సాక్షి, అమరావతి: మ్యుటేషన్లకు సంబంధించి ప్రభుత్వం కీలకమైన ఆదేశాలు జారీ చేసింది. భూములకు సంబంధించిన ఒరిజినల్ డాక్యుమెంట్లను తనిఖీ చేశాకే మ్యుటేషన్లు చేయాలని రెవెన్యూ యంత్రాంగాన్ని ఆదేశించింది. జిరాక్స్, ట్రూ కాపీలు, ఇతర అనధికారిక పత్రాల ఆధారంగా మ్యుటేషన్లు చేయవద్దని స్పష్టం చేసింది. వీటివల్ల వివాదాలు ఏర్పడుతున్న నేపథ్యంలో ఈ ఆదేశాలిచ్చింది. ఒరిజినల్ డాక్యుమెంట్లను తహసీల్దార్లు ధృవీకరించాలని చెప్పింది. ఈ మేరకు జిల్లా కలెక్టర్లు, రెవెన్యూ యంత్రాంగానికి భూ పరిపాలన ప్రధాన కమిషనర్, ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి. సాయిప్రసాద్ సర్క్యులర్ జారీ చేశారు.
తహశీల్దార్లు ప్రతి మ్యుటేషన్‌కు తప్పనిసరిగా సేల్ డీడ్ వంటి ఒరిజినల్ డాక్యుమెంట్లు, వాటి ఒరిజినల్ లింకు డాక్యుమెంట్లు, ఒరిజినల్ ఈసీతోపాటు దానికి సంబంధించిన ఇతర అధికారిక పత్రాలను పరిశీలించాలని స్పష్టం చేశారు. ఒరిజినల్ డాక్యుమెంట్లను పరిశీలించినట్లు తహసీల్దార్ ఆన్‌లైన్‌లో ధృవీకరించాలని (సర్టిఫై చేయాలి) ఆదేశించారు. రిజిస్ట్రేషన్ శాఖ సర్వర్ నుంచి ఆన్‌లైన్‌లో చూసే డాక్యుమెంట్లు తప్ప ఇతర ఏ సందర్భంలోనైనా ఈ విధానం పాటించాల్సిందేనని చెప్పారు.
ఇండియన్ ఎవిడెన్స్ చట్టం ప్రకారం ఒరిజినల్ డాక్యుమెంట్లని ధృవీకరించకుండా చేసిన ఎలాంటి మ్యుటేషన్ లేదా ఆర్డర్ ఆమోదయోగ్యం కాదని తెలిపారు. రాష్ట్రంలో పలుచోట్ల తహశీల్దార్లు ఫొటో కాపీల ఆధారంగా మ్యుటేషన్లు చేయడం, అసలైన యజమానులు ఫిర్యాదుతో అవి సరైన పత్రాలు కావని నిర్థారణ అయిన నేపథ్యంలో హైకోర్టు సీరియస్‌గా స్పందించింది. దీంతో సీసీఎల్‌ఏ ఈ ఆదేశాలు జారీ చేశారు.
రెవెన్యూ శాఖలోని చివరి వ్యక్తి నుంచి అన్ని స్థాయిల్లో ఈ నిబంధనలు పాటించాలని, దీనికి విరుద్ధంగా ఎవరైనా ఫొటో కాపీలు చూసి మ్యుటేషన్లు చేస్తే కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. యాక్ట్ 15 ఆఫ్ 2022 ప్రకారం క్రిమినల్ లా కింద ఎవరైనా ఆర్‌ఓఆర్ చట్టానికి విరుద్ధంగా ఆర్డర్లు ఇస్తే వారిని జిల్లా కలెక్టర్లు విచారించే అధికారం ఉందని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment