
పెండింగ్‌లోనే మగ్గుతున్న 2.91లక్షల ప్రజా వినతులు
వినతుల పరిష్కారంలో పోలీసుశాఖ తీరుపై 70శాతం అసంతృప్తి
చాలా శాఖల తీరుపై 50 శాతానికి పైగా పెదవి విరుపు
పిటీషనర్ల వద్దకు వెళ్లని రెవెన్యూ అధికారులు
భూ ఆక్రమణ వినతులకు ఎండార్స్‌మెంట్‌తో సరి
నెలలు గడిచినా ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదు
సాక్షి, అమరావతి: ప్రజా వినతులకు సరైన పరిష్కారం చూపకుండా ప్రభుత్వం మ..మ.. అనిపిస్తోంది. నామమాత్రపు చర్యలతో సరిపెడుతోంది. చాలా వినతులను అసలు పట్టించుకోవడం లేదు. దీంతో ప్రజా వినతుల పరిష్కారంపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. ఇటీవల మంత్రులు, కార్యదర్శులతో ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్వహించిన సమావేశంలో ప్రజా వినతులను పరిష్కరిస్తున్న తీరు సక్రమంగా లేదని ప్రకటించారు.
గత ఏడాది జూలై 15 నుంచి ఈ ఏడాది ఫిబ్రవరి 6వ తేదీ వరకు 7.42 లక్షల ప్రజా వినతులు రాగా, అందులో ఇంకా 2.91 లక్షలు పెండింగ్‌లోనే మగ్గుతున్నాయి. మరోవైపు కొన్ని వినతులు పరిష్కరించినట్లు చెబుతున్నప్పటికీ అందులో వాస్తవం ఉండటం లేదని ప్రభుత్వ అధ్యయనంలోనే తేలింది.
ప్రజా వినతుల పరిష్కార పరిస్థితి ఇదీ...
» పోలీసు శాఖ ప్రజా వినతులను పరిష్కరిస్తున్న తీరుపై 70 శాతం అర్జీదారులు అసంతృప్తి చేశారు.
» మున్సిపల్ శాఖపై 69 శాతం మంది అసంతృప్తి.
» స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖపై 67 శాతం సంతృప్తి వ్యక్తమైంది.
» రెవెన్యూ శాఖలోను 60 శాతం అసంతృప్తి వ్యక్తంచేశారు. అత్యధికంగా రెవెన్యూలో మ్యుటేషన్, విస్తీర్ణంలో తేడాలపై సర్వే సెటిల్మెంట్, రెవెన్యూ రికార్డుల్లో ఎంట్రీల సరవణలు, భూ కమతాల పంపిణీ, పట్టాదారు పాస్‌పుస్తకాల గురించి వినతులు వస్తున్నాయి. వీటిలో ఎక్కువగా సంబంధిత వీఆర్వోలకు బదిలీ చేస్తున్నారు. వీఆర్వో నివేదిక ఆధారంగా అధికారులు ఎండార్స్ చేసి అప్‌లోడ్ చేస్తున్నారు. కొన్ని కేసుల్లో పిటీషనర్ల దగ్గరకు వెళ్లడం లేదు. ప్రాథమిక విచారణ చేయడం లేదు.
» ప్రభుత్వ భూముల ఆక్రమణలకు సంబంధించిన కొన్ని కేసుల్లో అధికారులు చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని ఎండార్స్‌మెంట్లు ఇస్తున్నారు. కానీ, చాలా కేసుల్లో నెలలు గడిచినా ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదు. కొన్ని ఫిర్యాదులను అప్‌లోడ్ చేయడం ద్వారా తదుపరి చర్యలు తీసుకోవడానికి ఉన్నతాధికారులకు నివేదిక సమర్పించినట్లు పేర్కొంటున్నారు. అటువంటి వాటిపై నెలలు గడుస్తున్నా తదుపరి చర్యలు తీసుకోవడం లేదు.
» అర్జీదారుల వినతి, ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు కొన్నిచోట్ల ఫిర్యాదులను తిరిగి తెరిచినా సరైన చర్యలు తీసుకోవడం లేదు.
» వినతుల పరిష్కారం పట్ల సంతృప్త స్థాయి శాఖల వారీగా చేసిన సర్వేకు, సీఎంవో చేసిన సర్వేకు మధ్య చాలా వ్యత్యాసం ఉన్నట్లు తేలింది. సీఎంవో నిర్వహించి సర్వేలో ఎక్కువ శాఖల్లో ప్రజల వినతుల పరిష్కారం పట్ల సంతృప్త స్థాయి చాలా తక్కువగా ఉన్నట్లు గుర్తించారు.
Comments
Please login to add a commentAdd a comment