బల్దియాపై ‘నజర్‌’ | Medak Municipality Is Corrupted In Medak District | Sakshi
Sakshi News home page

బల్దియాపై ‘నజర్‌’

Published Wed, Aug 21 2019 9:20 AM | Last Updated on Wed, Aug 21 2019 9:21 AM

Medak Municipality Is Corrupted In Medak District - Sakshi

అవినీతి, అక్రమాలకు కేరాఫ్‌గా నిలిచిన మెదక్‌ మున్సిపాలిటీపై ఏసీబీ నజర్‌ వేసింది. మ్యుటేషన్‌లో అక్రమాలకు సంబంధించి ‘సాక్షి’లో ఇటీవల ‘మున్సిపాలిటీలో మాయ’ శీర్షికన కథనం ప్రచురితమైన విషయం తెలిసిందే. దీంతోపాటు మెదక్‌ బల్దియాపై గతంలో అవినీతి ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో ఇంటెలిజెన్స్‌తోపాటు అవినీతి నిరోధకశాఖ అధికారులు దృష్టిసారించినట్లు తెలుస్తోంది. మరోవైపు గత నెలలో పలువురు ఏసీబీ అధికారులు మెదక్‌కు స్వయంగా వచ్చి గుట్టుచప్పుడు కాకుండా విచారణ చేపట్టినట్లు సమాచారం. వారు ఎందుకోసం వచ్చారు, దేనిపైనా విచారణ చేశారు. వంటి అంశాలు మాత్రం వెలుగులోకి రాలేదు.  

సాక్షి, మెదక్‌: మ్యుటేషన్లలో పలువురు మున్సిపల్‌ రెవెన్యూ అధికారుల దందాపై ఫిర్యాదులు అందడంతోనే ఏసీబీ అధికారులు వచ్చారనే చర్చ జిల్లాలో జోరుగా సాగుతోంది. తాజాగా ఇటీవల అక్రమ మ్యుటేషన్ల వ్యవహారం వెలుగులోకి వచ్చిన క్రమంలో కమిషనర్‌ బదిలీ కావడం.. ఏసీబీ, ఇంటెలిజెన్స్‌ అధికారుల ఆరా.. వంటి సంఘటనలు బల్దియా వర్గాల్లో గుబులు రేపుతున్నాయి.

రెవెన్యూ విభాగం టార్గెట్‌గా..
మెదక్‌ మున్సిపాలిటీ పరిధిలో కోట్లాది రూపాయల విలువైన భూములు ఉండగా.. రియల్‌ వ్యాపారం జోరుగా సాగుతోంది. ఈ క్రమంలో నాలుగైదేళ్లుగా మ్యుటేషన్లకు సంబంధించి దందా కొనసాగుతోంది. అవినీతికి అలవాటు పడిన పలువురు మున్సిపల్‌ రెవెన్యూ విభాగం అధికారులు పనికోరేటు చొప్పున ఫిక్స్‌ చేసినట్లు తెలుస్తోంది. అన్ని సరిగ్గా ఉన్న పక్షంలో మ్యుటేషన్‌కు ఒక రేట్‌ ఫిక్స్‌ చేసి వసూలు చేసేవారని వినికిడి. ఇదేక్రమంలో పలు భూములకు సంబంధించి లొసుగులను ఆసరాగా చేసుకుని దందా నడిపించినట్లు తెలుస్తోంది. ఎలాంటి పత్రాలు లేకున్నా.. అన్నీ తామై వ్యవహరించి చక్కబెట్టినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో కొందరు బాధితులు ఏసీబీని ఆశ్రయించినట్లు సమాచారం. రెవెన్యూ విభాగం టార్గెట్‌గా పథకం ప్రకారం అవినీతి నిరోధక శాఖ అధికారులు గత నెలలో మెదక్‌కు రాగా.. ఈ సమాచారం లీక్‌ అయినట్లు తెలుస్తోంది. దీంతో ఆ రోజు అధికారులు తప్పించుకున్నట్లు సమాచారం.

దొంగచాటు మ్యుటేషన్లతో..
తాజాగా ఇటీవల మాన్యువల్‌లో ఒకరి పేరు.. ఆన్‌లైన్‌లో మరొకరి పేరుతో మ్యుటేషన్‌ చేయగా వెలుగులోకి వచ్చింది. నిబంధనల ప్రకారం ప్రజెంట్‌ ఆక్యుపయ్యర్‌ పేరు మీద ఉన్న ఇంటిని మరొకరి పేరుపై మార్పిడి చేయడానికి వీల్లేదు. కానీ.. అంతా జరిగిపోయింది. అధికారులే సూత్రధారులుగా నిలిచిన ఈ వ్యవహారంలో చాలా మొత్తంలో డబ్బులు చేతులు మారినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఏసీబీ మళ్లీ దృష్టిసారించినట్లు తెలుస్తోంది. మరోవైపు మున్సిపాలిటీ పరిధిలో ఎలాంటి పత్రాలు లేని ఇళ్లు చాలా ఉన్నట్లు అధికారిక వర్గాల సమాచారం. ఎలాంటి పత్రాలు లేకుండా కేవలం కరెంట్, నల్లా కనెక్షన్లు తీసుకున్న అందరినీ అధికారులు ప్రజెంట్‌ ఆక్యుపయ్యర్‌లో పెట్టారు. వీటిలో సైతం దొంగచాటు మ్యుటేషన్ల బాగోతమే నడిచినట్లు చర్చ జరుగుతోంది. ఈ క్రమంలో ఇంటెలిజెన్స్‌ అధికారులు సైతం రంగంలోకి దిగి ఆరా తీస్తున్నట్లు తెలిసింది.

కలెక్టర్‌ దృష్టి సారించేనా..? 
అక్రమ మ్యుటేషన్ల బాగోతం వెలుగులోకి వచ్చినా.. ఉన్నతాధికారులు నామమాత్రంగా వ్యవహరిస్తుండడంపై ప్రజల్లో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అప్పటి రెవెన్యూ అధికారులకు కేవలం మెమోలు జారీ చేసి.. చేతులు దులుపుకోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఏసీబీ, ఇంటెలిజెన్స్‌ రంగంలోకి దిగిన నేపథ్యంలో మున్సిపాలిటీ ప్రత్యేకాధికారి, కలెక్టర్‌ ధర్మారెడ్డి ఇప్పటికైనా ప్రత్యేక దృష్టి సారించి అక్రమార్కులపై వేటు వేయాలని ప్రజలు కోరుతున్నారు.


 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement