
అది చర్మం కాని చర్మం. అయితే అలాంటిలాంటి చర్మం కాదు. గాయాలను శరవేగంగా నయం చేసే చర్మం! ఎంతటి గాయాన్నయినా నాలుగే గంటల్లో 90 శాతం దాకా మాన్పుతుంది. 24 గంటల్లో పూర్తిగా నయం చేసేస్తుంది. వినడానికి ఏదో సైంటిఫిక్ థ్రిల్లర్ సినిమా కథలా అన్పిస్తున్నా అక్షరాలా నిజమిది. ఈ మాయా చర్మం అందుబాటులోకి వస్తే వైద్యచికిత్స కొత్తపుంతలు తొక్కడం ఖాయమని చెబుతున్నారు. అచ్చం చర్మాన్ని తలపించే కొత్త రకం హైడ్రోజెల్‌ను రూపొందించడంలో సైంటిస్టులు విజయవంతమయ్యారు.
చర్మానికి ఉండే స్వీయచికిత్స సామర్థ్యాన్ని ఇది ఎన్నో రెట్లు పెంచుతుందట. ఫిన్లండ్‌లోని ఆల్టో యూనివర్సిటీ, జర్మనీలోని బైరైట్ వర్సిటీలకు చెందిన పరిశోధకులు దీన్ని రూపొందించారు. నిజానికి ఇటువంటి విప్లవాత్మక ఆవిష్కరణ కోసం ప్రపంచవ్యాప్తంగా చాలా ఏళ్లుగా తీవ్రస్థాయిలో ప్రయత్నాలు జరుగుతూనే వస్తున్నాయి. కానీ అవేవీ ఇప్పటిదాకా అంతగా విజయవంతం కాలేదు. చర్మం తాలూకు విలక్షణతే అందుకు కారణం.
సాగే లక్షణం, దీర్ఘకాలిక మన్నిక, తీవ్ర ప్రతికూల పరిస్థితులను తట్టుకోగల సామర్థ్యం వంటి ఎన్నో ప్రత్యేకతలు చర్మం సొంతం. వీటన్నింటినీ మించి గాయాలను తనకు తాను నయం చేసుకునే సాటిలేని సామర్థ్యం చర్మానికి ఉంది. ఇన్ని లక్షణాలతో కూడిన కృత్రిమ చర్మం రూపకల్పన ఇన్నేళ్లుగా సైంటిస్టులకు సవాలుగానే నిలిచింది. తాజాగా రూపొందించిన హైడ్రోజెల్ మాత్రం పూర్తిగా చర్మం లక్షణాలను కలిగి ఉంటుంది. కాలిన, తెగిన గాయాలపై ఈ జెల్‌ను అమరిస్తే వాటిని చిటికెలో నయం చేస్తుంది. తర్వాత దాన్ని తొలగించవచ్చు. లేదంటే క్రమంగా అదే కరిగిపోతుంది.
ఇలా సాధించారు...
అతి పలుచనైన నానోషీట్‌తో రూపొందించిన పాలిమర్ సాయంతో కృత్రిమ చర్మం రూపకల్పన సాధ్యపడింది. మోనోమర్ పొడిని నీటితో కూడిన నానోషీట్లతో చాకచక్యంగా కలపడం ద్వారా అధ్యయన బృందంలోని శాస్త్రవేత్త చెన్ లియాంగ్ దీన్ని సాధించారు. తర్వాత ఈ మిశ్రమాన్ని యూవీ రేడియేషన్‌కు గురిచేయడంతో అందులోని అణువుల మధ్య ఆశించిన స్థాయిలో బంధం సాధ్యపడింది. ఫలితంగా చక్కని సాగే గుణమున్న చర్మంలాంటి హైడ్రోజెల్ రూపొందించింది.
‘‘అత్యంత హెచ్చు సామర్థ్యంతో కూడిన వ్యవస్థీకృత నిర్మాణం దీని సొంతం. హైడ్రోజెల్‌కు ఇది గట్టిదనం ఇవ్వడమే గాక గాయాల వంటివాటిని తనంత తానుగా నయం చేసుకోగల సామర్థ్యాన్ని కూడా కట్టబెట్టింది’’ అని అధ్యయన బృందం పేర్కొంది. ‘‘జీవకణాలు చూసేందుకు గట్టిగా ఉన్నా స్వీయచికిత్స సామర్థ్యంతో కూడి ఉంటాయి. సింథటిక్ హైడ్రోజెల్‌లో ఈ లక్షణాలను చొప్పించడం ఇప్పటిదాకా సవాలుగానే నిలిచింది. దాన్నిప్పుడు అధిగమించాం’’ అని వివరించింది. కృత్రిమ చర్మ పరిజ్ఞానంలో ఇది మైలురాయిగా నిలుస్తుందని పేర్కొంది.
‘‘కాలిన, దీర్ఘకాలిక గాయాలను సత్వరం నయం చేయడం ఇకపై మరింత సులువు కానుంది. అంతేగాక వైద్య చికిత్సలోనే గాక ప్రోస్తటిక్స్, సాఫ్ట్ రోబోటిక్స్ తదితర రంగాల్లో కూడా ఇది ఉపయుక్తం కానుంది’’ అని వివరించింది. మిల్లీమీటర్ మందంలోని జెల్‌లో దాదాపు 10 వేల నానోïÙట్లుంటాయి. ఫలితంగా దానికి గట్టిదనంతో పాటు సాగే గుణం కూడా ఉంటుంది. ఈ మిరాకిల్ జెల్ ప్రస్తుతానికి ప్రయోగ దశలోనే ఉంది. వైద్యపరంగా పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చేందుకు మరో ఐదేళ్లకు పైగా పట్టవచ్చు. అధ్యయన వివరాలు ప్రతిష్టాత్మక జర్నల్ నేచర్ మెటీరియల్ తాజా సంచికలో ప్రచురితమయ్యాయి.
ఏమిటీ హైడ్రోజెల్
సింపుల్‌గా చెప్పాలంటే ఇది జెల్ వంటి మృదువుగా ఉండే పదార్థం. దీన్ని పాలిమర్ తదితర మెటీరియల్స్‌తో తయారు చేస్తారు. వెంట్రుకల చికిత్స మొదలుకుని ఆహారోత్పత్తుల దాకా దాదాపు అన్నింట్లోనూ వీటిని విస్తృతంగా వాడుతున్నారు.
– సాక్షి, నేషనల్ డెస్క్
Comments
Please login to add a commentAdd a comment