Mutation
-
భూమి హక్కులకు ‘కొత్త చట్టం’!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో వ్యవసాయ, వ్యవసాయేతర భూములు, ఆస్తులపై హక్కులను నమోదు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కొత్త చట్టం తీసుకురానుంది. ఈ మేరకు ‘ది తెలంగాణ రికార్డ్ ఆఫ్ రైట్స్–2024’ పేరుతో రూపొందించిన ముసాయిదా బిల్లును ప్రజల ముందుకు తెచ్చింది. భూహక్కుల రికార్డులను ఎప్పటికప్పుడు సవరించడం, ఇప్పటివరకు పాస్‌బుక్‌లు రాని భూముల సమస్యలను పరిష్కరించడం, సర్వే చేసి కొత్తగా భూహ క్కుల రికార్డు తయారు చేసుకునే అధికారాన్ని కల్పించడమే ప్రధాన ఉద్దేశాలుగా ఈ చట్టాన్ని రూపొందిస్తున్నట్టు పేర్కొంది.రిజి్రస్టేషన్, మ్యుటేషన్, భూ ఆధార్, ఆబాదీలకు ప్రత్యేక హక్కుల రికార్డు, అప్పీల్, రివిజన్ వంటి సెక్షన్లను ముసాయి దా బిల్లులో ప్రతిపాదించారు. దీనిపై ప్రజల నుంచి అభిప్రాయాలు తీసుకున్నాక.. ప్రత్యేకంగా అసెంబ్లీ ని సమావేశపర్చి బిల్లుకు ఆమోదం తీసుకునే అవ కాశాలు ఉన్నాయని రెవెన్యూ వర్గాలు చెప్తున్నాయి. ⇒ భూమి హక్కుల బదలాయింపు కోసం 18 రకాల పద్ధతులు గుర్తించి.. వాటిలో ఏ రకంగా హక్కుల బదలాయింపు జరిగినా ‘రికార్డ్ ఆఫ్ రైట్స్ (ఆర్వోఆర్)’లో నమోదు చేయాల్సి ఉంటుంది. రిజిస్టర్డ్ దస్తావేజులు, వారసత్వం, భాగ పంపకాల ద్వారా హక్కుల బదలాయింపునకు పాత చట్టంలోని నిబంధనను కొనసాగించారు. ఈ పద్ధతుల్లో తహసీల్దారే రిజి్రస్టేషన్, మ్యుటేషన్ చేస్తారు. అయితే మ్యుటేషన్ చేసే సమయంలో విచారణ జరిపే వెసులుబాటు ఉంటుంది. ⇒ ఆ విచారణలో తప్పులేమైనా గుర్తిస్తే.. ఆయా కారణాలను వివరిస్తూ మ్యుటేషన్ నిలిపేయవచ్చు. ప్రస్తుత చట్టంలో ఈ అవకాశం లేదు. రిజిస్టర్డ్ దస్తావేజులు, భాగ పంపకాలు, వారసత్వ హక్కుల మ్యుటేషన్‌ను విచారించే అధికారం తహసీల్దార్లకు ఉంటుంది. మిగతా అంశాలకు సంబంధించి ఆర్డీవోకు అధికారం ఉంటుంది. ⇒ రిజిస్ట్రేషన్, మ్యుటేషన్ చేసేటప్పుడు సర్వే మ్యాప్ తప్పనిసరి చేశారు. రిజిస్ట్రేషన్‌కు వెళ్లేవారు ఈ మ్యాప్‌ను తీసుకెళ్లాల్సి ఉంటుంది. భవిష్యత్తు వివాదాలకు చెక్ పెట్టేలా గతంలో లేని ఈ కొత్త నిబంధన తెస్తున్నారు. అయితే ప్రభుత్వం నిర్దేశించిన తేదీ తర్వాత (ఇందుకు అవసరమైన వ్యవస్థను తయారు చేసుకున్నాక) మాత్రమే ఈ మ్యాప్ తప్పనిసరి అవుతుందని బిల్లులో పొందుపరిచారు. ⇒ ఇప్పటికే తీసుకున్న సాదాబైనామా దరఖాస్తులను కొత్త చట్టం కింద చేసుకున్న దరఖాస్తులుగానే పరిగణించాలి. తద్వారా పెండింగ్‌లో ఉన్న 9.4లక్షల దరఖాస్తులు అలాగే కొనసాగుతాయి. వాటి పరిష్కార సమయంలో స్టాంపు డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీజు కట్టాల్సిన అవసరం లేదు. అయితే కొత్తగా సాదాబైనామాల దరఖాస్తులను తీసుకుని పరిష్కరించే అధికారాన్ని ఈ బిల్లులో పొందుపరిచారు. కొత్త దరఖాస్తుల పరిష్కార సమయంలో మాత్రం స్టాంపు డ్యూటీ, రిజి్రస్టేషన్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. సాదాబైనామాల పరిష్కార అధికారం గతంలో కలెక్టర్లకు ఉండగా.. కొత్త చట్టంలో ఆర్డీవోలకు అధికారాలిచ్చారు. ⇒ ప్రతి భూకమతానికి తాత్కాలిక, శాశ్వత భూదార్ (ప్రత్యేక గుర్తింపు సంఖ్య) ఇవ్వాల్సి ఉంటుంది. ప్రస్తుత రికార్డులను పరిశీలించి తాత్కాలిక సంఖ్య ఇస్తారు. సర్వే తర్వాత శాశ్వత భూదార్ జారీ చేస్తారు. ఈ భూదార్‌కు సంబంధించిన మార్గదర్శకాలను రాష్ట్ర ప్రభుత్వం రూపొందిస్తుంది. ⇒ కొత్తగా గ్రామీణ ప్రాంత ఇంటి స్థలాలకు (ఆబాదీ) కూడా ప్రత్యేక హక్కుల రికార్డు తయారు చేయాలని బిల్లులో పొందుపరిచారు. భూదార్తోపాటు ఈ ఆబాదీల ఆర్వోఆర్కు అవసరమైన నిధులు కేంద్రం నుంచి తెచ్చుకోవచ్చు. గత చట్టంలో ఆర్వోఆర్ రికార్డుకు, గ్రామ పహాణీకి సంబంధం ఉండేదికాదు. ఈ కొత్త చట్టంలో.. హక్కుల బదలాయింపు జరగ్గానే గ్రామ పహాణీలో ఆ హక్కుల రికార్డును నమోదు చేసేలా నిబంధన విధించారు. ⇒ తహసీల్దార్లు, ఆర్డీవోలు చేసే రిజి్రస్టేషన్లు, మ్యుటేషన్లకు సంబంధించి వివాదాలు వస్తే.. అప్పీల్, రివిజన్‌కు కొత్త చట్టం అవకాశం ఇవ్వనుంది. కలెక్టర్లు లేదా అడిషనల్ కలెక్టర్లకు అప్పీల్ చేసుకోవచ్చు. తర్వాత సీసీఎల్ఏకు సెకండ్ అప్పీల్ చేసుకోవచ్చు. ఇది పాత చట్టంలో లేదు. ⇒ రివిజన్ మాత్రం రాష్ట్ర ప్రభుత్వం లేదా సీసీఎల్ఏ మాత్రమే చేయాలని బిల్లులో పొందుపరిచారు. గతంలో జాయింట్ కలెక్టర్లకు ఉన్న రివిజన్ అధికారాలను ఇప్పుడు సీసీఎల్ఏకు దఖలు పర్చారు. ఏదైనా రికార్డులో తప్పు జరిగిందని భావిస్తే.. సుమోటోగా తీసుకుని కూడా పరిష్కరించవచ్చు. అయితే అడిషనల్ కలెక్టర్ స్థాయి నుంచి ప్రభుత్వం వరకు అప్పీల్ లేదా రివిజన్లలో ఏ నిర్ణయం తీసుకున్నా లిఖితపూర్వక ఆదేశాలు ఇవ్వడాన్ని తప్పనిసరి చేశారు.2020 చట్టంలో ఈ అంశం లేదని.. కొత్త చట్టం అమల్లోకి వస్తే భూమి హక్కుల రికార్డుల వివాదాలన్నీ అప్పీలు, రివిజన్లతోనే పరిష్కారమవుతాయని రెవెన్యూ వర్గాలు చెప్తున్నాయి. యాజమాన్య హక్కుల వివాదాలు, భాగపంపకాల విషయంలో వివాదాలున్నప్పుడు మాత్రమే కోర్టులకు వెళ్లాల్సి ఉంటుందని, తద్వారా కోర్టులపై భారం తగ్గుతుందని అంటున్నాయి. రూపకల్పన కోసం విస్తృత కసరత్తు ‘రికార్డ్ ఆఫ్ రైట్స్–2024 చట్టం’è ముసాయిదా బిల్లు రూపకల్పన కోసం రెవెన్యూ వర్గాలు విస్తృతస్థాయిలో కసరత్తు చేశాయి. తెలంగాణలో ఇప్పటివరకు అమలైన 1936, 1948, 1971, 2020 నాటి చట్టాలను పరిశీలించి.. వాటి అమలు వల్ల వచి్చన ఫలితాలను బేరీజు వేసి కొత్త చట్టాన్ని రూపొందించారు. తెలంగాణలో ఆర్వోఆర్ చట్టాల అమలు చరిత్ర, ప్రస్తుత సమస్యలు, రాబోయే అవసరాలను అంచనా వేసి 20 సెక్షన్లతో ముసాయిదాను సిద్ధం చేశారు.ఈ క్రమంలో 18 రాష్ట్రాల్లోని ఆర్వోఆర్ చట్టాలను పరిశీలించడంతోపాటు బిహార్‌లో అమల్లో ఉన్న మ్యుటేషన్ చట్టాన్ని కూడా అధ్యయనం చేశారు. భూములకు ప్రత్యేక గుర్తింపు సంఖ్య (భూదార్), గ్రామీణ ప్రాంత ఆస్తుల రికార్డు తయారు చేయడం ద్వారా.. కేంద్ర ప్రభుత్వ పథకాల అమలుకు అవసరమైన వెసులుబాటును కలి్పంచనున్నారు. ముసాయిదా రూపకల్పనలో భూచట్టాల నిపుణుడు ఎం.సునీల్‌కుమార్, రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి నవీన్ మిత్తల్, సీఎంఆర్వో పీడీ వి.లచి్చరెడ్డి కీలకపాత్ర పోషించారు. ప్రజల సలహాలు, సూచనలకు అవకాశం ఈ ముసాయిదా బిల్లుపై రాష్ట్ర ప్రజల నుంచి సలహాలు, సూచనలు తీసుకుంటామని రెవెన్యూ శాఖ వెల్లడించింది. సీసీఎల్ఏ వెబ్సైట్ ( ccla.telan gana.gov.in ) లో ఈ బిల్లును అందుబాటులో ఉంచుతున్నామని.. ఈ నెల 2వ తేదీ నుంచి 23వ తేదీ వరకు ప్రభుత్వానికి అభిప్రాయాలు తెలియజేయాలని భూపరిపాలన ప్రధాన కమిషనర్ ఒక ప్రకటనలో కోరారు. ప్రజలు తమ సలహాలు, సూచనలను ror2024-rev@telangana.gov.in కు ఈ–మెయిల్ ద్వారా పంపవచ్చని.. లేదా ల్యాండ్ లీగల్ సెల్, సీసీఎల్ఏ కార్యాలయం, నాంపల్లి స్టేషన్‌రోడ్, అన్నపూర్ణ హోటల్ ఎదురుగా, అబిడ్స్, హైదరాబాద్–500001కు పోస్టు ద్వారా పంపవచ్చని వెల్లడించారు. -
పసిపిల్లలను నిద్రలోనే బలితీసుకుంటున్న ఎస్‌యూడీసీ!
అడుతూ పాడుతూ తిరుగుతున్న బిడ్డ ఉన్నట్టుండి కుప్పకూలిపోతే.. గాయం, వ్యాధి, ఆరోగ్య సమస్యలేవీ లేకున్నా కళ్లు మూస్తే? ఆ విషాదాన్ని వర్ణించడం కష్టం. తల్లిదండ్రులు ఎవరైనా ఆ నష్టాన్ని దిగమింగుకోలేరు కూడా. అయితే దురదృష్టకరమైన విషయం ఏమిటంటే... ప్రపంచవ్యాప్తంగా ఏటా ఇలాంటి ఘటనలు కొన్ని చోటు చేసుకుంటూండటం. సౌత్ ఇంగ్లాండ్‌లోని బాన్‌బరీలో ఇటీవలే 13 ఏళ్ల బాలుడు ఒకరు ఇలా ఆకస్మికంగా కుప్పకూలిపోయాడు. తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయాడు. ఎందుకిలా జరుగుతుంది? కారణాలేమిటి? నివారించే అవకాశం ఏదైనా ఉందా? ఊహూ... ప్రస్తుతానికి ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం నో అనే చెప్పాలి. సడన్ అన్ఎక్స్ప్లెయిన్డ్ డెత్ ఇన్ ఛైల్డ్‌హుడ్ (ఎస్‌యూడీసీ) అని పిలుస్తారు దీన్ని. పుట్టిన బిడ్డ మొదలుకొని 18 ఏళ్ల వయసు వారి వరకూ ఎవరికైనా ఎదురు కావచ్చు ఇలాంటి దుర్మరణం. బాన్‌బరీలో జరిగిన ఘటననే ఉదాహరణగా తీసుకుంటే...13 ఏళ్ల మాథ్యూ కౌలీ ముందురోజు రాత్రి... స్నేహితులతో వీడియో గేమ్ ఆడుకుని హాయిగా నిద్రపోయాడు. అలాగే శాశ్వతనిద్రలోకి జారుకున్నాడు. ఈ ఆకస్మిక మరణం అనేక ప్రశ్నల్ని లేవనెత్తింది. వైద్య పరీక్షల్లో, పోస్ట్‌మార్టంలోనూ మరణానికి కారణమేమిటన్నది స్పష్టం కాలేదు. ఎస్‌యూడీసీ అంటే... వైద్యుల అభిప్రాయం ప్రకారం, సడన్ అన్ ఎక్స్ప్లెయిన్డ్ డెత్ ఇన్ చైల్డ్ హుడ్ (SUDC) అంటారు. అకారణంగా ఆరోగ్యకరమైన పిల్లవాడు ఆకస్మికంగా ప్రాణాలు కోల్పోవడం. 2021 నాటి లెక్కల ప్రకారం ఒక్క అమెరికాలోనే దాదాపు 450 మంది ఎస్‌యూడీసీ బారిన పడ్డారు. ప్రపంచ వ్యాప్తంగానూ ఏటా 40 - 50 మంది పిల్లలు ప్రాణాలు కోల్పోతున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. న్యూయార్క్ యూనివర్శిటీ గ్రాస్మన్ స్కూల్ ఆఫ్ మెడిసిన్‌లోని వైద్యులు రిచర్డ్ ట్సీన్, ఓరిన్ డెవిన్స్కీ నేతృత్వంలో ఎస్యూడీసీకి కారణాలు తెలుసుకునేందుకు ఒక పరిశోధన జరిగింది కానీ ఫలితాలు మాత్రం అంత ఆశాజనకంగా ఏమీ లేవు. సుమారు 124 మంది ఎస్‌యూడీసీ బాధితుల శరీరాల నుంచి వారి తల్లిదండ్రుల నుంచి శాంపిల్స్ సేకరించి పరీక్షలు నిర్వహించారు. వీటిల్లో అనూహ్యంగా జరిగిన జన్యుపరమైన మార్పులు (ఉత్పరివర్తనాలు ఇంగ్లీషులో మ్యూటేషన్స్)లను గుర్తించారు. బాధితుల డీఎన్ఏలోని జన్యుపరమైన మార్పులు తల్లిదండ్రుల నుంచి సంక్రమించినవి కాకపోవడం గమనార్హం. ఇలా తల్లిదండ్రుల నుంచి కాకుండా స్వతంత్రంగా జరిగే జన్యుమార్పులను డీనోవో ఉత్పరివర్తనాలని పిలుస్తారు. డీనోవో ఉత్పరివర్తనాల విషయం ఇలా ఉంటే తల్లిదండ్రుల్లో ఉన్న కొన్ని ప్రమాదకరమైన జన్యు ఉత్పరివర్తనాల్లో 80 శాతం పిల్లలకూ సంక్రమించాయి. మొత్తం జన్యుమార్పుల్లో 11 ఉత్పరివర్తనాలు ఆరోగ్య సమస్యలకు కారణమవుతున్నట్లు పరిశోధకులు గుర్తించారు. ఈ మార్పులు వందలో తొమ్మిది మంది మరణానికి కారణం కావచ్చునని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. కాల్షియం సిగ్నలింగ్‌లో మార్పు SUDCలో ముఖ్యమైన పాత్ర పోషిస్తోందని జన్యుపరమైన ప్రమాద కారకాలను పెంచుతుందని పరిశోధనల ఫలితాలు సూచిస్తున్నాయి. -
చిటికెలో ‘మ్యుటేషన్’
సాక్షి, అమరావతి: కృష్ణా జిల్లా మచిలీపట్నం మండలం అరిశేపల్లి గ్రామానికి చెందిన నంద్యాల తేజస్ ఒక ఎకరం పొలాన్ని కొనుగోలు చేశారు. బందరు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి వెళ్లి తన పేరిట రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. రిజిస్ట్రేషన్ జరిగిన వెంటనే రెవెన్యూ రికార్డుల్లో ఆయన పేరు నమోదైంది. ఒకే రోజు రిజిస్ట్రేషన్‌తో పాటు ఆటోమెటిక్‌గా మ్యుటేషన్ కూడా జరిగిపోయింది. సరళంగా ప్రక్రియ ఆస్తి ఒకరి పేరు మీద నుంచి మరొకరి పేరిట మారాలంటే కొద్ది రోజుల క్రితం వరకు పెద్ద ప్రహసనమే. తహశీల్దార్ కార్యాలయం చుట్టూ రోజుల తరబడి తిరిగినా మ్యుటేషన్ జరగక కొనుగోలుదారులు అవస్థలు పడాల్సి వచ్చేది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ముందుచూపుతో ప్రవేశపెట్టిన విధానాలు, రెవెన్యూ సంస్కరణల ఫలితంగా ఇప్పుడు చాలా తేలిగ్గా ఆటో మ్యుటేషన్ జరిగిపోతోంది. వ్యవస్థలు వాటి పని అవి చేసుకుంటూ వెళుతున్నాయి. రిజిస్ట్రేషన్ జరిగిన వెంటనే ఆటోమేటిక్‌గా వెబ్‌ల్యాండ్‌లో యాజమాన్య హక్కుల బదలాయింపు జరుగుతోంది. ఎక్కడికి తిరగాల్సిన పనిలేకుండా ప్రభుత్వం కొత్తగా అమలు చేస్తున్న కార్డ్ ప్రైమ్ రిజిస్ట్రేషన్ల విధానంలో మ్యుటేషన్ ప్రక్రియ అత్యంత సరళంగా ముగుస్తోంది. ఎన్టీఆర్ జిల్లా నందిగామ, కృష్ణా జిల్లా మచిలీపట్నంలో రిజిస్ట్రేషన్లు, ఆటో మ్యుటేషన్ల తీరును ‘సాక్షి’ ప్రతినిధి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. పూర్తయ్యేదాకా ఉత్కంఠే! స్థిరాస్థుల క్రయవిక్రయాలు జరిగిన తర్వాత వాటిని తమ పేరు మీదకు మార్చుకోవడం ఇన్నాళ్లూ క్లిష్టతరంగా ఉండేది. రిజిస్ట్రేషన్ పూర్తయిన తర్వాత మళ్లీ మ్యుటేషన్ కోసం రెవెన్యూ శాఖకు దరఖాస్తు చేసుకోవడం, ఆ ప్రక్రియ పూర్తయ్యేందుకు కొంత సమయం పట్టడంతో కొనుగోలుదారులకు కునుకు పట్టేది కాదు. ఆస్తిని రిజిష్టర్ చేసేది రిజిస్ట్రేషన్ శాఖ అయితే దాన్ని రెవెన్యూ రికార్డుల్లో అప్డేట్ చేసేది రెవెన్యూ శాఖ. రెండు శాఖల మధ్య సమన్వయం లేకపోవడం, ఏళ్ల తరబడి అదే విధానం కొనసాగడంతో రిజిస్ట్రేషన్ పూర్తయినా మ్యుటేషన్ కోసం నిరీక్షణ తప్పని పరిస్థితి. కొన్ని సందర్భాల్లో రిజిస్టర్ అయిన ఆస్తికి సంబంధించి వివాదాలు తలెత్తడంతో మ్యుటేషన్ జరిగేది కాదు. అవతవకలకు ఆస్కారం ఉండేది. సంక్లిష్టంగా ఉన్న మ్యుటేషన్ల విధానాన్ని సీఎం జగన్ ప్రభుత్వం సరళంగా మార్చింది. ఎంతోకాలం నుంచి కాగితాలకే పరిమితమైన ఆటో మ్యుటేషన్ ప్రతిపాదనను వాస్తవ రూపంలోకి తెచ్చి ప్రజల అవస్థలను తొలగించింది. రిజిస్ట్రేషన్ల శాఖకు వెబ్‌ల్యాండ్ అనుసంధానం నూతన విధానంలో స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ సాఫ్ట్‌వేర్‌ను, రెవెన్యూ శాఖ వెబ్‌ల్యాండ్ సాఫ్ట్‌వేర్‌ను అనుసంధానం చేశారు. దానికి ముందు రిజిస్ట్రేషన్ల శాఖ సాఫ్ట్వేర్ కార్డ్ స్థానంలో కార్డ్ ప్రైమ్‌ను ప్రవేశపెట్టారు. ఆటో మ్యుటేషన్‌తోపాటు ఆన్లైన్లోనే డాక్యుమెంట్ తయారు చేసుకోవడం, సర్వే నెంబర్ ఎంటర్ చేయగానే మార్కెట్ విలువ కనిపించడం, అందుకు తగ్గట్టుగా ఆన్లైన్లోనే చలానాలు కట్టడం, అనంతరం రిజిస్ట్రేషన్ కోసం స్లాట్ బుక్ చేసుకోవడం కార్డ్ ప్రైమ్ విధానంలో కొత్తగా అందుబాటులోకి వచ్చాయి. నిర్దేశించిన స్లాట్ ప్రకారం రిజిస్టార్ ఆఫీసు లేదంటే గ్రామ, వార్డు సచివాలయానికి వెళితే అక్కడ కొత్త విధానంలో వెంటనే రిజిస్ట్రేషన్‌తోపాటు ఆ వివరాల ప్రకారం ఆటోమేటిక్‌గా మ్యుటేషన్ జరిగిపోతోంది. మళ్లీ మ్యుటేషన్ కోసం ప్రత్యేకంగా దరఖాస్తు చేసుకోవడం, రెవెన్యూ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు. రిజిస్ట్రేషన్ చేసే సమయంలోనే అన్నింటినీ పక్కాగా నిర్థారిస్తారు. సబ్ రిజి్రస్టార్లు రెవెన్యూ రికార్డులను పూర్తిగా పరిశీలించి రిజిస్ట్రేషన్‌కు అనుమతిస్తారు. రిజిస్ట్రేషన్ జరగగానే రెవెన్యూ రికార్డుల్లో యాజమాన్య హక్కు దానంతట అదే మారిపోతుంది. త్వరలో అర్బన్ ప్రాంతాల్లోనూ కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లో మూడు నెలల క్రితం నూతన విధానాన్ని ప్రయోగాత్మకంగా పరిశీలించారు. ప్రస్తుతం రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు, గ్రామ, వార్డు సచివాలయాల్లో కొత్త విధానంలోనే రిజిస్ట్రేషన్లతోపాటు ఆటో మ్యుటేషన్లు జరుగుతున్నాయి. కొత్త విధానం వచ్చాక 26 జిల్లాల్లో ఇప్పటివరకు 7 వేలకుపైగా ఆటో మ్యుటేషన్లు జరిగాయి. వ్యవసాయ భూములకు సంబంధించి అమలవుతున్న ఆటో మ్యుటేషన్ విధానాన్ని త్వరలో అర్బన్ ప్రాంతాల్లోనూ అమలు చేయడానికి ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. నగరాలు, పట్టణాల్లో ఆస్తుల రికార్డులు మున్సిపల్ శాఖ నిర్వహిస్తుండడంతో రిజిస్ట్రేషన్ల శాఖ అందుబాటులోకి తెచ్చిన కార్డ్ ప్రైమ్ సాఫ్ట్‌వేర్‌ను దానికి అనుసంధానించాల్సి ఉంది. ఇప్పటికే రిజిస్ట్రేషన్ల శాఖ అందుకు సిద్ధమవగా మున్సిపల్ శాఖ కసరత్తు చేస్తోంది. సులభతరం రిజిస్ట్రేషన్ సేవలతోపాటు మ్యుటేషన్ విధానాన్ని సులభతరం చేశాం. కార్డ్ ప్రైమ్ విధానంలో ఆటో మ్యుటేషన్ వెంటనే జరిగిపోతోంది. ఇందుకోసం రెవెన్యూ, రిజిస్ట్రేషన్ల శాఖల సాఫ్ట్వేర్లను పూర్తిగా మార్చాం. ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడాలన్న ప్రభుత్వ ఆదేశాల మేరకు కొత్త విధానాన్ని అమలు చేస్తున్నాం. రాష్ట్రవ్యాప్తంగా వ్యవసాయ భూములకు ఆటో మ్యుటేషన్లు జరుగుతున్నాయి. మరికొద్ది రోజుల్లో అర్బన్ ఆస్తులకూ ఇదే విధానాన్ని తెచ్చే ప్రయత్నం జరుగుతోంది. రిజిస్ట్రేషన్ల విధానం, ఆటో మ్యుటేషన్ చాలా బాగా అమలవుతోంది. దుష్ప్రచారాలను నమ్మవద్దు. – వి రామకృష్ణ, కమిషనర్ అండ్ ఐజీ, స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ వెంటనే ఆన్లైన్లో.. మా గ్రామ సమీపంలో రెండు ఎకరాల వ్యవసాయ భూమిని కొనుగోలు చేశా. నందిగామ సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులో రిజిస్ట్రేషన్ అరగంటలోనే పూర్తయింది. ఆ తర్వాత వెంటనే నా పేరు మీద ఆన్లైన్లో కూడా మారింది. ఇంతకుముందు ఆన్లైన్లో పేరు చేర్చాలంటే రిజిస్ట్రేషన్ పత్రాలతో ఎమ్మార్వో ఆఫీసు చుట్టూ తిరగాల్సి వచ్చేది. ఇప్పుడు వెంటనే మ్యుటేషన్ జరగడం బాగుంది. – నల్లపోతుల నాగరాజు, నందిగామ మండలం, రాఘవాపురం తిరిగే తిప్పలు లేవు.. నా పేరుతో ఉన్న 33 సెంట్ల భూమిని నా కుమార్తె వెంకటేశ్వరమ్మ పేరిట రాశాను. రిజిస్ట్రేషన్ జరిగిన రోజే ఆమె పేరిట భూమి మారిపోయింది. ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన బాధ లేకుండా వెంటనే పని పూర్తయింది. – చల్లా ఆంజనేయులు, కొండూరు, నందిగామ మండలం. -
ఒరిజినల్ డాక్యుమెంట్లు తనిఖీ చేశాకే మ్యుటేషన్లు
సాక్షి, అమరావతి: మ్యుటేషన్లకు సంబంధించి ప్రభుత్వం కీలకమైన ఆదేశాలు జారీ చేసింది. భూములకు సంబంధించిన ఒరిజినల్ డాక్యుమెంట్లను తనిఖీ చేశాకే మ్యుటేషన్లు చేయాలని రెవెన్యూ యంత్రాంగాన్ని ఆదేశించింది. జిరాక్స్, ట్రూ కాపీలు, ఇతర అనధికారిక పత్రాల ఆధారంగా మ్యుటేషన్లు చేయవద్దని స్పష్టం చేసింది. వీటివల్ల వివాదాలు ఏర్పడుతున్న నేపథ్యంలో ఈ ఆదేశాలిచ్చింది. ఒరిజినల్ డాక్యుమెంట్లను తహసీల్దార్లు ధృవీకరించాలని చెప్పింది. ఈ మేరకు జిల్లా కలెక్టర్లు, రెవెన్యూ యంత్రాంగానికి భూ పరిపాలన ప్రధాన కమిషనర్, ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి. సాయిప్రసాద్ సర్క్యులర్ జారీ చేశారు. తహశీల్దార్లు ప్రతి మ్యుటేషన్‌కు తప్పనిసరిగా సేల్ డీడ్ వంటి ఒరిజినల్ డాక్యుమెంట్లు, వాటి ఒరిజినల్ లింకు డాక్యుమెంట్లు, ఒరిజినల్ ఈసీతోపాటు దానికి సంబంధించిన ఇతర అధికారిక పత్రాలను పరిశీలించాలని స్పష్టం చేశారు. ఒరిజినల్ డాక్యుమెంట్లను పరిశీలించినట్లు తహసీల్దార్ ఆన్లైన్లో ధృవీకరించాలని (సర్టిఫై చేయాలి) ఆదేశించారు. రిజిస్ట్రేషన్ శాఖ సర్వర్ నుంచి ఆన్లైన్లో చూసే డాక్యుమెంట్లు తప్ప ఇతర ఏ సందర్భంలోనైనా ఈ విధానం పాటించాల్సిందేనని చెప్పారు. ఇండియన్ ఎవిడెన్స్ చట్టం ప్రకారం ఒరిజినల్ డాక్యుమెంట్లని ధృవీకరించకుండా చేసిన ఎలాంటి మ్యుటేషన్ లేదా ఆర్డర్ ఆమోదయోగ్యం కాదని తెలిపారు. రాష్ట్రంలో పలుచోట్ల తహశీల్దార్లు ఫొటో కాపీల ఆధారంగా మ్యుటేషన్లు చేయడం, అసలైన యజమానులు ఫిర్యాదుతో అవి సరైన పత్రాలు కావని నిర్థారణ అయిన నేపథ్యంలో హైకోర్టు సీరియస్‌గా స్పందించింది. దీంతో సీసీఎల్ఏ ఈ ఆదేశాలు జారీ చేశారు. రెవెన్యూ శాఖలోని చివరి వ్యక్తి నుంచి అన్ని స్థాయిల్లో ఈ నిబంధనలు పాటించాలని, దీనికి విరుద్ధంగా ఎవరైనా ఫొటో కాపీలు చూసి మ్యుటేషన్లు చేస్తే కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. యాక్ట్ 15 ఆఫ్ 2022 ప్రకారం క్రిమినల్ లా కింద ఎవరైనా ఆర్ఓఆర్ చట్టానికి విరుద్ధంగా ఆర్డర్లు ఇస్తే వారిని జిల్లా కలెక్టర్లు విచారించే అధికారం ఉందని తెలిపారు. -
ముగింపు దశకు కరోనా! అయినా నిర్లక్ష్యం వద్దు.. బూస్టర్ డోసు తీసుకోవాల్సిందే
న్యూఢిల్లీ: దేశంలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్న తరుణంలో ఈసీఎంఆర్ మాజీ సైంటిస్ట్ డాక్టర్ రమన్ గంగాఖేడ్కర్ కీలక విషయాలు వెల్లడించారు. కరోనా వైరస్ ముగింపు దశకు చేరుకుందని, ప్రజలు తీవ్ర భయాందోళనకు గురికావాల్సిన అవసరంలేదని చెప్పారు. అయితే వైరస్‌ను నిర్లక్ష్యం చేయకుండా జాగ్రత్తలు మాత్రం పాటించాల్సిందేనని స్పష్టం చేశారు. కరోనా వైరస్ వివిధ రకాలుగా రూపాంతరం చెంది(మ్యుటేషన్లు) బలహీన పడుతోందని డా.గంగాఖేడ్కర్ పేర్కొన్నారు. ఇప్పుడు వైరస్ సోకిన వారికి స్వల్ప లక్షణాలే కన్పిస్తున్నాయని, తీవ్ర అనారోగ్యానికి గురై ఆస్పత్రిలో చేరాల్సిన సందర్భాలు చాలా తక్కువగా ఉంటున్నాయని చెప్పారు. ఇంకా కొన్ని మ్యూటేషన్ల అనంతరం కరోనా పూర్తిగా కనుమరుగయ్యే అవకాశాలు ఉన్నాయని తెలిపారు. ఎక్స్‌బీబీ.1.16 వేరియంట్‌పై ఈ ఏడాది జనవరిలో తొలిసారి వెలుగుచూసిన ఎక్స్‌బీబీ.1.16 వేరియంట్ కూడా అంత ప్రమాదకరం కాదని డా.గంగాఖేడ్కర్ పేర్కొన్నారు. గత మూడు నెలల్లో దేశంలో కరోనా కేసులు ఆందోళనకర స్థాయిలో నమోదుకాకపోవడమే ఇందుకు నిదర్శనం అన్నారు. 'XBB.1.16 అనేది రీకాంబినెంట్ వైరస్. ఇది మానవ శరీరంలో అనుకోకుండా తయారవుతుంది. రెండు వేర్వేరు వేరియంట్లు మానవ శరీరంలోకి ప్రవేశించినప్పుడు, పునరుత్పత్తి సమయంలో జన్యు పదార్ధం మిక్స్అప్ అయినప్పుడు అవి తయారవుతాయి.' అని ఆయన వివరించారు. బూస్టర్ డోసులు, మాస్కులు దేశంలో మళ్లీ కరోనా కేసులు పెరుగుతున్నందున ఇంకా బూస్టర్ డోసు టీకా తీసుకోని వారు, ఆలస్యం చేసిన వారు ఎవరైనా ఉంటే వెంటనే తీసుకోవాలని డాక్టర్ సూచించారు. అలాగే ప్రజలు తప్పనిసరిగా మాస్కులు ధరించాలని చెప్పారు. పిల్లలు అనారోగ్యానికి గురైతే వాళ్లను స్కూళ్లకు అసలు పంపవద్దని తల్లిదండ్రులకు సూచించారు. ఒకవేళ వారికి సోకింది కరోనా అయితే అది ఇతర విద్యార్థులకు, టీచర్లకు, సిబ్బంది సోకి మరింత మందికి వ్యాప్తి చెందుతుందని హెచ్చరించారు. చదవండి: మాక్‌డ్రిల్‌తో అప్రమత్తమైన భారత్.. కొత్తగా 5,676 కేసులు, 15 మరణాలు -
యూజర్ ఫ్రెండ్లీ అంటూ గొప్పలు.. ప్రజలకు తప్పని తిప్పలు
సాక్షి, హైదరాబాద్: కాగిత రహిత పాలనలో తమను మించిన వారు లేరని, అన్నీ ఆన్లైన్లోనే నిర్వహిస్తున్నామని గొప్పలు చెప్పుకుంటున్న జీహెచ్ఎంసీ పరిస్థితి పైన పటారం.. లోన లొటారంలా మారింది. అన్నీ ఆన్లైన్ ద్వారానే అని చెబుతున్నప్పటికీ.. సవ్యంగా పనిచేయాల్సిన జీహెచ్ఎంసీ సర్వరే మొరాయిస్తుండటంతో వివిధ పనులు అవసరమైన వారు పడరాని పాట్లు పడుతున్నారు. జీహెచ్ఎంసీలోని వివిధ సేవలకు సంబంధించి ఇదివరకు ఆన్లైన్ లేదా ఆఫ్‌లైన్‌లో సదుపాయం ఉండేది. అంతేకాకుండా జీహెచ్ఎంసీ కార్యాలయాల్లోని సిటిజెన్ సర్వీస్ సెంటర్ల ద్వారా మ్యుటేషన్లు, బర్త్ సర్టిఫికెట్లు, ట్రేడ్‌లైసెన్సుల వంటి సేవలందేవి. ఇటీవలి కాలంలో ప్రజలు నేరుగా ఆన్లైన్ ద్వారా లేదా మీసేవా కేంద్రాల ద్వారా మాత్రమే సదరు సేవలు వినియోగించుకునేలా చేశారు. జీహెచ్ఎంసీలో వేళ్లూనుకుపోయిన అవినీతిని అరికట్టేందుకు అధికారులను కలిసే పనే లేకుండా యూజర్‌ఫ్రెండ్లీగా ఆన్లైన్ ద్వారానే ఈ సదుపాయాలు కల్పించినట్లు ప్రకటించారు. అంతవరకు బాగానే ఉంది కానీ, ఇంతకీ ప్రజలకు అంతరాయాల్లేకుండా సేవలందుతున్నాయా.. సాంకేతికంగా ఇబ్బందులెదురవుతున్నాయా ? వంటి విషయాలను మాత్రం ఉన్నతాధికారులు పట్టించుకోలేదు. దాంతో తరచూ సాంకేతిక సమస్యలతో పనులు కావడం లేదని ప్రజలు వాపోతున్నారు. మీసేవా కేంద్రాల ద్వారా సైతం అదే పరిస్థితని చెబుతున్నారు. కొత్త మ్యుటేషన్లు ఆటోమేటిక్‌గా జరుగుతున్నప్పటికీ, పాతవాటికి సంబంధించి ఇబ్బందులెదురవుతున్నాయి. జనన, మరణ ధ్రువీకరణ పత్రాలు పొందాలనుకునేవారికీ ఇదే పరిస్థితి. ఇక టౌన్‌ప్లానింగ్‌లో అన్నీ ఆన్లైనే అని చెబుతున్నప్పటికీ, అధికారులను మచ్చిక చేసుకోకపోతే పనులు కావడం లేదనే ఆరోపణలున్నాయి. కొత్తగా ఇల్లు కుట్టుకున్న వారి ఆస్తిపన్నుకు సంబంధించిన సెల్ఫ్ అసెస్మెంట్ నుంచి దుకాణదారుల ట్రేడ్‌లైసెన్సుల వరకు అన్నీ ఆన్లైన్లోనే సదుపాయం కల్పించినప్పటికీ, తలెత్తుతున్న ఇబ్బందులు, ప్రజల ఫీడ్‌బ్యాక్‌ను తెలుసుకొని, ఎప్పటికప్పుడు పరిష్కరిస్తే సమస్యలుండవని హిమాయత్‌నగర్‌కు చెందిన రాకేశ్ అభిప్రాయపడ్డారు. మరోవైపు, ఉన్నతాధికారులు చేపట్టిన ‘ఆన్లైన్ మంత్ర’ వల్ల తమకు రావాల్సిన పై ఆదాయం రానందున జీహెచ్ఎంసీలోని కొందరు ఉద్యోగులే సమస్యలు సృష్టిస్తున్నారనే అనుమానాలు సైతం ఉన్నాయి. ఏది ఏమైనప్పటికీ, సదుపాయాలు అందుబాటులోకి తెచ్చిన యంత్రాంగం వినియోగం సైతం పరిశీలించి ఎప్పటికప్పుడు తగిన చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు. (క్లిక్: హైదరాబాద్‌లో బోనాల జాతర.. తేదీలు ఖరారు) ఆన్లైన్ సేవలు.. ► సెల్ఫ్ అసెస్మెంట్స్ ► మ్యుటేషన్స్ ► బర్త్, డెత్ సర్టిఫికెట్ల జారీ ► ట్రేడ్ లైసెన్స్ నెలల తరబడి తిప్పుకుంటున్నారు రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పుడే మ్యుటేషన్ జరుగు తుందని చెబుతున్నప్పటికీ అమలు కావడం లేదు. సర్వర్‌డౌన్ పేరిట నెలల తరబడి తిప్ప డం సమంజసం కాదు. లోపాలెక్కడున్నాయో పరిశీలించి ఉన్నతాధికారులు తగిన చర్యలు తీసుకుని ప్రజల ఇబ్బందులు తొలగించాలి. – లక్ష్మణ్, ఉప్పల్ -
దారికొచ్చిన ‘ధరణి’..! వెబ్సైట్లో కొత్త ఆప్షన్లు
మోర్తాడ్ బాల్కొండ/నిజామాబాద్: వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్, తక్షణ మ్యుటేషన్ కోసం రూపొందించిన ధరణి వెబ్సైట్లో కొత్త ఆప్షన్లను ఇచ్చారు. ఫలితంగా కొంత కాలంగా పరిష్కారం కాని అనేక సమస్యలకు దారి చూపడానికి అవకాశం ఏర్పడిందని అధికార యంత్రాంగం చెబుతుంది. ధరణి వెబ్సైట్ అందుబాటులోకి వచ్చి ఏడాదిన్నర కాలం అవుతుంది. కొన్ని ఆప్షన్లను ఇవ్వడంతో కేవలం డిజిటల్ పట్టా పాసు పుస్తకం ఉండి ఎలాంటి తప్పు లు లేని భూమి పట్టా మార్పిడి మాత్రమే జరిగింది. చదవండి👉 Teenmar Mallanna: బీజేపీకి తీన్మార్ మల్లన్న గుడ్ పార్ట్–బీలో ఉన్న భూముల సమస్యలను పరిష్కరించి పట్టా పాసు పుస్తకాలను జారీ చేయడం, పట్టా మార్పిడి చేయడం వీలు పడలేదు. కొన్ని ఆప్షన్లు ఇచ్చి ప్రధాన ఆప్షన్లను ఇవ్వకపోవడంతో భూముల పట్టా మార్పిడి జరగకపోవడం, వివాదాలు పరిష్కారం కాకుండా ఉండిపోయాయి. ధరణిలో తాజాగా పాస్ బుక్కులలో పేర్ల మార్పు, భూమి స్వభావం, వర్గీకరణ, భూమి రకం, విస్తీర్ణం లెక్కలను సరి చేయడం, మిస్సింగ్ సర్వే నంబర్లను గుర్తించి వాటిని ఎక్కించడం, సబ్ డివిజన్ల చేర్పు, నేషనల్ ఖాతా నుంచి పట్టా భూమి మార్పు, భూమి అనుభవంలో మార్పులకు అవకాశం ఏర్పడింది. ఇలా పలురకాల ఆప్షన్లను ఇవ్వడంతో అనేక సమస్యలను త్వరితగతిన పరిష్కరించడానికి మా ర్గం సుగమమైందని తహసీల్దార్లు చెబుతున్నారు. చదవండి👉🏻 దయాకర్‌కు నోటీసులు.. మదన్మోహన్కు హెచ్చరిక కొత్త ఆప్షన్లను పరిశీలిస్తున్నాం ధరణిలో ఇచ్చిన కొత్త ఆప్షన్లను పరిశీలిస్తున్నాం. గతంలో పెండింగ్‌లో ఉన్న సమస్యలను ఎంత మేరకు పరిష్కరించవచ్చో క్షుణ్ణంగా పరిశీలించి చర్యలు తీసుకుంటాం. కొత్త ఆప్షన్లతో ప్రధాన సమస్యలు పరిష్కారం అవుతాయని ఆశిస్తున్నాం. – శ్రీధర్, తహసీల్దార్, మోర్తాడ్ -
Sakshi Cartoon: ఎలుకల నుండి మానవుల్లోకి ఒమిక్రాన్
ఎలుకల నుండి మానవుల్లోకి ఒమిక్రాన్ -
ఏపీ ప్రభుత్వం నూతన మార్గదర్శకాలు.. ఇక సులభంగా మ్యుటేషన్లు
సాక్షి, అమరావతి: భూ యాజమాన్య హక్కులకు సంబంధించి మ్యుటేషన్ల ప్రక్రియను మరింత సులభతరం చేసేందుకు ప్రభుత్వం నూతన మార్గదర్శకాలు జారీ చేసింది. ఈ మేరకు పలు అంశాలపై కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లు, రెవెన్యూ అధికారులకు స్పష్టతనిస్తూ భూపరిపాలన ప్రధాన కమిషనర్(సీసీఎల్ఏ) సాయిప్రసాద్ ఆదేశాలు ఇచ్చారు. ముందే సబ్ డివిజన్ తప్పనిసరి మ్యుటేషన్‌కు దరఖాస్తు చేసుకున్న వారు దానికి ముందే సర్వే నెంబర్‌ను సబ్ డివిజన్ చేసుకోవడాన్ని తప్పనిసరి చేశారు. సబ్ డివిజన్ ప్రక్రియ పూర్తై రికార్డుల్లో సర్వే నెంబర్లు, పేర్లన్నీ ఆ ప్రకారం ఉన్నట్లు నిర్థారించుకున్న తర్వాతే మ్యుటేషన్ ప్రక్రియ ప్రారంభించాలని తహశీల్దార్లకు సూచించారు. పాస్బుక్ల జారీ కూడా మ్యుటేషన్ సమయంలోనే పూర్తి చేయాలని పేర్కొన్నారు. మ్యుటేషన్‌తోపాటు పాస్‌బుక్ కోసం దరఖాస్తు స్వీకరించి రెండింటినీ ఒకేసారి పూర్తి చేయాలని స్పష్టం చేశారు. ప్రభుత్వ భూములపై.. ప్రభుత్వ భూములను ఎట్టి పరిస్థితుల్లోనూ మ్యుటేషన్ చేయరాదని సూచించారు. కొన్ని ప్రత్యేక కేసుల్లో చేయాల్సి వచ్చినప్పుడు ఆ బాధ్యతను పూర్తిగా జాయింట్ కలెక్టర్లకు అప్పగించారు. అది కూడా కలెక్టర్ల నుంచి వచ్చిన ఫైలు ఆధారంగా చేయాలని స్పష్టం చేశారు. ఇప్పటివరకు తహశీల్దార్లకు ఉన్న ఈ అధికారాన్ని జేసీలకు బదలాయించారు. వారసత్వ వివాదాలకు సంబంధించి మ్యుటేషన్ల విషయంలో ఫ్యామిలీ సర్టిఫికెట్‌ను తహశీల్దార్ అదే సమయంలో ఇవ్వాలని నిర్దేశించారు. మ్యుటేషన్ చేసుకునే సమయంలోనే ఫ్యామిలీ సర్టిఫికెట్‌ను దరఖాస్తుదారుడు ఇచ్చినప్పుడు మళ్లీ ఆ కుటుంబం గురించి విచారణ చేయాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. చుక్కల భూములు, అసైన్డ్ మ్యుటేషన్‌పై స్పష్టత చుక్కల భూముల చట్టం వచ్చే నాటికి 12 సంవత్సరాలు దాటి సంబంధిత భూములు దరఖాస్తు చేసుకున్న వారి స్వాధీనంలోనే ఉన్నట్లు రికార్డుల ప్రకారం నిర్థారణ అయితే వాటికి మ్యుటేషన్ చేయవచ్చని సూచించారు. తీర్పులు వెలువడిన కేసులు, కోర్టు ద్వారా వేలం పాట నిర్వహించిన ఆస్తులను కొనుగోలు చేసిన వారికి వెంటనే యాజమాన్య హక్కులు కల్పించాలని కలెక్టర్లను ఆదేశించారు. అసైన్డ్ భూములకు సంబంధించి రికార్డుల్లో ఉన్న వ్యక్తులే మ్యుటేషన్‌కు దరఖాస్తు చేసుకుంటే చేయాలని, మూడో వ్యక్తి ఎవరైనా దరఖాస్తు చేస్తే తిరస్కరించాలని స్పష్టం చేశారు. భూముల రీ సర్వే పూర్తయిన చోట సర్వే పూర్తయినట్లు జారీ చేసే 13 నోటిఫికేషన్ ఇవ్వడానికి ముందే అప్పటివరకు ఉన్న మ్యుటేషన్ దరఖాస్తులను క్లియర్ చేయాలని నిర్దేశించారు. మ్యుటేషన్ దరఖాస్తులను చిన్న కారణాలతో తిరస్కరించకూడదని, ఎందుకు తిరస్కరించారో స్పష్టమైన కారణాలు చూపాలని, ఇంకా ఏ డాక్యుమెంట్లు కావాలో స్పష్టంగా పేర్కొనాలని సూచించారు. మ్యుటేషన్ కోసం వచ్చే దరఖాస్తుల్లో 45 శాతం తిరస్కారానికి గురవుతుండడంతో పలు అంశాలపై స్పష్టత ఇస్తూ ప్రభుత్వం ఈ మార్గదర్శకాలు జారీ చేసింది. -
కరోనా కొత్త మ్యూటెంట్.. ప్రకటించిన డబ్ల్యూహెచ్‌వో
New Covid Variant XE: ఒక వేవ్ ముగిసిందని, ఒక వేరియెంట్ ప్రభావం తగ్గిపోయిందని అనుకునేలోపు.. కొత్త వేరియెంట్, మ్యూటెంట్ తెర మీదకు వస్తోంది. తాజాగా కొత్తగా బయట పడిన కరోనా మ్యూటెంట్ పేరు చెప్పేసింది ప్రపంచ ఆరోగ్య సంస్థ. ‘ఎక్స్ఈ’ గా పిలిచే ఈ కరోనా మ్యూటెంట్ గురించి ఆసక్తికర విషయాలను వెల్లడించింది. కొవిడ్-19 ఎక్స్ఈ Covid-19 XE.. మరింత వేగంగా వ్యాపించే గుణం ఉందని డబ్ల్యూహెచ్‌వో ప్రకటించింది. ఒమిక్రాన్ వేరియెంట్లో ఉప రకమైన బీఏ.2 (స్టెల్త్ కరోనా)ను ఇప్పటి వరకు అత్యంత వేగంగా వ్యాపించే వేరియంట్ గా భావిస్తున్నారు. అయితే.. స్టెల్త్ కరోనాతో పోలిస్తే ఎక్స్ఈ రకానికి 10 శాతం ఎక్కువ వేగంతో వ్యాపించే గుణం ఉందని గుర్తించినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ తన ఎపిడెమియోలాజికల్ నివేదికలో పేర్కొంది. ఇప్పటికీ ఒమిక్రాన్ ఉపకరం బీఏ.2 పలు దేశాల్లో విస్తరిస్తూనే ఉంది. అమెరికాలో కొత్తగా వెలుగు చూస్తున్న కేసుల్లో అత్యధికం ఈ రకానివే ఉంటున్నాయి. కానీ, ఎక్స్ఈ అన్నది రెండు రకాల హైబ్రిడ్ వెర్షన్. ఒమిక్రాన్ బీఏ.1, బీఏ.2 కలగలిసిన రూపం. ఇదిలా ఉంటే.. ఎక్స్ఈ రకాన్ని మొదటిసారిగా 2022 జనవరి 19న బ్రిటన్ లో గుర్తించారు. ప్రస్తుతానికి ఎక్స్ఈ కేసులు చాలా స్పల్ప స్థాయిలోనే ఉన్నాయట. అయితే ముందు ముందు పరిస్థితిని అంచనా వేయలేమని డబ్ల్యూహెచ్‌వో హెచ్చరిస్తోంది. ఇందులోనూ రకాలు! యూకే హెల్త్ సెక్యూరిటీ ఏజెన్సీ అధ్యయనం ప్రకారం.. మూడు రకాల రీకాంబినెంట్ స్ట్రెయిన్లు ఎక్స్ డీ, ఎక్స్ఈ, ఎక్స్ఎఫ్ ప్రస్తుతం వ్యాప్తిలో ఉన్నాయి. గతంలో వెలుగు చూసిన రెండు ఉప రకాలతో కలసిన స్వరూపాన్ని రీకాంబినెంట్ గా చెబుతారు. ఇందులో ఎక్స్ డీ అన్నది.. డెల్టా, బీఏ.1 కలసిన రకం. ఎక్స్ఎఫ్ అన్నది డెల్టా, బీఏ.1 కలసిన మరొక రూపం. -
డెల్టా + ఒమిక్రాన్ = డెల్మిక్రాన్!!
ముంబై: కరోనా కట్టడికి ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా మహమ్మారి మాత్రం సరికొత్త రూపాల్లో మానవాళిపై దండయాత్ర కొనసాగిస్తూనే ఉంది. తాజాగా బయటపడ్డ ఒమిక్రాన్ వల్ల పాశ్చాత్య దేశాలు విలవిల్లాడుతున్నాయని అందరూ భావిస్తున్నారు. ఇది ఒమిక్రాన్ ఒక్కదాని వల్ల జరగడం లేదని, డబుల్ వేరియంట్ వల్లనే ఈ కల్లోలం జరుగుతోందని నిపుణులు భావిస్తున్నారు. యూరప్, యూఎస్ సహా పశ్చిమాదిన కలకలం సృష్టిస్తున్నది ‘డెల్మిక్రాన్’ అనే డబుల్ వేరియంట్ అని, దీనికి డెల్టా తీవ్రత, ఒమిక్రాన్ వేగం ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 2022లో కరోనా రహిత ప్రపంచాన్ని చూడొచ్చన్న ప్రజల ఆశలకు ఈ డెల్మిక్రాన్ వమ్ముచేసిందంటున్నారు. పశ్చిమ దేశాల్లో కేసుల సునామీకి ఇదే కారణమని కోవిడ్ పరిశోధకుడు డా. శశాంక్ జోషి అభిప్రాయపడ్డారు. ఆల్ఫా, బీటా లాగా డెల్మిక్రాన్ కరోనా కొత్త వేరియంట్ కాదని, ఇది ఇప్పటికే ఉన్న వేరియంట్ల కలయికతో ఏర్పడిందని వివరించారు. అంటే దీన్ని డబుల్ వేరియంట్‌గా చెప్పవచ్చు. ఇలాంటి డబుల్ వేరియంట్లు రూపొందడం చాలా అరుదుగా జరుగుతుంది. డెల్టా కేసులు భారత్‌లో ఈ ఏడాది సెకండ్ వేవ్‌కు కారణమయ్యాయి. తాజాగా ఒమిక్రాన్ భారత్‌లోకి ప్రవేశించింది. ఈ దశలో ఇండియాలో ఈ రెండు వేరియంట్ల కలయిక ఏ పరిణామాలకు దారితీస్తుందో వేచిచూడాల్సిఉందని జోషి చెప్పారు. డబుల్ ఇబ్బందులు వైరస్‌లో జరిగే మ్యుటేషన్లు(ఉత్పరివర్తనాలు) కొత్త వేరియంట్ ఏర్పడేందుకు కారణమవుతాయి. కానీ ఇలాంటి డబుల్ వేరియంట్లు ఇప్పటికే ఉన్న వేరియంట్ల కలయికతో రూపొందుతాయని సైంటిస్టులు వివరించారు. ఉదాహరణకు ఇప్పటికే డెల్టా వేరియంట్ సోకి కోలుకుంటున్న వ్యక్తికి ఒమిక్రాన్ సోకితే అతనిలో డెల్మిక్రాన్ రూపొందే అవకాశం ఉందన్నారు. డెల్మిక్రాన్లో అటు డెల్టా నుంచి తీవ్ర వ్యాధి కలిగించే లక్షణాలు, ఇటు ఒమిక్రాన్ నుంచి వేగంగా వ్యాపించే లక్షణం వచ్చాయి. అందుకే ఇది ప్రస్తుతం పాశ్చాత్య దేశాలను ముంచెత్తుతోంది. డెల్మిక్రాన్ సోకిన వారిలో అధిక జ్వరం, నిరంతర దగ్గు, వాసన లేదా రుచి కోల్పోవడం, తలనొప్పి, ముక్కుదిబ్బడ, గొంతులో గరగరలాంటి లక్షణాలను నిపుణులు గమనించారు. భారత్‌లో ఒమిక్రాన్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. ఇంతవరకు డెల్మిక్రాన్ వేరియంట్ జాడ మాత్రం భారత్‌లో లేదు. భారత వాతవరణానికి ఒమిక్రాన్ ఎలా స్పందిస్తుందోనని నిపుణులు ఆందోళనగా ఎదురుచూస్తున్నారు. కొందరు మాత్రం ఇండియాలో డెల్మిక్రాన్ ప్రమాదం ఉండకపోవచ్చని అంచనా వేస్తున్నారు. డెల్టా, ఒమిక్రాన్, డెల్మిక్రాన్.. ఏదైనా సరే టీకాలు తీసుకోవడం, సరైన నిబంధనలు పాటించడంతో దరిచేరకుండా జాగ్రత్త పడవచ్చని ఆరోగ్య నిపుణుల సూచన. -
Omicron Variant : గంటన్నరలో ఒమిక్రాన్ ఫలితం
న్యూఢిల్లీ: ఢిల్లీలోని ఐఐటీ పరిశోధక బృందం గంటన్నరలో ఒమిక్రాన్ వేరియంట్‌ను గుర్తించే కొత్త పరీక్షా విధానాన్ని రూపొందించారు. ఆర్టీపీసీఆర్ ఆధారిత నిర్ధారణ పరీక్షతో కోవిడ్ కొత్త వేరియంట్‌ను వేగంగా గుర్తించవచ్చని అధికారులు తెలిపారు. ఒమిక్రాన్‌ను గుర్తించేందుకు జీనోమ్ స్వీకెన్సింగ్‌ను వాడుతున్నారు. దీని ఫలితాలు వచ్చేందుకు 3 రోజులు పడతుంది. ఈ నేపథ్యంలో ఐఐటీ ఢిల్లీకి చెందిన కుసుమా స్కూల్ ఆఫ్ బయలాజికల్ సైన్సెస్ రాపిడ్ స్క్రీనింగ్ పరీక్షను అభివృద్ధి చేసింది. ప్రస్తుతం ఈ పరీక్షకు పేటెంట్ తీసుకోవడం కోసం ఐఐటీ దరఖాస్తు చేసుకుంది. ఉత్పత్తి కోసం పారిశ్రామిక భాగస్వాములతో చర్చలు ప్రారంభించింది. ఒమిక్రాన్‌లో వేరియంట్లో మాత్రమే కనిపించే ప్రత్యేక ఉత్పరివర్తనాలను(మ్యుటేషన్లు) గుర్తించడంపై ఆధారపడి నిర్ధారణా పరీక్షను రూపొందించారు. ఎస్జీన్లో ఉండే మ్యుటేషన్లు పరీక్షలో బయటపడితే ఒమిక్రాన్‌గా నిర్ధారిస్తారు. సింథటిక్ డీఎన్ఏ ముక్కలను ఇందులో వాడతారు. కొత్త విధానంతో తొందరగా ఒమిక్రాన్‌ను గుర్తించవచ్చన్నారు. గతంలో కరోనాను తొందరగా, సులభంగా గుర్తించే పీసీఆర్ ఆధారిత పరీక్షను ఐఐటీ ఢిల్లీ రూపొందించింది. ఐసీఎంఆర్ అనుమతి లభించిన అనంతరం మార్కెట్లోకి విడుదల చేశారు. ఇప్పుడు ఒమిక్రాన్ వేరియంట్‌ను గుర్తించే పరీక్షకు అనుమతులు లభిస్తే మరింత విరివిగా, తొందరగా ఫలితాలు రాబట్టవచ్చని అధికారుల అంచనా. చదవండి: ‘నెల రోజులే ఎందుకు? రెండు, మూడు నెలలు బెనారస్‌లోనే ఉండాలి’ -
మ్యుటేషన్ మాయాజాలం
సాక్షి, అమరావతి: వారసత్వ భూముల యాజమాన్య హక్కులకు సంబంధించి మ్యుటేషన్ల లొసుగులతో దశాబ్దాలుగా ఎడతెగని వివాదాలతోపాటు ఖజానాకు భారీగా గండి పడుతోంది. రిజిస్టర్ డీడ్లు లేకుండానే రెవెన్యూ అధికారులు ఎడాపెడా మ్యుటేషన్లు చేసేస్తుండటంతో ఏటా దాదాపు రూ.800కోట్ల వరకు ఆదాయాన్ని ప్రభుత్వం కోల్పోతోంది. మరోవైపు సివిల్ వివాదాలు పెరుగుతుండటంతో సామాన్యులు సమస్యల్లో చిక్కుకుంటున్నారు. రాష్ట్ర డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్ఐ) తాజాగా నిర్వహించిన తనిఖీల్లో ఈ వ్యవహారం బయటపడింది. రిజిస్టర్డ్ డీడ్ తప్పనిసరి.. హిందూ వారసత్వ చట్టం ప్రకారం వారసత్వ ఆస్తిని ఆ వారసుల పేరిట మ్యుటేషన్ చేయాలంటే పార్టీషన్ డీడ్‌ను తప్పనిసరిగా రిజిస్టర్ చేయించాలని ‘రిజిస్ట్రేషన్ చట్టం–1986’ స్పష్టం చేస్తోంది. ఒక వ్యవసాయ భూమి యజమాని మరణిస్తే ఆయన/ఆమె ఆస్తి వారసులకు చెందుతుంది. ఆ వ్యవసాయ భూములను వారు భాగాలుగా చేసుకుని తమ పేరిట మ్యుటేషన్ చేసుకుంటారు. అందుకోసం ముందుగా వారసులు ఆ ఆస్తిని పంపకాలు చేసుకునే ఒప్పందాన్ని అంటే తగిన స్టాంపు డ్యూటీ చెల్లించి పార్టీషన్ డీడ్‌ను రిజిస్టర్ చేయాలి. రిజిస్టర్డ్ పార్టీషన్ డీడ్ ఉంటేనే అందులో పేర్కొన్న మేరకు ఆ వ్యవసాయ భూములను వారసుల పేరిట తహసీల్దార్లు మ్యుటేషన్ చేయాలి. సర్క్యులర్ సాకుతో చట్ట విరుద్ధంగా... రాష్ట్రంలో దశాబ్దాలుగా రెవెన్యూ అధికారులు పార్టీషన్ డీడ్ లేకుండానే వ్యవసాయ భూములను మ్యుటేషన్ చేసేస్తున్నారు. 1989లో సర్వే, సెటిల్మెంట్స్ కమిషనర్ ఇచ్చిన ఓ సర్క్యులర్‌ను దీనికి సాకుగా చూపుతున్నారు. రిజిస్టర్డ్ పార్టీషన్ డీడ్ లేకపోయినా సరే తగిన స్టాంపు డ్యూటీ చెల్లిస్తే మ్యుటేషన్ చేయవచ్చని అప్పటి కమిషనర్ ఓ సర్క్యులర్ జారీ చేశారు. పార్టీషన్ డీడ్‌ను రిజిస్ట్రేషన్ చేయాలని చట్టం చెబుతుండగా అందుకు విరుద్ధంగా అప్పటి కమిషనర్ ఇచ్చిన సర్క్యులర్‌కు విలువ ఉండదని నిపుణులు పేర్కొంటున్నారు. చట్టం, సర్క్యులర్‌లో పరస్పర విరుద్ధ అంశాలు ఉన్నప్పుడు చట్టం చెప్పిందే పాటించాలని నిబంధనలు స్పష్టం చేస్తున్నాయి. కాబట్టి ఆ సర్క్యులర్‌కు ఎలాంటి ప్రాధాన్యత లేదని స్పష్టమవుతోంది. పోనీ ఆ సర్క్యులర్‌లో పేర్కొన్నట్లుగా స్టాంపు డ్యూటీని కట్టించుకుంటున్నారా అంటే అదీ లేదు. కేవలం ఆ సర్క్యులర్‌ను సాకుగా చూపిస్తున్నారు కానీ అందులో అంశాన్ని తహసీల్దార్లు పాటించడం లేదన్నది స్పష్టమవుతోంది. ఏటా రూ.800 కోట్ల నష్టం... డీఆర్ఐ ఇటీవల రాష్ట్రవ్యాప్తంగా తహసీల్దార్ కార్యాలయాల్లో మ్యుటేషన్ల తీరును పరిశీలించగా విస్మయకర వాస్తవాలు వెలుగు చూశాయి. 2020 ఆగస్టు నుంచి 2021 ఆగస్టు వరకు రాష్ట్రంలో 8,55,937 మ్యుటేషన్లు జరగ్గా కేవలం 68,239 మ్యుటేషన్లకే రిజిస్టర్డ్ పార్టీషన్ డీడ్లు ఉండటం గమనార్హం. అంటే నిబంధనలకు విరుద్ధంగా ఏకంగా 7,87,698 మ్యుటేషన్లు జరిగాయి. దీంతో స్టాంపు డ్యూటీ రూపంలో రావాల్సిన దాదాపు రూ.800 కోట్ల ఆదాయాన్ని ప్రభుత్వం కోల్పోయింది. ఒక్క ఏడాదిలోనేఇంద నష్టం వాటిల్లిందంటే 30 ఏళ్లుగా ఎంత ఆదాయాన్ని కోల్పోయిందో ఊహకే అందడం లేదు. దీనిపై డీఆర్ఐ సమగ్ర నివేదికను ప్రభుత్వానికి సమర్పించింది. పెరుగుతున్న న్యాయ వివాదాలు రిజిస్టర్డ్ పార్టీషన్ డీడ్లు లేకుండా ఎడాపెడా మ్యుటేషన్లు చేస్తుండటంతో సివిల్ వివాదాలు పెరుగుతున్నాయి. వారసుల మధ్య తదనంతర కాలంలో విభేదాలు తలెత్తుతుండటంతో న్యాయపరమైన చిక్కులు ఏర్పడుతున్నాయి. చాలా చోట్ల తప్పుడు పత్రాలతో, వారసులందరి సమ్మతితో నిమిత్తం లేకుండా రిజిస్ట్రేషన్లు చేస్తున్నారు. అదే రిజిస్టర్డ్ పార్టీషన్ డీడ్ల విధానాన్ని తప్పనిసరిగా అమలు చేస్తే సివిల్ వివాదాలను చాలా వరకు నివారించవచ్చని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. 2020 ఆగస్టు నుంచి 2021 ఆగస్టు వరకు మ్యుటేషన్ల వివరాలు -
కరోనా ఎందుకు మార్పు చెందుతోంది...
ఏడాదిన్నర కింద కరోనా వైరస్ దాడి మొదలైంది. ఏడాది కింద మొదటి వేవ్‌తో కలకలం సృష్టించింది. ఇటీవల రెండో వేవ్‌తో అతలాకుతలం చేసింది. త్వరలో మూడో వేవ్ వస్తోందన్న ఆందోళననూ రేకెత్తిస్తోంది. అంతా కరోనానే అయినా.. మొదట్లో వచ్చిన వైరస్ వేరియంట్ ఆల్ఫా, ఇప్పుడున్నది డెల్టా, మూడోవేవ్‌కు కారణమవుతాయన్నది డెల్టా ప్లస్. మరి అసలు వైరస్ ఇలా మ్యూటేట్ అవడం ఏమిటి? కారణాలు ఏమిటి? దీనివల్ల ప్రమాదం ఎంత? దేశంలో ప్రస్తుత పరిస్థితి ఏమిటన్నది తెలుసుకుందామా.. – సాక్షి సెంట్రల్ డెస్క్ వైరస్ మ్యుటేషన్లు, వేరియంట్లు ఏమిటి సాధారణంగా వైరస్లు పరిస్థితులకు అనుగుణంగా తరచూ వాటిల్లోని జన్యు, ప్రొటీన్ పదార్థాలను మార్చుకుంటూ ఉంటాయి. ఈ మార్పులనే మ్యుటేషన్లు అంటారు. జన్యు, ప్రొటీన్లలో జరిగిన మార్పులను బట్టి ఆ వైరస్ లక్షణాలు తీవ్రంగా మారడంగానీ, ఉన్న సామర్థ్యాన్ని కోల్పోవడం గానీ జరుగుతుంది. ఇలా మ్యుటేషన్లు జరిగిన వైరస్ రకాలనే వేరియంట్లు అంటారు. వైరస్ ఎంత ఎక్కువగా వ్యాప్తి చెందుతూ పోతుంటే.. అంత ఎక్కువగా మ్యుటేషన్లు చెంది కొత్త కొత్త వేరియంట్లు వస్తాయి. వీటిలో కాస్త జాగ్రత్తగా ఉండాల్సిన వేరి యంట్లను ‘వేరియంట్ ఆఫ్ ఇంట్రెస్ట్ (వీఓఐ)’గా.. ప్రమాదకరంగా మారే అవకాశమున్న వాటిని ‘వేరియంట్ ఆఫ్ కన్సర్న్ (వీఓసీ)’గా సూచిస్తున్నారు. కరోనా ఎందుకు మార్పు చెందుతోంది ►ప్రజలు కోవిడ్ నిబంధనలు సరిగా పాటించకపోవడం వల్ల విపరీతంగా వ్యాప్తి చెందే అవకాశం ఉండటం ►వ్యాపించిన కొద్దీ వైరస్ తన సామర్థ్యాన్ని పెంచుకునే ప్రయత్నం చేయడం ►భారీగా పునరుత్పత్తి చేసుకునే క్రమంలో వైరస్ విభజనలో తేడాలు ►ప్లాస్మా థెరపీ, వ్యాక్సిన్లు, మోనోక్లోనల్ యాంటీబాడీస్ వంటి చికిత్సలతో శరీరంలో ఏర్పడిన రోగనిరోధక శక్తిని ఎదుర్కొనేందుకు వైరస్ ప్రయత్నించడం. మ్యుటేషన్ల వల్ల ప్రమాదం ఎంత వరకు? ►వైరస్ ఇన్ఫెక్షన్ తీవ్ర స్థాయిలో ఉండటం ►వ్యాప్తి చెందే సామర్థ్యం పెరగడం ►రోగ నిరోధక వ్యవస్థ నుంచి తప్పించుకోవడం ►ఊపిరితిత్తుల కణాలకు మరింత సులువుగా అతుక్కునే సామర్థ్యం రావడం ►ఒకచోట ఉన్నవారందరికీ గుంపులుగా ఇన్ఫెక్ట్ కావడం ►మోనోక్లోనల్ యాంటీ బాడీస్ నుంచి తప్పించుకునే శక్తి సంతరించుకోవడం దేశంలో ‘కన్సర్న్’ వేరియంట్ల పరిస్థితి ఏమిటి? ►దేశవ్యాప్తంగా 35 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల పరిధిలోని 174 జిల్లాల్లో ప్రమాదకర కరోనా వేరియంట్లను గుర్తించారు. ►ముఖ్యంగా మహారాష్ట్ర, ఢిల్లీ, పంజాబ్, తెలంగాణ, పశ్చిమబెంగాల్, గుజరాత్‌లలో ఇవి ఎక్కువగా వ్యాప్తిలో ఉన్నాయి. ►40వేల శాంపిళ్లలో ప్రమాదకర వేరియంట్లపై చేసిన కమ్యూనిటీ స్టడీలో.. ఆల్ఫా వేరియంట్ కేసులు 3,969.. గామా రకం ఒకటి.. బీటా రకం 149.. డెల్టా, దాని అనుబంధ రకాల కేసులు 16,238 నమోదయ్యాయి. ►కరోనా కొత్త కేసుల్లో ‘వీఓసీ’ల శాతం మే రెండో వారంలో 10.31 శాతమే ఉండగా.. జూన్ 20 నాటికి ఏకంగా 51 శాతానికి పెరిగింది. అంటే ప్రమాదకర వేరియంట్ల వ్యాప్తి పెరుగుతోంది. డెల్టా వేరియంట్లు.. ప్రమాదం లెక్కలివీ.. దేశంలో కరోనా రెండో వేవ్‌కు ప్రధాన కారణమైన డెల్టా (బీ.1.617) వేరియంట్ మరికొన్ని మార్పులు చెంది.. మూడు సబ్ వేరియంట్లు గా మారింది. ఇందులో కప్పా (బీ.1.617.1), లంబ్డా (బీ.1.617.3)లను జాగ్రత్త పడాల్సిన ‘వీఓఐ’ రకాలుగా గుర్తించారు. మరొకటైన డెల్టా ప్లస్ (బీ.1.617.2 లేదా ఏవై.1) రకాన్ని ప్రమాదకరమైన ‘వీఓసీ’ రకంగా ప్రకటించారు. ►డెల్టా ప్లస్ వేరియంట్‌కు వ్యాప్తి చెందే లక్షణం, ఊపిరితిత్తుల్లోని కణాలకు అతుక్కునే సామర్థ్యం మరింత ఎక్కువ. వ్యాక్సిన్‌తో శరీరంలో ఏర్పడిన రోగ నిరోధక శక్తి నుంచి, మోనోక్లోనల్ యాంటీబాడీస్ నుంచి తప్పించుకునే సామర్థ్యం పెరిగింది. దేశంలో ‘డెల్టా ప్లస్’ కేసుల తీరు ►దేశవ్యాప్తంగా 11 రాష్ట్రాల్లో కలిపి ఇప్పటివరకు 51 డెల్టా ప్లస్ కేసులను గుర్తించారు. ►ఐసీఎంఆర్, నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ (ఎన్ఐవీ) ల్యాబ్‌లలో ఈ వేరియంట్‌పై పరిశోధనలు చేస్తున్నారు. ►వ్యాక్సిన్ తీసుకున్నాక ఈ వేరియంట్ కరోనా సోకినవారి పరిస్థితి ఏమిటి, వ్యాక్సిన్ ప్రభా వం ఎంత వరకు ఉందన్నది కచ్చితంగా తేల్చేందుకు పలు ఆస్పత్రుల్లో అధ్యయనం జరుగుతోంది. ప్రమాదకర వేరియంట్ల నియంత్రణ ఎలా? దేశంలో ప్రమాదకర వేరియంట్లు విస్తరిం చకుండా కేంద్ర వైద్యారోగ్య శాఖ పలు సూచనలు చేసింది. ఈ తరహా కేసులు వచ్చిన ప్రాంతాలను కంటైన్మెంట్ జోన్లుగా ప్రకటించడం, బాధితులను ప్రత్యేకంగా ఐసోలేట్ చేసి, తగిన చికిత్స అందించడం, వారి కాంటా క్టులను క్వారంటైన్ చేయడం, ఆయా ప్రాంతాల్లో వ్యాక్సినేషన్ భారీగా చేపట్టడం వంటి చర్యలు చేపట్టాలని ఆదేశించింది. ►ప్రమాదకర వేరియంట్లు వచ్చిన జిల్లాలపై రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని, వైద్యారోగ్య సేవలను పెంచాలని సూచించింది. ►విస్తృతంగా కరోనా టెస్టులు చేయడం, పాజిటివ్ వచ్చిన వారి కాంటాక్టుల ట్రేసింగ్, శాంపిళ్లను జీనోమ్ సీక్వెన్సింగ్‌కు పంపడం, జనం గుంపులుగా ఉండకుండా చూడటం తప్పనిసరి అని స్పష్టం చేసింది. చదవండి: ‘రోగుల ఆశీర్వాదాలే మాకు యాంటీబాడీస్’ -
రిజిస్ట్రేషన్ ఆఫీస్‌లోనే.. మ్యుటేషన్
సాక్షి, హైదరాబాద్: వ్యవసాయేతర ఆస్తుల మ్యుటేషన్ ప్రక్రియను సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాల్లోనే పూర్తి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఈ మేరకు గతంలో స్థానిక సంస్థలకు (మున్సిపాలిటీలు, గ్రామపంచాయతీలు) ఉన్న మ్యుటేషన్ బాధ్యతలను రిజిస్ట్రేషన్ల శాఖకు బదలాయించింది. వారం రోజులుగా రాష్ట్రంలోని 141 సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఈ మ్యుటేషన్ ప్రక్రియను పైలట్ పద్ధతిన నిర్వహిస్తున్నారు. అయితే, ప్రస్తుతానికి పాత భవనాల మ్యుటేషన్‌ను మాత్రమే సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాల్లో చేస్తుండగా.. ఖాళీ స్థలాలు, కొత్త భవనాల మ్యుటేషన్‌ను ఇంకా స్థానిక సంస్థల పరిధిలోనే ఉంచారు. సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాల్లోనే మ్యుటేషన్ ప్రక్రియ కోసం జీహెచ్ఎంసీ, మున్సిపల్, పంచాయతీరాజ్ శాఖల సర్వర్లతో రిజిస్ట్రేషన్ల శాఖ సర్వర్‌ను అనుసంధానం చేశారు. అయితే, జీహెచ్ఎంసీ, గ్రామాల్లోని భవనాలకు సంబంధించిన డేటా రిజిస్ట్రేషన్ల శాఖ వద్ద ఉన్న కార్డ్ డేటాతో సరిపోలుతోందని, ఈ రెండుచోట్ల ఇప్పటికే ఆస్తి పన్ను చెల్లించిన భవనాల మ్యుటేషన్‌కు ఎలాంటి ఇబ్బంది తలెత్తడం లేదని తెలుస్తోంది. కానీ, మున్సిపల్ శాఖ డాటాతో రిజిస్ట్రేషన్ల శాఖ డేటా సరిపోలడం లేదని, దీంతో కొత్త మున్సిపాలిటీల్లోని భవనాల మ్యుటేషన్‌కు ఇబ్బందులు వస్తోందని రిజిస్ట్రేషన్ల శాఖ వర్గాల సమాచారం. దీన్ని కూడా అధిగమించేందుకు మున్సిపల్, రిజిస్ట్రేషన్ వర్గాలు ప్రయత్నిస్తున్నాయని, ఈ సమస్య కూడా తీరితే సాధ్యాసాధ్యాలను బట్టి ఖాళీ స్థలాలు, కొత్త భవనాల మ్యుటేషన్ బాధ్యతలు కూడా రిజిస్ట్రేషన్ల శాఖకు అప్పగించే అంశాన్ని మ్యుటేషన్ అంటే.. ఆస్తి బదలాయింపు రిజిస్ట్రేషన్ ప్రక్రియ ద్వారా జరిగితే ఆ ఆస్తిని సంక్రమణదారుడి పేరిట నమోదు చేయడమే మ్యుటేషన్ ప్రక్రియ. గతంలో ఏదైనా భూమి లేదా ఆస్తిపై క్రయ, విక్రయ లావాదేవీ జరిగితే ఆ లావాదేవీని సబ్రిజిస్ట్రార్లు రిజిస్ట్రేషన్ చేసేవారు. ఆ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ ఆధారంగా మ్యుటేషన్ కోసం పట్టణాల్లో అయితే మున్సిపాలిటీలు, గ్రామాల్లో అయితే పంచాయతీలకు వెళ్లేవారు. మ్యుటేషన్ కోసం మళ్లీ మీ సేవా కేంద్రంలో దరఖాస్తు చేసుకునేవారు. మీ సేవా కేంద్రం నుంచి దరఖాస్తు వచ్చిన తర్వాత స్థానిక సంస్థల అధికారులు పాత యజమాని, కొత్త యజమానికి సదరు ఆస్తి లేదా భూమిపై ఉన్న హక్కులు, భూమి/భవనం విస్తీర్ణం ఎంత ఉంది? ఎంత పన్ను చెల్లించాలి? చెల్లించారా లేదా, నిబంధనల ప్రకారం ఉన్నాయా? అనే అంశాలను పరిశీలించి అన్నీ సక్రమంగా ఉంటే సదరు ఆస్తిని రిజిస్ట్రేషన్ లావాదేవీలో ఉన్న సంక్రమణదారుడి పేరిట బదిలీ (మ్యుటేషన్) చేసేవారు. అయితే, ఈ మ్యుటేషన్ కోసం ఫీజును మాత్రం రిజిస్ట్రేషన్ సమయంలోనే చెల్లించేవారు. రిజిస్ట్రేషన్ల శాఖ ద్వారా మ్యుటేషన్ ఫీజు స్థానిక సంస్థలకు వెళ్లేది. మ్యుటేషన్ ఫీజు రిజిస్ట్రేషన్ సమయంలోనే చెల్లిస్తున్నారు కనుక మళ్లీ ప్రత్యేకంగా స్థానిక సంస్థలకు దరఖాస్తు చేసుకునే అవసరం లేకుండా సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాల్లోనే మ్యుటేషన్ ప్రక్రియకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. రిజిస్ట్రేషన్ లావాదేవీ పూర్తయిన తర్వాత ప్రాపర్టీ ట్యాక్స్ ఐడెంటిఫికేషన్ నంబర్ (పీటీఐఎన్)ను నమోదు చేసి, సదరు భవనానికి సంబంధించిన వివరాలు, అన్ని రకాల అనుమతులు ఉన్నాయా.. లేదా.. ఉల్లంఘనలున్నాయా.. అనే అంశాలను పరిశీలించి మ్యుటేషన్ ప్రక్రియను నిర్వహిస్తున్నామని రిజిస్ట్రేషన్ల శాఖ వర్గాలు చెపుతున్నాయి.పరిశీలిస్తున్నామని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. -
మరో కొత్త వేరియంట్.. వాటితో పోలిస్తే మహా డేంజర్..!
సాక్షి, పుణె: భారత్‌లో కరోనా వైరస్ సెకండ్ వేవ్‌లో తీవ్రస్ధాయిలో విజృంభిస్తోంది. కరోనా వైరస్ మ్యుటేషన్ చెందడంతో కేసుల సంఖ్య విపరీతంగా పెరగడానికి ముఖ్యకారణమని పరిశోధకులు తెలిపారు. డెల్టా వేరియంట్‌గా పిలవబడే B.1.617.2 వేరియంట్ భారత్‌లో అత్యధిక ప్రభావం చూపిందని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. కాగా ప్రస్తుతం భారత్‌లో మరో కరోనా వైరస్ వేరియంట్‌ను పుణేలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ (ఎన్ఐవీ) గుర్తించారు. ఈ వేరియంట్‌ను అంతర్జాతీయ ప్రయాణికుల నుంచి సేకరించిన నమూనాల నుంచి B.1.1.28.2 వేరియంట్‌గా గుర్తించారు. ఎన్ఐవి నివేదిక ప్రకారం, బ్రెజిల్, యునైటెడ్ కింగ్డమ్ నుంచి భారత్‌కు వచ్చిన ప్రయాణికుల్లో కొత్త వేరియంట్‌ను కనుగొన్నారు. ఈ కొత్త వేరియంట్ తీవ్రమైన దుష్ప్రభావాలను కలిగించే అవకాశం ఉందని తమ నివేదికలో పేర్కొన్నారు. అంతేకాకుండా ఈ వేరియంట్‌తో వైరస్ వ్యాప్తి మరింత అధికంగా ఉంటుందని అభిప్రాయపడ్డారు. ఈ వేరియంట్ ప్రస్తుతం ఉన్న టీకాలు ఎంతమేరకు సామర్థ్యాన్ని కల్టి ఉన్నాయనే విషయం కోసం , ఎక్కువగా పరీక్షించాల్సిన అవసరం ఉందని నివేదిక పేర్కొంది. కొత్త వేరియంట్‌ను ప్రయోగించిన ఎలుకల్లో శరీర బరువు ఒక్క సారిగా తగ్గిపోయిందని పరిశోధకులు తెలిపారు. అంతేకాకుండా శ్వాసకోశంలో సమస్యలు, ఊపిరితిత్తుల్లో గాయాలు ఏర్పడాయని పేర్కొన్నారు. కాగా, పది ప్రయోగశాలల సమూహమైన ఇన్సాకాగ్ (INSACOG) విస్తృత అధ్యయనం ప్రకారం, గత రెండు నెలల్లో భారత్‌లో కోవిడ్ -19 కేసుల పెరుగుదల SARS-CoV-2 కు చెందిన B.1.617 వేరియంట్ కారణమని తెలిపారు. ఇన్సకాగ్ ప్రకారం కరోనా వైరస్ B.1.1.7 వేరియంట్‌కు 'ఆల్ఫా' అని పేరు పెట్టారు. దీనిని మొదటిసారిగా యునైటెడ్ కింగ్ డమ్‌లో గుర్తించారు. ఈ వేరియంట్ గత ఒకటిన్నర నెలల్లో తీవ్రస్థాయిలో విజృంభించిందని ఇన్సాకాగ్ తెలిపింది. -
Coronavirus: డేంజరస్ డెల్టా ఒళ్లంతా తిష్ట!
సాక్షి, హైదరాబాద్: కోవిడ్ సెకండ్‌వేవ్‌లో వ్యాప్తి చెందిన డెల్టా వేరియంట్ శరీరంలోని కీలక భాగాలపై తీవ్ర ప్రభావాన్ని చూపుతోంది. బి.1.617.2 కోడ్‌తో ఉన్న వేరియంట్‌ను డెల్టాగా పిలుస్తున్నారు. ప్రస్తుతం దేశంలో ఎక్కువగా వ్యాప్తి చెందిన ఈ వేరియంట్ మానవ శరీరంలోకి ప్రవేశించాక అవయవాలపై వేగంగా ప్రభావాన్ని చూపడంతో ఎక్కువ మంది ఆస్పత్రుల్లో చేరాల్సి వస్తోంది. కరోనా మొదటి దశతో పోలిస్తే రెండో దశలో ఎక్కువ మంది ఆస్పత్రిపాలయ్యారు. అస్వస్థతకు గురైన వారిలో చాలా మంది మరణం అంచులవరకు వెళ్లి వచ్చారు. కొందరిలో అవయవాలు దెబ్బతినగా, మరికొందరు జీవితకాల వ్యాధులైన బీపీ, షుగర్ బారినపడ్డారు. మొదటి దశ, రెండో దశలో ఆస్పత్రిలో చేరి.. వారు ఎదుర్కొన్న సమస్యలు, వైరస్ ప్రభావం తదితర అంశాలపై రిషికేష్‌లోని ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(ఎయిమ్స్) పరిశోధన చేసింది. దీనికి ప్రత్యేకంగా కొన్ని కేటగిరీల రోగులను ఎంపిక చేసుకుని పరిశీలించి ఆ నివేదికను విడుదల చేసింది. అన్ని అవయవాలపైనా ప్రభావం... మొదటి దశ కోవిడ్ వ్యాప్తి సమయంలో ఎక్కువ మంది శ్వాసకోశ సమస్యలు, ఊపిరితిత్తుల్లో ఇన్ఫె„క్షన్ రావడంతో ఆస్పత్రులకు పరుగులు తీశారు. కానీ, రెండో దశ తీవ్రత ఎక్కువగా ఉంది. ఊపిరితిత్తులతో పాటు మూత్రపిండాలు, కాలేయం, మెదడు తదితర కీలకమైన అవయవాలపై వైరస్ ప్రతాపాన్ని చూపింది. వీలైనంత ఎక్కువ మార్గాలను ఏర్పాటు చేసుకుని వైరస్ వ్యాప్తి చెందిన శరీరాన్ని గుల్ల చేసింది. మొదటి దశతో పోలిస్తే రెండో దశలో మూత్రపిండాలపై ప్రభావం ఆరు రెట్లు అధికంగా ఉంది. కాలేయంపై చూపిన ప్రభావం గతేడాది కంటే రెండు రెట్లు ఎక్కువ. లివర్‌లోకి వైరస్ వ్యాప్తి చెందడంతో ఆ అవయవం విడుదల చేసే ఎంజైమ్స్ రెట్టింపు చేసి సామర్థ్యాన్ని తగ్గించినట్లు గుర్తించారు. దేశంలో కోవిడ్ బారినపడ్డ 70 శాతం మందిలో డెల్టా వేరియంట్ ఉన్నట్లు ఇప్పటికే ప్రపంచ ఆరోగ్య సంస్థ వివరించింది. బి.1.617.2 రకానికి చెందిన ఈ వేరియంట్ దాదాపు అన్ని రాష్ట్రాల్లోనూ ఇదే తరహాలో తీవ్ర ప్రభావాన్ని చూపింది. డెల్టా వేరియంట్ తెల్ల రక్తకణాల్లోని లింపోసైట్లపై తీవ్ర ప్రభావం చూపడంతో ఎక్కువ మంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఈ వేరియంట్ వైరస్ వ్యాప్తిని ముందుగా లక్షణాలతో గుర్తించి చికిత్స తీసుకున్న వారు ఇంటివద్దే కోలుకుంటుండగా... కాస్త నిర్లక్ష్యం చేసినా ఆస్పత్రికి వెళ్లాల్సిన పరిస్థితి వస్తోంది. దీని నియంత్రణకు వైద్యులు శ్రమించాల్సి వస్తోంది. మొదటి దశ, రెండో దశలో సివియర్ పేషంట్లలో పరిస్థితి ఇలా(గణాంకాలు శాతాల్లో)... కేటగిరీ మొదటి దశ రెండో దశ ఎస్పీఓ2 సగటు 92 85.5 ఫీవర్ 30 85 దగ్గు 14 78 గొంతులో గరగర 11 05 దమ్ము 15 80 నీరసం 9.5 19.6 లూస్మోషన్స్ 11 5 ► మొదటిదశ చికిత్సలో స్టెరాయిడ్లను 4 శాతం మందికే వాడగా... రెండో దశకు వచ్చే సరికి 72 శాతం మందికి ఇచ్చారు. ఇక యాంటిబయోటిక్స్ వినియోగం రెట్టింపు అయ్యింది. ►బాక్టీరియల్ న్యుమోనియా 1.1 శాతం నుంచి 9 శాతానికి పెరగగా, సివియర్ వైరస్ న్యుమోనియా 6 శాతం నుంచి ఏకంగా 49 శాతానికి ఎగబాకింది. ►సీటీ స్కాన్‌లో స్కోర్ గతేడాది కంటే ఈసారి భారీగా పెరుగుదల నమోదైంది. డెల్టా వేరియంట్ వ్యాప్తి చెందిన ఎక్కువ మందిలో ఊపిరితిత్తులపై ప్రభావాన్ని చూపడంతో ఆక్సిజన్ స్థాయిలు భారీగా పడిపోయాయి. కరోనా తొలి దశలో 12 శాతం మందికే ఆక్సిజన్ సప్లిమెంట్ అవసరంపడగా... రెండో దశలో ఏకంగా 82 శాతానికి పెరిగింది. రెమిడెసివిర్ వినియోగం మొదటి దశలో ఒక శాతం కంటే తక్కువ ఉండగా... ప్రస్తుతం ఆస్పత్రిలో చేరిన 12 శాతం మంది వినియోగించారు. సివియర్ కోవిడ్‌తో ఆస్పత్రుల్లో చేరిన వారిలో గతేడాది 90 శాతం మంది డిశ్చార్జ్ కాగా.. సెకండ్ వేవ్‌లో 71శాతం మందే డిశ్చార్జ్ అయినట్లు గుర్తించారు. ఈ లెక్కన మొదటి దశలో నమోదైన మరణాల రేటుతో పోలిస్తే రెండో దశలో మరణాల రేటు మూడు రెట్లు పెరిగినట్లు తెలుస్తోంది. గతేడాది ఆస్పత్రుల్లో చేరిన వారిలో 2.6 శాతం మందికే వెంటిలేటర్ అవసరపడగా ఈసారి 41 శాతానికి పెరిగినట్లు పరిశీలనలో తేలింది. పరిశోధన సాగిందిలా... మొదటి దశ కోవిడ్‌కు సంబంధించి గత ఏడాది ఏప్రిల్, మే, జూన్లలో ఎయిమ్స్‌లో అడ్మిట్ అయిన 106 మంది రోగులు.. రెండో దశ తీవ్రంగా ఉన్న ఈ ఏడాది మార్చి, ఏప్రిల్, మేలో చేరిన 104 మందిపై పరిశీలన చేశారు. మైల్డ్, మోడరేట్, సివియర్ కేటగిరీలుగా కోవిడ్‌ను విభజించి.. వీరిలో వైరస్ చూపిన ప్రభావం, అందించిన చికిత్సను పరిశీలించారు. తొలి దశలో లక్షణాలు లేకున్నా ఆస్పత్రుల్లో చేరగా.. ప్రస్తుతం మోడరేట్ స్టేజి దాటే క్రమం, సివియారిటీకి వచ్చిన తర్వాతే ఆస్పత్రుల్లో చేరారు. . తొలిదశలో 37.5% మందే ఆస్పత్రుల్లో చేరగా.. ప్రస్తుతం 70% మంది చేరారు. గతేడాది ఆస్పత్రుల్లో చేరిన వారి సగటు వయసు 37 యేళ్లు కాగా, ప్రస్తుతం 50.5 యేళ్లు. -
ఎయిడ్స్ పేషెంట్లో 216రోజులుగా కరోనా!
డర్బన్: దక్షిణాఫ్రికా పరిశోధకులు ఒక ఆసక్తికరమైన కేసును వెలుగులోకి తెచ్చారు. ఎయిడ్స్ వ్యాధితో బాధపడుతున్న ఓ మహిళ శరీరంలో 216 రోజులుగా కరోనా వైరస్ పాతుకుపోయిన విషయాన్ని గుర్తించారు. అంతేకాదు ఆమె శరీరంలో ఆ వైరస్ 32 సార్లు మ్యూటేషన్స్కి గురైందని, అది ప్రమాదకరమైన వేరియెంట్లకు దారితీసిందని నిర్ధారించారు. ఈ కేసు గురించి మెడ్ఆర్గ్జివ్ మెడికల్ జర్నల్ ప్రముఖంగా ప్రచురించడంతో విషయం వెలుగులోకి వచ్చింది. ముప్పై ఆరేళ్ల ఆ మహిళ 2006లో హెచ్ఐవీ బారిన పడింది. అప్పటి నుంచి ఆమె ఒంట్లో రోగనిరోధక శక్తి క్షీణిస్తూ వస్తోంది. కిందటి ఏడాది సెప్టెంబర్‌లో ఆమె కరోనా బారిన పడింది. అయితే ఇన్నిరోజులుగా ఆమె శరీరంలో వైరస్ రకరకాల మార్పులు చెందింది. ఆ మ్యూటెంట్స్ వల్ల ఏర్పడిన వేరియెంట్స్(ఆమెవల్ల) ఇతరులకు సోకింది, లేనిది అనేదానిపై ఒక స్పష్టతకి రాలేకపోతున్నారు. క్వాజులూ నటాల్ ప్రాంతంలో ప్రతీ నలుగురిలో ఒకరికి కొత్త వేరియెంట్ లక్షణాలు కనిపిస్తున్నాయి. కానీ, ఈ మహిళ కేసులో ఇన్నిసార్లు మార్పులు కలగడం, ప్రమాదకరమైన వేరియెంట్ల పుట్టుకకు కారణం కావడం ఆందోళన కలిగిస్తోందని రీసెర్చర్లు చెప్తున్నారు. కారణం ఇదే.. సాధారణంగా ఇమ్యూనిటీ లెవల్ తక్కువగా ఉన్నవాళ్లలో కరోనా వైరస్ ఎక్కువ కాలం ఉంటుంది. హెచ్ఐవీ అడ్వాన్స్డ్ స్టేజ్‌లో ఉన్న పేషెంట్లలోనూ ఇది జరుగుతుంది. దక్షిణాఫ్రికా ఎయిడ్స్ పేషెంట్ కేసులో బాధిత మహిళకు కరోనా సోకినప్పుడు మైల్డ్ సింప్టమ్స్ మాత్రమే ఉన్నాయట. అయితే అప్పటి నుంచి ఇప్పటిదాకా వైరస్ ఆమె శరీరంలో సజీవంగా ఉండడం ఆశ్చర్యం కలిగిస్తోందని డర్బన్‌కి చెందిన జెనెటిసిస్ట్ టులియో డె ఒలివెయిరా తెలిపారు. త్వరగా ట్రీట్మెంట్ ఈ పరిశోధనతో హెచ్ఐవీ బారినపడ్డవాళ్లు.. మరిన్ని రకాల కరోనా వైరస్ వేరియెంట్లను వ్యాపింపజేసే అవకాశం ఉందన్న వాదనకు బలం చేకూరిందని రీసెర్చర్లు చెబుతున్నారు. ‘‘హెచ్ఐవీ బారినపడ్డవాళ్లను ట్రేస్ చేసి గుర్తించి, ఇమ్యూనిటీ పెంపొందించేలా మంచి మందులు, సరైన పోషకాహారం అందించాలని, కరోనా బారినపడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని.. ఒకవేళ కరోనా సోకినా మంచి ట్రీట్మెంట్ అందించడం ద్వారా నష్ట తీవ్రతను తగ్గించవచ్చ’’ని టులియో చెప్పారు. ఇక భారత్‌లో సుమారు పది లక్షల మంది హెచ్ఐవీ పేషెంట్లకు సరైన ట్రీట్మెంట్ అందట్లేదని, వీళ్లకు గనుక కరోనా సోకితే పరిస్థితి ఘోరంగా మారొచ్చని ఈ రీసెర్చ్ స్టడీలో పరిశోధకులు అభిప్రాయపడ్డారు. చదవండి: తెలంగాణలో కండోమ్ కొనేందుకు సిగ్గు -
Corona Virus: మూడింట ఒకటి... ‘మహా’ డేంజర్!
సాక్షి, హైదరాబాద్: డబుల్ మ్యుటేషన్‌గా పేరుపొందిన మహారాష్ట్ర వేరియంట్ కరోనా వైరస్ ఇప్పుడు దేశాన్ని వణికిస్తోంది. అత్యంత వేగంగా వ్యాప్తి చెందే గుణమున్న ఈ వైరస్ ఇప్పుడు దేశంలో విస్తృత ప్రభావాన్ని చూపుతోంది. ప్రస్తుతం దేశంలో నమోదవుతున్న కోవిడ్–19 పాజిటివ్‌ల్లో ప్రతి మూడింట్లో ఒకటి మహారాష్ట్ర వేరియంట్ ఉంటోందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) చెబుతోంది. వివిధ దేశాల్లో వైరస్ వ్యాప్తి, తీవ్రత తదితర అంశాలపై తాజాగా డబ్ల్యూహెచ్ఓ నివేదిక విడుదల చేసింది. ఇందులో మహారాష్ట్ర వేరియంట్‌ను ప్రస్తావించింది. ఇప్పటివరకు ప్రపంచ వ్యాప్తంగా పది రకాల వేరియంట్లు ప్రభావవంతంగా ఉన్నాయని డబ్ల్యూహెచ్ఓ వెల్లడించింది. ఈ పదింట్లో కేవలం మూడు (యూకే, బ్రెజిల్, దక్షిణాఫ్రికా) మాత్రమే అత్యంత ప్రభావవంతమైనవని, మిగతా ఏడు సాధారణమైనవని తెలిపింది. తాజా జాబితాలోకి మహారాష్ట్ర వేరియంట్‌ను జతచేస్తూ అత్యంత ప్రభావవంతమైన వేరియంట్లలో ఇది నాలుగోదని వెల్లడించింది. మళ్లీ మూడురకాలుగా మారి.. జన్యు విశ్లేషణ ఆధారంగా వైరస్ వేరియంట్లను ప్రపంచ ఆరోగ్య సంస్థ అంచనా వేస్తోంది. ఈ క్రమంలో ఏప్రిల్ నుంచి మే 11 వరకు దాదాపు 44 దేశాల్లో 4,500 నమూనాలు పరిశీలించగా ఇందులో మహారాష్ట్ర వేరియంట్ (బి.1.617) ఎక్కువగా ఉన్నట్లు డబ్ల్యూహెచ్ఓ గుర్తించింది. ప్రస్తుతం డబుల్ మ్యుటెంట్ వైరస్ మళ్లీ మూడు రకాలుగా రూపాంతరం చెంది వ్యాప్తి చెందుతోంది. ఇందులో మొదటి రకం 34 దేశాల్లో, రెండో రకం 31 దేశాల్లో ప్రభావవంతంగా ఉండగా... మూడో రకం అతి తక్కువగా 4 దేశాల్లో కనిపించినట్లు చెబుతోంది. ఈ వైరస్‌ను తొలుత గత అక్టోబర్‌లోనే గుర్తించినప్పటికీ క్రమంగా మార్పు చెందుతూ ఈ ఏడాది ఫిబ్రవరి నెలాఖరు నుంచి వేగంగా వ్యాప్తి చెందుతూ వస్తోంది. ఏప్రిల్ ఆఖరి వారం నుంచి ఈ నెల 11 నాటికి గుర్తించిన పాజిటివ్ కేసుల్లో మొదటి రకం వైరస్ 21 శాతం ప్రభావవంతంగా ఉంది. రెండో రకం వైరస్ 7 శాతం, మూడో రకం 5 శాతం ప్రభావవంతంగా ఉన్నట్లు పరిశీలన చెబుతోంది. ప్రస్తుతం దేశంలో నమోదవుతున్న పాజిటివ్ కేసుల్లో మొత్తంగా మహారాష్ట్ర వేరియంట్ 33 శాతం ఉంది. ఇంట్లో ఒకరికి వైరస్ సోకితే క్రమంగా ఇంటిల్లిపాదికి వేగంగా అంటుకోవడంతో కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. దేశంలో వ్యాప్తికి కారణాలివే... దేశంలో వైరస్ వ్యాప్తికి అజాగ్రత్తలు, నిర్లక్ష్యమే కారణమని ప్రపంచ ఆరోగ్య సంస్థ తాజా నివేదికలో ప్రస్తావించింది. గత రెండు నెలల్లో దేశవ్యాప్తంగా పలుచోట్ల ఎన్నికల మాస్ మీటింగ్స్ పేరిట జనసమూహాలు విచ్చలవిడిగా జరిగాయి. వీటితోపాటు ఎన్నికలు లేని ఒకట్రెండు రాష్ట్రాల్లో మతపరమైన సమూహాలు పెద్ద ఎత్తున చేరడం లాంటివి చోటుచేసుకున్నాయి. కరోనా వ్యాప్తిపై హెచ్చరికలు చేస్తున్నప్పటికీ.. చాలామంది జాగ్రత్తలు తీసుకోకుండా నిర్లక్ష్యాన్ని ప్రదర్శించారు. లాక్డౌన్ అనంతరం అన్ని రంగాలు తెరుచుకుని సాధారణ స్థితికి చేరుకోవడంతో కార్యకలాపాలు యథావిధిగా సాగుతున్న సమయంలో మాస్కుల వినియోగం సరిగా లేకపోవడం, భౌతికదూరాన్ని పాటించకపోవడం వైరస్ వ్యాప్తికి కారణంగా మారినట్లు చెప్పింది. దూకుడుతో దాడి... మహారాష్ట్ర వేరియంట్ సోకిన వారిలో ఆరోగ్యక్షీణత వేగంగా కనిపిస్తున్నట్లు డబ్ల్యూహెచ్ఓ పరిశీలన చెబుతోంది. మోనోక్లోనల్ యాంటీబాడీస్ ఈ వైరస్‌పై ఎలాంటి ప్రభావాన్ని చూపడం లేదు. దీంతో ఆ రకం ప్లాస్మా థెరపీ కూడా ఏమాత్రం పనిచేయడం లేదు. ఈ వైరస్ శరీరంలోకి ప్రవేశించిన తర్వాత ప్రధానంగా యాన్జియోటెన్సిన్ కన్వర్టింగ్ ఎంజైమ్2 (ఏసీఈ2)పై దాడి ప్రారంభిస్తుంది. శరీరంలోకి ప్రవేశించడమే తరువాయి దూకుడుతో రంగంలోకి దిగుతున్న ఈ వైరస్ ఏసీఈ2 ఎక్కువగా ఉన్న ఊపిరితిత్తులపై ప్రభావం మొదలు పెడుతోంది. దీంతో ఈ వైరస్ సోకిన వారిలో ఎక్కువగా శ్వాససంబంధిత సమస్యలే ముందుగా వస్తున్నాయి. ఆక్సిజన్ స్థాయిలు పడిపోవడంతోపాటు ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్కు కారణమవుతోంది. క్రమంగా దగ్గు రావడం, తీవ్రమైన జ్వరం రోజుల తరబడి ఉండడం, హైఫీవర్ రావడంలాంటి లక్షణాలకు కారణమవుతోంది. న్యుమోనియా వృద్ధి చెందడంతోపాటు ఊపిరితిత్తులు పూర్తిగా దెబ్బతినే అవకాశం ఉంది. అంతేకాకుండా ఈ వైరస్ కడుపులోకి చేరిన వెంటనే డయేరియా మొదలవుతుంది. విపరీతమైన వాంతులు, విరేచనాలతో శరీరం డీహైడ్రేట్ అయ్యి క్రమంగా ఇతర అవయవాల పనితీరుపై పెనుభారం పడుతుంది. వ్యాక్సిన్‌తో ఎదుర్కోవచ్చు మహారాష్ట్ర వేరియంట్ ప్రమాదకారి అయినప్పటికీ వ్యాక్సిన్‌తో ఎదుర్కోవచ్చని తెలుస్తోంది. నిజామాబాద్ ప్రభుత్వ వైద్య కళాశాల పరిధిలో వ్యాక్సిన్ తీసుకున్న వారు కూడా కోవిడ్–19 బారిన పడ్డారు. అయితే ఇందులో 93 శాతం మందిలో ఊపిరితిత్తులపై ఈ రకం వైరస్ ఎలాంటి ప్రభావం చూపలేదని మా పరిశీలనలో గుర్తించాం. అదేవిధంగా వ్యాక్సిన్ తీసుకోని 85 శాతం మందిలో సగం మందికి ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్ గుర్తించాం. అంటే మన టీకా పనితీరు ఇక్కడ కనిపిస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే ప్రభుత్వం ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని, ప్రతి లబ్ధిదారుడు స్లాట్ బుక్ చేసుకుని టీకా వేయించుకోవాలి. –డాక్టర్ కిరణ్ మాదల, అసోసియేట్ ప్రొఫేసర్, ప్రభుత్వ వైద్య కళాశాల, నిజామాబాద్ 44 దేశాల్లో... ప్రపంచ ఆరోగ్య సంస్థ జన్యు విశ్లేషణ ఆధారంగా వైరస్ వేరియంట్లను అంచనా వేస్తుంది. దాదాపు 44 దేశాల్లో 4,500 నమూనాలు పరిశీలించగా ఇందులో మహారాష్ట్ర వేరియంట్ (బి.1.617) ఎక్కువగా ఉన్నట్లు గుర్తించింది. దూకుడెక్కువ.. డబుల్ మ్యుటేషన్‌గా పేరొందిన మహారాష్ట్ర వేరియంట్ కరోనా వైరస్ ఇప్పుడు దేశాన్ని వణికిస్తోంది. అత్యంత వేగంగా వ్యాప్తి చెందే గుణమున్న ఈ వైరస్ ఇప్పుడు విస్తృత ప్రభావాన్ని చూపుతోంది. నంబర్ 4.. ప్రపంచంలో అత్యంత ప్రభావవంతమైన వేరియంట్లు ఇప్పటివరకు మూడు (యూకే, బ్రెజిల్, దక్షిణాఫ్రికా) ఉండగా, ఈ జాబితాలో నాలుగోదిగా మహారాష్ట్ర వేరియంట్ చేరింది. ఇంటిల్లిపాదికీ.. ఇంట్లో ఒకరికి సోకితే ఇంటిల్లిపాదికీ వేగంగా అంటుకుంటోంది. దీంతో కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. ఈ వైరస్ శరీరంలోకి ప్రవేశించడమే తరువాయి.. ఊపిరితిత్తులపై ప్రభావం మొదలు పెడుతోంది. -
యూకే వేరియంట్‌తోనే సమస్య!
‘దేశంలో ప్రస్తుతం యూకే వేరియంట్ వేగంగా వ్యాప్తి చెందుతోంది. గత కొంత కాలంగా డబుల్ మ్యూటెంట్ వేగంగా వ్యాప్తి చెందినా, ప్రస్తుతం యూకే రూపాంతరితమే సమస్యగా మారింది. ప్రజలు నిర్లక్ష్యంగా వ్యవహరించడమే సెకండ్ వేవ్ ఉధృతికి ప్రధాన కారణం..’అని సీసీఎంబీ డైరెక్టర్ డాక్టర్ రాకేశ్ మిశ్రా ‘సాక్షి’కి తెలిపారు. ప్ర: దేశంలో కోవిడ్ కేసుల సంఖ్య రోజుకు నాలుగు లక్షలకు చేరువ అవుతోంది. తొలిదశలో వైరస్ వ్యాప్తిని సమర్థంగా అడ్డుకున్న మనం రెండోసారి మాత్రం విఫలమయ్యాం. ఇందుకు కారణాలేమిటి? జ: కోవిడ్–19 వ్యాప్తి నిరోధానికి అవసరమైన చర్యలు చేపట్టడంలో ప్రజలు నిర్లక్ష్యంగా వ్యవహరించడమే అతిపెద్ద కారణం. మాస్కులు ధరించడం, భౌతిక దూరం పాటించడం, తరచూ చేతులు శుభ్రం చేసుకోవడం అత్యవసరమని, ఈ జాగ్రత్తలన్నీ కొనసాగించాలని చాలాకాలంగా శాస్త్రవేత్తలు హెచ్చరిస్తూనే ఉన్నా పట్టించుకోకపోవడం వల్లనే ఈ సమస్య వచ్చిపడింది. పాఠశాలలు, కళాశాలలు త్వరగా తెరవడం, ఎన్నికల ర్యాలీలకు అనుమతించడం, బార్లు, పబ్బులు, సినిమాహాళ్లు పనిచేసేందుకు అనుమతులివ్వడం కూడా కారణమేనని చెప్పాలి. ఈ నేపథ్యంలోనే రూపాంతరిత వైరస్ వేగంగా వ్యాప్తి చెందేందుకు అవకాశం ఏర్పడింది. అదృష్టం ఏమిటంటే.. యూకే, భారత్ డబుల్ మ్యూటెంట్ వైరస్‌లకు ఇతర జీవుల ద్వారా వ్యాపించే శక్తి అలవడలేదు. అదే జరిగి ఉంటే సమస్య మరింత జటిలమయ్యేది. ప్ర: దేశంలో ఏ రూపాంతరిత వైరస్ ఎక్కువ వ్యాప్తిలో ఉంది? జ: ప్రధానంగా మూడు (యూకే, డబుల్ (కాలిఫోర్నియా), బెంగాల్) రూపాంతరిత వైరస్లు ఉన్నాయి. వీటి నుంచి మరోసారి జన్యుమార్పులకు గురైన ఇంకో వైరస్ కూడా వ్యాప్తిలో ఉంది. దీన్నే ట్రిపుల్ మ్యూటేటెడ్ అని పిలుస్తున్నారు. మహారాష్ట్రలో నమోదవుతున్న కేసుల్లో పదిశాతం ఈ వైరస్వే. కొమ్ములో ఉండే ఒకే ఒక్క తేడా డబుల్, ట్రిపుల్ మ్యూటేటెడ్లను వేరు చేస్తుంది. బెంగాల్లో 20 శాతం కేసులకు కారణమవుతున్న రూపాంతరిత వైరస్ బలహీనపడుతోందని, త్వరలో కనిపించకుండా పోతుందని అంచనా వేస్తున్నాం. డబుల్ మ్యూటెంట్ వైరస్‌ను గత ఏడాది డిసెంబర్లోనే గుర్తించినా..మన నిర్లక్ష్యం కారణంగా గత కొంతకాలంగా అది వేగంగా వ్యాప్తి చెందింది. డబుల్, ట్రిపుల్ మ్యూటెంట్ వైరస్లలో జన్యుపరమైన మార్పులు చెప్పుకోదగ్గ స్థాయిలో ఉన్నప్పటికీ వాటి వల్ల ప్రమాదమేమీ లేకపోవడం ఊరటనిచ్చే అంశం. దేశంలో ప్రస్తుతం యూకే రూపాంతరితమే ఎక్కువగా వ్యాప్తిలో ఉంది. అదే సమయంలో వేర్వేరు ప్రాంతాల్లో వేర్వేరు వెరైటీలు తమ ప్రభావాన్ని చూపిస్తున్నాయని తెలుస్తోంది. సీసీఎంబీలో రూపాంతరితాల జన్యుక్రమ నమోదు జరుగుతోంది. ఇప్పటివరకూ పరిశీలించిన నమూనాల్లో యూకే రూపాంతరితం 12 – 15 శాతం ఉండగా.. డబుల్ మ్యూటెంట్ 20 శాతం నమూనాల్లో కనిపించింది. మిగిలిన 70 శాతంలో వేర్వేరు రకాల ఉనికిని గుర్తించాము. ప్ర: రెండో దఫా కేసులు శిఖరస్థాయికి చేరేదెన్నడు? మూడో దఫా ఉండే అవకాశం ఉందా? జ: దేశ విదేశాల్లో చేసిన అధ్యయనాలన్నీ భారత్‌లో మే రెండు, మూడో వారాల్లో కేసులు శిఖరస్థాయికి చేరతాయని, ఆ తర్వాత వేగంగా తగ్గిపోతాయని చెబుతున్నాయి. మళ్లీ జూన్ తర్వాత కేసుల సంఖ్య స్వల్పంగా పెరిగే అవకాశం ఉందని పేర్కొంటున్నాయి. తీవ్రత తక్కువగా ఉంటుందంటున్న ఈ దశను మూడో దఫా అని కూడా అనలేము. నిజానికి ఈ మూడోదఫా గురించి ఎవరికీ స్పష్టమైన సమాచారం లేదు. ప్రస్తుతం రోజువారీ ఎన్ని కేసులు నమోదవుతున్నాయి? అన్న అంశంపై ఆధారపడి ఈ అంచనాలు రూపొందాయి. శిఖర స్థాయికి చేరే క్రమంలో రోజువారీ కేసుల సంఖ్య ఐదు నుంచి పది లక్షలకు చేరుకునే అవకాశం ఉంది. ప్రభుత్వ లెక్కల్లోకి ఎక్కని కేసులు దీనికి అదనంగా భావించాలి. కేసులకు సంబంధించి పూర్తిస్థాయి సమాచారం అందని పరిస్థితుల్లో అంచనాలు వేయడం అంత సులభమేమీ కాదు. కానీ మే నెల మూడో వారానికల్లా అత్యధిక స్థాయిలో కేసులు నమోదై ఆ తర్వాత తక్కువ కాలంలోనే ఆ సంఖ్య పతనమవుతుందని అనుకుంటున్నాం. అప్పటివరకూ పరిస్థితిని అదుపులో ఉంచేందుకు మాస్కులేసుకోవడం, తరచూ చేతులు కడుక్కోవడం, భౌతిక దూరం పాటించడం వంటివి మరింత కఠినంగా కొనసాగించాల్సి ఉంటుంది. వీలైనన్ని ఎక్కువ పరీక్షలు చేయడం, అందుబాటులో ఉన్న వైరస్ నమూనాల జన్యుక్రమాన్ని వేగంగా నమోదు చేయడం చాలా అవసరం. తద్వారా కొత్త రూపాంతరితాలను ఎప్పటికప్పుడు గుర్తించే వీలేర్పడుతుంది. జన్యుక్రమ నమోదు ద్వారా కొత్త టీకాలు, మందులను అభివృద్ధి చేయవచ్చు. ప్రభుత్వం ఈ పనులన్నీ తగిన వేగంతో చేస్తుందని అనుకున్నా.. ప్రజలు తమవంతు కర్తవ్యాన్ని నిర్వర్తిస్తేనే దేశం నుంచి కరోనా వైరస్‌ను తరిమి కొట్టగలం. – సాక్షి, హైదరాబాద్. -
కరోనా వైరస్: వామ్మో! డబుల్ కాదు.. ట్రిపుల్..!
ఢిల్లీ: భారత్‌లో రోజు నమోదవుతున్న కరోనా కేసులను చూసి పరిశోధకులు ఒక్కింతా విస్మయానికి గురవుతున్నారు. దేశంలో సుమారు రోజు మూడు లక్షల పైగా కరోనా కేసులు, 2వేలకు పైగా మరణాలు సంభవిస్తున్నాయి. పరిశోధకులు భారత్‌లో కరోనా డబుల్ మ్యూటేషన్ ఉన్నట్లుగా తొలుత భావించగా, ప్రస్తుతం భారత్‌లో కరోనా ట్రిపుల్ మ్యూటేషన్ కూడా ఉందని పరిశోధకులు అభిప్రాయపడుతున్నారు. ఈ ట్రిపుల్ మ్యూటేషన్ వలనే భారీ ఎత్తున కరోనా కేసులు నమోదవుతున్నాయని పేర్కొన్నారు. ట్రిపుల్ మ్యూటేషన్‌లో మూడు కోవిడ్ స్ట్రెయిన్లు కలిపి కొత్త వేరియంట్‌గా మారాయని భావిస్తున్నారు. మహారాష్ట్ర, ఢిల్లీ, పశ్చిమ బెంగాల్లో నమోదైన కేసుల్లో ట్రిపుల్ మ్యూటేంట్ కనిపించిందని పరిశోధకులు తెలిపారు. ఈ నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా కొత్త వేరియంట్లు కనిపిస్తూనే ఉన్నాయని సైంటిస్టులు పేర్కొన్నారు. ‘ట్రిపుల్ మ్యూటేంట్‌తో వైరస్ చాలా వేగంగా వ్యాప్తి చెందుతుంది. దాంతో పాటు వెంటనే అనారోగ్యానికి గురయ్యేలా చేస్తోంద’ని మెక్ గిల్ యూనివర్సిటీ ఎపిడమియాలజీ ప్రొఫెసర్ మధుకర్ తెలిపారు. ఈ మ్యూటేషన్లకు సరిపోయే వ్యాక్సిన్లు మనం ఇంప్రూవ్ చేసుకోవాలన్నారు. ప్రస్తుతం నమోదవుతున్న కరోనా కేసుల్లో (జీనోమ్ సీక్వెన్స్) జన్యు శ్రేణిలను కేవలం ఒక శాతం కంటే తక్కువగా స్టడీ చేస్తున్నామన్నారు. ఇది భారత్‌కు పెను సవాల్‌గా మారనుందని తెలిపారు. ట్రిపుల్ మ్యుటేషన్ ఎంత వరకు ప్రభావం చూపనుంది..! డబుల్ మ్యూటేషన్‌తో కరోనా వైరస్ వ్యాప్తి అధికంగా ఉంది. దేశంలో కరోనా మొదటి వేవ్‌లో పది మందిల్లో ఒకరు లేదా ఇద్దరికి వైరస్ వ్యాప్తి చెందగా, ప్రస్తుత డబుల్ మ్యూటేషన్‌తో వైరస్ వ్యాప్తి ఎనిమిదికి చేరింది. డబుల్ మ్యూటేషన్‌తో చివరికి చిన్న పిల్లలు కూడా వైరస్ బారిన పడుతున్నారు. ట్రిపుల్ మ్యూటేషన్ అంతకుమించి వేగంగా వ్యాప్తి చెందుతుందని భావిస్తున్నారు. ప్రస్తుతం ట్రిపుల్ మ్యూటేషన్స్ ఇండియాలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులను పెంచుతున్నాయి. ప్రస్తుతానికి వైరస్ జెనోమ్ను స్టడీ చేయడానికి 10 ల్యాబ్‌లు మాత్రమే ఉన్నాయి. చదవండి: కొత్తరకం వైరస్‌పై కొవాగ్జిన్ సమర్థవంతంగా పనిచేస్తుంది: ఐసీఎంఆర్ -
కొత్త స్ట్రెయిన్లతో ‘దడ’.. తెలంగాణకు పొంచివున్న ముప్పు
సాక్షి, హైదరాబాద్: ఇప్పుడిప్పుడే కరోనా కేసులు తగ్గుతున్నాయని, వ్యాక్సిన్ పుణ్యమాని ఇక వైరస్ నిర్వీర్యం అవుతుందన్న భావనలో ఉండగా... మహారాష్ట్ర ముప్పు వణికిస్తోంది. అక్కడ పుట్టుకొచ్చిన రెండు కొత్త స్ట్రెయిన్లు దడ పుట్టిస్తున్నాయి. దేశంలో కేరళ, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, పంజాబ్ రాష్ట్రాల్లో కేసులు పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. మొన్న మొన్నటివరకు యూకే కొత్త స్ట్రెయిన్‌తో గజగజ వణికిపోయాం. దక్షిణాఫ్రికా స్ట్రెయిన్‌తోనూ ఆందోళనకు గురయ్యాం. ఇప్పుడు మహారాష్ట్రలో పుట్టుకొచ్చిన రెండు కొత్త కరోనా వేరియంట్లతో వైరస్ వ్యాప్తి వేగంగా జరుగుతోంది. అంతేకాదు మొదటి వేరియంట్‌కు భిన్నంగా ఈ కొత్త స్ట్రెయిన్లు రోగులపై పంజా విసురుతున్నాయి. మొదట్లో వచ్చిన స్ట్రెయిన్ల వల్ల వారం పది రోజులకు కొందరి ఊపిరితిత్తుల్లో నిమ్ము చేరగా, ఇప్పుడు ఒకట్రెండు రోజులకే నిమ్ము చేరి పరిస్థితి సీరియస్ అవుతోంది. ఈ స్ట్రెయిన్లు ఇతర రాష్ట్రాలకు పాకితే పరిస్థితి ఏంటనే ఆందోళన అందరినీ వేధిస్తోంది. మహారాష్ట్రలో కొత్త స్ట్రెయిన్లు ఉన్నట్లు నిర్థారణ కావడంతో, సరిహద్దు రాష్ట్రం కర్ణాటక ప్రజా రవాణా వ్యవస్థలపైనా, ప్రయాణికుల రాకపోకలపైనా ఆంక్షలు విధించింది. మనదగ్గరి నుంచీ పొరుగు రాష్ట్రమైన మహారాష్ట్రకు నిత్యం రాకపోకలు అధికంగా ఉంటాయి. కానీ తెలంగాణ వైద్య యంత్రాంగం మాత్రం ఇప్పటికీ ఎటువంటి చర్యలు తీసుకోకపోవడంపై విమర్శలు వస్తున్నాయి. అమరావతి, యావత్మాల్ జిల్లాల్లో పుట్టిన స్ట్రెయిన్లు మొదటి విడత కరోనాతో మహారాష్ట్ర అతలాకుతలమైంది. దేశంలో అత్యధికంగా అక్కడే కేసులు నమోదయ్యాయి. ఇప్పుడక్కడ మళ్లీ కరోనా కొత్త రూపంలో రాజుకుంది. మరో రెండు కొత్త స్ట్రెయిన్లు పుట్టుకొచ్చాయి. మహారాష్ట్రలో కోవిడ్ నియంత్రణ చర్యలు దేశంలోనే అధ్వానంగా ఉన్నాయని ఇటీవలి ఇండియన్ ఎకనమిక్ సర్వే తేల్చి చెప్పింది. అక్కడి అమరావతి జిల్లాలో నిత్యం వెయ్యి కేసుల వరకు నమోదు అవుతున్నాయి. దీంతో అక్కడ కరోనా వచ్చిన నలుగురు రోగులపై జన్యు విశ్లేషణ చేశారు. వారిలో కొత్తగా ఇ–484క్యూ అనే మ్యుటేషన్‌ను కనుగొన్నారు. ప్రమాదకరమైన దక్షిణాఫ్రికా వేరియంట్ ఇ–484కే అనే మ్యుటేషన్‌కు దగ్గరగా ఈ కొత్త వేరియంట్లో జన్యు మార్పులు కనిపించాయి. అలాగే అదే రాష్ట్రం యావత్మాల్ జిల్లాలో నలుగురిపై జన్యు విశ్లేషణ చేస్తే, గతంలో దక్షిణాది రాష్ట్రాల్లో కనిపించిన ఎన్–440కే మ్యుటేషన్‌కు దగ్గరగా ఉందని తేల్చారు. కేసుల వ్యాప్తిని ఆపకపోతే, ఇలాగే కొత్త స్ట్రెయిన్లు పుట్టుకొస్తాయని, మళ్లీ దేశమంతా విస్తరించే అవకాశముందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. దేశంలో 31 జిల్లాల్లో భారీగా కేసులు దేశంలో 718 జిల్లాలకు గాను, 31 జిల్లాల్లో రోజుకు 100కు పైగా కేసులు వస్తున్నాయి. అందులో కేరళలో మొత్తం 13 జిల్లాల్లో 100కు పైగా కేసులు నమోదవుతున్నాయి. మహారాష్ట్రలోనూ 13 జిల్లాల్లో 100కు పైగా కొత్త కేసులు వస్తున్నాయి. 20వ తేదీన అమరావతి జిల్లాలో ఒకేరోజు వెయ్యి కేసులు నమోదయ్యాయి. పుణే, ముంబై, థానే, నాగ్‌పూర్, అమరావతి జిల్లాల్లో రోజుకు 500కు పైగా నమోదవుతున్నాయి. గత వారంలో కేరళలో ప్రతి పది లక్షల జనాభాలో 750 మందికి కొత్తగా వైరస్ సోకింది. ఈ సంఖ్య దేశంలోనే ఎక్కువ. అలాగే మహారాష్ట్రలో పది లక్షల జనాభాకు గత వారంలో 250 మందికి వైరస్ సోకింది. దేశవ్యాప్తంగా తీసుకుంటే సగటున ప్రతి పది లక్షల్లో గత వారంలో 60 మందికి కరోనా సోకింది. తెలంగాణలో 40 మందికి సోకినట్లు నిర్ధారణ అయింది. అయితే కేరళలో పంచాయతీ ఎన్నికలు, ఓనం పండుగ తర్వాత భారీగా కేసులు పెరిగాయి. అప్పటి నుంచి అదే ట్రెండ్ కొనసాగుతోంది. మరిన్ని కొత్త వేరియంట్లు పుట్టుకొచ్చే ప్రమాదం మహారాష్ట్రలో లాగా ఇతర ప్రాంతాల్లోనూ కొత్త వేరియంట్లు పుట్టుకొచ్చే ప్రమాదముంది. మహారాష్ట్రలో రెండు కొత్త కరోనా వేరియంట్లు ప్రమాదకరంగా ఉన్నాయి. ఇతర ప్రాంతాల్లో కొత్త వేరియంట్లు పుట్టుకొస్తున్నాయా లేదా అన్నదానిపై జన్యు విశ్లేషణ చేయాలి. కరోనా వ్యాక్సిన్ అందరికీ అందాకే ప్రమాదం పోతుంది. అందువల్ల జాగ్రత్తలు తప్పక తీసుకోవాలి. జనవరిలో దేశంలో ప్రతి వంద కేసుల్లో ఐదింటిపై జన్యువిశ్లేషణ చేయాలనుకున్నారు. కానీ అది పూర్తిస్థాయిలో జరగలేదు. ఇప్పటివరకు దేశంలో 8 వేల జన్యు విశ్లేషణలు చేశారు. అంటే 1,250 కేసుల్లో ఒక దానికి జన్యు విశ్లేషణ చేశారు. యూకేలో ప్రతీ 10 కేసుల్లో ఒకదానికి, ప్రపంచంలో ప్రతి 200కు ఒక జన్యు విశ్లేషణ చేశారు. – డాక్టర్ కిరణ్ మాదల, క్రిటికల్ కేర్ విభాగాధిపతి, నిజామాబాద్ ప్రభుత్వ మెడికల్ కాలేజీ వేగంగా విస్తరణ... ఇప్పటివరకు దేశంలో ఉన్న కరోనా మ్యుటేషన్ల వల్ల వైరస్ వ్యాప్తి జరిగిన దానికంటే... కొత్త వేరియంట్లు మరింత వేగంగా విస్తరిస్తున్నాయి. అంతేకాదు సాధారణ మ్యుటేషన్ సోకిన కరోనా రోగుల్లో కొందరిలో ఊపిరితిత్తుల్లో నిమ్ము వారం పది రోజుల్లో వస్తే, ప్రస్తుతం అమరావతి కొత్త వేరియంట్ల రోగుల ఊపిరితిత్తుల్లో ఒకట్రెండు రోజుల్లోనే నిమ్ము వచ్చినట్లు జన్యు విశ్లేషణలో తేలింది. నాగ్‌పూర్ నుంచి ఔరంగాబాద్ మధ్య రహదారి కనెక్టివిటీ ఎక్కువగా ఉండటం వల్ల భారీగా కేసులు నమోదవుతున్నాయని అంచనా. -
భారత్‌లో కరోనా రూపాంతరాలు ఎన్నో తెలుసా..?
సాక్షి, హైదరాబాద్: ఒకటి, రెండు కాదు.. భారత్‌లో ఉన్న కరోనా వైరస్ రూపాంతరాలు ఎన్నో తెలుసా..? ఏకంగా 5 వేల పైమాటే. అవును ఈ విషయాన్ని సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులార్ బయాలజీ (సీసీఎంబీ) వెల్లడించింది. సీసీఎంబీ శాస్త్రవేత్తలు ఇటీవల ప్రచురించిన పరిశోధనా వ్యాసం ఈ విషయాన్ని స్పష్టం చేస్తోంది. గతేడాది జనవరి నుంచి ఇప్పటివరకు దేశంలో 5 వేల కంటే ఎక్కువ కరోనా వైరస్లు రూపాంతరం చెందడం ఆందోళన కలిగిస్తోంది. వీటిల్లో వేగంగా వ్యాప్తి చెందగల ఎన్–501–వై, నాశనం చేసేందుకు ఎక్కువ యాంటీబాడీలు అవసరమయ్యే ఈ–484–కేలు కూడా ఉన్నాయి. విస్తృత స్థాయిలో జన్యుక్రమాలను నమోదు చేయకపోవడం వల్ల ఇలాంటివి తక్కువ సంఖ్యలో కనిపిస్తున్నాయని సీసీఎంబీ డైరెక్టర్ డాక్టర్ రాకేశ్ మిశ్రా శుక్రవారం ఓ ప్రకటనలో వివరించారు. కొన్ని రూపాంతర వైరస్లు కొన్ని రాష్ట్రాల్లో ఎక్కువగా వ్యాప్తి చెందుతున్నాయని, ఎన్–440–కే రకం దక్షిణాది రాష్ట్రాల్లో ఎక్కువగా ఉందని వివరించారు. వైరస్ వ్యాప్తిని అర్థం చేసుకునేందుకు నిఘా ముమ్మరం చేయాలని, కొత్త రూపాంతరాలను వేగంగాగుర్తిస్తే.. అంతే వేగంగా చికి త్సపద్ధతులను అభివృద్ధి చేయొచ్చని వివరించారు. జూన్ కల్లా మార్పు.. ఏడాదిలోనే భారత్‌లో అన్ని రకాల రూపాంతరాలు ఎలా పరిణామం చెందాయన్న అంశాన్ని సీసీఎంబీ శాస్త్రవేత్తలు తాజా అధ్యయనంలో వివరించారు. గతేడాది జూన్ నాటికి దేశంలో కొంచెం నెమ్మదిగా వ్యాప్తి చెందుతుందనుకున్న ‘ఏ3ఐ’ స్థానంలో ప్రపంచవ్యాప్తంగా ఎక్కువచోట్ల ఉన్న ‘ఏ2ఏ’ రూపాంతరం వచ్చేసింది. ఇటీవల వెలుగు చూసిన రూపాంతరాల్లో వైరస్ కొమ్ములోనే ఎక్కువ జన్యుమార్పులు చోటు చేసుకున్నట్లు శాస్త్రవేత్త డాక్టర్ దివ్య తేజ్ సౌపాటి తెలిపారు. దేశంలో గుర్తించిన కొన్ని రూపాంతర వైరస్లు పదేపదే వ్యాధికి కారణం అవుతున్నాయని తాము గుర్తించినట్లు తెలిపారు. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 6,400 వైరస్ జన్యుక్రమాలు మాత్రమే నమోదై ఉన్నాయని, వీటిల్లోనే 5 వేల కంటే ఎక్కువ రూపాంతరాలు ఉన్నాయని అంచనా. కోవిడ్ బారిన పడ్డ వారిలో కనీసం 5 శాతం మందిలోని వైరస్ జన్యుక్రమాలను నమోదు చేసేందుకు కేంద్రం కార్యక్రమం చేపట్టిందని, ఇది వ్యాధి నియంత్రణ, చికిత్సల్లో కీలకం కానుందని డాక్టర్ సురభి శ్రీవాస్తవ తెలిపారు. -
నో డ్యూ ఉంటేనే రిజిస్ట్రేషన్లు
సాక్షి, హైదరాబాద్: వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్ కోసం ధరణి పోర్టల్ ద్వారా సబ్ రిజిస్ట్రార్‌కు దరఖాస్తు చేసుకోవడానికి ముందు తప్పనిసరిగా సంబంధిత మున్సిపాలిటీ/మున్సిపల్ కార్పొరేషన్‌తో పాటు సంబంధిత విద్యుత్ పంపిణీ సంస్థ(డిస్కం) నుంచి ‘నో డ్యూ’సర్టిఫికెట్ పొందాలని రాష్ట్ర ప్రభుత్వం కొత్త నిబంధన తీసుకొ చ్చింది. రిజిస్ట్రేషన్ దస్తావేజు ద్వారా వ్యవసాయేతర ఆస్తి యాజమాన్య హక్కుల బదిలీ చేయాలని కోరుకున్నా, విక్రయం, కానుక, తనఖా, బదిలీ చేయాలనుకున్నా ఈ నిబంధన వర్తి స్తుందని స్పష్టం చేసింది. దరఖాస్తు దారుడు తన వీలును బట్టి అందు బాటులో ఉన్న తేదీ, సమయం కోసం ధరణి పోర్టల్ ద్వారా సబ్ రిజిస్ట్రార్‌కు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. ఆస్తి పన్నులు, ఇతర బకాయిలేవీ లేవని మున్సిపాలిటీ/కార్పొరేషన్ నుంచి, విద్యుత్ బిల్లుల బకాయిలు ఏవీ లేవని డిస్కంల నుంచి నో డ్యూ సర్టిఫికెట్ తీసుకోవాల్సి ఉంటుంది. రాతపూర్వకంగా దరఖాస్తు చేసుకున్న 4 రోజుల్లోగా పురపాలికలు, డిస్కంలు నో డ్యూ సర్టిఫికెట్ ఇవ్వడంలో విఫలమైతే.. జారీ చేసినట్లే పరిగణిస్తారు. ధరణి పోర్టల్ ద్వారా మున్సిపాలిటీలు/మున్సిపల్ కార్పొరేషన్లలో వ్యవసాయేతర ఆస్తుల మ్యూటేషన్ ప్రక్రియకు సంబంధించిన నిబంధనలు–2020ను ప్రకటిస్తూ రాష్ట్ర పురపాలక శాఖ ముఖ్యకార్యదర్శి అరవింద్‌కుమార్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. జీహెచ్ఎంసీ మినహా రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్లకు ఈ నిబంధనలు వర్తించనున్నాయి. ఉత్తర్వుల్లోని ముఖ్యాంశాలు.. ► వ్యవసాయేతర ఆస్తుల విక్రయం, తనఖా, గిఫ్టు, మార్పిడి (ఎక్స్చేంజ్)కి జరిపే రిజిస్ట్రేషన్, హక్కుల రికార్డు(రికార్డ్స్ ఆఫ్ రైట్స్)ల్లో యాజమాన్య మార్పుల ప్రక్రియ చేపట్టాలి. ► రిజిస్ట్రేషన్ కోసం దరఖాస్తు చేసుకున్న వ్యక్తికి సబ్ రిజిస్ట్రార్ తేదీ, సమయం కేటాయించి, ఈ వివరాలను అతడికి తెలపాలి. ఇందుకు సంబంధించిన వివరాలను నిర్దేశిత నమూనాలో రిజిస్టర్లో పొందుపర్చాలి. ► దస్తావేజు రిజిస్ట్రేషన్ రోజు సబ్ రిజిస్ట్రార్ రిజిస్ట్రేషన్ నిర్వహించి, నిర్దేశిత మ్యుటేషన్ చార్జీలు తీసుకున్న తర్వాత ఈ మేరకు సంబంధిత మున్సిపాలిటీ/మున్సిపల్ కార్పొరేషన్‌కు సంబంధించిన హక్కుల రిజిస్టర్లో తక్షణమే యాజమాన్య హక్కులు మార్పు చేయాలి. విక్రయం, గిఫ్టు, ఎక్స్చేంజీ ద్వారా ఆస్తి బదిలీ చేస్తున్న వ్యక్తి ఖాతా నుంచి ఆస్తిని తొలగించి, బదిలీ చేయించుకున్న వ్యక్తి ఖాతాలో జమ చేయడం ద్వారా తక్షణ మ్యుటేషన్ పూర్తి చేయాలి. ► తనఖా అయితే, ధరణిలో తనఖా లావాదేవీ వివరాలను రికార్డు చేయాలి. ► ఆస్తి రిజిస్ట్రేషన్‌లో భాగంగానే మ్యుటేషన్ జరగాలి. హక్కుల రికార్డుల్లోని వివరాలు.. ► మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్ల పరిధిలోని వ్యవసాయేతర ఆస్తులపై హక్కుల రికార్డులను ధరణి పోర్టల్‌లో డిజిటల్ రూపంలో తయారు చేసి నిర్వహిస్తారు. ఈ రికార్డుల్లో ఈ వివరాలుంటాయి. ► మున్సిపాలిటీలు/మున్సిపల్ కార్పొరేషన్లు నిర్వహించే ఆస్తుల రిజిస్టర్ ప్రకారం ఆస్తి యజమాని పేరు, సదరు ఆస్తిపై వారసత్వం కలిగిన కుటుంబ సభ్యుల పేర్లు. ► ప్రాంతం (లొకేషన్) వివరాలు, రకం, వినియోగం, విస్తీర్ణం ► ఆస్తి యజమాని, కుటుంబసభ్యుల గుర్తింపును రుజువు చేసేందుకు అవసరమైన ఇతర వివరాలు. ► ప్రతి మున్సిపాలిటీ/మున్సిపల్ కార్పొరేషన్ తన అధీనంలోని వ్యవసాయేతర ఆస్తుల వివరాలను నిర్దేశిత ఫార్మాట్లో ధరణి పోర్టల్‌లో పొందుపర్చాలి. ఇందుకు ఒకేసారి అవకాశం ఉంటుంది. ► ప్రతి మున్సిపాలిటీ/మున్సిపల్ కార్పొరేషన్ జారీ చేసే ప్రతి భవన నిర్మాణ అనుమతి, ఆక్యుపెన్సీ సర్టిఫికెట్లు, లేఅవుట్, ప్లాట్ల అనుమతులను నిర్దేశిత ఫార్మాట్లో ధరణి పోర్టల్‌లో పొందుపర్చాలి. ప్రభుత్వ ఆస్తులకు వర్తించదు... ► కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన లేదా వీటి నియంత్రణ పరిధిలో ఉన్న వ్యవసాయేతర ఆస్తులకు ఈ నిబంధనలు వర్తించవు. -
అరగంటలో ‘మ్యుటేషన్’
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలోని వ్యవసాయే తర ఆస్తులు, భూముల రిజిస్ట్రేషన్ల ప్రక్రియ అరగంటలో పూర్తయ్యేలా ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ధరణి పోర్టల్‌లోని ఎరుపు రంగు విండో ద్వారా రిజిస్ట్రేషన్‌తోపాటు మ్యుటేషన్ కూడా వేగంగా పూర్తయ్యేలా రూపొందించిన సాఫ్ట్‌వేర్‌ను ఇందుకోసం ఉపయోగించనుంది. రాష్ట్రంలోని 141 సబ్ రిజిస్ట్రార్ కార్యాల యాల్లో ఈ నెల 23 నుంచి ఈ సేవలు అందు బాటులోకి రానున్నాయి. గ్రామ పంచా యతీలు, మున్సిపల్ కార్యాలయాలకు వెళ్లే అవసరం లేకుండానే సబ్ రిజిస్ట్రార్ కార్యాల యాల్లోనే మ్యుటేషన్లు పూర్తి కానున్నాయి. సరళీకృత ఫార్మాట్లో.. వ్యవసాయేతర భూములు, ఆస్తుల రిజిస్ట్రేషన్ ప్రక్రియ కోసం సులభతరమైన, సరళీకృత విధానాన్ని ప్రభుత్వం అందుబాటులోకి తెస్తోంది. ఈ విధానం ప్రకారం భూములు, ఆస్తుల హక్కుల మార్పిడి, క్రయవిక్రయ రిజిస్ట్రేషన్ లావాదేవీల కోసం ధరణి పోర్టల్‌లోని ఎరుపు రంగు విండో (నాన్ అగ్రికల్చర్)ను క్లిక్ చేసిన తర్వాత వచ్చే పేజీలో ‘సిటిజన్ స్లాట్ బుకింగ్’ ఆప్షన్‌ను ఎంచుకోవాల్సి ఉంటుంది. సిటిజన్ లాగిన్ పేజీలో మొబైల్ నంబర్ నమోదు చేయగానే వచ్చే పాస్‌వర్డ్‌ను ఎంటర్ చేయాలి. ఆ తర్వాత డాక్యుమెంట్ నంబర్, క్రయ, విక్రయదారులకు సంబంధించిన వ్యక్తిగత సమాచారం నమోదు చేయాలి. స్లాట్ బుక్ కాగానే అమ్మకందారుడు లేదా కొనుగోలుదారుడి మొబైల్ నంబర్‌కు సమాచారం వస్తుంది. ఆ సమాచారం ప్రకారం అమ్మకందారులు, కొనుగోలుదారులు, సాక్షులు రిజిస్ట్రేషన్ కార్యాలయాలకు వెళ్లాల్సి ఉంటుంది. అప్పుడు స్లాట్ బుకింగ్ పోర్టల్‌లో రిజిస్ట్రేషన్ దస్తావేజుకు సంబంధించిన డేటా ఎంట్రీ చేస్తారు. నిర్దేశిత స్టాంపు డ్యూటీ, ఇతర చార్జీలను ఆన్లైన్లో ఈ–చలాన్ విధానంలో చెల్లించాల్సి ఉంటుంది. ఆ తర్వాత సాక్షులు, క్రయ, విక్రయదారుల వివరాలు, బయోమెట్రిక్ ఆధారాలను డేటా ఎంట్రీ ఆపరేటర్ తీసుకుంటారు. ఇది పూర్తికాగానే సబ్ రిజిస్ట్రార్ రిజిస్ట్రేషన్ ప్రక్రియను ప్రారంభిస్తారు. డేటా ఎంట్రీ ఆపరేటర్లు మళ్లీ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లను స్కాన్ చేసి అప్లోడ్ చేస్తారు. వెంటనే మ్యుటేషన్ సిగ్నేచర్ కోసం సబ్ రిజిస్ట్రార్‌కు పంపిస్తారు. ఈ సంతకం చేయడంతోనే సదరు భూమి లేదా ఆస్తి రిజిస్ట్రేషన్, మ్యుటేషన్ ప్రక్రియ పూర్తవుతుంది. నేటి నుంచి ట్రయల్ రన్ .. బీఆర్కేఆర్ భవన్లో ఏర్పాటు చేసిన ధరణి వార్‌రూంలో వ్యవసాయేతర భూములు, ఆస్తులకు సంబంధించి రోజుకు 10 రిజిస్ట్రేషన్ల చొప్పున మూడు రోజులపాటు అధికారులు ట్రయల్ రన్ నిర్వహించనున్నారు. ధరణి సాఫ్ట్వేర్ పనితీరును పరిశీలించనున్నారు. ఈ నెల 23న నుంచి స్లాట్ బుకింగ్ ద్వారా పూర్తిస్థాయిలో సేవలను అందుబాటులోకి తీసుకురానున్నారు.