‘రికార్డ్ ఆఫ్ రైట్స్–2024’ ముసాయిదా బిల్లును ప్రజల ముందుకు తెచ్చిన సర్కారు
తహసీల్దార్లతోపాటు ఆర్డీవోలకూ మ్యుటేషన్ చేసే అధికారం
రిజిస్ట్రేషన్ తర్వాత మ్యుటేషన్ సమయంలో విచారణ.. తప్పుగా తేలితే మ్యుటేషన్ నిలిపివేత
ప్రతి భూకమతానికి భూ ఆధార్.. ఆబాదీలకూ హక్కుల రికార్డు
హక్కుల బదలాయింపు జరగ్గానే గ్రామ పహాణీలో నమోదు
అప్పీల్, రివిజన్‌లకు వెసులుబాటు.. రివిజన్ అధికారాలు రాష్ట్ర ప్రభుత్వానికి..
సీసీఎల్‌ఏ వెబ్‌సైట్‌లో ప్రజలకు అందుబాటులో పెట్టిన అధికారులు
ఈ నెల 23 వరకు ముసాయిదా బిల్లుపై ప్రజాభిప్రాయసేకరణ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో వ్యవసాయ, వ్యవసాయేతర భూములు, ఆస్తులపై హక్కులను నమోదు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కొత్త చట్టం తీసుకురానుంది. ఈ మేరకు ‘ది తెలంగాణ రికార్డ్ ఆఫ్ రైట్స్–2024’ పేరుతో రూపొందించిన ముసాయిదా బిల్లును ప్రజల ముందుకు తెచ్చింది. భూహక్కుల రికార్డులను ఎప్పటికప్పుడు సవరించడం, ఇప్పటివరకు పాస్‌బుక్‌లు రాని భూముల సమస్యలను పరిష్కరించడం, సర్వే చేసి కొత్తగా భూహ క్కుల రికార్డు తయారు చేసుకునే అధికారాన్ని కల్పించడమే ప్రధాన ఉద్దేశాలుగా ఈ చట్టాన్ని రూపొందిస్తున్నట్టు పేర్కొంది.
రిజి్రస్టేషన్, మ్యుటేషన్, భూ ఆధార్, ఆబాదీలకు ప్రత్యేక హక్కుల రికార్డు, అప్పీల్, రివిజన్ వంటి సెక్షన్లను ముసాయి దా బిల్లులో ప్రతిపాదించారు. దీనిపై ప్రజల నుంచి అభిప్రాయాలు తీసుకున్నాక.. ప్రత్యేకంగా అసెంబ్లీ ని సమావేశపర్చి బిల్లుకు ఆమోదం తీసుకునే అవ కాశాలు ఉన్నాయని రెవెన్యూ వర్గాలు చెప్తున్నాయి.
⇒ భూమి హక్కుల బదలాయింపు కోసం 18 రకాల పద్ధతులు గుర్తించి.. వాటిలో ఏ రకంగా హక్కుల బదలాయింపు జరిగినా ‘రికార్డ్ ఆఫ్ రైట్స్ (ఆర్‌వోఆర్)’లో నమోదు చేయాల్సి ఉంటుంది. రిజిస్టర్డ్ దస్తావేజులు, వారసత్వం, భాగ పంపకాల ద్వారా హక్కుల బదలాయింపునకు పాత చట్టంలోని నిబంధనను కొనసాగించారు. ఈ పద్ధతుల్లో తహసీల్దారే రిజి్రస్టేషన్, మ్యుటేషన్ చేస్తారు. అయితే మ్యుటేషన్ చేసే సమయంలో విచారణ జరిపే వెసులుబాటు ఉంటుంది.
⇒ ఆ విచారణలో తప్పులేమైనా గుర్తిస్తే.. ఆయా కారణాలను వివరిస్తూ మ్యుటేషన్ నిలిపేయవచ్చు. ప్రస్తుత చట్టంలో ఈ అవకాశం లేదు. రిజిస్టర్డ్ దస్తావేజులు, భాగ పంపకాలు, వారసత్వ హక్కుల మ్యుటేషన్‌ను విచారించే అధికారం తహసీల్దార్లకు ఉంటుంది. మిగతా అంశాలకు సంబంధించి ఆర్డీవోకు అధికారం ఉంటుంది.
⇒ రిజిస్ట్రేషన్, మ్యుటేషన్ చేసేటప్పుడు సర్వే మ్యాప్ తప్పనిసరి చేశారు. రిజిస్ట్రేషన్‌కు వెళ్లేవారు ఈ మ్యాప్‌ను తీసుకెళ్లాల్సి ఉంటుంది. భవిష్యత్తు వివాదాలకు చెక్ పెట్టేలా గతంలో లేని ఈ కొత్త నిబంధన తెస్తున్నారు. అయితే ప్రభుత్వం నిర్దేశించిన తేదీ తర్వాత (ఇందుకు అవసరమైన వ్యవస్థను తయారు చేసుకున్నాక) మాత్రమే ఈ మ్యాప్ తప్పనిసరి అవుతుందని బిల్లులో పొందుపరిచారు.
⇒ ఇప్పటికే తీసుకున్న సాదాబైనామా దరఖాస్తులను కొత్త చట్టం కింద చేసుకున్న దరఖాస్తులుగానే పరిగణించాలి. తద్వారా పెండింగ్‌లో ఉన్న 9.4లక్షల దరఖాస్తులు అలాగే కొనసాగుతాయి. వాటి పరిష్కార సమయంలో స్టాంపు డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీజు కట్టాల్సిన అవసరం లేదు. అయితే కొత్తగా సాదాబైనామాల దరఖాస్తులను తీసుకుని పరిష్కరించే అధికారాన్ని ఈ బిల్లులో పొందుపరిచారు.
కొత్త దరఖాస్తుల పరిష్కార సమయంలో మాత్రం స్టాంపు డ్యూటీ, రిజి్రస్టేషన్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. సాదాబైనామాల పరిష్కార అధికారం గతంలో కలెక్టర్లకు ఉండగా.. కొత్త చట్టంలో ఆర్డీవోలకు అధికారాలిచ్చారు.
⇒ ప్రతి భూకమతానికి తాత్కాలిక, శాశ్వత భూదార్ (ప్రత్యేక గుర్తింపు సంఖ్య) ఇవ్వాల్సి ఉంటుంది. ప్రస్తుత రికార్డులను పరిశీలించి తాత్కాలిక సంఖ్య ఇస్తారు. సర్వే తర్వాత శాశ్వత భూదార్ జారీ చేస్తారు. ఈ భూదార్‌కు సంబంధించిన మార్గదర్శకాలను రాష్ట్ర ప్రభుత్వం రూపొందిస్తుంది.
⇒ కొత్తగా గ్రామీణ ప్రాంత ఇంటి స్థలాలకు (ఆబాదీ) కూడా ప్రత్యేక హక్కుల రికార్డు తయారు చేయాలని బిల్లులో పొందుపరిచారు. భూదార్‌తోపాటు ఈ ఆబాదీల ఆర్‌వోఆర్‌కు అవసరమైన నిధులు కేంద్రం నుంచి తెచ్చుకోవచ్చు. గత చట్టంలో ఆర్‌వోఆర్ రికార్డుకు, గ్రామ పహాణీకి సంబంధం ఉండేదికాదు. ఈ కొత్త చట్టంలో.. హక్కుల బదలాయింపు జరగ్గానే గ్రామ పహాణీలో ఆ హక్కుల రికార్డును నమోదు చేసేలా నిబంధన విధించారు.
⇒ తహసీల్దార్లు, ఆర్డీవోలు చేసే రిజి్రస్టేషన్లు, మ్యుటేషన్లకు సంబంధించి వివాదాలు వస్తే.. అప్పీల్, రివిజన్‌కు కొత్త చట్టం అవకాశం ఇవ్వనుంది. కలెక్టర్లు లేదా అడిషనల్ కలెక్టర్లకు అప్పీల్ చేసుకోవచ్చు. తర్వాత సీసీఎల్‌ఏకు సెకండ్ అప్పీల్ చేసుకోవచ్చు. ఇది పాత చట్టంలో లేదు.
⇒ రివిజన్ మాత్రం రాష్ట్ర ప్రభుత్వం లేదా సీసీఎల్‌ఏ మాత్రమే చేయాలని బిల్లులో పొందుపరిచారు. గతంలో జాయింట్ కలెక్టర్లకు ఉన్న రివిజన్ అధికారాలను ఇప్పుడు సీసీఎల్‌ఏకు దఖలు పర్చారు. ఏదైనా రికార్డులో తప్పు జరిగిందని భావిస్తే.. సుమోటోగా తీసుకుని కూడా పరిష్కరించవచ్చు. అయితే అడిషనల్ కలెక్టర్ స్థాయి నుంచి ప్రభుత్వం వరకు అప్పీల్ లేదా రివిజన్లలో ఏ నిర్ణయం తీసుకున్నా లిఖితపూర్వక ఆదేశాలు ఇవ్వడాన్ని తప్పనిసరి చేశారు.
2020 చట్టంలో ఈ అంశం లేదని.. కొత్త చట్టం అమల్లోకి వస్తే భూమి హక్కుల రికార్డుల వివాదాలన్నీ అప్పీలు, రివిజన్లతోనే పరిష్కారమవుతాయని రెవెన్యూ వర్గాలు చెప్తున్నాయి. యాజమాన్య హక్కుల వివాదాలు, భాగపంపకాల విషయంలో వివాదాలున్నప్పుడు మాత్రమే కోర్టులకు వెళ్లాల్సి ఉంటుందని, తద్వారా కోర్టులపై భారం తగ్గుతుందని అంటున్నాయి.
రూపకల్పన కోసం విస్తృత కసరత్తు
‘రికార్డ్ ఆఫ్ రైట్స్–2024 చట్టం’è ముసాయిదా బిల్లు రూపకల్పన కోసం రెవెన్యూ వర్గాలు విస్తృతస్థాయిలో కసరత్తు చేశాయి. తెలంగాణలో ఇప్పటివరకు అమలైన 1936, 1948, 1971, 2020 నాటి చట్టాలను పరిశీలించి.. వాటి అమలు వల్ల వచి్చన ఫలితాలను బేరీజు వేసి కొత్త చట్టాన్ని రూపొందించారు. తెలంగాణలో ఆర్‌వోఆర్ చట్టాల అమలు చరిత్ర, ప్రస్తుత సమస్యలు, రాబోయే అవసరాలను అంచనా వేసి 20 సెక్షన్లతో ముసాయిదాను సిద్ధం చేశారు.
ఈ క్రమంలో 18 రాష్ట్రాల్లోని ఆర్‌వోఆర్ చట్టాలను పరిశీలించడంతోపాటు బిహార్‌లో అమల్లో ఉన్న మ్యుటేషన్ చట్టాన్ని కూడా అధ్యయనం చేశారు. భూములకు ప్రత్యేక గుర్తింపు సంఖ్య (భూదార్), గ్రామీణ ప్రాంత ఆస్తుల రికార్డు తయారు చేయడం ద్వారా.. కేంద్ర ప్రభుత్వ పథకాల అమలుకు అవసరమైన వెసులుబాటును కలి్పంచనున్నారు. ముసాయిదా రూపకల్పనలో భూచట్టాల నిపుణుడు ఎం.సునీల్‌కుమార్, రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి నవీన్ మిత్తల్, సీఎంఆర్‌వో పీడీ వి.లచి్చరెడ్డి కీలకపాత్ర పోషించారు.
ప్రజల సలహాలు, సూచనలకు అవకాశం
ఈ ముసాయిదా బిల్లుపై రాష్ట్ర ప్రజల నుంచి సలహాలు, సూచనలు తీసుకుంటామని రెవెన్యూ శాఖ వెల్లడించింది. సీసీఎల్‌ఏ వెబ్‌సైట్ ( ccla.telan gana.gov.in ) లో ఈ బిల్లును అందుబాటులో ఉంచుతున్నామని.. ఈ నెల 2వ తేదీ నుంచి 23వ తేదీ వరకు ప్రభుత్వానికి అభిప్రాయాలు తెలియజేయాలని భూపరిపాలన ప్రధాన కమిషనర్ ఒక ప్రకటనలో కోరారు. ప్రజలు తమ సలహాలు, సూచనలను ror2024-rev@telangana.gov.in కు ఈ–మెయిల్ ద్వారా పంపవచ్చని.. లేదా ల్యాండ్ లీగల్ సెల్, సీసీఎల్‌ఏ కార్యాలయం, నాంపల్లి స్టేషన్‌రోడ్, అన్నపూర్ణ హోటల్ ఎదురుగా, అబిడ్స్, హైదరాబాద్–500001కు పోస్టు ద్వారా పంపవచ్చని వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment