వేప మేలు వేవేలు | beauty tips | Sakshi
Sakshi News home page

వేప మేలు వేవేలు

Published Fri, Oct 23 2015 11:45 PM | Last Updated on Fri, May 25 2018 2:29 PM

beauty tips

బ్యూటిప్స్

వేప చెట్టు ఇంటి దగ్గర్లో ఉంటే వేరే సౌందర్య సాధనాలతో పనే ఉండదు. వేపాకులు, బెరడు, వేపనూనె ఔషధాలుగానే కాదు, సౌందర్య సాధనాలుగానూ ఉపయోగపడతాయి. ఎలాంటి చర్మ సమస్యలకైనా వేపతో ఇట్టే చెక్ పెట్టేయవచ్చు.
     
ముఖంపై మొటిమలు, నల్లమచ్చలు ఏర్పడుతుంటే వేపాకులతో చక్కని విరుగుడు ఉంది. గుప్పెడు వేపాకులను అరలీటరు నీటిలో వేయాలి. వేపాకులు పూర్తిగా మెత్తగా మారిపోయేంత వరకు ఆ నీటిని మరిగించాలి. కాసేపటికి నీరు ఆకుపచ్చ రంగులోకి మారుతుంది. అప్పుడు వడగట్టి ఆ కషాయాన్ని సీసాలో భద్రపరచుకోవాలి. ప్రతిరోజూ రాత్రి పడుకునే ముందు ఆ నీటితో కాస్త దూదిని తడిపి ముఖాన్ని రుద్దుకుంటే చాలు. మొటిమలు, మచ్చలు మటుమాయం అవుతాయి.

ఒళ్లంతా చర్మం పొడిబారి, తరచు దురదలు పెడుతున్నట్లయితే, పైన చెప్పుకున్నట్లే వేపాకులతో కషాయం చేసి, బకెట్ నీటిలో ఒక కప్పు కషాయాన్ని పోసి ఆ నీటిని స్నానానికి ఉపయోగిస్తే చాలు, కొద్ది రోజుల్లోనే చర్మం ఆరోగ్యకరంగా మారుతుంది.

ఎండ తాకిడికి ముఖం కళతప్పినట్లుగా మారితే, వేపాకులను, గులాబీ రేకులను ఎండబెట్టి పొడిగా చేసుకోవాలి. రెండు చెంచాల పొడికి, చెంచాడు పెరుగు కలిపి, అందులో కొద్దిగా నిమ్మరసం పిండి ముఖానికి పట్టించుకోవాలి. అరగంట సేపు ఆరనిచ్చాక ముఖాన్ని చన్నీటితో కడిగేసుకోవాలి. ఇలా తరచు చేస్తుంటే ముఖానికి తిరిగి కళాకాంతులు వస్తాయి.

ముఖం తరచు జిడ్డుగా మారుతుంటే, వేపాకుల పొడి, గంధం పొడి, గులాబి రేకుల పొడి సమభాగాలుగా తీసుకుని కలుపుకోవాలి. చెంచాడు పొడిలో మూడు నాలుగు చుక్కల వేపనూనె, కొద్దిగా తేనె, నిమ్మరసం పిండుకుని ముద్దలా కలుపుకోవాలి. దానిని ముఖానికి పట్టించి, అరగంటసేపు ఆరనివ్వాలి. పూర్తిగా ఆరిన తర్వాత గోరువెచ్చని నీటితో కడిగేయాలి. ఇలా చేస్తే ముఖం తాజాగా మారుతుంది.
 
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement