medak municipality
-
నిండు ప్రాణాలను బలిగొన్న నిద్రమత్తు
మెదక్‌జోన్: నిద్రమత్తులో నిర్లక్ష్యంగా కారు నడిపిన ఓ వ్యక్తి రెండు నిండు ప్రాణాలను బలిగొన్నాడు. ఈ ఘటనలో మరో ముగ్గురు గాయపడ్డారు. శనివారం తెల్లవారుజామున 5 గంటల ప్రాంతంలో మెదక్ పట్టణంలో ఈ దుర్ఘటన జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. మెదక్ పట్టణంలోని దాయర వీధికి చెందిన సంగాయిపేట యాదమ్మ(48), పద్మగల్ల నర్సమ్మ (52), విజయ ముగ్గురూ మెదక్ మున్సిపాలిటీలో పారిశుధ్య కార్మికులుగా పని చేస్తున్నారు. రోజు మాదిరిగానే శనివారం తెల్లవారు జామున మున్సిపాలిటీ కార్యాలయం సమీపంలో రోడ్లను ఊడ్చే పనిలో నిమగ్నమయ్యారు. అదే సమయంలో పక్కనే ఉన్న పెట్రోల్ పంపులో స్వీపర్లుగా పని చేస్తున్న మరియమ్మ, శాంతమ్మ అక్కడే ఉన్నారు. ఈ క్రమంలో కొల్చారం మండలం వరిగుంతం తండాకు చెందిన సురేశ్ కుటుంబీకులతో కలసి నిజామాబాద్ జిల్లా అర్మూర్ నుంచి స్వగ్రామానికి కారులో వస్తున్నాడు. నిద్రమత్తులో కారును వేగంగా నడుపుతూ పెట్రోల్ పంపు వద్ద ఉన్న ఐదుగురిని వెనుక నుంచి ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో యాదమ్మ, నర్సమ్మ అక్కడికక్కడే మృతి చెందారు. విజయ, శాంతమ్మ తీవ్రంగా గాయపడ్డారు. వీరి పరిస్థితి విషమంగా ఉండటంతో చికిత్స నిమిత్తం హైదరాబాద్‌కు తరలించారు. మరియమ్మ స్వల్ప గాయాలతో మెదక్ జిల్లా కేంద్ర ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. నిర్లక్ష్యంగా కారు నడిపిన సురేశ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కస్టడీలో ఉన్న సురేశ్ మీడియాతో మాట్లాడుతూ.. ప్రమాదం జరిగే వరకు తనకు తెలియలేదని, శుక్రవారం రాత్రి సరిగా నిద్ర లేకపోవడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని చెప్పాడు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పట్టణ సీఐ మధు తెలిపారు. -
టీఆర్ఎస్ నుంచి మురళీయాదవ్ సస్పెన్షన్
మెదక్ మున్సిపాలిటీ: నర్సాపూర్ మున్సిపల్ చైర్మన్ మురళీయాదవ్‌ను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు జిల్లా అధ్యక్షురాలు, ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి తెలిపారు. శనివారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడారు. నర్సాపూర్ మున్సిపల్ చైర్మన్ మురళి పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడటం సరికాదన్నారు. పార్టీ ఇప్పటికే ఆయన భార్యకు ఉమ్మడి జిల్లా జడ్పీ చైర్పర్సన్ పదవి, ఆయనకు మున్సిపల్ చైర్మన్ పదవి, పార్టీ జిల్లా అధ్యక్ష పదవి కట్టబెట్టిందని గుర్తు చేశారు. చదవండి: 34 ఏళ్లు పనిచేసినా హోంగార్డు.. ఎస్పీ అవుతాడా? -
బల్దియాపై ‘నజర్’
అవినీతి, అక్రమాలకు కేరాఫ్‌గా నిలిచిన మెదక్ మున్సిపాలిటీపై ఏసీబీ నజర్ వేసింది. మ్యుటేషన్లో అక్రమాలకు సంబంధించి ‘సాక్షి’లో ఇటీవల ‘మున్సిపాలిటీలో మాయ’ శీర్షికన కథనం ప్రచురితమైన విషయం తెలిసిందే. దీంతోపాటు మెదక్ బల్దియాపై గతంలో అవినీతి ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో ఇంటెలిజెన్స్‌తోపాటు అవినీతి నిరోధకశాఖ అధికారులు దృష్టిసారించినట్లు తెలుస్తోంది. మరోవైపు గత నెలలో పలువురు ఏసీబీ అధికారులు మెదక్‌కు స్వయంగా వచ్చి గుట్టుచప్పుడు కాకుండా విచారణ చేపట్టినట్లు సమాచారం. వారు ఎందుకోసం వచ్చారు, దేనిపైనా విచారణ చేశారు. వంటి అంశాలు మాత్రం వెలుగులోకి రాలేదు. సాక్షి, మెదక్: మ్యుటేషన్లలో పలువురు మున్సిపల్ రెవెన్యూ అధికారుల దందాపై ఫిర్యాదులు అందడంతోనే ఏసీబీ అధికారులు వచ్చారనే చర్చ జిల్లాలో జోరుగా సాగుతోంది. తాజాగా ఇటీవల అక్రమ మ్యుటేషన్ల వ్యవహారం వెలుగులోకి వచ్చిన క్రమంలో కమిషనర్ బదిలీ కావడం.. ఏసీబీ, ఇంటెలిజెన్స్ అధికారుల ఆరా.. వంటి సంఘటనలు బల్దియా వర్గాల్లో గుబులు రేపుతున్నాయి. రెవెన్యూ విభాగం టార్గెట్‌గా.. మెదక్ మున్సిపాలిటీ పరిధిలో కోట్లాది రూపాయల విలువైన భూములు ఉండగా.. రియల్ వ్యాపారం జోరుగా సాగుతోంది. ఈ క్రమంలో నాలుగైదేళ్లుగా మ్యుటేషన్లకు సంబంధించి దందా కొనసాగుతోంది. అవినీతికి అలవాటు పడిన పలువురు మున్సిపల్ రెవెన్యూ విభాగం అధికారులు పనికోరేటు చొప్పున ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. అన్ని సరిగ్గా ఉన్న పక్షంలో మ్యుటేషన్‌కు ఒక రేట్ ఫిక్స్ చేసి వసూలు చేసేవారని వినికిడి. ఇదేక్రమంలో పలు భూములకు సంబంధించి లొసుగులను ఆసరాగా చేసుకుని దందా నడిపించినట్లు తెలుస్తోంది. ఎలాంటి పత్రాలు లేకున్నా.. అన్నీ తామై వ్యవహరించి చక్కబెట్టినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో కొందరు బాధితులు ఏసీబీని ఆశ్రయించినట్లు సమాచారం. రెవెన్యూ విభాగం టార్గెట్‌గా పథకం ప్రకారం అవినీతి నిరోధక శాఖ అధికారులు గత నెలలో మెదక్‌కు రాగా.. ఈ సమాచారం లీక్ అయినట్లు తెలుస్తోంది. దీంతో ఆ రోజు అధికారులు తప్పించుకున్నట్లు సమాచారం. దొంగచాటు మ్యుటేషన్లతో.. తాజాగా ఇటీవల మాన్యువల్‌లో ఒకరి పేరు.. ఆన్లైన్లో మరొకరి పేరుతో మ్యుటేషన్ చేయగా వెలుగులోకి వచ్చింది. నిబంధనల ప్రకారం ప్రజెంట్ ఆక్యుపయ్యర్ పేరు మీద ఉన్న ఇంటిని మరొకరి పేరుపై మార్పిడి చేయడానికి వీల్లేదు. కానీ.. అంతా జరిగిపోయింది. అధికారులే సూత్రధారులుగా నిలిచిన ఈ వ్యవహారంలో చాలా మొత్తంలో డబ్బులు చేతులు మారినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఏసీబీ మళ్లీ దృష్టిసారించినట్లు తెలుస్తోంది. మరోవైపు మున్సిపాలిటీ పరిధిలో ఎలాంటి పత్రాలు లేని ఇళ్లు చాలా ఉన్నట్లు అధికారిక వర్గాల సమాచారం. ఎలాంటి పత్రాలు లేకుండా కేవలం కరెంట్, నల్లా కనెక్షన్లు తీసుకున్న అందరినీ అధికారులు ప్రజెంట్ ఆక్యుపయ్యర్‌లో పెట్టారు. వీటిలో సైతం దొంగచాటు మ్యుటేషన్ల బాగోతమే నడిచినట్లు చర్చ జరుగుతోంది. ఈ క్రమంలో ఇంటెలిజెన్స్ అధికారులు సైతం రంగంలోకి దిగి ఆరా తీస్తున్నట్లు తెలిసింది. కలెక్టర్ దృష్టి సారించేనా..? అక్రమ మ్యుటేషన్ల బాగోతం వెలుగులోకి వచ్చినా.. ఉన్నతాధికారులు నామమాత్రంగా వ్యవహరిస్తుండడంపై ప్రజల్లో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అప్పటి రెవెన్యూ అధికారులకు కేవలం మెమోలు జారీ చేసి.. చేతులు దులుపుకోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఏసీబీ, ఇంటెలిజెన్స్ రంగంలోకి దిగిన నేపథ్యంలో మున్సిపాలిటీ ప్రత్యేకాధికారి, కలెక్టర్ ధర్మారెడ్డి ఇప్పటికైనా ప్రత్యేక దృష్టి సారించి అక్రమార్కులపై వేటు వేయాలని ప్రజలు కోరుతున్నారు. -
పైసా ఉంటే ఏ పనైనా..
సాక్షి, మెదక్: మెదక్ మున్సిపాలిటీ అవినీతికి కేరాఫ్‌గా నిలుస్తోంది. గతంలో ఆసరా పింఛన్లు, అక్రమ లేఅవుట్ల వంటి పలురకాల కుంభకోణాలు వెలుగుచూడగా.. తాజాగా బల్దియాలోని రెవెన్యూ విభాగం మాయాజాలం బయటపడింది. పట్టణ పరిధిలో లక్షలాది రూపాయలు విలువచేసే ఓ ఇంటికి దొంగచాటుగా మ్యూటేషన్ చేశారు. అధికారులే సూత్రధారులుగా నిలిచిన ఈ వ్యవహారంలో చాలా మొత్తంలో డబ్బులు చేతులు మారినట్లు తెలుస్తోంది. మెదక్ పట్టణ పరిధిలోని వడ్డెర కాలనీలోని ఓ ఖాళీ స్థలంలో ఆరు సంవత్సరాల క్రితం బోదాసు నాగమ్మ అనే మహిళ రేకుల ఇల్లు నిర్మించుకొని జీవిస్తోంది. ఈ భూమికి సంబంధించి ఎలాంటి పత్రాలు లేవు. ఈ క్రమంలో 2012–13లో ఇంటి నంబర్ కోసం మున్సిపాలిటీలో దరఖాస్తు చేసుకుంది. అధికారులు పరిశీలించి ఇంటి నంబర్ 1–10–82/1ను కేటాయించారు. ఆ తర్వాత ఆమె కరెంట్ కనెక్షన్ తీసుకుంది. ఈ ఇంటికి మాత్రమే ఆమె కబ్జాదారుగా(ప్రజెంట్ ఆక్యుపై) ఉన్నారు. మున్సిపల్ నిబంధనల ప్రకారం ఎలాంటి పత్రాలు లేని ఇల్లు, భూమిని విక్రయించొద్దు. ఆమెకు కేవలం కరెంట్ కనెక్షన్ కోసమే ఇంటి నంబర్ కేటాయించారు. మరొకరి చేతికి.. మున్సిపాలిటీ రికార్డుల ప్రకారం బోదాసు నాగమ్మ ఆ ఇంటికి కబ్జాదారు మాత్రమే. సదరు భూమి, ఇల్లుకు సంబంధించి ఎలాంటి అమ్మకాలు చేయరాదు. ఇందుకనుగుణంగా ఆమె పెట్టుకున్న అర్జీ మేరకు మున్సిపల్ రెవెన్యూ అధికారులు మ్యానువల్ రికార్డులో ఆమె పేరుతో ఇంటినంబర్ కేటాయించారు. రికార్డులో ప్రజెంట్ అక్యుపయ్యర్(కబ్జాదారు మాత్రమే) అని స్పష్టంగా పేర్కొన్నారు. ఈ క్రమంలో బోదాసు నాగమ్మ నిబంధనలకు విరుద్ధంగా మరో మహిళ గిరిగల్ల సుజాతకు విక్రయించారు. పేరు తారుమారు.. భారీగా ఆమ్యామ్యాలు ఈ ఇల్లుకు సంబంధించి మ్యానువల్‌గా బోదాసు నాగమ్మ పేరు ఉండగా.. ఆన్లైన్లో మాత్రం వేరే వారి పేరు ఉంది. 2016కు ముందు మున్సిపాలిటీ కార్యకలాపాలు మ్యానువల్‌గా సాగేవి. ఆ తర్వాత కంప్యూటరీకరణతో అంతా ఆన్లైన్లోనే సాగుతోంది. 2012–13లో సదరు ఇల్లు బోదాసు నాగమ్మ పేరు మీద ఉండగా.. 2018కి వచ్చే సరికి ఆన్లైన్లో ఆ భూమి గిరిగల్ల సుజాత పేరు మీదకు మారింది. ఆన్లైన్ రికార్డులను పరిశీలిస్తే 2018 మే 31న ఈ ఇల్లును సుజాత పేరు మీద మార్పిడి చేసినట్లు స్పష్టమవుతోంది. ప్రజెంట్ ఆక్యుపయ్యర్ పేరు మీద ఉన్న ఇంటిని ఇతరుల పేరిట చేయడానికి వీల్లేదు. కానీ.. అధికారులు నిబంధనలకు విరుద్ధంగా వేరే వారి పేరుపై చేయడం అనుమానాలకు తావిస్తోంది. ఇక్కడే పెద్ద ఎత్తున డబ్బులు చేతులు మారినట్లు తెలుస్తోంది. ఇలాంటివి ఇంకెన్నో.. మ్యానువల్‌లో నాగమ్మ పేరు ఉండగా.. ఆన్లైన్లో గిరిగల్ల సుజాత పేరు ఉండడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పట్టణ పరిధిలో విలువైన భూమి కావడం.. దీనికి సంబంధించి లొసుగులు ఉండడంతో మున్సిపాలిటీలో అవినీతికి అలవాటు పడిన పలువురు అధికారులు సూత్రధారులుగా వ్యవహరించి అన్నీ చక్కబెట్టినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. లక్షలాది రూపాయల విలువైన భూమిని ఇతరులకు కట్టబెట్టి వారి నుంచి సుమారు పెద్ద ఎత్తున ముడుపులు తీసుకున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఇదిలా ఉండగా.. అలాంటి పత్రాలు లేని ఇళ్లు పట్టణంలో కోకొల్లలు. చాలా ఉన్నట్లు తెలుస్తోంది. అందరిని ప్రజెంట్ ఆక్యుపయ్యర్‌లో పెట్టారు. వీటిలో సైతం ఇలాంటి బాగోతమే నడిచినట్లు పట్టణంలో చర్చ జరుగుతోంది. ఎన్నో అనుమానాలు ఎలాంటి పత్రాలు లేని భూమికి రిజిస్ట్రేషన్ ఎలా అయిందో.. ఎవరు తతంగం నడిపించారో అంతుబట్టని పరిస్థితి ఉంది. పేరు మార్పిడికి సంబంధించి మున్సిపల్ రెవెన్యూ అధికారులను సంప్రదిస్తే రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ ఆధారంగా చేశామని చెబుతున్నారు. కానీ.. నిబంధనల ప్రకారం ప్రజెంట్ ఆక్యుపయ్యర్ పేరు మీద ఉన్న ఇంటిని మరొకరి పేరుపై మార్పిడి చేయడానికి వీల్లేదు. ఇక్కడే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. విచారణ చేపడతాం మాన్యువల్‌లో ఒకరు, ఆన్లైన్లోన్లో మరో పేరు ఉండడంపై మున్సిపల్ కమిషనర్ వి.సమ్మయ్యను వివరణ కోరగా.. ‘దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో విచారణ చేస్తాం. ఎవరైనా అక్రమాలకు పాల్పడినట్లు తేలితే కఠిన చర్యలు తీసుకుంటాం.’ అని పేర్కొన్నారు. -
ధాన్యం కొనుగోలు చేసిన 72 గంటల్లో డబ్బు చెల్లించాలి
మెదక్ మున్సిపాలిటీ,న్యూస్‌లైన్: రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేసిన 72 గంటల్లో డబ్బులు చెల్లించేలా చర్యలు తీసుకోవాలని జిల్లా ఇన్చార్జి కలెక్టర్ డాక్టర్ ఏ. శరత్ ఆదేశించారు. శుక్రవారం మెదక్ వచ్చిన ఆయన స్థానిక తహశీల్దార్ కార్యాలయంలో పౌర సరఫరాలు, ఐకేపీ, పంచాయతీరాజ్ ఇంజనీర్లు, తహశీల్దార్లు, సివిల్ సప్లయ్ డిప్యూటీ తహశీల్దార్లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ధాన్యం కొనుగోలు పూర్తయిన వెంటనే కేంద్రాల్లోని ధాన్యాన్ని రైస్ మిల్లులకు తరలించాలని ఆదేశించారు. అలా చేయని అధికారులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇప్పటివరకు ధాన్యాన్ని రైస్ మిల్లులకు తరలించని పాపన్నపేట డిప్యూటీ తహశీల్దార్, సివిల్ సప్లయ్ అధికారికి మెమో జారీ చేయాల్సిందిగా జిల్లా పౌరసరఫరాల అధికారి రత్నంను ఆదేశించారు. కొనుగోలు కోసం ఎంత ధాన్యం వస్తుంది...ఎన్ని రోజుల్లో కొనుగోలు చేస్తారో అంచనా వేసుకున్నాకే కేంద్రాలను మూసివేయాలన్నారు. రైతుల వద్ద కొనుగోలు చేసిన ధాన్యం వివరాల నమోదులో ఎలాంటి జాప్యం చేయరాదన్నారు. అదే విధంగా కొనుగోలు చేసిన ధాన్యం తడవకుండా తగిన ఏర్పాట్లు చేయాలన్నారు. జిల్లాలో 70 వేల మెట్రిక్ టన్నుల బియ్యం అందుబాటులో ఉన్నాయని, బియ్యంతోపాటు ఇతర సరుకులు కూడా సరైన సమయంలో చౌకధరల దుకాణాల ద్వారా పంపిణీకి సిద్ధం చేయాలని ఆయన సూచించారు. డీడీలు సకాలంలో చెల్లించని డీలర్లపై శాఖాపర చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రభుత్వ భూములను రక్షించాల్సిన బాధ్యత తహశీల్దార్లపై ఉందన్నారు. గతంలో గుర్తించిన ప్రభుత్వ భూముల్లో బోర్డులు పాతడంతో పాటు చుట్టూ ఫెన్సింగ్ వేయాలని, ఈ పనిని పది రోజుల్లో పూర్తిచేయాలని ఆదేశించారు. సమావేశంలో ఆర్డీఓ వనజాదేవి, డీఎస్ఓ ఏసురత్నం, పంచాయతీరాజ్ అధికార్లు, తహశీల్దార్లు, డిప్యూటీ తహశీల్దార్లు పాల్గొన్నారు.