
సాక్షి, హైదరాబాద్: రోడ్డు ప్రమాద మృతుల్లో ఎక్కువగా ద్విచక్ర వాహనదారులే ఉంటున్నట్లు గణాంకాలు వెల్లడిస్తుండటం... కొన్ని సందర్భాల్లో వాహనదారులు హెల్మెట్ ధరించినా వెనుక కూర్చొనే వ్యక్తులకు (పిలియన్ రైడర్) హెల్మెట్ లేక ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోతుండటంతో ఈ తరహా ప్రమాదాలను నివారించాలని పోలీసులు భావిస్తున్నారు.
వాహనదారుడితోపాటు వెనుక కూర్చొనే వారు సైతం హెల్మెట్ ధరించేలా ప్రోత్సహించేందుకు సరికొత్త ప్రతిపాదనతో ముందుకు వెళ్లనున్నారు. ద్విచక్ర వాహనం కొనుగోలు సమయంలోనే రెండు నాణ్యమైనహెల్మెట్‌లను కొనడాన్ని తప్పనిసరి చేస్తే మరింత ఫలితం ఉంటుందని యోచిస్తున్నారు.
నూతన ద్విచక్ర వాహన ధరతోపాటు రెండు నాణ్యమైన హెల్మెట్ల ధరను సైతం జోడించి షోరూంలు విక్రయించేలా చూడాలనే ప్రతిపాదనను ప్రభుత్వానికి పంపాలనుకుంటున్నట్లు ఓ పోలీసు ఉన్నతాధికారి తెలిపారు. దీన్ని అమలు చేసేలా రవాణా శాఖకు ఆదేశాలు ఇవ్వాలని పోలీసు శాఖ తరఫున కోరనున్నట్లు చెప్పారు. ఇలా రెండు హెల్మెట్ల వాడకం క్రమంగా పెరిగితే రోడ్డు ప్రమాదాలు జరిగినా ద్విచక్రవాహనదారుల ప్రాణాలు సురక్షితంగా ఉంటాయని ఆ అధికారి పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment