స్పీడ్‌గన్ వినియోగంతో వాహనాల వేగాన్ని గుర్తిస్తున్న ఎంవీఐ మధుసూదన్
అనంతపురం సెంట్రల్: విస్తీర్ణంలో అతిపెద్ద జిల్లా అయిన అనంతపురంలో ప్రధానమైన రహదారులు వెళుతున్నాయి. ముఖ్యంగా జాతీయ రహదారి 44 యాడికి నుంచి పెనుకొండ సమీపంలోని కొడికొండ చెక్‌పోస్టు వరకు ఉంది. దీంతో పాటు అనంతపురం–కదిరి–మదనపల్లి జాతీయరహదారి 42, బళ్లారి జాతీయ రహదారి 67, రాష్ట్ర రహదారులు, పంచాయతీ రోడ్లు వేలాది కిలోమీటర్లు పొడువునా ఉన్నాయి. తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాలకు కలిపే రోడ్లు జిల్లా మీదుగా ప్రయాణించాల్సి ఉంటుంది. దీంతో జాతీయ, రాష్ట్ర రహదారులపై నిత్యం వేలాది వాహనాలు రాకపోకలు సాగిస్తున్నాయి. రోజూ ఎక్కడో ఒక చోట రోడ్డు ప్రమాదాల రూపంలో ప్రజల ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి. మనిషి బిజీలైఫ్‌లో ప్రయాణ షెడ్యూల్స్ కూడా అంతే బిజీగా ఉంటున్నాయి. ఐదు గంటల్లో హైదరాబాద్‌కు... నాలుగు గంటల్లో బెంగుళూరుకు పోయేలా వాహనాలను నడుపుతున్నారు. జాతీయ రహదారులపై కనీసం 120 నుంచి 150 కిలోమీటర్ల పైగా వేగంతో వాహనాలు నడుపుతున్నారు. ఆ వేగానికి తగ్గుట్టుగా రహదారులు లేవనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. దీంతో అదుపుతప్పి ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి.
156 బ్లాక్‌స్పాట్స్
జిల్లాలో అన్ని రహదారుల్లో మొత్తం 156 బ్లాక్‌స్పాట్స్ (ప్రమాద స్థలాలు) గుర్తించారంటే పరిస్థితి ఏవిధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. అధికారులు గుర్తించనివేకాకుండా అనేక ప్రాంతాలు మృత్యుపిలుపులుగా మారాయి. ఆయా ప్రదేశాల్లో అధికారులు ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోవాల్సి ఉంది. అయితే ఆ దిశగా చర్యలు లేవనే విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రమాదం జరిగితే.. స్పీడు బ్రేకరు వేస్తే సరిపోతుందనే భావనలో అధికారులు ఉన్నారు. కానీ ముందే హెచ్చరిక బోర్డులు ఏర్పాటు, ప్రత్యామ్నాయ చర్యలు తీసుకొని బ్లాక్‌స్పాట్స్ నివారించడంపై పెద్దగా దృష్టి సారించడం లేదని అభిప్రాయం వ్యక్తమవుతోంది.
పనిచేయని పంచసూత్రాలు
రోడ్డు ప్రమాదాలు నివారణకు ఎస్పీ జీవీజీ అశోక్‌కుమార్ బాధ్యతలు చేపట్టాక గట్టి చర్యలు చేపడుతున్నారు. ముఖ్యంగా ‘పంచసూత్రాలు’ పేరుతో హెల్మెట్, సీటు బెల్టు వినియోగం, పరిమితికి మించి ప్రయాణికులను తరలించరాదని, మద్యం తాగి, సెల్‌ఫోన్‌లో మాట్లాడుతూ డ్రైవింగ్ చేయరాదని ఆంక్షలు విధించారు. ఎక్కువశాతం మంది పోలీసులు రహదారి భద్రతపైనే దృష్టి సారించేలా ఆదేశాలు జారీ చేశారు. వీఆర్‌లో ఉన్న ఉద్యోగులను రోడ్డు సేఫ్టీ వి«ధులకు వినియోగిస్తున్నారు. అయితే ఎక్కువమంది పోలీసులు జరిమానాలు విధించడంపైనే దృష్టి సారిస్తున్నారు తప్ప ప్రమాదాల నివారణకు జాగ్రత్తలు తీసుకోలేదనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ద్విచక్రవాహనదారులపై వేసే జరిమానాలు... కార్లు, ఇతర నాలుగు చక్రాల వాహనాలపై వేయలేకపోతున్నారనే అభిప్రాయం వినిపిస్తోంది.
పరిమితికి మించి తరలిస్తే చర్యలు
అనంతపురం సెంట్రల్: పరిమితికి మించి ప్రయాణికులను తరలించే వాహనదారులపై చర్యలు తీసుకుంటామని ఎస్పీ జీవీజీ అశోక్‌కుమార్ హెచ్చరించారు. ప్రధానంగా గూడ్స్‌వాహనాలైన లారీలు, ట్రాక్టర్లు, 407 వ్యాన్లు తదితర లగేజీ వాహనాల్లో ప్రజలను తరలించకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రస్తుతం శుభకార్యాలు జరుగుతున్న నేపథ్యంలో ప్రజలను తరలించేందుకు గూడ్సు వాహనాలు వినియోగిస్తున్నారని వివరించారు. పెనుకొండ పరిధిలో రెండు రోజుల క్రితం జరిగిన ప్రమాదం కూడా ఈ కోవకు చెందినదేనని తెలిపారు. రోడ్డు ప్రమాదాల నియంత్రణ కోసం జిల్లాలో ‘పంచ సూత్రాలు’ అమలు చేయాలన్నారు. ముందస్తు చర్యలు చేపట్టి రోడ్డు భద్రత ప్రాముఖ్యతను తెలియజేయాలన్నారు. గత వారంలో నిబంధనలు ఉల్లంఘించిన 5469 మందికి కౌన్సెలింగ్ ఇచ్చినట్లు వెల్లడించారు. 3,621 మందిపై కేసులు నమోదు చేసినట్లు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment