ఎమ్మెల్సీ ఓటరు నమోదులో అలసత్వం
గత ఎన్నికల్లో 20,888 మంది ఓటర్లు
సెప్టెంబర్ 30 నుంచి ఇప్పటి వరకు
10,089 మంది మాత్రమే నమోదు
నవంబర్ 6వ తేదీ వరకే గడువు
వరంగల్–ఖమ్మం–నల్లగొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఓటర్ నమోదు ప్రక్రియ నత్తనడకన సాగుతోంది. గడువు దగ్గర పడుతున్నా.. ఓటు నమోదుపై ఉపాధ్యాయులు పెద్దగా శ్రద్ధ చూపడం లేదు. గత ఎమ్మెల్సీ ఎన్నికల్లో 20,888 మంది ఓటర్లుండగా.. ప్రస్తుతం మూడు ఉమ్మడి జిల్లాల పరిధిలో 10,089 మంది మాత్రమే ఓటు హక్కు నమోదు చేసుకున్నారు.
నవంబర్ 6 వరకు గడువు..
ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణకు ఎన్నికల సంఘం సెప్టెంబర్ 30న ఓటరు నమోదు షెడ్యూల్‌ను విడుదల చేసింది. నవంబర్ 6వ తేదీ ఆఖరు తేదీగా ప్రకటించింది. గత ఎన్నికల ఓటరు జాబితా రద్దు చేశామని.. గతంలో ఓటు ఉన్న వారు కూడా తిరిగి నమోదు చేసుకోవాలని ఎన్నికల అధికారులు చెప్పారు. ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ విధానంలో ఓటర్ నమోదుకు అవకాశం కల్పించారు. ఓటు నమోదు ప్రక్రియ ప్రారంభమై నెల రోజులు దాటింది. నల్లగొండ, ఖమ్మం, వరంగల్ ఉమ్మడి జిల్లాల పరిధిలో మొత్తం 12 కొత్త జిల్లాలున్నాయి. అందులో ఇప్పటి వరకు 10,089 మంది మాత్రమే ఓటు హక్కు నమోదు చేసుకున్నారు.
పెరిగిన ఉపాధ్యాయుల సంఖ్య
ఓటరు నమోదుకు ఆఖరి తేదీ నవంబరు 6. ఇంకా 10 రోజులు మాత్రమే గడువుంది. గత ఎన్నికల్లో 20,880 మంది ఓటర్లు ఉన్నందువల్ల ఈసారి ఉపాధ్యాయుల సంఖ్య కూడా పెరిగింది. ఓటర్ల సంఖ్య కూడా పెరగాల్సి ఉంది. ప్రధానంగా హైస్కూల్ ఉపాధ్యాయులు, జూనియర్, డిగ్రీ, పాలిటెక్నిక్, బీఈడీ కళాశాలల అధ్యాపకులతోపా టు ప్రభుత్వ రికగ్నైజ్డ్ హైస్కూళ్లు, కళాశాలల్లో పనిచేసే ఉపాధ్యాయులు ఓటర్ నమోదుపై స్పందించాల్సి ఉంది.
నివాసమే ప్రామాణికం..
ఓటర్లుగా ఉపాధ్యాయులు, అధ్యాపకుల నమోదు గడువు నవంబర్ 1 అని ఎన్నికల సంఘం ప్రకటించింది. ఈ తేదీ కంటే ముందు కనీసం 3 ఏళ్లు కచ్చితంగా బోధించి ఉండాలి. ఎన్నిచోట్ల పని చేసినప్పటికీ 3 ఏళ్లు బోధించినట్లు సర్వీస్ సర్టిఫికెట్‌తో పాటు సంబంధిత విద్యాశాఖాధికారి సంతకం తప్పనిసరిగా ఉంటేనే ఓటు నమోదుకు అవకాశం ఉంటుంది. నివాస ప్రాంతాన్నే ఎన్నికల సంఘం ఓటర్ నమోదుకు ప్రామాణికంగా నిర్ణయించింది. ఎక్కడైతే నివాసం ఉంటున్నారో ఆ చిరునామా ఆధారంగా ఓటు నమోదు చేసుకోవాలి. బోధన ఎక్కడ చేసినప్పటికీ అది ప్రామాణికం కాదు. ఉదాహరణకు నల్లగొండ, ఖమ్మం, వరంగల్ జిల్లాల్లో నల్లగొండలో నివసిస్తున్న వ్యక్తి వరంగల్ జిల్లాలో పనిచేస్తే.. ఆ వ్యక్తి నల్లగొండ చిరునామాతోనే ఓటు నమోదు చేసుకోవలసి ఉంటుంది.
ఈ మూడు జిల్లాల్లో ఎక్కడైనా ఉపాధ్యాయుడు పని చేస్తూ.. కరీంనగర్ జిల్లాలో నివసిస్తుంటే ఓటు నమోదు చేసుకునేందుకు అవకాశం ఉండదు. ఓటు నమోదుకు చేసుకున్న దరఖాస్తుల ఆధారంగా వారి చిరునామాకు వెళ్లి.. దరఖాస్తుదారు ఆ ప్రాంతంలో నివాసం ఉంటున్నాడా? లేడా? అనేది సిబ్బంది పరిశీలించాలి. ఒకవేళ అక్కడ నివాసం లేకుంటే ఆ దరఖాస్తును తిరస్కరిస్తారు. ఉపాధ్యాయులు ఎక్కడ నివాసం ఉంటే.. అక్కడ ఓటు నమోదు చేసుకుంటేనే ఆ దరఖాస్తు చెల్లుబాటవుతుంది. నివాసం ప్రామాణికంగానే దరఖాస్తు చేసుకోవాలని ఎన్నికల అధికారి కోరుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment