నా వయసు 38 ఏళ్లు. వృత్తిరీత్యా నాకు బయట ఎక్కువగా తిరగాల్సిన పని ఉంటుంది. ఇటీవల నా మెడమీద, నుదురు,నడుము మీద విపరీతంగా నల్లబడుతోంది. ఇలా ఎందుకు జరుగుతోంది? దయచేసి వివరించండి.
మీరు ఎదుర్కొంటున్న కండిషన్‌ను ఎకాంథోసిస్ నైగ్రికాన్స్ అంటారు. ఈ కండిషన్ ఉన్నవారిలో మెడ, నుదురు వంటి చోట్ల నల్లబడటంతో పాటు అక్కడ చర్మం ఒకింత దళసరిగా కూడా మారుతుంది. సాధారణంగా ఉండాల్సిన బరువు కంటే ఎక్కువగా ఉన్నవారిలో ఈ సమస్య కనిపిస్తుంటుంది. తక్కువ వ్యవధిలో ఎక్కువగా బరువు పెరగడం, కొన్ని హార్మోన్ల అస్తవ్యస్తతో ఇలా జరుగుతుంది. కొందరిలో కొన్ని రకాల మందులు వాడినా కూడా ఈ సమస్య రావచ్చు. మీరు వెంటనే డాక్టర్‌ను సంప్రదించి, ఏ కారణాల వల్ల ఇలా జరుగుతుందో తెలుసుకుని, అందుకు అనుగుణంగా చికిత్స తీసుకోండి.
టీవీ యాడ్స్‌లోని కాస్మటిక్స్ వాడమంటారా?
నా వయసు 20 సంవత్సరాలు. నా ముఖం విషయంలో నాకు ఎలాంటి సమస్యా లేదు. ఎలాంటి ఫిర్యాదులూ లేవు. నేను ఎలాంటి క్రీమ్స్ రాయను. అయితే టీవీ యాడ్స్ చూసినప్పుడు నేను కూడా ఏవైనా క్రీమ్స్ రాస్తే మంచిదా అన్న భావం కలుగుతోంది. వాటివల్ల ఏమైనా సైడ్‌ఎఫెక్ట్స్ ఉంటాయా అన్న ఆందోళన కూడా ఒక్కోసారి కలుగుతోంది. నాకు తగిన సలహా చెప్పండి.
మీ ముఖం, చర్మం విషయంలో ఎలాంటి సమస్యా లేదంటున్నారు కాబట్టి మీరు టీవీ యాడ్స్ వలలో పడకుండా... మీ చర్మాన్ని కాపాడుకోడానికి కొన్ని జాగ్రత్తలు పాటిస్తే చాలు. సూర్యకిరణాల దుష్ప్రభావం నుంచి కాపాడుకోడానికి మీరు డాక్టర్ సూచించిన సన్‌స్క్రీన్ వాడితే చాలు. అలాగే ముఖాన్ని శుభ్రపరచుకోడానికి సోప్ ఫ్రీ క్లెన్సర్ వాడండి. ఇక చర్మం పొడిబారకుండా ఉండేందుకు మాయిష్చరైజర్ ఉపయోగించండి.
స్విమ్మింగ్ తర్వాత మాడుపై దురద!
నా వయసు 20 ఏళ్లు. నాకు స్విమ్మింగ్ అంటే ఇష్టం. ఈ మధ్య స్విమ్మింగ్ చేసిన తర్వాత మాడు బాగా దురదగా ఉంటోంది. చర్మం కూడా పొడిబారినట్లు నల్లగా మారుతోంది. ఎందుకిలా జరుగుతోంది?
స్విమ్మింగ్‌పూల్‌లో శానిటైజింగ్ కోసం కొన్ని రసాయనాలు (ఉదాహరణకు క్లోరిన్ వంటివి) వాడుతుంటారు. ఆ రసాయనాలు కొంతమందికి సరిపడవు. దాంతో అలర్జీలా వస్తుంటుంది. మరికొంతమందిలో చర్మం పొడిబారడం, మాడుపైన దురదలు రావడం మామూలే. మీరు స్విమ్మింగ్‌కు వెళ్లేముందు డాక్టర్ సూచించిన మెడికేటెడ్ మాయిష్చరైజర్ వాడితే, ఈ రసాయనాల ప్రభావం చర్మంపై పడకుండా చూసుకోవచ్చు. ఔట్‌డోర్ స్విమ్మింగ్‌పూల్స్‌లో ఉదయం పది నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు స్విమ్మింగ్ చేసినట్లయితే వాటర్ రెసిస్టెంట్ సన్‌స్క్రీన్ ఎస్‌పీఎఫ్ 50 ఉన్నది వాడటం సముచితం. ఇలా చేయడం వల్ల చర్మాన్ని సూర్యకిరణాల నుంచి సంరక్షించుకోవచ్చు. మాడు భాగం అంటే స్కాల్ప్‌కు స్విమ్మింగ్‌పూల్‌లోని నీళ్లు తగలకుండా ఉండేందుకు క్యాప్ వాడండి. అంతేగాక మైల్డ్ మెడికేటెడ్ షాంపూ అండ్ కండిషనర్ వాడటం ద్వారా జుట్టు పొడిబారకుండా కాపాడుకోవచ్చు.
డాక్టర్ సుభాషిణి జయం, చీఫ్ మెడికల్ కాస్మటాలజిస్ట్,
ఎన్‌ఛాంట్ మెడికల్ కాస్మటాలజీ క్లినిక్, శ్రీనగర్‌కాలనీ, హైదరాబాద్
Comments
Please login to add a commentAdd a comment