సాక్షి, హైదరాబాద్ : తరచూ ప్రమాదాలు జరుగుతున్న రోడ్లపై పోలీస్ శాఖ ఫోకస్ పెట్టింది. ఎక్కువగా ప్రమాదాలు జరుగుతున్న ప్రదేశాలను బ్లాక్‌స్పాట్స్‌గా గుర్తించి నియంత్రణకు చర్యలు తీసుకుంటోంది. రాష్ట్రవ్యాప్తంగా పోలీస్‌తోపాటు రోడ్లు, భవనాలు, ఆరోగ్య, స్థానిక మున్సిపల్‌శాఖ అధికారుల సమన్వయంతో తాత్కాలిక, శాశ్వత ప్రాతిపదికన చర్యలు తీసుకుంటున్నారు.
గతంలో ఎక్కువ రోడ్డు ప్రమాదాలు జరిగిన ప్రాంతంలో.. మరోమారు ప్రమాదాలకు తావులేకుండా తీసుకుంటున్న చర్యలు ఫలిస్తే.. కొంత కాలం తర్వాత ఆ ప్రదేశాన్ని బ్లాక్ స్పాట్ జాబితాలోంచి తొలగిస్తున్నట్టు అడిషనల్ డీజీ శివధర్‌రెడ్డి తెలిపారు. అందుబాటులో ఉన్న గణాంకాల ప్రకారం.. 2019 నుంచి 2021 వరకు రాష్ట్రవ్యాప్తంగా 1,002 బ్లాక్‌స్పాట్స్‌ను గుర్తించారు. 2022 నాటికి వాటి సంఖ్య 951కి తగ్గింది.
బ్లాక్ స్పాట్లలో రోడ్డు ప్రమాదానికి కారణం రోడ్డు మలుపు లేదా ఇరుకుగా ఉండటం అయితే.. వెంటనే ఆ ప్రాంతంలో స్థలాన్ని కొనుగోలు చేసి రోడ్డు వెడల్పు చేయడం, లేదా మూల మలుపు ప్రమాదకరంగా లేకుండా మార్చడం వంటి ఇంజనీరింగ్ చర్యలతో సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతారు. ఇవన్నీ 3 నెలల్లో పూర్తి చేయాల్సి ఉంటుంది. బ్లాక్ స్పాట్లలో రోడ్డు సరిగా కనిపించేలా మార్కింగ్‌లు పెట్టడం.. వాహన వేగాన్ని నియంత్రించేందుకు స్పీడ్ బ్రేకర్స్ వేయడం, గుంతలు పూడ్చడం వంటి తాత్కాలిక చర్యలను తీసుకుంటారు.
బ్లాక్ స్పాట్ అంటే..?
బ్లాక్ స్పాట్లను రెండు విధాలుగా గుర్తిస్తారు. ఏదైనా రోడ్డులో 500 మీటర్ల పరిధిలో గత మూడేళ్లలో ఐదుకు మించి రోడ్డు ప్రమాదాలు జరిగితే దాన్ని బ్లాక్ స్పాట్‌గా గుర్తిస్తారు. ఏదైనా రోడ్డులో 500 మీటర్ల పరిధిలో జరిగిన ప్రమాదంలో పది మంది కంటే ఎక్కువ మంది చనిపోయినా (అక్కడ జరిగిన ప్రమాదాల సంఖ్యతో సంబంధం లేకుండా) ఆ ప్రాంతాన్ని బ్లాక్ స్పాట్‌గా పరిగణిస్తారు.
Comments
Please login to add a commentAdd a comment