేయాలి. తరచూ ఇలా చేస్తే డార్క్ సర్కిల్స్ తగ్గిపోతాయి. కీరాదోస రసాన్ని, నిమ్మరసాన్ని సమపాళ్లతో కలిపి కళ్లకింద పూయాలి. రోజుకు రెండుసార్లు చొప్పున వారం రోజుల పాటు ఇలా చేస్తే నల్లని వలయాలు మాయమైపోతాయి. చెంచాడు ఆరెంజ్ జ్యూస్‌లో కొన్ని చుక్కల గ్లిజరిన్ కలిపి పది నిమిషాల పాటు అలాగే ఉంచాలి. తర్వాత కళ్ల కింద రాసుకుని, ఆరిన తర్వాత చల్లని నీటితో కడిగేసుకోవాలి. వారానికి మూడుసార్లు ఉదయం లే వగానే ఇలా చేస్తే... డార్క్ సర్కిల్స్ పోతాయి. -
మొటిమలు మాయం కావాలంటే
కొన్ని తమలపాకులను మెత్తగా దంచి పేస్ట్‌లా చేసుకోవాలి. దానికి కొద్దిగా కొబ్బరి నూనె కలిపి ముఖానికి ప్యాక్ వేసుకోండి. ఇలా వారానికి మూడుసార్లు చేస్తే మొటిమలు మటుమాయం.ముఖంపై నల్లమచ్చలు తొలగిపోవడానికి తేయాకు తైలం బాగా పని చేస్తుంది. అందుకు రెండు టీస్పూన్ల టీ పొడిని రాత్రంతా పచ్చిపాలలో నానబెట్టాలి. ఉదయమే ఆ నానిన ఆకులతో నల్లమచ్చలపై ఓ నిమిషం పాటు రుద్దాలి. తర్వాత ఆ పాలతో ముఖాన్ని కడుక్కుంటే మచ్చలు పోతాయి.మోచేతులు, మోకాళ్లు నల్లగా గరుగ్గా ఉండటం సహజం. ఆ నల్లటి మరకలను పోగొట్టుకునేందుకు అనాస పండు గుజ్జును వాటిపై అప్లై చేయండి. అయిదు నిమిషాల తర్వాత అదే గుజ్జుతో మర్దన చేసి చల్లటి నీటితో కడిగేసుకోండి. -
వేప మేలు వేవేలు
బ్యూటిప్స్ వేప చెట్టు ఇంటి దగ్గర్లో ఉంటే వేరే సౌందర్య సాధనాలతో పనే ఉండదు. వేపాకులు, బెరడు, వేపనూనె ఔషధాలుగానే కాదు, సౌందర్య సాధనాలుగానూ ఉపయోగపడతాయి. ఎలాంటి చర్మ సమస్యలకైనా వేపతో ఇట్టే చెక్ పెట్టేయవచ్చు. ముఖంపై మొటిమలు, నల్లమచ్చలు ఏర్పడుతుంటే వేపాకులతో చక్కని విరుగుడు ఉంది. గుప్పెడు వేపాకులను అరలీటరు నీటిలో వేయాలి. వేపాకులు పూర్తిగా మెత్తగా మారిపోయేంత వరకు ఆ నీటిని మరిగించాలి. కాసేపటికి నీరు ఆకుపచ్చ రంగులోకి మారుతుంది. అప్పుడు వడగట్టి ఆ కషాయాన్ని సీసాలో భద్రపరచుకోవాలి. ప్రతిరోజూ రాత్రి పడుకునే ముందు ఆ నీటితో కాస్త దూదిని తడిపి ముఖాన్ని రుద్దుకుంటే చాలు. మొటిమలు, మచ్చలు మటుమాయం అవుతాయి. ఒళ్లంతా చర్మం పొడిబారి, తరచు దురదలు పెడుతున్నట్లయితే, పైన చెప్పుకున్నట్లే వేపాకులతో కషాయం చేసి, బకెట్ నీటిలో ఒక కప్పు కషాయాన్ని పోసి ఆ నీటిని స్నానానికి ఉపయోగిస్తే చాలు, కొద్ది రోజుల్లోనే చర్మం ఆరోగ్యకరంగా మారుతుంది. ఎండ తాకిడికి ముఖం కళతప్పినట్లుగా మారితే, వేపాకులను, గులాబీ రేకులను ఎండబెట్టి పొడిగా చేసుకోవాలి. రెండు చెంచాల పొడికి, చెంచాడు పెరుగు కలిపి, అందులో కొద్దిగా నిమ్మరసం పిండి ముఖానికి పట్టించుకోవాలి. అరగంట సేపు ఆరనిచ్చాక ముఖాన్ని చన్నీటితో కడిగేసుకోవాలి. ఇలా తరచు చేస్తుంటే ముఖానికి తిరిగి కళాకాంతులు వస్తాయి. ముఖం తరచు జిడ్డుగా మారుతుంటే, వేపాకుల పొడి, గంధం పొడి, గులాబి రేకుల పొడి సమభాగాలుగా తీసుకుని కలుపుకోవాలి. చెంచాడు పొడిలో మూడు నాలుగు చుక్కల వేపనూనె, కొద్దిగా తేనె, నిమ్మరసం పిండుకుని ముద్దలా కలుపుకోవాలి. దానిని ముఖానికి పట్టించి, అరగంటసేపు ఆరనివ్వాలి. పూర్తిగా ఆరిన తర్వాత గోరువెచ్చని నీటితో కడిగేయాలి. ఇలా చేస్తే ముఖం తాజాగా మారుతుంది. -
వేగమే యమపాశం
సాక్షి, సిటీబ్యూరో: అతి వేగం.. రాంగ్‌రూట్ డ్రైవింగ్.. గడిచిన 96 గంటల్లో నగరంలో 12 మందిని బలిగొన్నాయి. రోడ్డెక్కితే పట్టపగ్గాల్లేకుండా దూసుకుపోవాలనే కొందరి ధోరణి పాదచారులు, ఒక్కోసారి ఇళ్లలో ఉన్న వారి ప్రాణాలూ తోడేస్తోంది. ప్రమాద స్థలాల్లో కొన్ని నిత్యం యాక్సిడెంట్లు జరిగే ‘బ్లాక్ స్పాట్స్’ అయినప్పటికీ.. కనీస నియంత్రణ చర్యలు కరువయ్యాయి. ఫలితంగా రోడ్లు నిత్యం రక్తమోడుతున్నాయి. ట్రాఫిక్ పోలీసులు, ఇతర ప్రభుత్వ యంత్రాగాలకు చిత్తశుద్ధి ఉంటే వాహనాల అతి వేగానికి కళ్లెం వేయడం కష్టమేం కాదని నిపుణులు అంటున్నారు. ‘డ్రంకన్ డ్రైవ్’ విస్తరించడం, వివిధ సమయాల్లో, ప్రాంతాల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించడం అవసరం. మరోపక్క గత నాలుగు రోజుల్లో ప్రమాదాలు జరిగిన ప్రాంతాల్లో గండిమైసమ్మ రోడ్డు, నెక్లెస్‌రోడ్డు ఉన్నాయి. ఈ ప్రాంతాల్లో తరచూ ప్రమాదాలు జరుగుతున్నా పట్టించుకునే వారేలేరు. స్పీడ్ లేజర్‌గన్, ఇంటర్సెప్ట్ వాహనాలను తగిన స్థాయిలో వినియోగించి, అవసరమైన చోట్ల ఆకస్మిక తనిఖీలు చేయాలి. నిత్యం ప్రమాదాలు జరిగే ‘బ్లాక్ స్పాట్స్’తో పాటు ప్రమాదాలకు ఆస్కారమున్న చోట తగిన ఏర్పాట్లు చేస్తే ఫలితాలుంటాయని రవాణా రంగ నిపుణులు చెబుతున్నారు. వాటిని పరిశీలిస్తే... కాషనరీ సైన్స్ ప్రమాదకరమైన ప్రాంతం, హేతువు గురించి సదరు స్పాట్‌కు కొద్దిదూరంలోనే హెచ్చరిక/సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలి. ఆయా స్పాట్లకు ఇరువైపులా కనీసం 200, 100 మీటర్ల దూరాల్లో రెండు బోర్డులు ఉంచాలి. జాతీయ రహదారి అయితే 900 ఎంఎం కొలతలో, ‘ప్రమాదకర ప్రాంతం’ అని స్పష్టంగా తెలిసేలా బోర్డులుండాలి. కలర్స్, క్యాట్ ఐస్ ప్రమాదహేతువులుగా ఉన్న ప్రాంతాల్లో డివైడర్‌తో పాటు రోడ్ మార్జిన్స్‌లోనూ పెయిం టిం గ్ వేయాలి. రిఫ్లెక్టివ్ పెయింట్స్ అయితే రాత్రి వేళ కూడా స్పష్టంగా కనిపిస్తాయి. మా ర్జిన్స్తో పాటు ఎంపిక చేసుకున్న ప్రాంతాల్లో రాత్రి పూట మెరిసే క్యాట్ ఐస్ ఏర్పాటు చేయాలి. హజార్డ్ మార్కర్స్ అత్యంత ప్రమాదకర స్పాట్స్ దగ్గర ఉన్న డివైడర్‌ను సక్రమంగా నిర్వహించాలి. ఆ ప్రాం తాలకు ఇరువైపులా కనీసం 400 మీటర్ల మేర అయినా అవసరమైనంత ఎత్తులో దీన్ని నిర్మించాలి. దీనికి ఇరువైపులా హజార్డ్ మార్కర్స్ (ప్రమాద సూచికలు) ఏర్పాటు చేయాలి. చీకట్లోనూ వీటి ఉనికి వాహనచోదకులకు తెలిసేలా రిఫ్లెక్టివ్ లేదా సోలార్ మార్కర్స్ పెట్టాలి. స్పీడ్ బ్రేకర్, రంబ్లర్ స్ట్రిప్స్ నెక్లెస్‌రోడ్ వంటి చోట్ల వేగానికి ఆస్కారం ఉంది. ఇక్కడ 24 గంటలూ పోలీసులు కాపుకాయలేరు. కాబట్టి కీలక స్పాట్ల వద్ద స్పీడ్ బ్రేకర్లను ఏర్పాటు చేయాలి. జాతీయ రహదారులపై నిబంధనల ప్రకారం వీటి ఏర్పాటుకు అవకాశం లేదు. ఇలాంటి ప్రాంతాల్లో రెండు అంగుళాల ఎత్తు, అదే వె డల్పుతో ఉండే రంబ్లర్ స్ట్రిప్స్ ఏర్పాటు చేయవచ్చు. వీటిని మలుపునకు 100 మీటర్ల దూరంలో ఇరువైపులా రోడ్డుపై 10-15 చొప్పున ఏర్పాటు చేయాలి. జిగ్‌జాగ్ మార్కింగ్ ప్రమాదాల నివారణలో కీలకమైంది జిగ్‌జాగ్ మార్కింగ్. ప్రమాదకర ప్రాంతం కేంద్రంగా అటు-ఇటు దాదాపు 100 మీటర్ల మేర ఈ మార్కింగ్స్ వేయాలి. వీటిపై నుంచి ప్రయాణిస్తున్న వాహనచోదకుడు.. ఎక్కువ వేగంతో వెళ్తున్నట్టు భ్రాంతి చెందితే వెంటనే స్లో అవుతాడు. ఫాగ్‌లైట్స్ శీతాకాలంలో అర్థరాత్రి దాటాక, తెల్లవారుజామున పొగమంచు అలుముకుంటుంది. రోడ్డు కని పించక, ఎదుటి వాహనం కానరాక ప్రమాదాలు జరుగుతుంటాయి. కాబట్టి ప్రతి వాహనానికీ ఫాగ్లైట్ ఏర్పాటు కచ్చితం చేయాలి. దీనివల్ల వాహనం ఉనికి ఎదుటి వారికి తెలుస్తుంది. వాహనచోదకుడికీ మార్గం కొంతమేర స్పష్టంగా కనిపిస్తుంది. వారం- మృతులు/క్షతగాత్రులు సోమవారం- 3/1 దుండిగల్‌లోని గండి మైసమ్మ వద్ద ఆటో ఎదురుగా వస్తున్న కంటైనర్‌ను అతి వేగంతో ఢీకొట్టింది. డ్వాక్రా మహిళలు రాజేశ్వరి, చిట్టెమ్మ, ఆటోడ్రైవర్ న ర్సింహులు చనిపోయారు. మరొకరు గాయపడ్డారు. మంగళవారం- 3/2 నాచారం ప్రాంతంలో హమాలీ రాజు, లారీడ్రైవర్ బాబూమియా ఉదయమే రోడ్డు పక్కన నిల్చుని టీ తాగుతున్నారు. మల్లాపూర్ నుంచి వేగంగా వచ్చిన కారు అదుపు తప్పి ఢీకొట్టడంతో వీరిద్దరు అక్కడికక్కడే మరణించారు. మద్యం మత్తులో ఉన్న కారు డ్రైవర్, మరో వ్యక్తి గాయపడ్డారు నేరేడ్మెట్ జేజే నగర్ వద్ద రోడ్డు దాటుతున్న మాజీ సైనికోద్యోగి గోపాలకృష్ణన్‌ను వేగంగా దూసుకువచ్చిన కారు బలిగొంది బుధవారం- 3/3 కుషాయిగూడ పరిధిలో.. మద్యం మత్తులో ఉన్న డ్రైవర్ లారీని రాంగ్రూట్లో నడపటమే కాక రోడ్డు పక్కనే ఉన్న గుడిసెలోకి పోనిచ్చాడు. కూలీ ఎల్లమ్మ మరణించగా, డ్రైవర్ సహా ముగ్గురు గాయపడ్డారు. నాచారం పారిశ్రామికవాడలో ఉండే పారిశుద్ధ్య కార్మికురాలు పెంటమ్మ వాటర్ట్యాంకర్లో డ్రైవర్ పక్కన కూర్చుని ప్రయాణిస్తుండగా, స్పీడ్ బ్రేకర్ వద్ద కుదుపునకు ఎగిరి రోడ్డుపై పడి.. ట్యాంకర్ వెనక చక్రం కింద నలిగి ప్రాణాలు వదిలింది మైలార్‌దేవ్‌పల్లి పరిధిలో వాహనం ఢీకొట్టిన ప్రమాదంలో గుర్తుతెలియని వ్యక్తి మరణించాడు గురువారం-3/1 నెక్లెస్‌రోడ్‌లో జరిగిన ప్రమాదంలో విద్యార్థి హరీష్, స్వీపర్ అనసూయ మరణించారు. మొబిన్ గాయపడ్డాడు. సైబర్టవర్స్ ప్రాంతంలో రాంగ్రూట్లో వచ్చిన బైక్ ఢీకొట్టడంతో బీఫార్మసీ విద్యార్థిని తీవ్రగాయాల పాలై మృతిచెందింది.