యాదమ్మ (ఫైల్), నర్సమ్మ (ఫైల్)
మెదక్‌జోన్: నిద్రమత్తులో నిర్లక్ష్యంగా కారు నడిపిన ఓ వ్యక్తి రెండు నిండు ప్రాణాలను బలిగొన్నాడు. ఈ ఘటనలో మరో ముగ్గురు గాయపడ్డారు. శనివారం తెల్లవారుజామున 5 గంటల ప్రాంతంలో మెదక్ పట్టణంలో ఈ దుర్ఘటన జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. మెదక్ పట్టణంలోని దాయర వీధికి చెందిన సంగాయిపేట యాదమ్మ(48), పద్మగల్ల నర్సమ్మ (52), విజయ ముగ్గురూ మెదక్ మున్సిపాలిటీలో పారిశుధ్య కార్మికులుగా పని చేస్తున్నారు. రోజు మాదిరిగానే శనివారం తెల్లవారు జామున మున్సిపాలిటీ కార్యాలయం సమీపంలో రోడ్లను ఊడ్చే పనిలో నిమగ్నమయ్యారు.
అదే సమయంలో పక్కనే ఉన్న పెట్రోల్ పంపులో స్వీపర్లుగా పని చేస్తున్న మరియమ్మ, శాంతమ్మ అక్కడే ఉన్నారు. ఈ క్రమంలో కొల్చారం మండలం వరిగుంతం తండాకు చెందిన సురేశ్ కుటుంబీకులతో కలసి నిజామాబాద్ జిల్లా అర్మూర్ నుంచి స్వగ్రామానికి కారులో వస్తున్నాడు. నిద్రమత్తులో కారును వేగంగా నడుపుతూ పెట్రోల్ పంపు వద్ద ఉన్న ఐదుగురిని వెనుక నుంచి ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో యాదమ్మ, నర్సమ్మ అక్కడికక్కడే మృతి చెందారు.
విజయ, శాంతమ్మ తీవ్రంగా గాయపడ్డారు. వీరి పరిస్థితి విషమంగా ఉండటంతో చికిత్స నిమిత్తం హైదరాబాద్‌కు తరలించారు. మరియమ్మ స్వల్ప గాయాలతో మెదక్ జిల్లా కేంద్ర ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. నిర్లక్ష్యంగా కారు నడిపిన సురేశ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కస్టడీలో ఉన్న సురేశ్ మీడియాతో మాట్లాడుతూ.. ప్రమాదం జరిగే వరకు తనకు తెలియలేదని, శుక్రవారం రాత్రి సరిగా నిద్ర లేకపోవడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని చెప్పాడు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పట్టణ సీఐ మధు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment